Tuesday, April 15, 2014

చంకలో పిళ్ళాణ్ణి పెట్టుకుని.. ఊరంతా వెతికిందని..

సుమారు ఆర్నెళ్ళనుండి అనుకుంటున్నా అప్పికొండ వెళ్దామని..
ఇంటావిడ తీరుబడి చేసుకునేసరికి నిన్నను తీరింది..
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రహారీ గోడ పక్కనుండి అలా ఓ 10 కి.మీ లోపటికి వెళితే వస్తుంది ఈ అప్పికొండ గ్రామం..
సముద్ర తీరాన..చోళ వంశపు రాజుల కాలంలో అంటే 12 వ శతాబ్దంలో నిర్మించబడినది అని చెప్పబడిన పురాతన శివాలయం (శ్రీ రామేశ్వర ఆలయం) వున్నది..అడుగున్నర ఎత్తులో వున్న శివ లింగానికి మనమే నేరుగా అభిషేఖం చేసుకోవచ్చు..నల్ల రాతితో మలచబడ్డ  నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణ..
ఇంకా మరో రెండు శివ లింగాలున్న పాత రాతి మందిరాలు వున్నాయి..
ఇక సముద్రపు ఒడ్డుకి వెల్తే విశాఖ బీచ్ లోలాగ భయంకర మైన అలలు, కెరటాలు..లోతైన తీరప్రాంతం కాక, ఎంత ముందుకు వెళ్ళినా మోకాలు కూడా దాటి ప్రవహించలేదు..ప్రమాదం లేని బీచ్...
ఒడ్డున చిన్న కొండ దానిపై పురాతన ఇటుకలతో నిర్మించిన స్థూపం వున్నాయి..కాని అది ఎవరు ఎప్పుడు నిర్మించారో నాకు తెలియదు...
సిగ్గు పడాల్సిన విషయం ఏమిటంటే నేను ఇక్కడే పుట్టి,పెరిగి ఇక్కడే స్థిరపడ్డా గంగవరం బీచ్ గాని ముత్యాలమ్మపాలెం (పరవాడ) బీచ్ గాని ఈ అప్పికొండ బీచ్ గాని చూడకపోవడం...మొన్నా ఆ మద్యనే పద్మనాభ పురం..అంత కంటా ముందు రామతీర్థాలు, గోవిందపురం బీచ్ వెళ్ళాం..ఇవన్నీ సుమారు 50 కి.మీ లోపే వుంటాయి..అయినా ఎప్పుడూ వెళ్ళలేదు..
అయితే బోలెడు డబ్బు, కాలాన్ని వెచ్చించి ఢిల్లీ, ముంబై,పంజాబ్, మనాలి, కోల్కటా, కాశీ, హిరిద్వార్, ప్రయాగ, అయోధ్య, గోవా, మధురై, షిరిడీ ఇలాటివన్ని తిరిగాం...
కాని ఓ రెండొందల రూపాయలు, ఓ రెండుగంటల కాలాన్ని వెచ్చించి మా కళ్ళెదుటున వున్న ప్రకృతి అందాలను..పురాతన దేవాలయాలను దర్శించలేక పోయాను..ఈ స్థితి నాకేనా మీకూ వుందా...పంచుకోండి మీ అనుభవాలు...


ఎంతో ప్రయాసపడి నాసిక్ లో త్రయంబకేస్వర ఆలయానికి వెళితే క్రమశిక్షణ లేని జనాల తోపులాట, పద్దతీ పాడు లేని ఆలయ కమిటీ, పోలీస్ వారి బాధ్యతా రాహిత్యమైన క్యూ సిస్టం లో తోపులాట ల మధ్య కనులార దర్శించుకోలేని అసంతృప్తి మిగిలి వెనుదిరిగాం..ఇక్కడ ఏ తోపులాట వుండదు ..పూజారి నమకం, చమకం చదువున్నంత సేపూ మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు హాయిగా..

మీరు గోతెలుగు అనే ఈ పత్రిక చదివేరో లేదో అందులో ఎవరో కాశీలో గల అపరిశుభ్ర వాతావరణం గురించి బాగా
విశ్లేషించారు..
ఒక్క కాశీ యే కాదు ఉత్తరాదిన అన్ని ప్రాంతాలు అపరిశుభ్రంగానే వుంటాయి..హిందీ వాళ్ళు మేకప్పులు, సెంట్లు రాసుకుని తిరగడంలో చూపెట్టే శ్రధ్ధ పరిసరాలు శుభ్రంగా వుంచరని నా అభిప్రాయం..కిళ్ళీలు నములుతూ వుమ్ముతారు చండాలంగా...కాదంటారా...
Tuesday, April 8, 2014

మనలో మన మాట... పై రాబడి ఎక్కవట కదా.. అయినా మనకెందుకులే..."

నేను..... నేనే కాదు మా అన్నదమ్ములు అందరం ఒకటే స్కూల్ లో చదివిన ప్రిన్సిపాల్ Father గారు హటాత్తుగా మా ఇంటికి రావడం జరిగింది.. (ఒకానొక పనిమీద)..
ఆయన్ను అలా చూసే సరికి సరిగ్గా మాటలు రాలేదు.. కాళ్ళకి నమస్కరించి స్కూల్లో మా అనుభవాలు (క్లుప్తంగా) అలాగే ఆరోజుల్లో విద్యార్ధులు, తల్లితండ్రుల ప్రవర్తన మీద ఆయన అనుభవాలు నెమరు వేసుకున్నాం.. 


ఒక పావుగంట కబురులు..తేనీటి విందు సేవించిన తర్వాత.. 
ఫాదర్ గారు వస్తానని లేచి నిలబడి..
కొద్దిపాటి పక్షవాత వ్యాధితో మంచం మీద వున్న మా అమ్మగారిని చూసి వెళ్ళి వస్తానని చెప్పగా ...
మా తమ్ముడు  ఆవిడ గూర్చి ప్రార్ధన చెయ్యమని కోరగా... అలాగే అని పేరు తెలుసుకుని "నేను తప్పని సరిగా మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ప్రార్ధన చేస్తాను"... అని చెప్పి ఒక మంచిమాట అన్నారు... 

"మీరు కూడా మనసు ప్రశాంతంగా వుంచుకొని మా పిల్లలు బావుండాలి, అందరూ సంతోషంగా వుండాలి అని అనుకుంటూ వుండాలి" అని చెప్పి వెళ్ళారు.. 


పూర్వంలా కాక.. ఈనాటి వృద్ధులు చాలా మంది లో ఇది లేదు.. అని నా భావన.. 
చాలా మంది వుద్యోగస్తులు రిటైర్డ్ లైఫ్ ని చక్కగా ప్లాన్ వేసుకుని.. పిల్లలకు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ పెన్షన్ డబ్బులు, ఇంటి అద్దెలు ఏవైనా వుంటే వాటితో హాయిగా కాలం వెళ్ళబుచ్చుతూ ..టి.వీ ల్లో వరుసగా రోజంతా వచ్చే సీరియళ్ళను ఫాలో అవుతూ..కోడళ్ళ మధ్యనో.. కూతురు కొడుకుల మధ్యనో ఆ సీరియళ్ళ ప్రభావంతో పైకొకటి లోపల ఒకటి మాట్లాడుతూ పిల్లలను ఎడం చేసుకుంటూ డిటాచ్ మెంట్ లైఫ్ ని వారికి వారే ఏర్పరుచుకుంటున్నారు..(చాలామంది).. 

అవునంటారా?? కాదంటారా???  

"వాడు కారు, ఏ.సి.లు  కొనుక్కున్నాడంటా చూసావా బడాయి..
అక్కడెక్కడో జాగాలు కూడా వున్నాయట..
దాని పట్టు చీర చూసావా..ఖరీదెంత వుంటుందంటావ్.. 
మనలో మన మాట.. పై రాబడి ఎక్కవట కదా.. అయినా మనకెందుకులే..."  

కాని అదే నోటితో ఏవమ్మా బాగున్నావా. పిల్లలెలా వున్నారు..పెళ్ళి చేసేది ఏవైనా వుందా లేదా.. అని పలకిరిస్తే ఎలా వుంటుంది?? 

సొంత కోడళ్ళని, కొడుకులని చూసి ఈర్ష్య పడేవాళ్ళు కోకొల్లాలు.. కాదంటారా???