Friday, December 25, 2015

ఒకరోజు నా అనుభవాలు... అనుభూతులు....నిజజీవిత వాస్తవాలు..

కథ రాయడం అంటే ఒక రచయిత తన అనుభవాలకు కొన్ని అనుభూతులు అభూత కల్పనలు జోడించి రాయడమే...
కాని నిత్యవారి జీవనంలొ మనకు ఎదురయ్యే అనుభూతులు మనసుకి హత్తుకుని కదిలించిన అనుభవాలు..కూడా రాయొచ్చు అనుకుంటా..
నిన్నటి నుండి ఇప్పటి వరకూ జరిగిని అనుభవాలు.. :
1. నా బండి కొని నాలుగేళ్ళు అయింది.. కాని ఎప్పటికప్పుడు బద్దకించకుండా సర్వీసింగు చేయిస్తూ వుండటం వలన బాగానే వుంటుంది.. కాని ఈమధ్య మైలేజ్ లో తేడావచ్చి ఏవిటీ విషయం అని ఆరాతీస్తే "సార్..క్లెచ్ ప్లేట్లు పోయాయి మార్చుకోవాలని" ఒక ప్రేవైట్ మెకానిక్ చెపితే.. అతనికన్నా షోరూం లో ఇస్తే బెటర్ అని చెప్పి నిన్న షోరూం లొ ఇచ్చా..


కట్ చేస్తే సాయంత్రం బండి తీసుకోడానికి వెళ్తే వాళ్ళు కిస్మస్ హడావుడిలో కేక్ కటింగులు ప్రార్ధనలు, కేరింతలు..వీటన్నిటినీ చూస్తూ ఓ గంట గడిచాక...నా బండి నాకు ఇచ్చారు.. ఈ గాప్ లో వాళ్ళు రిపైర్ చేసే విధానం అంతా ప్రత్యక్షంగా చూసి ఒకింత అనుభూతిని పొందాను.. 

ప్రెవేట్ మెకానిక్ అయితే ఇంత పర్ఫెక్ట్ గా చెయ్యడు కదా అని ఆనందభాష్పాలు రాల్చాను.. కాని వాడు బిల్లు కూడా ఇంత చెయ్యడు కదా అని ఎక్కడో మనసు మూలుగుతోంది.. మనసుని తొక్కిపెట్టి..బండిని తొక్కుకుంటూ ఇంటిని చేరుతూ.."ఆహా ఇంతమంచి బండిని సజెస్ట్ చేసిన రమేష్ మంచి మిత్రుడు కదా" అనుకుంటూ..ఇంటికి రాగానే ఒక మెసేజ్ పెట్టేసా.."మంచి బండి కొనిపెట్టేవ్..నాకు అన్నివిధాలా సౌకర్యంగా వుందీ.. ముందుగా పండగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని నాకు తెలిసిన ఇంగీష్ ముక్కల పాండిత్యం ఒలకబోసా... 

ఇప్పటి వరకూ రిప్లై రాలేదు.. నా మెసేజ్ అర్ధం అయిందో లేదో .. అసలు మెసేజ్లు  చూసుకునే అలవాటు ఉందో..లేదో.. చూసినా అది నెగటీవ్ గా అర్ధం అయ్యిందేమో... రోజూ ముఖముఖాలు చూసుకుంటాం కదా ఈ మెసేజ్ ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడక అనుకున్నాడేమో.. మనసు ఎంత ఉద్వేగ పడితే మాత్రం ఒక ఫోను కాల్ చెయ్యక పెద్ద ఫోజుగా మెసేజ్ చేసాం... ఇంత వరకు అవతలి వ్యక్తి నుండి జవాబు రాకపోతే ఏమనుకోవాలి.... మనసు పలురకాలుగా ఆలొచిస్తుంది.. అసలు మెసేజ్ ఇవ్వకుండా వుంటే..  గొడవే లేదు కదా...మయసభలో ఎన్.టీ.ఆర్ లాగ..డైలాగులు కొట్టుకున్నాను...

2. ఈరోజు కిస్మస్ నాకు సెలవే.. కాని మా మేడం గారికి సెలవు లేదు.. అందువలన మనమే ఈరోజు స్వయం పాకం చెయ్యాలని బయలు దేరాను.. కూర ముక్కలు తాలింపు పెట్టి కుక్కర్లోనే కదా అని కాస్త హైలో పెట్టి.. ఆహా కె.సీ.ఆర్ మంచి యాగం చేస్తున్నాడు కదా చూద్దాం..అనుకుని భక్తి టీ.వీలో యాగం ఒకపక్క... టాబ్ లో ఫేస్ బుక్ ఒకపక్క మార్చి మార్చి చూస్తున్నాను... 

పవిత్ర యాగం చూస్తూ ఫేస్ బుక్ చూస్తూ వుంటే దేవుడు ఊరుకోడు కదా.. కూర కాస్తా మాడు వాసన వస్తేనే గాని అయ్యగారికి తెలివి రాలేదు.. సరే కింద కాస్త మాడు...పైన ఉడికీ ఉడకనట్లు ఉన్న కూర వరైటీ గా వుంది కదా అని అలాగే దించేసాను... ఇలా ఏ ఆడదీ వంట చెయ్యలేదని నా ప్రగాఢ విశ్వాసం.. కాని ఇంటి ఆడది ఊరుకోదుగా... అందుకని పాపానికి ప్రాయశ్చింత్తంగా.. మన ఎజెండాలో లేక పోయినా సాంబార్  తయారు చెయ్యడం మొదలుపెట్టాను.. ఈసారి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి మనసు ఇక్కడే పెట్టి సిమ్ములో ఓ గంట సేపు ఉడికించా.. అద్భుతహ...  ఆనక అప్పడాలు వేయించా.... 
సరే మధ్య మధ్యలో యాగం చూస్తున్నా.. కే.సీ.ఆర్ వారి సతీమణి..చుట్టు మనవలు బొద్దుగా భలే వున్నారు అనిపించింది...తెలంగాణాలో రైతులందరి బిడ్డలు కూడా ఇలా ముద్దుగా బొద్దుగా వుండాలని.. ఆ విధంగా కె.సీ.ఆర్ గారు ముందుకు పోవాలని కోరుకున్నాను...  
కె.సీ.ఆర్ కుమార్తె కవిత గారు కూడా కనిపించారు.. ఆవిడ భర్త గారు అనుకుంటా పక్కన వున్నారు.. ఆహా ఏమి నాభాగ్యము బహుశా ఆయనే ఆవిడ భర్త గారు..లైఫ్ లో మొదటి సారి చుస్తున్నాను కదా అని కళ్ళు చెమర్చాయి... 

అసలు వారి మేనల్లుడు హరీష్ రావే ఈవిడ భర్త అని మొదట్లో అనుకునే వాణ్ణి.. పాపము సమించు గాక...తరువాత తెలిసింది.. మంచు వారి అసలు అల్లుడు ఎలాగ కనబడ్డో కె.సీ.ఆర్ గారి అసలు అల్లుడు కూడా ఎప్పుడూ సీన్లోకి రాడూ అని.. ఈ విషయంలొ సొనియా గారి అల్లుడే నయం.. ఎంచక్కా వార్తల్లో ప్రముఖుడయిపోయి...అత్త సీటుకే ఎసరుపెట్టేడు.. అబ్బా సవాలక్ష కారణాల్లో అదొకటి లెద్దురూ.... 

వేద ఘోష వినిపిస్తుందని ఎదురుచూసాను... కాని.చండి మాత సహస్ర నామావళి పారాయణాన్నే కొంతమంది ఆవులిస్తూ కొంత మంది కెమేరా వైపు చూసి నవ్వుతూ... కొంతమంది మౌనంగా పారాయణం చేస్తూ ఉంటే.,.ఆహా జన్మ ధన్యమయింది కదా అని మళ్ళీ కన్నీరు కార్చేను...

3. మా టీ.వీలొ సుమలత గారు ఫామిలీ కోర్టు నిర్వహిస్తున్నారు.. జడ్జీ.. న్యాయవాది...ఇలా అన్నిపాత్రలు పోషిస్తూ... ఎక్కువగా చదులేని పేద కుటుంబాల వారినే ఎంచుకుంటారనుకుంటా...ఇలాంటి షోల్లో.. ఎంచక్కా తెలంగాణా యాసలో వాళ్ళు మాట్లాడేది.. ఒక్కోసారి అర్ధం కాకపోయినా..వారి కళ్ళల్లో ఆవేదన అర్ధం అవుతుంది... 


ఈ రియాల్టీ షోల్లో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి కూర్చోబెడతారు.. వాళ్ళు మాసిపొయిన బట్టలతో జిడ్డోడుతూ వుంటే సుమలతా..జీవిత..జయసుధలు..ఫుల్ గా మేకప్ అయి నిగనిగ లాడుతూ వుంటారు.. మధ్యమధ్యలొ వీళ్లల్లో వీళ్ళు.. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ వుంటారు.. 
ఎక్కువ మంది ముసిలాళ్ళు చూసే ప్రోగ్రాం ఇది.. వాళ్ళ జీవితాలకు ఈ కథలను అనునయం చేసుకుంటూ మరింత కుంగిపొతారు..లేదా కొంతమంది ఆనందం పొందుతారు.. 

సరే.. ఈరోజు కధలోకి వెళ్తే.. ఆమెకి పదేళ్ళ వయసులో ప్రేమించి పెళ్లి చేసుకోవడం నలుగురు పిల్లలు పుట్టి చనిపోవడం...ప్రస్తుతం ఇరవై ఏళ్ళ వయసులో ఒక అనారోగ్య కూతురు..తాను టి.బీ జబ్బుతో బాధపడుతూ.. మొగుడు సరిగ్గా చూడటం లేదని ఫిర్యాదు..ఎవరితోనే అక్రమసంబంధం పెట్టుకున్నాడని అపవాదు.. ఎవరి గొడవ వాళ్ళది.. ఈ క్రమంలో ఆ అమ్మాయి ఏడుస్తూ వుంటే నాకు అప్రయత్నంగా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి...  పదేళ్లల్లో పెళ్ళి ఏవిటి..  గురజాడ ఏవైపోయావు తండ్రీ.. నీ రచనలు ఎవరికోసం.. బాల్య వివాహం ఈరోజుల్లో...అట్టేసేపు చూడలేక చానల్ మార్చాను..
ఎలావున్నాయి.. ఒకరోజు నా  అనుభవాలు...  
  

 

Tuesday, December 22, 2015

ధనికుల వెంట్రుక కూడా పీకలేని ప్రజాస్వామ్య రాజ్యమా వందనం నీకు వందనం...

వడ్డీ వ్యాపారస్తులు అంటూ వేరేగా ఎవరూ లేరు...
అవసరం కొందరిది.. అవకాశం ఇంకొందరిది... 


రాత్రి అయ్యేసరికి పొట్టకి సరిపడా వుంటే చాలని ఆశ ఒకరిది..
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే దురాశ వేరొకరిది.. 


కష్టపడితే గాని పైసలు రావు కొందరికి...
కష్టపడకుండానే కాసులు వర్షం కురుస్తుంది కొందరికి.. 


అప్పు తీర్చలేక ఆకాశం వైపు చూస్తాడొకడు..
అప్పుని ఎరగా వేసి ఆస్థులని కాజేస్తాడు మరొకడు..   


వడ్డీకి చక్రవడ్డీ చూసి బేలగా కూలబడిపోతాడొకడు.. 
వడ్డీలకు బదులు మానాన్ని పణంగా పెట్టమంటాడొకడు...

పాలకులు, న్యాయస్థానాలు, రక్షక భటుల సాక్షిగా
సామాన్యుల ధన మాన ప్రాణాలు హరించుకుపోతుంటే....
కోట్లలో బకాయులు పడ్డ ధనికుల వెంట్రుక కూడా పీకలేని
ప్రజాస్వామ్య రాజ్యమా వందనం నీకు వందనం... 

Sunday, December 20, 2015

ఇండివిడ్యువల్ జీవితాన్ని కోరుకొని ఫైల్ అయిపోయిన నటుడు రంగనాధ్

పాత కాలం నాటకాలు, సినిమాల్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని తమ సర్వస్వం ధారపోసి పెంచిన కొడుకు తమను కాదనుకుని ఏ గొప్పింటి ఆడపిల్లనో పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే ఆ తల్లితండ్రులు పడే క్షోభని చూపెట్టే వారు.. నిజానికి అప్పటి జీవితాలు అలా వుండేవి..అప్పుడు తల్లితండ్రులు ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం నుంచి వచ్చినా పేద వారుగా మిగిలిపోయి ఉన్న ఆస్థి పిల్లాడి కోసం కరిగించి చదివిస్తే వాడు కాస్త రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టు చూపే వారు..
ఇప్పుడు ట్రెండు మారింది.. తల్లి తండ్రుల ఆలోచనా విధానం మారింది.. జీరో స్థాయి నుండి జీవితం మొదలుపెట్టి కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకున్న తల్లితండ్రులు ముందే ప్లాను గా తమ రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా గడిపేలా ప్లాన్ వేసుకుంటున్నారు.. 


తాము బతికున్నంత కాలం ఆస్థి పాస్థులు పిల్లలకి ట్రాంఫర్ అవకుండా జాగ్రత్తపడుతున్నారు.. రకరకాల ఇన్సూరెన్సులు,, బాంక్ అకౌంటులతో తమకున్న డబ్బును హాయిగా ఖర్చుపెట్టుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్ర జీవనాన్ని ఎవరి ఆసరా లేకుండా సొంతంగా బతికేయాలని.. తమ స్వేచ్చకు ఎవరూ అడ్డు చెప్పకుండా హాయిగా తాము కోరుకున్న జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు...

మరీ ఆధునిక భావాలు కలవారు.. ఎంత త్వరగా అబ్బాయో అమ్మాయో చదువులు పూర్తి చేసి ఏ అమెరికాయో వెళ్ళిపోతే అక్కడితో బాధ్యత తీరిపోయినట్టు భావించి మిగిలిన జీవితం వారి ఖర్మానికి వదిలేసి వీళ్ళు హాయిగా ఎంజాయ్ చెయ్యడానికే పరిమితం అయిపోతున్నారు.. 


పిల్లలు వారు నచ్చిన వారితో వెళ్ళిపోతే పైకి బాధ నటించినా కట్నం ఇచ్చి పెళ్ళిచేసే బాధ తప్పిందికదా అని సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు..
ఇక వీళ్ళు రోజంతా దిక్కుమాలిన టి.వీ సీరియళ్ళు చూడటం... నేరాలు ఘోరాలు...హత్యలు..అత్యాచారాలు ఇవన్ని చూసి ఎంజాయ్ చేస్తూ నిజ జీవితంలో కూడా కొడుకులు కోడళ్ళతో కృత్రికమైన ప్రేమ..అభిమానాలు చూపుతున్నారు...
ఆనాడు తల్లితండ్రులను గాలికొదిలేసిన తరం వాళ్ళే ఇప్పటి తల్లితండ్రులు.. అప్పుడు తల్లితండ్రుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాళ్ళే పిల్లల పట్ల కూడ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు... హమ్మయ్య ఇంట్లొంచి పోయాడు పీడాపోయింది అనుకుంటున్నారే గాని అయ్యో కూతురు ఎలా వుంది.. కొడుకు ఎలా వుందీ అని ఆలోచించరు.. తమ ఎంజాయ్ మెంటు తమకి వుంటే చాలు.. ఒక్కరొజు తమకు నచ్చిన సీరియల్ మిస్ అయితే ప్రపంచం తల్లకిందులు అయిపొయినట్టు బాధపడిపోతారు..

వయసు డెబ్బయ్యో పడిలోకి వెళ్తున్నా.. జీన్ ఫాంట్లు.. టీ షర్టులు వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని పాతికేళ్ళ కుర్రాడిలా ఫీల్ అయిపోతారు..ఇక ఆడవారి సంగతి చెప్పక్కర్లేదు.. సినిమాల్లో చూపిస్తున్నారుగా మోడ్రన్ అమ్మల్ని... బాబ్డ్ హైర్ వేసుకుని.. కాస్త అమ్మాయో అబ్బాయో వేరే వాళ్ళని చూసి నవ్వితే చాలు వీళ్లు రెచ్చిపోతారు.. ఏరా / ఏవే అమ్మాయి/ అబ్బాయి నచ్చేసిందా.??? అంటు తమ పిల్లలు ఎంత వేరం జెండా ఎత్తేస్తారా అని వాళ్లను ప్రేమ వైపుకి ఎగదోస్తారు....  

ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇలా ముసలి వయసులో ఎవరి మీదా ఆధార పడకుండా హోటళ్ళ మీదో పనిమనుషుల మీదో ఆధారపడి ఇండివిడ్యువల్ జీవితాన్ని కోరుకొని ఫైల్ అయిపోయిన  నటుడు రంగనాధ్ లాంటి వాళ్ళను చాలా దగ్గరగా చూస్తున్నాను కాబట్టి...

మను ధర్మ శాస్త్రం లో వర్ణాశ్రమ ధర్మాల గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు.. ఇప్పటి వాళ్ళు కూడా వర్ణాశ్రమ ధర్మాల్లో చివరిదైన ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారు.. కాని ఒక మెలిక వుంది.. 

ఆ కాలంలో రాజైనా సరే రాజ్యము,, సిరిసంపదా అంతా త్యజించి ఆశ్రమంలో గడుపుతు తమ చివరిరోజులు ప్రశాంతంగా గడిపి తమ అనుభవలాను ఇతరులకు నేర్పుతు   యువతరానికి ధర్మాన్ని ,..జీవితం పట్ల గురువులు, తల్లితండ్రుల పట్ల బాధ్యతను తమ అనుభావలను పంచి ఇచ్చి తృప్తిగా బతికి చివర్లో హాయిగా కన్ను మూసే వారు.. నిరంతర దైవ చింతనతో... 

ఇప్పటి వారు తమ సంపదను తమ వద్దనే వుంచుకుని... కొడుకులు.. కోడళ్ళను దూరంగా నెట్టేసి....నీకు రుపాయి నేను ఇవ్వను.. నాకు రూపాయి నువ్వు ఇవ్వద్దు.. అన్న చందాన బతుకుతూ... నేరాలు ఘోరాలు... కుటుంబ రాజకీయాలు ..ఒకరిపై ఒకరికి ద్వేషాలు... పగలు  ప్రతీకారాలు చూపెట్టే సినిమాలు సీరియళ్ళు చుస్తూ అశాంతిగా గడుపుతున్నారు.. 


అందుకే యువకులకి బాధ్యతను తెలియ చెప్పేవారు లేక.. మర్డర్లు... మానభంగాలు... నిజ జీవితంలో జరుగుతున్నాయి.. 
నేర చరిత్ర గల బిడ్డడి తల్లితండ్రులను ప్రశ్నిస్తే వాడికి మాకు ఎటువంటి సంబంధం లెదు.. ఎప్పుడో ఇల్లు విడిచి పెట్టి పోయాడు అంటారు.. 

మొన్న ఒక ఎంపీ స్థానానికి పోటి చెయ్యబోయిన రాజకీయ నాయకుడి కొడలుని హత్య చేసి చంపేస్తే ఆ తల్లి అంటుంది కదా" మా అమ్మాయి మమ్మల్ని కాదనుకొని వాడితో వెళ్ళిపోయింది...ఇప్పుడు అంతిమ సంస్కారం వాళ్ళే చెయ్యాలి" అని...  
ఏమైపొతుంది సమాజం.. ఎక్కడికి పోతున్నాం మనం...  

Monday, December 14, 2015

అదే రాముడిమీద... సీత మీద సెటైర్లు వెయ్యడానికి బార్లా కంపు నోర్లు తెరుచుకుంటాయి...

ఈరోజు ఆఫీసులో ఒకాయన నిన్న "మా పాపకి నిన్నఒంట్లొ బావులేదు 102 జ్వరం" అని చెప్పాడు..
"మరి ఏం చేసావు?" అని అడిగితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము" అని చెప్తూనే.. "సాయబు దగ్గరికెళ్ళి ఒక తావీదు కూడా కట్టించాను" అని చెప్పాడు..


"డాక్టరు గారి దగ్గరికి వెళ్ళారు సరే.. ఈ తావిదు సంగతేవిటి..అవన్నీ మూఢ నమ్మకాలు కదా.. ఇంకా ఈరోజుల్లో వాటిని నమ్మడం ఏవిటీ??" అని అడగ్గా..
"ఏం చేస్తాం అండి... ఆడవాళ్ళు ఒప్పుకోరు కదా" అన్నాడు..  


గురజాడ మొదలుకొని హేతువాద వాదులందరూ సాధించింది ఏవిటి??
కన్యాశుల్కం నాటకం లోని భ్రాహ్మణ ఆచార వ్యవహారాలను అపహాస్యం చేతుంటే కడుపుబ్బా నవ్వుకోని ఎంజాయ్ చేస్తారే గాని అందులో మూఢ నమ్మకాల మీద సంధించిన అస్త్రాలను పట్టుకోలేదా??


నిన్న మొన్నటి వరకూ ఒంట్లో బావులేక పోతే ఎక్కడో అక్కడ వాతలు పెట్టడమే చంటిపిల్లలకు..ఇప్పటికీ ఆ మచ్చలున్న వారు నూటికి 80 శాతం మంది  కనిపిస్తారు..
తెలంగాణా మొదలు శ్రీకాకుళం వరకు ఈ మూఢనమ్మకాలు బాగా విస్తరించి వున్నాయి.. ఇప్పటికీ...
మరి హేతువాదులు. నాస్తికులు అనబడే వారి రాతలు పుస్తకాలకే పరిమితమా.. 


దేవుళ్ళను.. ముఖ్యంగా హిందూ దేవుళ్ళమీద.. బ్రాహ్మణ వ్యవస్థ మీద ప్రశ్నించే మేధావులు అవార్డులు తీసుకోవడానికేనా రచిస్తారు?? 


హిందువులు అందరూ ముస్లిం ఇచ్చే తాయత్తులను.. తావీదులను నమ్ముతూ వుంటే.. మత అసహనం ఎక్కడ్నుంచి వచ్చింది??
మా వైజాగ్ లో ఈ తాయత్తులు అమ్మకాల ద్వారా రోజుకి కనీసం మూడు వేలైనా ఆర్జిస్తున్నారు.. వీటికి లెక్క చెప్పక్కర్లేదు.. పన్ను కట్టక్కర్లేదు.. 
రంగనాయకమ్మలు... ఇన్నయ్యలు.. పున్నయ్యలు...మిగిలిన హేతువాద లేదా నాస్తిక ముసుగు వేసుకున్న మేధావులు వీటిని ఎన్నడైనా ప్రశ్నించారా.. 


ఎంతసేపూ రామాయణం లోని లేని లోపాలను... భారతంలోని ధర్మాలను వేలెత్తి చూపి ఇతోధికంగా వారి మేధా శక్తిని బహిరంగ పరుచుకుంటారు..
నిజానికి ఈ మూఢ నమ్మకాల ప్రస్తావన ఏ పురాణాల లోను ఉన్నట్టు కనబడదు.. 

బ్రాహ్మణులు  కూడా వారికి వచ్చిన ఆయుర్వేదం ఆ తర్వాత వచ్చిన హోమియోపతీ ద్వారా చికిత్స అందించేవారు.. ఉచితంగా...
ఇప్పటిలాగ జ్వరానికి గాని తలనొప్పికి గాని వెళితే స్కానింగులు ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి వేలకు వేలు గుంజి కోట్లు సంపాదించలేదు.. 


దేవుణ్ణి పూజించమని.. ఆ పూజా ఈ పూజా చెయ్యమని చెప్పిన వారు బ్రాహ్మణులే కదా అని వాదించవచ్చు...
దేవుణ్ణి పూజించడం వేరు.. మూఢనమ్మకాలకు బలి అవడం వేరు... ఆనాటి కాలంలో లేవు కాని ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి..ఈ మూఢనమ్మకాలు...
తెలంగాణా అంతటా ఆడపిల్లలకి కాలుకి ఒక నల్ల దారం కడతారు.. పూర్వం పశువులకి కట్టేవారు..
సాక్షాత్తూ తెలంగాణా ముఖ్యమంత్రే పెద్ద తావీదు లాంటిది భుజానికి కిందన కట్టుకుని తిరుగుతాడు..సుమారు 5 కోట్లు ఖర్చుపెట్టి చండీ యాగం చెస్తున్నాడు.. అది ఆయన సొంత డబ్బే గాని.. రాష్ట్రపతి.. గవర్నర్లు... పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు సొంత డబ్బుతో రారు... వారికి సెక్యూరిటీ కొసం ఖర్చుపెట్టేది ప్రజల సొమ్మే... ఎందుకు చేస్తున్నాడో తెలీదు.. ఈ డబ్బు తీసికెళ్ళి తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకునే వారికి ఇవ్వచ్చు అని ఎవరైనా ప్రశ్నించారా?? 


ఈ కుహనా మేధావుల నోళ్ళు మూతపడ్డాయా... అదే రాముడి మీద సీత మీద సెటైర్లు వెయ్యడానికి బార్లా కంపు నోర్లు తెరుచుకుంటాయి...

ఇక దెయ్యాల గురించి భూత వైద్యుల గురించి అనేక రచనలు.. సినిమాలు... వాటిని సూపర్ హిట్ చేసే ప్రేక్షక దేవుళ్ళు...
ఒక్క మేధావి అయినా వీటికి వ్యతిరేకిస్తూ రచన చేసి అవార్డు తీసుకున్నాడా....
దేవుడి మహత్యాలు చూపించి సినిమాలు తీసే రోజులు పోయాయి... దెయ్యాలు..ఆత్మలు... గత జన్మ తాలుకూ జ్ఞాపకాలు అభూత కల్పనలు.. ఇవీ ప్రస్తుత సూపర్ హిట్ ఫార్ములాలు..


మరి ఈ అభినవ మేధావుల శాస్త్ర విజ్ఞాన పరిశొధనలు ఏం చెస్తున్నాయి... ప్రజలను చైతన్య పరచడంలొ విఫలం అయ్యారా...
సాహిత్య అకాడమీ అవార్డో ఇంకో దిక్కుమాలిన అవార్డో రావాలి అంటే హిందూ మతానికి.. హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా రాయాలి.. 


ప్రజల వలన..ప్రజల చేత..ప్రజల కొరకు ఏర్పరచుకున్న రాజ్యాంగం అపహాస్యమై అవినీతి చక్రవర్తులు..నేర చరిత్ర గల ఖూనీ కోర్లు అధికారం పీఠం పై కూర్చుని నల్ల ధనంతో కుబేరులై వెలిగిపోతుంటే..ఒక్క పూట తిండికి నొచుకోని పేదవాడు అసక్తుడై నిలిచిపోతే... ప్రశ్నించలేని మేధావి తనం.. పవిత్ర హిందూ మత గ్రంథాలను.. దేవుళ్ళను ప్రశ్నించే అధికారం ఎవరు ఇచ్చారు..

Monday, December 7, 2015

తాటకి..శూర్పణక.. రావణ వారసులు ఇప్పటికీ వున్నారని అర్ధం అవుతోంది..

మా రాముడు.. మా ఇష్టం.. ఆరాధిస్తాం.. ఇరవై నాలుగు గంటలూ స్మరిస్తాం.. మీకు ఏవిటి బాధ??
మేము కష్టాల్లో వున్నప్పుడు "ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయోభూయో నమామ్యహం" అంటూ పదే పదే జపించుకుంటాం.. లేదా "రామాయ రామ భధ్రాయ.. రామ చంద్రాయ వేదసే.. రఘునాధాయ నాధాయ సీతాయే నమ:" అని సింపుల్ గా ప్రార్థిస్తాం..

అదీ వీలుకాకపోతే.. ఉదయాన్నే రోజూ కనీసం పదిసార్లు..ఒక పుస్తకం మీద  " శ్రీరామ " అంటూ రాసుకుంటాం... రాత్రి నిద్రపోయే ముందు మనసారా రాముణ్ణి తలుచుకుంటూ హాయిగా నిద్రపోతాం..
మీకేవిటీ.. ఆహా మీ బాధ ఎందుకు... రాముణ్ణి పూజిస్తే మీకు జబ్బులు రావు.. మరణం అస్సలు రానే రాదు.. మీకు కష్టాలు అస్సలు వుండనే వుండవు అని బలవంతంగా మీరు ఆసుపత్రి బెడ్డు మీద వున్నప్పుడు ప్రచారం చేసి తద్వారా డాలర్లు  సంపదించుకోవట్లేదే..

రామ భక్తి మెండుగా ఉన్న ఒక పెద్దమనిషి తనకు తోచినది ఏదో పద్యరూపంలో రాసుకున్నాడు... స్వేచ్చ ఉంది  కదా అని ఇష్టానుసారం సీతా రాముల్ని దూషించడమే కాక ఆతనిని ఆతనికి సపోర్టుగా నిలిచిన వారిని వ్యక్తిగతంగా దూషించడం మీ యొక్క సంస్కారానికి మీ తల్లి తండ్రుల సంస్కృతికి నిదర్శనం...

మితిమీరిన స్వేచ్చ వుందికాబట్టే అసహనం కూదా వుంది.. ఇండియా తప్ప మరో దేశం వెళ్ళి వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడి చూడండి మరు నిముషంలో మీరు ఎక్కడ వుంటారో అసలు వుంటారో ఉండరో తెలుస్తుంది..

అయ్యా / అమ్మా... అసలు మాకు వాల్మీకి గురించి తెలీదు.. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలీదు.. నాకే కాదు గొంతుచించుకున్న మీకు తెలీదు.. తెలుసుకోవలసిన అవసరం మాకు లేదు.. ఒక శబరిలాగ ఒక దమ్మక్క లాగ ఆయన బొమ్మను ప్రేమిస్తాం ఆరాధిస్తాం... 

సీతమ్మను వేడుకుంటాం.. అమ్మా కాస్త చెప్పమ్మా మాగురించి అని....         ఆ యమ్మ నవ్వుతూ మాకు అభయమిస్తున్నట్లు భావించుకుని ధైర్యంగా బతుకుతున్నాం... 

ఇక ఎదురుగా ఆంజనేయ స్వామి అండ మాకు వుంటుంది...ఎక్కడ రాముడు వుంటాడో అక్కడే వినయంగా చేతులు జోడించి ఆంజనేయ స్వామి వుంటాడు.. 
నిత్యం రామ పాదాల దగ్గరున్న హనుమతో "నువ్వొక్కడివే రాముణ్ణి సేవచేసుకుంటె ఎలా మాకు అవకాశం కల్పించు"  అనగానే ఆ అయ్య పక్కకి జరిగిపోయి కూసింత జాగా ఇస్తాడు పాదసేవ చేసుకోమని..  

మా ముత్తాత పూజించేడు.. మా తాత పూజించేడు.. మా తలితండ్రులు రామాయణ భారత గాధల్ని విపులంగా చెప్పేరు.. మేమూ పూజిస్తాం.. ఆరాధిస్తాం...మా దేముడు మా ఇష్టం....


రావణున్ని... దుర్యోధనుణ్ణి  హీరో గా చేసి ఒక పెద్దాయన సినిమాలే తీసాడు.. చివరిరోజుల్లో ఎంత దారుణమైన  స్థితిని అనుభవించాడో మీకు తెలుసు..

ఇంకో పెద్దాయన హిందూ దేవుళ్ళను అవహేళన చేసి సినిమాలు తీసి కోట్లు సంపాదించి ఇవాళ మాకు మా పిల్లాడికి రక్షణ లేదు ఈ దేశంలొ అంటూ అసహనం ప్రదర్శించి విమర్శల పాలవడంతో తోక ముడిచాడు... 

వేరొక పెద్దమనిషి నేనూ నా ఇష్టం అంటూ దెయ్యాల సినిమాలు తీస్తాడు.. మాకు వీళ్ళే ఆదర్శం అని మీరు భావిస్తే అది మీ ఇష్టం.. మీ ఇష్టాలకు వ్యతిరేకంగా మీ స్వేచ్చకు భంగకరంగా ఎవరూ మాట్లాడరు... గొ టూ హెల్..

అదే విధంగా రామభక్తుల మీదనో హిందూ మతం వాళ్ళ మీద వ్యక్తిగత ద్వేషం చూపించే అధికారం మీకు లేదు.. మీ అభిప్రాయలు వెలిబుచ్చండి...తప్పులేదు...

మీ విజ్ఞానాన్ని అవినీతిమీదనో...సాటి మనుషులను మోసం చేస్తున్న ప్రస్తుత  రాజకీయ వ్యవస్థ మీద  కాక వేల సంవత్సరాల కితం జరిగిన అన్యాయాల గురించి గొంతు చించుకుని అరవండి.. దాని వలన ప్రయోజం ఏవిటో మీకే తెలియాలి... 

బ్లాగులోనే పాపం ఇంకొక పెద్దాయన మూడు పాతికలు దాటిన వయస్సులో ఆయన అనుభవసారం అంతా రంగరించి ఓపిక లేకున్నా పదిమందికి మంచిని మాత్రమే పంచుదాం అన్న ఉద్దేశ్యంతో ఆయనకు తోచినవేవో ఆయన రాస్తూ వుంటే ..సంస్కారం వుంటే మెచ్చుకోవాలి లేదా నోరుమూసుకు కూచ్చోవాలి.. 

అంతేగాని మీ వ్యక్తిగత దూషణలతో ఆయన మనసు గాయపరిచి ఈ బ్లాగులోకం నుండే తప్పుకోవాలీ అన్నంత అసహనం ప్రదర్శించ వలసిన ఆగత్యం కల్పించారు.. 
బ్లాగు లోకం సభ్యులందరి తరపున కాలక్షేపం కబుర్లు రాసే  శర్మ గారికి క్షమాపణలు తెలియచేసుకుంటున్నాను..

ఇదేనా మీ సంస్కారం.. ఇదేనా మీ విజ్ఞానం...చదువుకునే వాళ్ళు చేసే పనులేనా ఇవి.....ఒకడు తనకు తెలిసినది.. అనుభవించినది రాస్తే...దాడులు చేసి వాళ్ళ మనసులు గాయపరుస్తారా... 

ఆయన రాసిన వాటిలొ మీకు అభ్యంతరం అనిపించినవి సహేతుకంగా ఎత్తి చూపండి ఎవరూ వద్దనరు.. ఈ వ్యక్తిగత దూషణలు ఎంతవరకూ దారితీస్తున్నాయో ఆలోచించండి... ఇప్పటికైన మీ ధోరణి మారకపొతే ఈ తెలుగు బ్లాగుల్లో ప్రస్తుతం ఉన్నవాళ్ళు దుకాణం మూసేస్తారు.. కొత్తవాళ్ళు కన్నెత్తి చూడరు...అటువంటి పరిస్థితి తేవద్దని నా హృదయపూర్వక విన్నపం.. 
శర్మ గారికి.. శ్యామలీయం వారికి.. హరిబాబు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.. సంస్కార హీనులు చేసే వ్యక్తిగత దూషణ భూషణలకు  మనస్తాపం చెంది మీరు మీ రాతలను ఆపవద్దు.. మిమ్మల్ని అభిమానించి ప్రేమించే వాళ్ళు వున్నారు... . తాటకి..శూర్పణక.. రావణ వారసులు ఇప్పటికీ వున్నారని  వాళ్లవలన మనకి అర్ధం అవుతుంది అంతే...    

 
  

 

Tuesday, November 10, 2015

కొండవలసకి నాటకం ఒక పిచ్చి.. ఒక కిక్కు... ఒక సరదా..

కొండవలస లక్ష్మణరావు గారు విశాఖపట్ణం పోర్టు ట్రస్టులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గుమాస్తా గా పనిచేసారు... 
నటుడి కన్నా ముందు చక్కటి బొమ్మలతో గ్రీటింగు కార్డులు ప్రింట్ చేసి అవన్నీ టేబిల్ మీద పెట్టి సహోద్యోగులకి తక్కువ రేట్ కి ఇచ్చేవారు... 
స్క్రీన్ ప్రింటింగ్ టెక్నాలజీ అప్పుడే కొత్తగా వచ్చింది ... దీని కోసం చాలా కష్టపడేవారు... 

తదుపరి...  అప్పట్లో ఆంధ్రా యూనివర్శిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమో అంటే చాలా గొప్ప విషయం..
అక్కడ అత్తిలి కృష్ణారావుగారి శిష్యరికంలో నాటకాలు వేస్తూ డైరక్షన్ విభాగంలో కూడా మెళకువలు నేర్చుకున్నారు... 
ఇక మా పోర్టు అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం లాంటిది... కవులకు కళాకారులకు పుట్టినిల్లు మా విశాఖపట్నం పోర్టు ట్రస్టు...
నంది నాటకోత్సవాల కన్నా పోటా పోటీగా అంతర్విభాగ నాటక పోటీలు జరిగేవి... 
ఫైనాన్స్ విభాగం వారు.. వారి నాటికలను  వారే రాసుకుని ప్రదర్శించే వారు... అందుకే మిగిలిన విభాగాలకు భిన్నంగా ఫైనాన్స్ విభాగపు కల్చరల్ అసోసియేషన్ కి   "లిటరరీ అండ్ డ్రమెటిక్ అసోసియేషన్." అనే పేరుని స్వయంగా లక్ష్మణరావు గారు పెట్టడం జరిగింది... .

నాటకం తప్ప వేరే ప్రపంచం గురించి ఆలోచించని మనుష్యులలో ఈయన ఒకరు... నచ్చిన నాటికను తెచ్చుకోవడం..చాలా కొద్ది కాలం లోనే తయారు అవడం.. పరిషత్తులకి వెళ్ళడం ...ఇదీ దిన చర్య... అర్ధరాత్రి వరకూ లేదా ఒకోసారి తెల్లార్లూ రిహార్సల్స్ వేసినా మరుసటి రోజు పొద్దున్నే ఉద్యోగానిని హాజరు...


నాటకం ఒక పిచ్చి.. నాటకం ఒక కిక్కు... నాటకం ఒక సరదా.. నాటకమే ఊపిరి...అందుకే ఆ నటరాజ స్వామి కరుణించి చిత్ర సీమలో తనకంటూ గుర్తింపు తీసుకొచ్చిన పాత్రలను ప్రసాదించేడు... 

విశాఖ పోర్టు లో జరిగే పోటీలను చూసి ఎస్.బి.ఐ..స్టీల్ ప్లాంట్.. షిప్ యార్డ్ మొదలగు సంస్థల నుండి కొంతమంది ఔత్సాహిక నటులు వచ్చి నాటికలను తయారు చెయ్యమని ప్రాధేయపడగా.. వారికి డైరెక్షన్ చేస్తూ ఎంతో మంది నటుల్ని డైరెక్టర్లను తయారు చేసారు... ఎవరికీ తెలియని విషయం ఏవిటంటే ఈయన మంచి మేకప్ ఆర్టిస్టు..వారి నాటికలకే కాక ఇతరులకి కూడా మేకప్ అందించే వారు.... చాలా తక్కువ పారితోషికానికి.... ఆ రోజుల్లో కొంతమందికి నాటకం అంటే కసి.. చాలా సీరియస్ గా డైరెక్షన్ చేస్తూ చండశాసనుడిలాగ.. నియంత లాగ వాళ్ళు చెప్పినట్టుగానే సంభాషణలు పలకాలి...నిలబడాలి అని శాసించేవారు.. 

కాని కొండవలస వారు  చాలా సులువుగా హాయిగా నటులకి స్వేచ్చ నిచ్చి నటింప చేసేవారు... ఆయన భాషలో చెప్పాలంటే..."వీజీ.. వీజీ... స్టడీ..స్టడీ.." అంటూ ఉత్సాహ పరిచేవారు...
"ఒరేయ్ ఆడు అలా ఎడం వైపుకి తిరిగాడా...నువ్వు ఇలా కుడిపక్కకొచ్చి డైలాగ్ చెప్పు" అనే వారు..కాని డైలాగ్ డెలివరీ మాత్రం పర్ఫెక్ట్ గా వుండాలి అనేవారు...  
బాహుబలి లాంటి భారీ సబ్జెక్ట్ లు కాకుండా ఎక్కువగా ఫామిలీ డ్రామాలు ఎంచుకునే వారు... సినిమాల్లో ఆయన వాడింది ఫాల్స్ వాయిస్.. కాని నిజానికి ఆయన చాలా గంభీరమైన గొంతుతో గొప్ప కారెక్టర్ ఆర్టిస్టు గా రాణించే వాడు... ఎక్కువ హాస్య పాత్రలు కూడా వెయ్యడం జరిగింది.. అంతే స్థాయిలో సీరియస్ రోల్స్ కూడా వేసి మెప్పించారు...

అలా వందల నాటకాలు .. పరిష్యత్తులు.. పోటీలు....సన్మానాలు.. పురస్కారాలు ....అదో  అలుపెరుగని పోరాటం........ 
 సినిమా ప్రస్థానం కన్నా ముందు ఆయన వేసిన నాటికల్లో శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణ గారి రచనలు "రేపటి శత్రువు" "ఇండియన్ గ్యాస్" చాలా పేరుపొందాయి... వీటిని శ్రీ  వంశీ గారు చూసి ఆయన సినిమాలో (అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు) లో మంచి వేషం ఇచ్చారు.. 

ఇండియన్ గ్యాస్ నాటికలొ ఒక సోడాలు అమ్ముకునే పాత్రలో ఈ ఫాల్స్ వాయిస్ పెట్టి నాటిక మొత్తం ఫాల్స్ వాయిస్ తోనే చేయడం జరిగింది.. ఇదే ఫాల్స్ వాయిస్ సినిమాల్లో వాది దాదాపు అన్ని సినిమాలు ఒకటే వాయిస్ వాడడం జరిగింది.. అదే ఆయన కూడా అప్పుడప్పుడు బాధపడే వారు. తనలో దాగివున్న నిజమైన కళాకారుణ్ణి వాడుకోవట్లేదని...మూసపోసిన పాత్రలతో విసిగిపోయనని అనేవారు.. సినిమావాళ్ళు అంతే...  ఒక చిత్రంలొ ఏ పాత్ర ద్వారా ఒక నటుడు పరిచయం /క్లిక్  అయితే అదే పాత్రను అదే బాణిలో చెయ్యమని అడుగుతారు..తప్ప కొత్తరకం వేషాలు ఇవ్వరు.. బ్రహ్మానందం చెంపదెబ్బల కామెడీ కూడా అంతే... 

నాతో పరిచయ విషయానికొస్తే నేను ఇంటర్మీడియెట్
లో వున్నప్పుడే ఈయనతో పరిచయం ఏర్పడింది.. ఒక చిత్రకళా నికేతన్ లో... ఇక పోర్టుకి వచ్చాక ముందు ఒక చిన్న పాత్రనిచ్చి ప్రోత్సహించారు.. సోషల్ నాటికల్లో ఒకటో రెండో చేసాను ఈయన డైరెక్షన్ లో కానీ  "కన్యా శుల్కం" నాటికలో ఆడ శిష్యుడి పాత్రను వేసి ప్రేక్షకులను మెప్పించాను...సుమారు పాతికేళ్ళ కితం ......ఎంతో మంది సీనియర్ కళాకారులతో కన్యాశుల్కం నాటకాన్ని కొండవలస గారి డైరెక్షన్ లో ఒక పది ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం... అందువలన నేను కూడా నటనలొ మెళకువలు అలా సీనియర్ల నటన దగ్గరగా చూసి నేర్చుకున్నాను... కళలకు ప్రత్యేకించి కోచింగ్ వుండదు...అది ఏ కళ అయినా ....  

ఇక ఆయన పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక సినీమాల్లో బిజీ అయాక మాతో సంబంధాలు తగ్గిపోయాయి... చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తో ఫోనుల్లో మాట్లాడటం చేసే వారు.. వైజాగ్ వచ్చినప్పుడు కలిసే వాళ్ళం.. అప్పుడు "శంకరూ బావున్నావా.." అని అప్యాయంగా పలకరించేవారు..
 

కానీ బాధాకర విషయం ఏవిటంటే కళ్ళు చిదంబరం లాగే ఈయన కూడా వ్యసనాలకు లోను కావడం వలన సుమారు పది సంవత్సరాలనుండి హృద్రోగంతో బాధపడుతున్నా... ఏనాడూ నాటకం వెయ్యడం ఆపలేదు... పరిషత్తులకి కట్టడం ఆపలేదు...  
ఏది ఏమైనా విశాఖ పోర్టులో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలెట్టి.. ఎన్నో ఆటుపోటులకు తట్టుకొని సినిమాల ద్వారా ప్రఖ్యాతి వహించిన కొండవలస గారు మా పోర్టు ఉద్యోగి అని గర్వంగా చెప్పుకునేలా చిరస్మరణీయుడైనందుకు ఘన నివాళులు అర్పిస్తున్నాను..   

Monday, November 9, 2015

"కళ్ళు చిదంబరం" మా వాడే... 'కొండవలస" కూడా మా వాడే....

"కళ్ళు చిదంబరం" మా వాడే... 'కొండవలస లక్ష్మణరావు" కూడా మా వాడే....  
"మా వాడే" అంటే మా ఊరువాళ్ళు మాత్రమే కాదు.. మా విశాఖపట్నం పోర్టు ట్రస్టు లో వుద్యోగస్తులే...
విశాఖపట్నం పోర్టు ట్రస్టు లో ఎంతో మంది పేరొందిన కళాకారులు వుండేవారు.. ఇప్పుడు కొద్దిమందే మిగిలారు... కళాపోసన కూడా తగ్గింది...

కళ్ళు చిదంబరం గారు అంత ఎక్కువగా నాటకాల్లో వెయ్యకపొయినా 

శ్రీ సత్యానంద్ (పవన్ కళ్యాన్ కి ప్రభాస్ కి గురువు) తో తిరగడం వలన 
"రైలు బండి" లాంటి నాటికల్లో చురుకైన పాత్రలు ధరించి "కళ్ళు" సినిమా డైరెక్టర్ కంట్లో పడ్డారు...ఇక అక్కణ్ణుంచి సినీ ప్రస్థానం మొదలైంది.. ఆ వివరాలు నేను చెప్పక్కర్లేదు... 

ఈయన మా విశాఖ పోర్టు సాంస్కృతిక విభాగపు సంస్థ "సాగరి" కి కార్యదర్శిగా చేసారు.. ఇది సుమారు నలభై ఏళ్ళ కిందటి మాట... కొన్ని సమాజాల వాళ్ళు నాటకాలు తయారు చేస్తూ వుంటే వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వడం... కావలసిన వస్తువులు సేకరించిపెట్టడం చేసేవారు.. అదీకూడా కళాసేవే కదా.. అందుకే...
ఈయన సినిమాలకి వెళ్ళిన ఏడాది తర్వాత విశాఖపట్నం లో "నా కంటే ఎంతో ప్రతిభావంతులైన కళాకారులున్నారు..వాళ్ళకి కూడా సినిమాల్లో వేషాలు దొరికితే నా కన్నా ఎక్కువగా రాణిస్తారు" అని భావించి, విశాఖ కళాకారులందరికీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఫొటోలు బయోడేటాలు సేకరించి తాను షూటింగు కెళ్ళిన ప్రదేశాలకు అవి మోసుకెళ్ళి దర్శక నిర్మాతలకు చూపించి వాళ్ళకి వేషాలు ఇమ్మని అడిగే వారు... 

ఇదంతా ఉచితంగా చేసారు.. కాని ఫలితం శూన్యం... సినిమా వాళ్ళు ఎవరికున్న పరిమితుల్లో వాళ్ళు కళాకారుల్ని ఎంచుకుంటారు... 

సినీ ప్రస్థానం కొద్దిగా తగ్గిన తరువాత "సకల కళాకారుల సమాఖ్య" అనే సంస్థను స్థాపించి...ఒక్క నాటకాల వాళ్ళే కాక హరికథ బుర్రకథల కళాకారుల నుండి సంగీత నాట్య కళాకారుల వివరాలు పొందుపరుస్తూ ఒక పుస్తకం ప్రచురించారు.. సుమారు లక్ష రూపాయలు సొంతఖర్చుతో... \

ఆ సంస్థకు విరాళాలు సేకరించి పేద విద్యార్ధులకు పుస్తకాలు... బ్యాగ్గులు.. మొదలగునవి ఇచ్చేవారు.. తుది శ్వాస విడిచే వరకూ కళా సేవలోనే తరించారు... 
మా అమ్మ గారి ఇంటి పేరు వీరి ఇంటి పేరు ఒకటే అవడం యాదృచ్చకమే  అయినా  ఆ చనువుతో ఎప్పుడూ ఆయనకి  ప్రత్యేకంగా దగ్గర అయ్యే ప్రయత్నం చెయ్యలేదు.. కాని ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా పలకరించే వారు...

సుమారు ఐదేళ్ళ క్రితం యండమూరి వీరేంద్రనాధ్ గారి నాటిక "చీమ కుట్టిన నాటకం" లో కలిసి నటించాం.. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి లలో ప్రదర్శనలు వేశాం..  హాస్య నాటిక అవడం వలన ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునే వారు.. అందులొను ఈయన ప్రత్యేక ఆకర్షణ.. 
"కన్యాశుల్కం" నాటకంలో నేను 'అగ్నిహోత్రావధాలు' పాత్ర వేయడానికి ప్రోత్సాహమిచ్చి ఆ వేషం బాగా రాడానికి దోహదపడ్డారు.. 

ఇకపోతే ఆఖరురోజులు కాస్త భారంగా బాధగానే గడపవలసి వచ్చింది.. ఆక్సిజన్ పరికరం ముక్కుకి తగిలించుకుంటేనే గాన్ని ఊపిరి అందర్ని పరిస్థితి.. విపరీతమైన పొగతాగే అలవాటు వలన ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి..ఇంఫెక్షన్ బాగా ఎక్కువయి సుమారు ఒక సంవత్సరం నుండి ఇవాళా రేపా అన్నట్టు గడిపారనే చెప్పొచ్చు..ఈ సమయములో సాటి కళాకారునికి ఆపత్కాలంలో ఆదుకోవాలని ఆయనకు  నా వంతు సహాయం చేసాను. అదో ఉడతా భక్తి సాయం.. ప్రస్తుతం అప్రస్తుతం.. 

కాని చివరిరోజుల్లో ఒక్కొక్కరే ముఖం చాటేస్తుండటంతో "ఆ నలుగురు" లాగ నాకు చివరికి నలుగురే నలుగురు మితృలు మిగిలారండి అని పేర్లు చెప్పి మరీ బాధపడే వారు... . ఉపకారం పొందిన కొంతమంది కనీసం హాస్పిటల్ కి వచ్చి పలకరించేరు కాదని బాధపడే వారు... 

యవ్వనంలో ఉన్నప్పుడు మద్యం సిగరెట్లు లాంటి అలవాట్లను లోనైతే అవి శరీరాన్ని ఎలా పీల్చి పిచ్చి చేస్తాయో తెలియచెప్పే ఉదాహరణకు కళ్ళు చిదంబరం గారే సాక్షి...

కాని ఆయనలో ఒక గొప్ప మానవతావాది వున్నాడు..ఎవరైనా బాధ పడుతూ ఉంటే చూసి తట్టుకోలేని గొప్ప హృదయం గల మనిషి వున్నాడు... నిస్వార్ధంతో కళా సేవ చేసిన సైనికుడు వున్నాడు... 
విశాఖపట్నానికి ఒక కళా వేదిక కావాలని పోరాడిన అలుపెరుగని ఉద్యమ కారుడున్నాడు.. 
ఆయన పెంకితనం.. ముక్కుసూటి తనం ఆయనకు ఆభరణాలు అయ్యాయి గాని..ఎప్పుడు సమస్య కాలేదు... 

గంటకి ఇంత అని రేటు తీసుకునే కళాకారులున్న ఈ దేశంలొ కొన్ని చిత్రాలకు ఉచితంగానే పని చేసిన "కళ్ళు చిదంబరం" గారు చిరస్మరణీయులు...
(కొండవలస గారి గురించి  తదుపై పోస్టు లో రాస్తాను...)    

Saturday, November 7, 2015

ఎర్రమట్టి దిబ్బలు నాశనం చేసిన దుష్టులను ప్రకృతి మాత శిక్షించు గాక....

భీమునిపట్నానికి మణిహారం ఈ ఎర్రమట్టి దిబ్బలు...
ప్రపంచంలో మరెక్కడా కానరాని ఎత్తుమట్టి దిబ్బలు..
పర్యావరణ ప్రేమికులను అలరించిన అద్భుత దిబ్బలు...
అనేక చిత్రాలలో కనువిందు చేసిన సుందర దిబ్బలు..
నేడు రక్కసుల కోరలకు బలైపోయిన ప్రాచీన దిబ్బలు...ఎర్రమట్టి దిబ్బలు నాశనం చేసిన దుష్టులను ప్రకృతి మాత శిక్షించు గాక....

గోవధకి తెగబడుతున్న దుర్మార్గులకు శిక్ష వేసే సెక్షన్లు కరువాయెనే..


'అ' అంటే 'అమ్మ' ..'ఆ' అంటే 'ఆవు'..
ఇది ప్రతి అమ్మ బిడ్డకి నేర్పే తొలిపాఠం..

 
గంగి గోవు పాలు గరిటడైనను చాలు..
కడవడైననేమి ఖరము పాలు...
ఇది యోగి వేమన నేర్పిన నీతి పాఠం..


గోపంచక సేవకం సర్వరోగనివారణం..
ఇది మన సనాతన సాంప్రదాయం..

 
గోమయం సర్వకీటక నాశినం..
ఇది శాస్త్ర వేత్తలు నిర్ధారించిన నిజం..

 
గోమాతను ఇంటికి శోభనిచ్చే లక్ష్మీదేవికి
ప్రతిరూపంగా పూజించే సంస్కృతి గల
హైందవ దేశంలో గోవధకి తెగబడుతున్న
దుర్మార్గులకు శిక్ష వేసే సెక్షన్లు కరువాయెనే..

Tuesday, November 3, 2015

కానీ... వీరిపై ప్రజలకు అసహనం పెరిగిపోతున్నదని గుర్తించట్లేదు..

అవార్డు రచయితలకు అసహనం పెరిగిపోయిందట...
ఎందుకయ్యా అంటే...బట్ట తలకి బోడి గుండుకి ముడిపెడుతున్నారు....
మధ్యలో నేటి పాలకుల తలకి బొప్పి కడుతున్నారు....   

అభ్యుదయ వాదులు అవార్డులు పొందారు..ప్రభుత్వ రివార్డులు పొందారు..
తిరస్కార వాదంతో తిరిగి ప్రాచుర్యం అవాలనో..వేరొకరికి తొత్తులుగానో మిగులుతున్నారు..

హిందువులు పవిత్రంగా భావించే కావ్యాలను ఖండిస్తారు..కానీ..
పవిత్ర యుద్దంతో నరమేధం సృష్టిస్తున్న ఉగ్రవాద చర్యలను ఖండించే సాహసం చెయ్యరు..

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నిస్తారు.. కానీ..
'తేజో మహల్'  ఉంపెడుగత్తె ముంతాజ్ మహల్ గా మారిన వైనాన్ని ప్రశ్నించరు..  

హిందూ దేవాలయాల్లో బూతుబొమ్మలెందుకని వెక్కిరిస్తారు..కానీ.. 
అద్భుత శిల్ప కళా కుడ్యాలను ధ్వంసం చేసిన ముష్కరులను పల్లెత్తు మాట అనరు..

కులాల గోడలు కూల్చెస్తాం.. మతాల వైషమ్యాలను తుడిచెస్తాం అంటారు ..కానీ..
"అరసం" అని.."విరసం" అని.."దిగంబర కవులం" అని అడ్డుగోడలు కట్టుకుంటారు...

సెక్కులరిజం అంటే మెజార్టీ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా రాసే
ఈ కుహనా మేధావులు తమ స్వేచ్చకు..హక్కులకు భంగం కల్గుతున్నాదని
అసహనం వ్యక్తపరుస్తున్నారు.. కానీ...

 వీరిపై ప్రజలకు అసహనం పెరిగిపోతున్నదని గుర్తించట్లేదు..  

 


Saturday, October 31, 2015

కులగజ్జి ని గోక్కుంటూనే... కులరహిత సమాజాన్ని ఆకాంక్షిస్తాం..

భారత దేశం బాగుపడదు..తరాలు మారినా యుగాలు గడిచినా..
ఎందుకంటే....


ఎన్నో వేల సంవత్సరాల నాటి మనువును స్మరిస్తాం..
ఈనాటి వేమన గురించి అస్సలు తలంచం.... 

 

రామాయణ మహాభారతాలలోని మంచిని విస్మరిస్తాం..
భగవద్గీతలోని లేని వర్ణాల గురించి వాదిస్తాం..

 

రాజ్యాంగంలోని హక్కులకోసం పోరాడతాం..
అందులో పొందుపరిచిన విధులను బాధ్యతలను బహిష్కరిస్తాం..   

గోమాంసంపై వివాదాలు సృష్టిస్తాం..
నరమాంసపు రాక్షసులని నాయకులని చేస్తాం..


 

కులగజ్జి ని గోక్కుంటూనే...
కులరహిత సమాజాన్ని ఆకాంక్షిస్తాం..

సందేశాత్మక..కళాత్మక చిత్రాలు ఒక్కరోజు ఆడవు...
హారర్..దెయ్యాల సినిమాలు వందరోజులు ఆడతాయి..

 


వైదీక బ్రాహ్మణుల భరతం పడతాం..
దొంగ బాబాలు స్వామీజీలకు మొక్కి కోట్లు గుమ్మరిస్తాం..  
హైందవ బ్రాహ్మణ వ్యవస్థే అన్ని అనర్ధాలకు మూలం అని పిచ్చెక్కిన్నట్టు అరుస్తాం. .    
బ్రాహ్మణ్యం ద్వారా సంక్రమించిన వాస్తు, జ్యోతిష్య, పంచాగాలను వదలము..

అందుకే ఇండియా ఎప్పటికీ "ఎండి"యా యే ... Saturday, October 24, 2015

మనం కోరిందే ఇచ్చాడు మన ప్రధాని..

మన రాష్ట్రం లో వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలున్నారు..
గ్రామాలను దత్తత తీసుకొనే శ్రీమంతులున్నారు..
రాజధాని కోసం వేల ఎకరాలు ఉచితంగా యిచ్చే రైతులున్నారు..
అభివృధ్ధి కోసం పెట్టుబడులు పెట్టే ఎన్.ఆర్.ఐ లున్నారు..
రాజధాని డిజైన్ ఉచితంగా యిచ్చిన సింగపూర్ ..
నిర్మించడానికి జపాన్ సహాయపడుతోంది ...
మన రాజధాని..మన మట్టి..మన నీరు..
మనం కోరిందే ఇచ్చాడు మన ప్రధాని... 

Thursday, October 22, 2015

(అ) పవిత్ర పార్లియమెంటు మట్టిని మూటకట్టి తెచ్చినాడు...

ఇదిగిదిగో అమరావతి..ఇదే సీమాంధ్రుల రాజధాని అన్నారు...
ముడుపులన్నీ మూటకట్టి...మూడు పంటల భూమినే కూల్చారు..

అడుగడుగో మోడీ..వరాల మూట మోసుకొస్తాడన్నారు..
(అ) పవిత్ర పార్లియమెంటు మట్టిని మూటకట్టి తెచ్చినాడు...

ఈ పాపం మాది కాదు..గత పాలకులది అన్నాడు మోడీ..
అడ్డగోలు విభజనలో నెల్లూరు పెద్దోడు..చిన్నమ్మ సుష్మా ఉన్న మాట మరిచాడు..

ఉన్న చంద్రుడు చాలదన్నట్టు.. మరో చంద్రుణ్ణి పిలిచారు..
చంద్ర ద్వయాలు ద్వి తెలుగు రాష్ట్రాలను వెలిగిస్తారన్నాడు...

స్వయం ప్రకాశితం కాని చంద్రుళ్ళకు వెలుగునిచ్చే సూర్యుడే 
మబ్బుల్లో దూరితే.. చంద్రులకు వారిని నమ్ముకున్న ప్రజలకు..  
వెలుగెక్కడిది?? దారిచూపెడి దిక్కేది???

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని యమునా నదీజలాల్లో ముంచి..
రెండుగా చీల్చి రెండు రాష్ట్రాల నాయకులు పండగ చేసుకుంటుంటే..
విడిపోయిన కోట్లాది అన్నదమ్ముల ఆకలి ఆర్తనాదాలు అమరావతి హోరులో మూగబోయాయి..    

Sunday, October 11, 2015

విజయవంతమైన మా పరిశుభ్ర భారత్..


గత వారం మా పోర్టు కాలనీలో మరియు ఆసుపత్రి లో స్వచ్చ్ భారత్ కార్యక్రమం జరిపాము. 
పిల్లలతో చేసిన మానవహారం అలరించి ఆకర్షణగా నిలచింది.. 
అన్ని పేపర్లలోనూ పడి ఆ ఫొటోలు తీసిన నాకు తృప్తిని కలగచేసింది.. 
మీరు కూడా తిలకించి ఆనందించవలసిందిగా కోరిక.. 


 

Sunday, October 4, 2015

స్వాతి ముత్యంలాంటి మనస్సుతో మీకు ఇదే నా నివాళి...

తెలుగు ఆడబడచులకు సిరిసిరి మువ్వ ను తొడిగి..
తెలుగు నాట తాయారమ్మ బంగారయ్యలను విడిచి...
తెలుగు కీర్తనలో శంకరాభరణాన్ని పలికి... 
తెలుగు తోటలొ సితాకోక చిలుకలను వదిలి..
తెలుగు నట్టింట సితారను వాయించి...
తెలుగు సాగర సంగమాన్ని మధించి.. 
తెలుగు జలములో స్వాతి ముత్యాల్ని కడిగి..
తెలుగు యువతకు స్వయం కృషి నేర్పి...
తెలుగు వీణా తంత్రులతో స్వరకల్పన చేసి..
తెలుగు ప్రేక్షకులకు ఆపద్భాంధవుడవై....

తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా అజరామరమైన చిత్రాలను భువికందించి..
తెలుగు నేల పులకరించి జలదరించేలా ఆణిముత్యాలను సృష్టించి..


పాశ్చాత్య సంగీతహోరులో రెపరెపలాడున్న శాస్త్రీయమైన సంగీతానికి చేతులను అడ్డుపెట్టిన ఏడిద నాగేశ్వరరావు   
తెలుగు నాట సీతాకోక చిలుకలు... సితారలు... సిరిసిరి మువ్వలు   ఉన్నంత కాలము  చిరస్మరణీయుడుగా వుంటాడని అభిలషిస్తూ.. 


స్వాతి ముత్యంలాంటి మనస్సుతో మీకు ఇదే నా నివాళి...     
 

Saturday, October 3, 2015

చేతకాని వారు...దద్దమ్మలు... ఇంతకంటే తిట్లు నాకు రావు.. క్షమించాలి..

పంటఋణాలు తీర్చలేక రైతులు రోజుకి పదుల సంఖ్యలో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు..
 

ఫీజులు కట్టలేకో....కాలేజీల్లో హింస ఎక్కువయ్యో రోజుకో విద్యార్ధి(ని) ఆత్మ హత్య చేసుకుంటున్నాడు(ది)...  
బిడ్డల్ని పెంచలేక కన్నతల్లులు బిడ్డలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..

కల్తీ సారా దొరక్క చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది.. కల్తీ విత్తనాలు దొరికి పైకి పోతున్నారు  మరికొంతమంది..


 

 


ఎలుకలు కొరికి ఒక బిడ్డ.. కుక్కలు చీల్చేసి మరో బిడ్డ దారుణంగా  మరణిస్తున్నారు..

కరెంటు షాకుకి ఒకరు.. మురికి కాలువకి వేరొకరు బలైపోతున్నారు..
ప్రేమవంచనతో కొంతమంది.. మాన హరణంతో మరికొంతమంది యువతులు నిర్జీవులైపోతున్నారు..   


 

ఇక గొలుసు దొంగలకు..ఆన్ లైను మోసగాళ్ళకు..అంతేలేదు...

భూకబ్జాలకు... ఇసుక మాఫియాలకు...ఎర్ర స్మగ్లింగుకు ఆకాశమే హద్దు...

ఇన్ని ఘోరాలు ..దారుణాలు... మోసాలు...వీటన్నిటినీ నియంత్రించే వారు ఎవరు???
న్యూస్ చానళ్ళ సాక్షిగా అంతా సానుభూతి చూపించే వాళ్ళే..
శవాలకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చేవాళ్ళే....


ఋణ మాఫీలకు... పరిహారాలకు.... రాయితీలకు.... అలవాటు బడ్డ జనం....
ఇచ్చిన బిక్షకు సంతృప్తి పడి... మూలకారణాలను నివారించమని కోరరు..
చచ్చిన వాడి మీద  ప్రేమకన్నా.. వాడి ద్వారా వచ్చే సొమ్మే మిన్న..

ఈనాటి సమాజం ఇలా వుండాలి అని కలలు కన్నది ఎవరు??? 
మేధావులు...ఆర్ధిక వేత్తలు...సామాజిక సేవకులు..న్యాయశాస్త్ర కోవిదులు..
వీళ్ళంతా ఏవీ సమాధానం చెప్పలేరా..
హిందూ సమాజానికి కుల జాడ్జాన్ని అంటకట్టి
సత్యం, న్యాయం, ధర్మం అనే పదాలను సమూలంగా నాశనం చేసిన వారు ఇందుకు బాధ్యులు కాదా??

 

దేవుణ్ణి నమ్మవద్దు.. పూజారులను, బాబాలను స్వామీజీలను కొలవద్దు అని  జ్ఞాన బోధ చేసిన హేతువాదులు..నాస్తిక వాదులు-
నేడు మూఢ భక్తితో నరబలులు ఇస్తున్న వారిని.. దెయ్యాలతో సినిమాలు తీస్తున్నవారిని..చేతబడులున్నాయి అని నమ్మించేలా రచనలు చేసిన రచయితలను.. ఏమీ చెయ్యరు ఎందుకని???

 

మన సమాజంలో వంద మర్డర్లు చేసేవారు, దోపిడీలు మానభంగాలు చేసే వారు, భూకబ్జాలు చేసే వారు, ఎర్రదొంగలు  హీరోలు..  

అరె ఇలా ప్రవర్తించకండయ్యా. ఇదిగో ఫలనా పురాణంలొ ఈ విధంగా వుంది అని చెప్పే వాళ్ళు విలన్లు.. 

మితాహరం తినండి కొవ్వు పెంచుకోకండి అని తన  జీవితాన్ని సైతం పణంగా పెట్టి పోరాడే వాళ్ళు సమాజానికి చీడపురుగులు... సందుదొరికితే బురద చల్లడానికి రడీ అయిపోతారు.. 

గుడి కెళ్ళి పుజారి పళ్ళెం లోనో.. మెట్ల మీద భిక్షమెత్తే పేదవాడికో రూపాయి ఇవ్వరు గాని.. హుండీలో వేసిన కోట్ల కొద్దీ సొమ్ము కైంకర్యం అయిపోతున్నా పట్టించుకోరు..

సమస్యలకు మూలం తెలుసుకోకుండా కేవలం తాత్కాలిక చర్యలనే తీసుకున్న ఆనాటి పాలకులు దూర దృష్టి లేకపోవడం వలననే ఇప్పటి సమాజ దుస్థితి అని నా అభిప్రాయం.. 

 
నేరం నాది కాదు ఆకలిది అన్నట్లు.. ఈ నాటి పాలకులు నిమిత్త మాత్రులు.. అంతా పైవాడి(కేంద్రం)  దయ మీద ఆధారపడి బతుకున్న బలహీనులు.. చేతకాని వారు...దద్దమ్మలు... ఇంతకంటే తిట్లు నాకు రావు.. క్షమించాలి..   

Wednesday, September 30, 2015

పెళ్ళాం వద్దు.. కంప్యూటరే ముద్దు

Ctrl+Alt+Del నొక్కితేనే కంప్యూటర్ ఓపెన్  అవుతుంది.. కాని..
ఏదీ నొక్కకుండానే నా బ్రైన్ ఓపెన్ అయిపోతోంది...


షట్ డౌన్ చేస్తే కంప్యూటర్ నిద్రపోతుంది..కాని...
నిద్దట్లో కూడా నా బ్రైన్ పనిచేస్తుంది.. 


పాస్ వర్డ్ కొడితేగాని నా ఇ.మైల్ ఓపెన్ అవదు..
ఏ పాస్ వర్డ్ అక్కర్లేకుండానే నా పర్సు ఓపెన్ అయిపోతుంది.. 


ఫుడ్ లేక పోయినా పర్లేదు కాని..
నెట్ లేకుండా బతకలేని బలహీనుణ్ణీ.. పెళ్ళాం వద్దు.. కంప్యూటరే ముద్దు
ప్లీజ్.... ఈ విషయం నా పెళ్ళానికి మాత్రం చెప్పొద్దు..
ఎందుకంటే ...నీది కూడా ఇదే స్థితి అని నాకు తెలుసు..

Tuesday, September 29, 2015

వీక్షింపుడు ఈ ఘోర కలి..అరికట్టలేరా ఈ నరబలి...

ముద్దుగొలుపు  మురిపాల చిన్నారి....
చిట్టి పొట్టి మాటలతో అలరించిన పొన్నారి..
వడివడి అడుగులతో పడుగులిడుతున్న వయ్యారి...
తప్పటడుగు వేసెనమ్మ ఆదమరిచి..
కానరానీయ్యకుండ చేసెనమ్మ మాయదారి డ్రైనేజి.. 


వినుతి కెక్కిన విశాఖ నగరాన
ఒక బాబు బలి ఆయ్యె  శునకరాజములకు..
ఒక పాప బలి అయ్యె మురికి కాలువకు..
ఒక బాలుడు బలి అయ్యె విద్యుత్ ఘాతమునకు..
విశ్వములోకెల్ల విఖ్యాతి పొందునటుల
విశాఖను తీర్చుదిద్దెదమని బీరములు పలుకు పాలకులార ..
వీక్షింపుడు ఈ ఘోర కలి..అరికట్టలేరా ఈ నరబలి...  


Friday, September 25, 2015

భయానక దృశ్యం - హుద్ హుద్ మిగిల్చిన జ్ఞాపకం..

ఇక్కడ దిగువన లింక్  వీడియో - గత హుద్ హుద్ తుఫాన్ సమయములో మా ఇంటిలోంచి తీసిన వీడియో..
నిన్న కురిసిన వర్షం మరల హుద్ హుద్ తుఫాన్ ని గుర్తు చేసింది. 

కురిసిన గంట సేపు వర్షం మరలా అదే వేగం తో విశాఖను ముంచెత్తింది.. 

ఒక చిన్నారిని కాటేసింది.. 

హుద్ హుద్ తుఫాన్ ఆదివారం రోజున జరిగింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు.. 

ఇలా వర్కింక్ డే అయి ఉంటే ఎన్నో వందల ప్రాణాలు పోయేవేమో అనిపించింది అప్పుడు ఇప్పుడు కూడా..  

HUD-HUD CYCLONE FROM MY HOME 

Wednesday, September 23, 2015

వృద్ధులారా..దయచేసి శతమర్కటాలు మాత్రం కాకండి.. సహస్ర కోతులను తయారు చెయ్యకండి..."బ్రహ్మచారి శతమర్కట:"


"వృద్ధనారీ పతివ్రత:"


వీటికి అర్ధాలు చెప్పక్కర్లేదని అనుకుంటాను..
కాని ఇప్పుడు "వృద్ధనారీ శతమర్కట:" అనుకునే రోజులు...
ఇప్పటి వృద్ధులు కొంతమంది తమ వృద్ధాప్యాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు..
కట్టూ బొట్టూ అంటే వేసుకునే దుస్తులు దగ్గరనుండి చేసే పనులన్ని యువతకు తీసిపోవు.. 


మను ధర్మశాస్త్ర ప్రకారం మనిషి జీవితంలో తన వయస్సుని బట్టి నాలుగు ధర్మాలను ఆచరించవలసి వుంటుంది.
బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థానము..సన్యాసము..  
వీటి
గురించి కూడా అట్టే వివరించక్కర్లేదు అనుకుంటా.. 

ఇప్పుడు మన అంశం నేటి వృద్ధుల గురించి కాబట్టి సన్యాశ్రమము గురించి ఆలోచిస్తే..వృత్తివ్యాపార వ్యవహారాలన్ని పుత్రులకు అప్పచెప్పి అనునిత్యము దైవధ్యానంలో గడపవలెనని..ఇతరులకు ధర్మబోధలు చేస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని తెలియచేసారు..అందుకే మన ప్రభుత్వం వారు కూడా రిటైర్మెంట్ వయస్సు అరవై గా నిర్ధారించారు.. 


అయితే ఇప్పటి కాలం నాటి వృద్ధులలో కొంతమంది వయస్సుకి తగిన పనులు చేస్తున్నారా.. అని ప్రశ్నించుకోవాలి.. 

 
అసలు వయస్సుని బహిరంగ పరుచుకునే స్థితిలో వున్నారా.. అనిపిస్తుంది.. ఈరోజుల్లో నిత్యయవ్వనంగా కనిపించడానికి అనేక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి.. పాలనురుగులాంటి జుత్తుని నల్లగా నిగనిగలాడేలా చేయ్యొచ్చు.. ముఖసౌందర్యానికి అనేక క్రీములు వచ్చేయి..పొట్టి జుత్తు తో పొట్టి బట్టలతో అమ్మమ్మలు కూదా అమ్మాయిలలాగ తయారవుతున్నారు..  

ఇక్కడ వేషధారణను తప్పు పడట్లే.. ఎవరి ఇష్టం వాళ్ళది.. కాని ప్రవర్తన మాత్రం వయసుకి తగ్గట్టు ఉంటే సమాజానికి మంచిది అని నా అభిప్రాయం..
మనవడు తప్పు తోవలో వెళ్తుంటే "ఒరే తప్పురా" అని చెప్పగలిగే స్థితిలో వుండాలి.. తానే ఒక పెగ్గు తాగందే నిద్రపోని స్థితిలో వుంటే ఇక పిల్లలకి ఏమి చెప్తాడు.. 


నేటి వృద్ధులు ఎవరి మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడట్లేదు... బతికినంత కాలము స్వతంత్రంగా బతకాలని,, తమ ప్రైవసీ కి ఎవరూ అడ్డు తగలకుండా వుండాలని అభిలషిస్తున్నారు.. కొడుకు కాని కూతురు గాని ఎంత వేగిరం ఇంట్లోంచి బయటకు వెళ్తాడా అని ఆలోచిస్తున్నారు... ఎవరూ లేకుండా హాయిగా స్వేచ్చా లోకంలో విహరించాలని పిల్లలు వేరుకాపురం వుంటేనే మంచిదనే భావంలో వున్నారు.. 

 
ఇప్పటి ఆర్ధిక పరిస్థితులు బ్యాంకింగ్ రంగాలు.. పెన్షన్ స్కీములు వృద్ధుల జీవితానికి భరోసా ఇస్తోంది.. వారి పెన్షన్ డబ్బుని గాని ఇండ్లను గాని ఇతర ఆస్థులు ఏవైనా జీవితం చివరి రొజుల వరకు ఎవరికీ భాగం ఇవ్వక తమ వద్దనే వుంచుకుంటూ.. మరణాంతరం చెందేలా రాస్తున్నారు..లేదా విల్లు రాయకుండానే పోతున్నారు.. 

ఇందువలన అయినవారికి దూరంగా వుంటున్నా పైకి గాంభీర్యత ప్రకటిస్తూ శేష జీవితాన్ని గడిపేస్తున్నారు... కొంతమంది ఆస్థులు ఇండ్లు వారి మరణాంతరం ఎవరికీ చెందక ఒక్కోసారి తగాదాలు కోర్టు వరకు వెళ్ళి ఆఖరికి అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది... 


వ్యక్తిగత నష్టం ఈ విధంగా వుంటే కొంతమంది వ్యవహార శైలి వలన సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది... అరవైలో కూడా ఇరవై పనులు చేస్తూ అదేదో ఆదర్శంలాగ కుర్రాళ్ళని చెడగొడుతున్నారు... 

తివారి లాంటి వృద్ధులు కోకొల్లలు..
ద్విగిజయ సింగ్ లాంటి వారిని కూడా ఉదహరించుకోవచ్చు..  

అందుకే యువతరం చెడుతోవలో పయనిస్తోంది...వృద్ధులను యవ్వనంలో వున్నవాళ్ళు అనుసరిస్తారు..అనుకరిస్తారు.. 

తాగుబోతు అయిన తండ్రికి పుట్టిన వాడికి తాగడం తప్పని తెలీదు..
తల్లి వ్యభిచారి అయితే పిల్లలకు వ్యభిచారం తప్పుగా అనిపించదు..   

కొంతమంది వృద్ధులకు..వయసుమీరిన వారికి మను ధర్మ సూత్రాలు గాని భగవద్గీతలు గాని అక్కరలేదు... ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే పాటలు ... సమాజాన్ని పెడతోవ పెట్టే ప్రసార సాధనాలు మాత్రమే ఆశ్వాదిస్తూ పరోక్షంగా యువత తప్పు తోవలో నడవదానికి కారకులు అవుతున్నారు..

వృద్ధులారా దయచేసి పతివ్రతలు కాకపోయినా పర్వాలేదు గాని శతమర్కటాలు మాత్రం కాకండి.. సహస్ర కోతులను తయారు చెయ్యకండి...


Monday, September 21, 2015

సమసమాజ నిర్మాణానికి అగ్రవర్ణాలు ఆహుతయ్యాయి...

అగ్రహారాల గోడలు బీటలు వారాయి...
అగ్నిహోత్రావధానుల ఇళ్ళు బూడిదయ్యాయి...
అవధానుల ఆవాసాలు సమాధులయ్యాయి...
సమసమాజ నిర్మాణానికి అగ్రవర్ణాలు ఆహుతయ్యాయి..
అయినా కులరహిత సమాజం ప్రశ్నార్ధకం అయ్యింది...

పటేళ్ళ ఉద్యమం కులాల ప్రస్తావనను కుదిపేస్తోంది..
రాజ్యాంగ హక్కులను పునరాలోచించేలా ప్రేరేపిస్తోంది.

Saturday, September 19, 2015

"కాకినాడ" - ఇంతకన్నా అభివృధ్ధి చెందదా???

నిన్న నేనూ..మా మిత్రబృందం కాకినాడ వెళ్ళాము..  ఎందుకు వెళ్ళామూ అంటే "ఆవుదూడకి గడ్డికోసం"..అన్నట్టుగా గట్టి పనేమీ లేదు.. 

"హుండాయి-సాంత్రో" కారు ఉండి డ్రైవింగ్ రాని రిటైరయిపోయిన మా మిత్రుడు అడిగాడు "మన కారులో కాకినాడ వెళ్దాం వస్తారా??" అని.. 
"మన కారు అంటే మీ కారా మా కారా??" అని అడిగా.. 
"మా కారే" అన్నాడు...మీరు సరే అంటే సరే.. లేదంటే మరో దారి వెతుక్కుంటా" అన్నాడు.. 


ఎందుకూ అని అడిగితే  "ఏవీ తోచక" అని మురారి స్టైల్లో చెప్పి..  "సరదాగా అలా వెళ్ళొద్దాం.. తెలుసున్న మిత్రులని కలుద్దాం అంతకంటే పనిలేదు.." 
"సరే"
అని ఒప్పుకున్నాను.. ఎందుకంటే...
అఫీసులో చూసిన ముఖాల్నే రోజూ చూసి బొరుకొడుతోంది..కాస్త రిలాక్సింగా వుంటుంది..కారు డ్రైవింగ్ కూడా మనకి ఇంట్రెస్టు కాబట్టి ఒకరోజు సెలవు పెట్టడం వేస్టు అయినా.. 
"పొద్దస్తమాను తిని తొంగోడవేనా మడిసన్నతర్వాత కాసింత కలాపోసన వుండొద్దూ" అని ముళ్ళపూడి వారు రావుగారితో మనకి గడ్డి పెట్టారు కాబట్టి వెనకాల ఇల్లాలి గొణుగుడ్లు వున్నా మాట ఇచ్చేసాను.. 
"ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను." అని పూరీ యో ఇడ్లీ యో ఎవరు రాసారో తెలీదు గాని అలా కమిట్ అయిపోయా...

హైవేలో కాకుండా స్టీల్ ప్లాంట్ మార్గంలో అచ్చుతాపురం మీదుగా దూసుకొని పోయి పాయకరావుపేటలో అల్పాహారం చేసి మరెక్కడా ఆగకుండా కాకినాడ చేరుకున్నాం...
"కాకినాడ" తూర్పుగోదావరికి ముఖద్వారం.. చిన్న ఓడరేవు..పాడిపంటలతో కొబ్బరి ఉత్పత్తులతో కోట్లమీద వ్యాపారం జరిగే ప్రాంతం..

ఒకపక్క జె.ఎన్.టీ.యూ.. మరోపక్క రంగరాయ మెడికల్ కాలేజి...సాంకేతిక విద్యనందించే ..వృత్తివిద్యలను అందించే విద్యాసంస్థలు.. ఇలా నాకు తెలిసి విశాఖ కన్నా ముందే ఆధునికతను రంగరించుకున్న పట్టణం..

ఏ పట్టణానికి లేని ప్రత్యేకతలు ఒకేరోడ్డు లో సినిమాహాళ్ళు.. ఒకేవీధిలో దుకాణ సముదాయలు.. ఒకే దగ్గర విద్యాలయాలు.. ఈ పట్టణం పేరు చెబితే గుర్తొచ్చేవి "సుబ్బయ్య హోటలు.. "కోటయ్య కాజాలు" .. 

ఇలా గతవైభవు చిహ్నాలని గుర్తుతెచ్చుకొని మురిసిపోవడమే గాని...ఏదీ అభివృధ్ధి??? ఎక్కడ ఆధునికత నిర్మాణాలు??? 
రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు తప్ప.. అవే రోడ్లు..అవే మురిక్కాలువలు ...

కనీసం కత్తిపూడి నుండి కాకినాడ వరకూ రెండులైన్ల రోడ్డు లేదు.. తిరిగి వస్తున్న దారిలో పెద్ద యాక్సిడెంటు ఒక కారు లారీని గుద్దేసి కారులో వున్న శాల్తీ అక్కడికక్కడే మరణించాడు.. ఎంతఘోరం.. 

ఒక వెహికల్ ని ఓవర్ టేక్ కూడ చెయ్యలేని ఇరుకు రోడ్డు..పైగా గతుకుల మయము...

అక్కడ వూరంతా తిరిగేసి..తెలుసున్న వాళ్ళని కలిసేసి..తిరిగి సాయంత్రం ఐదు గంటలకి బయలుదేరి ఎనిమిది గంటలకల్లా వైజాగ్ వచ్చేశాము.. చీకట్లొ ఇంత దూరం ఎప్పుడూ డ్రైవ్ చెయ్యలేదు గాని ఎన్.ఎహ్ 5 విశాలంగా వుందికాబట్టి ఎనబ్భై లో దూసుకొచ్చేశాను.. 


అన్నట్టు మధ్యలో అన్నవరం లో రోడ్డు పక్కన మినీ దేవాలయంలో స్వామిని ప్రార్ధించి ప్రసాదాలు కొనుక్కొని..తేనీరు సేవించి బయలుదేరాము... నా సోది ఎప్పుడూ మామూలే గాని ఫుటోలు చూడండి..    

 1. హోరువానలో ..  వాన నీటిలో కారు ప్రయాణం.. .. (పిఠాపురం దాటేక) 2, 3. గాంధీభవన్ ప్రాంగణం, kakinada..  
4. 5.కనుచూపుమేర కనువిందు.చేసే పచ్చని పైరులు...  


               
 

Sunday, September 13, 2015

మనిషి బుద్ధి మారునా? ఈ అందాలను పాడుచెయ్యకుండా వుండునా??

ఇది గత పోస్టుకు కొనసాగింపు.. 
ఇంకా కొన్ని ఫొటోలు పెడుతున్నాను ... చూసి ఆనందించండి.. 
 1.వేపగుంట, పెందుర్తి - హైవే నుండి సింహాచలం శిఖర దర్శనం..
   
2.పెందుర్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి - ప్రధాన రైలు మార్గం- హౌరా లైన్..3. "మోదకొండమ్మ" అమ్మవారి గుడి - పాడేరు....

4,5-పాడేరు - సుందర మనోహర దృశ్యం...అన్నట్టు 'దృశ్యం' సినిమా కూడా విజయనగర.. విశాఖ ప్రాంతాల్లోనే తీసారట.. 5,6.పర్వతాల నడుమ ఒక ఊరిలో సంత.. 


7.పాడేరులో కొన్న పువ్వులు...8.ఇలాంటి ఇళ్ళు కనుమరుగు అవుతాయా??? - ఒక అమ్మాయి గేదెలకు దాణా పెడుతోంది..9. విశాఖ సిటీ (కంచరపాలెం)  లో  కొండలను ఆక్రమించిన కాంక్రీటు మేడలు..


10. విశాఖ నగర పాలక సంస్థ వారు ఖాళీగా వున్న గోడలపై ఇలా అందమైన వర్ణాలను చిత్రీకరించారు..అయినా మనిషి బుద్ధి మారునా???? ఈ సిటీ అందాలను పాడుచెయ్యకుండా వుండునా???