Sunday, March 31, 2013

తెలుగులో భక్తి గీతాల కరువు..

 
చక్కటి భజన (భక్తి) పాటలు వినాలంటే హిందీ లోనో పంజాబీ లోనో వినాలి .. ఒక అనురాధా పౌడ్వాల్, గుల్షన్ కుమార్ లేదా చక్కని పంజాబీ వాళ్ళ గీతాలు బావుంటాయి.. 
సంగీతం, సాహిత్యం విలువలు ఒక్కటే కాక గొంతులోని భక్తి భావం కట్టి పడేస్తుంది..
హై స్థాయిలో ఎక్కువ రాగాలాపన, గమకాలూ పలుకుతారు (నాకు పెద్దగా సంగీత పరిజ్ఞానం లేదు .. సరిగ్గానే రాసానని అనుకుంటున్నాను). 
 
మనసు హాయిగా అయిపోతుంది. ముఖ్యంగా రాముడు మీద మన తెలుగు లో కన్నా హిందీ వాళ్ళ పాటలు మనల్ని భక్తి భావం లోకి అలా అలా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి...
శంకర శాస్త్రి గారు చెప్పిన ఆద్రత కనిపిస్తుంది.... 
మన తెలుగు లో భక్తి పాటలు అంటే అయితే కీర్తనలు(సంగీతం) వుంటాయి.  
మహానుభావులైన వాగ్గేయ కారులను, పాత సినిమాల భక్తి పాటలను (ఘంటసాల గారి వరకు) పక్కన పెట్టెస్తే  .. 

నేడు తెలుగులోభక్తి పాటలు  వుంటే నేటి సినిమా పాటలు లేదా ప్రెయివేట్ గీతాలు (లలిత గీతాల మోడల్ లో) వుంటాయి... ఇంచుమించు ఒకటే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు శైలి.. పదాలను వీళ్ళ ఇష్టానుసారం ముక్కలు చెక్కలు చేస్తూ సంగీత దర్శకుని ప్రతిభను తప్ప భక్తి భావానికి పెద్ద పీట వెయ్యరు.. 

భజన గీతాలు విన సొంపుగా నేను చెప్పిన హిందీ వాళ్ళ స్థాయిలో మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి పోయే మధుర మైన గీతాలు తెలుగులో ఏమైనా ఉన్నాయేమో  మీకు తెలిస్తే చెప్పండి..... 

అన్నానని కాదు గాని ఆ రోజుల్లో పొద్దున్నే రేడియోలో శ్రీ మంగళం పల్లి వారి రామదాసు కీర్తనలు, శివ స్తుతులు (ఏమి సేతురా లింగా.., వస్తా వట్టిది.. పోతావట్టిది) వంటి పాటలు, శ్రీమతి శ్రీరంగం గోపాల రత్నం గారి భక్తి గీతాలు మళ్ళి మళ్ళి వస్తాయండి.. 


Friday, March 29, 2013

నాటకం ఒక యాగం, రంగస్థలం యజ్ఞ వాటిక, నటులు సమిధలు

 


మార్చి 27 వ తేది "ప్రపంచ రంగస్థల దినోత్సవం" సందర్భంగా  "స్వా గతం" అను సాంఘీక నాటకం కళాభారతి, విశాఖ లో వేశాం. 
రచన : శ్రీ భారతుల రామకృష్ణ , దర్శకత్వం : శ్రీ పి. శివప్రసాద్ , ప్రదర్శకులు - కె.వి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ , విశాఖపట్నం. )
నాటకం ఒక యాగముగా , రంగస్థలమే యజ్ఞ వాటికగా, నటులు సమిధిలుగా ఆ యాగ  హోమగుండం లో సమిధులుగా మారి  ప్రేక్షకుల అభిమానమనే యజ్ఞ ఫలాన్ని పొందడమే పరమావధిగా భావించే విశ్వనాధం అనే మహా నటుడు తన జీవితాన్ని నాటక రంగానికే అంకితం చేస్తాడు.. 
భార్య, పిల్లలు, వుద్యోగం కన్నా నాటకమే ప్రాణంగా బతుకుతాడు.. ఆఫీసర్ వచ్చి వారించినా ఆయనచేత కూడా నాటకం, కళలు గొప్పవని ఒప్పిస్తాడు.. భారత, రామాయణ ఇతిహాసాల్లోని ధర్మ నిరతిని కళల ద్వారా, తమ గళం , కలం ద్వారా  లోకానికి తెలియపరచి సంఘం, సమాజం, దేశం యొక్క అభ్యున్నతికి ఎంతో తోడ్పతున్నారని, అందుకే కళాకారులు చనిపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా సుస్థిర స్థానాన్ని  ఏర్పరుచుకుంటారని, కళాకారుల సంపాదన కరెన్సీ నోట్లు  కావని, ప్రేక్షకులు అభిమానంతో ఇచ్చే వెలకట్టలేని  పురస్కారాలు, జ్ఞాపికలు అని తెలియచేస్తాడు.. 
మీరంతా కళాకారులని చిన్న చూపు చూడకుండా అభిమానంతో ఆదరించండి, కళలను ప్రోత్సహించండి, నాటకాన్ని సజీవంగా నిలబెట్టండి .. అని ఆ మహానటుడు అభ్యర్ధనతో నాటకం ముగుస్తుంది. 

మధ్యలో ఈనాటి యువత నాటక రంగం వైపు కాక సినిమా రంగానికి ఎక్కువ ఆకర్షితులై కేవలం డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు తప్ప నైతిక విలువలు గురించి పట్టించుకోకుండా యువతని  చెడు మార్గం లో పయనింప చేసే సినిమాలు తీస్తున్నారని తెలియ చేయడం జరుగుతుంది... 

ఎంతో గొప్ప నాటకాల్ని రాసిన రచయుతలు నాటక రంగం నుండి సినిమా రంగానికి వెళ్ళిపోయినా నాటకరంగం పడిపోలేదని, నాటకం ఆగలేదని, ఏ ఒక్కరి వల్లో నాటకాలు, కళలు తమ ఉనికి ని కోల్పోవని నాటకమనే మణి దీపం ఆరిపోకుండా ఎన్నో వేల, లక్షల ప్రేక్షక దేవుళ్ళ చేతులు అడ్డుగా వుంటాయని ఎంతో ఉద్వేగ భరితంగా ఆ మహా నటుడు విశ్వనాధం పాత్ర ద్వారా చెప్పిస్తారు రచయితా శ్రీ.భారతుల రామకృష్ణ గారు, (CTO-తెనాలి). 
 


మా మితృడు శ్రీ శివప్రసాద్ విశ్వనాధం పాత్ర ని ఎంతో ఉన్నతంగా నటించారు.. సీనియర్ నటీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు విశ్వనాధం భార్య అయిన పావని పాత్రను వేసి, సహజ నటన ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసారు.. 
ఆఫీసర్ పాత్రలో నేను (ఓలేటి శంకర్), కొడుకుగా శ్రీ చందర్ రావు, పట్టాభి గా శ్రీ నాంచారయ్య, మరొక పాత్రలో శ్రీ అప్పలరాజు నటించి మెప్పించాం.. 

కేవలం వారం రోజుల్లో తయారయ్యి, కొత్త నాటకాన్ని ప్రదర్శించినా లైట్స్ ఆఫ్ మరియు లైట్స్ ఆన్ మధ్యలో ఆహార్యంలో మార్పు అనివార్యం కాబట్టి కొంచెం ఆలస్యం అయింది అనే లోటు తప్ప, నాటకం అద్యంతమూ చాలా ఉత్సాహభరితంగా, ప్రేక్షకుల హర్షధ్వానాల  మధ్య చాలా బాగా వచ్చింది మా ప్రదర్శన.. 
మా నటవర్గానికి.. మా సమాజంలో ప్రతీ ఒక్కరికీ మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ.. 
 
భవదీయ 
ఓలేటి.. (ఎడమ - జాగింగ్ డ్రస్)

Friday, March 15, 2013

ఐరావత గజారోహణమా ... అథ: పాతాళ పతనమా


ఎన్నోసార్లు మృత్యువు అంచుల దాకా వెళ్ళివచ్చిన  వాణ్ణి... 
మరి మన వలన ఏం ప్రయోజనం వుందనో లేదా మన వల్ల మాత్రమే అయ్యే రాచ కార్యాలు ఏవైనా ఉన్నాయనో ..   ఇంకా ఈ భూమ్మీద నూకలు ఇచ్చాడు ఆ దేవుడు.. 
బహుశా ఇలా బ్లాకిస్తూ మిమ్మల్ని హింసించడానికి అయ్యుండొచ్చు...

1. చిన్నపుడోసారి... పదవ పుట్టినరోజు సందర్భంగా మనం చాకిలేటులు ఇచ్చినప్పుడు ఒక ముసిలావిడ "నువ్వు డాక్టరు అంతటి వాడివి అవుతావు బాబూ! " అని దీవించేసరికి మన ఛాతీ అమాంతం 

ఓ పదో పాతికో ఇంచీలు పెరిగిపోయి ఇక పెరగలేక ఓ నెలరోజులు అలా ఉబ్బిపోయి  వుండిపోయింది.. 

 

 
భళ్ళున పాతికేళ్ళు  తిరిగేసరికి నిజంగానే డాక్టరు "అంతటి" వాడినే అయ్యాను కాని "డాక్టరు" ని కాలేక పోయాను..  

ఆ ముసలమ్మ డాక్టరు అంతటి వాడివి అనకుండా.. డాక్టరువి అవుతావు అని డైరెక్ట్ గా దీవించ నందుకు రోజులో పాతిక సార్లు అయినా తిట్టుకుంటున్నాను.. కాని ఆమె దీవన నిజమైనందుకు సంతోషపడాలా, డాక్టరు కానందుకు ఏడవాలా..   

2. బాల్యం లోనే మా తాతయ్య వరస అయ్యే ఒకాయనతో ఒకానొక పెద్దమనిషి  ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నా వైపు చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడుగగా ఈయనేమో మా చుట్టాలబ్బాయి అని ముక్త సరిగా జవాబు ఇయ్యగా,  అలాకాదు ఈ అబ్బాయి మీ మనవడా అని అడిగితే ఆ ఇంచుమించు ఆ వరసే.. అని చెప్పగా ఆ పెద్దాయన.. "ఈ అబ్బాయి మంచి ఉన్నత  స్థితికి వెళ్తాడు.. నాకు ఫేస్ రీడింగ్  తెలుసు ..  ఇతని ముఖంలో ....." (తర్వాత గుర్తు లెదు కాని ఎవేవో పొగిడాడు).. 

మళ్ళీ ఛాతీ  పొంగింది.. ఎన్ని ఇంచీలో చెప్పలేను.. బహుశా గజాలలో పొంగివుండవచ్చు...  

 
 
మనం పెద్ద ఐ.ఏ.ఎస్సో. మరేదో అయిపోయినట్లు... తోట బంగ్లా, కార్లు, నౌఖర్లు,  ఘూర్ఖాలు వున్నాట్లు  ఎవేవో కలలు...నిజంగానే పెరిగింది శరీరం...   కాని నాకో సందేహం ఏమిటంటే ఈయన తో ఆయనకి ఏదో పెద్ద అవుసరమే పడి వుండవచ్చు ఈయనకి నేను సొంత మనవణ్ణే అనుకుని ఆ విధంగా మనల్ని మునగ చెట్టుమీదకి ఎక్కించేసి వుండవచ్చు...
కాని నా లో ఇంకా విశ్వాసం , నమ్మకం వుంది... విశ్వ విఖ్యాతిని గాంచే పనేదో నాచే ఆ దేవుడు తప్పక 

చేయిస్తాడు అని .. ఎంతైనా ఆశాజీవులం  కదా... 

 3. మా సీనియర్ ఒకావిడ ఓ రోజు హఠాత్తుగా "నువ్వు తప్పక మన కంపెనీకి సెక్రటరీవి అవుతావు" అని దీవించి పారేసింది... ఛా ..  వూరుకోండి మీరు మరీను అని అన్నానే గాని షరా మామూలుగా మన 

చాతీ వుప్పొంగింది ఈ సారి అడుగుల్లోనే..
"బాబు! నీకు క్వాలిఫికషన్ వుంది, కష్టపడి పనిచేస్తావు... నేను చెప్తున్నాను కదా నువ్వు తప్పక సెక్రటరీ  స్థాయికి వెళ్ళిపోతావు చూడు"  అంది..
కాల చక్రం మళ్ళీ గిర్రున తిరిగి తన పని తాను చేసుకుని పోగా నేను నిజంగానే  సెక్రటరీ ని అయ్యాను.... కాని కల్చరల్ సెక్రటరీని... ఏం ఇది మాత్రం తక్కువా.. ఇన్ని వేలమంది వుద్యోగస్తుల్లో మనల్ని నామినేట్ చేసారు...అంటే ఎంత గొప్ప ..  అని సరిపెట్టు కోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక.... తృప్తి పడ్డాను... (అంతో కొంతో గీత అదే భగవద్గీత చదివాము కాబట్టి...) 

 నా చిన్నప్పుడే ఒకసారి చుట్టం చూపుగా పక్కింటికి వచ్చిన ఒకాయన "మీ అబ్బాయి జాతకం  లో జైలు జీవితం రాసివుంది.. కనీసం కొద్ది కాలం (ఎంతో చెప్పాడు కాని గుర్తు లేదు) అయినా జైల్లో వుంటాడు" అని చెప్పాడు...

 


ఛాతీ లోపలకి మూసుకు పోయింది కొన్నాళ్ళు.. కాని ఇంతవరకూ ఆ ఛాయలు కి కూడా వెళ్ళలేదు.. 
కాని ఇక్కడో సందేహం...  ఏమో దేశ భక్తులైన జగన్, గాలి లాంటి వారిని కలిసే ప్రాప్తం వుందేమో ఎవరికి తెలుసు...
ఐరావత  గజారోహణమా ... అథ: పాతాళ పతనమా ... అని ఆలోచిస్తూనే ఇన్నేళ్ళ  జీవితం అయిపోయింది... 
కాని రెండింటిలో ఏది అయినా చిరునవ్వుతో స్వాగతించే స్థిత ప్రజ్ఞత మనకి వచ్చేసింది ...గీత దయవల్ల .. ఇప్పుడు ఛాతీ పొంగదూ..  కృంగదూ ... 
ఏమో ... జైలుకెళ్ళండం వల్ల  మహాత్మా గాంధీ అంత పాపులర్ అయిపోతామేమో.... 
 టు బర్డ్స్ ఇన్ వన్ షాట్.. వైట్ అండ్ సీ... 
మీరు మాత్రం కాస్త ఆలోచించి నన్ను దీవించండేం ... 

Tuesday, March 12, 2013

కనబడని స్నేహితురాలికి ... కడసారి లేఖ..

ఓ ప్రియ మిత్రురాలా.. ఆత్మీయ బంధురాలా.... 

నీ జ్ఞాపకాల పరంపరలు నన్ను అనుక్షణం వెంటాడుతూ వుంటాయి... 
ఇన్నాళ్ళయినా....  ఎన్నేళ్ళయినా... 

తొలి చూపులోనే నన్నాకర్షించినా, బిడియ పడ్డాను నీతో మాటలు కలపడానికి.. 
సూచన ప్రాయంగా నీ మనసులోని మాటను తెలియ చేసినా... అడుగు ముందుకు వేయలేక పోయాను.. 
స్నేహితుడు సూటిగా నీ మనసు లోని భావాన్ని నాకు చెప్పినా .. అర్ధం చేసుకో లేక పోయాను... 

నా అంతట నేనుగా రాలేను... 
మీ అన్న ను అడగలేక పోయాను.. తానంతట తానుగా తను అడగ లేదు.. 
ఏ అడ్డుగోడ నిలిచిందో చెప్పలేను.. 
గోత్రాన్ని , చదువుని, అంతస్తుని బహుశా  బేరీజు వేసుకుని వుంటాను... 

రుక్మిణి రాయబారం వలె  ఆ  ఊరి  ఏకైక పూజారి ద్వారా 
నీ అభిష్టాన్ని సంసిద్దతను తెలియ పరిచినా సంకోచించాను.. 

భధ్రాచలం నుండి పాపి కొండలు వరకు సన్నిహితులతో సాముహిక వన విహారం.. 
నీ నవ్వుల జల పాతాలు.. స్వచ్చమైన నీ హావ భావాలు గోదారిని తలపించాయి 
తీయని మాటల తేనెయలు.. అభిమాన విరిజాజులు ఇప్పటికీ పదిలం.. 

మాకు మాత్రమే ఇచ్చిన ఫలహారాన్ని "కొంచెం మాకూ పెట్టరా?"  అని గోముగా అడిగినా 
చుట్టుపక్కల  వారు  గేలి చేస్తారేమో అని బిడియ పడ్డాను... 

తిరుగు పయనంలో .. బస్సులో నీ పక్కన నిలబడినది ముప్పై నిముషాలే ...   
అయినా ఎన్నో ఊసులు చెప్పావు.. 
నీ మనసు లోని కోరికను, ప్రేమను చెప్పకనే చెప్పావు... 

అయినా ... నీ చేతిని అందుకోలేక పోయాను... 
ఆ రోజే నా ఆఖరు ప్రయాణం .. ఆ రోజుతో ఆ ఊరికి నాకూ తెగిపోతుంది అనుబంధం ... 
సొంత వూరికి వచ్చే హడావుడిలో నీ ప్రేమను నిర్లక్ష్యం చేసాను... 
నీవు ఎంతో ప్రేమగా .. "ఇంకెప్పుడూ ఇటు రారా" అని అడిగినా "రాలేనేమో" అని  పలికాను.. 
సున్నితంగా తిరస్కరించాను...  

నీ తోవ నీదైంది.. నా తోవ నాదైనది... 
కాల చక్రం తిరుగుతోంది.. తన పని తను చేసుకుని పోతోంది ... 
అయినా నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా హృదయం ద్రవిస్తుంది... 

ప్రేమ పూరిత నీ హృదయం అందుకోలేని మూర్ఖుణ్ణి ... 
నీవు నన్ను క్షమించావా...నిన్ను వదిలి వచ్చి నందుకు శపించావా.. 

నీవు ఎలా వున్నావో అని బెంగ..... 
నన్ను తలస్తున్నావో లేదో అని సందేహం... 
ఏనాటికైనా నిను కలవాలని ఆత్రం... 

ప్రేయసీ ప్రియులకు అతీతమైన ప్రేమ మనది... 
స్వచ్చమైన  నీ నిర్మల ప్రేమను పొందాలని .. 
నీతో ఎన్నో ఊసులు చెప్పుకోవాలని వుంది.. 
మంచి స్నేహితుల వలె మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలి... 
కనీసం కడసారి ఒక్కసారి నిను చూడాలని... ఆ తృప్తి తో శేష జీవితాన్ని గడవాలని వుంది...

వుంది నాకు నమ్మకం వుంది... నేను తనని చేరేలోగా దేవుడు నన్ను నీ కడకు చేరుస్తాడని.. 
ప్రియతమా ఆఖరుగా నన్ను క్షమించమని నిను వేడుకుంటున్నను... ఈ బ్లాగ్ సాక్షిగా... 

బరువైన గుండెతో .. 
ఇట్లు 
నీ ప్రేమని పొందలేని నిర్భాగ్యుణ్ణి ... నిన్ను తిరస్కరించిన అభాగ్యుణ్ణి..  


Monday, March 11, 2013

అధర్మంగా బతుకుట కన్నా ధర్మం కోసం మరణము మేలు..

"ధర్మో రక్షితి రక్షిత: " - ధర్మాన్ని నువ్వు రక్షించితే ధర్మం నిన్ను రక్షిస్తుంది...
అసలు ఏమిటి ఈ ధర్మం ? ఎక్కడ వుంటుంది.. ఎలా వుంటుంది.. 
కనిపించని ఆ ధర్మాన్ని రక్షించడం ఎలా..

జీవి పుట్టినది మొదలు, చనిపోయే దాకా పాటించాలి ధర్మం.. ఒక్కొక్క దశలో (బాల్య, యౌవ్వన, వృద్దాప్యం దశల్లో) ఒక్కొక్క విధంగా వుంటుంది ఈ ధర్మం.. 
మనం చేసే వృత్తిని బట్టి ఆచరించాలి ఈ ధర్మం ...
మన కోసం మనంతట మనమే ఆచరించాలి ధర్మం..  
ఇప్పడు నేను ధర్మాన్ని గురించి సుధీర్ఘ మైన చర్చ చేయుటకు రాలేదు.. 
ధర్మం మనిషిని బట్టి మారుతుంది.. కనుక ఇలాగే వుండాలి అని నియమం లేదు.. 
 
ధర్మం 1 : పుట్టిన తర్వాత తల్లి తండ్రులు  నేర్పిస్తారు... 
ధర్మం 2: గురువుల ద్వారా తెలుస్తాయి.. 
ధర్మం 3: పుస్తకాల ద్వారా తెలుసు కుంటాము.. 

ఇలా  తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టుటయే ధర్మం.. 
అయినా సరే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తాము.. ఎందుకు.. 
దురాశ, స్వార్ధ చింతన, తాత్కాలిక సుఖ: భోగస లాలన  .. 

పొరపాటునో, గ్రహపాటునో ఒకసారి తప్పు చేసినప్పుడు కొంతకాలానికి (నిముషం కావచ్చు - కొన్ని రోజులు పట్టవచ్చు)   ఎవరికైనా ప్రశ్చాత్తాపం కలుగుతుంది.. 

తన తప్పు తాను  తెలుసుకుని మరింకెప్పుడూ ఆ తప్పు చేయకూడదని భావన ప్రతీ వారిలోను కలుగుతుంది. అప్పుడే గనక స్థిర నిశ్చయముతో కూడిన మనసుతో మరల అటువంటి తప్పుని చేయకుండా వున్నవాడు  ధర్మ మార్గాన్ని విడవకుండా జీవితాంతం మనగలడు.. 

కాని ఒక తప్పు చేసి ఆ తప్పుని  కప్పిపుచ్చు కోవడానికి వేరొక తప్పు చేసి ఇలా తప్పు మీద తప్పులు చేసిన వాడు ఆ తప్పుల వూబిలో కూరుకుని పోయి మరి లేవలేడు... 

ఒక్కసారి అధర్మ మార్గమే పరమావధిగా ఎంచుకుని ఆ మార్గంలో వున్నా వారినే ఆదర్శంగా పెట్టుకున్న వారు ధర్మాన్నే ఎదురొడ్డి నిలిచి గొప్పవానిగా చలామణి అయిన వాడు అంత్యకాలము లోనైనా తప్పుని తెలుసుకున్న నాడే ప్రశాంత చిత్తతతో మరణించ గలడు.. 

దేవుడు అనేవాడు వున్నాడు , మన పాప కర్మలను బట్టి శిక్షలు వేస్తాడు అని భయం తోటి ధర్మాన్ని ఆచరించే వారికి కలిగే తృప్తి కన్నా, తమంతట తాము గా ధర్మాన్ని ఆచరించి అందులో వున్న  ఆనందాన్ని  అనుభవించే వారికి తృప్తి ఎక్కువ.. 

ఒక బెత్తాన్ని పట్టుకుని మన ఎదురుగా కూర్చుని ఎవరూ మనల్ని ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు అని ఎవరూ చెప్పరు..  మనలోని వేరొక మనిషి - అంతరాత్మ అనో మనస్సు అనో ఏ పేరుతో అనుకున్నా మనలోని మనిషి హెచ్చరిస్తూ వుంటాడు... 

కాని వాడి మాటను పెడ చెవిని పెట్టి , ఆ గొంతు నొక్కేసి.. అధర్మమైన కార్యాలు చేస్తూ వుంటారు... 

ఇప్పుడు ఎదుటి వానిని మెప్పించుటకో, వారికి భయపడో, పక్షపాతం వల్లనో వాడు చెప్పిందే కరెక్ట్ అని గంగిరెద్దులాగ తల వూపేసి.. ఎక్కడా ఎవరి వద్దా చెడ్డ అవకుండా ధర్మాన్ని చంపేస్తున్నారు.. 
తప్పు చేసిన వాని కన్నా ఆ తప్పుని సమర్ధించిన వాడికే శిక్ష ఎక్కువని పెద్దలు అంటారు.. 

ధర్మం ఆచరించుటలో లాభాలు ఏవిటయ్యా  అంటే ... 
1. నిత్యం ప్రశాంత చిత్తతతో జీవించ వచ్చు.. 
2. దినము ముగిసిన తరువాత హాయిగా మనశ్శాంతిగ  నిదుర పోవచ్చు.. 
3. ఏ పూట కి ఆ పూట తృప్తి గా మనవచ్చు.. 
4. బయటకు ఒకలాగా లోపల వేరొక విధంగా మాట్లాడే అవస్థ వుండదు.. 
5. మన మీద మనకు, ఎదుట వారికి విశ్వాసం కలుగుతుంది.. 
6. మన ఎదుట ఒకలాగా మనం లేనప్పుడు ఒకలాగా మన మీద మాట్లాడే అవకాశం వుండదు.. 
7. ఈ క్షణం ఇప్పుడే మరణం ఆసన్న మైనను హాయిగా ప్రాణం వదలవచ్చు.. 
8. ధర్మాన్ని పాటించుటలో వున్న హాయిని ఆనందాన్ని పొంది మరల ధర్మాన్ని మరింత ఇష్టతతో ఆచరించవచ్చు.. 
9. కుసింత గౌరవంగా బతక వచ్చు..   
10. ముఖ్యంగా మనలని వేలెత్తి చూపెట్టే అవకాశం ఎవరికీ రాదు.. అందువల్ల ఎవరికీ భయపడో, లోబడో పనిచెయ్యక్కర్లేదు.. 
అధర్మంగా బతుకుట కన్నా ధర్మం కోసం మరణము మేలు..
 అందుకని ఎవరో ఏదో చేస్తారని భయపడి అధర్మ మార్గాన్న పయనించకండి..

మొదట్లో వ్యతిరేకించిన వారే కాల క్రమేణా మీ తత్వం తెలుసుకుని మిమ్ములను ఆదరిస్తారు.. వారిలో కూడ పరివర్తన మొదలవుతుంది.. 

తప్పు చేసిన వారిని ఇది తప్పు అని చెప్పే వారు లేకపోవడం వల్ల, తప్పులను సమర్ధించే వారే ఎక్కువ అవడం వల్లనే ఈ రోజున ఇన్ని అనర్ధాలు.. ఒకరి తప్పుని వేలెత్తి చూపి సరిదిద్ద వలసిన బాధ్యత మన అందరిదీ ..

తప్పు చేసిన వాడు ఆఖరికి నీ తండ్రి అయినా సమర్ధించాలని రూలు లేదు ... 
దానికి ముందు మనం తప్పు చెయ్యకుండా వుంటేనే అలా చెప్పే వీలు, అర్హత  వుంటుంది.. 

ఇప్పటికి ఇది చాలను కుంటా..ఇవేవీ కొత్త విషయాలు కాదు కాని పాటించుటలో అశ్రద్ధ మనకి.. 

మనలో 100% మిష్టర్ పెరఫెక్ట్  గా ఎవరూ వుండ లేక పోవచ్చు...  అయినా మనలో వున్న  మరో మనిషిని బాధ పెట్టే విధంగా ప్రవర్తించ కుండా వుంటే చాలు... 

తరచి చూస్తే నీ గుండెల్లోనే వున్న  నీ అంతరాత్మ.. మరెవరో కాదు ఆ పరమాత్మ..
ఈ నిజాన్ని తెలుసుకుని జీవించిన వాడే నిజమైన జీవాత్మ...


Sunday, March 10, 2013

వేలు వెచ్చించ కండి.... వందలలోనే కనండి పర్వత శ్రేణులను..

శివరాత్రి పూట ఒక మంచి పని చేసి నిద్రపోదామని ఈ పోస్ట్ రాస్తున్నాను.. 
మా విశాఖపట్నం యొక్క గొప్ప తనం ఏమిటయ్యా అంటే .. 
ఒక పక్క విశాల బంగాళాఖాతం, మరో  పక్క సువిశాలమైన వన సంపద గల  మహోన్నతమైన శిఖరాల సమాహారం.. 
ఒక పక్క సమున్నత మహా నగరం, మరో పక్క పచ్చని చేలకు ఆలవాలమైన గ్రామాల మణిహారం.. 
ఒక్క వంద కిలోమీటర్ల పరిధి లోనే ఇవన్నీ వీక్షించి తరించవచ్చు.. 

ఒక మార్గంలో ఆంధ్రా ఊటీ గా పేరు గాంచిన అరకు, కాఫీ తోటల అనంతగిరి, మైమరిపించి ఔరా అనిపించే బుర్రా గుహలు.. 
మరో మార్గం లో చింతపల్లి, సీలేరు ..అందాల సెలయేరు..  
వేరొక మార్గంలో మాడుగుల, పాడేరు..ముచ్చట గొలిపే పర్వత శ్రేణులు 
దేనికదే ప్రత్యేకత కల్గిన అటవీ సంపద గల ఘన మేరు పర్వతాలు...   
కొండ పక్క కొండ, ఆ కొండ వెనకాల మరో కొండ ఇలా వరుస  శిఖరాల బారులు.. 
ఇవన్నీ వదిలేసి బోల్డంత ధనాన్ని వెచ్చించి ఎక్కడో ఉత్తర భారతాన్ని దర్శించి ఊరుకాని ఊరులో, భాష రాని ప్రదేశాల్లో మన ఆహారం దొరక్క నానా బాధలు పడి యాత్రా నిర్వాహకులకు వేల రూపాయలు సమర్పించుకుని వెళ్తాం.. ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని వూరంతా తిరిగిందని అన్నట్లుగా .. 
రండి.. విశాఖను దర్శించండి.. పై అందాలను తిలకించండి.. తక్కువ ఖర్చుతో..  
ఆయనే వుంటే మంగలి ఎందుకని.. మన ప్రభుత్వమే గనక బావుంటే, మన విశాఖను ఇంకా అభివృద్ది చేసివుంటే మనకు ఈ తిప్పలు వుండేవా..

ఈ కింద పాడేరు లో వెలిసిన మోదకొండమ్మ వారి చిత్రము  జత పరుస్తున్నాను...ఈ విగ్రహము నూతనంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాదాలు అనే చోట  అమ్మవారి నిజపాదాలు వుంటాయి..కాని అక్కడ కోళ్ళు వంటి జంతువులను బలి ఇస్తారు..మన లాంటి వాళ్ళం కొబ్బరి కాయ కొట్టవచ్చు..   
అసలు అమ్మవారి రూపం చాలా భయం గొల్పేదిగ వుండేదిట.. అందుకని సుందరమైన ఈ రూపాన్ని తీర్చిదిద్దారు.. అమ్మలగన్న అమ్మ.. కోర్కెలు తీర్చె కొంగు బంగారం..కొండంత అండ మోద కొండమ్మ తల్లి.. 
మనము అడక్కుండానే వరాలు తీర్చే వర ప్రదాయిని మోదకొండమ్మ తల్లి  .. 
ఈ ప్రాంతం వారికి ముఖ్యంగా గిరిజనులకి కుల దైవమైన ఈ తల్లి ని గూర్చి ఎంత చెప్పినా తక్కువే.. 
మీరు కూడా ఈ దేవతనుదర్శించుకుని ..  పునీతులై మీ యొక్క అనుభవాల్ని స్వయంగా పొందితే తప్ప మీకు తెలియదు.. 
మీకు వీలైతే పాడేరుకి దగ్గరలోనే వున్న మత్స్య గుండంలో వెలిసిన శివయ్య ను కూడా దర్శించి పవిత్ర మత్స్య గుండంలో స్నాన మాచరించి పవిత్రంగా అమ్మని దర్శిస్తే .. ఆ అనుభూతే వేరు.. 
కాని మత్స్య గుండం చాలా లోతైనది .. కాస్త ప్రమత్తంగా వుండాలి... 
ఈ అమ్మ వారి విశేషాలను, అమ్మ సుందర రూపాన్ని మీకు పరిచయం చెయ్యాలని ఎన్నాళ్ళ బట్టో అనుకున్నాను.. ఇప్పటికి వీలైనది..
కాని పాడేరులో బస చెయ్యడానికి, మంచి భోజన వసతి మొ.నవి  తక్కువ..   మన అమాత్యులు, అధికారులు ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది చక్కటి ఈ ప్రదేశాల్ని చూసే అవకాశం వుంటుంది. 
పాడేరు మీదుగా అరకు వెళ్ళవచ్చు..అరకులో, అనంతగిరి లో వసతి సౌకర్యాలు వున్నాయి.. లేదా తిరిగి విశాఖ వెళ్లిపోవచ్చు.. 
మీరు విశాఖ నుండి కారు బుక్ చేసుకుని చుట్టి వస్తే మంచిది.. లేదా నాన్ స్టాప్  బస్సులు వున్నాయి (తక్కువ)..పొద్దుట 5 గంటలకు విశాఖలో నాన్-స్టాప్ బస్సులో బయలు దేరి తే 8 గంటలకల్లా పాడేరు చేరతాము. అమ్మవారి దర్శనము అయ్యాక  10 గంటలకు బయలుదేరితే 12. 30 కల్లా విశాఖ కి వచ్చేవచ్చు..మధ్యాహ్నం బస్సుల ఫ్రీక్వెన్సీ తక్కువ.. 

అమ్మ నేను  కోరకుండానే  ఎన్నోవరాలు ఇచ్చింది చల్లని తల్లి మోదమాంబ .. 
మళ్లి, మళ్ళి తన  దర్శనానికై తహ తహ లాడేలా  చేసింది మోదమాంబ తల్లి....
మీరు కూడ తప్పక పాడేరు దర్శించి., మోదకొండమ్మ వారి కృపకు పాత్రులయి... మీ జీవితాన్ని పునీతం చేసుకోండి.. 

అందాల పాడేరు కొండల వలయాల్ని. సుందర  జలపాతాలను,   మనోహర వృక్ష సంపదను వీక్షించి మీ మనస్సులను, స్వచ్ఛ మైన గాలిని పీల్చి మీ వూపిరి తిత్తులను.. శుభ్రపరచుకోండి.. 
ఈ ప్రచారం వల్ల భీమా ఏజెన్సీ వారికి వచ్చే కమీషన్ రాదు గాని.. ఈ పవిత్ర శివ రాత్రి రోజున.. ఒక పుణ్య క్షేత్రాన్ని మీకు పరిచయం చేసానన్న తృప్తి.... అమ్మ ఆశ్వీరచనం ఇవి చాలు.. 
ఇక అమ్మ వారిని దర్శించండి... (ఈ చిత్రరాజాన్ని నేనే తీసాను)..అమ్మవారి చరిత్రను ఎవరికైనా తెలిస్తే రాయండి.. నాకు అంతగా తెలీదు..మిడి మిడి జ్ఞానంతో తప్పులు రాస్తే  మంచిది కాదని రాయలేదు.. 
ఓం మోదమాంబాయ  నమ: 
ఓం మోదాంబికాయై నమ: 
ఓం మోద కొండమ్మాయ నమ:Saturday, March 9, 2013

లింగ వివక్ష మనిషిలోనేనా ? జంతువులకు కూడానా...


నా ముందరి టపా లో మా పప్పీ (అమ్మాయి) చిత్రరాజము చూసారుగా...
తనని నేను బయటకు వాహ్యాళి కి తీసుకుని వెళ్తున్నపుడు కొంత మంది స్పందన ఇలా వుండేది..
1. అబ్బో చాలా బావుంది.. ఎవరైనా ఇచ్చారా... . కొన్నారా ?

2. ఇంతకీ ఆడా  ? మగా ?

3. అబ్బా ... ఆడ పిల్ల ని  ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారు?...

4. కాస్త ఖరీదు ఎక్కువైనా మగ అయితేనే బెస్టు అండీ..

5. ఆడ తో కొన్ని సమస్యలు వుంటాయి అండి బాబూ... వయసు పెరిగాక.. కష్టమే మరి...
6. అదే మగ ది అనుకోండి.. అంతగా బాధ వుండదు...
(పై మాటలు అన్నది ఆడవారే... )

ఇహ లాభాలు...
1. ఆడ అయితే చెప్పిన మాట విని బుద్దిగా వుంటుంది (ట)..

2. వూరికే అటూ ఇటూ పరిగెట్ట కుండా, ఎక్కువ న్యూసెన్స్ పనులు చేయకుండా ...  కుదురుగా ఓ దగ్గర కూచుంటుంది (ట)... వాహ్యాళికి వెళ్ళేటప్పుడు కాసుకో వచ్చు (ట)...

3. మగ వలె గబుక్కున (దూకుడు గా ) ఎవరిమీద ఎటాక్ చెయ్యదు.. 

3. వయసు వచ్చేసరికి మగ ది అయితే ఎవరి వెనక బడితే వారి వెనకాల పడుతుంది (ట)... అది ఇంకా కష్టం (ట)..

4. ఆడ అయితే ఎదిగే సరికి ఫలానా వాళ్ళకి ఫోన్ కొడితే చాలట వచ్చి తీసుకుని వెళ్లి.. జత కలిపి ... గర్భ ధారణ చేసి పెడతారు(ట).. .. కాని దానికి తగిన మూల్యం.. (కట్న కానుకలు), ఒప్పందాలు లాంటివి వుంటాయట.. పుట్టిన పిల్లల్లో ఒకదానిని ఉచితంగా వాళ్ళకి ఇవ్వాల(ట)....

చూశారా ... ఎంత లింగ వివక్ష.. ఓ పక్క స్త్రీల సమాన హక్కుల గురించి పోరాడుతూ చివరికి పెంచుకునే జంతువుల మీద కూడా ఎంత వివక్ష..
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ఖండించాలి..
 

ఎందుకీ తేడా .. సహజ సిద్దమైన లక్షణాలు స్త్రీ, పురుషులలో (అన్ని జీవాల్లో ) దేవుడే పెట్టాడా ... అయితే పురుష ఆధిఖ్యత పైన స్త్రీల తిరుగుపాటు దేనికి.. 
స్త్రీ, పురుషులు  చెయ్యవలసిన విధులు  అటు ఇటు అయినందువల్లనే ఈ సమస్యలేమో అని నా భావం.. తప్పు ఎప్పుడో ఎక్కడో జరిగిపోయింది.. 
దీనికి కేవలం పురుషులను లేదా స్త్రీలను తప్పు పట్టడం వల్ల    ఒరిగేదేమీ లేదు ... లోపాల్ని సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి.. 
ఎప్పటి లాగే (నా ముందరి టపాల్లో కొన్నిటి లాగ ) ఇదేదో వ్యంగ్యము గా  రాసేనని అనుకోకండి .. 
సీరియస్ గానే నాకు చాలా బాధ వేసింది కాబట్టే ఇలా రాసాను... 


కానీ ఒహటి మాత్రం నిజం ఏ జంతువు అయినా కేవలం తన సంతాన ఉత్పత్తి కోసం మాత్రమే జత కలుస్తాయి.. 
 
  మానవుడు మాత్రమే నిత్యం అదే ధ్యాస లో వుంటాడు... అందుకే ఇన్ని మానభంగాలు,  మర్డర్లు..జంతువుకున్న నీతి నియమం భగవంతుడు మానవునిలో ఎందుకు పెట్టలేదు.. 
ఈ విషయం సైన్స్ పరిజ్ఞానం వున్న  వారు చెప్పాలి..  

సూచన :  ఏదైనా బిజినెస్ చెయ్యాలనుకునే వారికి చక్కటి అవకాశం .. శునకరాజములు  తినే  ఆహారపదార్దములు (పెడిగ్రీ), బెల్టులు, గొలుసులు.. వాక్సినులు, సబ్బులు, షాంపూలు.. వీటితో బాటు  బ్రీడ్ లను కూడా అమ్ముకుని తక్కువ సమయములో తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించ వచ్చు.. కాకపోతే శ్రమ కాస్త పడాలి.. 


Friday, March 8, 2013

మా ఇంట్లో సింహ పిల్ల..


 టైటిల్ చూసేసి ఆదుర్దాగా బ్లాగ్ ఓపెన్ చేసేసారా.. న్యూస్  టి.వి చానల్ ఎఫక్ట్ అన్నమాట.. 
ఈ బుజ్జిది మా ఇంటికొచ్చి సుమారు  రెండునెలలు  అయ్యింది.. ఈ ఫుటో అప్పుడు తీసింది.. 
వెనకాల సీనరీ, కిటికి బిల్డప్...  వగైరా మన పైత్యం అన్నమాట (ఫోటో షాప్ లో) ... 
ఇప్పుడు ఈ అమ్మడు మూడింతలు పెద్ద అయ్యింది.. చిన్న సింహం పిల్ల లా వుంటుంది.. 
ఆడితే సరదాగా నే వుంటుంది గాని.. టైమ్ కి ఫుడ్ ... బయటకి షికారు (ఇంకో పనికి .. లేకపోతే ఆ పని ఇంట్లో నే అప్పుడు మనకి  బోల్డు పని) ... 
ఇవన్ని ఈ వయసులో అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి... 
ఏదో మా అబ్బాయి సరదా.. మనకి శ్రమ.. 
నెలసరి ఖర్చుల్లో కొంత ఈవిడ గారికి.... ఏం చేస్తాం ఏ జన్మ బంధమో ఈ జన్మలో ఇలా.. 
ఈనాటి ఈ బంధ మేనాటిదో .... (పాట ఈ సందర్భానిది కాదా)

ఇంతకీ ఇది మా ఇంట్లో సింహ పిల్ల కాదంటారా.. నేనొప్పుకోను.. 
ఏటీ...కాదా .. సీరియస్ వార్నింగా ... అయితే ఓకే...  

Wednesday, March 6, 2013

ఎక్కడికి పోతున్నాం... ఏమైపోతున్నాం

 

నాడు - క్షవరం చేయించుకోడానికి ఆ పని చేసే ఆయన ఇంటికే వచ్చి చేసేవాడు.. ఓ ఐదు రూపాయలు చేతిలో పెడితే చాలు పని అయిపోయేది.. ఐదు రూపాయలు..  అయినా...   ఇచ్చిన వాడికి తృప్తి .. పుచ్చుకున్న వాడికి తృప్తి ... బుద్దిగా  వుండి, బాగా చదువుకుని, మంచి వుద్యోగం రావాలని ... ఆ పని చేస్తున్నంత సేపు కబుర్లు చెప్తూ వుంటే ఎంత ఆనందం .. 
మళ్ళి ఆ వ్యక్తి కోసం ఎదురు చూసి ఒకవేళ రాకపోతే ఏం మొన్న వారం రాలేదు .. చూసేవా జుట్టు ఎలా పెరిగిందో అని సరదాగా కోప్పట్టం.. వూరెళ్ళేను బాబూ ...క్షణంలో చేసేస్తాను ఇట్టా కూకోండి అని అప్యాయంగా కూర్చోబెట్టడం ..చేయించుకున్న పనికి వేల గట్టినా.. ప్రేమ, అభిమానాలకి వేల కట్ట గలమా.. 
 
నేడు - అదే పని కోసం ఏ.సి సెలూన్ లో గంట సేపు క్యూ అయ్యేక, క్షవరం అయ్యేక మరీ మొహమాటానికి పోతే  జుట్టుకి రంగు, ముఖానికి క్రీములు వగైరా పూయించుకుంటే  కనీసం 300 నుండి 500 వందలు కొండకచో హై  క్లాస్ బ్యూటి పార్లర్  అయితే హీన పక్షం 2000 ఇస్తే గాని పని జరగదు..దిక్కుమాలిన పాటలు పెట్టి, వాడిన టవల్ నే మడత పెట్టి.. ఫ్రెష్ గా మనకి వేస్తున్నాట్టు బిల్డప్ ఇచ్చి, ప్రతి సేవకి ఇంత రేటు చొప్పున గుంజి.... ఈలోగా క్యూ లో వున్న వారి అసహన చూపులు..అయిపోయింది సార్ .. ఈ సార్ కి  ఒక్క కటింగే.. (ఇంకే మీ చేయించుకొని అనాగరికులం అని వాడి ఫీలింగ్ అన్నమాట)  అని ఏదో అయిందను పించుకుని బయటకి రావాలి.. క్షవరం మన జుట్టుకా....  జేబుకా ? అర్ధం కాని పరిస్థితి... 

నాడు - ఏ మధ్యానం వేళో, సాయంత్రమో సరదాగా టిఫిన్ చెయ్యాలని కోరిగ్గా వుంటే (తినే అవుసరమే వుండేది కాదు) తప్పని సరో, స్నేహితుల కోసమో తప్ప.. హోటల్ కి వెళ్తే ఎంత తిన్న ఇద్దరికీ కలిపితే  మహా అయితే పాతిక రూపాయలకి మించదు..రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ల ని ఆప్యాయంగా పలకరించే హోటల్ యజమానికి బిల్లు ఇచ్చి .. బేర్ మని త్రేంచుతూ తృప్తి గా బయటకి వస్తాము.. 

నేడు - ఓ గంట బయట వైట్ చేస్తే మన సంఖ్యని బట్టి మనకి కేటాయించిన  సీట్ల లో ఆసీనులయిన తర్వాత మెనూ పుస్తకం ఓ పావు గంట తిరగేసి (పిల్లలుంటే అరగంట) అయి,  మనం ఆర్డర్ ఇచ్చిన గంట తర్వాత అందంగా అమర్చిన అవి ఏ పదార్ధాలో అర్ధం కాక పోయినా ఎలా తినాలో చేతకాకపోయినా, కడుపు నిండక పోయినా వేలల్లో బిల్లు (VAT తో సహా) చెల్లించి మొదట వెల్కమ్ చెప్పిన సూటు వాడో, మిడి లో వున్న  వయ్యారి భామో "థాంక్యూ సర్" అని నిండుగా నవ్వి వీడ్కోలుతో బాటు "కం అగైన్ సర్" అని ముద్దుగా అన్నా సరే నవ్వు రాక పోయినా ఓ విధమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చి బయట పడతాము.. 

నాడు- ఏ వస్తువు కావలసినా మన వీధి చివర్లోనో.. మెయిన్ రోడ్డు మీదో వున్నా షావుకారి గారి దుఖాణానికి వెళ్తే  అప్యాయంగా పలకరించి మనకి కావలసిన సరకులు సరసమైన ధరకి ఇచ్చెవారు.. పాపం పేద వారికి అయితే ఒక్క రూపాయి ఎండు మిరప కాయలు, పది రూపాయల బియ్యం.. రెండు రూపాయల నూనె ఇలా ఇచ్చి పంపే వారు.. నమ్మకస్తులకైతే అరువు కూడ ఇచ్చేవారు.. సాధారణ మధ్య తరగతి వారు నెలవారీ వెచ్చాలు తీసుకుని ఆఖర్లో జీతం వచ్చేక ఇచ్చేవారు.. 
మనుష్యుల మీద ఒకరికి ఒకరికి  నమ్మకం .. మన వస్తువు పొరపాటున వదిలేసినా జాగ్రత్త పెట్టి ఇచ్చేవారు.. 
నేనైతే తరచూ సైకిల్ వదిలేసే వాణ్ని(సైకిల్ నేర్చుకున్న కొత్తలో).. ఆ షావుకారు సాయంత్రం దాకా చూసి ఇక రానని తెలుసుకుని వాళ్ళ కుర్రాళ్ళతో ఇంటికి పంపించేవాడు.. అప్పటికి గాని సైకిల్ అక్కడ వదిలేసానని గుర్తుండేది కాదు..

నేడు - సెంట్రల్ ఏ.సి, అన్ని వసతులు.. హంగులతో A - Z అన్ని వస్తువులు ఒకే చోట దొరికే షాపింగ్ మాల్.. అవసరమున్నా ...  లేకపోయినా, కొంటే పోలా అనో.. వాడు ఇచ్చే ఆఫర్ల మోజు లోనో, అర్ధాంగి ఫావరేట్ కొన్ని, పిల్లల ఫావరేట్లు కొన్ని..ఇలా చక్రాల తోపుడు బండి లో సామాన్లు వేసుకుని  బిల్లులో చివరాఖర్న వాడిచ్చిన డిస్కొంట్లు.. మనకి వచ్చిన పాయింట్లు తద్వారా మనకి ఎంత ఆదా అయ్యిందో పర్సెంటేజ్ లు , ప్రతీ వస్తువు మీద VAT..  అర్ధం అయీ అవనట్టు.... లాభమా నష్టమో తెలీయని అయోమయ స్థితిలో "సర్ ఆ చివరన కౌంటర్ లో  బిల్లు చూపిస్తే కొన్ని వాటికి ఫ్రీ గిఫ్టులు వున్నాయి   సర్"  అని వయ్యారి భామ చెపితే అబ్బో అనుకుని తీరా వెళ్ళేసరికి బిస్కట్ పేకట్టో, ఓ షాంపూ పేకట్టో ఎంతో నవ్వుతు ఇస్తూ "హాపీ డే అండ్ విజిట్ అగైన్ సార్" ... అని చెప్తూ వీడ్కోలు ఇస్తూ వుంటే .. హీరో రాజశేఖర్ లాగ పళ్ళన్ని బయటకి వచ్చేలా ఇకిలిస్తూ బయటకి వచ్చేస్తాం.. 

ఇంతకీ ఈ గోలంతా ఎందుకంటే ..చదువులు పెరిగాయి ..  హోదాలు పెరిగాయి.. జీతాలు పెరిగాయి.. సాఫ్టు వేరొ, హార్డు వేరొ మరోటో చేసి వేలకు వేలు సంపాదిస్తున్నారు..ఐదుకీ.. పదికీ పీచు బేరలాడే మనస్థత్వాలు మారి.. రేటు ఎంతయినా పర్వాలేదు.. సౌఖ్యం ముఖ్యం అని అనుకునే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది.. ... న్యాయ, ధర్మ పద్దతిలో వస్తువు దొరకనప్పుడు ఎంత పడేసినా బ్లాకులో అయినా ఆ వస్తువుని చేజిక్కించుకోవాలి (రైల్వే టికట్టు అయినా, అధార్ కార్డు అయినా ప్రతీ దానికి ఏజెంట్లు వున్నారు.. ) 
ఇక్కడ ఇచేవాడికి , పుచ్చుకునే వాడికి ఏ మాత్రం నమ్మకం కాని, అభిమానం గాని.. తృప్తి గాని అక్కరలేదు... బిజినెస్ .. బిజినెస్ .. 
 
 
దీని వలన నలిగి పోతున్న సామాన్యులు  ఎందరో వున్నారు.. 
విద్య, వైద్యం..రోటి,కపడా..  మకాన్.. ఇలా  ప్రతిదీ కార్పొరేట్ అయిపోయి వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంటే ...  
ఉచిత ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల లోను అవి సరిగ్గా దొరక్క అల్లాడుతున్న అభాగ్యులు ఎంతో మంది వున్నారు.. .... 

ఎక్కడికి పోతున్నాం...  ఏమైపోతున్నాం..  


Monday, March 4, 2013

లోకంలో కెల్లా ఒక ఉత్తమ కావ్యం.. గొప్ప యోగ శాస్త్రం ...
 మాజీ ముఖ్యమంత్రి . డా. రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు మా విశాఖ లో ఏ వీధి కెళ్లినా.. ఓ టెంట్ వేసి.. ఆయన ఫోటోకి దండ వేసి అలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఘంటసాల వారి "భగవద్గీత" ను  స్పీకర్ల ద్వారా వినిపిస్తూనే వున్నారు.. 
నా మనస్సు చివుక్కుమన్నది.. 
ఎవరు ఎప్పుడు ఏలా జనాల మెదళ్ళలో నాటారో గాని ఎవరనా చనిపోయినప్పుడు వెంటనే భగవద్గీత రికార్డు వేయడం .. 
మా చిన్న తనంలో రోజూ గుడిలో సాయంత్రం భగవద్గీత రికార్డు వేసేవారు.. పిల్లలకి భగవద్గీత అన్ని శ్లోకాలు పారాయణం చేయించి వారిలో పోటీలు కూడా పెట్టే వారు..

 

లోకంలో కెల్లా  ఒక   ఉత్తమ కావ్యం, గొప్ప  యోగ శాస్త్రం ...  
మనిషి ఉన్నతుడిగా ఎలా బతకాలి.. 

సుఖ: దు:ఖాదుల యందు గాని రాగ ద్వేషాదుల యందు గాని ఆపేక్ష లేక ఏ వస్తువు పైన అనురాగము, మోహం  పెంచు కొనక, నిరంతర అభ్యాస, వైరాగ్యములను కల్గి వుండి పరోప కారమే ఈ జీవితానికి  పరమార్ధమని తెలుసుకుని మనసు పరమాత్మ పైన లగ్నం చేసి, సదా కర్మలను ఆచరించి తద్వారా వచ్చే కర్మ ఫలములని ఆశించక చివరకు మోక్ష సాధన దిశగా అడుగు వేయుటకు ఉపకరణ సాధనమే ఈ భగవద్గీత.. 

ఒక విధంగా ఈ తప్పు సినిమా వాళ్ళది తదనంతరం నాటకాల వాళ్ళది... చనిపోయిన వారిని చూపిస్తూ వెంటనే "వాసాంసి  జీర్ణాని యథా విహాయ.. " అనే శ్లోకం వినిపించి.. 
"పుట్టిన వానికి మరణము తప్పదు.. మరణించిన వారికి జన్మము తప్పదు.. అనివార్యమగు ఈ కార్యము గురించి శోకింప తగదు" అని ఎంతో గంభీరంగా సాగే ఘంటసాల వారి ఈ ఒక్క శ్లోకాన్ని అనేక సినిమాలు, నాటకాల్లో వాడేరు.. 
దాంతో జనానికి  కేవలం ఎవరైనా  చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత చదవాలనే ఒక అపోహ నాటుకుపోయింది.. 

మనం చనిపోయిన తర్వాత ఎవరో భగవద్గీత చదివితే మన  ఆత్మ శాంతించదు.. మనం బతికి వుండగానే భగవద్గీతను చదివి అర్ధాన్ని తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తేనే పరమాత్మ మన ఎడల కనికరించి ఇహ లోక పర లోక సౌఖ్యాన్ని ఇస్తాడు అని నమ్మకం .. 

ఇంచు మించు  అన్ని మతాల సారం ఇంతే...మందుల  కంపెనీ , లేబుల్ మారినా లోపల కెమికల్  పదార్ధం ఒకటే అన్నట్టు.. పరాయి మనిషిని చంపమని, ఇతర మతస్థులని దూషించమని ఏ మత గ్రంధము లోను వుండదు.. 

సకల జీవ రాశి కోటి లోను పరమాత్మను మాత్రమే దర్శించమని చెప్తుంది గీత.. 
అమృతం తాగ కుండానే దాని రుచి ఎలా వుంటుందో తెలియదు.. అలాగే భగవద్గీత పూర్తిగా చదవకుండా ఎవరో రాసిన రాతలకో వాఖ్యానాలకో ప్రభావితమయి ఒక మంచి మానవ వనరుల  అభివృధ్ధి  శాస్త్రమైన "భగవద్గీత"ను నిర్లక్షం చేస్తున్నారు.. 

 కనకనే నేడు కోట్ల కొద్ది అవినీతి ధనాన్ని పాలకులు పోగుచేసుకుంటున్నారు.. జనాలు కూడా ఎవరు మంచి, ఎవరు చెడు అన్న బేధాలను మరచి చెడ్డ వారిని మరల మరల ఎన్నుకుని ధన ప్రభావానికి లోనయి, విలువైన ఓటుని దుర్వినియోగం చేస్తున్నారు.. అనేక కంపెనీలు తమ మానేజ్ మెంట్ కోర్సుల్లో భగవద్గీతను చేర్చి వున్నత శిఖరాలను చేరుకుంటున్నారు..సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయం చేస్తున్నారు..  


పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడుగాని, ఏ విషములో నైనా ఓడినట్టు భావించి.. మనసు వికలమై ఇక చావే శరణ్యమని తోచినప్పుడు గాని..నైరాశ్యం లో కొట్టు మిట్టాడుతున్నప్పుడు గాని రోజూ భగవద్గీత పారాయణం చేసి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది.. అలాగని ఆనంద సమయములో చదవ వద్దని కాదు.. 

గీతా పారాయణానికి నిర్ధిష్ట కాల, వయో పరిమితి లేదు.. 
 

ఎవరు ఏ సమయములో నైనా చదవ వచ్చు.. పావన గంగను దోసిలి నిండా గ్రోల వచ్చు..   
గురజాడ వారు కన్యాశుల్కం లో చెప్పినట్టు భగవద్గీత చదివితే ఒక గొప్ప స్నేహితుడు తప్పక దొరుకుతాడు..      

సర్వే జనా సుఖినో భవంతు.. ఓమ్.. శాంతి:..శాంతి: శాంతి:

Sunday, March 3, 2013

బ్లాగు లందు మంచి బ్లాగులు వేరయా .. విశ్వ దాభి రామ వినుర బ్లాగోడా.. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు.. బ్లాగు లందు మంచి బ్లాగులు వేరయా .. విశ్వ దాభి రామ వినుర బ్లాగోడా.. 
నేను "జల్లెడ" లో తెలుగు బ్లాగు లని ఓపెన్ చేసి చదువుతాను కాబట్టి మిగిలిన సైట్ లో బ్లాగుల సంగతి నాకు తెలీదు.
నిజానికి బ్లాగు మిత్రులంతా తమ శక్తి మేరకు చాలా బాగా రాస్తున్నారు.. కాని  క్రమం తప్పకుండా ప్రచురించే బ్లాగుల మీద నాకున్న అభిప్రాయాలు రాస్తున్నాను..ఇది మిగిలిన వారిని తక్కువ చేసే ప్రయత్నం కాదు..  తప్పులుంటే పెద్దలు క్షమించండి.. 
నాకు నచ్చిన బ్లాగులు:
1. శ్రి. కంది శంకరయ్య గారి "శంకరాభరణం" - క్రమం తప్పకుండా కనీసం రెండ్రోజులకు ఒక సమస్యని మన ముందు వుంచి పూరించమని కోరతారు.. పద్యము మన తెలుగు వారికి మాత్రమే సొంతం..
పద్యం రాసే పరిజ్ఞానం అందరికీ వుండదు (ఈ అర్భకుడుకి కూడా లేదు)..కాని ఈ బ్లాగుని ఫాలో అయి పూరించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వుండటం విశేషం .. ఈ పద్యాలు చదువుతూ వుంటే.. 
తేనె లొలుకు తెలుగు భాష తియ్యదనం.. చమత్కార పద విన్యాసం..ఓహ్ .. అద్భుతం, అమోఘం ...  
ఈ బ్లాగు మన తెలుగు బ్లాగు ప్రపంచానికే తలమానికం...మాష్టారూ.. మీకు శతకోటి వందనాలు.. 

2. డా. పూర్ణచందు గారి  ఆరోగ్య విషయాలు.. ఎన్నో వ్యాధుల గురించి మనకు తెలియని విషయాలు వివరించి  .. చక్కని పరిష్కారాలు సూచిస్తారు.. వివిధ రోగాలపై మనకున్న అనుమానాలు, అపోహలు నివృత్తి అవుతాయి.. మంచి విషయాలు రాస్తున్నారు... డాక్టర్ గారూ జోహారులు.. 

3. నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు.. - కంప్యూటర్ పరిజ్ఞానం పై అనేక విషయాలు చాలా కష్టపడి వీడియో ద్వారా చక్కగా తెలుగులో మనకి అర్ధమయ్యే సరళ భాషలో అందిస్తున్నారు.. చాలా విషయాలు మనము  తెలుసుకుని తద్వారా కంప్యూటర్, మొబైల్ లో ఏ ఫీచర్స్ ఎలా వాడొచ్చో సోదారహణంగా వివరించే విధానం బావుంటుంది... శభాష్ నల్లమోతు గారు.. 

3. శ్రి. దుర్గేశ్వర  గారి "హరి సేవ" - ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు.. సేవా కార్యక్రమాలు ..ఫొటోలతో సహా ప్రచురించి ఆధ్యాత్మిక లోకంలో విహరింప చేస్తారు.. కొద్ది సేపేనా ఆ భగవంతుని సేవలో విహరించు వున్నట్లు వుండే ఈ బ్లాగు తెరవగానే కనిపించే  ఆ శ్రీనివాసుని ఫొటొ మనల్ని  తరింప చేస్తుంది.. దుర్గేశ్వర  గారు.. కృతజ్ఞతలు.. 

4. శ్రీ ఫణి బాబు గారి "బాతాఖాని -  లక్ష్మిఫణి కబుర్లు" - ఈ వయసులో ఎంతో శ్రమ కోర్చి అపారమైన అనుభవాలను మనకి పంచి ఇస్తూ, నేటి సమకాలిన వ్యవస్థ పై వ్యంగ్య భాషణాలు, జీవితం లో ఎదురయిన  సమస్యలు చక్కటి తెలుగు భాషలోను.. అక్కడక్కడ పూనా హిందీ లోనూ (హిందీ కి పూనా హిందీ, కలకత్తా హిందీ అని వేరుగా వుంటాయా..) అంటే భావం (ఎక్క్స్ ప్రెషన్ )  వేరుగా వుంటుందని 
నా భావం.. 
చదువున్నంత సేపూ ఆర్.కే లక్ష్మన్ గారి సామాన్యుడి  ఘోష లాగ వుంటుంది.. ఫణి బాబు (బాబాయి) గారికి మనపూర్వక అభినందనలు.. అభివాదాలు.. 

5. శ్రీ. యారానా గారి "పనిలేక" బ్లాగు సమ కాలీన సమస్యలపై  చక్కటి హాస్య ధోరణి లో, విమర్శనాత్మక విసుర్లు...  సరస సంభాషణలు.. ప్రతీ వారినీ ఆలోచింప చేస్తాయి.. ఆదివిష్ణు గారి రచనలను తలపిస్తాయి..కృతజ్ఞతాభి వందనాలు..  

6. anrd గారి : "aanamdam" ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తారు.. తెలియని పురాణ కధలు ఎన్నిటినో వివరిస్తారు.. చదువున్నంత సేపూ పరమాత్ముని ఎడల భక్తి... మన దేవుళ్ళ మీద విశ్వాసం కలిగేలా చేసి.. మనసుని రీచార్జ్ చేస్తుంది.. పేజి మీద నున్న ఆకుపచ్చని సీనరీ కట్టిపడేస్తుంది... అభినందన మందార సుకుమారాలు.. 

7.  శ్రి.సూర్యనారాయణ గారి "ఘంటసాల" బ్లాగు నా కిష్ట మైన బ్లాగులో ఒకటి.. ఘంటసాల మాష్టారు అంటే ఇష్టపడని తెలుగు వారు వుండరేమో ..  ఒకవేళ వుంటే వాడు తెలుగు వాడు కాదు.. అసలు మనిషే కాదు.. తెలుగు చిత్ర సీమ లో "ఘంటసాల" అనే మధుర గాన గంధర్వుడు పుట్టడం, తన గానామృతాన్ని మనకి ఇచ్చి పరమాత్మునికి తన పాటల ద్వారా ఆనందింప చేయడానికి స్వర్గ లోకంలో విహరిస్తున్న ఆ మహానుభావుణ్ణి స్మరించని జన్మ జన్మ కానే కాదు.. అటువంటి మహానుభావుని అద్భుత పాటలను కొన్నిటిని మనకి పరిచయం చేస్తున్న శ్రీ సూర్య నారాయణ గార్కి సహస్ర కోటి అభివందనాలు.. 

8. శ్రీమతి  వనజ గారి  "వనజ వనమాలి" - మంచి బ్లాగుల్లో ఒకటి .. మనసులో అనుకున్నది ఎటువంటి భేషజాలు లేకుండా, నిత్యం జరిగే అనుభావాలను పంచుకుంటూ తన దైన శైలి లో చక్కగా రాస్తారు.. 
ఒక అమ్మ, ఒక చెల్లి, మనతో మాట్లాడితే ఎలా వుంటుందో ... అలాగే వుంటుంది  .. బ్లాగులో బొమ్మలు బావుంటాయి..ముఖ్యంగా పాదం బొమ్మ చూస్తూ వుంటే ఎన్నో భావాలు కదుల్తాయి... నిజంగానే ఒక అమాయకపు ఇల్లాలు తనకు తెలియని ప్రపంచం వేపుకి గడప దాటి వెళ్తున్నట్టు.. ఒక కొత్త లోకానికి ఓ అడుగు ముందుకి వేస్తున్నట్టు ... ఇంకా ఏవేవో భావాలు... చక్కటి పాద ఆకృతి .. స్త్రీకి మాత్రమే సొంతం... తియ్యటి పద ఆకృతి ఈ బ్లాగు కి మాత్రమే సొంతం.. 
9. "మీ కోసం" బ్లాగు లో వివిధ రకాల అంశాలపై చక్కటి  ఫొటోలు, వీడియోలు పెట్టి మనలని అలరిస్తున్నారు.. మనము  చూడని, చూడలేని  ప్రదేశాలు, వైవిధ్య మైన ఫొటొలు.. విశ్లేషణలు మనకి అందించి చక్కటి పరిజ్ఞానాన్ని అందిస్తునారు.. వారి శ్రమకి, పరిశీలనకి అనేక శుభ అభినందనలు.. 

( ఈ రోజుకి ఇవి చాలు.... .ఇవి "A" గ్రేడు బ్లాగులు నా దృష్టిలొ మాత్రమే....   నచ్చినవి ఇంకా వున్నాయి..తరవాత రాస్తాను..  ..  అన్నట్టు నచ్చనివి కూడా వున్నాయి.. కాని వారి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అలాంటి వారి గురించి చర్చించడమే కూడదు అని నా అభిప్రాయం.. )