Thursday, February 28, 2013

ఛ .. ఇదే ఫారిన్ కంట్రీ లో అయితేనా1. "స్టాప్ " .. స్టాప్" అరిచాడో కానిస్టేబుల్ స్పీడ్ గా పోతున్న బండిని చూసి ... "హె.. ఫె.. " అంతకన్న దురుసుగా అరిచి మరింత స్పీడ్ గా పోనిచ్చాడు.. నిర్ఘాంత పోయి చూస్తున్న కానిస్టేబుల్ ని చూసి సీనియర్ అయిన హెడ్ కా. నవ్వి ఆ కుర్రోడు ఎవరనుకుంటున్నావు .. ఎమ్. ఎల్ ఏ గారి ఏకైక కుమార రత్నం .. కాస్త ఎవరో ఏమిటో చూసుకుని ఆపు ఈసారైనా.. 

2. మరో వ్యక్తి రాంగ్ రూట్లో ఎంటర్ అయ్యాడు .. కానిస్టేబుల్  ఆపాడు.. "ఏయ్ .. నన్నెవరనుకుంటున్నావ్ .. ఫలానా కాస్ట్ కి యూనియన్ లీడర్ ని .. ఎక్కువ చేసావంటే బుక్ అయిపోతావ్ జాగ్రత్త"... "మీ రెళ్ళండి సార్... మా వోడు కొత్త" అని సర్ది చెప్పి పంపించేసాడు హెడ్ "ఒరే ఆళ్ళతో పెట్టుకోమాక .. ప్రమోషన్ అదీ లేకుండా జీవితాంతం ఇలాగే వుండిపోగలవ్" .. 

3. ఒక అందమైన లేడీ .. నడి రోడ్డుపై అడ్డంగా కారు పార్కింగ్ చేస్తోంది.. "మేడమ్ కాస్త పక్కకి పార్క్ చెయ్యండి మేడమ్.. " ముందో మేడమ్ వెనకో మేడం అయినా ఆవిడ శాంతించ లేదు.. "ఏయ్.. ఎవరయ్యా నువ్వు.. నా కారునే ఆపుతావా" అంటూ గద్దించింది.. వెనక నుంచి హెడ్ వచ్చి "మేడమ్  మీరెళ్ళండి మేడమ్ మీ కారుని మేం చూసుకుంటాంగా.. మీరెళ్ళండి" అని పంపించేసాడు.. "ఒరే..  పోయి పోయి మన కమీషనర్ గారి మూడో పెళ్ళాం తోనే పెట్టుకున్నావ్ తొక్కేగలరు జాగ్రత్త.. 
 
4. "ఒరే పొద్దున్నుంచి టీ చుక్క పడలేదు.. ఒక్క బేరము లేక గుండె గుబ గుబ లాడుతోంది...  అటుచూడు సిగ్నల్  పడినా ఆపకుండా పోతున్నాడు ..  ఈడెవడో అర్భక ప్రాణిలా వున్నాడు ఆపరా" .. 
ఓ అయుదు నిముషాలు అన్ని చెకింగులు అయిపోయాక .. 
"సార్ .. అన్ని కరెక్ట్ గా వున్నాయి.. పైగా ఆరెంజ్  కలర్ సిగ్నల్ వుండగా దాటేసానని చెప్తున్నాడు వదిలేద్దాం సార్".. 
హెడ్ లైట్ కి సగం బ్లాక్ కలర్ స్టిక్కర్ వుండాలి .. వుందా".. "లేదు సార్".. 
"రోడ్డుకి బాగా కుడి పక్కకి వచ్చీసాడు.. అవునా" "అవును సార్"..
మరింకేం కేస్ బుక్ చెయ్.. లేదా ఓ 200 ఫైన్ కట్టమను లేదూ చలానా అక్కర్లేదు.. ఓ వంద ఇచ్చి పొమ్మను.. ఎప్పుడు పైకొస్తావురా"..  
5. "బావా.. ఈడెవడో ఫోర్త్ టౌను ఎస్సై అంట.. మన లోడుని ఆపేసాడు.. ఇగో ఫోను ఆడికిస్తున్నాను మాట్లాడు"
"ఏమయ్యా.. లారి నంబరు చూసే ఆపేవా... పోనీ లారీ మీద మా కంపెనీ లేబుల్ తాటికాయంత అక్షరాలతో రాయించాను... కనబడలేదా.. అవునయ్యా..  రోజూ పది ట్రిప్పులు అక్రమంగా సరుకు రవాణా చేస్తున్నాం.. ఇది ఏమైనా కొత్తా... మీ మామూళ్ళు చాలక పోతే అడగండయ్యా .. మరో సారి ఆపేవో ఖర్సు అయిపోగలవ్ జాగ్రత్త.. "

పై సంఘటలన్నీ రోజూ చూస్తున్నవే కదా.. సినిమాల్లో కూడా ఎన్నోసార్లు చూసాం కదా.. నీకేమన్నా పిచ్చా ఇలా బ్లాగ్లో రాసి మా టైం వేస్ట్ చేస్తావ్.. 

మరి.. ఎందుకు ఎక్కడైనా ఏ సంఘటన జరిగినా తప్పు పోలీసు వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు మీరు .. అర్ధరాత్రి ఆడపిల్ల మీద అత్యాచారం జరగకుండా పోలీసు కాపలా కాయాలి.. 
మొగుడు పెళ్ళాన్ని వదిలేస్తే పోలీసు వాడు కలపాలి.. 
తాగొచ్చి బండిని స్పీడ్ గా పోనిచ్చి మందిని చంపేస్తే పోలీసు వాడు కాపాడాలి.. తక్షణం వాలిపోయి ప్రాణాలు కాపాడాలి.. 
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి..జనాన్ని ఉసిగొల్పి రోడ్డు మీద అడ్డం వచ్చిన వాహనాలని ధ్వంసం చేస్తు పోతూ వుంటే పోలీసు అదుపు చేయాలి.. 

  

కోట్ల రూపాయలు దండుకున్ని ఆఖర్న బోర్డు తిప్పేసిన బోగస్ సంస్థల వారి మీద కేసులు పెట్టాలి.. 
ఇలా చేయక పోతే "పోలీసులు డౌన్ .. డౌన్ .. పోలిస్ జులుం నశించాలి" అంటూ నరాలు తెగే దాకా అరుస్తాం.. టి.వీ ల్లో గోల చేస్తాం.. 
అసలు రిపోర్ట్ చెయ్యగానే సరి అయిన ఏక్షన్ తీసుకుని వుంటే. ఈ మర్డర్ జరిగేది కాదండి.. 
ఆ పిల్ల వారం రోజుల కితమే రిపోర్టు ఇచ్చిందట .. వాడు నన్ను ఏడిపిస్తున్నాడు అని .. అసలు వీళ్ళు పట్టించుకుంటేగా... 
పోలీసులే సమర్ధ వంతంగా  ఉంటే ఈ పేలుళ్లు జరిగేవా.. వాళ్ళు  తలచు కుంటే ఉగ్రవాదుల్ని ఏరిపారెయ్య గలరు.. వాళ్ళకి బాధ్యతన్నది లేదండి.. మామూళ్ళు మీద వున్న  శ్రద్ధ జనం రక్షణ మీద చూపించినా ఇన్ని విధ్వంసాలు జరగవు.. 


అదే ఫారిన్ కంట్రీ  లో అయితేనా.. ఆన్ ది స్పాట్ కాల్చి పారెస్తారు.. మనము...  మన చట్టాలు..న్యాయ స్థానాలు ... అబ్బే ఇండియా మరి బాగు పడదండి.. 
 ఇలా ఇద్దరు స్నేహితులు చర్చించుకుంటూ వుండగా ఫోన్ వచ్చింది.. 
"ఒరే ఎక్కడున్నావు రా?".. 
"బార్ లో రా.."
"ఇంత అర్ధరాత్రి వరకూ ఏంచేస్తున్నావురా.. త్వరగా వచ్చేయ్.. అసలే లైసెన్స్ లేకుండా తిరుగున్నావ్.."
"పోరా పిచ్చి సన్యాసి.. నేను  విలేఖర్ని రా .. మా ఫ్రెండ్ లాయర్ గోపాల్ తో కలిసే వున్నాను.. మనల్నెవుర్రా పీకేది.."   . 
Tuesday, February 26, 2013

సామాన్యుడి డైరీ... బాగా బలిసిన వారు చదవకండి


అయిపోయింది .... ముప్పావు వంతు జీవితం  అయిపోయింది.. ఈ ముప్పావు జీవితం లోను సాధించినది ఏమిటి.... మనకి జనాలు ఇచ్చిన బిరుదులేమిటి... మనం మిగుల్చుకున్నది ఏమిటి... 

ఈ వుద్యోగం లో వున్నంత కాలం పర్వాలేదు అని అనుకున్నా రిటైర్ అయ్యాక వచ్చే ముప్పావు వంతు పెన్షన్ తో బతుకు బండి ఈడ్చ గలమా...
పెట్రోల్, నిత్యావసర వస్తువులు, కాయగూరలు, పండ్లు వీటి ధరలు అలా అలా పైకి ఎగబాకి.. మనల్ని చూసి నవ్వుతున్నాయి..
ఇప్పుడే ఇలా వుంటె, పది, పన్నెండేళ్ళ తర్వాత.. జాగాలు, ఇళ్ళు కొనగలమా.  మనం మిగిల్చి వెళ్ళిన డబ్బులతో మన వెనక వాళ్ళు సంతృప్తి గా బతగ్గలరా ? సరిగ్గా సేవ్ చేసేము కామని మనల్ని తిట్టు కుంటారా.. .... 
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెరుగుతున్న షుగర్ లెవెల్.. వెనక నేనూ వున్నాను అంటూ దాని చెల్లి బి.పీ ... గట్టిగా నడిచినా, పనిచేసినా వచ్చే కండరాల నొప్పులు.. అప్పుడప్పుడు వచ్చే పోయే చుట్టాలయిన కళ్ళ జబ్బులు, చెవి దిబ్బట, రొంప,  గొంతు నొప్పి ... 
ఇప్పుడే ఇలా వుంటే వ్యార్ధకం లో తీరని రోగాలొస్తే.. ఈ బిజీ జీవితాల్లో మనలని మంచం మీద పడుక్కోపెట్టి సపర్యలు చేసే వారు ఎవరైనా ఉంటారా.. ఈ ముసిలాడు ఎప్పుడు చస్తాడురా అని ఎదురు చూస్తారేమో .. 
ఈ మాత్రం దానికి మాట పట్టింపులు... ఎడ ముఖాలు, పెడ ముఖాలు, ఇగో ప్రాబ్లమ్స్ ...
ఎన్నో ఏళ్ళబట్టి మాట్లాడటం మానేసిన వాళ్ళ లిస్ట్ ఎంత వుంటుంది... 
మన కన్నా డబ్బున్న వాళ్ళు, హెచ్చు హోదాలో వున్న వాళ్లు  మనతో మాట్లాడరు..మన కంటే తక్కువ వాళ్ళతో మనం మాట్లాడము..... 
ప్రపంచ, దేశ రాజకీయాలన్ని మనకి కావాలి..నిరంతర వార్తా చానళ్ళలో ..  
వాళ్ళేదో విశ్లేషణ పేరిట ఉత్తుత్తినే దెబ్బలాడు కుంటూంటే ... ఒకళ్ళనొకలు తిట్టేసుకుంటూటే మనం ఇక్కడ ఉగ్గ పెట్టి వింటూ టెన్షన్ పడిపోతాం .. ఒక పాయింట్ పట్టుకుని రోజల్లా స్క్రోలింగ్ వేస్తూ, చూపించీదే పది సార్లు చూపిస్తున్నా అస్సలు తిట్టు కోము.. గుడ్లప్పగించి మరీ చూస్తాము.... 
"ఏ" అనే రాజకీయ నాయకుణ్ణి "బి" అనే నాయకుడు తిడతాడు.. "ఏ" ఎదురుదాడి చేస్తాడు.. "ఏ" ని, "బి" ని కలిపి "సి" అనేవాడు తిడతాడు.. "సి" ని మళ్లి "ఏ , బీ " లు కలిపి తిడతారు.. 
ఎవడు ఎప్పుడు ఎవర్ని తిడతాడు ఎవడు ఏ పార్టీ తో ఎప్పుడు పొత్తులు పెట్టుకుంటాడో , ఎప్పుడు విడిపోతాడొ .. వున్నపార్టి ని ఎప్పుడు వదిలేసాడో తెలీని స్థితి  ... వెనక తిట్టుకున్న వాళ్ళే ఇప్పుడు భాయి భాయి అయిపోతారు (వైస్ వెర్సా ) .. 
మనమేమో మాట పట్టింపు వస్తే జీవితాంతం  వాడితో మాట్లాడము, వాడి  ముఖం చూడము అన్నదమ్ముడైనా సరే. ... 
వాళ్ళ బంధం అన్న దమ్ముల కంటే ఎక్కువ.  మనమే అనవసరంగా వాళ్ళని అనుమానిస్తున్నాం... అందుకే మనకి జబ్బులు ... 
దేవుని హుండీలో మనం సాధారణంగా మనకున్న స్థోమతని, అవకాశాన్ని బట్టి డబ్బులు వేస్తాం.
మరి లక్షలు,  కోట్లు  హుండీలో వేసే వాడు, బంగారు ఆభరణాలు చేయించే వాడు ఆ డబ్బు న్యాయ సమ్మతంగా సంపాదించిన దేనా అని ఎవరూ అడగరు.. 

అన్నమో రామచంద్రా అని గోల పెట్టె పేద వారికి ఆ డబ్బు వినియోగిస్తే దేముడు వరాలు ఇవ్వడా..
ఎవరి ఇష్టం వాళ్ళది.. నీకెందుకు ఈ గోల అని మనస్సు హెచ్చరిస్తున్నా ప్రాంణం  చివుక్కు మంటుంది...
తిండికి, గుడ్డకు నోచుకోని జనాలు, విలాస వంతమైన జీవితానికి తరాలు సరిపడినంతా అడ్డగోలున సంపాదించిన వారు ఇద్దరూ  ఒక దగ్గరే.. ఇటు ఎడారి, అటు గోదారి, పచ్చని పసిడి నేల, బీడు వారిన ఎండు నేల పక్కపక్క నే .. దట్ ఈజ్ ఇండియా .... 
నడుస్తున్న వాడి గొలుసు లాక్కు పోతారు  .. తలుపులేసి వున్న  ఇళ్ళు   పట్ట పగలే దోచుకూంటారు.. ఒంటరి ఆడదాని శీలానికి...ఆడ శిశువుకు రక్షణ లేదు...రాజధాని నడిబొడ్డున జీవితాలకు గారెంటీ లేదు... 
అయినా సరే కులాల, మతాల, ప్రాంతీయ విభేదాలతో నిత్యం కొట్టుకూందాం .. వీరబ్రహ్మం గారి పుట్టక మీద, గాంధిజి శీలం మీద రోజుల తరబడి చర్చిద్దాం ... బుద్దుడు అసలు పుట్టలేదని, క్రీస్తు యవ్వన కాలం లో ఎక్కడ వున్నాడో తెలీదు అన్న మీద కొట్టుకుంటూ అసలు వాళ్ళు బోధించిన దాన్ని గాలికి వదిలేద్దాం ... 60% శాతమే వున్న  షుగర్ వ్యాధి గ్రస్తుల్ని 100% శాతం చేయడానికి అహర్నిశలు కృషి చేద్దాం.. 

Friday, February 22, 2013

మెదడు పొరల్లో.... జ్ఞాపకాల దొంతరలు..మర్చిపోలేని సంఘటనలు :
చిన్నప్పుడు... సమయం.. సుమారు రాత్రి 8 గంటలప్పుడు.. ఆ రోజుల్లో తినవలసినవి తినేసి ఇహ కాసేపట్లో నిద్రపోయే టైము.. ఇక ఆడవారు గిన్నెలు తోముకునే టైము.. కారు చీకటి.. అప్పుడు ఇంకా వీధి లైట్లు లేని కాలం.. ఇంటి ముందు.. దీనాతి దీనమైన గొంతుకతో "అమ్మా.. ఇంత వన్నం వుంటే వెయ్యమ్మా" అని అరుపు... 


చుట్టు నిశబ్దం.. ఎక్కడొ కుక్కల అరుపులు...పేరుకి పట్టణమే అయినా ఇక్కడొ ఇల్లు, అక్కడొ ఇల్లు అన్నట్టుగా వుండేవి.. 


కారు చీకటి.. పిలిచిన వ్యక్తి ఎవరో తెలీదు.. ఇంటికి కాస్త దూరంగానే నిలబడి.. ఆకలి, నీరసం మిళితమైన గొంతు.. 
ఆ కేక విన్న వెంటనే జాలితో గుండె చెరువైపోయేది.. తినగా ఏమినా మిగిల్తే వేసేవాళ్ళం.. 
లేకపోతే మౌనంగా వూరుకునే వాళ్ళం.. 
అంతే గాని పగటి వేళ రోజూ క్రమం తప్పకుండా వచ్చి విసిగించే ముష్టి వాళ్ళను కసురుకునేటట్టుగా పొమ్మని చెప్పలేము.. ఆ పిలుపు.. దీనాతి దీనమైన పిలుపు ఎన్నటికీ మర్చిపోలేను...

2) పదవతరగతి పరీక్షలప్పుడు మా స్నేహితుడు ఒహడు లెక్కల్లో వీకు.. అందుకని వాళ్ళింలో కంబైడ్ స్టుడీస్ కి రాత్రి వేళ రమ్మనేవాడు.. నేను కూడా ఇంట్లో కన్న అక్కడే చదుకోవడానికి వీలు వుండడం తో వెళ్ళే వాణ్ణి.. 

వాళ్ళ అమ్మగారు భోజనం కూడా పెట్టే వారు.. నాకు కొత్త మరి ఒకరి ఇంట్లో తినడం... కాని వారి ఇంట్లో నాకు దొరికిన ప్రేమ, దయ, అప్యాయత కట్టి పడేసేవి.. మా ఫాథర్ ఎప్పుడూ సీరియస్ గా వుంటే అందరు నాన్నలు ఇలాగే వుంటారు అనుకునే వాణ్ణీ..కాని వాళ్ళ నాన్నగారు మాతో జోకులు అవీ వేస్తూ, ఆయన ఆర్.ఎస్.ఎస్ అనుభవాలు, ఎమర్జెన్సీ కాలంలో పోలీసులను ఎలా ముప్ప తిప్పలు పెట్టిందీ, ఎక్కడెక్కడ దాక్కుందీ అవన్ని చెప్పే వారు...
ఇంతకీ విషయం ఏమిటంటే రాత్రి  సుమారు నాలుగు గంటలు దాకా ఏక ధాటిగా చదువుకుంటూనే వుండేవాణ్ణీ.. మా ఫ్రెండు, వాళ్ళ ఇంట్లో వాళ్ళూ అంతా నిద్ర పోయేవారు.. నేను రాత్రి ఎంతసేపైనా మేలుకుని వుండి పోయి చదువుకోవడం అలవాటు.. కొంతమంది. రాత్రి తొందరగా అంటే 8 గం.లకే నిద్రపోయి తెల్లవార్ఝామున 4.00 గం.లకి లేచి చదువుతారు...అలాగైతేనే చదివింది బుర్రకెక్కుతుంది అంటారు.. కాని నాకెప్పుడైనా ఎంత మంది లో వున్నా చదువుమీదే దృష్టి సారించి చదివితే పరిసరాలు, టైము కూడా మర్చిపోతాను...
సరే విషయానికొస్తే... ఆ నాల్గు గంటల వేళ ఇహ ఇంటికి వెళ్లి పోదాం అనిపించి లేచి బయలు దేరే వాణ్ని  ఇక్కడ పడుక్కుంటే మళ్ళి లేవలేను.. అదే మన ఇంట్లో అయితే ఎంత సేపయినా పడుక్కోవచ్చు.. 


అలా బయలుదేరిన నేను ఓ గడ్డ దాటుకుని రావలసి వచ్చేది.. ఆ గెడ్డ పక్కన ఓ పెద్ద మర్రిచెట్టు.. దానికింద.. ఓ ముస్లిముల గోరీ అంటే పది అడుగుల ఎత్తున్న తెల్లని గోడ.. దాని మీద బురుజులు.. దాని మీద జెండాలు.. అలా ఎందుకు కట్టారో ఇప్పటికీ  నాకు తెలీదు.. అవి సమాధులని ఎవరో చెప్పగా విన్నాను.. కాదు అది ప్రార్ధనా గోడ అనేవారు.. ఏది కరెక్టో తెలీదు గాని.. ఆ నిశిరాత్రి వేళ, కారు చీకట్లో 
ఆ గోడకి కాస్త దూరంగా నడుస్తూ.. గడ్డ దాటడానికి భయపడుతూ... గుండే వేగంగా కొట్టుకుంటూ వుంటే వెనక్కి వెనక్కి చూసుకుంటూ ఏదైనా దెయ్యం వుందేమో అని భయం భయంగా వెళ్ళేవాణ్ణి..  
పరుగులాంటి నడక.. 
ఈ సీన్ ఎప్పటికీ మర్చిపోలేను.. మళ్ళి ఇంకోసారి వెళ్ళినప్పుడు అయినా రాత్రి వాళ్ళింట్లో పడుక్కునే వాణ్ణా .. కాదు.. మొన్న ఏమీ జరగలేదు కదా.. దెయ్యాలకి మనమంటే భయం.. మనల్ని ఏమీ చెయ్యవు అనుకుని వెళ్ళేవాణ్ణి..సరే ఈ రోజు దెయ్యం అంటే ఎలాగ వుంటుందో చూద్దామనుకునే వాణ్ణి.. ఒకవేళ దెయ్యం ఎదురొస్తే ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకునే వాణ్ణి..
ఇంతకీ ఆడ దెయ్యమా, మగ దెయ్యమా.. సరే చూద్దాం అనుకుంటూ వెళ్ళేవాణ్ణి ...   
కాని తీరా గడ్డ దగ్గరకి వచ్చేసరికి గుండె దడ మామూలే... ఇప్పటికీ బండి మీద ఆ మార్గం గుండా వెళ్తూ, (ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది.  గోడ చుట్టూ బోల్డన్ని నిజం దెయ్యాల ఆక్రమణలు వచ్చేసాయి) చిన్నప్పుడు ఈ గోడని చూసే కదా భయపడేవాణ్ణి అని నవ్వు కుంటూ వుంటాను.....  దెయ్యాన్ని చూడాలనే కోరిక ఇప్పటికీ తీరలేదు .
మిగిలినవి మరో మారు.....      

Thursday, February 21, 2013

ఘాటు లేని మిర్చి.. అనేక సినిమాల మిక్సీ


 నేను మొన్ననే చూసాను కాబట్టి.. కాస్త ఆలస్యం గానైనా ఈ సినిమా మీద రివ్యూ రాయొచ్చు అనుకుని రాస్తున్నా... అదే... మిర్చి...
"మిర్చి.. మిర్చి, మిర్చి లాంటి కుర్రోడోయ్.."  సాంగ్ బావుంది.. భాష అర్ధం కాలేక పోయినా (అన్ని పాటలకి కూడా ).. అసలు తెలుగు పాటలేనా ? 
ప్రభాస్ యాక్షన్ బావుంది..కొంచెం మహేష్ లాగ, అక్కడక్కడ పవన్ లాగ యాక్ట్ చేశాడు అనుకుంటాను.. ఎనీవే అతని ముందు సినిమాలకన్నా బాగానే చేశాడు.. సన్న పడ్డాడు.. డాన్సులు బావున్నాయి..

ఇక కధ కి వస్తే..  ఇంద్ర. అంత:పురం, యజ్ఞం, ఢీ.. ఇలాంటి సినిమాలన్ని మిక్సి లో వేసి రుబ్బి తీసినట్టుగా వుంది...చాలా జాగ్రత్తగా ఒక్కో  సినిమాలోంచి ఒక్కో పార్టు తీసుకున్నాడు.. వయస్సుకి తగ్గట్టు ఫాక్షనిస్ట్ కుటుంబాల్ని భలేగా చూపెట్టాడు.. 

తండ్రి పాత్రధారి - సత్యరాజ్ బహుశా కన్నడ నటుడేమో.. అతను తప్ప మిగిలిన అందరూ బాగా చేసారు.. బ్రహ్మి కి తక్కువ కామెడీ పెట్టి మనల్ని రక్షించారు.. వీడి ఓవర్ ఏక్షన్, కామన్ గా వుండే చెంప దెబ్బలు చూడ లేక చస్తున్నాం..ఇక సుబ్బరాజు అయితే చాలా బాగా చేశాడు.. కొన్ని ఏంగిల్స్ లో ప్రభాస్ ని మించి పోయాడు..
ప్రభాస్ ఇంటిలో గోడ మీద స్వామి వివేకానందుని ఫొటో చూపించి తద్వారా సత్యరాజ్ పాత్రని ఎలివేట్ చేద్దామని పెట్టి వుంటాడు.. అయితే అదే గదిలో అతను మందు కొట్టే సీను చూపించడం ఎంతవరకు కరెక్టో అర్ధం కాలేదు.. 

భార్యకి దూరంగా వున్న వాడు, భార్య చనిపోయిన వాడు తప్పని సరిగా ఓ పెగ్గు మందు రోజూ రాత్రి కొట్టేసి బాధని మర్చిపోవాలన్న మాట..
తన ఫామీలో మనుష్యుల్ని నరికేసినా, పాపం రిచా ఫామిలీ వాళ్ళకి ప్రభాస్ ఎలా వుంటాడో తెలీదు..
రిచా తో పరిచయం కోసం ఫారిన్ వెళ్ళిపోయి..ఏదో కాలేజీలోనో, మూజిక్ క్లాసు లోనో (మనకి తెలీదు) జాయిన్ అయిపోయి.. సడెన్ గా ఇండియా వచ్చేసి సుబ్బరాజు వున్న కాలేజీకి వెళ్ళీపోయి జాయిన్ అయిపోడం.. అతనితో పరిచయం వల్ల వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోడం చకచకా జరిగిపోతాయి.. 


మనం నోరు తెరిచి వెర్రి  వాళ్ళ లాగ చూడ్డమే తప్ప ప్రశ్నించుకో కూడదు.. ఇక ఎప్పుడూ శత్రువులకి భయపడుతూ అప్రమత్తంగా వుండవలసిన వాళ్ళూ హీరో అనాధ అని చెప్తే నమ్మేయడమే కాక, పిల్లని ఇవ్వడానికి కూడా సిధ్ధ పడిపోతారు.. 
తెనాలి, రేపల్లె లో వుండే వాళ్ళూ ఇంత తెలివి తక్కువ వారన్న మాట.. (దర్శకుని దృష్టిలో).. 
ఇంద్రా లో లాగ హీరో బోల్డు మందిని కత్తితో పొడిచేసి...ఆఖర్న ఇక చాలు... రక్త పాతం వద్దు.. ఇకనైనా మారండిరా అని మొత్తుకుంటాడు.. బోల్డు వుపన్యాసం ఇస్తాడు... ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాల వల్ల ఏమి నీతి నేర్చుకున్నామో తెలీని అయోమయ స్థితిలో జారుకుంటారు... 
అఫ్టర్ ఆల్ ఏభై, అరవై రుపా యలతో ఒకింత కాలక్షేపం, టైం పాస్...దీనికింత సింగినాధం ఎందుకూ.. అని కొట్టి పారెయ్యొచ్చు.. 
ఇక తెలుగు సినిమా ఎన్నాళ్ళకి బాగుపడుతుందో కదా.. ఎందు కంటే నా చిన్నప్పణ్ణించి చూస్తున్నా .. 
ఓ నలుగురు రౌడీలు  హిరోయిన్ వెంట పడ్డం , హీరోయిన్ .. హీరో వెనకాల నించోడమ్ .. హీరో విలన్లతో ఫైట్ చేసి , హీరోయిన్ని పడగొట్టడమ్.. వెంటనే హీరోయిన్ హీరో ప్రేమ లో నిండా మునిగిపోవడమ్. ఆహా ఈ తెలుగు దేశం లో అమ్మాయలను ప్రేమలో పడేసు కోవడం ఎంత వీజీ.. ఓపెనింగ్ సీనే ఇంత దరిద్రంగా  దర్శకుడు ఇతనే అయ్యుండచ్చు.. వింతా చేస్తే ఆ అమ్మడు ఆఖర్న ఓ వెర్రి బాగుల దాన్లా అలా వుండి పోయి , తన ప్రేమను త్యాగం   చేస్తుంది.. త్యాగశీలి వమ్మా మహిళ.....  అనురాగశీలివమ్మా.....  

Wednesday, February 20, 2013

అత్యాచారాలు.. స్త్రీల పాత్ర

 ఇది ఎవరినీ నొప్పించ డానికి గాని, మనోభావాలు మీద దెబ్బ కొట్టడానికి గాని కాదు.. జస్ట్ నేటి సమాజం పై నా పరిశీలన మాత్రమే .. తప్పులుంటే క్షమించండి . 
 

ఓ ఇరవై ఏళ్ళు  వెనక్కి వెళితే.. (మనకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది కనుక).. ఆడవారు కొన్ని జాబ్ లే చేసేవారు.. వుపాధ్యాయినిలు, టైపిస్ట్లు, స్టెనోలు, స్టాఫ్ నర్సులు, ఐర్ హోస్టెస్సులు,, వగైరా.. బహుశా స్టార్ హోటళ్ళలో రిసెప్షనిష్టులు తక్కువ శాతం.. 

కాని ఇప్పుడు .. ఏదైనా సెల్ ఫోన్ కంపెనీకి వెళితే అందమైన ఐర్ హోస్టెస్సులాగ మేకప్ అయిన ఇరవై లోపు వయస్సులో వున్న ఆడపిల్ల చిరునవ్వుతో పలకరిస్తుంది.. ఏ పేకేజికి ఎంత జి.బి లు ఫ్రీ గా వస్తాయి.. ఏ పేకేజికి వెళితే ఎంత లాభం వివరిస్తారు.. సదరు మానవుడికి అర్ధం కాకపోయినా, అర్ధం అయినట్లు తలాడిస్తూ లిప్ స్టిక్ పెదవులే గాని, అందు లోంచి వచ్చె భాషని పట్ట లేక.. ఏదో పేకేజీని తీసుకుని వచ్చేస్తాడు... 
కారో, బండో కొనాలని వెల్తాడు.. మళ్ళి షో కేసు లో బొమ్మ లాగ వుండే అమ్మాయి తారస పడి.. వివరాలన్ని టక, టకా చెప్పేస్తుంటే మనవాడు గుడ్లు మిటకరించి బుక్ అయిపోవడం తప్ప (అదే ఏదో బండి బుక్ చెయ్యడం తప్ప) మరేమీ లేదు..  

రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోను, ఇన్సూరెన్స్ కంపెనీల్లోను.. అన్ని చోట్లా రంభా, ఊర్వశీ, మేనకలే,, ఇక బంగారం షాపులోకి వెళ్ళీనా, హోటల్ కెళ్ళి ఇన్ని మెతుకులు తిందామన్నా, చిరునవ్వు తో కూడిన అప్సరస గుమ్మంలోనే నవ్వుతూ నమస్కరిస్తూ ఎదురవుతూనే వుంటుంది.. 
 
డిపార్టు మెంట్ స్టొర్స్ ల్లో అయితే టాప్ లెస్ భామను చూసి ముసలి వాళ్ళు కూడా ఢమాల్ అయిపోయి, ఓ వెయ్యి రూపాయల సరుకైనా కొని పడేస్తాడు.. 
దీన్నే బిజినెస్ టెక్నిక్ అనో, జనాకర్షన్ అనో పేర్లు పెట్టే యొచ్చు.. 
ఈ మధ్యనే ఇంకో మార్పు ని చూసాను.. రోడ్డు పక్కన పకోడి బండి గాని, ఇడ్లీలు అమ్ముకుని బతికే వాళ్ళూ కూడా,, భార్య పొట్లాలు కడుతూ డబ్బులు అందుకంటూటే భర్త వాయలు దింపుతూ వుంటాడు.. బడ్డి చుట్టు ఓ పదిమంది ఎప్పుడూ ఈగల్లా ముసురుతూ ఓ పక్క ఆమె అందాల్ని చూస్తునే ..  సరుకు కొనుక్కుని పోతారు.. 

ఆమె కూడా ఇవన్ని మామూలే అన్న ధోరణిలో వుండి ఎందుకైనా మంచిదని డబ్బులు ఇస్తున్నపుడు అలా చేతి స్పర్స చేస్తుంది.. ఆ మాత్రం భాగ్యానికే రోజూ సరిగ్గ అదే టైంకి వచ్చి హీన పక్షం ఇరవై రూపాయాల పకోడీ అయినా కొనుక్కొనీ పోతాడు అర్భకుడు....
అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను అంటే స్త్రీ ఏ వృత్తి అయినా చేపట్టచ్చు... హద్దుల్లో వున్నంత వరకూ ఎవరూ ఏమీ అనరు...

కాని రేఖ దాటి ప్రవర్తించినా... సెల్ ఫోన్ లో గల, గలా మాట్లాడి ఆశలు రేకెత్తించినా, ఎద భాగం కవర్ చెయ్యకుండా గాలికి వదిలేసినా, శేఖర్ కమ్ముల హాపీ డేస్ సినిమాలో ఇంగ్లిష్ టీచర్ కమలిని లాగ నాభి కనిపిస్తూ  చీర కట్టి రెచ్చ గొట్టినా ... ఆ తప్పు ఎవరిది...  
(పాపం ఇప్పుడే శేఖర్ కమ్ములకి జ్ఞానోదయం అయింది గాబోలు టీవిలో బోలడు బిల్డప్ ఇస్తున్నాడు )
ఇవాళ సినిమాల్లో కురుచ బట్టలు ధరిస్తున్న వాళ్ళు ఆడవారే కదా..  వాళ్ళకి లేదా బాధ్యత.. పైగా రోజూ చూస్తున్న దినపత్రికల్లో వాళ్ళ ఫొటొలు దాదాపు నగ్నంగా ప్రచురిస్తారని ముందుగా తెలీదా...


ఇవాళ సమాజం లో స్త్రీ ప్రవర్తన బట్టే ఇన్ని ఘోరాలు (ఎక్కువ శాతం) జరిగే వాటిల్లో వున్నాయి... 
అయితే రెండేళ్ళ పసిపాప వస్త్ర ధారణ ఏ విధంగా సెక్స్  ని ప్రేరేరింపచేసింది అని అమాయకంగా అడిగే వారికి సమాధానం ఏమిటేంటే  పడచు వారి అందాన్ని, బహిరంగ అంగాంగ ప్రదర్శనలని చూసిన వాడు తనకి అందుబాటులో తన కోరికలను తీర్చు కోడానికి ఆడది అందుబాటులో లేక మృగమై పశువులా ప్రవర్తిస్తాడు.. 
వున్మాది లా మారిపోయి కామ వాంచని తీర్చు కోడానికి అత్యంత పాశవిక మైన పన్లు చేస్తాడు.. 
అది ముమ్మాటికి తప్పే.. 
కాని ముందు ఫ్రీగా, బహిరంగ ప్రదేశాల్లో, అంగాంగ ప్రదర్సనలు ఆపితే కొంతవరకైనా ఈ అత్యాచారాలను అరికట్ట వచ్చు... 
ఈ రోజున కొంతమంది  స్త్రీలు  తన అందాలను ప్రదర్సిస్తూనే.. ఎదుటి మగ వాళ్ళు తన అందాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడా లేదా అని చెక్ చేసుకుని, అయోమయంగా తన వైపు చూసిన మగాళ్ళని గమనిస్తూ మురిసిపోతున్నారు.. 
 మార్పు రావలసింది చట్టాల్లో, పోలీసుల ప్రవర్తనతో బాటు ఆడవారు స్నేహం చేసేటప్పుడే అన్ని విధాలా ఆలోచించి మగవారితో సంబంధాలు పెట్టుకోవాలి. 

మగ వారికి ఆ పనికి ఆస్కారం ఇవ్వకుండా.. తెలివిగా మాట్లాడుతూ కామాన్ని ప్రేరేపించకుండా ప్రవర్తించాలి.. వీలైనంత వరకు అక్రమ సంబంధాలకు దూరంగా వుండాలి... ఒక సారి పోనీలే అని వూరుకుంటే వాడికి అలుసై పోయి.. తన లాంటి మరో మగాన్ని మీ మీదకు వుసిగొలుపుతాడు.. సంతలోని వస్తువు లాగ వాడుకుంటారు దుర్మార్గులు.. 
మన దురదృష్టం ఏమిటేంటే డబ్బు లేక పొట్ట కూటి కోసం ఈ వృత్తిని ఎంచుకున్న వారి శాతం ఎక్కువ..            

చస్తే చావు .. కాని ... (మిమ్మల్ని కాదులెండి)

 

 హలో మై డియర్ మిత్రులారా .... 
ఈ క్రింద లింక్ లో ఇవ్వబడిన యూ ట్యూబ్ లో పెట్టిన మా బుల్లి వీడియో సిన్మా(ఓ పది నిమిషాలు మాత్రమే ) "మార్పు" చూసి .. 
మా మిత్ర బృందాన్ని ఆశ్వీరదిస్తారని కోరుకుంటూ ... 
మీలో కూడా మార్పు రావాలని.... 
ఒకవేళ డ్రైవింగ్ లో  వున్నప్పుడు సురక్షిత పద్దతులను పాటించక ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మీలో మార్పు  రావాలని .. 
చాలా మంది కుర్రాళ్ళకు (స్పీడ్ గా డ్రైవ్ చేసే వాళ్ళతో) నేను చెపుతాను - నువ్వు చచ్చినా పర్వాలేదు .. చావడానికి రడి అయ్యావు కనుక కాని ఇతరులను చంపే అధికారం నీకు లేదు అని...
ఒకళ్ళొ ఇద్దరో నేను ఈ మాట అన్న తర్వాత స్లో గా నడిపే వారు .. కాని మెజార్టీ శాతం ఓ పిచ్చి చూపు చూసి రయ్యి మని దూసుకుని పోతారు.... పోతారు .. 
 షరా మామూలుగా ఈ టపా చదివి , వీడియో చూసి ... ఇవన్ని మాములే అని మామూలుగా X మార్క్ కొట్టేసి , టపా ని మూసీ కుండా కనీసం ఏక వాక్య కామెంటుతో మీ మద్దతు తెలుపుతారని ..దూకుడు లో బ్రహ్మి లాగ ఆడియన్స్ పోల్ అడుగుతున్నాను 

 లింక్: https://www.youtube.com/watch?v=86KPv55FDEQ


__________________________________________________________________________________

 పోలీసు వాళ్ళు కనిపిస్తేనే హెల్మెట్ ... లేక పోతే ఫైన్ వేస్తారు కదా ....

Sunday, February 17, 2013

మంచి చూడండి, మంచి వినండి..


ఒక మంచి కీర్తన ..ఒక పెద్ద ఆవిడ పాడగా వినండి.. నేను తరచుగా నా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా తయారు అవడానికి, సేద తీరడానికి, నేరుగా దైవ భక్తి అంటే ఎలా వుంటుందో కన్నులారా చూడాలి అంటే మీరు కూడా చూడండి..


http://youtu.be/oSG781wrNH8