Tuesday, March 22, 2011

బంగారు పిచ్చుక చిక్కినట్టే చిక్కి మాయమైంది...

మా ఇంటి పెరట్లో పెద్ద మామిడి చెట్టుంది.. ఇంకా మూడు జామి చెట్లూ, అరటి చెట్లూ, దానిమ్మ చెట్టూ ఇలా తోటంతా చెట్లతో, మొక్కలతో నిండుగా ఉంది.. రోజు నేను తోట లోకి వెళ్తుండగా మామిడి చెట్టునిండా పెద్ద పెద్ద పిచుకలున్నాయి.. పైకి కిందకీ ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి.. ఇంకా చిలకలు, కాకులు కూడా ఎగురుతూ కోలాహలంగా వున్నాయి.. పిచ్చుకలు చాలా పెద్ద సైజులో వున్నాయి..

ఇదేంటి మా బ్లాగర్లంతా పిచ్చుకలు అంతరించి పోతున్నాయి.. వాటిని చూసి చాలా రోజులైంది..అని వాపోతూ బోల్డు కధలు రాస్తున్నారు, మన తోటలో ఇన్ని పిచ్చుకలు.. ఎంత హాయిగా, స్వేచ్చగా ఎగురుతున్నాయి అని ఆనంద పడుతూ తోటంతా కలయ తిరిగాను.. అయితే విషయం మన బ్లాగర్లందరికీ చెప్పాలని, తద్వారా మన పిచ్చుకలు మన దగ్గరే వున్నాయి అని నిరూపించాలను కున్నాను. అయితే వట్టి పోస్ట్ రాస్తే సరిపోదు, ఒక పిచుక ఫోటో ఒకటి కూడా పెడదాం అని ఐడియా వచ్చింది..ఎందుకంటే మీ ఇళ్లల్లో లేని పిచ్చుకలు మా ఇంట్లో వున్నాయి అని గొప్పగా రాయాలని తద్వారా ఫేమస్ అయిపోదామని ఛాతీని ఓ రెండంగుళాలు పెంచి మరీ కెమెరా కోసం ఇంట్లోకి పరిగెట్టాను.

కెమెరా తెచ్చాను గాని ఒక్క పిచ్చుకా కుదురుగా వుంటేగా.. పైకీ కిందకీ ఒకటే గెంతులు.. ఇలా కాదు ఒక పిచ్చుకని మనం గనక చేత్తో పట్టుకుంటే చక్కగా ఫోటో తీయవచ్చు అని కెమెరా కింద పెట్టి ఒక పిచుక వెంట పడ్డాను.. చిక్కి నట్టె చిక్కి పారిపోతున్నాయి... సరే ఇంతలో పెద్ద పిచ్చుక నా చేతికి చిక్కింది.. సైజు లో పెద్దది పైగా రోజూ అలవాటు వున్న మనిషిని కావడం చేత నా చేతుల్లో ఇమిడి పొయింది.. కాని కెమెరా కాస్త దూరంలో వుందే ఎలా? మా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు..అందుబాటులో ఎవరూ లేరు.. జామి చెట్టు మీద ఒకరు.. నీళ్ళు పోస్తూ ఒకరు.. ఇలా ఎవరి గోలలో వాళ్ళు వున్నారు.. ఇహ లాభంలేదనుకుని.. నేనే మెల్లగా కెమెరా వైపు వెళ్ళి.. చేత్తో పిచ్చుకను పట్టుకుని రెండో చెయ్యి కాస్త కిందకి దించాను.. నేను కెమెరాని చూస్తూ మెల్లగా వంగి ఎడమ చేత్తో కెమెరా అందుకుని, కుడి చేతిలో వున్న పిచ్చుక వైపు చూసా....ఇంకేముంది.. నా దృష్టి కెమెరా వైపు పడగానే ఎలా తప్పించుకుందో గాని సున్నాలా చుట్టబడి, ఖాళీగా వున్న చెయ్యిని చూసుకుని బిత్తర పోయాను.. పైకి తుర్రుమంది నా బంగారు పిచ్చుక..

నా బ్లాగర్లకి నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ కూలబడిపోయాను.. ఇంతలో "ఏవండీ మీడ్యూటీ కి టైమైంది వెళ్ళరా?" అని నా శ్రీమతి పిలుస్తోంది.. వుండు నా పిచ్చుక ఎగిరి పోయి నేనెడుస్తూవుంటే అని అనుకుంటున్నాను.. "తెల్లారింది.. ఇక లేవండి బాబూ" అని ఒక కుదుపు... ఒక్క సారిగా తెలివి వచ్చింది.. అంటే ఇప్పటిదాకా నేను కంటున్నది కలా? నిజంగానే పిచ్చుకలు అంతరించి పోయాయన్న మాట.. ఎంత ఘోరం.. చిన్నప్పట్నుంచి మన జీవితాల్తో అనుబంధం పెంచుకున్న మన బంగారు పిచ్చుక అంతరించి పోతోందా.. అదీ మన ఆధునిక జీవన విధానం వల్లనా? .. ఎంత దౌర్భాగ్యం? మనకి శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది కదా అని మీతోనే నేనూ కుమిలిపోతూ...

(పిచ్చుకలు నా అనుభవాలు నా తరవాతి టపాలో రాస్తానేం..)

Tuesday, March 15, 2011

విశాఖ లో పి.వీ.జీ....

మొన్న మన రాష్ట్ర రాజధాని నగర నడిబొడ్డున పట్ట పగలు లక్షలాది తెలుగు వారి సమక్షంలో విగ్రహ విధ్వంస కాండ మరియు కనిపించని నాలుగో సింహం పత్రికా ప్రతినిధులు వారి విలువైన దృశ్య, శ్రవణ యంత్రాలపై, వాహనాలపై దమన కాండ తదుపరి, టి.ఎస్.ఆర్ అధినేత శ్రీ కే.సీ.ఆర్ (హెచ్.ఎమ్.వి టీవీలో) ఫోన్లో మాట్లాడుతూ "ఒక్క తెలంగాణా వాదుల విగ్రహం ఆంధ్రా ప్రాంతంలో (విజయవాడలో గాని, విశాఖపట్నంలో గాని) వుందా?" ... అని సూటిగా అడిగారు.. పాపం గరికపాటి వారు "వుండ కుండా వుంటుందంటారా?" అని నసిగి వూరుకున్నారు.


అయితే మా విశాఖ పట్నం లో నగరం నడిబొడ్డున దసపల్లా హిల్స్ అనగా జగదంబా నుండి యూనివర్శిటీకి వెళ్ళే రోడ్డులో సరిగ్గా మినిష్టర్లు, ముఖ్యమంత్రులు విశ్రాంతి తీసుకునే సర్కూట్ హౌస్ జంక్షన్ వద్ద ఠీవిగా పి.వీ నరశింహరావు గారి నిలువెత్తు విగ్రహం కనువిందు చేస్తోంది..

మరి ఇలాంటి విగ్రహాలెన్నో మన ఆంధ్రా ప్రాంతంలో వుండొచ్చు... విషయం సదరు తాలిబాన్ నాయకుడి కి తెలీదా? తెలిసినా జనాల్ని ఉదృక్త పరిచి, రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆకట్టుకుంటూ, పారిశ్రామిక వేత్తలని బ్లాక్ మైల్ చేసి కోట్లు దండుకుంటూ..... ఒక ప్రాంత వారికే పరిమితం కాకుండా తమ జీవిత కాలమంతా సకల మాన శ్రేయస్సుకై తపన పడిన త్యాగధనులను, మహోన్నత పేరుగల స్పూర్తి దాతలను అవమాన పర్చి తద్వారా వాళ్ళను వాళ్ళే అవమాన పర్చుకున్న కొద్దిమంది అల్లరిమూకలు, వారికి నాయకత్వం వహిస్తున్న నాయకులను జాతి క్షమిస్తుందేమో గాని.....ఉద్యమం పక్కద్రోవలు పట్టి ఇతరులకు రోత పుట్టించే ధోరణిలో్, ఇతరుల వునికికి విద్రోహం కలిగే రీతిలో వుంటే అది అందరికీ ప్రమాదమే...

అయితే ప్రాణం లేని విగ్రహాల కంటే ప్రాణం వున్న మనుష్యులకు విలువ లేదా అంటే వుంది...చావ మని రెచ్చ గొట్టింది ఎవరు? నిజంగా చస్తున్నది ఎవరు? ఆనాడు గాంధిజి తను ముందు దెబ్బలు తినడానికి బ్రిటిష్ పోలీస్ వారిముందు నిల్చున్నాడు.. ఈవేళ నాయకులు లేదా వారి పిల్లలు వెనక నుండి అమాయకలైన పిల్లలను, పేద కుంటుంబం నుండి చదువుకోడానికి వచ్చిన బిడ్డలను బలి తీసుకుంటున్నారు...వాళ్ళ తలితండ్రులకు ఎంత క్షోభ?

తెలంగాణా సోదరులకు విన్నపం "ఆవేశాలకు లోనై మీ వుజ్వల భవిష్యత్తును, మన రాష్ట్ర శాంతి భద్రతలను నాశనం చేయకండి.. ఇప్పుడు ప్రపంచం లో అంతటా పరిస్థితి ఇలాగే వుంది.. తిండి కోసం, నీళ్ళ కోసం, వుండడానికి నీడ కోసం కోట్లాదిమంది రేయింబవళ్ళు శ్రమిస్తే గాని మనుగడ లేదు..ఒక్క తెలంగాణా లోనే కాదు.. ఆంధ్రా లో గాని మరే ప్రాంతంలో గాని సామాన్యులు లేదా పేదవారు ఎన్నో కష్టాలు పడుతున్నారు.. శ్రీకాకుళం నుండి వలన కూలీలు ఎంతోమంది తెలంగాణా కొచ్చి(ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చూసాను) పిల్లాపాపలతో కూలిపన్లు చేస్తూ వుంటారు.. అటు కలకత్తా నుండి అండమాన్ వరకూ కూడా శ్రీకాకుళం వారు వలస వెళ్తూ వుంటారు.. అంత శ్రమ జీవులు వారు.. కాని మాటంటే మీరు ఒప్పుకోరు...