Saturday, June 23, 2012

సన్మానాల తిప్పలు..

పూర్వం రోజుల్లో ఎవరికైనా సన్మానం చేయ్యాలంటే సదరు వ్యక్తి ఎంతో ప్రముఖుడై ఎంతో ఆదర్శ వంతుడై అందరికీ తెలిసిన వ్యక్తిగా ప్రఖ్యాతి గాంచిన వారై వుంటేనే సన్మానానికి అర్హుడు.. 

మరి ఈ కాలంలో ఎవరు ఎవర్ని ఎప్పుడైనా సన్మానించొచ్చు.. ఎన్ని బిరుదులైనా ఇవ్వచ్చు.. బిరుదుకో  రేటు చొప్పున సన్మానం ఎంత గొప్పగా వుంటే అంత ఎక్కువగా వారి వద్ద డొనేషన్ కూడా లాగించేవచ్చు..
అప్పుడే వెలుస్తారు సన్మాన పత్రాలు రాసేవాళ్ళూ..దాన్ని అందంగా లామినేషన్ చేసేవాళ్ళూ.. సైజుని బట్టి ధర.. పదాల పేరికను బట్టి కమీషను..


వారి దగ్గర కొన్ని మాటలు పర్మనెంట్ గా వుంటాయి.. "కళా బంధు",, "కళా పిపాసి", "మూర్తీ భవించిన మానవతా మూర్తీ" మున్నగు నవి..  వ్యక్తి ఎవరైనా టైటిల్ వకటే.. "ప్రతిభకు పట్టభిషేకం..మృదుల మానవీయతకు  నీరాజనం"... ఆత్మీయ అభినందన పురస్కారం..
ఇక లోపల .."ఓ ఘనా పాటీ.. నీకు నువ్వే సాటి.. వేరెవ్వరు లేరు నీకు పోటీ" ఇలాంటి పదాలు కామన్.. వాడు పరమ కోపిష్టి కావచ్చు అయినా మానవతా మూర్తి అనే రాయాలి..  వాడు ఎప్పుడూ నాటకాలను గాని, సినిమాల్ని గాని చూసి వుండక పోవచ్చు అయినా సరే "ఓ కళా పిపాసీ", "కళా నిధీ అంటూ పొగడాలి"..  


ఇప్పుడంతా గ్రాఫిక్కు మహిమ.. ఆల్రేడీ డిజైన్ కంప్యూటర్ లో నిక్షిప్తమై వుంటుంది.. పువ్వులు, దండలు.. నక్షత్రాలు అన్నీ చక్కగా క్లిప్ ఆర్ట్ లో వుంటాయి.. అందర్కీ అవే పువ్వులు.. అదే డిజైన్లు.. హ్యపీగా ఒక్క గంటలో సన్మాన పత్రం తయారు.. ఇక్కడా అంతే... సైజును బట్టి, డిజైనుని బట్టి, ఫొటోల సంఖ్యను బట్టి.. రేట్లు..
ఇవన్నీ గాక ఇంకో సులువు పద్దతి.. నిర్వాహకులు, సదరు సన్మాన గ్రహీతకు ఓ ఐదు వందలో, ఆరు వందలో ఇచ్చి అయ్యా మీ సన్మాన పత్రం మీరే తయారు చేసు కోండి అని చెప్తారు.. ఎందుకంటే ఇంతకు ముందు పద్దతిలో అయితే సన్మాన కర్తలు సన్మాన గ్రహీత చుట్టు బయోడేటా కోసం, ఫోటోల కోసం, ఓ పదిసార్లు తిరగాలి..ఆ మహానుభావుడు.. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం బ్లాక్ అండ్ వైట్ లో తీయుంచుకున్న ఫోటో ఒహటి కొట్టి దాన్నే పెట్టమంటాడు.. డి.టి.పీ వాడేమో ఈ ఫోటోని పెద్దది చేస్తే క్లారిటీ వుండదండీ అంటాడు.. ఎలాగోలా అఘోరించవయ్యా.. టైం లేదు.. అని వీడు దాన్నే పెట్టిస్తాడు.. ఇహ చూడండీ.. బ్యాక్ గ్రౌండేమో కలర్ ఫుల్ గా వుండి.. ఫొటో ఏమో మసక మసకగా వుండి..   చండాలంగా చస్తుంది.. 


ఇహ రాసే వాడికి సన్మాన గ్రహీత యొక్క గుణ గణాలు గాని, యోగ్యత గాని తెలియక కట్టుడు పదాలతో గజిబిగా వుండి.. ఇంతకీ తిడుతున్నాడా పొగుడుతున్నాడా అన్న టైప్ లో వుంటుంది.. 
మరి కొంతమంది కవులు.. సన్మాన పత్రం మేమే చదువుతాం.. అలా అయితేనే రాస్తాను అని కండీషన్ పెడతాడు.. అతన్నే సభాధ్యక్షుడిగా చెయ్యాలనే కండిషన్ కూడా  వుంటుంది.. 

అతను తన ప్రసంగంలో చీటికీ మాటికీ వెనకాల కట్టిన బానర్ వేపు చూస్తూ సదరు సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అప్పటి కప్పుడు తనకు తోచిన రీతిలో మాట్లాడుతూ సభని రసాభాస చేస్తాడు.. 
ముఖ్య అతిధి ఎంత పెద్దవాడైనా, పేరు వున్న ఆఫీసర్ అయినా, తను కవినన్న అహంకారంతోనో లేదా ఇక్కడ తనదే పెత్తనం అంతానని తెలియ చేయడం కోసమో సభని డామినేట్ చేసి, ముఖ్య అతిధులకి చికాకు రప్పిస్తాడు.. 
సరే ఇప్పటికి ఇంతే సంగతులు..మళ్ళి కలుద్దాం.. బై..          

Friday, June 1, 2012

కువైట్ లో మా నాటికల ప్రదర్శనలు..


ప్రియ బ్లాగు మిత్రులారా.. 
మేము ఓ పది మంది నాటక సభ్యులం  "తెలుగు కళా సమితి" కువైట్ వారి ఆహ్వానం మేరకు కువైట్ లో జరగ బోయే "నాటకోత్సవములు" లో పాల్గొనుటకు బయలు దేరి వెళ్తున్నాం. 

08-06-2012 తేదీన ఉ.9.30 నుండి సా.6.00 గం.. వరకు మూడు నాటికలు - పుటుక్కు జర జర డుబుక్కు మే, బోయవాని వేట, ఇండియన్ గ్యాస్ మరియు కన్యాశుల్కం లోని మధురఘట్టాలు - ప్రదర్సిస్తున్నాం.. 
కువైట్ లో నున్న తెలుగు కళాభిమానులైన బ్లాగ్ మిత్రులందరికి ఇదే మా ఆహ్వానం..
మా ప్రదర్శనలను చూసి మమ్ములను ఆశ్వీరదించండి.. 
కువైట్ లో నున్న మీ మిత్రులకు కూడా చెప్పండి.. 
ధన్యవాదములు.. 
మిగిలిన బ్లాగు మిత్రులకు కూడా మమ్ములను దీవించమని విన్నపము.