Wednesday, August 31, 2011

ఆసియాలో కెల్లా మహా నగరం


ఇక్కడ పెట్టిన ఫొటోలు ఆసియా ఖండం లో కెల్లా మహానగరమైన "గైజావ్" లోనివి.. ఆ నగరానికెళ్ళే రూట్ మాప్ నా తరవాతి టపాలో.. మీ ఆశక్తి ని బట్టి..Friday, August 26, 2011

"నీతా" ? సారీ ఎడ్రస్ మాకు తెలీదు..


అన్నా హజారే గారి పుణ్యమా అని ఈ మధ్య అందరికీ అవినీతి పై మాట్లాడటం ఓ ఫ్యాషన్ అయ్యింది..ఆఫీస్ లో కొలీగ్స్, బయటి మిత్రులు.. ఇంట్లో సభ్యులు.. ఇలా అంతటా ఇదే..సర్విస్ అంతా ఒహడి నెత్తిమీద చెయ్యేసి బతికిన వెధవలు కూడా అవినీతి గురించి మాట్లాడ్డమే..
మామూలు
వుద్యోగస్తులే కోట్లు ఆర్జిస్తూ వుంటే ముఖ్యమంత్రి, మంత్రులు లక్షల కోట్లు తింటే ఆశ్చర్య మేముంది. అవినీతి మన జీవన విధానం లో ఓ అంతర్భాగం అయికూచుంది..

"ఆ ఆయన అలాగే అంటారు గానీ.. మనకి బర్త్ సర్టిఫికెట్ కావలన్నా, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా.. మన పెద్దల ఆస్తి మన పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఎంతో కొంత ముట్ట చెప్పక తప్పుతుందా? అని కొంతమంది వాదన. లేక పోతే "ఇక్కడ మీ ఇంటి పేరు తప్పుందీ" అనో, "మీ తండ్రి పేరు స్పెల్లింగ్ రాంగ్" అనో మనల్ని సంవత్సరాల పాటు తెప్పేసే "ప్రజా సేవకులున్న" వ్యవస్థ మనది..
ఇలా ఓ గంట సేపు మాట్లాకున్నాక మా మిత్రుడొకాయన అన్నాడు.. ఈ రోజుల్లో దేశం కోసం ఏదేదో పోడిసెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి.. అని ఇల్లు, ఒళ్ళూ గుల్ల చేసుకోడం వేస్టు... జనాలు కూడా తెలివి మీరిపోయారు.. అందువల్ల ఓపిక వున్నంత వరకు మనీ రెట్టింపు చేసుకుని (ఏదో ఒకలాగ), ముసలి కాలంలో దర్జాగా కాలుమీద కాలువేసుకుని బ్రతికేయడమే నేటి ఫిలాసఫీ.. ఎవడో ఒకడు రోడ్డెక్కుతాడు.. వాడి చుట్టు చేరి.. అప్పటికి చప్పట్లు కొట్టేసి ఇంటికి వచ్చేయడమే..
నాకు చాలా మంది హిత బోధ చేస్తూ వుంటారు.. ప్రతీ దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు.. ఏదో అలా జరిపించడమే అని.. ఎక్కువ టెన్షన్ పడి వుద్యోగం చెయ్యద్దూ అని, ఎందుకంటే కష్టపడే వాడికన్నా, కాకా పట్టిన వాడే వీరుడు ఈ రోజుల్లో.. ఆఫీసర్ ముండాకొడుకులు కూడా వాళ్ళ మాటల్నే చెవియొగ్గి వింటారు..

నేను ఏ కార్యం తలపెట్టినా (కల్చరల్ సెగెట్రీ ని కదా) "చూడు గురూ ఫంక్షన్ కోసం నువ్వు మరీ ఎక్కువగా ఖర్చు పెట్టద్దు..ఎంతో కొంత మిగుల్చుకో.... ఏదో ఫంక్షన్ అయ్యిందా లేదా, అని మొక్కుబడి గా చేస్తే చాలు.. అనవసరంగా టెన్షన్ పడకు.. ఇదీ వాళ్ళ సలహా..మిగలడం మాట దేవుడెరుగు.. తగలకుండా వుంటే చాలు..

ఎవర్నీ నొప్పించ కూడదు.. ఎవరు తప్పు మాట్లాడినా ఖండించ కూడదు.. నవ్వుతూ పళ్ళికిలించాలి.. ఇదెక్కడ పాలసీ యో నాకు అర్ధం కాదు..
ఏవన్నా అంటే అది మన ఆరోగ్యానికి మంచిదట. మనకివన్నీ చేతకావే.. ముక్కూ మొహం తెలీని వాళ్ళని కాదు స్నేహితులని, కొలీగ్స్ ని, సొంత అన్నదమ్ములుని, చివరికి తల్లి తండ్రుల్ని కూడా మోసం చేస్తూ బతుకుతున్నారు (చీ ఇవీ ఒక బతుకులేనా)...
ఇంకో ఫిలాసఫీ..చెడే చూడు, చెడే మాట్లాడు, చెడే విను..ఎదుటి వాడి బలహీనత ఏమిటో తెలుసుకుని, వాళ్ళ మీద ఎదురు దాడికి దిగడం, ఇవి ఇక్క రాజకీయాల్లోనే కాదు.. మామూలు జీవితాల్లో కూడా.. ఇలాగే వున్నాయి.. అందరూ మచ్చ వున్న గురివింద గింజలే.. అందుకే అదేదో చేసిన ముత్తైదువ వలే కామ్ గా వుంటారు.. ఏదో అప్పుడప్పుడు తిన్నదరక్క "అన్నా హజారే జిందాబాద్" అని అరుస్తే చాలు..

సారే జహాసే అచ్చా....

Wednesday, August 17, 2011

నేటి అధికార భాష -- బూతా


ఇవాళ మన యువత మాట్లాడే భాష ఎంత చెంఢాలంగా ఉందంటే.. ఒకప్పుడు బూతు అనుకునే మాటలన్నీ చాలా తేలిగ్గా అనేస్తున్నారు.. ఉదాహరణకి "నీ ఎంకమ్మా" అనో నీ "అయ్య లేదా "అమ్మ".. అలాగే అనేక బూతు పదాలు .. రాయడానికి వీలులేని పదాలు.. "తొక్కలోది", సొల్లు కొట్టకు..ఇంకా ఎన్నో..
అయితే వీటికి అర్ధాలు మాట్లాడే వాళ్ళకి గాని వినే వాళ్ళకి గాని తెలీదు..యువత ఇంత దిగజారి పోయిందా అని బాధ.. ప్రతీ మాటకు వెనకాల ముందర ఇవి తప్పని సరి.. ఇది ఎవరి తప్పు..

ఒకవిధంగా సినిమా వాళ్ళదే.. బూతుని అధికార భాషగా మలిచేస్తారు.. అదేదో సినిమాలో బ్రహ్మానందం మాటిమాటికి "నీ ఎంకమ్మా" అంటాడు.. ఇహ అక్కడ్నుంచి ప్రతీవాడికి వాడుక పదంగా మారిపోయింది.. మహేష్ పోకిరీలో "ఈ తొక్కలో మీటింగ్ అవసరమా" అంటాడు.. దాంతో ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా,. చివరికి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ఇలాగే మాట్లాడేస్తున్నారు..
సెల్ ఫోన్ లో ఏ అబ్బాయి గాని అమ్మాయి గాని మాట్లాడే భాష ఇదే.. చివరికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయినా ఇదే భాష.. ఒరేయ్
మామా..(పిల్లనిచ్చిన మావ కాదులెండి) ఇక్కడ మా బాస్ దొబ్బుతున్నాడురా(ఇంకా నీచ పదం) .. అసలు.. "బాబూ ఇక అన్నం తిను నాన్నా" అని ప్రేమగా పిలిచిన అమ్మతో "తింటాలే.. ఊకే షంటకు" అంటారు.. అసలీ పదాలకి అర్ధాలు తెలుసా అని.. ఎవరిష్టం వాళ్ళది మధ్యలో నీకొచ్చిన కష్టం ఏమిటంట.. అని మీరు విసుక్కోకండి.. ప్రేమగా పిలిచిన అమ్మతో "నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా.. తర్వాత తింటాలే" అంటే ఎలావుంతుంది..అలాగే ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడే టప్పుడు చుట్టూ నల్గురూ వింటారు అనే ఇంగిత జ్ఞానం వుండి.. చక్కటి పదాలు వాడితే వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది.. అమ్మాయిలు కూడా ఇలాగే వున్నారు.. అదే నా బాధ కి కారణం...
మీరే చెప్పండి నా బాధలో బేధం వుందంటారా..

Thursday, August 11, 2011

ఓ మహాత్మా మన్నించు..


ఈరోజు మధ్యాహ్నం అదేదో సినిమా వస్తోంది.. అందులో హీరోయిన్ రాశి ని అర్ధరాత్రి నడిరోడ్డు మీద, వృద్దాశ్రమం ముందర శ్రీహరి రేప్ చేసే సీన్,, చుట్టూ పది మంది విలన్లు.. కోట, హనుమంతరావు వగైరా... గాంధీ విగ్రహం ముందు..
అయితే
ఇక్కడ నాకు బాధ కల్గించిన అంశాలు రెండున్నాయి.. ఏవిటి "అర్ధరాత్రి నడిరోడ్డు మీద ఆడది ఒంటరిగా నడచినప్పుడే..." అనే భారీ (రొటీన్) డైలాగ్ కొడతానని ఫిక్స్ అయిపోకండి.. నా బాధ నెంబర్ వన్ ఏమిటంటే -- ఒకప్పుడు వెండి తెరమీద వెలుగు వెలిగి, లెజండ్ స్థాయి కీర్తి ని సంపాదించుకున్న హీరో కాంతారావ్ , విలన్ రాజనాల, కారక్టర్ ఆర్టిస్టు ధూళిపాల, హాస్య నటులు అల్లు రామలింగయ్య మరియు నూతన్ ప్రసాద్.. ఇక్కడ వృద్దాశ్రమం లో సేదతీరుతున్న వృద్దులుగా నటించి .. విలన్స్ చేత చాలా దారుణంగా హింసించ బడతారు.
గాంధీ
గారి మూడు కోతుల బొమ్మలు అక్కడే వుంటాయి.. వాటి రూపాల్లాగే చెడు వినకూడదు, చెడు మాట్లాడ కూడదు, చెడు చూడకూడదూ అంటూ వీళ్ళ కళ్ళు, నోరు, చెవులు పొడిచేస్తారు..
ఒకప్పటి మహోన్నత నటుల్ని, ఇప్పటి తరం నటులు (?) ఇష్టానుసారం తంతూ, కుళ్ళ బొడుస్తూ వుంటే అప్రయత్నం గా నా కళ్ళు చెమర్చాయి,.. ఈనాటి వారి దుస్థితికి నేనెంతో బాధ పడ్డాను.. ఇదంతా నటనలో భాగమే కదా అని కొట్టి పారెయ్యలేం..ఒక్క అల్లూ తప్ప వాళ్ళంతా ఆర్ధికంగా బాగా చితికిపోయిన వాళ్ళే.. నిర్మాతలు ఇలాంటి కేరక్టర్లు ఇచ్చి వాళ్ళనేదో ఉద్దరించాం.. అనుకునే బదులు.. (ఇలా వాళ్ళని అవమానించే బదులు).. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి, గౌరవం గా వాళ్ళని చూస్తే చాలు..

ఇక రెండోది.. ప్రతీ అడ్డమైన వెధవకి గాంధీ విగ్రహం ఎదుటే రేప్ సీన్ పెట్టి సింబాలిక్ గా పాట ని పెట్టి మహాత్మా నీవు కలలు కన్న స్వరాజ్య దేశం ఎలా వుందో చూడు అని ఆడదాని మీద గుడ్డలన్నీ విప్పుతేనే గాని వాడో గ్రేట్ డైరెక్టర్ నన్న ఖ్యాతి రాదేమోనని భయం.. పనేదో ఇంకో పెద్దాయన విగ్రహం ముందు పెట్టచ్చుగా...ప్రతీ అడ్డమైన గాడిదకీ గాంధీ విగ్రహం, మూడు కోతుల బొమ్మలంటే ఎంత అలుసు.. మొన్న మా అబ్బాయి అడిగేడు.. డాడీ మన కరెన్శీ నోట్ల మీద గాంధీ గారి బొమ్మ మాత్రమే ఎందుకుంటుంది..మిగతా నాయకులవి ఎందుకు లేవు అని అప్పుడు నేనన్నాను "అది మహానుభావుడికి, జాతిపితకు మనం ఇచ్చే గౌరవం నాన్నా... నవ్వుతూ చక్కగా కనిపించే ఆయన ప్రతిరూపం శాశ్వతంగా భారతీయుల గుండెల్లో నిలిచిపోవాలని ఆనాటి పెద్దల నిర్ణయం" అన్నాను.. కానీ ఈనాడు.. జాతిపిత విగ్రహాలు రేప్ సీన్లకు, హత్యా కాండలకు, రాజకీయ రాబందులకు సాక్షిగా నిలుస్తున్నాయి.. మహాత్మా మన్నించు...
(నా బాధల్లో బేధం ఏమైనా వుందా.. ).. తెలిసీ చెప్పక పోయారో.. భేతాళ కధ గుర్తుంది కదా..

Wednesday, August 3, 2011

నీ ఊరుని ఎంతపెట్టి కొన్నావ్ ?ఒకూళ్ళో (వొక వూరిలో) లగాబుస్సు
లచ్చన్న అని ఓ పిసినారి వడ్డీ వ్యాపారి వున్నాడు.. అతగాడికి ఎన్నికల్లో పోటీచేసి, రూపాయి ఖర్చుపెట్టి, గెల్చిన తర్వాత ప్రజల సొమ్ము కోట్లు కొద్దీ మింగేయాలని ప్లాను వేస్తాడు.. అతడింటికి జనాభా లెక్కల గుమాస్తా వస్తాడు.. అతడికి సదరు లగాబుస్సు లచ్చన్న కి జరిగిన సంభాషణల్లో చివరి పార్టు ఇలా వుంటుంది:
(అప్పటికే ఈయన ధోరణితో అతగాడు దిమ్మతిరిగిపోతాడు)

గుమాస్తా: అయ్యా ! ఆఖరిగా చిన్న ప్రశ్న వేస్తాను .. దీనికైనా సరిగ్గా సమాధానం చెప్పండి సార్!
లచ్చన్న: అడుక్కో.. అడుక్కో..
గుమాస్తా: మీ నేటివ్ ప్లేస్ అనగా మీ సొంత వూరు ఏదండి?
లచ్చన్న: నాకు నేటివ్ ప్లేస్ అనగా సొంత వూరు ఏదీ లేదయ్యా.. ఆ మాట కొస్తే ఈ భూప్రపంచం మీద ఏ మనిషికి సొంత వూరు అంటూ ఏదీ వుండదయ్యా..
గుమాస్తా: అదేవిటండీ అలా అంటారు..ఇప్పుడు నా సంగతే చూడండి.. నా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం..
లచ్చన్న: ఆగలాగ..ఆ వూరు నువ్వెప్పుడు కొన్నావ్? నాకు తెలీకుండా నీకు దాన్ని అమ్మినోడెవడు.. నీ దగ్గర దస్తావేజులు, పత్రాలు, వాటి కాపీలు వున్నాయా.. ఏదీ చూపెట్టు..
గుమాస్తా: అయ్యా నా సొంతూరు అంటే నేను దాని కొనేసానని కాదండి..
లచ్చన్న: మరి కొనకుండా అది నీ సొంతూరు ఎలాగయింది?
గుమాస్తా: అంటే నేను అక్కడ పుట్టాను కాబట్టి..
లచ్చన్న: అంటే నువ్వు అక్కడ పుట్టేస్తే అది నీ సొంతం అయిపోతుందా..
గుమాస్తా: అంతే కదండి..
లచ్చన్న: అయితే మొన్న మా రామ్మూర్తి కూతురు హైదరాబాద్ వెళ్ళింది.. అప్పుడు అది తొమ్మిదో నెల గర్భవతి.. ఎలాగూ హైదరాబాద్ వెళ్ళాను కదా అని అన్నపూర్ణా స్టూడియో కి వెళ్ళింది.. అక్కడో ఫైటింగ్ సీన్ చూసి డంగై పోయి అక్కడే ఓ మగ గుంటణ్ణి కనేసింది.. అక్కడే పుట్టాను కదా అని అన్నపూర్ణా స్టుడియో అంతా నాదే అంటే అక్కినేని నాగేశ్వర్రావ్ వూరుకుంటాడా.. అతడి కొడుకు నాగార్జున వూరుకుంటాడా.. అతగాడి కొడుకు నాగ చైతన్య వూరుకుంటాడా..
(దెబ్బతో గుమాస్తా పరుగు లంకించుకుంటాడు...)
ఆగండాగండి.. ఇదేదో నా సొంత రచన అనుకుంటున్నారా.. ఈ రసవత్తర సన్నివేసం "లగాబుస్సు లచ్చన్న" అనే హాస్య నాటిక లోనిది.. రచన: శ్రీ కాశీవిశ్వనాధ్ ..
ఇంతకీ ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మా సొంతూరు ఫలానా అని, ఈ ప్రాంతం మా సొంతం అని తెగ గలాటా చేస్తున్నారే వాళ్ళకి కాస్త కళ్ళు తెరిపించడానికి.. ఈ వివాదాల ప్రాంతంలో ఎవరు ఎప్పుడు పుట్టేరు.. ఎవరు ఎక్కడ నుంచి వచ్చి ఎన్నేళ్ళ క్రితం సెటిల్ అయ్యారు.. ఇవన్నీ తెలిసేదెలా.. ఇప్పుడు అసలు సిసలైన తెలంగాణా వాళ్ళని గుర్తించడం ఎలా ? పాలూ నీళ్ళని వేరుచేసేది ఎలా.. బొబ్బిలి నుండి వలస వచ్చి ఈ అమాయకుల మీద స్వారీ చేస్తున్న దొర వారి & వారి కుటుంబ వ్యక్తుల దాష్టికం ఎన్నాళ్ళు..