Saturday, September 28, 2013

ఒపీనియన్స్ చేంజ్ చేస్తేనే గాని.. పొలిటీషీన్ కానేరడు..

గురువు గారు నిన్నటి మీ పోస్ట్ లో అలనాటి గిరీశం గారి మాటలను ఈనాటి రాజకీయాలకు ముడిపెట్టారో లేదో, మరలా ఆయన చెప్పినట్లే జరిగింది..

ఏవిట్రా శిష్యా అది.. 

గిరీశం గారు ఏవన్నారు ? 

అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తేనే గాని పొలిటీషీన్ కానేరడు అన్నారా.. 

అవును..

ఇప్పటి రాజకీయనాయకులు అప్పుడప్పుడు కాకుండా నిత్యం తమ ఒపీనీన్స్ ని చేంజ్ చేస్తున్నారు.. 
యూ టర్న్ లు, కె. టర్నులూ.... అబ్బో చాలా చాలా టర్నులు తీసుకుంటూ ప్రజల్ని అయోమయ స్థితికి నెట్టేస్తున్నారంటే నమ్మండి.. 

నిజమేరా అబ్బాయ్ .. ఎవడు ఎన్ని టర్నులు కొట్టినా, మేము మాత్రం వెజక్కి తగ్గేది లేదని డిగ్గీ గారు బల్ల (mike) కొట్టి మరీ చెప్పి పూట గడవలేదు... రాహుల్ గారు బాంబు పేల్చేడు..  

ఎవడో మన వాళ్ళని తిట్టే బదులు మనమే మన పార్టీని విమర్శించడం అన్నది కాంగిరేసు వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య.. 

పాలక, ప్రతిపక్షం పాత్రలు వాళ్ళే పోషించి వాళ్ళ నాయకత్వం మీద తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకిస్తూ మాట్లాడడం .. ఇదో పెద్ద రాజకీయం .. బహుశా ఇది గిరీశం వల్ల కూడా అవలేదు...  

పనిలో పనిగా అన్ని రాజకీయ పార్టీలని తిట్టిపోసి  ఆర్డినెన్సుని చించిపారెయ్యమని చాలా వుద్రేకంగా మాట్లాడాడు.. మరల ఒక అపరిచితుడి వేషం కట్టేడు యువరాజా వారు..  

రేపో నాడో వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్న ముఖ్య నిర్ణయాన్ని(రాష్ట్రాన్ని విడగొట్టాలనే తీర్మానాన్ని) నాన్సెన్స్ కింద జమకట్టి దీన్ని  కూడా అలా చించి పారెయ్యమని యువరాజా వారు శెలవిస్తారని ఎంతో ఆశ పడుతున్నారు సీమాంధ్రులు....  

అప్పుడు వేర్పాటు నాయకులకి పండగే పండగ .. కొన్నాళ్ళు వుద్యమాలు నడిపించి జనాల్ని రెచ్చగొట్టి సొమ్ములు వసూలు చేసుకుని తరతరాలకు తగ్గని సంపదని పోగేసుకోవచ్చు.. 

మరి ప్రజలో..
ఆ నాన్సెన్స్ .. వచ్చే ఎన్నికల వరకూ ఎంత అరచి గోలపెట్టినా మనవాళ్ళకి వినబడదుగా.. Thursday, September 26, 2013

"మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్"..


"మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్".. 
"ఇదేమిటి గురువుగారు ఇలా సెలవిస్తున్నారు..
ఇంతకీ ఎవరు వెధవాయలు.. 
మన భారతీయులా..తెలుగు వాళ్ళా? రాయలసీమవాళ్ళా?  ఆంధ్రులా ? తెలంగాణావాళ్ళా?? " 

తెలీదురా శిష్యా, But వందేళ్ళ కితం గిరీశం నోటి వెంట గురజాడ పలుకు నేటికీ మనవాళ్ళకి వర్తిస్తుంది.. ఆయన ఎవర్ని వుద్దేశించి  ఈ మాటఅన్నాడో గాని  ప్రతి తెలుగు వాడికీ ఇది వర్తిస్తుందోయ్. 

ఎలా??

నాటింది లీస్ట్ కొసాకి విను.. 
దేశం అంతా కాంగిరేసుకి వ్యతిరేక ఓటు వేస్తే మన వాళ్ళు కాంగిరేసుని గెలిపిస్తారు.. 
దేశం బిజేపీ ని గెలిపిస్తే మనవాళ్ళు వేరే  పార్టీకి పట్టం కట్టారు.. 

నిన్న మొన్న దాదాపు 32 పార్లమెంట్ స్థానాల్లో మనవాళ్ళు గెలిచి కాంగిరేసు పాలనకి మెజారిటీ ఇచ్చారు..కాని మన మహా నాయకుడు ఒక్క పదవి అడక్కుండా పైకి వెళ్ళిపోయాడు.. 

అదే తమిళ తంబీలు అయితే గెలిచినవి మూడే సీట్లు అయినా కీలక పదవులను ఇవ్వమని పేచి పెట్టి దర్జాగా దేశాన్ని (చక్రాన్ని) తిప్పే అవకాశం లాక్కుంటారు.. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్..  

ఊరంతా ఒక దారి అయితే ఉలిపిరి కట్టది వేరొక దారని సెంట్రల్ లో ఒక పార్టీ అధికారం లో వుంటే మన స్టేట్ లో వేరొక పార్టీ రూలింగ్ లో వుంటుంది.. అందువల్లే ఢిల్లీ పెద్దల దయా దాక్షీణాలపై, వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలై విలువ లేని చిల్లి కాణీల్లాగ మిగిలిపోతున్నారు.. 

అగ్నిహోత్రావధానులు "తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి" 
ఈ మాట కూడా ఇప్పటికీ వాడుతున్నారు.. 
మనల్ని చులకన చేస్తూ "ఆడముండలతోనా ఆలోచన" అన్న తీరున అఫ్టరాల్ మీతోనా ఆలోచన అని మన అమాత్యులను ఢిల్లీ పెద్దలు ఈసడించుకున్నారు.. 

ఇక రామప్పంతులు చెప్పినట్టు "పదో  వంతు అన్నారుగా కాని సగానికి సగం మా బేరం.."అంటే...
 దానికి కరటక శాస్త్రి "ఈ పాపపు సొమ్మునా మీరాశించేది" అంటే 

"పాపపు సొమ్ము మా చేతికి రాగానే పవిత్రమయిపోతుందండీ" అన్న రీతిలో ప్రజల సొమ్ము రాజకీయ నాయకుల చేతిలో పడగానే పవిత్రమయిపోతోంది..
న్యాయస్థానలకు వారిని అడిగే హక్కులేదని రాజకీయ నాయకుల తీర్మానం.. 

మధురవాణి చుట్టుతా కన్యాశుల్కం నాటకం తిరిగినట్లు ఢిల్లీ మాత చుట్టు తెలుగు వారి జాతకం తిరిగుతోంది. ఎన్నో చీకటి ఒప్పందాలు.. 

"యంత్రం ఎదురుతిరిగిందో అయితే చక్రం అడ్డువేస్తాను..అన్న మాటలు అప్పటికీ ఇప్పటికీ ఏనాటికీ విలువైన మాటలు...వజ్రాల్లాంటి మాటలు అందుకే వండేళ్ళు దాటినా ఆ ప్రజాకవి తెలుగువారందరి మనసులో అమరుడై నిలిచాడు..    

అమాయకపు బుచ్చెమ్మ గిరీశం వలలో పడ్డట్టు.. 
డబ్బాశతో లుబ్ధావధాన్లుకి పసిబిడ్డను అమ్ముకున్నట్టు.... 
ఊరందర్నీ తన యంత్ర బలం చేత మోసగించే రామప్పంతులు మధురవాణి వేసిన వుచ్చులో పడ్డట్టు... 

సుమారు 60 ఏళ్ళ కిత్రం అమాయకపు పిల్లను ఒక గడుసు పిల్లోడి కిచ్చి పెళ్ళి చేసిన పెద్దలు ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు వారి మునిమనవలు తన్నుకు చస్తూ  ముసలం పుట్టి వారిలో వారే కొట్టుకుంటూ ఘోర పతనానికి అధారం అయి నిలిస్తున్నారు... 

దీనికి పరిష్కారం ఆ గురజాడ వలన కూడా కాదు.. 

ఎందుకు లేదండి .. గిరీశం గారు చెప్పినట్లు: "వాట్ ఇజ్ ఇన్ నేం" అని షేక్స్ పియర్ అన్నదు గాదండి" అందువల్ల ఇప్పుడున్న మన రాష్ట్ర పేరుని మార్చివేసి "తెలంగాణా ప్రదేశ్" అనో "తెలంగాణా నాడు" అనో "సీమాంధ్ర తెలంగాణ ప్రదేశ్"  అనో పేరు పెట్టినట్లాయినా ఈ సమస్య చిటికలో తేలిపోతుంది...  

నీ కున్న పరిజ్ఞానం కూడా మన వాళ్ళకి లేదోయ్.. మనవాళ్ళు వట్టివెధవాయలోయ్..కాదు వట్టి వాజమ్మలోయ్..       

Tuesday, September 24, 2013

హాయిగా నవ్వుకోండి కాసేపు.. మమ్మల్ని ఆశీర్వదించండి..

మితృలారా.. 
జగన్ జైల్లో నుండి బయటకు వచ్చీసేడని.. 
తెలంగాణా / ఆంధ్రా  వాళ్ళు (vice verse)  ఏదేదో అన్నారని బుర్రలు పాడుచేసుకోకండి.. 
ఈ దిగువ link open చేసుకుని  మేము నటించిన చిన్న సినిమా చూసి ఆనందించండి.. 

జరిగేది జరుగక మానదు అంతా ఇటలీ దేవత చేతుల్లో వుంది..
హాయిగా నవ్వుకోండి కాసేపు.. 
మమ్మల్ని ఆశీర్వదించండి..    

http://www.youtube.com/watch?v=ZkbQB3xSLPk


Sunday, September 15, 2013

విభజించిన చరిత్ర ను విభేదించిన నేటి తరం..

- - - - - - 


రేపటి రోజున ... 
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర రాయమంటే ఏది రాయాలో తెలియని అయోమయ స్థితిలో పిల్లలు... 

ఏది రాస్తే పూర్తి మార్కులు వస్తాయో .. ఏది రాయక పోతే వీపులు  పగులుతాయో తెలియని అభాగ్యులు..  

ప్రాంతీయ వివక్షతతో పేపర్లు దిద్దే ఆచార్యులు ...  జీవిత కాలం ఉత్తీర్ణత  సాధించలేని అభాగ్యులు 


నాయకుల పిల్లలు విదేశాల్లో .. సామాన్యుడి పిల్లలు సర్కారీ బడిలో .. 

మూర్ఖుల ఆచార్యుల ఒడిలో   

అవుతారు ఉన్మాదులు, సంఘ విద్రోహ శక్తులు .. దీనికి ఎవరు బాధ్యులు ???? 

(ఇది ఇరు ప్రాంతాలకు వర్తిస్తుంది)


Saturday, September 7, 2013

అటువంటి భర్తలను విడిచి పెట్టడం ఒకటే మార్గం.అప్పుడు ఎవరు దిక్కు ? ? ?

మితృలారా..
నా ముందటి పోస్ట్ కి చక్కటి వాఖ్యలు రాసి ఇంకా రామాయణం లాంటి మన గ్రంథాలపై మరింత విశ్లేషిండానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు..

ఒక అజ్ఞాత రాసినట్లు ఇది హారి పోటర్ లాగ  ఒక ఫాంటసీ లాంటి  కథ కాదు..మానవ జీవితాలకు, అనుబంధాలకు భారత జీవన విధానానికి  దగ్గరగా వాస్తవ జీవితాలకి దగ్గరగా వుండే అద్భుత కథ..

రామాయణం లోని ప్రతి పాత్ర సహజ పాత్రలకు దగ్గరగా వుంటాయి..
ప్రతి మానవులోని అంతర్గత సంఘర్షణలకు, ధర్మాన్ని ఆచరించుటలో సందేహాలు, అనుమానాలు ఆయా పాత్రలు ఒకరినొకరు ప్రశ్నించుకోవడము ద్వారా నివృత్తి అయి చదువుతున్న మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి..

అయితే ముందుగా మీకు మనవి చేస్తున్నది ఏవిటయ్య అంటే ఇప్పటి యుగం వేరు.. అప్పటి యుగం వేరు.. ఇప్పటి జీవన విధానం, పద్ధతులు వేరు.. 
ఎంతో పటిష్టమైన రాజరిక వ్యవస్థ అది, ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలే రాజులు.. అయినా అంత కన్నా ఘోరంగా వున్నాయి నేటి పరిస్థితులు.. 
నేటి ఆధునిక స్త్రీకి స్వేచ్చ దొరికింది కాని  రక్షణ కరువయ్యింది.. 
  
రాముడు తానూ విష్ణు మూర్తి అవతార పురుషున్ని అన్న స్పృహ వున్నా ఏ విధమైన దైవీక మహిమలు కాక ఒక సామాన్య మానవుని వలే ప్రవర్తిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ మానవులకు కలిగే సుఖ దుఃఖాలు, భావోద్వేగాలు కలిగి వుంటాడు.. 

తనకి కూడా కొన్ని సందర్భాల్లో ఏమైనా ధర్మ సంకట స్థితి కలిగినప్పుడు పక్కన వున్న తన గురువు లేదా స్నేహితుని ద్వారా ఆ సందేహాల్ని నివృత్తి చేసుకుంటాడు.. 
తాటకి వధ, వాలి వధ, రావణ సంహారం వరకూ ధర్మా ధర్మ విచక్షణ చాలా స్పష్టంగా విశిదీకరించ బడుతుంది.. 
ఇలా ఎన్నో చెప్పచ్చు కాని మనకున్న కాలము చాలదు.. మన కున్న పరిజ్ఞానం  కూడా చాలదు..


ఇక మన విషయంలోకి (చర్చ లోకి)  వస్తే....
స్త్రీ వాదులనబడే వాళ్ళు మన హిందూ సమాజం లో స్త్రీని వంటింటి కుందేళ్ళు గా చేయటలో మన భారత ఇతిహాసాలు ఒక కారణమని నిందిస్తూ ఆ విధంగా రాముని పాత్ర లోని భార్య ని కష్టాల పాలు చేసిన వైనం ప్రధానం గా చూపిస్తారు.. 
1. సీతమ్మ బలవంతంగా రాముని తో బాటు అడవికి రాలేదు.. రామయ్య వద్దని వారించినా భర్త కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని ఇష్ట పూర్వకంగా వచ్చింది.. ఒక మహారాజు కూతురు, వేరొక మహారాజు కోడలు ఇలా నార చీరలు ధరించి అతి నిరాబండర జీవితం గడపడం ఆదర్శం.. వన వాసంలో వారిద్దరి ప్రేమ అనురాగం వర్ణించ వీలులేనిది..  
2. ఒక అల్పుని మాటలకు విలువనిచ్చి తనని వదిలి వేస్తున్నందుకు సీతమ్మ మొదట విచారించినా ధర్మ పరిరక్షణ కోసం భర్త మాటను శిరసా వహిస్తుంది.. (లక్ష్మణుడు తనని వదిలివేస్తున్నపుడు వారిద్దరికి జరిగిన సంభాషణ పూర్తిగా తెలుసుకోవాలి).. 

వాల్మీకి ఆశ్రమంలో ఎవరికీ తన అసలు  పేరు గాని, తానూ ఫలానా వారికి భార్యను అన్న సంగతి కాని తెలియనివ్వదు.. ఏనాడు తన భర్త తనను ఇలా వదిలివేసాడని చెప్పలేదు.. పతిని నిందించలేదు..  

3. అసలు సీతారాముల మధ్య ఒకరు గొప్ప వేరొకరు తక్కువ అన్న భావం మనకి ఎక్కడా కనిపించదు.. అందుకే నేటికీ సీతా రాముల్లాగా కలకాలం జీవించండి అని దీవిస్తారు.. పెళ్లి శుభలేఖల్లో  "జానక్య.. "  అనే శ్లోకం వేస్తారు.. 
  
 ఈనాటి ఆధునిక భావాలు వున్న స్త్రీలు చాలమంది రామాయణాన్ని, రాముని మీద చాలా వ్యతిరేక భావంలో వుంటూ సీత లాగ భర్త పై విధేయత గా వుండకూడదు అన్న స్వతంత్ర భావాలతో జీవనం సాగిస్తూ ఆమె దే పై చేయి అవాలనే పట్టుదలకి పోయి కాపురాలను చెడకొట్టుకుంటున్నారు (ఇది నాకు తెలిసిన వారి (బందువులలో) కొంతమంది స్త్రీలను చూసి రాస్తున్నాను)..

 అందులోను వుద్యోగం చేస్తున్న ఆడవారిలో ఈ స్వతంత్ర భావాలు ఎక్కువ.. స్త్రీకి స్వతంత్ర భావం వుండకూడదు అని ఎవరూ అనరు.. కాని లోపల ఎడమొహం పెడమొహంలా వుండి పైకి సమాజం కోసం ఇద్దరూ అన్యోన్యంగా వున్నట్టు నటించే వాళ్ళు ఎంతో మంది వున్నారు..

శాడిష్టు భర్త తో ఇబ్బంది పడే స్త్రీలు అనేక మంది వున్నారు..అందులోను భర్త తాగుబోతు  అయితే  ఆ స్త్రీ పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే నయానో భయానో లొంగని అటువంటి భర్తలను విడిచి పెట్టడం ఒకటే మార్గం.అప్పుడు ఎవరు దిక్కు ? ? ? అందుకే స్త్రీలు చదువుకోవాలి, ఉద్యోగాలు చెయ్యాలి. 

డబ్బు మాత్రమే శాసిస్తున్న నేటి కాలంలో భార్య భర్తల అనుబంధం కూడ డబ్బు తోనే ముడిపడి వుండి.. స్త్రీ తనకాళ్ళ మీద తానూ స్వతంత్రంగా నిలబడిన నాడు ఈ మగ వారిని బతిమి లాడి వారు పడవేసే ముష్టి తో సంసారాన్ని పోషించా వలసిన ఆగత్యం లేకుండా ఈ నాడు పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ముందు వున్నారు.. ఇది హర్షణీయమే...  
  
కాని... 

కొంత మంది మొత్తం మగ జాతిపైనే విద్వేషంతో వుంటూ అసలు పెళ్లి మీదే ఆసక్తి చూపరు. ఒకవేళ పెద్దల మాటతో  పెళ్లి చేసుకున్నా భర్త పై ప్రేమ, అనురాగము చూపక ప్రతి విషయానికి గొడవ పడుతూ పిల్లలు పుట్టినా తెగతెంపులు దాకా వెళ్లి పిల్లల బంగారు  భవిష్యత్తు  ని కూడా పాడు చేసిన వాళ్ళు అవుతున్నారు..
ఇలాంటి వారు రామాయణాన్నో మరేదో పురాణ గాధలనో వేలెత్తి చూపుతూ విమర్శిస్తూ, ఇతరులను కూడా అదే భావజాలంతో వుండేలా ప్రేరేపిస్తారు.. 

ఇవాళ   ఏ టి.వీ సీరియల్ చూసినా ఆడదానికి ఆడదే శత్రువు.. ఎంతో సుకుమార, సున్నిత మనస్తత్వం గల స్త్రీ ఎదుటి వారికి విషం ఇవ్వటమో,కత్తి  తోనో  తుపాకీ తోనో చంపడం ద్వారానో ఒక విలన్ కి వుండవలసిన దుష్ట పాత్రని ఇవాళ స్త్రీలు పోషిస్తున్నారు..అసలు కుటుంబ వ్యవస్థ నే అపహాస్యం చేసేలా వున్నాయి.. 
డైలాగులు మరీ ఘోరం.. "నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీకు తాళి కట్టిన  ప్రసాద్ కాదు..." (పెద్ద మ్యూజిక్.. విరామం) మరల ఓ పది ఎపిసోడ్ లకు  గాని ఆమె కడుపులో  పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో మనకి గాని ఆమె కి గాని తెలియదు.. ఈ లోగా ఇద్దరు ముగ్గురు ఆమెకు భర్తలుగా కనిపిస్తారు.. ఏవైనా అంటే అదేదో నాటకంలో ఓ భాగం అంటూ సాగతీస్తారు.. 

అమ్మా ! మీరు విమర్శించ వలసినది రామాయణాన్నో భారతాన్నో కాదు ఆధునికత పేరుతో వెర్రి తలలు వేస్తున్న నేటి సంస్కృతిని.. 

ఆడవారికైనా  , మగ వారికైనా  ప్రాణం కంటే శీలం విలువ ఎక్కువ.. శీలం అంటే కేవలం మాన రక్షణ కాదు.. మంచి నడత, నడవడిక, సంస్కారం, నిబద్దత కల్గిన, జవాబు దారీ తనం గల గొప్ప జీవితం.. 

భర్త అడుగుజాడలో మీరు నడిచినా , మీ అడుగు జాడలో భర్త నడచినా ఇద్దరి అడుగు జాడలు తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడి.. సంసార మనే రథాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండ సాఫీగా సాగేట్లు కృషి  చేయాలి.. 

సర్వే జనా: సుఖినో భవంతు.. 

Thursday, September 5, 2013

అవన్నీ చెయ్యడం కష్టం .. రామాయణాన్ని విమర్శించడం సులువు..

ఆ మధ్య "వనజ వనమాలి" అను బ్లాగులో ఆగస్టు 13 వ తారీఖున రాసిన "మనం నేర్పేదేమిటి? " అన్న శీర్షిక న "రామాయణం" గురించి శ్రీరాముని వ్యక్తిత్వం గురించి, అగ్ని పరీక్ష మొదలు ఒక  అనామకుడి మాటలు పట్టుకుని గర్భిణి తో వున్న సీతమ్మని అడవిన వదిలేసిన సంఘటనలను విమర్శిస్తూ చాలా రాసారు.. ఇప్పటి తరం వాళ్ళకి మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలాంటి పుక్కిటి పురాణాలు చెప్పి లాభం లేదని విమర్శిస్తూ ముగించారు.. 
రామునికి అనేక వేలమంది భక్తులలో ఒక చిన్న భక్తుడిగా బాధపడినా, రామాయాణ్ని సమర్ధిస్తూ రాయడం వలన వారిని మరింత ప్రోత్సాహ పరిచి వాద ప్రతివాదనలకు తావివ్వకూడదని ఇన్నాళ్ళూ వుపేక్షించినా, శ్రీరాముని పై నాకున్న అనన్య భక్తీ విశ్వాసం నాకు తోచిన ఈ  నాలుగు విషయాలు రాయడానికి  నన్ను ఉపక్రిమించేలా చేసాయి.. 

1. రామాయణాన్ని ముందు ఒక కథ గానే ఆలోచిద్దాం.. నవరసాలు కలిగిన ఒక ప్రేమ కావ్యం అవడం వలననే ఆది గ్రంథం అయిన  రామాయణమే నాటి నేటికీ చాలా గొప్ప కథాంశం. పాత సినిమాలైన  పాతాళ భైరవి,మల్లీశ్వరి, తోట రాముడు మొదలు ఈనాటి అనేక  హిట్ చిత్రాలకు రామాయణమే మూలం.. హీరోయిన్ ఒక రాక్షసుడి దగ్గరో, విలన్ దగ్గరో, రాజు కోటలోనో బందీగా వుండగా, హీరో ఒక్కడు వెళ్లి ఆమెను కాపాడి తన దాన్ని చేసుకుంటాడు.. అంతకన్నా హిట్ ఫార్ములా ఇంతవరకు పుట్ట లేదు.. తరాన్ని బట్టి మాటలు , వెనకాల సెట్టింగులు మారతాయి.   కాని హీరోకి పక్కన   కోతుల్లాంటి  స్నేహితులు  వుంటారు.. 

ఈ క్రింది విషయాలు రామాయణాన్ని భక్తి భావంతో చూసే వారికి మాత్రమే అనుభవ వైద్యం అయి అర్ధం అవుతాయి..ఏ మత గ్రంథం  గాని , గురు వాక్యాలు గాని వాటిపై భక్తీ విశ్వాసం వుంటేనే అవి చదవడం వలన మనకి మంచి ఫలితాలు వుంటాయి.. లేక పోతే పుక్కిటి పురాణాలు గానే అర్ధం అవుతాయి.. 

1. వాల్మీకి శోకం నుంచి పుట్టిన ఈ పవిత్ర కావ్యం బీజాక్షరాలు కల్గిన శ్లోకాలుగా ఈ లోకానికి వెలువడి, ప్రతి రోజు రామాయణం (ముఖ్యంగా సుందరకాండ) పారాయణం చెయ్యడం వలన సకల దుఃఖాల నుండి విముక్తులమై పతిత పావన మూర్తి ఆ శ్రీరాముని  కృపా కటాక్షములను పొందగలము.. 

2. మీరు ఏమీ చెయ్యవద్దు ఒక నెల రోజులో రెండు నెలలో శ్రీరాముని మీద అత్యంత భక్తి  విశ్వాసాలతో ఒక పుస్తకం లో "శ్రీ రామ" అని ప్రతి రోజు మీ తీరిక సమయములో మీకు తోచినన్ని సార్లు రాయండి.ఫలితము మీకే తెలుస్తుంది.. ఏకాగ్రత, భక్తీ భావము ఇక్కడ  Important .. అవి లేకుండా ప్రపంచ లౌకిక విషయాలు ఆలోచిస్తూ రాయ కూడదు..
 
3. రామాయణ కావ్యం ద్వారా వాల్మీకి పరమ పవిత్రమైన గాయిత్రి మంత్రాన్ని లోకానికి అందించాడు..ఏకాగ్రతతో ఈ గాయత్రి మంత్రాన్ని పఠించండి .. ఏకాగ్రత కుదరాలి అంటే కొన్ని నియమాలు అవసరం. ధ్యానం, యోగా పైన కొద్దిగా అవగాహన కలగాలి.. Life style ని అవసరము అయితే మార్చాలి.. అంటే చెడు అలవాట్లు నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా వుండాలి.. కాని అవన్నీ చెయ్యడం కష్టం .. రామాయణాన్ని విమర్శించడం సులువు.. 


ఇక రామాయణం లోని ఆ బ్లాగులోని వెలిబుచ్చిన సందేహాలు గురించిన చర్చ లోకి వెళితే :
1. శ్రీరాముని కి తన భార్య మీద అనంత ప్రేమ వుండ బట్టే ఏక పత్నీ వ్రతుడు అయ్యాడు.. వేరొక స్త్రీ కి ఆయన హృదయంలో స్థానం లేదు.. .. ఈ ఒక్క మాట చాలు రామునికి సీతా దేవి పై వున్న ప్రేమ.. సీతా దేవి అడుగగానే బంగారు లేడి కై పరుగెత్తాడు.. ఇప్పటి మగ వారిలాగ భార్య ఏదైనా బంగారు నగ లేదా ఏదైనా వస్తువు అడిగితే "రేపు, మాపు" అంటూ వాయిదా వెయ్యలేదు.. 

2. ఇక రెండవ విషయము భార్య పైన ఇంత ప్రేమ వున్నవాడు గర్భిణీ అని చూడకుండ ఒక అనామకుడు మాటకు విలువ ఇచ్చి అడవిలో వదిలి వేశాడు.. రాముడు నేటి పాలకుల వలె ప్రజా సంక్షేమం కాక స్వార్ధ ప్రయోజనము కై పాలిస్తున్న వాడు కాదు.. తన రాజ్యం లోని ప్రతి మనిషి యొక్క భావాలు వేగుల ద్వారా కనుక్కుని తదనుసారం ప్రజా రంజక పాలన అందించాడు.. అందుకే "రామ రాజ్యం" లాగ వుండాలనే నానుడి వచ్చింది..రామ రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి మాటకు అంత విలువ వుంది..  తన మీద సీతా దేవి మీద నింద వచ్చింది కనక ఆమెను పుట్టింటితో సమాన మైన వాల్మీకి ఆశ్రమంలో వదిలి వేస్తాడు..  
..మూల రామాయణంలో లక్ష్మనునితో రాముడు ఆమెను అడవిలో వదిలి రమ్మని పలికిన పలుకులు, దానికి లక్ష్మణుని అభ్యంతరాలు చదవాలి.. (మధ్యలో వచ్చిన సినిమాలు ఇతర రామాయాణాలు మనకి ప్రమాణికం కాదు).. 

ధర్మాన్ని ఆదర్శంగా తీసుకున్న వాడికి భార్య అయినా తల్లి తండ్రి అయినా చివరికి సంతానం అయినా ధర్మం ముందు దిగదుడుపే ..
కేవలం కొంత మందికే అది సాధ్యం అందుకే వారు ఆదర్శ మూర్తులు అయ్యారు.. (దేవుళ్ళే కాదు ధర్మాన్ని సత్యాన్ని గౌరవించే వారు చరిత్ర లో గొప్ప స్థానాన్ని పొందారు. )

(మిగిలినవి తరువాత ..) Duty time అయ్యింది. 
 షరా : నా మాటల వలన రాముని యెడల భక్తి భావము , రామాయాణం మీద  విశ్వాసం, గౌరవం పెంచుకుంటే మంచిది లేక పోతే లేదు కాని మీకు నమ్మకం లేక పోయినంత మాత్రాన అనేక వేలు లక్షల మంది ఇన్ని తరాలుగా కొలుస్తూ నిత్యం పూజలు చేస్తున్న వారి భావాలను అపహాస్యం చేస్తు రాయకండి..  

హిందూ మతం ఒక్కటే  కాదు ఏ  మతాన్ని ఆచరించాలన్నా, ఏ దేవుణ్ణి కొలవాలన్నా  కొన్ని నియమాలు పాటించాలి..(అసత్యం, హింస, చోరత్వము, చెడు నడత - మనలో ఇవి లేకుండుట) 

అవి పాటించలేక మత విశ్వాసాలను, గురువుల చక్కటి బోధనలను వ్యతిరేకిస్తూ ఎవరికీ వారు విచ్చల విడి జీవితాన్ని అవలంబిస్తూ  వుండడం వలననే నేడు దుర్భర పరిస్థితులు, మనం బాగుపడం ఎదుటి వాణ్ణి బాగుపడనీయం .. ఇవీ నేటి పరిస్థితులు..