Thursday, February 27, 2014

ఈ కథ శివ పురాణం లోనిది కాదు..స్వీయానుభవము..

ఇది నిజంగా జరిగిన కథే..కల్పితం కాదు.. నేటికి సుమారు పదిహేను సంవత్సరాల క్రితం.. 
నేను మా డిపార్టుమెంటు కల్చరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న రోజులు..
నా ఆధ్వర్యంలో "అంతర్విభాగ నాటిక పోటీలు" జరుగబడుతున్నాయి..

పెద్ద పంచలోహ నటరాజుని విగ్రహము మా ఎడ్మిన్ డిపార్టుమెంటులో ఒక మూలన పడివుంటే అప్పటి లేబర్ ఆఫీసరు గారి వద్ద పర్మిషన్ అడిగి,  మా డిపార్టుమెంట్ కి తీసుకు వచ్చి.. ఫంక్షన్ మొదటి రోజున వేదిక మీద జ్యోతీ ప్రజ్వలన కొరకై శుభ్రంగా చింతపండుతో తోమించాను.. 


(This image is from Google)

చాలా కష్టపడి వేదిక వద్దకు తీసుకుని వెళ్ళి ఒక బల్లపై నిలబెట్టాను..
అప్పటికి మా వేదిక పూర్తి రంగస్థలములాగ లేక ఓపెన్ టాప్ వేదిక..
అప్పటికి సాయంత్రం నాలుగు అయ్యింది..ఇక రెండు గంటలాగితే కార్యక్రమము మొదలు అవాలి..
కాని హటాత్తుగా ఆకాశం మేఘావృతం అయ్యింది..రోజంతా ఎండగాచిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కుంబవృష్టి కురిసింది..వేదిక మీద నటరాజు- వేదిక కింద నేను తడిసి ముద్ద అయ్యాము..
ఈ వర్షం వలన ప్రోగ్రాము ఆగిపోతుంది అని ఒక పక్క భయం వున్నా అలా వర్షపు నీటిలో తడిసి ముద్ద అయిన ఆ చిద్విలాస నటరాజ మూర్తి ని చూసి స్వామి ఇలా అభిషేక మూర్తుడై నిలచి వుండటం ఆశ్చర్యము, భయము, భక్తి కలిపి ఒక అపురూప దృశ్యము నా మదిలో నిలిచింది.. 
అటుపిమ్మట ఆ కార్యక్రమము వాయిదా పడింది..కాని అప్పుడూ వర్షాలే.. మరల పోస్టుపోను అయింది.. అప్పటికే నా మీద వ్యతిరేక భావనలు వున్న వాళ్ళు అపహాస్యములు చేస్తున్నారు.. అయినా నేను చలించలేదు..

ముచ్చటగా మూడో సారి..స్వామి మీదే భారం వేసాను.."స్వామీ.ఎక్కడో మూలన పడివున్న నిన్ను తీసుకువచ్చి ఇలా నిలబెట్టినందుకు ఇలా నాకు శిక్ష వేసావా" అని మధన పడ్డాను.. 
జరగని రెండు ప్రోగ్రాములకి కొంత ఖర్చు అయ్యింది.. అవి తిరిగి రావు..నష్టమే భరించాలి తప్పదు..
అయితే ఈ సారి మాకు దగ్గర్లో వున్న శివాలయానికి వెళ్ళాను..శివునికి అభిషేకం చేసాను..నా ప్రార్ధనను, బాధను విన్నవించుకుని ఈ సారి ఎలాగైనా ప్రోగ్రాము అయ్యేలా చూడు స్వామి అని వేడుకున్నాను.. 

అంతే ఆశ్చర్యం.. ఎక్కడా ఏ అవాంతరాలు లేకుండా నాటికల పోటీలు జరిగాయి..వాటిముందే మేనేజ్ మెంటు పెద్దలు రెండుసారులు వాయిదా పడ్డ కారణంగా జరిగిన ఖర్చులకు అదనపు డబ్బు మంజూరు చేసారు..
ప్రోగ్రాములు అయిపోగా నా దగ్గరే సొమ్ము మిగిలింది..దానిని నేను నా సొంతానికి వుంచేసుకోవచ్చు..కాని ఐదు డిపార్టుమెంటుల కార్యకర్తలకు ఇచ్చేసాను..వాళ్ళు మాకు అక్కర్లేదు..ఇప్పటికే మీకు  నష్టం  జరిగింది కాబట్టి నువ్వే వుంచేసుకో అన్నారు.. కాని నేను ఇష్టపడలేదు..దేవుని దయవలన కార్యక్రమము జరిగింది..ఇందుకు మీ అందరీ సహకారము లభించింది..నాకు అదే పది వేలు..ఇంక నాకు డబ్బు ఎందుకు అని ఇచ్చేసాను..
అప్పటి దాకా నన్ను అనేక విధాలా విమర్శించిన వాళ్ళే ప్రశంసలతో ముంచెత్తారు..  కాని అవేవీ నేను పట్టించుకోలేదు..ఇది నా గొప్ప కాదు..ఆ శివుని లీల, ఆ నటరాజుని వినోదం..నాకు పరీక్ష.. అని మనసులోనే అనే భావన లో వున్నాను.. 

దుమ్ము పట్టిన నటరాజు విగ్రహాన్ని నేను కాబట్టి తెల్లగా తోమించాను అని గర్వంతో వున్నాను గాని... వేదిక మీద పెట్టేముందు మనసారా ఆ స్వామిని ప్రార్ధించడము గాని, ఒక కొబ్బరికాయను కాని కొట్టలేదు..నాలో వున్న గర్వాన్ని అణచడానికి, భక్తి చూపడంలో అలక్ష్యం చూపినందుకు బహుశా ఆ స్వామి ఇలా చేసి వుంటాడు.. 
కాని ఆ నటరాజుని కరుణా కటాక్షాల వలన  నటనా రంగం నన్ను ఆదరిస్తోంది..చేసినవి కొద్ది నాటికలే అయినా.. మంచి పాత్రలు నాకు లభించి పేరు తీసుకు రావడము.. మా నాటక సమాజం ద్వారా కువైట్ వెళ్ళడము అంతా ఆ స్వామి దయే గాని మరొకటి కాదు అని నావిశ్వాసము.. 
   
ఈ కథ ఎవరికీ చెప్పలేదు..కొద్దిమంది నా మితృలకు తప్ప..ఇప్పటికీ వీలైనంత వరకూ ప్రతీ సోమవారం ఆ శివాలయానికి వెళ్తాను.. నాకు ఏవైనా కార్యక్రమాలు జరగాల్సి వచ్చినప్పుడు స్వామీ ఏ ఆటంకం లేకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటాను.. ఇప్పటి వరకూ స్వామి రక్షిస్తునే వున్నాడు.. 
అయితే నా జీవితంలో కేవలం సుఖాలు మాత్రమేనా దు:ఖాలు లేవా..అని అనుకోకండి..చీకటి, వెలుగు లాగే తీపి వగరు లాగే మానవ జీవితం సుఖదు:ఖాల మయం..మంచి జరిగినప్పుడు పొంగిపోవడము, చెడు జరిగినప్పుడు కృంగి పోవడము కాక రెంటినీ సమానంగానే తీసుకుని ముందుకు సాగిపోవాలి..ప్రతీ పని చేసే ముందు దైవనామ సంస్మరణం చేయుటవలన మనోధైర్యము కలిగి నిర్భయంగా వుంటాము.. 

ఈ రోజు శివరాత్రి పుణ్యదినాన ఏవో పురాణ విషయాల బదులు ఇలా నా జీవితం లోనే జరిగిన విషయాన్ని రాస్తే శివ భక్తులైన వారికి ఉత్సాహము,ఏ భక్తి లేని వారికి దేవుని లీలల వెనుక అంతరార్ధము తెలుసుకొని దేవుని మీద భక్తి కలిగి వుంటారని ఆశిస్తూ.. శెలవు.. 

P.S: శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్న మార్కండేయుడను నేనే..పరమ శివభక్తులైన గజము,సాలీడు,పాము, కన్నప్పను నేనే అని అనుకున్న రోజున ఆ శివుని కృపా కటాక్షాలు మనపై ప్రసరిస్తాయి అనుటలో సందేహం లేదు..     

Sunday, February 23, 2014

ఇస్పెషల్ ఛాయ్.. దీన్నే "టీ" అనికూడా అంటారు..

ఇద్దరన్నమ్ములు రోడ్డుమీద పోతున్నారు.. 

ముగ్గురు రోడ్డు పక్కన 'టీ" దుకాణం పెట్టి అరుస్తున్నారు.. 

"బాబూ..రండి బాబు రండి ..ఇస్పెషల్ ఛాయ్.. దీన్నే "టీ" అనికూడా అంటారు..మేము ముగ్గురం కలసి తయారుచేసినం"..

ఇవేవీ పట్టించుకోకుండా వెళిపోతున్న వారితో "ఓరి సిన్నోడా.. ఈడు నిజంగా నీ అన్న అనుకుంటున్నావా.. నీ సవతి కొడుకు.. మీ ఇద్దరి తల్లులు వేర్రా పిచ్చోడా.. ఇటురా".. 

"మా అన్న మంచిగ నాకు ఇల్లు కట్టి ఇచ్చినాడు".. 

"ఓరి సన్నాసి..అది నీ అయ్య జాగారా..తేరగా దొబ్బేసి నీకు చిన్న డాబా కట్టేడు..నీ ఆటలు నిన్ను ఆడుకోనీకుండా నీకు అన్నాయం సేసిండు, నీకిట్టమైన కూడు నిన్ను తిన నివ్వలె..చివరికి నీ మదర్ టంగ్ ని కూడా కబ్జా సేసిండు"..

"అదేటి మా ఇద్దరిదీ భాష ఒకటే కదా.."

"ఓరి సన్నాసి..భాష ఒకటే అయినా యాస వేరురా"...ఆణ్ణొగ్గీసి ఇటురా.. ఈ "టీ" తాగు.. 

తమ్ముడు అన్నని పడదోస్సి నాడు..

"టీ" తాగేడు..

"అన్నా! ఛాయ్ బాగుందే..టీ పొడి బదులు రగతం కలిపినట్టు..పంచదార బదులు ఎవికల పొడి వాడినట్టు భలే రుచిగా వుంది.."

"మరేటి..ముందే సెప్పినానా ఇస్పెషల్ "టీ" అని.. సీకట్లో ఎవ్వులికీ తెలవకుండా తయారు చేసినం.. అందుకు మా పెద్దమ్మ, సిన్నమ్మ కూడా భలే సాయం సేసినారులే.."

"ఏటి మీకు కూడా ఇద్దరు అమ్మలు వున్నారా??"

"ఆళ్ళు నిజానికి అమ్మలు  కాదొరే..మా పాలిటి దేవతలు..మాకు ఈ "టీ" ఫార్ములా ఇచ్చింది కూడా ఆళ్ళే.. ఎవ్వుళికీ తెలవకుండా సీకటి గదిలో తలుపులేసి మరీ ఇచ్చినారు.. నీ అన్నలాంటి దుర్మార్గులు అడ్డుపడితే ఆళ్ళందర్నీ బయటకు తోస్సి మరీ ఇచ్చేర్లే"..   

"సరే..పైసల్ తీసుకో అన్నా"..(అని ఓ పది రూపాయల నోటు ఇవ్వబోతాడు)..

మొదటి వాడు: "తమ్మీ..పైసల్ నాకియ్యి...కట్టపడి అగ్గి రాజేసినా.."..కట్టబడి "టీ" నేనే తయారు చేసా..

రెండవ వాడు: "అరె..చుప్..పాలు,పందార, టీ పొడి నేను తెచ్చా..పైసల్ నాకె రావాలె..అసలు కట్టపడినోడ్ని నేను..

మూడవ వాడు: "ఏందిబే నకరాలు చేస్తున్నారా?? కప్పులు తెచ్చింది ఎవడు బే.. నేను గనక కట్టపడి ఆఖరు క్షణంలో కప్పులు అందించక పోతే మీరు "టీ" ఇవ్వగలరా..

(అని ఒకరి మీద ఒకరు కలబడి కుమ్మేసు కుంటారు..ముగ్గురూ కలబడి "టీ" తాగినోడి మీద కలబడి నాలుగు తన్ని నోటు నాకివ్వు అంటే నకివ్వు అని పీకుతారు..)

దెబ్బలు తిన్న సామాన్యుడు : ఒరే..అసలు "టీ" ఇమ్మని నేను అడిగాన్రా..మీరు పైసల్ కోసం "టీ" దుకాణం ఎట్టి అక్కడికి నాకేదే వుపకారం చేసినట్టు బిల్డప్పులు ఇచ్చేరు కదురా..బంగారం లాంటి మా అన్నదమ్ముల అనుబంధాన్ని తెంచేసారు కదురా.. ఇదిగో ఈ నోటుని మూడు ముక్కలుగా సింపేస్తున్నా..ఒక్కోడు ఒక్కో ముక్క తీసుకుని ఏడవండి..పనికిరాని మా నోటుని జేబులో ఎట్టుకుని కులకండి..  
     
(అన్న ఇంటికెళ్ళేసరికి పెద్దమ్మ, చిన్నమ్మలు తోడి కోడళ్ళ మధ్య కూడా ఇలాంటి చిచ్చు పెట్టి..పెద్ద కోడలుని ఇంట్లోంచి తరిమేసారు..)

"మరి మాకు ఇల్లో.." అంటే.. శూన్యం లోకి చూపెట్టారు..  

(కథ కంచికి చేరలేదు...మనము ఇంటికీ చేరలేదు.. కాని వీళ్ళకి ఇల్లు లేకుండా చేసిన పిశాచాలు మాత్రం ఆనందంగా వున్నాయి (దేవతల రూపంలో). 

   

Thursday, February 20, 2014

తెలంగాణా అన్నదమ్ములకు..అక్కచెళ్ళెలకు శుభాకాంక్షలు..

నిజమైన తెలంగాణాగా వాదులకు, అమాయకంతో కూడిన నిజాయతీయే వూపిరి గల తెలంగాణా అన్నదమ్ములకు..అక్కచెళ్ళెలకు శుభాకాంక్షలు..
ఈ రోజు సాయంత్రం 6 నుండి రాజ్య సభ ఆసాంతం చూసాను..షిండే, జై రం రమేష్ ముఖాలు మాడిపోయి ఒక్కోసారి చాలా అసహనం ప్రదర్శించారు..విభజన వ్యతిరేకించే పార్టీ లీడర్లు వీళ్ళ ముఖాన ఉమ్మేసిన చందాన తీవ్ర స్థాయిలో విరుకుని పడ్డారు..లోక్ సభలో ఆమోదం తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా..సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, 10 ఏళ్ళపాటు ఉమ్మడి రాజధాని మొదలగు వరాలు ఇచ్చారు..

షరతులు లేని హైదరాబాద్ సహిత తెలంగాణా కావాలని ఇన్నాళ్ళు గొంతు చించుకున్న టి.నాయకులు గెలిచి ఓడి..సంబరాలు చేసుకుంటున్నారు..

పదేళ్ళు కాదు వందేళ్ళయినా హైదరాబాద్ దేశ ప్రజలందరి సొత్తు..గతంలో ఇలాంటివి చాలా జరిగాయి..చట్ట సభల్లో ఆమోదం పొందిన బిల్లులు అనేకం అమలు పరచక పోవడమే భారత రాజ్యాంగ నేతల స్పెషల్..
గతంలో విడువడిన రాష్ట్రాల పాకేజీలు పూర్తిగా అందక ఆయా రాష్టాలు ఇప్పటికీ అయోమయ స్థితిలో వున్నాయి...

తెలంగాణాలో పూజలందు కోడానికి పెద్దమ్మలు,చిన్నమ్మలు పోటీ పడుతున్నారు..వాళ్ళ వీర భక్తులకి (పోత రాజులకి) లోటు లేదు..

కాని విశేషం ఏమిటంటే నిన్ననే హైదరాబాద్ లో వారం రోజులు వుండి వచ్చిన నాకు అక్కడ సామాన్యులు ఎవరూ అసలు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం పై కనీసం ఎక్కడా మాట్లాడుకోవటం కనబడ లేదు..
పైపెచ్చు సీమాంధ్ర నుండి అనేక పనుల నిమిత్తం వచ్చేవారి వలనే మాకు బేరాలు వున్నాయని ఆటొవాలా నుండి దుకాణ దారులు, హోటళ్ళ వాళ్ళు చెప్తున్నారు..
సార్ ఇంతకాలం అక్కడ ఏ అభివృధ్ధి చెయ్యకుండా గుత్తంగా హైదరాబద్ ని డెవలప్ చెయ్యడం మీ ప్రాంత నాయకులదే తప్పు సార్ అని ముక్త కంఠం తో చెబుతున్నారు..


ఏది ఏమైనా ఏడ్చిన దాని మొగుడొస్తే ఏడవదాని మొగుడు వచ్చినట్లు..ఈ ప్రత్యేక హోదాలతో, పరిశ్రమల కి రాయతీలతో. సీమాంధ్ర లో అభివృధ్ధి చెందితే..మా మనవల తరం వాళ్ళైనా బాగుపడతారు..ఇన్నాళ్ళు మమ్మల్ని దోసుకు తిన్నారు అన్న అపవాదుల నుండి విముక్తి పొందిన రోజు..Friday, February 14, 2014

ఇలావచ్చినది మా రాష్ట్రమని తెలంగాణా ప్రజలు చరిత్ర రాసుకోవాలా

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు ...ఇడియట్స్ లాగ 
ప్రవర్తిస్తున్నారు...

తెచ్చేదీ మేమే ..ఇచ్చేదీ మేమే ..అని అనిపించుకోవడం కోసం పశువుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు..

పసివాడు సైతం ఈ రక్కసుల ప్రవర్తనలకు సిగ్గు పడేలా ప్రవర్తిస్తున్నారు..

ఇలా ఇచ్చే తెలంగాణాని స్వీకరించే స్థితిలో ప్రజలు వుంటారా..
ముష్టి యుద్దాలతో..మల్లు యుద్దాల్తో అరాచక, అనైతిక పోరాటంలో వచ్చినది మా రాష్ట్రమని తెలంగాణా ప్రజలు చరిత్ర రాసుకోవాలా..

సొంత మనుష్యులను విలన్లు చేసి బిల్లు పాసు కావటానికి శత్రువులతో చేతులు కలపడం ..ఇదేమి రాజకీయం..

రేపు ప్రజల ముందుకి ఇరు ప్రాంత నాయకులు ఏ ముఖం పెట్టుకు వెళ్తారు??
దొంగ నేను కాదు..వాడు అని ఒకరి నొకరు దూషించుకుంటూ..తోడు దొంగల వలె దోచుకు తింటున్నారు...

ఇంత జరిగినా సామాన్యులు సహనంతో, సామరస్యంతో సాగిపోతుండడం..గ్రేట్..

ఓ కూలోడా,నాలోడా,బక్కోడా,బడుగోడా
రాబందుల కుట్రలకు బలి కావద్దు మనం..
నిలదీద్దాం జవాబుదారీ లేని (అ)రాజకీయాన్ని..

విలువ లేని నాయకత్వాన్ని పాతర పెడదాం..
అంతిమ విజయం ఎప్పుడూ సామాన్యుడిదే....Sunday, February 9, 2014

ఈ విభజన వాదులకు బుద్ధి చెప్పుట కష్ట సాధ్యమా...

ఓ భద్రగిరి రామా..కోదండరామా....

నాడు...

మురిసితినయ్యా నీ ఆలయ శిఖరమ్ము నల్లంత దూరాన గాంచి..
అచ్చెరువునొందితినయ్య సీతమ్మ నుందొడంగి నీదు రూపమ్మునుంజూసి..

అనాధరక్షకా నీవె నాకు రక్ష యనుచు మ్రొక్కుకుంటినయ్యా..
ఏకాకినైన నన్ను దయతో అక్కున చేర్చుకుని తోడువైనావు..

నీదు నామమ్ము నిత్యము జపించిన..
నీదు పాదమ్ము శరణని నమ్మిన ..
నీకిక తిరుగులేదని జనని జానకమ్మ వుపదేశించె..

అచ్చోటి నుండి నేడీ స్వస్థలంబునకొచ్చినను
ఎన్నోఏళ్ళయినను విడువ లేదు నీ నామము..
మరువలేదు నీ రూపమ్ము
భద్రపరచుకుని శాంతముగ జీవించు చుంటినయ్యా
సదా రక్షించు చుంటివయ్యా..ఓ భద్రగిరి రామా..

నేడు ముష్కరులు అనేకులు
తెలుగు నేలను విభజించు చందాన
గుడి,నది,ఊరు   వేర్వేర్యనుచు
ముక్కలు చేయ తెగబడుచుంటిరి..

వానర సైన్యము తోడ ఘోర రక్కసులను
హతమార్చిన నీకు..
ఈ విభజన వాదులకు బుద్ధి చెప్పుట కష్ట సాధ్యమా...

దాశరధీ కరుణా పయోనిధీ..Friday, February 7, 2014

అన్నా తెలంగాణా వచ్చేవరకు నువ్వు ఢిల్లిలోనే వుండరాదె ..రాష్ట్రం ప్రశాంతంగా వుంటది...


నమస్తే లల్లన్నా...

నమస్తే రావు భయ్యా..

దాణా సరిపోనాదె..

ఏడ..సరిగ్గా తిన నివ్వలే..ముండాకొడుకులు..

అరె మీక్కూడా నోటి కాడ బువ్వ లాక్కున్నారన్నట్టు..

ఈ కోటులో భలేగున్నావ్..మొత్తం ఎన్ని కోట్లు సంపాదించారు..

అబ్బే ఏడ పట్టుమని పది కోట్లు లేవు..లొల్లి చేస్తున్రు..

నువ్వేమీ ఫికర్ గాకు భయ్..తెలంగాణా బిల్లుకి మేం మద్దతు ఇస్తాం..

గట్లయితే నేను కోటెట్లా తొడగాలె..దిమ్మాక్ గట్లా ఖరాబ్ అయినాదె..సభలో మాట్లాడక గమ్మున వుండుండ్రి..మిగిలిన కత మా సీమాంద్ర నాయకులు సూసుకుంటరు..

సమజయింది ..ఫో..ఇంకో పది కోట్లు కుట్టించుకో..

వస్తా భై .....గీ విషయం మిగిలిన జాతీయ నాయకులకు చెప్పాలె..లేక పోతే నా దుకాణం బందైతది అన్నట్లు..

బుల్లి తెర వార్త : తెలంగాణా సాధన కోసం శ్రీ కరాచా గారు జాతీయ పార్టీ నాయకులు అందర్నీ కలసి చట్ట సభల్లో టి.బిల్లుకు మద్దతు కోరారు..

సారుకి ఫొను:  అన్నా తెలంగాణా వచ్చేవరకు నువ్వు ఢిల్లిలోనే  వుండరాదె ..రాష్ట్రం ప్రశాంతంగా వుంటది...
Saturday, February 1, 2014

మనది కర్మ భూమా?? "ఖర్మ" భూమా?? మీరే చెప్పండి..

(గత పోస్ట్ కి కొనసాగింపు) 
కన్యాశుల్కం నాటకం గురించి చర్చ చేస్తూ ఆ మహాకవి అంటే నాకు వ్యతిరేకమని భావించకండి..గత పాతికేళ్ళుగా ఎన్నో నాటికలు, నాటకాలు వేసినా మాకు కన్యాశుల్కం నాటకం వలననే ఎంతో పేరు వచ్చింది..కాని కన్యాశుల్కం నాటకం మీద ఎన్నో రీసెర్చిలు చేసి డాక్టరేట్ బిరుదును సంపాదించుకున్నవాళ్ళు కనీసం మాటమాత్రం గానే ఈ విషయాలు ప్రస్తావించలేదని నా మనవి..

1. దురాచారాలను రూపుమాపాలనే సదుద్దేశంతో రాసిన ఈ నాటకం సమాజంలో కొన్ని చెడు విషయాలు ప్రబలడానికి అవకాశం కల్పించింది..కొన్ని పంచ్ డైలాగులు (ఇప్పటి భాషలో) పెట్టి హిట్ కొట్టి తద్వారా మంచిని గాక,చెడుని ప్రోత్సహించేలా చేసింది..

2. "చుట్ట కాల్చినందుకు థాంక్స్ చెప్పక తప్పు పడుతున్నావ్.. చుట్ట కాల్చబట్టే కదా దొరలు అంత గొప్పవారు అయ్యారు..చుట్ట కాల్చడంలో వున్న మజా నీకేం తెలుసు?" అంటూ ఓ పదేళ్ళ కుర్రవాడికి చుట్టకాగా కాల్చడం నేర్పుతాడు గిరీశం పాత్ర  ద్వారా  ఆధునిక కవి .. 
పైగా  " ఖగపతి.....పొగ త్రాగని వాడు  దున్నపోతై పుట్టున్" అని సందేశం.. 
ఈ పద్యం విన్నవాడెవడయినా చుట్ట, సిగరెట్టు, బీడీ మొదలగునవి కాల్చకుండా వుంటారా? పైగా కాల్చేవాళ్ళంతా ఈ పద్యం చాలా గొప్పగా చెప్పుకునే వారు..(గిరీశం ఏవన్నాడో తెలుసా??అని) ..ఇలాంటి చెడు అలవాను ప్రోత్సహించారు.. దొరలు గొప్పవారు- అట? (ఏ విషయంలో ..మనల్ని బానిసలు చెయ్యడంలోనా)

3. ఈ నాటకంలో అనేక సార్లు జంధ్యం తియ్యడం.. గాయిత్రి  సాక్షి అని ఓ అబద్దం సాక్షం చెప్పడం..పైగా ఇన్నాళ్ళకు ఈ జంద్యప్పోగు ఇలా వుపయోగపడ్డది అని వెక్కిరింత.."మీలాగే వాడూ జంధ్యాలు వడుక్కుంటూ బతకాలా ఏవిటి?" 
ఇలా వైదిక ఆచార వ్యవహారాలను వెక్కిరింత ధోరణి గురజాడతోనే మొదలు అయ్యింది..రాజుల కాలంలో, ముస్లిం రాజుల పాలనలో, ఇంగ్లీష్ వారి కాలంలో జరిగిన అనేక మానభంగాలు, హత్యలు, దోపిడీలు (భారత దేశాన్ని అతలా కుతలం చేసినవి)ఇవేవీ  కనీసం మాటమాత్రంగానైనా సృజించలేదు..ఆనాటికీ ఈనాటికీ వైదిక ధర్మాల్ను ఆచరించే వారికి  గాయిత్రి  మాత ఆరాధ్య దేవత..ఒక్క బ్రాహ్మణులకే కాక అనేక ఇతర కులాలకు జంధ్యం ధరించడం ఒక ఆచారం..ఇప్పుడు కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాక ఇతరులు అనేక మంది  గాయిత్రి  మంత్రాన్ని పఠిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు.. అలాంటిది " గాయిత్రి  సాక్షి" అంటూ అవహేళన చెయ్యడం ఎంతవరకు సబబు.. 
   
4. గిరీశం అన్న వాడు విలను లక్షణాలు వున్న హీరో..చెడు వ్యసనాలు, వేశ్యాసంపర్కము, అబద్దాలు ఆడటము, ఆడవారిని చెడగొట్టడము..ఇలాంటివి వున్నా పైకి ఆషాడభూతుని వలె నటించి బుచ్చెమ్మ ని లొంగదీసుకుంటాడు.."వదినా" అని పిలుస్తూ ప్రేమ పాఠాలు బుర్రకెక్కిస్తాడు..వదిన అంటే తల్లితో సమానం..గిరీశం పాత్ర బుచ్చెమ్మను "వదినా" అంటూ పిలచి లవ్ ట్రాక్ రాయడంలో కవికి గల వుద్దేశం తెలీదు..ఇది సమాజాన్ని ఎటువైపుకి దారితీస్తుంది?? 

ఆ క్రమంలో అనేక విషయాలు సమీక్షిస్తూ తప్పు తోవలో నడుస్తున్న సమాజాన్ని మంచి దింసా గొట్టిన మార్గంలోకి మళ్ళిస్తున్నట్లు ప్రకటించినా..కవి పాత్రలో మంచిగా వున్న సమాజాన్ని చెడు మార్గంలో నడిచేలా చేసినట్లై భావి తరాల హీరోలంతా మందు, మగువ, సిగరెట్టు పట్టుకుని ఎన్నో అవార్డులు రివార్డులు కొట్టేసారు..

5. ఇందులో వేశ్య పాత్ర - "మధురవాణి" -ఎంతో తెలివైనదానిలా చూపి మొత్తం నాటకమంతా వేశ్య పాత్ర చుట్టు తిరుగుతాయి.. "చింతామణి"నాటకంలో వేశ్యపాత్ర విటులతో వున్నను చిత్తము దేవునియందే నిలిపి చివరిఘట్టంలో పూర్తి ఆధ్యాత్మిక జీవితంలోకి మళ్ళుతుంది..అలాగే వేశ్యా సంపర్కము వలన కలిగే అనర్ధాలను తెలియజేసి సమాజానికి హితవు పలుకుతుంది..
కాని ఈ కన్యాశుల్కంలోని వేశ్య కనిపించిన ప్రతిఒక్కరికి ముద్దులిచ్చేస్తూ వుంటుంది..ఆడశిష్యుడు (10 ఏళ్ళకుర్రవాడు మొదలుకొని 60 ఏళ్ళ లుబ్దావధాన్ల దాకా -వయసుతో పనిలేదు..(కావలసినంత ముద్దు సీన్లు) ..ఆఖరుకి ఆడవారికి తన ఇంట్లోకి కూడా ప్రవేశించరాదనే నియమము పెట్టుకున్న "సౌజన్యరావు పంతులు" అన్న వున్నత ఆశయాలు కలిగిన పెద్దమనిషితో  కూడా "ఒక ముద్దుకి కరువో"అని ఫీజు కింద ముద్దు ఇమ్మని అడుగుతుంది.. 
ఆ వూరిలో వున్న పెద్దమనుషులంతా మధురవాణి ఇంట్లో కూడి ఎంతో ఎంజాయ్ చేస్తారు..వేశ్యా  సంపర్కము మంచిది కాదు అని చెప్పవలసింది పోయి,  అందులో వున్న మజాని రామప్ప పంతులు పాత్ర ద్వారా చూపిస్తారు..తద్వారా అనేకులకు ఆదర్శం అయ్యింది..

(అజ్ఞాతలు కామెంట్ చేస్తే చెయ్యవొచ్చు..ఇది తప్పు కాదు అని..కాని నా దృష్టిలో తప్పే -సుఖవ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాలు వస్తాయి కాబట్టి)    

6. ఆఖరున గిరీశం "డామిట్ కథ అడ్డం తిరిగింది" అంటూ వెళ్ళిపోతాడే గాని పరివర్తన వచ్చినట్లు చూపరు..సినిమాలో మాత్రం బుచ్చెమ్మకి గిరీశానికి పెళ్ళి అయినట్లు చూపిస్తారు..సమాజం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఈ దర్శక నిర్మాతలు నిలిచిపోయారు..

లోక హితవు కోరవలసిన కవులు, రచయతలు యదేశ్చగా తమ రచనలలోను, సినిమాలలోను చెడు దృశ్యాలు చూపటానికి అడుగుజాడ అయ్యింది..
ఈ నాటకానికి ముందు కేవలం పౌరాణిక, పద్యనాటకాలు మాత్రమే వున్నాయి..మాట్లాడుకునే భాషలో ఒక నాటకం రావడం చాలా గొప్పవిషయం..
కాని ఇంగ్లీష్ భాషలో ప్రవేశం వున్న రచయిత మధ్యమధ్యలో తెలుగు నాటకంలొ ఇంగ్లీష్ భాషను జొప్పించడమే గాక రవి అస్తమించని  పాలనలో ఎన్నో బాధలు పడి వుద్యమిస్తున్న కాలంలో అనేక సార్లు విదే శీయుల గొప్పతనాన్ని,  వారి చదువుల మాత్రమే గొప్పవని పొగడటం "ఇంగ్లీష్ రాకపోతే అసలు బతుకే లేదు అన్నట్లుగా చెప్పడం..విదేశీయుల సంస్కృతిని గొప్పగా అభివర్ణించడం-ఇంగ్లిషు వాడు నేచర్ స్టడీ చెయ్యమన్నాడోయ్..అలా అన్నాడు,ఇలా అన్నాడు అంటూ..భారతీయులంతా ఏకమై విదేశీ బహిష్కరణ చేస్తున్న కాలంలో ఈ రచన వలన ఇంగ్లీష్ వారిపై మోజుని పెంచడంలో రచయిత వుద్దేశ్యం నాకైతే అర్ధం కాలేదు.. 

ఇంకా చాలా వున్నాయి...మీ స్పందనను బట్టి వుంటుంది. 

నోట్: కన్యాశుల్కంపై విమర్శలు రాసి నేనేదో గొప్పవాణ్ణి అయిపోదామని కాదు.. కాని చలం మొదలు అనేక కవులు విచ్చలవిడిగా చెడు సంప్రదాయాలను గొప్పవిగా రాసి సమాజాన్ని చెడు తోవలో నడిపిస్తున్నారు..ఇప్పొడొస్తున్న సినిమాల్లో కూడా శృంగారం, తాగుడు మొదలగు చెడు పనులే గొప్ప విషయాలుగా చూపటం వలన యువత చెడుమార్గంలొ నడిచి ఇవాళ అనేక మానభంగాలు, అక్రమ సంబంధాలు, హత్యలు ఆత్మ హత్యలు జరుగుతున్నాయి.. పూర్వం విలన్ కి ఆఖరు సీనులొ పశ్చాత్తాపం వచ్చేట్లు చూపించే వారు కొంత నయం..ఇప్పుడు అదీ లేదు..
ఆగండి..కొంచెం ఆలోచించండి..మనకి వెకిలి హాస్యం, శృంగారం తప్ప ఇంకేమీ అక్కరలేదా??
అసలు  గౌతమ బుద్దుడు కి జ్ఞానోదయం అయిన కర్మ భూమేనా మనది??   లేక నేటికీ నిరుపేదలు, ఆడవాళ్ళు "ఖర్మ భూమి" అని తిట్టుకునే భూమా???..