Friday, May 16, 2014

నిజాలు చేదుగా వుంటాయి... కాని ఒప్పుకోక తప్పదు..review on results

రొటీన్ కి భిన్నమైన కామెంట్లతో - ఈ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిద్దామనే ప్రయత్నం..

1. పక్క  వాడు  ఓడిపోయాడు కాబట్టి మనం గెలిచాం అన్న కోణం లో ఆలోచిస్తే..

ఫాను స్పీడ్ గా తిరగక పోవడానికి కారణాలు:

1. తల్లి..పిల్లల అజెండాలో ఎక్కువభాగం చంద్ర బాబు ని తిట్టడం తప్ప అధికారం లోకి వస్తే ఏమేమి చేస్తాం అన్న పాయింట్లు గట్టిగా చెప్పలేదు..

2. సాక్షి టీ.వీ, సాక్షి పేపర్ అంటేనే ప్రజలకు చికాకు పుట్టేలా ఎదిగాయి..మిగిలిన పేపర్లను అదేపనిగా ఎల్లో మీడియా అని ఎద్దేవా చేసినా ఎక్కువ మంది ప్రజలు వాటినే చదువుతున్నారు..విశ్వసిస్తున్నారు..

3. జగన్ గారు చెప్పులతో తిరుమల నడవటాన్ని కొంతమంది సహించలేక పోయారు.. ఇతర మతవిశ్వాసాలను నమ్మేవారు కూడా జగన్ తిరుపతి వెళ్ళటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియలేదు..

4. జనం కనబడగానే అదేపనిగా బుగ్గలు, తల నిమరడం కొంతమందికి నచ్చలేదు..

5. ఎక్కడ మాట ఎలా వున్నా విజయమ్మ గారు పోటీ చేసిన విశాఖలో అనేక పుకార్లు చెలరేగాయి..ఇన్నోవా కార్లలో కడపనుండి సుమారు 300 మంది అనుచరులు తిరుగుతున్నారని, ఇతర పార్టీల వారిపై దౌర్జన్యాలకు పాలుపడుతున్నారని..ప్రశాంతంగా వున్న విశాఖ ఒకవేళ విజయమ్మ గారు గెలిస్తే మరో సీమ లాగ తయారు అవుతుందని ప్రజల్లో భయాన్ని రేకెత్తించారు..

6. ధన పంపిణీ కార్యక్రమంలో కొంత అస్తవ్యస్తాలు జరిగాయి అని అంటున్నారు..మధ్య దళారీలు బాగుపడ్డారు..అసలు ఓటర్లకి పంపిణీ సరిగ్గా అవలేదు..ప్రాంతీయ నాయకులతో సమన్వయ లోపం కొంత జరిగింది..

7. ఒక మత విశ్వాసకుల ఓవర్ యాక్షన్ వలన, వారిలో వారు జగన్ వస్తే వారి మతం పెరుగుతుంది అని అనుకోడాల వలన..  ఇతర మతాల వారిలో వీరిని ఓడించాలనే పట్టుదల పెరిగింది..

8. కారణాలు ఏమైనప్పటికీ ఎక్కువ భాగం ప్రజలు రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకులు..ప్రభుత్వ వుద్యోగాలు రావు కాబట్టి బి.జే.పీ, తె.దే.పా వస్తే పరిశ్రమలు వచ్చి వుద్యోగ అవకాశాలు వచ్చి పిల్లలు బాగుపడతారు అన్న వుద్దేశం లో వున్నారు.. రాష్ట్ర విభజన కారణంగా బి.టెక్ చదివినా వుద్యోగాలు లేక ఇంటికొకరు వున్నారు..

9. ఆరోగ్య శ్రీ కార్డు, ఫీజుల రియింబ్రెన్స్ ..ఇలాంటివి కలిసొచ్చే అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదు..

10. సుమారు అరవై సీట్లు వచ్చాయి అంటే గట్టి పోటీయే ఇచ్చారు.. అయినా పైన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక ప్రజలని కలుపుకుని పోయి వారి కుటుంబం మీద వున్న అపవాదులు, అవినీతి మచ్చలను  తొలగించుకుంటే వచ్చే ఎలక్షన్ల లో విజయం సాధించవచ్చు..

పై వాక్యాలలో (10 లో) అవినీతి మచ్చ అని ఎందుకు అన్నానంటే కొంతమందికి బెంగుళూరులో వున్న అధునాతన పాలెస్ కళ్ళముందు కదులాడి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో విశ్లేషించుకున్నారు..

పైవన్నీ ఓ సామాన్యుడిగా నా పరిశీలనలు..తప్పులున్న క్షమించవలెను..మనకి ఎవరు వచ్చినా ఒకటే కాకపోతే ప్రజలు ప్రశాంతంగా వుండాలి..అభివృధ్ధి లేకపోయినా పర్వాలేదేమో గాని ప్రజల్లో  అభధ్రతా భావం వుండకూడదు..

గతంలో చేసిన తప్పులు చెయ్యకుండా వుంటేనే చంద్రబాబు గారు మరల ప్రతిపక్షం స్థానంలోకి వెళ్ళకుండా వుండగలరు..ముఖ్యంగా టీచర్లకి, ఎన్.జీ.జీ ఓలకి వ్యతిరేక నిర్ణయాలు పునరావృతం అవకూడదు..కక్ష సాధింపు చర్యలు, వేధింపులు వలన వుద్యోగస్తులు పాలనను తిరస్కరించారు..దానిని రాజశేఖర్ రెడ్డిగారు అనుకూలంగా మలుచుకున్నారు...

కొన్ని నిజాలు చేదుగా వుంటాయి కాని ఒప్పుకోక తప్పదు..                    

   

Thursday, May 15, 2014

టెన్షన్ తో.. ఈ నిద్రలేని రాత్రి ఎవరికి??

సమయం సరిగ్గా ఆరుగంటలు దాటి ముప్ఫై ఐదు నిముషాల నలభై నాలుగు సెకండ్లు అయ్యింది.. 
నాలుగు ఫోన్లు రింగ్ ఒక్కసారే అయ్యాయి...

బగన్: మూన్ అంకుల్..రేపు కౌంటింగ్ పెట్టుకుని హాయిగా మజా చెయ్యక ఈ టెలి కాంఫరెన్స్ ఏవిటి అంకుల్..

మూన్ రాయుడు: చూడమ్మా బగన్ ఏ విషయమైనా చక్కటి క్లారిటీ వుండాలి మనం..ఆ విధంగా ముందుకి పోదాం..

(ఇంతలో కిల్లారి తరుణ్ లైన్లో కొచ్చి) హలో..హలో..మూన్, బగన్..హలో..
కాని.. మూన్ రాయుడు: హలో..హలో..ఎవరూ..సరిగ్గా వినిపించట్లేదమ్మా..  నీ సిగ్నల్ వీక్ గా వున్నట్టుంది..ఎక్కడో మారుమూల అడవిలో కూర్చున్నావా..హలో..హలో..

కిల్లా తరుణ్: మూన్ గారూ..నాకు మాత్రం మీ వాయిస్ చానా క్లియర్ గా వినిపిస్తోంది..నేను ఆఖరు ఓవర్ ఆడుతున్నప్పుడు మీరు లూజ్ బాల్స్ వేసి చివరి బాల్ ఆడేవరకు అవుట్ అవకుండా కోపరేట్ చేసారు..అందకనకి మీకు ధన్యవాదాలు చెప్పేదానికి ఫోన్ చేసినా..కాని మీరు సిగ్నల్ బాగులేదని నన్ను పక్కకి పెట్నారు.. నాకు తెలిసిపోయింది..  

మూన్ రాయుడు: బాబూ తరుణ్!నువ్వు కాసేపు లైన్లో వుండు..ఇక్కడ గగన్ నేను కొన్ని డీల్స్ మాట్లాడుకోవాలి..దానికి నువ్వు అంపైర్ గా వుంటావని పిలిచాను..నీ పాత్ర అంతవరకే..

గగన్: మూన్ అంకుల్ కొత్తగా మాట్లాడవలసింది ఏమీ లేదు..ఎవరు అధికారం లోకి వచ్చినా..ఎవరి బిజినెస్సులు వాళ్ళవి..ఎవరి లాబీయింగులు వాళ్ళవి అని మా నాన్న పాలన నుండి వున్నదే కదా..ఆరోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా మీ మితృడికి అదే మా నాన్నకు మీరిచ్చిన సహకారం ఎలా మర్చిపోతాను..

ఇంతలో ఫోన్లో: అరె సన్నాసులు, బేవకూఫ్, లఫంగి నాయాళ్ళు.. (అంటు ఎవరిదో గొంతు వినిపిస్తుంది)
మూన్ రాయుడు: అరె గోసీఆర్..బండముక్కు నాయాల.. ఇదేమన్నా ప్రెస్ మీట్ అనుకున్నావా..ఏవిటా తిట్లు..

గోసీఆర్: అరె..యాద్ మర్చిన..మూనన్నా నువ్వా..గీ ఫాం హౌజల సల్లగ పడుకుని గిప్పుడే లేచినా గింతలో మా పి.యే ఫోన్ గిట్లా ఇస్తే, టి.వీ లైవ్ అనుకుని అలవాటుగా నా దండకం ఇప్పినా..

గగన్: గోసీఆర్ అంకుల్..హౌ ఆర్ యూ.. 

గోసీఆర్: అరె గగన్ ..పండగ చేస్కో..సీమాంధ్ర మొత్తం నీదే అన్నట్లు..

మూన్ రాయుడు: నీ నోటి దూల ఇంకా అట్లనే వుంది..మొన్న టీవీలో కూడా..ఇట్లనే కూసావ్..మన ఒప్పందం మర్చిపోయావా.. 

గోసీఆర్: ఎవడొస్తే ఏంది వయ్యా..మందిని దోసుకొనుడు..తినుడు.. అయినా మధ్యలో గీ జోకర్ విపన్ గాడుమాత్రం తక్కువ తిన్నాడా భయ్..గోసీఆర్ని గగన్ తిట్టిండా..గగన్ ని గోసీఆర్ తిట్టాడా? అంటు రెచ్చిపోయాడు ..దిమ్మాక్ గట్ల ఖరాబ్ అయ్యిందా..మన రహస్య ఒప్పందం బయటపెట్టేస్తాడని పరేషాన్ అయినా..

గగన్: ఏది ఏమైనా మూన్ అంకుల్... నీ రాజకీయ చతురతకి జోహార్..అందుకే నాన్న ఎప్పుడూ సెప్పేటోడు..మూన్ అంకుల్ దగ్గర పాఠాలు నేర్చుకో అని..

మూన్ అంకుల్: బాబు గగన్..మీనాన్న బతికి వుండే రోజుల్లో అసెంబ్లీ సాక్షిగా నన్ను భలే తిట్టాడు "మూన్ రాయుడూ..నేనుగాని నోరువిప్పానంటే..నేను మా అమ్మ కడుపులోంచి ఎందుకు పుట్టానా అని ఏడుస్తావు"..అని పంచ్ డైలాగుతో తిట్టాడు.. 

నువ్వు, మీ చెల్లి, మీ అమ్మ కూడా అంతబాగా తిట్టలేదు.. "అడుగుతున్నా...నిలదీసి అడుగుతున్నా"..అంటు డొంక తిరుగుడుగా తిట్టారు.. అందుకే స్పీడుగా తిరగవలసిన విసినికర్ర కాస్త నెమ్మదించింది.. అందుకే మునిపటి మన డీల్ రద్ధు..కొత్త డీల్ చేసుకునే అవుసరం వుంది.. ఆ విధంగా ముందుకి పోవాలని అనుకుంటున్నాను... 

గగన్: నేను పక్కా బిజినెస్సు మనిషిని..రేపు ఫలితాలు రానివ్వండి..ఎలాగు మా "క్వి.ప్రో" పాలసీ వుంది కదా..ఇంతకీ ఈ జోకర్ వెపన్ గాడు లైన్లో కి రాలేదు..ఎవరినైనా లైన్లో పెడుతున్నాడా కొత్తగా..

మూన్ అంకుల్: చూడమ్మా.. పేకాటలో షో ఫినిష్ అయ్యాక విసిరేసినట్టు జోకర్ లాటోడు..ప్రస్తుతం వాడికి మనతోను, మనకి వాడితోను పనిలేదు..తిట్టుడు ప్రోగ్రాం వున్నప్పుడు పిలుద్దాం..

సరె రెష్టు తీసుకోండి.. హాయిగా నిద్రపోండి..మీ నమ్మిన బంట్లను రేపు టీ.వీ ల్లో కూర్చోపెట్టండి..
అర్ధం పర్ధం కామెంట్లతో సమీక్షల మధ్యలో రెచ్చిపొమ్మను.. నీ టీములో ఆ గోసిరెడ్డి పమ్మ, దుంపటి బాంబాబు..బెటర్..నా దగ్గర వున్న పనికిరాని నాయాళ్ళను నేను పంపుతా..ఒకే..గుడ్ నైట్.. 

(ఇలా వాళ్ళు హాయిగా చల్లగా ఏ.సీ రూముల్లో తొంగుంటే ఇక్కడ ప్రజలు .. ఎప్పుడు తెల్లారుతుందా.ఎప్పుడు టీ.వీ ల్లో లైవ్ టెలికాస్ట్ కౌంటింగ్ చూద్దామా అని టెన్షన్ గా..తెల్లార్లూ నిద్రలేకుండా లక్షలు కోట్లల్లో పందెం వేసుకుంటూ రహస్యంగా తెచ్చుకున్న మందు సేవిస్తూ పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు)..రొటీన్ సీన్ చూడలేక పున్నమి చంద్రుడు మబ్బుల చాటుకు పోయాడు..         
     

Wednesday, May 14, 2014

టీవీ వాళ్ళు వచ్చేరు..నిన్ను తిట్టే ప్రోగ్రాం వుంది..

బగన్ : (సెల్ ఫోన్ రింగ్ అయితే నొక్కాడు) హలో మూన్ అంకుల్ ..ఎట్లున్నారు..సింగపూర్ నుండి ఎప్పుడొచ్చారు..

అంకుల్: (హుషారుగా): బ్రహ్మాండం గా వున్నానమ్మా..నువ్వు కూడా వస్తే హాయిగా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టే వాళ్ళం..

బెగన్: నాకు బెంగులోరు పాలెస్ వుండగా ..సింగపూర్ ఎందుకు దండగ..సరే ఏమిటి ఇలా కాల్ చేశారు..

అంకుల్ : సాయంత్రం మనకి టెలి కాంఫరెన్సు వుంది..మనతో ఆ బండముక్కు రావు గాడు, జోకర్ విపన్ గాడు, కిల్లాలి తరుణ్ జాయిన్ అవుతారు..సరిగ్గా ఆరు గంటలకి..వుంటానమ్మా...టీవీ వాళ్ళు వచ్చేరు..నిన్ను తిట్టే ప్రోగ్రాం వుంది..
ఆ విధంగా మనం ముందుకి పోదాం..మన డీల్స్ మరోసారి మాట్లాడుకుందాం...
బెగన్: సీ యూ అంకుల్..

Tuesday, May 13, 2014

డబ్బు తీసుకుని ఓటు వేసే వాళ్ళు జిందాబాద్...నేరస్తులు జిందాబాద్...

"పుట్టిన రోజు పండగే అందరికి..మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి"...
అని కమ్మగా సుశీల గారు పాడారు...
ఆనాటి మా మధ్యతరగతి జీవితాల్లో పుట్టిన రోజున పొద్దుటే తలంటు స్నానం (కుంకుడు కాయతో)..కొత్తబట్టలు..నాలుగు చాకిలేట్లు..పెద్దల దీవనలతో అక్షింతలు...పరవణ్ణం వితౌట్   జీడిపప్పు.. 

కాని ఈమాత్రానికే నెల రోజుల నుండే ఎప్పుడెప్పుడు పుట్టిన రోజు వస్తుందా అని ఎదురు చూడటం..కలల్లో తేలిపోవడం...

దానా దీనా మా పిల్లల పుట్టిన రోజున హడావుడి చేసినా... మన విషయంలో ,దానికి అంత ప్రాముఖ్యత లేదు...

ఎవరో అన్నట్టు..ఒక్కొక్క పుట్టిన రోజు తరిగి పోతున్న మన ఆయు: ప్రమాణానికి కొలబద్ద అని ఒక్కొసారి వైరాగ్యం కూడా వస్తుంది.. 

ఈ సుత్తి దేనికి అంటే నిన్న ఒక గ్రేట్ పర్సన్ పుట్టిన రోజు.. అంటే మనదే..అదేనండి నా పుట్టిన రోజు...
ఇలా నీకు నువ్వే గ్రేట్ అని రాసుకుంటే ఎలా ??అని అనుకుంటున్నారా..
ఎస్... ఎవరైనా వాళ్ళకి వారు అందరి కన్నా నేనే గొప్ప.... అన్న ఫీలింగ్ వుంటేనే.. ఆత్మ విశ్వాశం పెరుగుతుంది అని నా అభిప్రాయం..
అలా కాక ఇతరుల కన్న నేను తక్కువ వాణ్ణి... నేను ఏమీ చెయ్యలేను..అని నైరాశ్యంలో పడితే మరి ఎన్నటికి ఏమీ చేయలేడు...

మన చుట్టుపక్కల వారికంటే మనమే అన్నివిధాలా గొప్పగా విండటానికి ప్రయత్నించాలి..అంటే.. చదువులోను, క్రీడారంగాల్లోను..
కాని ఈనాటి యువత దీన్ని మరో విధంగా..అంటే.. ఖరీదైన సెల్ ఫోన్లు, వెహికల్స్, గర్ల్ ఫ్రెండ్స్ కోసమో పోటీ పడుతున్నారు...తల్లితండ్రులు కూడా వీళ్ళ ముచట్లు కాదనకుండా తీరుస్తున్నారు...

దేశం వెలిగి పోతోంది... అని వాజిపేయి గారు ఆనందిస్తే..ప్రజలు ఆయన్ను చీకట్లోకి నెట్టేసి, దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు..
దేశం మాట ఎలా వున్నా, ఓ వెలుగు వెలిగి నెంబర్ వన్ స్థాయిలో నిలిచిన రాష్ట్రాన్ని ముక్కలు కోసి నాశనం చేశారు...
ఎడారి లాంటి గుజరాత్ ని అభివృధ్ధిని చేశాను..ఇప్పుడు అవకాశం ఇస్తే దేశాన్ని అభివృధ్ధి చేస్తాను.. అని బల్ల ..కాదు కాదు ...మైకు గుద్ది చెప్తున్న గెడ్డపాయన చెప్తే..మన గెడ్డపాయన కూడా " ఒక్క సారి! ఒకే ఒక్కసారి చాన్స్ ఇవ్వండి !!అని అడిగేడు కాబట్టి ..ఈసారి ప్రజలు అవకాశం ఇస్తున్నారనే అనుకోవాలి...
డబ్బు వరదలా పారిన ఈ ఎన్నికలలో ప్రజల నిజమైన, నిజాయితీ తో కూడిన తీర్పు కాదని చిన్న పిల్లలకి కూడా తెలుసు...

దేవుడా..ఇంత స్వేచ్చ గల దేశం ఎక్కడా వుండదు...రాంగ్ పార్కింగ్ అయినా..ఎక్కడ బడితే అక్కడ కడుపులో వున్నది వొంపేసి "హమ్మయ్య ఈ దేశం లో పుట్టడం నా అదృష్టం" ..అని భావించుకుంటున్నాం..
ఒద్దు..మా వూరు సింగపూర్ లాగ, మా దేశాన్ని అమెరికాలాగ మార్చేసే ప్రభుత్వాలు మాకొద్దు...
అందుకే ఎక్కువ మంది ఓటుకు నోటు తీసుకుని దోచుకునే వాళ్ళని గెలిపించినా... చేసేది ఏమీ లేదు..
ఆనందంగా చిందులేస్తాం..
మా స్వేచ్చకి తిరుగుండదు....డబ్బు తీసుకుని ఓటు వేసే వాళ్ళు జిందాబాద్...నేరస్తులు జిందాబాద్...నేనేమిటి పెద్ద పెద్ద ఐ.ఏ.ఎస్సులు..ఐ.పి.ఎస్సులు..సెల్యూట్ కొట్టి దాసోహం అంటారు...

16 ఎవరికి నిజమైన పండగ??? స్వేచగా..యదేచ్చగా తినడానికి అవకాశం ఇచ్చే పాలకుల కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ అధికార్లకు, చిన్నా చితకా పనులకు లంచాలు తినే చిరు వుద్యోగస్తులకు నిజమైన పండగ...
సుత్తి ఎక్కువైందా...పుట్టిన రోజు కానుక..హి..హి..హి...

Friday, May 2, 2014

ఈనాటి నాయకులకు ఓటు వెయ్యడం అవసరమా అధ్యక్షా...

ఓటు వెయ్యని వాళ్ళు :
1.బాగా  వయసు మళ్ళి, మంచం మీద నుండి లేవలేని స్థితిలో వున్నవాళ్ళు..

2.ఎవడు వచ్చినా మనల్ని వుద్దరించడు అన్న నిర్లిప్తత కలిగినవాడు...లైన్లో నిలబడ్డానికి బధ్ధకించే వాళ్ళు..

3.రిజర్వేషన్ విధానం వలన అన్యాయమయిపోయిన కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు..

4.డబ్బులు బాగా సంపాదించిన ధనికులు కొంతమంది సామాన్యులతో సమానంగా లైన్లో నిలబడ్డానికి నామోషిగా ఫీల్  అయ్యేవారు...

5.ధనిక కుటుంబాల్లో స్త్రీలు..(కొంతమంది)..

6.విప్లభావాలు కలిగి మరో ప్రపంచం గురించి కలలు కంటూ వుండేవారు..

7.తమ పక్కింటికి పార్టీల వాళ్ళు ఇచ్చే బహుమతులు లేదా డబ్బులు అంది, వాళ్ళకు అందలేదని అలిగేవాళ్ళు...

8.ఓట్లు గల్లంతు అయినవారు..వేరే వూరు లేదా ప్రాంతానికి వెళ్ళిపోయిన వారు..

9.తల్లి కనిపారేస్తే,ఎక్కడో అనాధులుగా మారిన వాళ్ళు..

10.ఎన్నికల ముందు సంస్కృతంలో తిట్టుకున్నా, గెలిచిన తర్వాత ఇద్దరూ కలిసిపోయి కౌగలించుకుని..అధికారం చేజిక్కించుకుని..ప్రజాధనాన్ని, దేశాన్ని దోచుకుని తింటారు ఈ నాయకులు అనే అసహ్య భావంతో ఏ దొంగకీ వోటు వెయ్యడం ఇష్టం లేని వాళ్ళు..

11.ఏ పత్రికను ఫాలో అవ్వాలో తెలియని అయోమయ స్థితిని కల్గినవాళ్ళు  


ఇలా సగం మంది మాత్రమే వేసిన ఓట్లతో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గెలిచి..నిన్నటిదాకా కొట్టుకున్న వాళ్ళతో కలసి ఏర్పడిన ప్రభుత్వం...

ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వం అవసరమా అధ్యక్షా....