సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా

సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా
ఓం నమో నారాయణాయ..

Tuesday, December 27, 2011

ఈ కధలో గజేంద్రుడు నువ్వే


మీలో చాలా మంది గజేంద్ర మోక్షం గాధ వినే వుంటారు.. పోతనా మాత్యులు చాలా అద్భుతంగా రాసారు.. ఒక భక్తుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్ధించాలో తెలియచేసే గాధ.. అక్కడ ఏనుగు ఎవరో కాదు మనమే, ,మొసలి మనలో వున్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలు.. ఇక కధ లోకి వస్తే ఎంతో బల గర్వితుడైన ఏనుగు రాజు తన రాణి ఏనుగులతో ఒక సరస్సు లో జలకాలుడూ, తన తొండము తో నీతిని పీల్చి ఇతర ఏనుగులపై చిమ్ముతూ, ఇలా ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముతూ జలకాలుడుతూ వుంటే హటాత్తుగా ఆ సరస్సులో వున్న ఒక మొసలి తన నోటితో ఆ ఏనుగు యొక్క కాలుని పట్టుకుంటుంది..

కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.


ఏనుగు తన బలమంతా వుపయోగించి యుద్దం చెసినా పట్టు విడవదు.. అడవంతా వినిపించేటట్టు ఘీంకారం చేస్తూ మొసలితో పోరాడినా, మొసలి తన పట్టు విడవదు.. అలా ఎన్నో రోజులు సాగుతుంది ఈ పోరాటం.. చివరికి ఏనుగులో బలం నశిస్తుంది.. ఎంతో బలంగా, పుష్టిగా వున్న ఏనుగు కాస్తా బలహీనంగా అయి మొత్తం శరీరం అంతా శుష్కించి పోతుంది.. అప్పుడు ఏమిచెయ్యాలో దిక్కు తోచక విష్ణు మూర్తిని ప్రార్ధిస్తుంది.

"దేవా , నా బలమంతయు పోయినది.. నా గర్వము అణిగినది, ధైర్యం కోల్పోయినాను, ఈశ్వరా నీవు తప్ప ఇక నాకు దిక్కెవ్వరు లేరు.. వచ్చి కాపాడుము.. ఈ మొసలి బారి నుంది నన్ను రక్షింపుము" అని ఎంతో దీనంగా, ఆర్తితో ప్రార్ధిస్తుంది..

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్

ఒకపరి జగముల వెలినిడి, యొకపరి లొపలికిఁ గొనుచు నుభయుముఁ దానై
సకలార్థ సాక్షియగు , య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్


కలఁ డందురు దీనులయెడఁ, గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను, గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో
కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ గలిమిలేములు లేక గలుగువాఁడు
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ బడిన సాధుల కడ్డపడెడు వాఁడు
చూడఁడె నా పాటు చూపులఁ జూడక చూచువారలఁ గృపఁ జూచువాఁడు
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱఁగువాఁడు


ఏనుగు మొరని విన్న విష్నుమూర్తి ఎక్కడో వైకుంఠ పురంలో తన భార్య లక్ష్మీ దేవితో పాచికలు ఆడుతున్న విష్ణు మూర్తి పరుగు పరుగున వచ్చి ఏనుగును కాపాడతాడు.. అప్పుడు పోతన గారు వర్ణించిన పద్యాలు ప్రతి ఒక్కరు వినితీరవలసిందే.. "

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;

వినుదట జీవుల మాటలు, జనుదట చనరాని చోట్ల శరణార్థుల కో
యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యెఁ గరుణావార్ధీ

కమలాత్మ! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష దూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగ తామర

నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపుల ప్రభావ! రా

వే, కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁ గావవే.


పద్యాలు భావయుక్తంగా, రాగ యుక్తంగా ఎవరైనా పాడితే పాడే వాళ్ళకి, వింటున్న వాళ్ళకి కన్నీళ్ళు రాక మానవు..
ఇంతకీ చివరగా మళ్ళి
నేను చెప్పేదేమిటంటే ఇక్కడ ఏనుగు మనమే, మొసలి మనలో వున్నా కోరికలు, కామము, ఆపేక్ష, కాంక్ష, ఆశ, వగైరా.. అవన్నీ వదిలి, ఆర్తితో, చిత్తసుద్దితో భగవానుని స్తుతించి మెప్పించ డమే మన విధి.. మరొక్క సారి పోతనా మాత్యులకు జోహార్లు అర్పిస్తూ విష్ణు నామ కీర్తనం చేద్దాం " ఓం నమో నారాయణాయ"

0 comments:

Post a Comment