Thursday, May 26, 2011

"గంధం" సువాసన మరి లేదు


నిన్ననే చదివాను "గంధం నాగరాజు" అనే నాటక/ సినీ రచయిత పరమపదించాడని.. చాలా భాధపడ్డాను.. ఆయన రాసిన "సత్యాగ్రహి" అను నాటిక మా డిపార్టుమెంటు కాంపిటేషన్లలో రెండు సార్లు ప్రదర్శించాం.. ఈ నాటికలో కొడుకు(డ్యూయల్ రోల్) వేషం వేసిన నాకు "ఉత్తమ విలన్" అవార్డు వచ్చింది..

ఇందులో ఒక రిటైర్ మాష్టారికి ఇద్దరు కొడుకులు (కవలలు) వుంటారు.. ఒకడు బుద్దిగా కాలేజీ లో చదువుతూనే తీవ్రవాదుల భావాలకు ఆకర్షించబడి.. ఉద్యమాల్లో కలసిపోతాడు..మరొకడు ఇంట్లోనే వుండి, జులాయిగా తిరుగుతూ, రౌడి నుండి రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు.. అదే ఊళ్ళో గాంధేయ మార్గం అవలంబిస్తూ, ఆశ్రమాన్ని నడుపుతున్న ఓ స్వాతంత్ర్య సమరయోధుని ఆశ్రమాన్ని దౌర్జన్యంగా తన మనుష్యులతో దాడి చేసి, కబ్జా చేస్తాడు.. ప్రశ్నించిన తండ్రిని కూడా చంపుతానని బెదిరిస్తాడు.

వీడి చేష్టలతో విసిగిన ఆ తండ్ర్రి పెద్దబ్బాయి (తీవ్రవాది) కోసం వెతుకుతున్న పోలీసులకు ఈ చిన్న కొడుకును అప్పగిస్తాడు..
తీవ్రవాదుల కన్నా ప్రమాదకరమైన ఇలాంటి గుండా నాయకులని సమజానికి నిజమైన చీడపురుగులు వీళ్ళేనని ,ముందు ఇలాటి నాయకులని మట్టు పెట్టాలని అర్దిస్తూ తండ్రి పాత్ర చెప్పే డైలాగులతో నాటిక ముగుస్తుంది..

సదరు రెండు పాత్రలను ఆహార్య, గాత్ర మార్పులతో నటించి మెప్పించి నందుకు నాకు రెండు సార్లు కూడా బహుమతులు వచ్చాయి.. పెద్దవాళ్ల ప్రశంసలు కూడా వచ్చాయి.. ముఖ్యంగా తండ్రి ఒక్కడే కూర్చుని ఉండగా బాక్ గ్రౌండ్ లోంచి ఇద్దరి కొడుకుల డైలాగులు ఒకరి తర్వాత ఒకరి డైలాగ్స్ చెప్పాలి (గొంతు మార్చి).. ఈ సీన్ బాగా వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు..


ఇహ రెండో కొడుకుగా నేను వేసిన ఆహార్యం (తెల్లని చొక్కా, తెల్ల ఫ్యాంటు, తెల్ల జోళ్ళు, నుడుట ఓ పెద్ద బొట్టు).. ఇదీ కూడా వెంటనే మార్చుకుని రావడం వల్ల బాగా హిట్ అయ్యింది.
ఈ నాటికలో తండ్రీ , కొడుకుల సంభాషణలు, తన శిష్యుడు అయిన ఓ ఐ.పి.ఎస్ ఆఫీసర్ వచ్చి కొడుకుని అప్పగించమని చెప్పి వెళ్లడం, గాంధేయ వాది అయిన స్వాతంత్ర్య సమరయోధుని పాత్ర చెప్పే డైలాగ్ లు సూపర్ హిట్.. ఈ పాత్ర వేసినాయనకు కూడా అవార్డు వచ్చింది..

తండ్రి పాత్ర మరియు డైరెక్షన్ చేసిన మా మిత్రుడు రాజ్ కుమార్ గారికి ఉత్తమ నటుడు, దర్శకత్వ అవార్డులతో బాటు మాకు ఉత్తమ ప్రదర్శన అవార్డు కూడా వచ్చింది..
ఇదంతా జరిగి ఓ ఐదారేళ్ళు కావస్తోంది.. అయినా "సత్యాగ్రహి" నాటకం వల్ల నాకు మంచి పేరు వచ్చింది.. నలభైమూడేళ్ళ నేను పాతికేళ్ల కుర్రాళ్ళ రోల్ వేసాను.. అది మరొకళ్ళకి ఇద్దాం అనుకున్నాం కాని కాస్త అనుభవం వున్న నటుల కొరత వల్ల మా డైరెక్టరు నన్నే వెయ్యమన్నాడు..
సరే ఇవన్నీ రాస్తూ కూచుంటే సొత్కర్ష అవుతుందేమో.. కాని తెలుగు నాటక రంగం ఓ మంచి రచయిత ని కోల్పోయిందని చెప్పవచ్చు.. ఆయన గమ్యం లాంటి ఓ నాలుగు సినమాలకి కూడా పనిచేసారని తెలిసి బాధపడ్డాను..ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ... ఆయన గురించి మీకు తెల్సిన ఓ నాలుగు మాటలు చెప్పవలసిందిగా మనవి..

Tuesday, May 24, 2011

"నిజం" ==== ఓ సంచలనం

"నీ పేరు ?" బోనులో నిలబడ్డ ఓ నడివయస్సు ఆడ మనిషిని చూసి వ్యంగ్యంగా ప్రశ్నించాడు పి.పి
"సుశీల" బిడియంగా, భయంగా జవాబు చెప్పింది... అప్పటికే కోర్టుకు వచ్చినందుకు సిగ్గుతో తలొంచుకుని భుజంనిండా కొంగు కప్పుకుని బోనులో నిలబడ్డ ఆ ఆడ మనిషి

"నిజంగా నీ పేరు సుశీలేనా?" సంధించాడు మరో ప్రశ్న.
బిత్తరపోయి చూస్తుంది.
"పర్వాలేదు నిజం చెప్పు.. నీ అసలు పేరు సుశీలేనా?" కాదు అన్నట్టు తలూపుతుంది.
"అంటే పేరు లోనే అబద్దం వుందన్నమాట" మళ్లీ వ్యంగ్యం..
"మా అమ్మా నాన్న పెట్టిన పేరు కొండమ్మ.. కాని సార్వభౌమరావు గారు నన్ను సుశీలా అనే పిలుస్తారు" "చూడు కొండమ్మా" ..బిత్తరపోయి చూస్తుంది.."అదే..అదే..చూడు సుశీలా! సార్వభౌమరావు గారి ఇంట్లో నువ్వేం చేస్తుంటావ్?"
"పని"

"అదే ఏం పని చేస్తావ్? ఇల్లు తుడుస్తావా?"
కాదు అన్నట్టు తలూపుతుంది.."పోనీ అంట్లు తోముతావా?" మళ్ళీ అడ్డంగా తలూపుతుంది..
"మరి ఏం పని చేస్తున్నావ్?" ఇక తప్పదన్నట్లు " ఆయన గత కొన్ని ఏళ్ళు గా నన్నుంచుకున్నారు"
"అంటే ఆయన ఉంపుడుగత్తెవన్నమాట?"

"సార్వభౌమరావు మంచి వారేనా?"

"అవును కాబోలు"

"నిన్ను బాగా చూసుకునేవారా"
ఏం చెప్పాలో తెలీక మౌనంగా వుంటుంది.
"మరి సుందరం తో ఎన్నాళ్ళనుండి పరిచయం"

"సుందరం ఎవరో నాకు తెలీదు" బుకాయించడానికి చూస్తుంది..
కాని మరో రెండు ప్రశ్నలకి తెలుసుననట్టు అంగీకరిస్తుంది"
"మరిందాక
సుందరం ఎవరో నాకు తెలీదన్నావ్.. అది అబద్దమేనా?" సూటిగా ప్రశ్నించేసరికి బిత్తరపోతుంది.
ఈ నిజాలు, అబద్దాల మధ్య పి.పి అడిగే ప్రశ్నలకి తట్టుకోలేక ఒక్కసారిగా బరస్ట్ అవుతుంది..
"ఇదిగో అమ్మాయ్! ఇది కోర్టు ..ఇక్కడ ఏడవకూడదు.."
కోర్టుకొచ్చిన వాడు ఇంటికెళ్ళి ఎలాగూ ఏడుస్తాడు..

ఈ రసవత్తర సన్నివేశం "నిజం" నాటకం లోనిది.. రచయిత కీ.శే.రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారు.
ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర కూడా ఆయనే వేసారు. సార్వభౌమరావు మరియు దర్శకత్వం కీ.శే.అత్తిలికృష్ణారావు గారు..యూనివర్శిటీ ఓపెన్ ఎయిర్ ధియేటర్లో..
మళ్ళి అదే నాటకాన్ని మా గురువుగారైన కీ.శే.మందులు గారి (సార్వభౌమరావు మరియు దర్శకత్వం) ఆద్వర్యంలో మేము వెయ్యడం జరిగింది (ఇదంతా జరిగి సుమారు ఓ ఇరవై ఏళ్ళు)..
కాని సజీవ నాటకం "నిజం"


ఇహ టూకిగా కధ లోకి వస్తే సార్వభౌమరావు అనే ఓ డబ్బు, పలుకుబడి వున్న పెద్దింటాయన "సుశీల"అనే అమ్మాయిని వుంచుకుంటాడు.(భార్య చనిపోయిన తర్వాత).. ఆ అమ్మాయితో "
సుందరం" అనబడే డ్రైవర్ ప్రేమాయణం సాగిస్తూ, తనతో వచ్చేయమని అడుగుతాడు (సమయం కోసం ఎదురుచూస్తుంటారు).
ఇలా వుండగా సార్వభౌమరావు కొడుకు(అతడి పేరు కూడా "
సుందరం") అతని స్నేహితులు దగ్గర్లోని అడవిలో మందు పార్టీ చేసుకుంటారు.. సత్యం అను ఒక స్నేహితుడు సుశీల తో సుందరం(డ్రైవర్) కున్న కనెక్షన్ గురించి వాగుతాడు.. అయితే ఈ సుందరం(కొడుకు) తననే అంటున్నాడని అపోహపడి సత్యాన్ని చంపేస్తాడు..దీనికి మిగతా ఇద్దరు స్నేహితులు సాక్షులు..అందులో ఒకడు అంతరాత్మ..(అసలు పేరు మధు)..వాడు జీవితంలో అబద్దమన్నది ఆడి ఎరుగడు..మరొక స్నేహితుడు కృష్ణ (జులాయిగా తిరుగుతుంటాడు).
అయితే విషయం తెల్సుకున్న సార్వభౌమరావు వీళ్ళిద్దరి చేత కోర్టులో అబద్దం ఆడించి ఆ హత్యా నేరం సుందరం (డ్రైవర్) మీదకు నెట్టేసి, వురిశిక్ష పడేలా చేస్తాడు..
ఇహ కధ మొత్తం నిజం, అబద్దాల మధ్య తిరుగుతూ..కడు రసవత్తరంగా సాగి కోర్టు సీన్ లో అబద్దపు సాక్షాల్ని నిజాలుగా ఎలా చిత్రీకరిస్తారో కళ్ళకి కట్టినట్టుగా చూపించడంలో శ్రీ రావి శాస్త్రి గారు వృత్తిరీత్యా వకీలుకున్న అనుభవాల్ని జోడించి తన రచన లో విశ్వరూపం చూపించారు..
నేను "అంతరాత్మ" గా వేసి ఒక పరిష్యత్తులో (మునగపాకలో) ఉత్తమ నటుడి అవార్డుని అందుకోడం జరిగింది. మా తొలి ప్రదర్శనని (వైజాగ్ కలెక్టరు ఆఫీసులో) స్వయంగా రావిశాస్త్రి గారే వచ్చి మమ్మల్ని ఆశ్వీరదించండం మేం మర్చి పోలేని అనుభూతి..

Monday, May 23, 2011

తెలంగాణా సోదరులారా! ఈర్ష్య పడండి..ఇదుగో మా ప్రాంతపు నిజమైన అందాలు

మీరెప్పుడైనా మా వైజాగ్ రైల్లో వస్తున్నప్పుడు ఐదు నిముషాల్లో స్టేషన్ వస్తుందనగా, రామ్మూర్తి పంతులు పేట వద్ద కిటికీ లోంచి తొంగి చూసారా?
అక్కడ సుమారు వంద గుడిసెలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద వుంటాయి.. వాళ్ళకి విశాలమైన రోడ్లు గాని, కరెంటు గాని, గ్యాస్ పొయ్యలు గాని, సెపరేట్ బెడ్ రూములు గాని లేవు.. అయినా పిల్లా, పాప, ముసలి, ముతకా అంతా అక్కడే, అన్నీ అక్కడే..

ఇంకా వైజాగ్ లో కావలసినన్ని మురికి వాడలు..గర్వ పడే పారిశ్రామిక వాడల చుట్టూ, కాలుష్యపు కోరల విష జ్యాలల నడుమ... పెద్ద వాళ్ళు చిన్నా,చితకా పన్లు, చిన్న వాళ్ళు ఇంకా బుల్లి పన్లు..(చిత్తు కాగితాలు ఏరుకోడం, బలాదూర్ తిరగడం..అందిన కాడికి దొరికిన వస్తువులు పట్టుకెళ్డం.. కాదేది రూపాయికి అనర్హం.. పారేసిన పాల పేకట్టు, ఖాళీ సీసా, విరిగిన ప్లాస్టిక్ ముక్క, నొక్కిన చిన్న టూత్ పేస్టు ట్యూబ్..ఇవన్నీ మనకి వేస్టు..వాళ్ళకది బెస్టు...

పారుతున్న పెద్ద మురికి కాలువ, ఒడ్డునే పూరి గుడిసెలు,పాత రేకుల షెడ్లు ..న్యూకాలనిలో, కొత్తరోడ్డు వద్ద, పాత పోష్టాఫీసు వద్ద, కంచరపాలెంలో.. ఎన్..డి, గాజువాక దరి...ఎన్నని వున్నాయని ..ఎంతమంది అని లెక్క చెప్పమంటారు.. ఫోటోలు తీసి, వీడియోలు తీసి చూపించి వాళ్ళను అవమానించ లేను..నా ప్రాంతాన్ని నేను కించపరచు కోలేను..

ఎకరాల కొద్దీ పొలాల మధ్యలో పల్లె వాళ్ళు, ఎన్నో పరిశ్రమల్లో పెద్ద పెద్ద వుద్యోగాలు చేసుకుంటూపట్టపు వాళ్ళూ ..గట్లా గీ ఆంధ్రా వోల్లు ఎంతో సుఖంగా, హాయిగా, దర్జాగా బతుకుతున్నారు అనుకుంటున్న తెలంగాణా సోదరులు ఇలాంటి సీన్లని చూసి ఏమంటారు?

ఈరోజు అలాంటి మురికి వాడలో మేం AIDS మీద Awareness Programme కండక్ట్ చేసాం..

అవే ఫోటోలు.. అంత మురికివాడలోను ఎంతో చురుకైన, తెలివైన పిల్లలు..మా ప్రోగాం అయిపోగానే LCD ఖరీదెంత సార్? అని ఒకడు..అద్దెకు ఇస్తారని చెప్పగానే..రేటెంతో తెలిసికొని, వాళ్ళ ఫోన్ నెంబరు అడిగి తీసుకున్నవాడు మరొకడు.. కంప్యూటర్ లో అన్ని భాగాల్ని సులువుగా చెప్తున్న వాళ్లు కొందరు.. అవకాశం ఇవ్వాలే గాని వాళ్ళలో అబ్దుల్ కలామ్, న్యూటన్ తప్పని సరిగా తయారవుతారు..

Saturday, May 21, 2011

తెలంగాణా వాదులారా .. ఇప్పటి కైనా కళ్ళు తెరవండి...స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మన దేశ ప్రజలు, నాయకులు ఎన్నో కలలు కన్నారు.. ఇక దేశ భవిష్యత్తు మారి పోతుందని, ప్రజలంతా అతి పెద్ద గణ తంత్ర, లౌకిక, ప్రజాస్వామ్యంలో అంతా (ఏ జాతి వారైనా, కులం వారైనా, మతం వారైనా) కలసిమెలసి జీవనం సాగిస్తూ, ఫలాలను అనుభవిస్తూ, అన్నివిధాలా (గ్రామీణ, పట్టణ) అభివృద్ధి చెందుతుందని, రామరాజ్యం వస్తుందని ఎన్నో కలలు, దాని కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసారు..
ఇటు అమెరికన్ రాజ్యాంగం , అటు బ్రిటీష్ రాజ్యాంగానికి రెండింటికి మధ్యస్థంగా మన రాజ్యాంగాన్ని కొన్ని వందల ఆర్టికల్స్ తో అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం..
అయితే కుల వ్యవస్థ , ప్రాంతీయ అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయే గాని, తగ్గటం లేదు.
కోట్ల కొద్దీ అవినీతి, తవ్వుకున్న కొద్దీ స్కాములు.. కుల రాజకీయాలే తప్ప సామాన్య ప్రజల సంక్షేమం ఎక్కడా కనిపించదు..
ఇప్పుడు చాలామంది భారత దేశంలో ఎందుకు పుట్టానా ? అని తిట్టుకుంటున్నారు.. జపాన్, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు సాధించిన ప్రగతి(టెక్నాలజీ) మనం సాధించాలి అంటే కనీసం వంద జన్మలు ఎత్తాలి. అగ్రకులాలు (అని ముద్ర వేసింది..ప్రభుత్వమే) వాళ్ళు చాలామంది ఓటు వేయడానికి వెళ్ళరు.. వాళ్ళ ఓట్లు కాని, వాళ్ళ సంక్షేమం గాని ప్రభుత్వానికి అవసరం లేదు.. కొన్ని కులాలకి మాత్రమే పరిమితమైన సంక్షేమ పధకాలు, విద్యా, వుద్యోగ అవకాశాలు, మినహాయింపులు, కేటాయింపులు..

(స్వతంత్రం వచ్చి వేల సంవత్రరాలు గడిచినా ఇందులో మార్పు వుండదని కొందరి అభిప్ర్ర్రాయం) .. ఇందులో దొంగ కుల/ ఆదాయ సర్టిఫికెట్ల వాళ్ళు ఎంతో మంది.. వాళ్ళకి సహకరిస్తూ ఎంతో మంది నాయకులు, అధికారులు..
అయితే తెలంగాణా వాళ్ళకి మాత్రమే నా యొక్క విన్నపం ఏమిటంటే.. కనీసం మన పక్క రాష్ట్రాల అబివృద్ది ని చూసి మనం తెలివి తెచ్చుకోవాలి.. గుజరాత్ , పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ కంటే మన రాష్ట్రం వెనక బడి వుంది.. ఒక మోడీ, మమతా బెనర్జీ వంటి నాయకులు మనకి లేకపోవడం కంటే, ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో విజ్నతతో వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు.. ముస్లిం లు కూడా మోడీ కి ఓటు వేసారు.. కంచు కోట లాంటి కమ్యూనిజాన్ని కాదని మమతా బెనర్జీ కి పట్టం కట్టారు బెంగాలీలు..

ఈ ఐకమత్యం, మన రాష్ట్రం అభివృద్ది చెందాలనే భావం మనకి లేదు.. ఎప్పుడో మా తాతల నాడు మీరు మమ్మల్ని దోసుకున్నారు.. మా భూములు, నీళ్ళు, వుద్యొగాలు లాక్కున్నారు అంటూ (అభివృద్ది గణాంకాలతో సంబంధం లేకుండా) మీ సెంట్ మెంట్ అడ్డం పెట్టుకుని, కోట్లు సంపాదిస్తున్న కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల మాటలకు మీ జీవితాలు, ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు..

ఒక వేళ తెలంగాణా వచ్చినా మీ పోరాటాలు కొనసాగుతునే వుంటాయి.. ఎందుకంటే తెలంగాణాలోనే ఎన్నో వైవిధ్యాలు, ప్రజల జీవన విధానంలో ఎన్నో అసమానతలు.. రాకుండానే పోట్లాడుకుంటున్న నాయకులు మిమ్మల్ని వుద్దరిస్తారన్న గ్యారంటీ లేదు..
ముందు నైజాం నవాబు మీద, రజాకార్ల మీద పోరాటం, ఆ తర్వాత ఆంధ్రా ప్రాంతం వారి మీద, రేపు మీ నాయకుల మీద..(ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతం వాళ్ళ మీద) ఇలా పోరాటాలు చేస్తూ, బస్సులు, ఆస్తులు తగలెట్టు కుంటూ, విగ్రహాలు కూల్చుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతాం.. దీనికి ఫుల్ స్టాప్ అంటూ వుండదా?

ఆలోచించండి.. ఐకమత్యంగా వుంటీ జరిగే అబివృద్ధి గుజరాత్, ప.బెంగాల్ వైపు చూసి నేర్చుకోండి.. మన రైళ్ళన్నీ వాళ్ళు తన్నుకు పోతున్నారు.. పరిశ్రమలన్నీ కొట్టుకు పోతున్నారు.. తెలంగాణా కన్నా ఘోరమైన స్థితి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వుంది..డబ్బంతా హైదరాబాద్ అబివృద్ది కే తగలేసారు మా ముఖ్యమంత్రులు అనే బాధ కూడా వాళ్ళలో వుంది.. మరి ఇవన్నీ తవ్వుకుంటూ పోతే అంతం వుండదు...

Friday, May 20, 2011

జయ వెర్సెస్ మమతకొద్ది రోజుల తేడా లోనే ఇద్దరు మహిళా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల్ని టివిల్లో వీక్షించాం... ఒకరు చెన్నై గద్దె నెక్కిన జయలలిత, మరొకరు పశ్చిమ బెంగాల్ ప్రధమ మహిళా ముఖ్యమంత్రి మమత బెనర్జీ.

అయితే ఎంత తేడా... జయ ప్రమాణ స్వీకారం ఎంతో ఆర్భాటంగా జరిగితే, మమత గారిది ఎంతో నిరాడంబరంగా జరిగింది.. ఇక్కడ ఎంతో మంది రాజకీయ నాయకులు (పొరుగురాష్ట్రాల వారు), సినీనటులు, వి.వి.ఐ.పి లు.. అక్కడ ఎంతో మంది సాధారణ పౌరులు, అభిమానులు, ప్రజలు..

జయలలిత చీరకట్టులో హుందా తనం, ముఖ కవళకల్లో ఒకింత గర్వం.. మమత సాదాసీదా చీరకట్టు, మేకప్ లేని ముఖం..ఒకింత భావోద్వేకంతో కూడిన వినయం, ప్రమాణ స్వీకారం తర్వాత రెండు కిలోమీటర్ల పాదయాత్రతో కార్యాలయంలోకి అడుగు పెడ్తూ అడుగడుగునా ప్రజలకి అబివాదం తెలుపుతూ, ఆ జనసందోహం లోంచి ఒక బెంగాల్ టైగర్ లా కనిపించారు..

నేను తెలుగు వాడిని, నాకు జయలలిత, మమత ఇద్దరూ సమానమే.. కాని నాకు అనిపించిన భావాలు మీతో పంచుకున్నానే తప్ప, ఇంకేం వుద్దేశం లేదు..
ఇద్దరూ బ్రహ్మచారుణులే (జయ విషయంలో ఏవో కొద్ది రూమర్స్.. అఫ్ కోర్సు మనకి అప్రస్తుతం)..

మరొక విషయం ఏమిటంటే మమతా బెనర్జీ ఎప్పుడూ కాలికి సాదాసీదా చెప్పులే తప్ప ఖరీదైన జోళ్ళు వాడరట.. మరి జయలలిత గారి చెప్పులతో ఓ పెద్ద షాపు పెట్టుకోవచ్చట..

ఏది ఏమైనా కరుణానిధి మరియు కుటుంబసభ్యుల అవినీతి పర్వం మన జయ గారికి కలిసొచ్చింది.. ఈవేళ కనిమొళి జైలు కెళ్ళిన వార్త, తీర్పు విని ఆమె కోర్టులో కుప్ప కూలిందన్న విషయం తెలిసి, అయ్యో పాపం అనిపించింది..మగాళ్ళు చేసిన తప్పులకు ఆమె బలి అయిందేమో అనిపించింది..

Thursday, May 12, 2011

నాకు విషెస్ చెప్పి మోక్షాన్ని పొందండి
సోదర, సోదరీ మణులారా
మీకు చక్కని అవకాశం
నాకు బర్త్ డే విషెస్ చెప్పే అవకాశం మీకు కల్పిస్తున్నాను..ఎందుకంటే ఈ రోజు (మే 12) మదీయ పుట్టిన రోజు కాబట్టి..
ఏంటి.. నువ్వేమన్నా లెజండ్ వా? స్టార్ వా? ఎందులో గొప్పోడివి అనడుగుతున్నారా?
సరే నా క్వాలిఫికేషన్స్ అనగా అర్హతలు చెప్తున్నా వినండి..(చదవండి)
జనరల్ గా అబద్దమాడి ఎరగను .. అంతా నిజమే చెప్తాను..
చెప్పింది చేస్తాను..చేసేదే చెప్తాను..
సిగరెట్, మద్యం లాంటి అలవాట్లు లేవు...
ఏకపత్నీ వ్రతుణ్ణీ
అప్పనంగా ఎవరైనా ఇచ్చింది తీసుకునే అలవాట్లు లేవు..
బండి నలభై లోపే డ్రైవ్ చేస్తాను
పోలీసోడు వున్నా లేకపోయినా సిగ్నల్ దగ్గర ఆగి పోతాను
అడిగినా అడగక పోయినా ముష్టి వాళ్లకి కనీసం ఓ రూపాయి అయినా ఇస్తాను
టివీల్లో సీరియల్లు గాని, రేటీంగ్ పెంచి మనకి ఝలక్ లిచ్చే ప్రొగ్రాములు చూసి బుర్ర పాడు చేసుకోను... సచిన్ తప్ప మిగతావాళ్ళ ఆటని ఎంజాయ్ చెయ్యలేను (సచిన్ ఔట్ అవగానే టీ.వీ కట్టేస్తాను).
ఇప్పటికి ఇవి చాలను కుంటా... త్వరగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేసు కుని తరించండి
ఏం సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, మనల్ని మోసం చేసే బాబాలకి తప్ప నాకు శుభాకాంక్షలు చెప్పరా?

నేను ఎవరు?ఈ క్రింది బ్లాగ్ వారికి నా చిన్న విన్నపం.

http://aanamdam.blogspot.com/2011/05/blog-post_09.html

మొదట ఆధ్యాత్మిక శక్తి వున్నవాళ్ళకి మాత్రమే జబ్బులు తగ్గుతాయి.. లేక పోతే ఎంత పెద్ద పెద్ద డాక్టర్లయినా ఎన్ని మందులు మింగినా జబ్బులు రావు అన్నారు.. ఇప్పుడేమో అవధూతలను, రాముణ్ణి, కృష్ణున్ని,ఏసుక్రీస్తుని బాబాలను అందర్నీ ఒకే గాటికి కట్టి, అతీత శక్తులు అదీ ఇదీ అని అంటున్నారు.

పుణ్యస్థలాల్లో(యాత్రలకు వెళ్ళి) చనిపోయేవాళ్ళు నిజమైన భక్తులు కాదా? తిరుపతి గాని షిర్డీ గాని వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఏక్సిడెంట్ అయిన వాళ్ళని శక్తి కాపాడటం లేదే? వాళ్ళకి దేవుడు మోక్షం ఇచ్చేసాడు అంటారా? బాబా అయినా ఒక్క మనిషి నైనా మరణించకుండా (శాశ్వతంగా) ఆపగలిగేరా? మన విజ్నానంలో మనకి ముందు క్లారిటీ వుండాలి.

నేను ఎవరు? నా శక్తి ఏమేరకు వుంది? దాని వలన ఎంత వరకు నేను ఇతరులకు వుపయోగపడగలను అని తెలుసుకోవాలి. ఆత్మ గురించి గాని, పరమాత్మ గూర్చి గాని, భక్తులకు, గురువులకు వుండవలసిన లక్షణాలు గాని మన భగవద్గీత లో చక్కగా రాసారు.కోరిక (మోక్షాపేక్ష కూడా కోరికే), సుఖాన్ని ఆనందంగా ఎలా స్వీకరించామో దు:ఖాన్ని కూడా అంతే ఆనందంతో స్వీకరించాలి.. మరణాన్ని కూడా జననంలాగే భావించాలి.

ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు(విశ్వం గురించి) లోతుగా పరిశీలించాలి.. అప్పుడు భేధాభిప్రాయాలు వుండవు.. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప ..ఆధ్యాత్మికంగా బతికిన వాళ్ళే ఎక్కువ, డాక్టర్లు, సైన్స్ గొప్ప కాదు ఇలాంటి తేడాలుండవు...