Tuesday, January 25, 2011

ధర్మ సందేహం (బ్లాగు డిజైన్ గురించి)

నా బ్లాగు చూసారుగా. బ్లాగు టైటిల్ "ఎందరో మహానుభావులు" ఇలా రాముని మీంచి ఎడమ వైపు కి వుంది. దాన్ని కాస్త కుడి వైపుకి ఎలా జరపాలో కాస్త చెప్పండి. ఇక FEEDJIT చాలా డార్క్ బ్లూ రంగు కాకుండా లైట్ కలర్ లో కనిపించాలంటే ఏం చెయ్యాలో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండీ ప్లీజ్.

Monday, January 24, 2011

ఓ యధార్ధ గాధ (రక్త చరిత్ర కాదు, రంగు రాళ్ళ చరిత్ర)

ఓసారి నేను రెగ్యులర్ గా వెళ్ళే ఓ బంగారం షాపుకి వెళ్ళేను (ఉంగరం కొనుక్కొందామని). షాపు లో నాకన్నా ముందు వచ్చిన వారు ఉండటంతో షాపులో వున్న బొమ్మలకేసి చూస్తూ ఉండగా లామినేట్ చెయ్యబడ్డ బోర్డు ఒకటి ఓనర్ టేబుల్ పై వుంది. ఆ బోర్డు లో ఏ రంగు రాయి ఏ రాశి వాళ్ళు పెట్టుకోవాలో రాసి వుంది. నాకు ఇలాటి వాటిపై నమ్మకం లేదు గాని, సరే అంతా ఇప్పుడు వీటిపై చర్చించుకుంటూ (టీవీల్లో కూడా ప్రోగ్రామ్ లు వస్తున్నాయి కాబట్టి) ఆశక్తి కొద్దీఆ షాపు యజమాని (మాకు బాగా పరిచయం_ కాస్త పెద్దాయన) గారిని అడిగా, "నాకు ఏ రంగు రాయి అయితే నప్పుతుంది చెప్పండి" అని.
అందరూ వెళ్ళిపోయాక "అవి మన లాంటి వాళ్ళకి కాదు పంతులు గారూ" అన్నారు.
శుభ్రంగా దేవుడి బొమ్మ వున్నది పెట్టుకోండి" అన్నారు. మరెందు కండీ ఇంత అందంగా లామినేట్ చేసి మరీ పెట్టారు అని అడిగా. ఈ జనం ఉన్నారు చూడండీ "నాకు ఆ రంగు రాయి ఇవ్వండి, ఈ రంగు రాయి ఇవ్వండి" అని మా ప్రాణాలు తోడేస్తున్నారండి. వాళ్ళతో "అదంతా పిచ్చి నమ్మకాలు, మా షాప్ లో రంగురాళ్ళతో వుంగరాలు ఇవ్వం" అని అన్నాం అనుకోండి. మా షాప్ కి ఎవరూ రారండి. ఆ పక్క షాప్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ కున్న పిచ్చి నమ్మకానికి మేం మరింత మాయ మాటలు చెప్పి అమ్మేస్తామండి. వ్యాపారం ఒదులుకోలేము కదా." అన్నారు. "మీ లాంటి తెల్సిన వాళ్లకి కూడా అవి అమ్మితే నాకు పాపం కదా. నా వుంగరం చూడండీ శుభ్రంగా వెంకటేశ్వర స్వామి బొమ్మది పెట్టుకున్నాను" అన్నారు.

ఒక్క సారి నేను గతంలోకి వెళ్ళాను. మా తాతగారు (మా అమ్మగారి నాన్న గారు) కూడా ఈ జాతకాలు అవీ చెప్పేవారు. వాస్తు గురించి (పొలంలో ఎక్కడ నీళ్ళు పడతాయో కూడా చెప్పేవారు). మంత్ర విద్యతో పాము కాటుకి గురైన వార్ని, తేలు కుట్టిన వారికి వైద్యం చేసేవారు. చర్మం వ్యాధి వున్నవారికి వేపాకులతో మంత్రం అదీ వేసి తగ్గించేవారు. అయితే వీటన్నిటికి ఆయన తీసుకునే ఫీజు (ఓ పావలాయో, అర్ధ రూపాయో లేదా ఓ రెండు చుట్ట పీకలు) అయనికి చుట్ట కాల్చే అలవాటు వుండేది. అదీ కూడా ఇవ్వలేని వారు "రెండు చేతులు జోడించి.. మా దేవుడువే బాబూ" అని ఓ దండం పెట్టి వెళ్ళిపోయేవారు. అయితె వాళ్ళిచ్చిందేదీ కూడా చేత్తో ముట్టుకునే వారు కాదు. పంచాంగం పుస్తకం లో వాళ్ళు పెడితే మా పిన్ని గారు ఆఖర్న వాటిని గూటిలో
పెట్టే
వారు. ఓ రోజు నేను బోల్డన్ని చుట్టముక్కలని చూసి "ఏంటి ఇన్ని వున్నాయి అని అడిగితే "అదేరా నాయనా మీ తాత గారి ఆస్తి" అని నవ్వేది మా పిన్ని.
ఎఫ్ఫుడూ ఏదో ధ్యాన ముద్ర లోనో, మంత్రాలు నెమరు వేసుకుంటూనో, లేదా రామనామ జపం చేస్తూ వుండే వారు. బాధ వస్తే మౌనంగా భరించేవారు గాని ఎవరికీ చెప్పేవారు కాదు. కాని నేను కూడా అవి నమ్మే వాణ్ణి కాదు ఏదో పిచ్చి జనం వాళ్లంతగా నమ్ముతున్నారు కాబట్టి మంత్రాలు పని చేస్తున్నాయి అనుకునేవాణ్ణి. ఈనాడు బ్రాహ్మణ వ్యవస్థని ప్రాలదోరగలిగారు గాని, జనాల్లో ఈ మూడ నమ్మకాల మీద పిచ్చి మరింత ఎక్కువైంది. ఈ రోజు ఏ చానల్ వాడైనా పొద్దున్నే ఈ జాతకాల గురించి, రాశి చక్రాల గురించి, దేవుని యంత్రాల గురించి ప్రకటనలు, వేలకి వేలు ఇమ్మని ఆకర్షణలు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది " ఈ రోజుల్లో లాగ జాతకాలు వాటికీ, వాస్తు కి మా తాత గారు ఇప్పటి కుహనా జ్యోతిష్కులు లాగే వేలు కాకపోయినా వందల్లో నైనా తీసుకునుంటే మా వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యేవారు కదా అని. మా తాత గారి నుంచి వారసత్వంగా మాకు ఆ విద్యలు రాలేదు గాని ( మాకు నేర్పండీ అని ఎప్పుడైనా అడిగితే), అదంతా చాలా కష్టం. హాయిగా చదువులు చదువుకుని మంచి ఫస్టుగా వుండండీ అనేవారు. ఎప్పుడైనా మాకు మంచి మార్కులు వచ్చాయని తెలిస్తే " ఊ.. ఫస్టు.. ఫష్టు.." అని నవ్వేవారు. తనకు వచ్చిన చిల్లర పైసలు అన్నీ వుంచి ఆయన మనుమలు, మనుమరాళ్ళందర్కీ పండగకి వెళ్ళి నప్పుడు పంచుకోమని ఇచ్చేసేవారు. ఆయన మనవడిగా అప్పుడూ, ఇప్పుడూ ఫస్ట్ గానే వున్నాను.
ఇక ముందు కూడా వుండగలను ఆయన ఆశ్వీరచన బలంతో.
నా వ్యాసానికి టైటిల్ కి అస్సలు సంబంధం లేదు కదూ. ఇది కూడా మీ క్యూరియాసిటీని క్యాష్ చేసుకోడానికే)

Thursday, January 20, 2011

బ్రాహ్మలు బుద్దుని బోధనలు చదవకూడదా?


ఒకానొక సారి నేను మా మిత్ర బృందం తో కలసి ట్రైన్ లో వెళ్తున్నాను. కాలక్షేపం కోసమని ఎప్పుడూ పుస్తకం చడవడం అలవాటున్న నేను ఆ రోజు "బుద్దుని బోధనలు" అను చిన్న పుస్తకం చదువుతున్నాను.
ఇంతలో మా ఫ్రెండొకడు వచ్చి నేను చదువుతున్న పుస్తకం చూసి, " అదేంటి నువ్వు ఈ పుస్తకం చదువుతున్నావు?" అనడిగాడు.

"ఏం?" అన్నా.

"నువ్వు బ్రాహ్మిన్ కదా?" అన్నాడు. "అయితే ఏం?" అనడిగా.
"అదంతే. నీలాంటి బ్రాహ్మిన్ ఈ పుస్తకం చదవకూడదు" అనేసి వెళ్ళిపోయాడు.
వీడెప్పుడూ ఇంతే" అనుకుని పుస్తకం చదవడంలో మునిగి పోయాను. ముఖ్యంగా బుద్దుని పంచ సూత్రాలు నన్ను ఆకర్షించాయి.
(అ) ఎదుటి మనుష్యల కే కాదు, సృష్టి లో నున్న ఏ ప్రాణికి హాని తలపెట్ట కూడదు.
(ఆ) ఇతరుల వస్తువులను దొంగతనము చేయరాదు.

(ఇ) పరాయి వారితో (స్త్రీ/ పురుషు లతో) అసభ్యంగా ప్రవర్తించరాదు.

(ఈ) ఇతరులకు ఉపయోగపడని సంభాషణ లు చెయ్యరాదు.

(ఉ) మద్యపానము చేయుట వలన పై విషయములు పాటించుట లో అశ్రధ్ధ కల్గును కావున మద్య పానము చేయరాదు.


ఇప్పుడు చెప్పండి, పై వాటిలో అభ్యంతరకర మైన విషయాలు ఏవున్నాయి. ( ఏ కులం వారి కైనా). ఇవి పాటిస్తే ఇప్పుడున్న రక్త చరిత్రలు వుంటాయా? ఆలోచించండి.

మరొక మిత్రుని అడిగాను మొదట మిత్రుడు ఎందుకు అలా అన్నాడని.

అతను "బుద్దుడు విగ్రహారాధన వద్దన్నాడు. మంత్ర తంత్రాలతో పూజలు అవీ అక్కర్లేదు, జంతు బలులు నిషేధించాలని కోరాడు. నిర్మల మైన మనస్సుతో ధ్యానం చేసుకోవాలని, నిర్యాణం అనే మహా సమాధి కొరకు సిద్దపడాలని బోధించాడు. అందువల్ల హైందవ సాంప్రదాయులైన మన వాళ్ళు బౌద్ద మతాన్ని భారత దేశం లో వ్యాప్తి చెందనియ్య కుండా అడ్డుకున్నా"రని చెప్పాడు.


"కాని అదే హైందవ మతం బుద్దుని దశావతారాలలో ఒక అవతారంగా గుర్తించింది కదా?" అనడిగా. సరైన సమాధానం లేదు. సరే మన గీత లో కూడా" పత్రం, పుష్పం ఫలం తోయం....." అని చెప్పారు కదా?
అంతే కాదు ఎదుట వారిని హింసించ మని, దొంగతనమూ, వ్యభిచారమూ చెయ్యమని ఏ మతగ్రంధాలలోనీ లేదే? మరి ఇతర మతాలు ఆచరించే ఇతర దేశాలలోని వారు నిత్యం యుద్దకాంక్ష తో రగులుతూ ప్రప్రంచయుద్దాలకే దారి తీస్తున్నారు కదా? అంటే తప్పు మనదే కాని, మన మతానిది కాదు.


నేను చదివిన పుస్తకాలు కొన్నిటిలో ఇలా చదివినట్టు గుర్తు. బుద్దుని బొధనలకు ఆకర్షితులై చాలా మంది వ్యభిచారుణులు బౌద్ధ మతంలో చేరారు. వద్దని కొంతమంది శిష్యులు వారించినా సరే, వారిలో పరివర్తన వచ్చింది కాబట్టి చేర్చుకోడంలో తప్పు లేదని బుద్ద భగవానుడు వారిని శిష్యులుగా స్వీకరించాడు.
అంతే గాక బుద్దుని ఆశ్రమంలో పెళ్ళై, సంసార జీవితంలో కష్టాలు పడి, వైరాగ్యం చెందిన కొంత మంది మగవారు (పెద్దవారు) ఇంకా పెళ్ళికాని బ్రహ్మచారులు (ఇలా మూడు రకాలైన శిష్యులుండేవారు).

పాత వాసనల ప్రభావం వల్ల, పెళ్లై, భార్యలకి దూరంగా వున్న మగ వారు, వ్యభిచారులైన ఆడవారు శారీరక మైన సంబంధాలు పెట్టుకొని కొంత అస్తవ్యస్తమైన జీవనాన్ని కొనసాగించేవారని, అట్లాగే బుద్దుని శిష్యులు కూడా మూడు వేర్వేరు భావజాలాల తో మూడు రకాలుగా విడిపోయారని విన్నట్టు గుర్తు (నాకు పేర్లు తెలీవు).
బహుశా ఇలాంటి కారణాల వల్ల మన దేశంలో బౌద్ద మతం మనుగడ సాగించలేక పోయి ఉండవచ్చు. ఆ తప్పు మన బ్రాహ్మలపై అపాదించేసారు. ఒక వేళ బ్రాహ్మలే బౌద్ధ మత ప్రచారం అడ్డుకున్నారనే అనుకుందాం.
మరి ఇండియాలో వున్న ఇతర మత ప్రచారాల్ని ఎందుకు అడ్డుకోలేదు. మన దేశ నాయకుల్ని ఎంతో మందిని ప్రభావితం ఇంత మంచి బౌద్ద మతాన్ని మన వారు ఆచరించరు.
ఎక్కడో నేపాల్ దేశ రాజుకి ఇండియాలోనే బౌద్ద గయలోని, బోధి వృక్షం కింద జ్నానోదయం కలిగింది.
కాని మనం నిత్యం రక్తం చిందిస్తునే వుంటాం.
జీవ హింస చేస్తూనే వుంటాం. పాపాలు చేస్తూనే వుంటాం..
ఆ పాపాలని కడికేసుకోడానికి గుళ్ళ చుట్టూ తిరుగుతాం.. . అడ్డంగా సంపాదించిన బ్లాక్ మనీ తో కె.జీ లకొద్దీ బంగారాన్ని దేవుడి కి అర్పిస్తాం.......మళ్ళీ కొత్త పాపాలు చేస్తాం..


మరొక విషయం భగవాన్ శ్రి షిర్డి సాయి బాబా కూడా ఏ విధమైన విగ్రహారాధన, ఆడంబరమైన పూజలు, పునస్కారాలు (మడి, తడి, ఆచారాలు) వుండ నవసరం లేదని, ఇతరులలోనే భగవంతున్ని దర్శించమని, పేదవారికి సేవ చెయ్యమని భక్తులకి చెప్పారు. కాని మనవాళ్ళు పోటీ పడి మరీ సాయిబాబా విగ్రహాలను స్థాపించడం, చాలా ఖర్చుపెట్టి బాబా గుళ్ళు కట్టించడం (గ్రానైట్ స్టొన్స్, / పాల రాతి గచ్చులు, ఏ.సి హాలు, అద్దాల మహలు) బంగారు ఆభరణాలతో బాబాని అలంకరించడం, పాలతో, కె.జీల కొద్దీ ఆహార పదార్ధాలతో బాబా గార్కి అభిషేకం చెయ్యడం....

ఇవన్నీ వద్దని బోధించిన ఆయనకే ఇలా చెయ్యండం నిజమైన భక్తి ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.
(ఆ డబ్బుతో బోల్డు మంది పేద వారికి అన్నం పెట్టచ్చు కదా)

(నేను కూడా బాబా గారి భక్తుణ్ణే.. అపార్ధం చేసుకోకండి)


అయ్యలారా! అమ్మలారా! చివరాకరికి నేను చెప్పేదేవిటంటే మీరు దేవుని హుండీ లో గాని, పూజారి గారి పళ్ళెంలో గాని మీకు తోచినంత వేస్తే వెయ్యండి.. అది మీ ఇష్టం.... (వద్దని చెప్పడానికి నేనెవర్ని)

కాని, గుడి మెట్ల మీద చిక్కి శల్యమై, వయో భారం వల్ల పని చేసుకోలేక, ఆదరించే దిక్కు లేక దీనంగా అడుక్కుంటున్న ముష్టి వారికి కూడా కాస్త వెయ్యండి.
(వాళ్లలో కూడా నిజమైన ముష్టి వాళ్ళు వుండరని మీ అభిప్రాయమా? సరే మీకు దగ్గరలోనే వున్న అనాధ ఆశ్రమం లేదా రోడ్డు పక్కన వున్న ఇల్లు లేని పేదలకు సాయం చెయ్యండి). ఆ.. నువ్వేం చెప్పక్కరలేదు.. మేం ఆల్రెడీ ఆ పనే చేస్తాం అని కోప్పడకండి.. చెయ్యని వారికి మాత్రమే నా విన్నపం... తప్పులున్నచో మన్నించి, ఆ తప్పులను కూడా ఎత్తి చూపితే నా తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసి, మరల ఆ తప్పుని చెయ్యనని ప్రమాణం చేస్తూ మీ సమాధానాల్ని తప్పని సరిగా చెప్పాలని కోరుతూ.....

Wednesday, January 19, 2011

ఫ్లాష్ బాక్ లోకి నన్ను తోసేసిన డా.పంతుల రమ


ఈ రోజు టి.టి.డి వారి చానల్ లో డా.పంతుల రమ గారి గాత్రం ప్రసారం జరిగింది. మమ్మల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. నాల్రోజుల నుండి స్క్రోలింగ్ లో వస్తుండడంతో, ఎప్పుడెప్పుడా అని చూసి, ఎక్కడకీ
వెళ్ళ కుండా ప్రోగ్రాం అంతా విని, నా సెల్ లో రికార్డు చేసుకుని మరీ ఆనందించాను.


ఈ ప్రొగ్రామ్ తో నేను ఓ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను.
ఆ రోజుల్లో మా వైజాగ్ లో ముఖ్యంగా మా మధురానగర్ చుట్టూ సంగీత సామ్రాట్టులు కొలువై ఉండే వాళ్ళు. మా ఇంటి వెనుకనే మాకు దూరపు బంధువు డా.కొల్లూరు గౌరీ రామ్మోహన్ గారు ఉండేవారు. నా కన్నాసుమారు పదేళ్ళు పెద్ద. ఏ.యూ లో బి.ఏ (వోకల్) చేసేవారు. అసలు అలాంటి కోర్సు ఒకటి వుంటుందని నాకు అప్పుటి దాకా తెలీదు.

సరిగ్గా ఆరు గంటలకల్లా ఆవిడ సంగీత సాధన మొదలుపెట్టేవారు . నేను అప్పుడే స్నానానికని మా పెరట్లో బావి దగ్గర కొచ్చేసరికి, ఎంతో మధుర మైన కంఠ స్వరంతో ఆ కీర్తనలని వినిపించేవి. అవి వింటూ "ఆహా! నా జన్మ ధన్యమైంది కదా" అని అనుకునే వాణ్ణి. ఎంతకీ ఇంట్లోకి వచ్చే వాణ్ణి కాదు.


ఇహ శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు (ఎ.ఐ.ఆర్) లో పనిచేసే మ్రదంగం కళాకారులు, ఆయన మా ఇంటి ఎదురుగా ఓ రెండిళ్ళ ఆవల వుండేవారు. సరిగ్గా ఎనిమిది గంటలకు చక్కగా నామాలు అవీ పెట్టుకుని సాధన మొదలు పెట్టేవారు. ఇక మైమరిచి పోవడం మన వంతు.పుస్తకం చేతిలో వున్నా, ద్రుష్టి మృదంగం పై తాండవం చేసే
ఆయన చేతివేళ్ళ వేపే వుండేది.

ఇక మరో మ్రదంగం కళాకారులు వంకాయల నరసింహం గారు మా వీధి లోనే వుండేవారు. వాళ్ళ ఇంట్లో కుంటుంబం అంతా కళాకారులే. వారి అబ్బాయి శ్రీ. వంకాయల వెంకట రమణ తండ్రి గారి వద్దే శిష్యరికం చేసి, తండ్రి ని మించిన తనయుడై ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిని గాంచి, ఆకాశ వాణి లో నేడు చాలా వున్నత పదవిలో వుంటూ, ఇప్పటికీ నేను ఎదురైతే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన నా కన్న ఓ రెండు మూడేళ్ళు మాత్రమే పెద్ద. వారి మిత్రులు అంతా మా ఆంజనేయ స్వామి కోవిల లో అప్పుడు ఒక్కక్కరు ఒక్కక్క వాయిద్యాలలో ప్ర్రాక్టీసు చేసేవారు. ప్రతీ వారం భజనలు చేసేవారు.
వాళ్లకి అదే సంగీత సాధన.


ఇక శ్రీ ఐ.వి.ఎల్.శాస్త్రి గారు గూర్చి నేను చెప్పే పని లేదు (వైజాగ్ వాసులకి) కాని తెలియని వాళ్ళ కోసం రాస్తున్నాను.
ఆయన సంగీత జన కులం అని పెట్టి, వుచితంగా సంగీతం నేర్పేవారు. వారి కుటుంబమే పెద్ద సంగీత కుటుంబం
(అప్పటికే వారి కుమారులు శ్రీ కాళీ ప్రసాద్ గారు ప్రముఖ వేణు గాన విద్వాంసులు, అమ్మాయిలు: శ్రీమతి.సరస్వతీ గారు, శారద గారు చాలా ప్రఖ్యాత గాయనీ మణులు)
వీరు, శ్రీ వంకాయల వారు వియ్యంకులు కూడా.


ఏదైనా పండుగలు వస్తే మా ఆంజనేయ స్వామి కోవిలలో (శ్రీ గంటి నరసింహ మూర్తి గారి సారధ్యంలో) మరియు శంకర మఠంలో పైన చెప్పిన గాయనీ మణులు, వాయుద్య కళాకారుల విన్యాసాలతో తనువు, హ్రదయం రెండూ వూగిస లాడేవి. అప్పుడు ఈనాటి ఈ డా.పంతుల రమ గారు చిన్న వయసు లోనే చక్కగా సాంప్రదాయ మైన దుస్తులతో తన గానామ్రంతంతో మమ్మల్నందర్నీ ఆనంద పరవశులని చేసే వారు.

ఇలాంటి ఎంతోమంది కళాకారులకి గురువుగారైన శ్రీ యువటూరి విజయేశ్వర రావు గారు (ఆయన కి కళ్ళు కనబడవు) అనుచరుల సహాయంతో ధవళ వస్త్ర ధారులై, మా వైజాగ్ వీధుల్లోంచి నడచి వెళ్తుంటే, చూడ్డానికి మాకు రెండు కళ్లూ చాలేవి కావు.


ఇదంతా ఎందుకు రాసేనంటే వీళ్ళంతా ఎంతో నిర్మల హ్రుదయులు, ఏ స్వార్ధం లేని వారై, సంగీత ప్రపంచంలో మాత్రమే మునిగి వుండేవారు. ఇప్పటి ప్రపంచంలో ఈ వాయు, ధ్వని కాలుష్యాల నడుమ అటువంటి స్వచ్చమైన సంగీతాన్ని ఆశ్వాదించ లేక పోతున్నాం. ఏదో టి.టి.డి వారి పుణ్యమా అని ఈ మాత్రం ప్రోగ్రామ్ లైనా వింటున్నాం.

ఇప్పటి తల్లి తండ్రులు కూడా మళ్ళీ తమ పిల్లలకి సంగీత, నృత్య శిక్షణ లని ఇప్పిస్తున్నారు. పైన తెలిపిన వ్యక్తుల గురించి పరిచయాలు నాకు తెలిసినవి మాత్రమే రాసాను
(ఇంకా చాలా మంది కళాకారులు వైజాగ్ లో వుండే వారు, వున్నారు కూడా,కాని నా చిన్నప్పుడు మా వీధి లో మా చుట్టూ వున్న ప్రఖ్యాతి గాంచిన వారు, నాకు గుర్తున్నంత వరకు రాసాను.
తప్పులున్నచో పెద్దలు మన్నించాలి)ఎవరినైనా మర్చిపోయినా క్షంతవ్యుణ్ణీ.
అన్నట్టు పూర్తి పేరు తెలీదు కాని ఎంతోమందికి గురువులు (శ్రీ పప్పు మాష్టారు గారు) కూడా వుండేవారు.

Tuesday, January 4, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు


జనవరి ఫస్ట్ నాడు నేను మా ఆఫీస్ లో చదివిన కవిత:
డిసెంబరు ముఫ్ఫై ఒకటవ తేది అర్ధరాత్రి వేళ గడిరాయంలో ముళ్లు పన్నెండు దాటిన మరుక్షణం
తేది
మాత్రమే కాదు సంవత్సరమే మారింది
2010
కి వీడ్కోలు పలికి 2011 కి స్వాగతం పలికింది
ప్రతి ఒక్కరి లోను నూతనోత్సాహం
మధుర క్షణాల కోసం ఎదురుచూసి,
తక్షణం
ఆత్మీయుల మధ్య అభినందనల వెల్లువ
"WISH YOU A HAPPY NEW YEAR"
అంటూ గ్రీటింగ్ లు, షేఖ్ హండులు, SMS లు
అసలు ఎందుకు ఇదంతా
నది
ప్రవాహంలో పాత నీరు స్థానే కొత్త నీరు
కడలి
ఒడ్డున పాత అలని వెనక్కి నెడుతూ కొత్త అల
నిన్నటి
సంఘటన రోజు కల
రాలిన
పండుటాకు స్థానే చిగురించిన లేత పత్రం
ఎప్పటి కప్పుడు ప్రక్రుతి మాత ఒడి సాక్షిగా నూతనాన్నే కోరుకుంటున్నాం

గత సంవత్సరపు తప్పులు /పొరపాట్లు పునరుక్తి కాకూడదని
నూతన
సంవత్సరం లోనైనా అంతా మంచే జరగాలని
అందరికీ
మంచే జరగాలని ఆశిద్దాం

కార్యదీక్షతో కర్తవ్య నిర్వహణలో పునరంకితం అయితే
అధికారుల
అండదండలు నిండుగా, మెండుగా వుంటాయని, వుండాలని
"నేను సైతం విశాఖ రేవు అభివృద్దికి సాయ పడతాను" అంటూ
మా
సెక్షన్ తరుఫున ------------(విచ్చేసిన అధికారులకి) నూతన సంవత్సర శుభాకాంక్షలు
అని చదివి వినిపించాను. అందరూ బావుందని మెచ్చుకున్నారు, మీకు కుడా నచ్చితే ఒక్క ఒకే ఒక్క కామెంట్ ప్లీజ్