Wednesday, August 8, 2012

నాకు దేముడు ప్రత్యక్షం అవ్వాలి... నాకోసం కాదు.. మీ అందరి కోసం..

ఇవాళ చాల ఘోరమైన ఏక్సిడెంట్ చూసాను..సమయం సుమారు సాయంత్రం ఐదున్నర...  
సెవెన్ హిల్స్ ఆసుపత్రి జంక్షన్ దగ్గర నుండి రాం నగర్ రూట్ వైపు వచ్చే రోడ్డు మొదట్లో ఓ కాలేజ్ బస్సు కింద ఓ మోపెడ్ లాంటి బండి దూరిపోయింది..
(ఫొటో  అసలు సంఘటనది కాదు )
 శాల్తీ ఏమయ్యిందో అని భయపడుతూనే అడిగా ఇద్దరిలో ఒకతను అక్కడిక్కడే మరణించాడని మరొకతనికి తీవ్ర గాయాలయ్యాని చెప్పారు..నాకు భయమేసి ఆ జాగా నుండి వెళ్ళిపోయాను..చాలా బాధ అనిపించి చాలా సేపు మనసు బరువయిపోయింది..

అసలు విశాఖపట్నం అన్న మాటేవిటి.. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై ఎక్కడ చూసినా విపరీతమైన ట్రాఫిక్.. స్కూటర్లు,   కార్లు, ఆటోలు, బస్సులు పెరిగాయి కాని అందుకు అనుగుణంగా రోడ్లు విశాలం అవవు, అవలేవు.. ఎవరి ఇల్లు పడగొడితే ఎవరు వూరుకుంటారు? పబ్లిక్ పార్కులు, దేవాలయాలు, విగ్రహాల చుట్టూ వున్న సర్కిల్..ఇవి ట్రాఫిక్ కి ఎంత అడ్డు వచ్చినా  వాటిని పడగొట్ట కూడదు.. ఖబడ్దార్.. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఫర్వాలేదు... 

మా చిన్నప్పుడు మా స్కూల్ కి 3 కి.మీ దూరం నడిచే వెళ్ళేవాళ్ళం.. "అది మీ ఖర్మ ఆ రోజుల్లో మీకు ఆటోలు, స్కూల్ బస్సులు లేవు.. వున్నా వాటి ఫీజులు వేలల్లో కట్టే స్థితిలో మీ తల్లి తండ్రులు లేరు. 
మాకేం ఖర్మ.. మా పేరెంట్స్ డబ్బున్న వాళ్ళు..స్కూల్ ఫీజు కాక బస్సు ఫీజుకి కొన్ని వేలు నెలకి ఇస్తారు" అన్నది నేటి తరం వారి ప్రశ్న..  ఎంచక్కా షేర్ ఆటోల్లో పాతిక మంది కూరేసినా, ఆడవాళ్ళ మీద మగాళ్ళు కుమ్మేసినా 5 రూపాయలతో మన గమ్యం చేరామా లేదా..
అసలు వీటన్నిటికీ పరిష్కారం ఏమిటంటే... నాకు రాత్రికి  రాత్రి దేముడు పవర్స్ ఇస్తే..తెల్లారేసరికల్లా...  పెద్ద పెద్ద  ఫ్లై ఓవర్లు నగరం ఈ చివరి నుండి ఆ చివర వరకూ వుంటాయి. దాని మీద స్కూటర్లు, ఆటోలు మాత్రమే  వెళ్తాయి.. బస్సులు, కార్లు  కింద రోడ్లపై  వెళ్తాయి..  మనుషులకు భూమి కింద  నుండి నడిచే మార్గం (దగ్గరి దారి) వుంటుంది.. 


స్కూటర్లకి, ఆటోలకి పార్కింగ్   పైన వుండే మార్గం లోనే ఓ పక్క గా వుంటుంది.. ఓ ప్రత్యేక లిఫ్ట్ ద్వారా వాళ్ళు కావలసిన స్థలం నుంచి కిందకి దిగి మార్కెట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయి స్కూటర్ మీద ఇంటికి వెళ్తారు.. ఎలక్ట్రికల్ వైర్లు, కేబుల్ వైర్లు డక్టల్లో వుంటాయి.. అప్పుడు పెద్ద లారీలు వచ్చి వాటిని తెంపేసి రోడ్డున పడవెయ్యవు.. మా వీధిలో వారానికొకసారి కరెంటు వైరో, టెలిఫోన్ వైరో, కేబుల్ వైరో తెగిపోతుంది,, వాళ్ళకి ఫోన్ చెయ్యడం, వాళ్ళు వచ్చె లోగా ఎవరూ ఆ వైరుని ముట్టు కోకుండా చెయ్యడం.. అబ్బో  చాలా ప్రహసనం.. 

పిల్లలకి ఎస్కిలేటర్లు వుంటాయి.. నేరుగా వాళ్ళ స్కూల్ కి ఇంటి నుంచే వాళ్ళ అమ్మ మీట నొక్కితే స్కూల్లోకెళ్ళి పడతాడు.. పుస్తకాల బరువు, కారేజీ మోత వుండదు..ప్రతీ పది కిలో మీటర్లకి ఒక మైదానం వుండి, రిపైర్ వచ్చిన లారీలు అక్కడే రోడ్డు మీద కాక ఆ మైదానంలోకి పంపబడతాయి..  

అసలు ఆల్కహాల్ తాగితే కారు గాని, లారి గాని, బస్సు గాని స్టార్ట్ అవ్వదు.. అటోమేటిక్ గా  లాక్ అయిపోతుంది.. సరే మీకు కాస్త కామెడీ గా వున్నట్టుంది.. కాని ఈ అసహజ మరణాలు ఆపాలంటే ఇంతకంటే మార్గాలు నాకు కనిపించటం లేదు..
నాకు దేముడు ప్రత్యక్షం అవ్వాలని మీరు కోరుకోండి.. నా కోసం కాదు.. మీ అందరి కోసం...