Saturday, August 23, 2014

సాగర ఘోషను మింగిన మీడియా హోరు..

ఈ రోజు కేంద్ర మంత్రిణి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు విశాఖపట్నం లో గల ఫిషింగ్ హార్బర్ సందర్శించారు.. 

ఇన్నేళ్ళ హార్బర్ చరిత్రలో ఒక కేంద్ర మంత్రివర్యులు ఫిషింగ్ హార్బర్ లో గల మార్కెట్ ఏరియాలో ఎక్కువ సమయం కలియ తిరగటం ఇదే మొదటి సారి అట..

మంత్రులు వస్తారు.. అలా పైపైన ఎగిరే సందర్శనములు (flying visits) చేసి వెళతారు. కాని అందర్నీ పలకరిస్తూ వివిధ రకాల చేప వుత్పత్తులను చూస్తూ వాటి వివరాలు అడిగి తెలుసుకుంటూ.. రోజు వారి వ్యాపారం చేసుకునే ముసలమ్మలను కూడా పలకరిస్తూ వారికి రోజుకి ఎంత కిడుతుందో తెలుసుకుంటూ... 
సుమారు ఓ గంట పాటు ఫిషింగ్ హార్బరు లో వున్నారు.. ఆవిడ అటు తిరగ్గానే వాళ్ళ  కళ్ళలో ఆనందం, చూట్టూ వున్నవారిలో వుత్సాహం..
ఒక కుర్రాడు అయితే పాట పాడుతూ గెంతులు కూడా వేసాడు.. తల్లి రొయ్య అనబడు టైగర్ రొయ్యను పట్టుకుని గెంతులు వేసాడు..కేంద్ర మంత్రిగారు ఆ రొయ్య గురించి వాడిని అడిగినందుకు వాడి సంతోషం ..ఓ నెల రోజుల దాకా నిద్రపోడేమో అని నా అనుమానం..  

ఒక చిన్న హాలు లో మీటింగ్ పెట్టారు..పక్క నున్న మా మిత్రుడు అన్నాడు "ఈ కంపు గదిలో పెట్టే కన్నా, వీళ్ళకి జాలరి పేట దగ్గరలో పెద్ద కమ్యూనిటీ హాలు వుంది అక్కడ పెట్టొచ్చు కదా" అని... దానికి నా సహజ సిద్దమైన హాస్యం తో "చేపల మార్కెట్టులో చేప కంపు వుండక, మల్లె పూల వాసన వస్తుందా.. రానివ్వండి".. అని ఓ కుళ్ళు జోకు వేసా.. 
దానికి పక్కనున్న మరో వ్యక్తి అన్నాడు "అదికాదండి.. ఇవాళ్టి ఒక్కరోజు మార్కేట్టు ఆపేవచ్చు కదా.." అని. 
దానికి నేను "చూడండి వాళ్ళు నెలరోజులో.. ఇంకా పైన రోజులో వేట కెళ్ళి అర్ధరాత్రికో..తెల్లార గట్రో చేపలు పట్టుకు వస్తారు.. వెంటనే మార్కెట్టు చెయ్యక పోతే అవి కుళ్ళిపోయి, పాడైపోయి పనికిరాకుండా పోతే.. ఎంత నష్టం.. అధికార్లు మూడు రోజులనుండి మైకుల్లో చెప్తే మాత్రం వ్యాపారం మానుకుంటారా.. వారి వ్యాపారం వారిదే మంత్రిగారి పర్యటన మంత్రిగారిదే... ఫిషింగ్ హర్బరు లో ఫిష్షులు కాక కూరగాయలు వుంటాయా..". అని మళ్ళీ కుళ్ళు జోకు ఒకటి వేసా... 
కుళ్ళిపోయిన చేపల కంపు ముందు నా కుళ్ళుజోకులు ఒక లెక్కా అన్నట్టు చూసారు...    
సరె చివరాగారికి నా అభియోగం ఏవిటంటే ఈ మీడియా వాళ్ళు వున్నారే.. సుమారు ఓ పాతిక కెమేరాలు అడ్డం పెట్టేసి కనీసం ఆవిడ ముఖం అన్నా మాకు కనబడకుండా "కవరేజి" చేసుకు పోయారు.. 

ఆవిడ వెళ్ళేచోటుకి ఆవిడకన్నా ముందు పరిగెట్టుకుని వెళ్ళడం.. ఆగివున్న ఆటో ఎక్కే వాడు ఒకడు..పిట్ట గోడ ఎక్కేవాడు ఒకడు.. సర్కస్ ఫీట్లు చేసే వాడు ఒకడు.. తోసుకుంటూ... నెట్టుకుంటూ..."మేడం..మేడం" అనో..."సార్..సార్" అనో కొన్ని వందల వేల క్లిక్కులు కొట్టివుంటారు.. 
హాలులో ఆవిడకు వూపిరి ఆడనివ్వలేదు... ఆవిడ ఏమి చెప్తున్నారో మిగిలిన వాళ్ళకి వినబడనివ్వ లేదు... కాస్త దగ్గరగా వెళదాం అనుకునే లోపు..ఒకడు రయ్యి మంటు వచ్చి గుద్దేసాడు.. పడిపో బోయా.. "ఓరి.. నీ బండ బడ" అని తిట్టా.. 

హాలు లో కూర్చున్నప్పుడు అన్నాను.."ఎందుకండీ ఇంతమంది?? ఓ ముగ్గురో..నలుగురో వచ్చి షూట్ చేస్తే.. దాన్నే మిగిలిన వాళ్ళు షేర్ చేసుకోవచ్చు కదా"..అన్నా పక్కనున్న మీడియా వ్యక్తి..ఏదో సర్దిచెప్పాడు వాళ్ళ మీడియా భాషలో... నాకు అర్ధం కాలేదు.. 
"ఇదే విదేశాల్లో అయితే ఇలా వుండదు.. ఒక్కరికో ఇద్దరికో పర్మిషన్ ఇస్తారు.. అదికూడా అధికార్లు  అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రసారం చేస్తారు.. ఇక్కడే ఇలా.." అన్నా.. పెద్ద నాకేదో తెలిసినట్టు.. 
కాని ఆ మీడియా వ్యక్తి "అది నిజమే సార్.. కాని ఇక్కడ అలా కాదు... ఎవరి తాపత్రయం వాళ్ళదే"... అన్నాడు.. 
మరి మీరు ఏవంటారు మిత్రులారా... 
"అయ్యా.. మీరింతమంది ఇన్ని కెమెరాలు పట్టుకుని వచ్చినా.. చూపించిందే పదిసార్లు చూపెట్టి రోజల్లా ఒకటే విషయాన్ని చూపిస్తారు.. పైగా అన్ని చానళ్ళ లోను ఒకేసారి... ఆ మాత్రం దానికి ఎందుకండీ ఇంతమంది.. ???" "నిజమే సార్.. అయినా తప్పదు.. మా వృత్తి ధర్మం మేము చెయ్యాలి కదా.." అలా అని ...చుట్టు వున్న వాళ్ళని కవర్ చేసేసి మరీ షూటింగ్ చేసిన కవరేజ్ ని.. అక్కడే వున్న మేము కూడా సదరు మంత్రిణిగారిని కేవలం టి.వీ లోనే చూడాల్సి వచ్చే ధౌర్భాగ్యాన్ని కలగ చేసిన మీడియా వారికి (అ)ధన్యవాదాలతో..స్వస్తి..                       

Saturday, August 16, 2014

భగవంతుని లీల.. ప్రత్యక్ష నిదర్శనం..

భగవంతుడు భక్తుల మధ్యలో వున్నాడు అనడానికి ఇది చక్కటి నిదర్శనం.. 
ఏ మాయా లేదు మంత్రం లేదు.. 
ఫొటో టెక్నిక్ అంతకన్నా లేదు బాబుల్లారా..
జాగ్రత్తగా పరిశీలించండి.. 

ఈ ఫొటో లోని జనాల మధ్యలో  శ్రీ వేంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు..     
ఇది ఎలా వచ్చిందో తరువాత చెప్తాను.. 

ముందు ఈ వింతను ఆస్వాదించి తరించండి.. 
ఓం నమో వెంకటేశాయా..