Monday, July 30, 2012

ఓ గోదారోడా.. ఇది ఏ ప్రాంతం ???

మీలో చాలా మంది గోదావరి జిల్లాల వాళ్ళు వున్నారు... మీకు మీ వూరన్నా, గోదావరి ఒడ్డున అందాలన్నా చాలా ప్రేమ అభిమానం... అది నాకు తెలుసు.. 

ఎలాగంటే మా  ఆవిడది..నేచురల్ గా వాళ్ళ అన్నయ్యది అత్తిలి..వాళ్ళు ఆ వూరు వదిలి సుమారు 40 ఏళ్ళు అవుతుంది, ఇక్కడ నీళ్ళు తాగుతూ, ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ పొట్ట కూటి కోసం జీతం తీసుకుంటూ, సమయం వస్తే చాలు.. మా కోనసీమ, మా.. ప.గో.జీ..తూ.గో.జీ అంటూ ఎక్కడికో వెళ్ళిపోతారు... 

అక్కడే నాకు మండుద్ది.. నాకే ఇలా వుంటే మరి తెలంగాణా వాళ్ళకి ఇంకెంత మండాలి. అందుకే మా రాష్ట్రం మాగ్గవాలే, మా నీళ్ళు మాగ్గావాలే అంటూ వుద్యమిస్తున్నారు... ఇలాంటి ప్రాంతీయ, కుల పిచ్చి వున్నంత కాలం మన రాష్ట్రం అభివృద్ధి   చెందదు..

సరే ఇంతకీ విషయం ఏమిటంటే ఈ క్రింది ఫొటో నేను ఏదో గోదావరి ప్రాంతం లో తీసినదె.. ఎక్కడ తీసానా అని మర్చిపోయాను.. పాలకొల్లు, అమలాపురం, భీమవరం, అత్తిలి, రాజోలు..ఈ వూళ్ళు వెళ్ళినప్పుడు   తీసాననుకుంటా..

మీరే కనక నిజమైన గోదారి  అభిమానులైతే ఈ ఫొటొ ఎక్కడిది చెప్పుకోండి.. అబ్బ.. ఆ  కొబ్బరిచెట్లు.. అవీ ఎంత బావున్నాయో.. మీ గోదారొడ్డున తప్ప ఇలాంటి సీను వుండదని గర్వం... సరే చెప్పుకోండి చూద్దాం...   

Friday, July 13, 2012

మన సి.ని.మా ల గురించి నా గోల..

ఇది నా ముందరి టపాకు సీరియల్ లాంటిది అనుకుందాం.. చక్కటి విషయాలు రాసిన మితృలందరికి ధన్యవాదాలు ...
నాకు వచ్చిన సందేహాన్ని తీర్చిన జై.గొట్టిముక్కల గారికి ధన్యవాదాలు.. అయితే సిల్క్ నిజ జీవితంలో రజనీతో అలాంటి అనుభవాలు  జరిగిందో లేదో మనకి తెలీదు..
తరువాత అజ్ఞాత గారు చక్కగా రాసారు..మీరు చెప్పినట్టు కర్ఫ్యూ టైం లో ఎవరూ అలా తిరగరు..మీ ఉపమానం కూడా చాలా బావుంది.. ధన్యవాదములు...  కరెక్టే నండి..అయినా రాముడి చేతిలో విల్లంబు వుంటుంది అని చెప్పడానికి ఇంత గోల అక్కర్లేదు..అప్పుడే పుట్టిన పాపాయి కూడా చెప్పగలదు...దానికి పేదరికం, అవిద్య కారణం అక్కరలేదు.. అన్ని ప్రశ్నలు సిల్లీ పైగా దానికి బోలడంత చెత్త ఫ్లాష్ బాక్ ఒహటి..


తరవాత uknowat ??? గారు అలియాస్ రాజశెఖర్ దాసరి గారు మీ అభిప్రాయంతో నేను కాస్త ఏకీభవించట్లేదు.. ఇక్కడ నజిరుద్దిన్ షా అనుకరణ మన హీరోలకి (ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్) లాంటి వాళ్ళకి అతికి పోయింది.. 

(Note:నేను ముందే చెప్తున్నాను నేను మన తెలుగు అగ్ర హీరోలయిన ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు లకి వీరాభిమానిని కాని లేటు వయస్సులో వాళ్ళు వేసిన కుప్పిగెంతుల మీద, దాన్ని అనుసరించిన నజరుద్దిన్ మీదే నా టపా రాసాను.. వారి అభిమానులని క్షమించ మని ప్రార్ధన... సరదాగా రాసాను కాని ఎవర్నీ నొప్పించే వుద్దేశంతో కాదు)..
ఎంతో గొప్ప నటులయిన వీళ్ళంతా, వాళ్ళు అరవై దాటిన తర్వాత వాళ్ళ వేషాలేంటి, తమ కంటే సుమారు నలభై ఏళ్ళు చిన్నవాళ్ళయిన శ్రీదేవి, జయప్రద, జయసుధలతో ఆ గెంతులు, బూతు పాటలుకి స్టెప్స్, డబల్ మీనింగ్ డైలాగుల తో ఎంత రచ్చ చేసారండి.. భూకైలాస్, పాండురంగ మహత్యం, లవకుశ, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, మల్లీస్వరి, దాన వీర శూర కర్ణ, ఇలా ఒకటా రెండా అనేక చిత్రాలలో తన నటనతో విశ్వవిఖ్యాతి నట సార్వభౌముడు తన అరవై ఏళ్ళ వయసులో పదహారేళ్ళున్న శ్రీదేవి, జయప్రదలతో తో వేటగాడు, యమగోల, అడవి రాముడు, బొబ్బిలి పులి, ఇలాంటి సినిమాల్లో ఆయన వేషం డర్టీ పిక్చర్లో నజరుద్దిన్ వేషం లాగే వుంది... ఆ విగ్గు, బొమ్మల బొమ్మల పొట్టి చొక్కాలు హీరోయిన్లను తాకరాని చోట తాకుతూ ఎన్ని గెంతులు వాటినీ ఆదరించాం గతి లేక..

ఇక అక్కినేని....దేవదాసు, అనార్కలి, విప్రనారాయణ, సువర్ణసుందరి, మహాకవి కాళిదాసు,  పునర్జన్మ, తోడికోడళ్ళూ, జయభేరి,వెలుగు నీడలు,  మూగమనసులు లాంటి ఎన్నో కళా ఖండాలలో తన అసమాన నటనా కౌశల్యంతో మనలని మంత్ర ముగ్డుల్ని చేసిన ఆయన పైత్యం ఏమని వర్ణించాలి.. ముసలి వయస్సులో పెళ్ళికాని కుర్రాడిగా కనిపించ డానికి అనేక పాట్లు పడి శ్రీదేవి తో, జయసుధ, జయప్రదలతో ఎన్ని కుప్పిగెంతులు, అవన్ని భరించాం గతి లేక.. ఆయన అప్పట్లో వేసిన విగ్గులు, బొమ్మల బొమ్మల చొక్కాలు అచ్చం నజిరుద్దిన్ వేసినవే...

ఇహ ముదురు పెళ్ళికొడుకు శోభనబాబు ఈయనకి ఒక పెళ్ళం చాలదు అన్నిట్లోనూ ఇద్దరు వుండాలి(ఆంధ్రా అందగాడు కదా).. ఇద్దరి తోను డ్యూయెట్లు... ఆఖర్న ఒహరు చావాలి, లేదా మనం చావాలి..ఈయన అన్ని సినిమాల్లోను విగ్గు లోంచి ఒక పాయ ముందుకు వచ్చి రింగులాగ కనిపించాలి ఇది అచ్చం ఇలాగే నజిరుద్దిన్ షా చేసాడు..అందులో తప్పేమి వుందండి.. 


ఇహ మన కృష్ణ  గారు హిట్లు ఎన్నో ఫ్లాపులు కూడా అన్నే వుంటాయి.. కాని తెలుగులో ఎవరూ చేయని సాహసాలు చేసి సినిమాలు తీసినా. ఆయన నవ్వినా ఏడ్చినా ఒక్కలాగే వుంటుంది.. బిగుసుకుని పోయి, చెయ్యి పిడికిలి బిగించి తేనే గాని డైలాగ్ రాదు..పాపం హీరోయిన్లను ఎన్ని ఇబ్బందులు పెట్టేడో తన ఎక్సర్సైజు లాంటి కుప్పిగెంతులతో..ఈయన్ని అనుకరించని మిమిక్రీ అర్టిస్టు ఎవరూ లేరు.. అల్లూరి, గూఢాచారి 111, పండంటి కాపురం లంటి హిట్ సినిమాలు ఎన్నో వున్నా, తన విశిష్ట నటనా కౌసల్యంతో అలరించినా లేట్ వయస్సులో హీరోయిన్లతో పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు.. ఇది కూడా సరిగా నజరుద్దిన్ షా నటనకు అతికింది.. 

అసలు అంతవరకూ ఎందుకండి,, ఇప్పుడు బాలకృష్ణ విగ్గు ని చూడండి.. ఆ పొట్టి చొక్కాలు,  తర్వాత వెంకటేష్ ఇప్పటికీ పెళ్ళికాని కుర్రాడే.. వీళ్ళకి హీరోయిన్ మాత్రం పదహారేళ్ళ బాలాకుమారి వుండాలి..ముడతల పడ్డ వాళ్ళ చర్మాలు, నరాలు కనిపించే చేతులు.. ఇప్పుడు చెప్పండి .. నజరుద్దిన్ షా చేసిందాంట్లో తప్పేవిటి.. 
విశ్వనాధ్, బాపు, జంధ్యాల, బాలచందర్ లాంటి దర్శకులు లేకపోతే నిజమైన కళాఖండాలు వచ్చేవంటారా.. ఇప్పటికీ మనం ఎదగలేదు.. ఒక్కడే హీరో వందమందిని చితగ్గొడుతూ వుంటే అదీ గ్రాఫిక్ లో నోరెళ్ళబెట్టి చూడ్డమే తప్ప చేతకాని మన ప్రేక్షకులు వున్నంత కాలము ఇలాంటి సినిమాలే వస్తాయి.. సి (సిగ్గు), ని(నీతి), మా (మానం) లేని సి.ని.మా లపై ఇంత వాగి నందుగు దాన్ని భరించి నందుకు ధన్యవాదాలు.. నన్ను తిడుతూ రాయడం మర్చిపోకండేం..                    

Wednesday, July 11, 2012

అవార్డుల చిత్రాల పై..కామెంట్..ప్లీజ్


అవార్డు వచ్చిన సినిమాల గురించి చర్చిద్దామని.. ఈ రెండు సినిమాలు మీకు పాతవే కాని నేను మాత్రం మొన్ననే టి.వీ లో చూసా.. మనసు వుండబట్ట లేక రాస్తున్నా..
 
మొదటిది "స్లం డాగ్ మిలియినర్".. 


రెండవది "డర్టీ పిక్చర్" 

ఇండియా వాళ్ళని ఎంత అసహ్యంగా, పేదవారిగా చూపిస్తే అంత ఎక్కువ విదేశాల్లో అవార్డులు, డబ్బులు రావడం ఖాయం.. ఈ సంగతి ఇంతకు మునుపే రుజువయ్యింది సత్యజిత్ రే లాంటి వారి దయవల్ల..


కాని ఈ స్లం డాగ్ లో నిజంగా వీధి కుక్కల లాగే చూపించారు..ముఖ్యంగా ఆ అబ్బాయి మరుగు దొడ్డి లో నుండి మునిగి రావటం..(అమితాబ్ ఆటోగ్రాఫ్ కోసం) ఇది ఎంత జుగుప్సా కరంగా వుందంతే ఆ టైం లో ఇహ టి.వీ కట్టేసి సినిమా చూడక్కర్లేదు అన్నంత అసహ్యంగా, నీచంగా మోతాదు మించిన దరిద్రంగా తీసాడు.. తీసిన వాడికి, అవార్డు ఇచ్చిన వాడికి అది ఒక కళాఖండమే గావచ్చు..

కాని ఒక సగటు భారతీయునిగా తల భూమిలోకి పాతిపెట్టుకునే అంత ఘోరంగా వుంది..మిగిలిన సినిమా అంతా ముందే తెలిసిపోయేటట్టుగా వుంది.. కేవలం ప్రశ్నలకు తగ్గట్టుగా కధలు అల్లడం పెద్ద విశేషం అనిపించలేదు..తెలుగులో వీధి బాలల మీద ఇంతకన్న గొప్ప సినిమాలే వచ్చాయి..ఇంతకన్న నీచతి నీచమైన దారిద్రాన్ని అనుభవిస్తున్న దేశాలెన్నో వున్నాయి కాని మన భారతదేశం లోని దారిద్రమే వీళ్లకి కనిపిస్తుంది.. వదిలేయంది..

ఇక సిల్క్ స్మిత కధని అధరంగా తీసిన డర్టీ పిక్చర్ నన్నెంతగానో ఆలోచించేలా చేసింది.. కేవలం ఆవిడ పేరుని మాత్రమే వాడుకున్నారు గాని, ఇంచు మించు సినిమా హీరోయిన్ల, ముఖ్యంగా వాంప్ పాత్రధారుణిల  జీవితం ఎలా వుంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించారు..  


ఇంతకు ముందు హీరోయిన్ జీవిత చరిత్ర అధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి గాని ఇది ఇంతకు ముందులాంటి సినిమలా కాక ఒక వాస్తవాన్ని సహజ సిద్ధమైన నటన ద్వారా విద్యా బాలన్, నజిరుద్దిన్ షా చాలా నేచురల్ గా   నటించారు.. కాదు జీవించారు.. 

ప్రతీ సన్నివేశం ఎంతో భావ గర్భంగా, సున్నిత హాస్యంతో కూడి, ఒక సినిమా  చూస్తున్నట్లుగా అనిపించలేదు.. వాళ్ళ జీవితాలపై సానుభూతి వచ్చేలా వుంది.. చివర నాలుగో వంతు సినిమా చూడలేక పోయాను కారణం అప్పటికే అర్థరాత్రి పన్నెండు దాటింది..చివర్లో ఆవిడ ఆత్మ హత్యా లేక  హత్యా అన్నది ఎలా తీసాడో చూడ్డం అవలేదు..మీకు తెలుస్తే చెప్పండి...  

పేరు "డర్టీ పిక్చర్" అన్నది కరక్టే కాని ఇలా పెట్టడం వల్ల చాలా మంది ఇదేదో బూతు సినిమా అని చూసి  వుండరు.. విద్యా బాలన్ కంటే సిల్క్ స్మిత కళ్ళలోనే శృంగార కరమైన మత్తుగా వుండేవి.. కేవలం ముఖ  కవళికలు, హావ భావ ప్రకటనల వల్లనే స్మిత గారికి   అంత పేరు వచ్చింది.. 

నాదో సందేహం నజిరుద్దిన్ షా అనుకరించి నటించిన నటుడు తెలుగులో ఎవరు? ఎన్.టి.ఆర్ లేక ఏ.ఎన్.ఆర్? లేక శోభన్ బాబ అని సందేహం.. 

ఈ సినిమా కి అవార్డు ఇచ్చినందుకు అప్పుడు బాధ పడ్డ నేను అలా బాధపడినందుకు ఇప్పుడు ఇంకా చాలా బాధపడుతున్నాను.. హాట్సాఫ్ టు డైరెక్టర్, నజిరుద్దిన్, విద్యా మరియు సాంకేతిక వర్గానికి..
నా సుత్తిని భరించిన మీకు జోహార్లు..            

Sunday, July 8, 2012

తప్పెవరిది?? మీరే తీర్పు చెప్పండి..


నిన్న ఓ ఏక్సిడెంట్ ప్రత్యక్షంగా చూసాను.. కంగారు పడకండి..ఏక్సిడెంట్ చిన్నదే.. కాని అది జరిగిన తీరు చెప్పి  తప్పెవరిదో తీర్పు ఇవ్వవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను.. 
 
స్థలం విశాఖపట్టణం లో అక్కయ్యపాలెం సిగ్నల్ పాయింట్ దాటి నేషనల్ హైవే రోడ్డు (నగరం నడిబొడ్డున) ..
నాకు పది గజాల దూరంలో ఒక ఆవు రోడ్డుని క్రాస్ చేస్తోంది.. నా పక్క నుండే వెళ్తున్న మూడు కార్లు ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూ, ఆవుని దాదాపు గుద్దినంత పనిచేసి తప్పించుకుని వెళ్ళాయి...ఒహడు కూడా ఆపి దానికి దారి ఇవ్వలేదు.. స్లో గానే వెళ్తున్నా ఒక్కరూ ఆపలేదు.. కాని మూడో కారతను దాదాపు గుద్దినంత పనిచేసి ఆపాడు (తప్పనిసరిగా) దాంతో పాపం ఆ ఆవు పడబోయి తమాయించుకుని దాటుకుని డివైడర్ మీద నుంచి దుమికి వెళ్ళే ప్రయత్నం లో వుంది.. 


ఇంతలో వెనకాల స్పీడ్ గా వస్తున్న లారీ వాడు బ్రేక్ వేసినా క్రాస్ గా వచ్చి దఢేల్ మని గుద్దేసాడు..బంపర్, లైట్లు పగిలి పోయాయి.. కాని డైరెక్ట్ గా వచ్చి గుద్దితే కారు బోల్తా పడి అందులో వున్న వాళ్ళు చచ్చి పోయే వారు.. ఆ లారి వాడు అదే స్పీడ్ కొనసాగి వచ్చి గుద్దితే నేను చచ్చి పోయేవాణ్ణి.. కారు అడ్డంగా వుంది కాబట్టి కారుని గుద్దేడు..

ఆ ఆవుకి బదులు మనిషి వుంటే ఆవులా తమాయించు కోక డివైడర్ మీద పడి తలపగిలి చచ్చే వాడు.. లారీ క్రాస్ గా కాక డైరెక్ట్ గా గుద్ది వుంటే కారులో వున్న వాళ్ళు ఒక్కడు మిగలడు..
ఈ ఘటన ఎక్కడో వూరవతల హైవే మీద జరిగితే అనుకోవచ్చు, ట్రఫిక్ ఎక్కువగా వుండి దాదాపు వెహికల్స్ నార్మల్ స్పీడ్ లో వచ్చి, ఆగే అవకాశం ఆవుకి దారి ఇచ్చి ఆ తర్వాత వెళ్ళే అవకాశం వున్నా, దాదాపు ఆవుని రాసుకుంటు, గుద్దేస్తూ వెళ్ళే అవసరం ఇక్కడ లేదు.. 


ఓ మూగ జీవి రోడ్డుని క్రాస్ చేస్తూ వుంటే దానికి దారి ఇచ్చే సంస్కారం, ప్రేమ, జాలి, భూత దయ లేని మనుషుల మధ్య మనం వున్నాం..  ఆ మర్నాడు పేపర్లో "రోడ్డుకి అడ్డంగా ఆవు రావడం వల్ల ఏంచెయ్యాలో పాలుపోని స్థితిలో కారు సడెన్ బ్రేక్ వేసి ఆపితే, వెనకాల్ స్పీడ్ వస్తున్న లారీ డ్రైవెర్ తప్పని పరిస్థిల్లో కారుని గుద్దేడని, అప్పటికీ చాలా చాకచక్యంగా ఆపాడని, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగివుండేదని, కథలు కథలు రాస్తారు... 

వీలైతే సమయానికి స్పందించలేదని  పోలీస్ వాళ్ళని, పశువులని అడ్డదిడ్డంగా వదిలేస్తున్న  యజమానిని, మునిసిపాలిటీ వాళ్ళని తిడతారు.. కాని అసలు  తప్పంతా కారు వాళ్ళదే.. ముందే ఆ ఆవుకి దారి ఇచ్చుంటే ఇంత ప్రమాదం జరగదు.. ఆవుని గుద్దుకునైనా ముందుకి వెళ్ళే ప్రయత్రం చేసిన మూడో కారు వాడికి మంచి శాస్తి జరిగింది..
ఇప్పుడు చెప్పండి..
తెప్పెవరిది? నోరులేని మూగజీవిదా.. కారు వాళ్ళదా.. లారీ వాడిదా..లేక ఇంత సెన్సెటివ్ గా ఆలోచించి మీ బుర్రలు తింటున్న నాదా.. పోలీస్ వ్యవస్థ దా.. యజమాని,మునిసిపాలిటీ వాళ్ళదా..
జవాబు తెలిసినా చెప్పక పోయారో బేతాళ కథ లో విక్రమాదిత్యునిలా అయిపోతారు..   

(గమనిక: ఫొటో ఆ సంఘటనది కాదు.. గూగులోడిది..)   

Friday, July 6, 2012

సన్మాన చిత్రాలు...సరదాగా మీతో..

Dear Sirs / Madams...
ఈ మధ్య మా డిపార్టుమెంట్ వాళ్ళు మరియు "మెడికల్ కల్చరల్ అసోసియేషన్" తరఫున నన్ను సన్మానించారు.. ఆ ఫొటొలు..  సొంత డబ్బాకి కాదండోయ్.. సరదాగా మీతో పంచుకుందామని..   


వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.,.

Wednesday, July 4, 2012

ఓ ఉచిత సలహా..ఇవ్వగలరా.. ప్లీజ్

మా స్నేహితుడు ఒకాయన కూతురికి అమెరికా సంబంధం వచ్చింది.. 
అబ్బాయి కుటుంబ నేపధ్యం, వుద్యోగం, గుణ గణాలు అన్నీ బాగానే వున్నాయి.. 
కాని అమ్మాయి తల్లికేమో వున్న ఒక్క కూతుర్ని అంత దూరం ఇచ్చేస్తే ఎలా అని బెంగ.. 
అందుకే మీ సలహా అడుగుతున్నాను.. 
మీలో చాలా మంది విదేశాల్లో ఎప్పటి నుంచో వుంటున్నారు కదా.. 
ఓ మంచి సలహా ఇచ్చి పుణ్యం కట్టు కుంటే..వాళ్ళకి మీ అభిప్రాయం చెప్తే....
ఏమైనా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు...  .

Tuesday, July 3, 2012

కువైట్ లో తెలుగు వెలుగు

తెలుగు కళా సమితి, కువైట్ వారి ఆహ్వానం మేరకు మా నాటికలు ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు  తీయించుకున్న కొన్ని ఫొటోలు.. మీకోసం:  Monday, July 2, 2012

గిరీశం ఉవాచ:

"ఈ ప్రపంచంలో  ఏమేమి వస్తువులున్నాయి?" మహారాజశ్రీ గిరీశం గారడిగిన ప్రశ్నకు
 "ఆవులు" శిష్యుడు వెంకటేశం జవాబు..
ఏవిటి ఎదురుగ్గా ఆవులు వున్నాయనా? సరిగ్గా చెప్పు.. అని గిరీశం గారి ఉవాచ..
ఆ రోజుల్లో కాబట్టి "ఆవులు", గేదెలు, చేగోడీలు అని జవాబులు..
కాని ఇప్పుడైతే.. వెంకటేషం మళ్ళి పుడితే ఠక్కున "దోమలు" అని చెప్తూ చేతిమీద వాలిన దోమని చటుక్కున కొట్టి చంపుతాడు..
"ప్రపంచములో దేముడు ప్రతీవస్తువును ఏదో ఒక వుపయోగము కొరకు చేసియున్నాడు. చేగోడీలను ఎందుకు చేసియున్నాడు?"   
"తినడనమునకు."
"ఆవులనెందుకు చేసాడు?"
"పాలు యివ్వడమునకు.."
"పెర్ ఫెక్ట్లీ రైట్! ఆడవాళ్ళ నెందుకు చేశాడు?"
"వంట చెయ్యడానికి."
"నాన్సెన్స్, పెండ్లాడమునకూ, పిల్లలని గనడమునకున్నూ,  గనుక పెండ్లాడకుండా వున్న విధవ దేవుని ఆజ్ఞను  అతిక్రమించిన పాపమును చేస్తున్నారు.." 
అభినవ గిరీశం, వెంకటేషం: 
"మరి దోమలను ఎందుకు సృష్టించెను.."
"మనలని కుట్టుటకును, రక్తమును పీల్చుటకును.."
       

Sunday, July 1, 2012

అబ్బ ..నవ్వండేహే

భర్త: ఏమోయ్! మీ బంధువులొచ్చారు.. కాస్త ఇలా వచ్చి రిసీవ్ చేసుకుని మర్యాద చెయ్యి..
(ఆవిడ పాపం గబ గబా వచ్చి చూసేసరికి రెండు గాడిదలు కనిపించేయి) .. 

కాని ఆ ఇల్లాలు వెంటనే తడుముకోకుండా.."రండి మావయ్య గారు! రండి అత్తయ్య గారు" అంది..
- - - - - - - - - -


ఓ కలి కాలం భక్తుడు రామ కోటి రాసి, రాముడ్ని ప్రార్ధిస్తే, ఆహా ఈ కలం లో కూడా నాకు రామ కోటి రాసే వాళ్ళున్నారా అని ఎంతో పొంగిపోయి ఆ భక్తుడికి  దర్శనమిస్తాడు..


కాని పక్క నున్న సీతాదేవి ఆ  రామకోటిని ఓ సారి పరికించి చూసి "స్వామీ.. ఈ భక్తుడు మిమ్మల్ని మోసం చేసాడు.. మొదటి పేజీలో మాత్రమే రాసి, మిగిలిన వన్నీ జెరాక్స్ కాపీలు పెట్టేడు.. అని చెప్పింది.. 

"స్వామీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని వుపయోగించి ఇలా రామకోటి రాసాను.. రామ కోటిలో రామ నువ్వుంచుకొని కోటి రూపాయిలు నాకు ప్రసాదిస్తే మంచి ఫ్లాట్, ఓ కారు కొనుక్కుని, డబ్బున్న అమ్మాయిని చేసుకుని సుఖంగా వుంటాను అంటాడు.. 

అంతట రాముడు ఓ వందరూపాయులు అతని చేతిలో పెడతాడు.. ఇదేమిటి రామా అని అడిగిన భక్తునితో ''ఈ వందా తీసుకో, నీ లేటెస్ట్ టెక్నాలజీని వుపయోగించి కోటి చేసుకో'' అని అంతర్ధానమవుతాడు..