Saturday, July 12, 2014

ప్రపంచ కప్ పోటీ మ్యాచులా??? గల్లీ మ్యాచులా???

 

  అర్థరాత్రుళ్ళు మేలుకుని ఒక్క బంతి కోసం చెరొక పదకొండు మంది తన్నుకునే (కొట్టుకునే) ఆట ను చూసి ఆనందించే వయసు దాటిపోవడము వలన మరురోజు తాపిగా విశేష భాగాలను (హై లైట్స్) చూస్తున్నాను..
కాని.. ఇప్పటి ఈ మ్యాచులను చూస్తూ వుంటే ఇవి ప్రపంచ ఫుట్ బాల్ మ్యాచులా.. లేక గల్లీ లో జరిగే పోటీలా అర్థం కాకుండా వుంది.. (అభిమానులు క్షమించాలి).. 

ఈ మాట అంటున్నందుకు ఎందుకు సాహసిస్తున్నాను అంటే.. నేను యువకుడిగా వున్నప్పుడు మాయల మాంత్రికుడు మరడొనా లాంటి దిగ్గజాల ఆటను చూసిన వాణ్ణి..
ఇప్పటిలా ఇంటికో టీ.వీ లేని రోజు.. అప్పుడు నేను పనిచేసిన అటవిప్రాంతపు వూరిలో అసలు టీ.వీ ఇంకా పుట్టలేదు.. అక్కడికి నలభై కి.లో మీటర్ల దూరాన ఒకానొక వూరిలో పారిశ్రామిక ప్రాంగణంలో రక్షక భటుల విశ్రాంతి గదిలో వారి వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న టి.వీలో వాళ్ళని బతిమాలుకుని ...ఓ పక్కగా కూరుచుని ఈ వరల్డ్ కప్ ఫుట్ బాల్ మాచులు, మార్టినా నవ్రతిలోవా, అప్పుడే విరబూసిన  స్టెఫీ గ్రాఫ్ లాంటి దిగ్గజాల ఆటను కనులారా వీక్షించి రోమాంచిత వుద్వేగాలతో నిండిన.. 

నిదురలేని రోజులు అవి.. 

 

అప్పటి ఫుట్ బాల్ మాచుల్లో వ్యూహ రచన ముఖ్య మైనది.. ప్రత్యర్ధులకు అందని రీతిలో ఒకరికొకరు బాల్ అందించుకుంటూ ముందుకు సాగి ఎవరు ఎప్పుడు ఎలా గోల్ కొట్టారో తెలియని రీతిలో బంతి గోల్ లోకి వెళ్ళిపోయేది.. ముఖ్యంగా కార్నర్ షాట్ లు, గోల్ కి దగ్గరగా లభించే పెనాల్టీ కిక్కులు ... వాటి కిక్కే వేరబ్బా.. 

కాళ్ళ మధ్య నుంచి దూసుకు పోయే బంతి.. నెత్తిమీంచి కనురెప్పపాటులో బుల్లెట్ లాగ దూసుకు పోయి గోల్ పోస్టుకి వెంట్రుక వ్రాసిలో వెళ్ళి గోల్ కీపర్కి అందకుండా గోల్ లో పడిపోయె బంతి.. ఇలా ఎన్నని.. ఒక్క క్షణం  టి.వీ మీదనుండి దృష్టి మరిల్చామా.. గోల్ చూసే చాన్స్ మిస్సయి నట్టే.. ఎలానూ స్లో మోషన్ వుంటుంది కాని...డైరెక్ట్ గా చూసి పక్కవాళ్ళు అరుస్తూ వుంటే ఆ క్షణాన్ని మిస్సయిపోయామన్న బాధ వర్ణనతీతం.. 


అసలు నాకు ఈ మాచులు.. గొడవలు ఏవీ తెలీదు.. నా మితృలు  శ్రీ కృష్ణా రావు గారు డ్రిల్లు మాస్టారు పైగా క్రీడా రంగానికి వీరాభిమాని.. డ్రాయింగు మాష్టారికి డ్రాయింగులోను, డ్రిల్లు మాస్టారుకు క్రీడా రంగంలోను ఆసక్తి వుండి తీరాలని రూలు లేదు.. ఏదో జీతం ఇస్తున్నారు కాబట్టి నిర్లిప్తంగా నిరుత్సాహంగా పని చేసుకు పోతారు చాలా మంది..  

కానీ కృష్ణా రావుగారు అలాకాదు అంత దూరం నన్ను నా బండి మీద తీసికెళ్ళమని అడిగి నాకు వాటి మీద ఆసక్తి కలిగేలా చేసి.. చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టి ..అంతకష్టబడి ఆ మాచులు చూసినందుకు మా జీవితాలు ధన్యం అయ్యేయని తలుచుకుని హాపీగా నిద్రపోయేవాళ్ళం..

మరడొనా గురించి చెప్పలంటే పేజీలు చాలవు.. ఎగురుతాడో, గెంతుతాడో.. పిల్లి మొగ్గలు వేస్తాడో తెలీదు అతని దగ్గరికి బంతి వచ్చిందీ అంటే ఖచ్చితంగా గోల్ లోకి వెళ్ళిపోవాల్సిందే.. 


ఎలా కొట్టాడు?? కాలితోనా.. చేతితోనా.. తలతోనా ఎవరికీ అర్ధం కాదు.. ఖచ్చితంగా రిప్లే చూడాల్సిందే..   

అయ్యా ఇదీ పరిస్థితి.. పేలవంగా కొట్టే షాట్లు.. గోల్ పోస్టుకి వెనక్కి.. పైకి కొట్టే షాట్లు.. నేరుగా గోల్ కీపర్ చేతుల్లోకి వెళ్ళేలా కొట్టే షాట్లు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.. ఇవి ప్రపంచ కప్ మాచులా మా చిన్నప్పుడు యూనివర్శిటీ గ్రౌండ్ లో ఇంటర్ కాలేజీ మాచులా అనిపిస్తోంది.. 

వ్యూహరచన లేదు.. కుయుక్తులు లేవు..ప్రత్యర్ధులను తికమక పెట్టే ఆట లేదు..ఎవడి కాలికి బంతి తగిలితే వాడు తనకు తోచిన రీతిలో కొట్టేయడమే.. అలా అని నాకు అనిపిస్తోంది..
మరొక్కమాట చెప్పి ముగిస్తాను... ఒక మార్టినా గాని, స్టెఫీ గాని, మరడోనా గాని ఈ ఆటలో గెలవక పోతే ప్రాణం పోతుందీ అన్న రీతిలో ఆడేవాళ్ళు.. 

(ప్రాణాల్ని పణంగా పెట్టి ఆడటం) యుద్ద వీరుల్లాగ.. ఇక కోచుల సంగతి చెప్పక్కర లేదు వాళ్ళు నిజంగానే చచ్చిపోతారా అనిపించేది...

 
గమనిక: ఒక సినిమాని విమర్శించే  వాడు సినిమా తియ్యక్కర్లేదు.. కథలను విమరించే వాడు రచయిత అయి తీరాలని రూల్ లేదు..అలాగే ఈ ఫుడ్డు బాల్ మాచులను విమర్శించే వాడు ఖచ్చితంగా క్రీడాకారుడు అయివుండాలని రూల్ లేదు అని భావంతో  ఇదంతా రాసాను..
అన్ని రంగాల్లో క్వాలిటీ లేనట్టే ఇప్పుడు క్రీడారంగంలోను క్వాలిటీ మిస్సయి.. ఇతర వ్యాపార ధోరణులు పెరిగినందుకు చింతిస్తూ... దేముడు అభిమానులను కాపాడుగాక అని ప్రార్ధిస్తూ శెలవ్..