Tuesday, April 30, 2013

భిన్నత్వంలో ఏకత్వం అంటే మా విశాఖ మాత్రమే..


భిన్నత్వంలో ఏకత్వం అంటే మా విశాఖ మాత్రమే.. 
మా (మన) విశాఖపట్నం లో "కంచరపాలెం" అను ప్రాంతం ఉంది.. చాలా మందికి తెలిసే వుంటుంది.. నేషనల్ హైవే తాటిచెట్ల పాలం జంక్షన్ క్రాస్ అయిన తర్వాత నుండి సుమారు కిలోమీటరున్నర మేరా పొడవుతో రైల్వే పట్టాలు వరకూ వున్న స్థలం .. 
ఇటు జ్ఞానాపురం .. అటు మర్రిపాలెం, తూర్పున రైల్వే క్వార్టర్స్ ఉత్తరాన హైవే ... అయితే ఏమిటి గొప్ప ? అని మీకు సందేహం రావచ్చు.. 


సదరు కంచరపాలెం మూడు పేరులతో పిలువ బడుతుంది.. 1. గొల్ల కంచరపాలెం, 2. గవర కంచరపాలెం, 3. రెడ్డి కంచరపాలెం.. 
పేర్లను బట్టే మీకు అర్ధం అయ్యింది అనుకుంటా.. ఆయా ఏరియాల్లో ఆయా కులస్తులు ఎక్కువగా  నివసిస్తారని.. 
కంచరపాలెం ని ఆనుకుని హైవే రోడ్డుకి కుడిపక్క ఒక కొండ కనిపిస్తుంది.. ఆ కొండ చుట్టూ కొండ పైన అనేక ఇళ్ళు కనిపిస్తాయి.. ఇక్కడ బర్మా వాళ్ళు (బర్మా కాంప్) , నిమ్న జాతి కులస్తులు, కన్వెర్టెడ్ క్రిస్టియన్ లు ఎక్కువగా కనిపిస్తారు.. ఒకప్పుడు "మాల కొండ" (క్షమించాలి) అనేవారు.. 
ఇప్పుడు అనేక నగర్లు పుట్టుకుని వచ్చాయి.. ఇక పోతే జ్ఞానాపురం అంతా కన్వెర్టెడ్ క్రిస్టియన్ ల ప్రాబల్యం ఎక్కువ.. 
ఇక వైజాగ్ లో మిగిలిన ప్రాంతాలని తీసుకుంటే వన్ టౌన్ ఏరియాలో ముస్లిములు, కోమటివారు (వైశ్యులు)  ఎక్కువగా వుంటారు.. అలా ముందరికి వస్తే రెల్లి వీధి, జాలరి పేట వున్నాయి.. వీటి గురించి కూడా మీకు అర్ధం అయ్యే వుంటుంది.. 
ఇక సీతమ్మ ధారా నార్త్ extension రాజుల ప్రాబల్యం ఎక్కువ.. ఇప్పుడున్న సత్యం కూడలి జంక్షన్ వద్ద రెడ్డి కులస్తులు ఎక్కువ... 
ఇకపోతే మురళి నగర్, మాధవధార ప్రాంతాల్లో కాళింగులు ఎక్కువగా వుంటారు... 
సీతమ్మ పేట, అక్కయ్య పాలెం ఏరియాల్లో గొల్ల(యాదవ)  కులస్తులు ఎక్కువగా కనిపిస్తారు.. 
ఎండాడ ఏరియాలో ట్రైబల్ (షెడ్యూల్ తెగల) వారు ఎక్కువగా ఇళ్ళు కట్టుకుని వున్నారు... 
ఇప్పుడు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల్లో వున్నా ఇప్పటికీ పై ఏరియాల్లో ఆయా కులాల వారి ఆధిక్యత కనిపిస్తుంది.. 
ఇన్ని రాసిన వాణ్ణి బ్రామ్మల గురించి రాయలేదు కదూ.. ఒకప్పుడు వన్ టౌన్ జాలరి పేటకు, కనకమహాలక్ష్మి గుడి కి మధ్య ఏరియాలోనూ, ద్వారకానగర్, మధురానగర్(శంకరమఠం ఏరియా) , లలితానగర్ ఏరియాల్లో బ్రాహ్మలు ఎక్కువగా వుండే వారు.. అయితే రాను రాను ఇళ్ళన్ని అమ్మివేసినందువల్ల ఈ మూడు ఏరియాల్లో పెద్దగా లేరు.. 
ఇకపోతే విశాఖ పట్నం జిల్లాలలో సబ్బవరం, పరవాడ, అత్యుతాపురం వంటి గ్రామాల్లో వెలమ కులస్తులు ఎక్కువ. 
ఇంత పెద్ద మహా నగరం ఇలా కులాల వారీగా ఎందుకు పంచుకున్నారు? అన్న సందేహం మీకు రావచ్చు.. 
రెల్లి వీధి, జాలరి పేట సహజసిద్దం గా సముద్రానికి దగ్గరగా వున్న ప్రాంతం కాబట్టి అలా ఏర్పడవచ్చు.. కాని ఒకప్పుడు మహారాణి పేట వరకే వున్న నగరం రాను రాను అభివృధ్ధి చెంది అనేక పరిశ్రమలు, షిప్ యార్డ్, పోర్టు, నావల్, బి.ఎహ్.పి. వి, కోరమండల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు మరియు పరిశ్రమలలో పనిచేయడానికి అనేక మంది చుట్టుపక్కల జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ, కృష్ణా జిల్లాల నుండి అనేక మంది.. ఇక్కడ నివసించడానికి అద్దె  ఇళ్ళ కోసం నగరమంతా తిరిగేవాళ్ళు.. 
కొత్త వారికి ఇళ్ళు ఇచ్చే వారు కాదు.. పైగా కులం, గోత్రం అడిగి మరీ ఇల్లు ఇచ్చేవారు.. అందువల్ల ముందుగా ఒక కులానికి చెందిన ఒక వ్యక్తీ లేదా కొంతమంది వ్యక్తులు ఆక్యుపై చేసిన ఏరియాలో మిగిలిన సమ కులస్తులు చేరుకునే వారు.. 
ఒకే కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు "మన వాళ్ళు ఫలానా ఏరియాలో వున్నారు" అని " అక్కడైతేనే మనవాళ్ళు సహకారంతో హాయిగా వుండ వచ్చని"- రాను రాను ఏరియాలని కులాలను బట్టి పంచుకుని ఇలా ఇప్పటికీ కులాల పేరుతోనే మనుగడ సాగిస్తున్నాయి. 
అంతే కాదు చిన్న కార్పొరేట్ ఎన్నికలు నుండి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇక్కడున్న కుల పెద్దల సహకారం తోనే ఎవరైనా గెలిచేది.. 
వన్ టౌన్ ఏరియాలో,  కంచరపాలెం లో, మద్దిలి పాలెం ఏరియాలో , జ్ఞానాపురం ఏరియాలో ఎక్కడ చూసినా అన్ని ఇరుకు ఇరుకు సందులు కనిపిస్తాయి .. కనీసం స్కూటర్ కూడా వెళ్ళదు. కాని మా మనస్సులు మాత్రం ఇరుకు కాదని ఇప్పటికీ నిరూపించుకుంటున్నారు విశాఖ వాసులు.. 
ఇన్ని కుల, మత, జాతుల కలగలసి వున్నా ఎప్పుడూ కూడా కులాల, మతాల మధ్య గొడవలు కాని, విద్వేషాలు కాని లేకుండా ఒకరిని ఒకరు ఎంతో గౌరవించు కుంటూ , చక్కటి ప్రశాంత మైన వాతావరణం లో జీవిస్తారు ఇక్కడి ప్రజలు.. 
ఒక బాబ్రీ మసీదు కూల్చినప్పుడు కాని, ఇందిరా గాంధి చనిపోయినప్పుడు గాని, దేశమంతా గొడవలు అల్లర్ల తో అట్టుడుకి పోయినా విశాఖ మాత్రం ప్రశాంతంగానే వుంటుంది.. 
ఇక్కడి ప్రజలు సంయమనం పాటిస్తూ సహనంతో వుంటారు.. అందుకే అనేక వున్నత అధికార్లు (కలెక్టర్, పోలీస్ కమీషనర్లు) లాంటి వారు విశాఖలో పనిచేయడానికి ఇష్ట పడతారు.. 
విశాఖను విడిచి వెళ్ళడానికి ఇష్ట పడరు.. నగరంలో శాశ్వతంగా ఇల్లు కట్టు కోవాడానికి ప్రయత్నిస్తారు.. 

నాకు తెలిసిన విషయాలు రాసాను.. ఇది ఎవర్నీ తక్కువ లేదా ఎక్కువ  చేసినట్టు కాదు.. కులాల మధ్య అంతరాలు లేకుండా చేయ్యనక్కర లేక పోయినా ఇలా ఎవరి కులాలను వారు వుద్దరిస్తూనే ఇతర కులాల వారిని ప్రేమిస్తేనే నిజమైన భారతీయులం.... తప్పులుంటే క్షమించవలెను..  
 
 

Saturday, April 27, 2013

అల్లు... ది గ్రేట్ ... హాట్స్ ఆఫ్ టూ యూ మనకున్న నటుల్లో విశిష్ట, విలక్షణ నటుడు శ్రీ అల్లు  రామలింగయ్య గారు.. 
హాస్య నటనకు సిసలైన అర్ధాన్ని తెలియచేసిన వాడు. ఆయన పాత్రల ద్వారానే కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి అన్నదానిలో ఏ మాత్రం సంకోచం లేదు...

మాయాబజార్ నుండి  యమగోల, ముత్యాలముగ్గు, శంకరాభరణం వంటి హిట్ చిత్రాలు ప్రధాన పాత్రల కన్నా మించి తనదైన మార్కు హాస్యాన్ని పండించి చిత్ర విజయం లో ప్రధాన భూమికను వహించారు. 
కస్తూరి శివరావ్, రేలంగి ల తర్వాత చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నది అల్లు  మాత్రమే.. 
1. మాయా బజార్ లో వంగర వారి తో బాటు "శర్మా!" అని వారంటే "శాస్త్రీ" ! అంటూ వీరిద్దరూ  గింబళి  ఘట్టాన్ని కడు గొప్పగా నవ్వులు పూయించి ధియేటర్ లో అలజడి సృష్టించారు. 

2. యమగోల లో చిత్రగుప్తుని పాత్రలో "తాళం వేసితిని .. గొళ్ళెం మరిచితిని" అంటూ అమాయకంగా పలుకుతూ నవ్వించడమే కాక సబ్బుని చాక్ లేట్ అనుకుని తినెయ్యడం... యముణ్ణి తన పిచ్చి సలహాలతో మరింత గందరగోళానికి గురిచేయడం ... హై లైట్ 

3. ముత్యాలముగ్గు సినిమాలో మన అల్లు గారు అసాధారణ మైన ప్రతిభను చూపారు.. కోతి కరిచిన తరువాత తనలో  కోతి లక్షణాలు  సంక్రమించి అచ్చం కోతి లాగే అభినయించడం నిజంగా అంత వరకూ    ఏ నటుడు చేయని చిత్రాతి చిత్రమైన చేష్టలు ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూసారు.. దీన్ని నేటి నటులు కాపీ కొట్టాలని చూసినా సాధించలేకపోవడం ఆయన విలక్షణమైన నటనకు మచ్చుతునక... 

4. శంకరాభరణం సినిమాలో నటించింది ఎవరయ్యా అంటే ఒక్క అల్లు మాత్రమే ... జె.వి సోమయాజులు గారికి పెద్దగా డైలాగ్స్ లేవు.. అట్లా కూర్చునో నించునో సీరియస్ గా చూస్తూ వుండటమే, మంజు భార్గవి కూడా కేవలం ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే చాలు.. 
కాని అల్లూ గారిది అలా కాదు.. తన క్లయింట్ వచ్చినప్పుడు (పోయిందే పార్టీ పోయింది.. ) అన్న సీను లోను, గదిలో సోమయాజులు గారు లేరనుకుని కుర్రాడితో బీరాలు పలికినప్పుడు (రానీవోయ్.. నాకేం భయమా... అని) తీరా తన వెనకే వున్న సోమయాజులు గార్ని చూసి తడబడుతూ ఆయన్ని కన్నడ కచేరికి ఒప్పించడం..  
 
తమతో సోమయాజులు గారి కూతుర్ని అన్నవరం పంపమని అడిగే సీను లోను, పెళ్లి చూపుల సీన్ ఆఖరు లో సోమయాజుల గార్ని కడిగి పారేయడం లోను, ప్రతీ అక్షరం స్పష్టంగా పలుకుతూ విలక్షణ మైన నటన చూపారు... 

ముఖ్యంగా చాలా సినిమాల్లో రావుగోపాల రావు గారికి (విలన్ కి) అసిస్టెంట్ గా అమోఘమైన కాంబినేషన్ ఎన్నో చిత్రాల్లో అందించారు.. 
ఆయన నటనలో అమాయకత్వం తో కూడిన గడుసుదనం, విలన్ వెనకాలే ఉంటూ  చెడ్డపన్లకి సహాయం చేస్తున్నా ఆ పాపం లో తనకి ఏమాత్రం సంబంధం లేని విధంగా ఆఖర్న మిగిలిపోతారు.. 
 
ఒక సినిమాలో (పేరు గుర్తులేదు).. బియ్యం లోడుతో వున్న బండి తోస్తూ మండుటెండలో అలా నిలబడే చనిపోతారు. ఆ సీన్ ఇప్పటికీ మర్చిపోలేను... 

ఈయన ఎంత గొప్ప ప్లానింగ్ గల వ్యక్తి  అంటే కొడుక్కి నిర్మాణ రంగాన్ని అప్పచెప్పి ఇవాళ కోట్ల రూపాయలకి చేరేలా తన వారసులని నిలబెట్టారు.. 

మనవూరి పాండవులు సినిమా లో ఒక చిన్న పాత్ర ద్వారా పరిచయం అయిన చిరు లోని కార్య దీక్షతను, పట్టుదలను గ్రహించి.. భవిష్యత్తులో ఆయన వున్నత శిఖరాలకు చేరగలడు అని ఆరోజే వూహించి వారి అమ్మాయిని చిరుకి ఇచ్చి వివాహం చేసి ఒక మంచి అల్లుణ్ణి అల్లు గారు కొట్టేసారు.. 


ఇవాళ ఆయన కుటుంబం లోని మూడో  తరం  వాళ్ళు ఇద్దరు మేటి హీరోలుగా వెలుగొందుతున్నారు.. ఇదంతా ఆయన చలవే.. ఆయన ఆశీస్సులే... కాదంటారా.. 
 
అల్లు...  ది గ్రేట్ ... హాట్స్ ఆఫ్ టూ యూ 

Tuesday, April 23, 2013

ఎక్కడికి దారిదీస్తాయి ఈ వేర్పాటు భావాలు..

ఇప్పుడు ఒక కొత్త నినాదం తో వివాదాన్ని మరింత ఉదృక్తం చేస్తున్నారు తెలంగాణ వాదులు అనబడు వేర్పాటు వాదులు.... 


ఇన్నాళ్ళూ బయ్యారం ఇనుప ఖనిజాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ కి పాత పాలకులు దాఖలు చేసిన దాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ కంపెనీకి కొంత వాటా ఇస్తే దాన్ని రాద్దాంతం చేసి ప్రాంతీయాల మధ్య చిచ్చు పెట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజల్ని రెచ్చ గొడుతున్నారు.. 
కారణం వి.ఎస్.పి ఆంధ్రా ప్రాంతం లో వుండటమే.. స్టీల్ ప్లాంట్ తెలంగాణా ప్రాతంలో వుండాలనే కోరిక సమంజసమే అయినా అది ఇప్పటి కిప్పుడు సాధ్యమయే సాధనమా.. 

విశాఖలో స్టీల్ ప్లాంట్ రావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? ఎన్ని ఉద్యమాలు నడిచాయి.. ఈ స్టీల్ ప్లాంట్ లో ఒక్క విశాఖ వాళ్ళు మాత్రమే కాదు దేశం లో అన్ని ప్రాంతాల వాళ్ళు , విదేశాల వాళ్ళు కూడా పనిచేస్తారు.. కొన్ని క్లాస్ 3 మరియు క్లాస్ 4 జాబ్ లు మాత్రమే స్థానికులకు అవకాశం ఇస్తారు గాని ఇంజనీర్లు, వున్నత అధికార్లు చాలా మంది  ఇతర ప్రాంతం వాళ్ళు  వుంటారు..విద్యార్హత, సాంకేతిక పరిజ్ఞానం కల వాళ్ళని సెలక్ట్ చేస్తారు.. 

అప్పుడు మళ్లి ఈ వేర్పాటు వాదులు తెలంగాణా కాని వాళ్ళకి ఇక్కడ వుద్యోగాలు ఇవ్వకూడదు అని పట్టు పడితే ప్లాంట్ ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళదు.. 
బయ్యారం గనులు స్వప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులకి కట్టపెట్టినప్పుడు గొంతు విప్పని నాయకులు ఇప్పుడే కళ్ళు తెరిచినట్టు మాట్లాడ్డం ఎంత వరకూ సమంజసమో ఆలోచించాలి.. 
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తయారయిన ఇనుప పరికరాలు దేశ విదేశ మార్కెట్ లోకి వెళుతుంది. ఆ లాభం రాష్ట్ర, దేశ ఖజానాలోకి వెళ్తుంది.. ఏ ఒక్కరి జేబు లోకి వెళ్ళదు.. బొగ్గు ఏ విధంగా సింగరేణి నుంచి దేశములో ఉన్న అన్ని ప్రాంతాలకి వెళుతుందో అలాగే ఇది కూడా.. బొగ్గుని కూడా ఇతర ప్రాంతాలకి తరలించ కుండా తెలంగాణాలోనే ఖర్చు చేసేలా ఫాక్టరీలు కట్టగలమా? 

అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే ఇనుప ఖనిజాల్ని సృష్టించ గలమా ?.. మరి వరి, కూరగాయలు మొదలగునవి  పండించే వారు తెలంగాణా ప్రాంతానికి అవి సప్లై చెయ్యక పోతే తిండానికి తిండి దొరకదు కదా..

ఎక్కడికి దారిదీస్తాయి ఈ వేర్పాటు భావాలు.. 


ఆఖరుకి సామాన్య ప్రజలు రెండుగా చీలి పోయి కొట్టుకుంటూ వుంటే నాయకులు మాత్రం ఏ.సీ ఫార్మ్ హౌస్ లలో సేద తీరుతూ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించి కోట్లు సంపాదిస్తున్నారు. ఇహ దీనికి అంతం ఎక్కడ?  

Monday, April 22, 2013

రావణ కీచకులు సిగ్గు పడుతున్నారు...

నిన్న ఆదివారం కాబట్టి... మధ్యాహ్నం రెస్ట్ దొరికింది కాబట్టి.... రాత్రి  త్వరగా నిద్రపట్టక ఐ.పి.ఎల్ మాచ్ చూద్దామని కూర్చున్నా.. 
ఎర్ర బట్టల వాళ్ళకి, నీలం గుడ్డల వాళ్ళకి జరుగుతోంది.. 11 వ పంజాబి రాజులకి , పూణే సైనికులకి (వారియర్స్) మధ్య యుద్ధం అట..
అసలు ఈ టైటిల్స్ అనగా జట్టులకి పేర్లు ఇలా ఎందుకు పెట్టారో తెలీదు.. 
సాధారణంగా పంజాబ్ జట్టు అంటే ఆ జట్టులో ఆటగాళ్ళు అంతా పంజాబీలే అవ్వాలి.  
బెంగుళూర్ జట్టులో కర్నాటక వాళ్ళూ, చెన్నై లో తమిళులు ఉండాలి.. 
కానీ కేవలం పేర్లు మాత్రమే సిటీల పేర్లు తగిలించి మళ్ళి వాటికి మరొకటేదో తగిలించి - కింగ్ ఫిషర్ వాళ్ళూ స్పాన్సర్ చేస్తున్నారు  కాబట్టి కింగ్ ఎలెవన్ అట.. 
విమానాలు దగ్గర నుండి మద్యపానం వరకు మార్కెట్ రంగం లో వున్న సదరు కంపెనీ వాళ్ళు ఇలాంటి కోట్ల టర్నోవర్ గల మరికొన్ని కంపెనీల తో కలసి, మరిన్ని కోట్లు పోగుచేసుకోవడం కోసం ఎన్నో  కోట్లు ఖర్చు పెట్టి పందెం కోళ్ళని కొనుక్కుని ఐ.పి.ఎల్ అను ముద్దు పేరు పెట్టి, అధికారికంగా జూద క్రీడని నిర్వహిస్తున్నారు.. 
వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రసార హక్కులు పొందడానికి కోట్లు సమర్పించాలి.  నిర్వాహకులు, క్రీడా మైదానాల వాళ్ళు, టీ.వీ ల్లో వాణిజ్య ప్రకటనల వాళ్లు, చీర్ గాళ్స్ ని ఎరేంజి  చేసే బ్రోకర్లు, ఇలా ఎంతో మంది ఎంతో డబ్బు లావాదేవీలు. 
పోలీసులు, మంత్రులు, క్రీడా అధికారులు వీళ్ళందరికీ చేతినిండా పని. సినిమా కేతి గాళ్ళు, వయ్యారి భామలు, కంపెనీల అధినేతల పెళ్ళాలు ఓహ్ సందడే సందడి.. 
ఎవరు ఎవర్ని స్పాన్సర్ చేస్తున్నారు, ఏ ఆట గాడు ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు పెద్ద కన్ఫ్యూజన్..  అయినా అంతా ఓకే కలర్ బట్ట కడతారు కాబట్టి ఫర్వాలేదు.. 
ఆడవాళ్ళు కూడా టీ చొక్కా, పంట్లాం వేస్తారు కాబట్టి గొడవే లేదు.. వీడు ఎప్పుడు సిక్సర్ కొడతాడా ఎప్పుడు వయ్యారి భామలు పొట్టి లాగూలతో గెంతుతారా అని చూసే వాళ్ళు కొంతమంది.. 

గ్లామర్ వున్న కంపెనీ ఓనర్  పెళ్ళామో, హీరోయిన్నో (అప్సరసలా) గెంతుతూ వుంటే మైదానం లో ఆట కన్నా పెవిలియన్ లో వినోదం ఎక్కువ ఆసక్తి ని కలిగిస్తోంది కొంతమందికి .. 
ఎవడు గెలిస్తే ఎవడికి కావాలి, ఓడితే ఎవడికి కావాలి ? రోమాలు నిక్కబొడుచుకుని చూడ్డానికి ఇదేమన్నా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మాచ్ కాదు కదా.. 
తెల్ల వాళ్ళు, నల్ల వాళ్ళూ తెలుపు నలుపు కలబోసుకున్న వాళ్ళూ  వారెవ్వా, ఏమి సామరస్యం ఎక్కడుందయ్యా వర్ణ విచక్షణం ? 
ఇరు   దేశాల మధ్య పోటీలు కాక ఇలా అన్ని దేశాల వాళ్ళు కలగలిపిన టీముల మధ్య పోటీలు వుంటే ప్రపంచ శాంతి ఆవిర్భవిస్తుంది.. కాని పాకిస్తాన్ వాళ్ళని వెలి వేసారట.. పాపం వాళ్ళేమి చేసారయ్యా .. 
అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళూ, జపాన్.....  చైనా వాళ్ళూ ఈ కిరికెట్టు ఆడరట.. మరి మనం ఆడటం మాత్రమే కాదు చూడ్డానికి ఇన్ని కోట్లు, సమయం వెచ్చిస్తున్నామే..
భారత దేశం పేద దేశమని, వెనకబడి వున్న దేశమని అన్న వాళ్ళు ఎవరు... చూడండయ్యా మా ఐ.పి.ఎల్ అనబడే కోడి పందాల్ని... లైవ్ టెలికాస్ట్ చూస్తూ ఎప్పటి కప్పుడు చేతులు మారే ధనలక్ష్మిని కనరయ్యా.. ఓడి పోతుందీ అనుకున్న టీమ్ తెలుస్తుంది.. గెలుస్తుందీ అన్న టీమ్ ఆఖరి ఓవర్లో బొక్క బోర్లా పడుతుంది.. ఆటగాళ్ళు కూడా దీనికి తమ వంతు కృషి తాము చేస్తారు(ట)..  
గంటలో, నిముషంలో లక్షాధికారులయ్యే అద్బుత అవకాశం అందరిదీ  .. 
ఇది ఒక్క  మన దేశం లొనే సాధ్యం.. 
నిముషానికి రెండు మానభంగాల రికార్డు కూడా మనదే... అబ్బా  ! మధ్యలో ఈ మానభంగాల గొడవేమిటయ్యా... ఇవి మనకేం కొత్తా... 
రామాయణ, భారతాలలో కూడా   వున్నాయి కదయ్యా ... 


మన సినిమాల వాళ్ళు కూడా మూతి మీద మీసాలు కూడా  రాని కుర్రాడికి, మొగ్గ లాంటి పసి దానికి ప్రేమ కథలు  తీసి చూపిస్తున్నారు.. "తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా.. " మనమే హిట్ కొట్టించాం .. 
దానికి తోడు పెద్ద కంప్యుటర్ మొదలు అరచేతిలో పట్టే సెల్ ఫోన్ లలో నెట్ వుండాలే కానిఎప్పుడు కావాలంటే  అప్పుడు , ఆలు మగల మధ్య వుండవలసిన పవిత్ర బంధాన్ని -   వావి వవరసలు లేని పరిమితులు లేని అసాధరణ రీతిలో జరిగే కార్యకలాపాలని పిల్లా, పాప తేడా లేకుండా అందరూ వీక్షించే వసతి కల్గిన జనరేషన్ ఇది.. 
స్నేహానికి, బంధుత్వానికి విలువలేని కాలం.. పసి పాపాయని కూడా కామంతో చూసే దుష్టులు వున్న కాలం.. కీచకుడు, రావణుడు కూడా సిగ్గు పడే అంత నీచులు వున్న దేశం...

ఎవరు ఎవర్ని మర్డర్ చేస్తే మనకేం, మానభంగం చేస్తే మనకేం ....  హాయిగా ఐ.పి.ఎల్ చూద్దాం .. బెట్టింగ్ పెడదాం... మందువేద్దాం .. కనబడ్డ ఆడదాన్నల్లా రేప్ చేసేద్దాం .. పబ్లిసిటి వస్తుంది.. మీడియా కవరేజ్ ఎలాగూ వుంటుంది..నిరంతర టీవీ వార్తా చానళ్ళ వారికి పండగ..  మన వీరత్వాన్ని దేశ ప్రజలంతా చూస్తారు.. ఎన్ని వెధవ పన్లు చేసినా శిక్షలు వేయలేని కొజ్జా పాలకులు ఉన్నంత కాలం మస్తు ఎంజాయ్ చేద్దాం.. 

 

ఇంత స్వతంత్రాన్ని ఇచ్చిన సమర యోధులకీ జై.... 

Wednesday, April 17, 2013

కేకు మిత్రా.. నమో.. నమ:

నా ముందరి టపా కి చక్కటి వాఖ్యలు పెట్టిన పాఠకులిచ్చిన  ప్రోత్సాహంతో  ఈ పోస్ట్ రాస్తున్నాను.. 
 అవి నేను 7 వ తరగతి చదువుతున్న రోజులు..
నా పక్కన కూర్చునే ఒక అబ్బాయి రోజూ మధ్యాహ్నం క్లాసులు ఎగ్గోట్టే వాడు.. అసలు అంత మంది వున్న క్లాసులో ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అన్న విషయాలు ఎవరూ పట్టించుకోరు.. ఎవరి గోల వాళ్ళది.. 
కాని క్రమం తప్పక రోజూ మధ్యాహ్నం ఎగ్గొడుతున్నాడు కాబట్టి ఒకరోజు అడిగా "ఎందుకు రోజూ మధ్యాహ్నం పూట రావట్లేదు ?"  అని .. 
దానికి అతడు ఇచ్చిన సమాధానం విని నాకు మతిపోయింది.. "నేను రోజు మధ్యాహ్నం ఒక బేకరీ లో పని చేస్తాను" అని.. అదేవిటి బేకరీ లో పని చెయ్యడమేమిటి ఇంత చిన్న వయసులో .. నాకు అర్ధం కావడం లేదు.. 
అబద్దం చెపుతున్నాడేమో అనుకున్నా.. బడి ఎగ్గొట్టి ఏవో కుంటి సాకులు చెపుతున్నాడు అని మనసులో అనుకున్నా... నా ముఖం లోని భావాలను అర్ధం చేసుకుని తనే అన్నాడు " నేను మధ్యాహ్నం పూట బేకరీ లో పని చేస్తేనే గాని పూట గడవదు.".. అని చెప్పేడు.. అప్పుడు గమనించాను ఆతను వేసుకున్న బట్టలు కొంచెం మాసి నట్టుగా వున్నాయి...

మొదటి సారి మన కన్నా చాలా పేద వాడు మన సహ విద్యార్ధిగా వుండటం కొంచెం ఇబ్బందిగా వున్నా చాలా జాలి కలిగింది వాడి మీద.. 
మనమేమో చక్కగా తల్లితండ్రుల పెంపకంలో వున్నంతలో బాగానే బతుకుతున్నాం.. మంచి తిండి, ఇల్లు, బట్ట అన్నీ వున్నాయి.. కాని వీడికి రోజులో సగ భాగం బేకరీ లో పని చేస్తే గాని రోజు గడవదు.. సరి అయిన బట్ట లేదు, పుస్తకాలు, పెన్ను లేవు..కాని  ఒక పూట అయినా స్కూల్ కి వచ్చి పరీక్షలు రాసి ఉన్నత స్థాయి కి వెళ్ళాలని ఆశ.. 
తల్లి తండ్రుల నీడలో హాయిగా కాలం గడిపేస్తున్న మనం మన భవిష్యత్తు మీద, చదువు మీద పెద్దగా శ్రద్ద పెట్టక ఆట పాటలతో గడిపేస్తున్నాం.. 
జీవించడానికి అనునిత్యం పోరాటం చేసే వీడెక్కడ.. జీవితమంటే కేవలం వినోదం అని భావిస్తున్న మనమెక్కడ .. గమ్యం తెలియని మార్గం మనది... నిర్దిష్ట మైన లక్ష్యాన్ని పొందడం కోసం,   ప్రతికూల  పరిస్థితులకి ఎదురెడ్డి  నిలబడుతున్న మహోన్నత ఆశయం కల్గిన బాలుడతడు..
ఎవరు పేద ? నేనా ? వాడా ? బుద్దుడికి జ్ఞానోదయం కల్గినట్టు ఏదో అంతర్మధనం...జీవితం లో మొదటి సారిగా  నన్ను నేను తెలుసుకునే అవకాశం కల్గింది..అతనితో నా జీవితాన్ని పోల్చుకోవడం వల్ల .. 
నేటి మన స్థితికి - అన్ని వుండి కూడా చదువు మీద, భవిష్యత్తు మీద అంతగా శ్రద్ధ పెట్టని నా స్థితికి సిగ్గుతో తల వంచుకున్నాను.. 
అలా ఓ రెండు రోజులు వాడితో చనువుగా మాట్లాడి ఇద్దరం చక్కటి స్నేహితులం అయ్యాము... 
వాడితో ఎవరూ సరిగ్గా మాట్లాడ్డం నేను చూడలేదు.. మొదటి సారి మా క్లాసులో వాడితో నవ్వుతూ పలకరించే ఒక స్నేహితుడు వాడికి దొరికాడు.. కాబట్టి ఓ రోజు జేబు లోంచి ఓ పొట్లం తీసి నాకు ఇచ్చాడు తినమని..నిజానికి ఆ పదార్ధం చూడటం నాకు మొదటి సారి..  ఏవిటి అన్నాను.. 


"కేకు" అని .. 
"మా బేకరీలోనే తయారు చేస్తాం" .. అని గొప్పగా చెప్పాడు.. 
ఆ రోజుల్లో దాని విలువ ఓ పావలా.. చిన్న సైజు కేకుముక్క ..

 అయితే అప్పటి అలవాట్ల ప్రకారం  మా యింటిలో బయటి వస్తువులు ఏవీ తినేవారం కాదు.. స్వీట్లయినా హాట్లయినా ఇంట్లో చేసినవే .. మహా అయితే బిస్కట్లు, బిళ్ళలు లేదా సోడా.. అందులోనూ ఇలాంటి కేకులు లాంటివి నిషిద్ద పదార్ధాలు అసలు తినకూడదు .. .. తిన్నానని ఇంట్లో తెలిస్తే వీపు విమానం మోతే.. పైగా ఒకళ్ళు ఉచితంగా  ఇచ్చిన పదార్ధాలు అసలు తీసుకోకూడదు.. అది సంస్కారం, పద్దతి .. 
 .. ఆయాచితంగా వచ్చే వస్తువుని, డబ్బుని పుచ్చుకోకూడదు..
ఈ ధర్మ సుక్ష్మాన్ని పాటిస్తే జీవితంలో లంచం పుచ్చుకోవాలని గాని, అక్రమార్జన చెయ్యాలనే తలంపు గాని ఎవరికీ, ఎప్పటికీ రాదు..  ఇప్పటి కాలం పిల్లలకి  ఇవన్నీ వింతగా ఉండొచ్చు.. కాని తల్లితండ్రులు ఈ సంస్కారాన్ని తమ పిల్లలకి నేర్పించి తీరాలి.. 
అదలా పక్కన పెడితే తినాలా వద్దా అని వూగిస లాడుతున్నాను.. ఎవరికీ ఇవ్వకుండా  ఎవరూ చూడకుండా రహస్యంగా ప్రేమతో తెచ్చి ఇచ్చాడు.. తినకపోతే చాలా బాధ పడతాడు.. తింటే ఇంటి కట్టుబాట్లు, ఆచారం, అపచారం.. ఒక పక్క తినమని బతిమాలుతున్నాడు.. కాని నాకు తినకూడని పదార్ధాన్ని తినాల్సి వస్తోందే అన్న బాధ.. చివరికి స్నేహమే గెలిచింది.. తినక తప్పలేదు.. 
నేను తింటున్నప్పుడు వాడి కళ్ళలో ఆనందం..కాని నాకు - ఇంతవరకూ నేను రుచి చూడని ఒక కొత్త పదార్ధం తింటున్నాను అన్న ఆనందమో, ఇలాంటి పదార్ధాన్ని తినవలసి వచ్చిన పరిస్థితికో తెలియని అయోమయం.. 
కాని ఆ సమయంలో నా కన్నా గొప్ప వాడు.. ధనికుడు అయ్యాడు వాడు...ఆ చిన్న వయసులో  వాడి సొంత సంపాదనతో ఇచ్చిన బహుమానం... నేను పరాన్న జీవిని..  మరి  వాడు- తన కాళ్ళ మీద తానూ నిలబడి తనను తానూ పోషించుకుంటూ, తల్లితండ్రులకు ఇతోధిక సాయాన్ని అందిస్తూ చదువుకుంటున్న జ్ఞాని, పదేళ్ళకే జీవిత విలువల్ని కాచి ఔపాసన పట్టిన మేధావి.. 
వాడు ఇప్పుడు ఎలా వున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు.. ఇప్పటికీ నేను కేకు కొన్నప్పుడల్లా గుర్తుకి వస్తాడు. మొదటి సారి నాకు  కేకు రుచి చూపించిన వాడి ముఖం నా మెదడులో శాశ్వతంగా ముద్ర పడింది.. 
ఇది మీలో చాలా మందికి సిల్లీగా వుండవచ్చు కాని ఆ చిన్న వయసులో నా జీవితాన్ని మలుపుతిప్పిన ప్రధాన ఘట్టం గా భావిస్తాను .... మీలో ఎంతమంది ఏకీభవిస్తారు.. ??? Tuesday, April 16, 2013

ఒరే ... నేను నీ ఫ్రెండ్ ని కాదా?

జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకి జీవితాంతం గుర్తుకి వుండిపోతాయి.. 
అలాంటి ఓ రెండు :
నేను 5 వ తరగతిలో వున్నప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూల్ ఆఖరి సంవత్సరం లో వుండగా ఆ రోజు నా పుట్టిన రోజు.. 

చిన్నతనంలో మాకు పుట్టిన రోజులు జరిపిన దాఖలాలు లేవు.. 
ఆ రోజుల్లో పుట్టిన రోజు అంటే తలంటు కోవడం, కొత్త బట్టలు వేసుకోవడం. . అంతే... 
కాని అప్పుడే బయటి ప్రపంచానికి వెళ్లి కాస్త స్నేహితులు ఏర్పడ్డారు కాబట్టి స్కూల్ లో స్నేహితులకి చాక్ లెట్లు పంచితే బావుంటుందని నా చిన్న బుర్రకు ఆలోచన వచ్చింది.. 
అంతకు ముందు ఎవరో అలా ఇచ్చారు కాబట్టి...
స్కూల్ లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా పిల్లలు అందరికీ చాక్ లెట్లు పంచే వారు... 
ఆ చిన్న చాక్ లేట్, పిప్పర్ మెంట్ బిళ్ళే పిల్లలకి నూరు కోట్ల ఆనందాన్ని ఇచ్చేది.. 
అందుకే ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే ఆ ఇంట్లో వున్న పిల్లలకి బిళ్ళలు తీసుకు రావడం ఆనవాయితీ.. కొంతమందికి బిళ్ళల మావయ్య అనో బిళ్ళల బాబాయి అనో పేరు పెట్టేసే వారు పిల్లలు.. 

ఇక విషయానికొస్తే నా పుట్టిన రోజు నాడు బిళ్ళలు పంచుదామనుకున్నా తండ్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆఫీసు కి వెళ్ళి పోయారు..
ఓ కొడుకు పుట్టిన రోజుకి ఓ పది రూపాయిలు  కూడా ఇవ్వలేని పేదరికం కాదు అయినా  ఆయన దృష్టిలో ఇవన్ని అనవసరపు ఖర్చులు... కారణాలు అనేకం ..పక్కన పెడదాం.. 
మా అమ్మ గార్ని అడిగితే ఎక్కడో దాచుకున్న ఓ రూపాయి ఇచ్చారు.. లక్ష రూపాయల విలువైన తల్లి ప్రేమకి  కొలమానం -  ఆ ఒక్క రూపాయి ... కాని ... 
ఒక్క రూపాయి తో కేవలం  5 చాక్ లెట్లు (బిళ్ళలు) మాత్రమే వస్తాయి... క్లాసులో హీన పక్షం 20 మంది వుంటారు.. మనకి దగ్గర వాళ్ళు అనుకున్నా ఓ 10 మంది... ఎలా... సరే ముందు ఎవరు కనిపిస్తే వారికి ఇద్దామని (First come First) అని నిర్ణయించుకుని క్లాసుకి మొదట వచ్చిన వారికి 5 మందికి ఇచ్చాను.. 
కాని మనసులో ఏ మూలో భయం, బెరుకు, సిగ్గు... తల దించుకునే 2 పిరియడ్లు  గడిపేసాను.. హమ్మయ్య... ఎవరూ ఏమీ అనలేదు అనుకుని ఊపిరి పీల్చుకున్నాను..
ఇంటర్వెల్ లో రాజేశ్వరరావు అనే మా క్లాస్ లీడర్ ఎదురయ్యాడు.. వాడికి విషయం ఎలా తెలిసిందో 
" ఏరా ! నేను నీ స్నేహితుణ్ణి కాదా.. నా కెందుకు ఇవ్వలేదు చాక్ లేట్ ?" అని అడిగేడు. 
"నేను నీ ఫ్రెండ్ కాదా?" అని రెట్టించాడు.. అంతే నీరు గారి పోయాను.. తల దించుకున్నాను...
వాడే మళ్ళి "సరదాగా అన్నానులే " అన్నాడు.. కాని రోజంతా బాధ పడ్డాను.. వాడికొక్కడికీ కొన లేను.. ఇస్తే అందరికీ ఇవ్వాలి కాని అన్ని డబ్బులు ఇవ్వరు మా వాళ్ళు .. 
ఏమీ చెయ్యలేని నిశ్శహాయుణ్ణి.. రాత్రి పడుకున్నా వాడి మాటలే... 
అప్పటి నుంచి ఎన్నో పుట్టిన రోజులు వచ్చాయి.. వెళ్ళాయి.. 
వయసు తో బాటు చదువు, వుద్యోగం, హోదా అన్ని పెరిగాయి...
పుట్టిన రోజుని గ్రాండ్ గా జరుపుకోవచ్చు....  
కాని...  
ప్రతీ పుట్టిన రోజుకీ రాజేశ్వరరావు గుర్తుకి వస్తాడు.. "ఏరా నేను నీ ఫ్రెండ్ ని కాదా ?" అని నిలదీసి అడుగుతున్నట్లు... 

అందుకే "ఇవాళ నా పుట్టిన రోజ"ని ఎవరికీ చెప్పను.. ఏ పార్టీ చెయ్యను... 
ఒక్కోసారి పుట్టిన రోజుకి బట్టలు కూడా కొనుక్కోను.. నాకు ఎప్పుడు కట్టుకోవాలని అనిపిస్తే అప్పుడే కట్టుకుంటాను.. 


ఆమరణాంతరం నాకు వచ్చే ప్రతీ పుట్టిన రోజు నాడు గుర్తుకు వస్తాడు వాడు... ఇప్పుడు ఎక్కడ వున్నాడో ఎలా వున్నాడో ... కాని వాడి చిన్నప్పటి రూపం నా మెదడులో శాశ్వతంగా ముద్రించ పడింది ... 

ఇంకా నెల రోజులు వుందనగా  వాడు గుర్తుకి వచ్చాడు.. ఇలా పోస్ట్ రాయాలని పించి రాసాను..
(మరొకటి రేపు రాస్తాను... ఇది మరొకటి,  ఇలాంటిది కాదు...) 


Saturday, April 6, 2013

మహానుభావా... మా కోసం మళ్ళీ పుట్టండి.ఆ మహా గాయకుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది...
అయినా ఇప్పటికీ ఆయన పాటలు మాత్రమే విని పరవసించి పోయే మనుషులు వున్నారు...


కేవలం ఆయన పాడిన హిట్స్ ని మాత్రమే సి.డి ల రూపంలోనో, పి.సి ల్లో మై మ్యూజిక్ లో నో , పెన్ డ్రివ్ ల్లోనో భధ్రపరుచుకుని, కంపూటర్ వర్క్ చేసుకుంటున్నపుడు (ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా)   

కారులో వెళుతున్నప్పుడు..కిచెన్ లో వంట చేసుకుంటున్నప్పుడు... 
హాయిగా ఈజీ చైర్ లో నడుము వాల్చినప్పుడు, ఆదివారం భోజన విరామం లోనో, రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు... ఇలా వారి వారి అనుకూల మైన సమయములో, వారి వారి అభిరుచి మేరకు.... ఆయన గానామృతములో తేలియాడుతున్న వారి సంఖ్య ఎంత? లెక్కించగలమా ??  

ఆయన పుట్టడం వల్ల తెలుగు జాతి పులకరించి పోయింది...భావోద్వేగానికి లోనైనది.. 

ఆయన లాగే పాడాలని ప్రయత్నించని  తెలుగు వాడు లేడు..
ఒంటరిగా, ఏకాంతం లో గొంతెత్తి ఆయన పాటలే పాడుకుని సంతృప్తి పడని తెలుగు వాడు లేడు..
ఆ మహనీయుని గళ మాధుర్యంలో తమకున్న బాధలు, కష్టాలు,  కన్నీళ్ళు అన్నీ మర్చిపోయి తిరిగి మామూలు మనిషిగా జీవించడానికి వలసిన మానసిక ధైర్యాన్ని ఇస్తాయి ఆయన పాటలు...


ఆయన పాడిన "అమ్మా అని పిలిచినా.. ఆలకించవేవమ్మా" అన్న పాటను మొదటి సారిగా విన్న వారు కన్నీళ్ళ పర్యంతం అయిపొతారు...


జీవితం లో అన్నీ కోల్పోయి ఇక చావే శరణ్యం అని నిరాశ లో ఆత్మహత్య చేసుకోబోయే వారు ఆయన పాటలను విని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న వాళ్ళు ఎంతో మంది వున్నారు....  

              
 ఇంటర్నెట్ లో సైతం ఆయన పేరుతో వున్న సైట్లే అధిక సంఖ్యలొ వున్నాయి....

తిరుమల ఆస్థాన విద్వాంసునిగా ఆయనకు మాత్రమే దక్కిన గౌరవం మరిచిపోలేనిది ....
తెలుగు పద్యాలను ఆయన పాడినట్టుగా వేరెవ్వరూ పాడలేరు...

ఆఖరుకి కొన్ని వేల పాటలు పాడిన నేటి గాన గంధర్వుడు కూడా తన నేతృత్వంలో నడిచే  కార్యక్రమానికి "పాడుతా తీయగా" అన్న పేరు పెట్టడం తప్పని సరి అయ్యింది.. 
 

భగవద్గీతను ఎంతో  రాగ, భావ యుక్తంగా పాడి ఆ గీతా సారాన్ని సరళ రీతిలో లోకానికి అందించి తనను ఆదరించిన  తెలుగు వారి  ఋణాన్ని తీర్చారు..  

మహానుభావా... మా కోసం మళ్ళీ పుట్టండి.... ఇంకా మిగిలిపోయిన ఆణిముత్యాలను మాకు అందించండి... 

అయినా నా పిచ్చి గాని మీరు మరణిస్తే కదా... మా తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా జీవించి వున్నారు...

తెలుగు జాతి వున్నంత కాలము, భాషపై అభిమానమున్న కోట్లాది తెలుగు ప్రజలు వున్నంత కాలము మీకు మరణం లేదు....
మీ పాటలను  మా జీవితాలలో శాశ్వత అనుబంధం ఏర్పరచుకుని మీ ప(పా)ద సేవలో తరించి, ములిగితేలిన  ఈ అభాగ్యులను కరుణించి కాపాడు తండ్రీ..... 

ఓ వేంకటేశ్వరా.. ఘంటసాల వెంకట ఈశ్వరా..         
(ఈ మహానుభావుణ్ణి విమర్శించే వారు సైతం "అధికులమని... అధములని" (జయభేరి)  .... అన్న పాటను విని నవరంధ్రాలు మూసుకుని వెళ్ళేవారట.....)

Monday, April 1, 2013

ఇది ఒక విధంగా ఆరోగ్య రహస్యం..


 
ఒకడు తన కంటే తక్కువ హోదా గల వాని బండి మీద తన కార్యాలన్నీ చక్కపెట్టుకుంటాడు.. వీడు బండి పెట్రోల్ తో నడిస్తే మరొకడి బండి నీళ్ళతోనో మరొక దాంతోనో (సెన్సార్) నడుస్తుందని వాడి అభిప్రాయమా.. 

మరొహడు అందరికీ మిస్డ్ కాల్స్ ఇస్తాడు.. తన సెల్ లో సిమ్ కార్డులో బాలన్స్ అయిపోయింది అనో మరొకటనో తన పక్క వాళ్ళ సెల్ తీసుకుని మరొకరికి రింగ్ ఇస్తాడు.. 

ఇంకొక సన్నాసి ఆఫీస్ ఫోన్లో నుంచే ఫోన్ బుక్ తీసి మరీ అవసరం వున్నా లేక పోయినా అందరికీ ఫోన్లు చేస్తూనే వుంటాడు.. 

టిఫిన్లు, టీలు తేరగా దొబ్బి తినేసే వాళ్ళు చాలామంది ... 
తెల్లారి లేచి ఎవరు మందు పోయిస్తాడా అని గుంట నక్కలా ఎదురుచూస్తారు కొంత మంది.. .. 

వీళ్ళెవరూ డబ్బుకి ఇబ్బంది పడి మరొకరి మీద ఆధార పడ్డ వాళ్ళు కాదు.. 
అమ్మా బాబులు అడ్డంగా సంపాదించి ఇస్తే దాన్ని రెట్టింపు చేసుకున్న  కోట్ల ఆస్తికి వారసులు.. 
వాడు ఒకరికి దానం చెయ్యక్కర్లేదు.. ఒకరి దగ్గర సిగ్గు, లజ్జ లేకుండా దేహి అని మాస్ లెవెల్ లో కాక క్లాస్ గానే మరొకరి మీద బతికేసే పారాసైట్లు (పరాన్న జీవులు).. 

కాని దేవుడు వీళ్ళ పక్షానే వున్నాడేమో అనిపిస్తుంది.. ఎవరు ఏమనుకుంటున్నా వీళ్ళకి పట్టదు.. అందుకే మధు మేహం, బీ.పి వంటి వ్యాధులు రావు.. 
అనుక్షణం అభిమానంతో బతికి, ధర్మ బద్ధంగా జీవిస్తు అవినీతి, లంచం, కక్కుర్తి పన్లకు దూరంగా వుంటూ కాస్త సెన్సిటీవ్ గా వున్న  వాళ్ళకే పై జబ్బులు తొందరగా వస్తాయి... 

ఏదీ పట్టించుకోకుండా ఎప్పుడూ మిస్టర్ కూల్ గా వుంటూ ప్రపంచం ఎలా పోతే మనకెందుకు అన్న టైప్ లో వున్న వాళ్ళకే ఏ టెన్షన్ లేకుండా రాత్రి అయిపోగానే హాయిగా నిద్ర పోతారు..
ఇది ఒక విధంగా ఆరోగ్య రహస్యం.. 

దేవుడు కూడా తనని నమ్మిన వాళ్ళకే పరీక్షలు పెడతాడు అని పిస్తుంది.. నమ్మని వారు హాయిగా పాప కార్యాలు చేస్తూనే వున్నా వారి జోలికి వెళ్ళడు అని అనిపిస్తూ వుంటుంది ఒక్కోసారి...
మరి  మీరేమంటారు ?????