Sunday, July 28, 2013

"మూర్ఖుడా.. మీ సాగర్ లో అన్ని రాజకీయ పార్టీల (వి) నాయకులు లేరురా.. ...

కొంత మంది పల్లెటూళ్ళ నుండి వస్తున్న ఉద్యోగస్తుల మాటల ద్వారా తెలిసింది ఏవిటయ్యా అంటే ఒక్కొక్క ఓటుకు 2,500 చొప్పున ఒక ఇంట్లో ఇద్దరు వుంటే 5 వేలు ఇచ్చారట.. గుంపుగా ఒకే చోట వున్న కొంతమందికి కలిపి వుంటే  ఒక లక్ష రూపాయలట.. దేనికా నిన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో...
 ఓ ఈపాటి దానికి ఎవడికి వాడు వాడి సొంత దృశ్య శ్రవణ యంత్రాల్లో మా పార్టీకి ఇన్నివేల మెజార్టీ .. కాదు మా పార్టీ కే ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు అని పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా గొంతులు చించుకుని అరుస్తున్నారు..

అందుకే...... 
1. పాకిస్తాన్ లాగ మనకీ మిలిటరీ పాలనో, రాష్ట్ర పతి పాలనో  వస్తే బావుంటుంది. లేదా.
2. చైనా జపాన్ వాడో .. కనీసం బ్రిటీష్ వాడైనా ఆక్రమించేసి దేశాన్ని అభివృధ్ధి పరచాలి.. 
3. సునామీయో ... భూకంపమో వచ్చేసి కుళ్ళు కంపు కొడుతున్న రాజకీయ వ్యవస్థ తో బాటు అవినీతిమయమైన ప్రదేశాల్ని కుప్ప కూల్చేయాలి.. మిగిలిన వారు కొన్నాళ్ళ పాటైనా అవినీతి జోలికి వెళ్ళకుండావుంటారు.. (అని ఎక్కడో చిన్న ఆశ). 
4. కొంత మంది (నేను కాదు) సమ సమాజ నిర్మాణానికి  తుపాకి రాజ్యం రావాలి అంటారు .. వాళ్ళకోసం అలాగ కూడ జరగొచ్చు.. 

ఇంకా... 
"నోర్ముయ్.. ఆపు  నీ చెత్త వాగుడు".. 
"నువ్వెవరు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నవు?"
"నీ అంతరాత్మను .. ఏం.. సినిమాల్లో చూడట్లేదా"..  
"అక్కడ  మనిషి లోంచి మరో మనిషి తెల్ల బట్టల లోనో నల్ల బట్టల లోనో వస్తాడు.. మంచి చెప్పే వాడు తెల్లగా వుంటాడు.. చెడు చెప్పేవాడు నల్లగా వుంటాడు.... ఇంతకీ నువ్వు ఏ టైపు ?".. 
"మూర్ఖుడా .. అంతరాత్మ ఒక్కటే వుంటుందిరా.. చెడ్డ అంతరాత్మ మంచి అంతరాత్మ అని రెండు వుండవు.. "
"మరి నేను చూసిన సినిమాల్లో ఒకే సారి రెండు అంతరాత్మ లు ఒకేసారి చెరో వైపు వచ్చి హీరోనో హీరోయిన్నో కన్ఫుజన్ చేస్తూ వుంటాయి".. 
"ఈ ప్రశ్న మీ సిన్మాలు తీసే దర్శకుల్ని అడుగు.. ప్రస్తుతం నాకు అట్టే టైమ్ లేదు.. చెప్పేది విను.. హాయిగా కాలు మీద కాలు వేసుకుని టిక్కు టిక్కు అని రిమోట్ నొక్కుకొని నీకు (నాకు) ఇష్టమైన చానల్స్ చూడక ఈ బ్లాకు గోల ఏవిట్రా.. ఎవరో ఏదో రాస్తారు.. చదివి ఆ సైటు పీక నొక్కక... నీ కామెంట్ ఒహటి గెలుకుతావు.. మరల దానికి జవాబు ఏమి రాసారో అని ఆ బ్లాగులన్నీ చదువుతావు.. ఇవన్నీ కాక నువ్వేదో దేశాన్ని వుద్దరిస్తున్నట్లు ... అవినీతి రహిత సమాజంకోసం నీ పుచ్చు  సలహాలు...బోడి అవిడియాలు .  

"ఒరేయ్ మూర్ఖుడా.. ఈ స్వతంత్ర భారతదేశం లో ఎన్నికల టైము లో మందు, బిర్యాని, డబ్బు, చీరలు, టి.వీ లు ఆఖరుకి కిరికెట్టు కిట్టులు అన్నీవాళ్లకి  ఉచితంగా వస్తూ వుంటే నీకెందుకురా కడుపు మంట.. 
అన్నీ ఉచితంగా ఇస్తామని హామీలు ఇస్తూ.. పదవిలోకి వచ్చిన వాడు పెద్ద పెద్ద భవనాలు, పడవల్లాంటి కార్లు, పెళ్ళాం తో బాటు వుంచుకున్న దానికి ఒంటినిండ నగలు ఇయన్నీ సంపాదించుకూంటూ వుంటే నీకెందుకురా కుళ్ళు.. 
రాజకీయ పలుకుబడితో వాళ్ళు మర్డర్లు చేసుకుంటారు, కబ్జాలు చేసుకుంటారు.. సెటిల్ మెంటులు చేసుకుని ఏదో పదవిలో వున్నంతకాలమన్నా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు.. నీకేంటి బాధ.. 
అదేదో సినిమాలో పరాయి నటుడు అన్నట్టు.. "తిన్నామా, పడుకున్నామా.. తెల్లారిందా" . అన్నట్టు వుండాలి.. 

ఇంత చెప్పినా  నీకు జ్ఞానోదయం అవలేదా.. తిన్నగా మీ వూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళు .. హైదరాబాద్ కి టికెట్టు కొనుక్కుని  రైలు ఎక్కు.. అక్కడనుంచి హుస్సేన్ సాగర్ కి వెళ్ళు.. బుద్దుడి విగ్రహం కనిపిస్తుంది.. ఆ గట్టు మీదకి చేరుకుని ఓ  దండం పెట్టి  నీళ్ళలో దూకెయ్.. "
- మా విశాఖపట్నం లో సాగర్ లేదా  ఏవిటి...ఆ సాగర్ కి వెళ్ళమంటున్నావ్  .. 
"మూర్ఖుడా..   మీ సాగర్ లో అన్ని రాజకీయ పార్టీల (వి) నాయకులు లేరురా.. ... 
అన్నట్టు ఒరే దూకే ముందు 
"జై తెలంగాణ" అని రెండు సార్లు, "జై సమైక్య ఆంధ్రా" అని రెండు సార్లు, "జై రాయల తెలంగాణా" అని రెండు సార్లు అరిచి మరీ దూకు.. 
చచ్చిన తరువాత అయినా బోల్డు పబ్లిసిటీ, సింపతీ పెరుగుతుంది నీ మీద .. 
ఈడు మావోడు అటే కాదు మావోడు అని ఓ రెండ్రోజులు కొట్టుకు చస్తారు ఈ దృశ్య శ్రవణ యంత్రాల సాక్షిగా.. 
ఏటి ఇలా చెయ్యడం తప్పనా  నీ అనుమానం .. ఇదే మాట డిల్లీ లో వున్న పెద్దలని అడుగు..సన్నాసీ.. ఈ మంత్రం తోనే 2014 లో రాహుల్  ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న  సీను కళ్ళకి ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా అనుమానం ఏట్రా నువ్వు దూకుతావా .. తోసీ మంటావా.."


Sunday, July 21, 2013

ఒక సినిమా చూసేసాను.. "బలుపు" ఎక్కువై..

ఈ మధ్యనే అందరూ హిట్ చేసి పారేసిన ఒక సినిమా చూసేసాను.. "బలుపు" ఎక్కువై..
చిన్నప్పుడు ఏదైన తప్పుపని చేస్తే పెద్దవాళ్ళు "ఎరా ఒళ్ళు బలిసిందా.. " అని తెట్టేవారు..
కాని ఇక్కడ హీరో "మనిషి మారాను కాని నాలో బలుపు ఇంకా తగ్గలేదు" అంటాడు , అంటే దాని అర్ధం ఏమిటో అర్ధం కాలేదు..

1. మర్డర్లు, కూనీలు చేసేవాడు హీరో..
2. సెటిల్మెంటులు, అక్రమ వ్యాపారాలు చేసే వాడి కూతురు హీరోయిన్.. పైగా నిజాయితీ గల వైద్యురాలు..

3. సినిమా అంతా చంపుకోడాలు నరుక్కోడాలు, చివరాఖర్న హీరో అహింసా వాడిగా మారడం అందులోనూ నాటకీయం.. మధ్యలో దెయ్యం గోల.

4. ఒక మంచి కుటుంబం లోని పిల్ల పెళ్లి ఫిక్స్ అయిపోయింతర్వాత ఒక జఫ్ఫా / ఉల్ఫా మావయ్య తో కలిసి రోజు కొకడిని బకరా చేస్తూ రోడ్డు మీదే డాన్స్ చెయ్యడం .. చివరికి హీరో వేసిన వుత్తుత్తి  ప్రేమ నాటకంలో బకరా అయిపోవడం..   

5. చెత్త వెధవలు మధ్యలో విశాఖపట్నం పేరుని ఇక్కడ వీధి పేర్లని ప్రముఖ బిల్డింగులని వాళ్ళు తీసే పనికిమాలిన చెత్త పనులకి వాడడం.. కంచరపాలెం పేరుని ఒక నీచ కుమేన్ కుత్తే కి వాడడం .. ఆమధ్య ఒక సినిమాలో గండి బాబ్జీ (ఒక విశాఖ ఎమ్.ఎల్.ఎ) పేరు వాడడం , ఆయన కేసు పెట్టడం జరిగింది..

 ఒక్క మంచి మాటగాని, నీతి గాని యువతకు పనికొచ్చే విషయం లేక పోవచ్చు .అదే నేటి హిట్ సినిమా ఫార్ములా  కావచ్చు . 
కాని యువతను వక్రమార్గాన పట్టే చెత్త సంభాషణలు పెట్టి, చెత్త సినిమాలు  తీసి జనాల మీదకి వదిలే అధికారం, అవకాశం కల్పించడం మన దౌర్భాగ్యం.. 
మొన్న ఒక టి.వీ ఇంటర్వూ లో వాణిశ్రీ గారు "ఇప్పటి దర్శకులు ఆడదాన్ని ఎలా చూడాలి అని వాళ్ళ మనసులో ఎలా అనుకుంటున్నారో అదే సినిమాల్లో చూపిస్తున్నారు".. అని అన్నారు.. 

మన ఖర్మ కొద్దీ గిన్నీస్ అవార్డో మరేదో అవార్డులు పొందిన చెంపదెబ్బల కామెడీని అన్ని సినిమాల్లోనూ గత శతాబ్ధ కాలంగా చూడాల్సి వస్తోంది.. ఒక్కో చెంపదెబ్బకీ ఒక్కో రేటు అని విన్నాను.. 

మనకి బలిసింది కాబట్టే INOX లో ఒకొక్క టికెట్టు 150 రూపాయిలు పెట్టి చూడటం, ఒక్కొక్క బాటిల్ (నీళ్ళ సీసా లెండి ) 30/- చొప్పున కొనడం.. బలుపు ని ఇంకా పెంచడానికి అందమైన ట్రే నిండా పెప్సీ, కోలా, పాప్స్ కార్న్, సమోసా, వగైరా వన్ని ఫామిలీ పేక్ ఓ రూ. 200/- లో రూ. 300/- లో పెట్టి  కొనడం (నేను కొనలేదు లెండి) .. కారు పార్కింగ్ కి ఓ 20/- 
ఇవన్నీ కాక ఇలా బ్లాగులో గీకి నా కాలాన్నే కాక మీ కాలాన్ని కూడా హరించడం.. ఇదంతా బలుపు కాక మరేవిటి.. 
ఇక చాలు బలుపు పెంచుకోకండి.. 
Wednesday, July 17, 2013

ఏ మతము వాడైనా, ఏ కులము వాడైనా, ఏ దేశస్తుడైనా ఇవి తప్పవు..

ఏ జీవికయినా ఈ మూడు విధులు  తప్పని సరి: 
1. ఆకలి,    2. నిద్ర      3. సంతానోత్పత్తి ... 

ఏ మనిషికయినా ఇవి తప్పవు:
1. సుఖము, 2. దు:ఖము. 3. అనారోగ్యము   4. మరణము 

వాడు ఏ మతము వాడైనా, ఏ కులము వాడైనా, ఏ దేశస్తుడైనా ఇవి తప్పవు..  కోటి జీవ రాశులలో ఒకడైన మనిషి ఇతర జంతువుల వలే కాక సుఖంగా బతుకుటకై భగవంతుడు జ్ఞానమును మనిషికి అదనంగా ఇచ్చాడు.. ఇచ్చి తప్పు చేసాడు..

మనిషికి ఓర్పు, సహనము, దయ, క్షమ, ఔదార్యము, దానము, ఉపకారము, గౌరవము, అనురాగము, ప్రేమ ఇలా ఎన్నో సుగుణ సంపత్తులను కలుగజేసాడు..   , 

సరిగ్గా వాటికి వ్యతిరేక లక్షణాలు 
ఏ జీవికి లేని క్రిందివి మనిషికి ఎక్కడ నుంచి వచ్చాయి:
ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, అహంకారము, క్రోధము, దర్పము, వున్మాదము.


నేటి (ఆధునిక ?)  యుగంలో మనిషికి ఇవి తప్పనిసరి. 
1. డబ్బు, 2. డబ్బు, 3. డబ్బు.. ఇంకా నేను మర్చిపోయిన లక్షణాలు ఏవైనా వుంటే తెలియజేసి మమ్ములను ఆనందించ పరచ వలసిందిగా విన్నపము.. 

Monday, July 15, 2013

కొంతమంది విచిత్ర భక్తులు కూడా వుంటారు.

ఆధ్యాత్మిక ప్రవచాలను అత్యంత మనోహరంగా సామాన్యులకు సైతం సులువుగా అర్ధం అయే  రీతిలో చెప్తున్న శ్రీమాన్ చాగంటి కోటేశ్వర రావు గారి మీద బురద జల్లడానికి టీ.వీ 9 ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డది.. శ్రీమాన్ పి.విఽఅర్.కె ప్రసాద్ గారు చక్కగా బుద్ది  చెప్పారు.. దాని గురించి అంతకంటే చెప్పనక్కరలేదు.. 

1. మన హిందూ ధర్మం ప్రకారం గాని లేదా గీతలో కర్మ సిద్దాంతం వలన గాని మనకు తెలిసినది ఏ విధమైన కోరికలు లేకుండా నిర్మల మైన  మనస్సుతో అత్యంత భక్తి శ్రద్ధలతో పరమాత్మను సేవించవలెనని. 

2. కర్మలను ఆచరించుటయే మనపని ఫలితములను ఆశించరాదు.. 

3. కోరికలు అనంతం .వాటికి ఎక్కడా చాలు అని ఫుల్ స్టాప్ వుండదు.. ఒక కోటి వున్న వాడికి పది కోట్లు కావాలి అనిపిస్తుంది..  అందువలన  వున్న దానితో తృప్తి చెంది లేని వాటికి అర్రులు చాచకుండా కనీసం దేవుని ప్రార్ధించు నపుడైనా కల్మష మైన స్వార్ధ పూరిత ప్రయోజనాలతో కాకుండా దేవుని స్వరూపము నందు గాని దైవిక శక్తిని గురించి గాని మన చిత్తము ఏకా గ్రతను కోల్పోకుండా తదేక మనస్సుతో ప్రార్ధన చెయ్యాలి.. 

4. కొంతమంది విచిత్ర భక్తులు కూడా వుంటారు.   దేవుడా నేను పరీక్ష తప్పినా ఫర్వాలేదు.. నా పక్క వాడు పాసు కాకుండా చూడు తండ్రీ అని.. లేదా మా అమ్మాయికి పెళ్లి అవకపోయినా పరవా లేదు ఎదురింటి వాడి కూతురికి పెళ్లి అవకూడదు అని.. 

5. ఈ మధ్య ఇటువంటి ప్రార్ధనలు ఎక్కువ అయాయి.. మా దేవుని పూజించండి మీకు జబ్బు నయం అయిపోతుంది అని ఆసుపత్రుల చుట్టూ రోగుల చుట్టు చేరతారు కొంతమంది... ఈ రకమైన ప్రార్ధన వారి మూల గ్రంథా లలో ఎక్కడా వుండదు.. కష్టాలు వున్న వారి దగ్గరకు భీమా పధకం ఏజెంట్ల వలే వాలిపోతారు. వారి భయం అందోళనలను కాష్ చేసుకుని పనిలో పనిగా బలహీనమైన వారి మనస్సులలో ఇప్పటివరకు ఆరాధిస్తున్న దేవుని కాదని మా దేవుని పూజించండి ఆరాధించండి అని బోధిస్తారు. ప్రపంచంలొ ఎవరికైనా మరణం తప్పదు. ఎంతటివారికైనా ఏదో ఒక రోగం రాక తప్పదు.. మరి ఎందుకు ఈ విధమైన చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తారో తెలియదు.. 

6. మరొక మతం వారు అయితే నేను రాయక్కర్లేదు చాలా సినిమాల్లో చూపించారు పవిత్ర యుద్ధం .. వారు ప్రార్ధించిన దేవుడు గాని మత గురువులు గాని గ్రంథా ల్లో గాని ఇలా మతం పేరుతో యుధ్ధం చెయ్యమని ఎక్కడా లేదు.. అయినా అనేక మంది ఉగ్రవాదులై ఆ మతానికే కళంకం తెస్తున్నారు.. 

7. పవిత్ర గంగా నది అనేక నదులని తనలో కలుపుని ప్రవహిస్తున్నట్లు హిందూ మతం అన్ని మతాలను కలుపుకోవడం వలన మన భారత దేశం లోనే ఇన్ని మత  సంఘర్షణలు.. ఏ మతం వారైనా స్వేచ్చగా వారి మతాన్ని అనుసరించడం ఒక్క భారత దేశంలోనే వుంది.. ఏ విధమైన నిబంధనలు అడ్డుగోడలు లేవు.. విచిత్రంగా హిందూ మత  దేవాలయాలలోనే ప్రభుత్వం వారి అజమాయిషీ కనిపిస్తుంది. ఆలయ అధికారులకు, భక్తులకు, పూజారులకు మధ్య ఘర్షణ పూరిత మైన వాతావరణం ఏర్పడి ప్రభుత్వమే ప్రజలకు హిందు మతము మీద విముఖత ఏర్పడేలాగ చెయడం అత్యంత దురదృష్టకరం. 
Saturday, July 13, 2013

నేను పాటిస్తున్నవే మీకు చెపుతున్నాను..

వెధవ కుళ్ళు రాజకీయాల గురించో, ప్రముఖులు అనబడే వారి చేష్టల గురించో కాక కొన్ని మంచి విషయాలు రాద్దామని బయలుదేరా.. 
 
1. ఈ సీజన్ వ్యాయామాలకు, ఆసనాలు గట్రా వేయడానికి మంచి సమయం.. ఎంత సేపు చేసుకున్నా వేసవి లాగ వెంటనే చెమటలు పట్టి చికాకుగా అనిపించ కుండా హుషారుగా వుంటుంది.. కనుక బద్దకాన్ని వదిల్చుకుని మీకు తెలిసిన (అంతకు ముందు వేసి ఆపేసిన) ఆసనాలు అవీ వేయండి.. కనీసం గంట సేపు నడక కార్యక్రమమో మొదలెట్టండి.. సుబ్బరంగా ప్రాణాయామం చెయ్యండి. 

2. పూర్వం రోజుల్లా కాక  బోర్ అనిపించకుండా చెవుల్లో సెల్ పోన్ తాలుకా పాటలు పెట్టుకుంటూ నడవడమో, వ్యాయామాలో (లౌడ్ స్పీకర్ లో పెట్టి, సెల్ ని పక్కన పెట్టుకుని) ఆసనాలు చేసుకుంటూ తెల్ల వారుజామున వచ్చే భక్తి  పాటలు వింటూ వుంటే ఆ హాయే వేరు.. అనుభవించండి.. 

3. ఈ మధ్య వరుసగా కనీసం నెలకో నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది.. ఆసనాలు వెయ్యక ముందు కాస్త ఆయాస పడుతూ డైలాగు లు చెప్తే, ఈ మధ్య రెండు నెలలై క్రమం తప్ప కుండా వ్యాయామం చెయ్యడం వలన ఒళ్ళు బ్రిస్క్ గా అవడమే కాక పాత్రలను అవలీలగా, మనస్పూర్తిగా లీనమై చేస్తూ ముందు కంటే ఎక్కువ ప్రేక్షక ఆదరణ లభించింది.. 
( ఈ ఉదాహరణ ఎందుకంటే , రామకృష్ణుల వారు తన దగ్గరకు వచ్చిన పిల్లాడి చేత తీపి పదార్ధాలను తినవద్దు అని చెప్పే ముందు ఆయన మూడు రోజుల పాటు తినకుండా వుండి మూడో రోజు ఆ మాట చెప్పారట.. తానూ ఆచరించి అది ఇంకొకరికి చెప్పాలనే న్యాయ సూత్రాన్ని అనుసరించి నేను కూడా పాటిస్తున్నవే మీకు చెపుతున్నాను..) 

4. చిరు బొజ్జ కాస్త తగ్గుతోంది.. ఇంకొక రెణ్ణెల్లలో పూర్తిగా తగ్గించుకోవాలని చాలెంజ్ గా తీసుకున్నాను.. కానీ కొంచెం కష్ట పడాలి.. తప్పదు.. 

5. నూనె పదార్ధాలు, బయట కొన్న తిను బండారాలు చాలా మటుక్కు తగ్గించండి.. 

6. వాద ప్రతి వాదాలకు కొంచెం దూరంగా వుండండి.. కాని అప్పుడప్పుడు డిఫెన్స్ తప్పదు అనుకుంటేనే కాస్త గట్టిగా డోస్  ఇచ్చి దాన్ని మర్చి పోవాలి.. 

7. మీకు ఏది నచ్చితే అది చేసెయ్యడమే.. (మర్డర్లు , మానభంగాలు లాంటివి కాదు) మనసు కి నచ్చిన పన్లు  చేసెయ్యడమే .. ఒకళ్ళ గురించి త్యాగం చెయ్యక్క ర్లేదు.. 

8. మనం చేసే పని వలన ఇతరులకు ఇబ్బంది కాని పనులు ఏవైనా చెసెయ్యొచ్చు.. (ఓస్ మాకు తెలుసు లేవోయ్ అని మీరు అనొచ్చు).. కాని ఇవాళ ఇన్ని అనర్ధాలకు మూలం ఇదే కదా.. అంటే ఆచరించడంలో లోపం వుంది..

9. ఒకరి మెప్పు కోసమో లేక నొచ్చుకుంటారనో మనం పన్లు చెయ్యకూడదు.. నిజమాడేవాణ్ణి ఎక్కువ మంది తిట్టుకుంటున్నా చివరికి నిజమే నిలబడుతుంది.. 

10. చిన్న చిన్న అబద్దాలు మీ జీవిత భాగస్వామి దగ్గర కాని తల్లి తండ్రుల దగ్గర, అన్నా దమ్ములు, అక్కాచెల్లెళ్ల దగ్గర, చివరికి స్నేహితులు కొలీగ్స్,  ఆఫీసర్లు ఇలా ఎవరి దగ్గర అబద్దాలు ఆడకండి.. మీరు ఆలస్యానికి కారణమో మీ వలన జరిగిన తప్పిదానికి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చినపుడు నిజమే చెప్పండి...(ఇందులో వున్న ఆనందం అనుభవిస్తే మీకే తెలుస్తుంది.. ) 

11. సిగరెట్లు, మద్యపానం, గుట్కా, పాన్ మషాలా ఇవేవీ అలవాటు చేసుకోకండి.. మీకు వుంటే క్రమేపీ తగ్గించుకోండి .. 

12. అక్రమ సంబంధాలు అనర్ధాలకు మూలం.. మీ జీవిత భాగస్వామిని సక్రమమైన కుటుంబ వ్యవస్థ వలననో  లేదా  చట్టబద్దంగానో ఏర్పరుచుకొని ఆ ఒక్కరి తోనే సంసార జీవితాన్ని గడిపి మీ యొక్క శీలాన్ని (గుణాన్ని) ఉత్తమంగా వుంచాలి.. ఒక వేళ అతను / ఆమె నచ్చక పోతే సక్రమమైన, న్యాయబద్ధమైన చట్టబద్దమైన మార్గాన్ని అవలంబించి వేరు పడి అవసరం అనిపిస్తే వేరొక సరియైన వ్యక్తిని ఎంచుకుని మరల సక్రమమైన, న్యాయబద్ధమైన చట్టబద్దమైన మార్గాలతో ఒకటి అవ్వాలి.. అంతే గాని వేరొకరి కాపురంలో చిచ్చు పెట్టే అధికారం మనకు లేదు.. 

13. మీ వొద్ద పనిచేసే వ్యక్తులతో (కింద పనిచేసే వారితో) చులకన భావంతో , వారి బలహీనతను ఆధారం చేసుకుని గాని మీ అధికార బలం తో గాని వారికి  అన్యాయం తలపెట్ట కూడదు.. 

14. ఆఖరుగా ఒక్క మాట ఒక మనిషి మీద ఆ మనిషి లేనప్పుడు అవాకులు చవాకులు పేలి . తీరా ఆ వ్యక్తి  మీ ఎదట కి వచ్చే సరికి లేనిపోని ప్రేమ అభిమానం చూపించడం చెయ్యరాదు. .. ఇది ఈ నాడు అనేక మంది మగ వారే కాక ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు... నటనలో ఆస్కార్ అవార్డు గ్రహీతలను మించి పోతున్నారు..  . 

 15. మనలో మనమాట అంజనేయుల వారు రాముని పాదాలలో ఒక పాదాన్నే పట్టుకుని కూర్చొనే భంగిమలో ఎందుకున్నారో తెలుసా .. ఆ రెండో పాదం నీదేరా  అని మనకు విడిచి పెట్టారు..ఆ రామ పాదాన్ని ఒడిసి పట్టండి..

భరత శతృఘ్హ్నలక్ష్మణ సమేత సీతారాముల   కృపా కటాక్షాన్ని పొందండి.. 

ఎక్కడో మొదలెట్టి వేరెక్కడో ముగించాను..

Friday, July 12, 2013

త్రిమూర్తులు లాంటి నాయకులు (ట)

మేడం: ఏవిటి ఇ.ఎం  తరణ్ గారూ హైదరాబాద్ లో వర్షాలు ఎలా వున్నాయి? 
తరణ్: ఈ  హైద్రాబాద్ లో మా సీమ మాదిరి కాకన్న పెతీ నెలకొకతూరి పదహైదు సార్లన్నా వర్షాలు కురస్తనే ఉంటయ్ మేడమ్ ... 
ఆ మాదిరిగా వానలు  కురుచి నంక నల్లాలు పొంగుతయ్.. రాస్తాలన్ని మడుగులవుతయ్.. చానా సేపటి దంక బళ్ళు తిరగ దీనికి లేదు.. 
టీ.వీ ల్నంక పొంగుతున్న కాల్వల్నీ, చెరువు లంక మాదిరి వున్నా రహదారులని చూపెట్టి మమ్మల్ని బద్నాం చేస్తారు.. 
ఈ పొద్దుల ఇయన్నీ మాకు అలవాటే మేడమ్.. 
మీరు వర్రీ అవకండ నా మీదన పెట్టిన బాధ్యతను చక్కంగా నిర్వర్తించ దానికి చానా కట్టపడి పనిచేచుకుంటా వెళ్తున్నా మేడం.. 

 మేడం: ఏవండీ ..ఇ .సి. సి.  కత్తి  గారు మీ అమ్మాయి పెళ్లి ఎలా చేసారు.. మరీ పీనాసి చేసి మన పార్టీ పరువు తీసారని విన్నాను.. 
కత్తి : ఎం సేస్తాం అమ్మా.. ఏదో నా శక్తి మేరకు ఖర్చులన్నీ పెభుత్వ ఖాతా లోనే జరిగేలా చూసా.. బళ్ళు, మందీ మార్బలం అంతా మనోళ్ళే .. శానా సింపుల్ గా సేసా.. ఈ మాత్రం దానికే నానా యాగీ చేస్తున్నారు.. 
ఏటి సేస్తాం..ఆ మద్దిన సొమ్ములు పోనాయి నానేటి సెయ్యాల.. 
నేను, నా పత్ని, నా బావ మరిది, సుట్టాలు అంతా పేజా సామ్యానికే అంకితం అయి పని సేస్తా వుంటే ఈ మద్దిన పేపరోల్లు పెతి పక్షం ఒళ్ళు తెగ యాగీ సేస్తన్నారు.. 


మేడం: ఏవండీ.. పామోదర్ గారు... మీ వాళ్ళంతా కులాసా యెనా.. 
సామోదర్: ఎం చెప్ప మంటారు మాడం.. గీ తరణ్ మా వోడు కాదు.. కత్తి గాడు మా వోడు కాదు.. అంతెందుకు.. ఇప్పుడున్న మా క్లాస్ మేట్స్ అంతా పరాయి వోళ్ళు.. 
మొత్తం అన్నీ పదవులు మా వాళ్ళకి వచ్చీవరుకు మా పోరాటాలు వుంటనే వుంటయ్.. మీరు నాకు  పదవి ఇస్తే గీ తరణ్ గాడు నేనే నీకు మన పాత స్నేహం కొద్దీ పదవికి రికమెండ్ చేసాను అంటున్నాడు..నా ఇజ్జత్ పోయింది.. 
వానికి పిలక కట్ చెయ్యండి మేడం.. 

ఓ.కే .. ఓ. కే ... మీరు ఇక వెళ్ళండి.. 

బయట విలేఖర్ల కోలాహలం : 
ఇప్పుడే విచోర్ కమిటీ మీటింగ్ ముగిసింది.. త్రిమూర్తులు లాంటి నాయకులు అమ్మ గారితో దీర్ఘంగా చర్చించి వారి వారి వాదనలు వినిపించి.. తిరంగాణా మీద మార్గం దార్ల రూట్ మాపులను వివరించి ఏదారి సరి అయినదో చక్కంగా అమ్మకి వినిపించి వచ్చారు.. అమ్మ వారు దీనిపై దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.. అందాకా వేచి వుండండి. 
ఈ లోగా టెన్షన్ పెంచుకుని (వార్తా చానళ్ళలో హడావుడికి) బి.పీ లు పెంచుకుని చస్తే చావండి..  

Monday, July 8, 2013

"మహా ప్రస్థానం"- నా ఘోష

"మహా ప్రస్థానం" అను  కవితా సంపుటి శ్రీ శ్రీ ని ఒక గొప్ప (మేటి) విప్లవ కవి ని చేసింది..అందులో ఏమాత్రం సందేహం లేదు..


అయితే ఇప్పటికీ నాకు అర్ధం కానిది చాలా వుంది.. విజ్ఞులు ఎవరైనా వివరించగలరు..
1. జగన్నాధుని రధచక్రాలు:
పతితులార, బ్రష్టులారా బాధాసర్ప దష్టులార ! ఏడవకండి ఏడవకండి..
...... ....
వస్తున్నా యొస్తున్నాయి...
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్‌ !
జన్నాథుని రథచక్రాల్‌ !

 రథచక్రాల్‌,
రథచక్రాల్‌,
రథచక్రాల్‌, రథచక్రా
లోస్తున్నా యొస్తున్నాయి !

నా ఘోష: 
జగన్నాధ రథ చక్రాలకీ .. ఈ పతితులకు, బ్రష్టులకు,  బాధాసర్ప దష్టులకు ఏవిటి సంబంధం.. జగన్నాథ రథ చక్రాలు ఏవిధంగా వారికి వుపయోగం.. 

2
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదాంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారిపొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!

  నా ఘోష: 
ఎక్కడుందీ మరో ప్రపంచం? తోసుకుంటూ  పై పై కి ఎక్కడికి వెళ్తారు.. హిమాయాల్లోకా.. దారి పొడవునా గుండె నెత్తురులా.. ఎవరివి.. 
 అందులోనే :
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!
నా ఘోష: మధ్యలో ఈ దేవుని ప్రార్ధన ఏవిటి విప్లవ గీతం లో .... యింకా నయాగారా , త్రాచులు, రేచులు .. పార్దునిలా కదలండి...   

ఏవిటో ఒకదానికి ఒకదానికి పొంతన లేని పదాలు.. 

కాని ఈ పాటను విన్న యువత రెచ్చిపోయింది.. ఇప్పటికీ తుపాకి చేతపట్టుకుని కనబడని ఆ మరో ప్రపంచానికి ఎంతో మంది పొట్టన పెట్టుకుంటూ రక్తాన్ని చిందిస్తూ .... 

3
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!

నెను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.

నా ఘోష: 
ఇప్పటికీ ప్రపంచాగ్నికి సమిధను ఆహుతి ఇవ్వడం అంటే ఏవిటో అర్ధం కాలే.. ప్రపంచాన్ని తగలెట్టేసే క్రమంలో మనల్ని మనం తగలెట్టు కోవడమా..విశ్వ వృష్టి - అంటే (నిజంగా నాకు తెలీదు) 
భువన ఘోష కి వెర్రి గొంతుక (?) - బహుశా "విప్లవం వర్ధిల్లాలి" అని గట్టిగా అరవడమా.. 

నాకు తెలిసీ ఇవి పాడిన వాళ్ళు ఏదో రైము బావుంది .. పాడుతూ వుంటే తెలియని ఉత్తేజం, ఆవేశం, ఉద్వేగం కలుగు తాయని పాడేస్తున్నారు గాని పదాలకు పదాలకు పొంతన లేదేమో అనిపిస్తోంది.. 
నాకు శ్రీ శ్రీ అంటే అభిమానమే గాని అప్పుడూ ఇప్పుడూ .. ఈ మహాప్రస్థానం లోని కవితలు సరిగ్గా అర్ధం చేసుకోలేని అజ్ఞానం లో వున్నాను.. ప్రాజ్ఞులు, విజ్ఞులు ఎవరినా వివరించ గలరు.. 

Saturday, July 6, 2013

"పని లేక" లేదా దేవదాసు పై అపహాస్యమా??

http://yaramana.blogspot.in/2013/07/blog-post.html

పై లింకు లో 
ఈ మధ్య "పనిలేక" అనే బ్లాగు లో దేవదాసు సినిమా గురించి తెలియ చేసిన అనేక విషయాలు నాకు నచ్చక ఈ పోస్టు రాస్తున్నాను...
ఏ కాలం లో నైనా  ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి కారణం ఒక్కటే అప్పటి ఎక్కువ శాతం ప్రజలకు నచ్చడం.. అందువలన 60 ఏళ్ళ తరవాత మనం ఈ సినిమా మీద వ్యంగ ధోరణిలో కామెంట్లు రాయడం మంచిది కాదు.. 
ఇక దేవదాసు విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది మహా నటి  సావిత్రి గారి అద్భుత నటన, ముఖ కవళికలు (ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్), చిలిపి తనం నుండి హుందా తనం గా ఎదగడం లో ఆ పాత్ర పోషణలో ఆమె చూపించిన హావ భావాలు న భూతో నభవిష్యతి. 
పాటల చిత్రీకరణం లో ముఖ్యంగా "అంతా భ్రాంతియేనా" అను పాటలో ఆమె నటన అద్భుతం, అమోఘం.. (మీ పోస్టు లో సావిత్రి గారి నటన గురించి ఒక్క వాక్యం కూడా లేక పోవడం విచారకరం)
ఇక నాగేశ్వర్ రావు గారి విషయానికొస్తే అప్పటికి ఆయన కూడా కొత్త నటుడే.. దేవదాసు పాత్రకి ఈయన పనికి రాడని, సరిపోడని కొంతమంది విమర్శించారు.. కాని ఆ విమర్శలను తిప్పి కొడుతూ తన పరిపక్వతమైన  నటన ద్వారా ఆ పాత్రని పోషించి, దిలీప్ కుమార్ లాంటి దిగ్గజాల ప్రశంసలను పొందాడు.. 
3. సముద్రాల సీనియర్ గారి పాటలు ఈ సినిమాకి ఆయువుపట్టు.. అవి కూడా ఘంటసాల వారి గళ మాధుర్యంలో .. ఒక్కొక్క పాట అజరామజరమై తెలుగు వారి గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసాయి.. ఆ పాటలు పాడని తెలుగు వాడు లేడు.. ముఖ్యంగా "పల్లెకి పోదాం, కుడి ఎడమైతే, కల ఇదనీ నిజమిదనీ " ఏమి పాటలండి వింటూ వుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.. 

4. "మన వాడు తల్చుకుంటే ఏమైనా చేస్తాడు" స్నేహితుడు పాత్రలో పేకేటి వారి నటన, అసలు అలాంటి పాత్ర సృష్టి ఒక అద్భుతం.. ఇక వేశ్య పాత్ర లో చంద్ర కుమారి - డబ్బు కట్టలు ఆమె ముఖం మీద విసిరి కొట్టినప్పుడు ఆమె చూపిన ఎక్స్ ప్రెషన్ మరువ లేనిది... 

ఇక ఆఖరుగా నేను మొన్న టి.వీ లో చూసినప్పుడు కూడా సావిత్రి తన సవతి కూతురికి నగలు పెడుతూ వుండగ అప్పటి దాకా ఆమె మీద ఏహ్య భావంతో వున్న ఆమె ఒక్కసారిగా తెల్ల బోయి "ఇప్పుడివన్నీ ఎందుకమ్మా" అని అడిగి నపుడు " నేను పేదరికంలో నుండి వచ్చానమ్మా .. నాకు మాత్రం ఇవన్నీ ఎందుకమ్మా ? మీ నాన్న గారికి మీకు ఇంత సేవలు చేస్తూ గడపడానికి వచ్చాను" అని చెప్తూ వుంటే అప్రయత్నంగా నా కళ్ళ వెంట కన్నీళ్ళు... ఆమె నటనా కౌశల్యానికి రెండు చేతులూ జోడించి నివాళి అర్పించడం తప్ప ఏమీ చెయ్యలేము.. 

ఇప్పుడు ఈ విధంగా మీ బ్లాగులో దేవదాసు పాత్ర గురించి, వ్యక్తిత్వం గురించి శరత్ బాబు రచనా శైలి గురించి కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు రాయడం ఏమీ బాగులేదు.. 

అప్పటి రోజుల జీవన సరళిని బట్టే కథ సాగింది అనుటలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.. ఇప్పటి సమాజ స్థితులు వేరు.. 
ఒకప్పుడు అందరూ గ్రాంధికం లో మాట్లాడే వారు.. ఇంకా వెనక్కి వెళ్తే సంస్కృతం లో మాట్లాడే వారు.. 
ఇప్పుడు సినిమాల్లోనూ, యువత భాష లోనూ వస్తుంది కూడా సంస్కృతమే(?)... 
ఆఖరికి ఆడవారి పాత్రలు కూడా సిగ్గు లేకుండా నీచ భాష మాట్లాడేస్తున్నారు.. 
ఇవన్నీ అనుమతిస్తున్న మన సమాజం 60 ఏళ్ళ కిందట వచ్చిన ఒక అద్భుత కళా ఖండాన్ని వ్యంగంగా విమర్శించ డం లో  తప్పు కాక పోవచ్చు...
ప్రేమ పేరుతో వంచన చేస్తూ ఆడవారి ధన మాన ప్రాణాల్ని దోచుకుంటున్న ఇప్పటి సమాజం వారికి దేవదాసు ఒక పిచ్చి సినిమాగా కనిపించవచ్చు. 

అలాగే ఒక నటుడి గురించి పెరుగన్నం  తిన్నాడా , నిజంగా మందు తాగే నటిస్తే నాకేంటి అని చాలా వెక్కిరింపుగా అన్నారు . ఇది ఖండించ వలసిన విషయం.. ఆ పాత్రలో లీనం అయి సహజంగా మందు తాగిన వాడిలాగా కనిపించడానికి ఆతను పడ్డ తపన, కృషి కి మెచ్చు కోవాలె గాని వెక్కిరించ  కూడదు. 
"అటు వంటి చెత్తను నేను చదవ దలచు కోలేదు అన్నది" కూడా బావు లేదు..మనం చెత్త అన్నంత మాత్రాన కొన్ని వేల మంది గుండెల్లో ఒక అద్భుత కావ్యం తన అస్తిత్వాన్ని కోల్పోదు.. 
ఆఖరుగా ఒక్క మాట కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా తన ప్రియుడు లేదా ప్రియురాల్ని చూడాలని అనుకోవడం విమర్శనాత్మకం ఎలా అయిందో మీకే తెలియాలి.  
మనవి : "పనిలేక" రచయితను  గాని ఇతరులను గాని కించపరచాడానికో వ్యక్తిగత విమర్శకో కాక దేవదాసు పైన నాకున్న అభిమానమే నన్ను ఇలా రాయడానికి వుపక్రమించింది.. 

Friday, July 5, 2013

మా ఇంట భోజనం ఎంత మాత్రం వీలు పడదు...

అయ్యలారా, అమ్మలారా
తే.3/7/2013 ది. నాడు విశాఖపట్నం కళాభారతి లో మేము గురజాడ అప్పారావు గారి "కన్యాశుల్కం" నాటకం వేయడం జరిగింది.. నేను "అగ్నిహోత్రావధానులు" పాత్ర ను వేసాను..
ఇదిగో ఆ ఫుటోలు .. వీక్షించండి ... తరించండి.. పేపర్ కవరేజ్ అదీ తరవాత పెడతాను.
ఇంతకీ సిద్ధాంతి (ప్రేక్షకులు) ఏవన్నారు ?
నా జాతకం (నాటకం) చూసిన సిద్ధాంతల్లా (ప్రేక్షకులు) అంతా బావుందనే అన్నారు...

ఈ నాటికలో "అగ్నిహోత్రావధానులు" పాత్రలో  నాకు నచ్చిన డైలాగ్స్ లో ఒకటి  "ఈ శషభిషలు నాకు పనికి రావు..ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేట్టు కనబడుతోంది..  మా ఇంట భోజనం ఎంత మాత్రం వీలు పడదు.."