Thursday, January 15, 2015

సి.సి కెమేరాలు కొని..వాళ్ళను రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలని అనుకుంటున్నాను..

 హుద్-హుద్ తుఫాను తరువాత వేసిన పూలమొక్కలు

ఇంకా మూడు రకాల మందారాలు, రెండు రకాల గులాబీలు..వున్నాయి....
ఇంకో గొప్ప పని ఏమి చేసానంటే ఓ మూడు వేప మొక్కలు, ఒక కాము మొక్క కూడా రోడ్డు మీద పాతి రోజు నీళ్ళు పోస్తున్నాం... 

చూడాలి ఎంత త్వరగా ఎదుగుతాయో.... 
ఎంత ఘోరం అంటే వేప మొక్కలను బతక నివ్వట్లేదు... 
మొదళ్ళు తెంపేస్తున్నారు... 
సి.సి కెమేరాలు కొని అవి తెంపుతున్న వాళ్ళను రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలని అనుకుంటున్నాను.. 
మీరేమంటారు.. 
అసలు వీళ్ళకి శిక్ష ఏమైనా వుంటుందా ?? 
మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళే హాయిగా తిరుగుతున్నప్పుడు చెట్ల కొమ్మలను విరిచే వాళ్ళకి శిక్ష వుంటుందా అని అనుమానం... 

Friday, January 9, 2015

పూరా ఉత్తరాంధ్ర మాండలీకం..ఆశ్వాదించండి..

కీ.శే.గణేష్ పాత్రో గారి నాటికలో కొన్ని ప్రధాన ఘట్టాలను వివరిస్తాను అని మురళి గారికి ప్రామిస్ చేసాను..
మీరు కూడా ఆశ్వాదించండి..  
(అంతా పూర్తి ఉత్తరాంధ్ర మాండలీకంలోనే సాగుతుంది)..

ప్రదేశం: భీమునిపట్నం దిగువపాలెంలో సముద్ర తీరం..
దృశ్యం: సముద్రతీరాన్ని బాగా ఆనుకున్న ఒక పాక. చేపలు పట్టే వలలు ఆరవేసి వున్నాయి..టెర్రెలు ఒక మూల పడి వున్నాయి..ముందర చీడీకి ఆనుకుని నాలుగైన గంపల్లో ఉప్పు వేసిన చేపల దొంతర్లు, దానిమీద తాటిబద్దల మూతతో ఉన్నాయి. చీడీకి బాగా వెనుక చాప, చిరుగుల బొంత అస్తవ్యస్తంగా పడివున్నాయి. ఎడమవైపుకి కోసుగా ఒక కుక్కి మంచం పడేసి వుంది. గోడకి ఆనుకుని తోరణంలాగా సొరముళ్ళు ఆరుతూ వేళ్ళాడుతున్నాయి..
(తెర తొలగింది)  
మంచం కాళ్ళకట్టు తాడు బిగిస్తూ దారుణంగా దగ్గుతున్నాడు గంగులు. చల్లటి గాలి వేస్తోదేమో అతనికి బాగా చలివేస్తోంది.. ఆపాదమస్తకం చలితో, జ్వరంతో వణికి పోతున్నాడు. కాని మొగంలోని ఫ్రౌడిమకు ఎలాంటి భంగం కలగలేదు..చాలా నిదానంగా బాధపడుతున్నాడు. నిదానంగానే మంచం తాడు బిగిస్తున్నాడు..నిదానంగానే దగ్గుతున్నాడు. అవిరామంగా వస్తోన్న ఆ దగ్గుని అలా విలాసంగా వదిలేయలేదు.. 

ఆపుతున్నాడు. ఉగ్గపడుతున్నాడు. అయినా ఆయాసపడి పోతున్నాడు. కాస్త సమీపంలో సముద్రం ఊపిరి పీల్చుకుంటున్న చప్పుడు తప్ప మరే అలికిడి లేదు..
గంగు: (కాలితో కోడు మీద దన్నుపట్టి తాడు బిగిస్తూ) ఇంత ముసిలికాలం మీదబడీ వరదాక వుంచకు దే(వుడా అని మొక్కుకుంతన్ను. ఇనిపించుకోడు దే(వుడు. సద్దారన్నోల్ని ఉంచతడు, ఉంతామన్నోల్ని సంపతండు! - (తాడు కోడుకి బిగించసాగాడు, ముడివేస్తూ) శరబయ్య దద్దీ ! శరబయ్య దద్దీ...(పైనున్న శరభయ్య నుద్దేశించి పిల్చాడు. గాని పలుకు వినడ్లేదు.) ఉ(..ఈడు కొడుక్కోసం కాసుకుని కూకుండు గావల ఇసకల. కపాళం పగిలిపోతంది ఎండ. ఆ కాసుకోడంనోనే  ఈడెప్పుడో కల్లు పేలిపోయి గంగమ్మ తల్లిలో కలిసిపోగడు గా(వాల...  
----
(మగపిల్లాడు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవద్దనే సీను)
గంగు: గొప్ప పాపంరా  సిమ్మాద్రీ ! నీకు తెల్దు..కొడుకు పుట్టకుంట ఆపరేసను సేయించుకుంతే మనం సచ్చిపోతే నీల్దారెట్టి వోడేడీ??మరొక్క యేడాది సూడు...
సిమ్మా: సూత్తన్నాను.. ఏడేళనుండి సూత్తన్నాను..

నువ్వొట్టి  పిచ్చిబడతన్నావు మా(వా ! పదిమంది ఆడపిల్లల్ని కాసి, పద్దకుండోవోడు కొడుకైతే మట్టుగు ఆడికి సుకమేటి సెప్పు ? 
సత్తువంతా ఆడపిల్లల్ని పెంచడంతోటే కరిగిపోద్ది. మరి ఆడి సంగతేటి సెప్మి ! సత్తే నానొగ్గీసిన అప్పులు, ఆడపిల్లలు ఆడి మీదడతాయి.. 
నాకు నీల్దారెట్టడం కాదు. తిట్టి పోసెత్తాడు ! ఎందుక్కాసినావురయ్యా అని నా పేనాల మీద కేడుస్తాడు..
 -----


గంగు: ఔను. ఇదేటి పోయీకాలమే నీ మొగుడికి ? ఆపరేసనంతాడేటి ?
కొర్ల: శ శ ! నా నొల్లకోనని సెప్పీసినాను గానా ! కులం నిలబెట్టడానికి మగపిల్లడు పుట్టొద్దా ?
సిమ్మా: పుడతారె ! ఒలె ! పుడతాడు. నీకెడతాడు నోట్లో గడ్డి ! 

కొడుకుల్ని కాసి సుకపడుదు మనుకుంతన్నావు గావాల !
కొర్ల: మా(వా ! మా అయ్యకిట్టం నేకుంట ఆపరేసను ఈల్లేదంతే ఈల్లేదే !
ఇన్నావుగావా ? ఆడి మనసు కట్టం సేసుకుంటే మనకి జరిగేపాటి కూడా జరగదు ! మనకున్ని పెద్దదిక్కు మా అయ్యొక్కడే..
గంగు: నా తల్లె నా తల్లె ! నా మనసు గురించి ఆలోసించీ దానవు నువ్వ్వున్నావు        సాల్నా యమ్మీ..
కొర్ల: ఓరయ్యా. ఉల్లి బద్దనూరి సింతకాయ పులుసుల వొంజిరం ముక్క వుడకెయ్య మంతావేటే ? నీ కిట్టంగదా..   

(మరొక్క రెండు ఘట్టాలు తరువాయి పోస్టులో)  

 
 

Thursday, January 8, 2015

పీ.కే గాడు ఏం పీకుతున్నాడు??


నిన్నటి రోజున యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది.. 

టీ.వీ ల్లో లైవ్ దృశ్యాలను చూసి ఒక్కసారిగా భీతరిల్లిపోయింది.. ఏవిటీ మారణ కాండ??
దీనికి మూలకారణాలు..తప్పొప్పులు చాలా ఉండొచ్చు గాక.. 

జరిగినది మాత్రం అమానుషం.. 
ఫ్రాన్సు లాంటి కట్టుదిట్టమైన భధ్రతా వ్యవస్థ ..గట్టి నిఘా వ్యవస్థ వున్న దగ్గరే అతి సునాయసంగా ఇద్దరు వ్యక్తులు గన్నులతో వచ్చి..రాకెట్టు లాంచెలతో కూడా వచ్చి మారణ హోమం సృష్టించారు... 
అడ్డొచ్చిన పోలీసులను కూడా కాల్చి చంపారు..(వీళ్ళేమి చేసారు??)

ఇప్పుడు గత వారం రోజులనుండి పీ.కే రిలీజ్ అయ్యింతర్వాత ఇండియాలో మతవిశ్వాసాలమీద, ముఖ్యంగా హిందూ మత ఆచార, పూజా విధానాల మీద పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాసిన వారు, టి.వీ ముందు కూర్చొని తమకి ఇష్టమైన రీతిలో అవహేళణ చేసి మాట్లడిన వారు..దీనికి ఏమని సమాధానం చెప్తారు.. 

ఇక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ  వుంది కాబట్టి ఎవరో ఏదో  చేసారని అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడమేనా..    
మరి జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా ఒక్క కామెంటు చేసే ధైర్యం కూడా ఎవరికీ లేదా?? మీకు ఆడుకోవడానికి ..అవహేళణ పరచాడికి అనాదిగా హిందూ దేవుళ్ళు, మత విశ్వాసాలు దొరికాయా???
ఇప్పటికైనా పరమత  సహనాన్ని కలిగిన హిందూ వాదము కలిగిన మన భారత దేశ గొప్పతనానికి సలాం చెయ్యాలి.. మేరా భారత్ మహాన్ అని ఎలుగెత్తి చాటాలి.. 

ప్రపంచానికే శాంతిసందేశాన్ని చాటిచెప్పి తద్వారా ప్రపంచ యుద్ధాలను ఆపగలిగిన సత్తాను కలిగిన ఘన చరిత్రను గౌరవించాలి... 
నిరంతరం దైవధ్యానం కలిగిన మత పీఠాధిపతులు వున్నంతకాలము...ఎంతో భక్తిని..నియమాలను కల్గిన స్వాములు వున్నంత కాలము హిందూ మతం విరాజిల్లుతూ వుంటుంది..
ఒక్కొక్కసారి ఒక్కొక్కరి రూపంలో హిందూ మత పరిరక్షణకై ఆ భగవంతుడు పంపుతూనే వుంటాడు..  

కొడుకు పుట్టాల-Part III --.5 గురు ఆడపిల్లలు గల ఓ తల్లికథ..

మేము ప్రస్తుతం సుమారు గత 20  ఏళ్ళనుండి కె.వీ.మెమోరీల్ ఆర్ట్స్ అసోసియేషన్ పేరుతో నాటకాలు, నాటికలు వేస్తున్నాం.. 
దీని వ్యవస్థాపకుడు శ్రీ పి.శివప్రసాద్ గారు మ పోర్టు వుద్యోగస్తుడే..మరియు అత్యంత ప్రతిభావంతమైన కళాకారుడు.. నటుడు, ..దర్శకుడు.. 
మా సంస్థ పేరు కె.వీ మెమోరీల్ అంటే కుప్పిల్లి వెంకటేశ్వరరావు గారి పేరుమీద సంస్థ..
అయితే శ్రీ.శివప్రసాద్ ఆయన ఏకలవ్య శిష్యుడే..
మేమంతా శిష్య, ప్రశిష్యులం అన్నమాట..
ఈ సంస్థ ద్వారా కళ్ళు చిదంబరం  గారి ఆధ్వర్యంలో 2014 లో జరిగిన "ఆనాటి ఆణిముత్యాలు" అన్న కార్యక్రమంలో "కొడుకు పుట్టాల" నాటిక వేద్దాం అని తయారు అయ్యారు.... తీరా మాకు వేరే చోట అదే సమయానికి ఇంకొక ప్రదర్శన వుండటంతో వెయ్యలేకపోయాం.. 
ఈ ఉపోద్గాతం ఎందుకంటే ఈరోజన శ్రీ శివప్రసాద్ గారిని అడిగి నాటకం స్క్రిప్టు ని తీసుకుని మరికొన్ని విషయాలు మీ ముందువుంచే ప్రయత్నం చేద్దామని..

1. కొర్లమ్మకి అప్పటికే 5 గురు ఆడపిల్లలు.. మగపిల్లాడు పుట్టేవరకూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవద్దని తండ్రి కోరిన పిదప తండ్రికి.. మాట ఇస్తుంది.. కాని ఆమె భర్త సిమ్మాద్రి...ఆపరేషన్ చేయించుకుందాం అని ప్రోత్సహిస్తాడు... ఐదుగురు ఆడపిల్లలకి తోడు ఆఖరుపిల్లకి చర్మ వ్యాధి కూడా వుంటుంది..
2. తండ్రికి తెలియకుండా ఆపరేషన్ చేయించుకుని అపార్థాలకు గురై ప్రాణాల మీదికి తెచ్చిపిట్టుకున్న 5 గురు ఆడపిల్లలు గల ఓ తల్లికథ ...

3. "అధిక సంతానం అనర్థదాయకమని, పుట్టే బిడ్డ ఆడయినా, మగయినా ఒకటేనని, కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను వెల్లడించే ప్రయోగాత్మక, ప్రయోజాత్మక నాటిక..
----- 

14 భారతీయ భాషల్లోకి అనువదింపబడి , భారతదేశం అన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి పలు మార్లు ప్రసారమైంది..
ఇందలి పాత్రలు: కొర్లమ్మ, గంగులు ( కొర్లమ్మ తండ్రి), సిమ్మాద్రి (భర్త) ,   పకీరు (కొర్లమ్మకి తమ్ముడు), శరభయ్య (13 బిడ్డలు కన్న తాత), ..
మొదటి ప్రదర్శన : 1970.
ప్రదర్శకులు : బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం.
నటీనటులు: యస్.కె.మిశ్రో, కె.వెంకటేశ్వరరావు, కృష్ణచైతన్య, కె.వి,ఎన్,డి,ప్రసాద్ (కె.వీ.మాష్టారి అబ్బాయి), వి.ఎస్.ఎన్.మూర్తి, పి.జగన్నాధ రావు.గణేష్ పాత్రో, కె.విజయలక్ష్మి. ,
దర్శకత్వం: శ్రీ .కె.వెంకటేశ్వర రావు గారు..

గణేష్ పాత్రో గారి ఇతర రచనలు:
పావలా, లాభం, ట్రివేణీ, ఆగండి కొంచెం ఆలోచించండి , తెరచిరాజు, మృత్యుంజయుడు..మొ..నాటికలు,
తరంగాలు, అసుర సంధ్య అను నాటకాలు..
2008 అక్కినేని నాగేశ్వర రావు 85 వ జన్మదినోత్సవ సంధర్భంగా వారిచే స్వయంగా సన్మానించబడిన ప్రముఖులలో వీరొకరు.. 
మరోచరిత్ర, ఆకలిరాజ్యం, ఇది కథకాదు, స్వాతి, మయూరి, సీతారామయ్య గారి మనుమరాలు.. మొన్నటి "సీతమ్మ వాకిట్లో..."దాకా ప్రసిధ్ధ చలన చిత్రాలకు సంభాషణలను సమకూర్చిన వీరు ఉత్తమ రచయితగా పలుమార్లు నంది అవార్డులు పొందారు..
"కొడుకు పుట్టాల" లోని కొన్ని మాటలను మీకు తరువాయి పోస్టులో అందించే ప్రయత్నం చేస్తాను.. 

  

Wednesday, January 7, 2015

"కొడుకు పుట్టాల"... కాదు..కాదు.. కొడు"'కే" పుట్టాలా??? -Part 2

అసలు విషయం చెప్పకుండా.. గత పోస్ట్ ముగించాను అనుకుంటున్నారా.. 
సాంఘీక నాటకాల గురించి..పరిష్యత్ పోటీల గురించి తెలియని వారికోసం ఆ మాత్రం నాలుగు ముక్కలు చెప్పకపోతే.. వాటి సీరియస్ నెస్ వాళ్ళకి తెలియక పోతే ఈ నాటికల గురించి రాసినా ప్రయోజనం వుండదేమో అని అలా రాసాను..

ఇక "కొడుకు పుట్టాలా?",   "పావలా" నాటికల విషయానికొస్తే.. నిరుపేద జీవితాలకు.. వారి కష్టాలను.. వాటికి సర్దుకుని పోయి అందులోనే ఆనందం అనుభవించే ఘట్టాను సజీవంగా చూపుతాయి... 

సాంఘీక నాటికల్లో కూడా కొన్నిటికి భారీ సెట్టు..గంభీరమైన పాత్రలు..రొటీన్ డైలాగులు వుండి..ఒక నాయకుడు..ఒక నాయకి..ఒక విలను, గుండె జబ్బుతో బాధపద్డే తండ్రి.లేక తల్లి..ఇలాంటి నాటకాలు కూడా ఎన్నో వచ్చాయి.. 
వీటన్నిటికీ బ్రేక్ చేస్తూ వచ్చినవే ఇలాంటి సహజ సిధ్ధమైన పాత్రలతో కూడిన నాటికలు.. 
సర్వశ్రీ గొల్లపూడి మారుతీ రావు, తనికెళ్ళ భరణి, యండమూరి, గణేష పాత్రో, ఆకెళ్ళ, ఎన్.ఆర్.నంది..ఇలా ఎంతో మంది రచయితలు, దర్శకులు తమ కలానికి పదును పెట్టారు..పెడుతూనే వున్నారు.. 
వీటిల్లో మెలో డ్రామా కి ప్రాధాన్యత వుండి..ప్రతి సన్నివేశమూ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వుంటాయి..చప్పట్లు కొట్టిస్తాయి..

"కొడుకు పుట్టాల" నాటికలో ముందు తెరలేవ గానే ఒక జాలరి వీధి..ఆ వీధిలో ఒక జాలరి కుటుంబం ఇల్లు..వాతావరణం కనిపిస్తాయి..

ముసిలాడు (కొర్లమ్మ తండ్రి) వలను నేస్తూ వుంటాడు..సముద్రపు హోరు వినిపిస్తుంది... 
కట్టు, బొట్టు అచ్చం జాలరి యువతి లాగ వుండే యువతి కనిపిస్తుంది..  
సహజసిధ్ధమైన వాతావరణం..
కన్యాశుల్కం లో మధురవాణి చుట్టు పాత్రలన్ని తిరిగినట్టు..ఈ నాటికలో  కొర్లమ్మ పాత్ర చుట్టు తిరుగుతాయి.,..
నిలబడి డైలాగు చెప్తూ కంటే ఏదో ఒక పనిచేసుకుంటూ డైలాగ్ చెప్పడం అనేది ఒక నూతన ప్రక్రియ అప్పట్లో.. 
ఒక కుక్కి మంచం వుంటే దాన్ని నేస్తూ డైలాగులు చెప్తూ వుంటారు...అప్పుడే ప్రేక్షకుడికి ఒక నాటకం చూస్తున్నాం అనే అనుభూతి కన్నా..ఒక ఇంటి బయటో లేదా వీధి అరుగులోనో కూర్చుని చూస్తున్నట్లుగా అనుభూతి పొంది..అలా నాటిక లోకి మమేకమైపోతాడు..   
ఈ కొర్లమ్మ తండ్రికి 7 గురు కొడుకులు పుట్టి చనిపోతారు..మిగిలింది కొర్లమ్మ, మరియు ఒక తమ్ముడు..వాడొక తాగుబోతు..డబ్బులు లాక్కొని పోయి బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తూ వుంటాడు.. 

ఈ ముసిలాడికి మరొక ముసిలాడు స్నేహితుడు వుంటాడు.. అతనికి పదముగ్గురు మగ సంతానం.. కాని వారు సముద్రంలో వేటకి వెళ్ళి ఒక్కొక్కరూ చనిపోతూ వుంటారు.. 
కొర్లమ్మ భర్త మరీ చెడ్డ వాడు కాదుకాని.. విలాసపురుషుడు.. ఇది ఇలా వుండగా తండ్రికి మందులు కోసమని దాచిన డబ్బులు తమ్ముడు ఎత్తుకుని పోవడంతో ... ఓ రెండ్రోజులు ఎక్కడికో వెళ్ళిపోయి డబ్బులతో తిరిగి వస్తుంది కొర్లమ్మ...
ఆ డబ్బులు ఎక్కడివో చెప్పమన్నా చెప్పదు..  దాంతో ఆమె ఏదో చెడ్డ పని చేసి డబ్బు సంపాదించిందని బావకి వుసికొల్పుతాడు బావమరిది.. 
భర్త నిలదీసి అడిగి ఆవేశంతో కొడతాడు.. అప్పుడు నిజం చెప్తుంది.. బాధ్యతను మరిచి తిరుగుతున్న మగాళ్ళను చూసి తనకు అసలు బిడ్డలే వుండకుండా వుంటే కొడుకుల వలన కలిగే కష్టాలు వుండవని ఆమె కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుని వారిచ్చే డబ్బుతో తిరిగివస్తుంది.. తండ్రి, ఆతని స్నేహితుడు "కొడుకులు పుట్టే కంటే ఇలాంటి కొర్లమ్మ లాంటి కూతురు వుంటే చాలును" అని తెలియజేస్తూ వుండగా నాటిక ముగుస్తుంది..

నాటిక ఇతివృత్తం ఇలా టూకీగా తెలుసుకుని ఓస్ ఇంతేనా అని మీరనుకోవచ్చు.. కాని ఆ సంభాషణలు...కొర్లమ్మ వ్యక్తిత్వం ఇవన్నీ నాటిక చూస్తే తప్ప అర్ధం కావు.. నిజానికి ఏ గొప్ప నాటిక కాని, సినిమా గాని కథ వింటే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.. కాని దర్శకుని ప్రతిభను బట్టి అవి ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి ఆకట్టుకుంటాయి.. 

"కొర్లమ్మ" వేషం చేసిన సీనియర్ విజయలక్ష్మి గారికి ఎంతో పేరు రావడమే కాక  ఎన్నో ఉత్తమ నటి అవార్డులు తెచ్చిపెట్టింది.. శ్రీ కె.వీ మాష్టారు స్నేహితుడి పాత్రలోను ..ఇతర పాత్రల్లో శ్రీయుతులు వంకాయల, మిశ్రో, జగన్నాధరావు గార్లు కూడా బహుమతులు అందుకున్నారు..  
(కొన్ని వివరాలు అందించినందుకు శ్రీమతి విజయలక్ష్మి గారికి ధన్యవాదములతో)
ఇంకా వివరంగా కావాలి అంటే రాస్తాను ఈ "కొడుకు పుట్టాల" నాటిక గురించి..
"పావలా" గురించి తరువాయి భాగంలో చర్చిద్దాం...

"కొడుకు పుట్టాల"... కాదు..కాదు.. కొడు"'కే" పుట్టాలా???

శ్రీ గణేష్ పాత్రో గారు స్వర్గస్థులైనప్పుడు..చాలా మంది పాత తరం నటులు, రచయితలు స్పందించేరు.. 
ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం రాసిన "కొడుకు పుట్టాల", "పావలా" నాటికల గురించి ప్రస్తావించారు.. 
అయితే ఏంటి ఆ నాటికల గొప్పతనం?? అని ఆ నాటికల గురించి తెలియని వారు ఆశ్చర్య పోయారు... 
వాటి గురించి నాకు తెలిసిన నాలుగు ముక్కలు రాసే ప్రయత్నం చేస్తాను..

తెలుగు నాటక రంగం ముఖ్యంగా రెండు రకాలు ఒకటి పౌరాణిక (పద్య) నాటకం.. రెండోది సాంఘీక నాటకం లేదా నాటిక.... (నిడివి పట్టి విభజించారు)..
పౌరాణిక నాటకాల లో టైటిల్ ని బట్టి ఆ నాటకం మనకి ముందే తెలుస్తుంది.. పద్యాలు కూడా సుపరిచితమే.. 

 
 
కాని ఆ నాటకం మీద మక్కువను బట్టి..ఈ నటులు అయితే ఈ నాటకాన్ని ఎలా వేస్తారో చూద్దాం అని కూర్చుంటారు ప్రేక్షకులు.. 
అసలు నాటకాలకి వుండవలసిన అన్ని లక్షణాలు సంపూర్ణంగా వుండేది పౌరాణిక నాటకాల్లోనే..
 

పౌరాణిక నాటకము నాటక కళకు తల్లి లాంటిది..

ఇక ఈ సాంఘీక నాటికలు, నాటికల విషయానికొస్తే ప్రదర్శనా కాలం తక్కువగా వుండి, 

ఏదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు ఇవాలి, 
సహజత్వానికి దగ్గరగా వుండాలి..
.ప్రేక్షకులను ఆలోచింపచేసేదిగా వుండాలి..

 


 ముఖ్యంగా పరిష్యత్తు నాటక పోటీలు అన్నవి ప్రారంభం అయిన దగ్గర నుండి నాటకం రూపాంతరం చెందినది అని చెప్పవచ్చు.. 
ఎప్పటి కప్పుడు నూతన ఒరవడిని సృష్టించుకుంటూ ముందుకు సాగిపోతోంది నాటక కళ సజీవంగా..
   ఈ నాడు పరిష్యత్తు పోటీలు వుండబట్టే నాటక కళ  బతికి బట్టకడుతోంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు..
ఈ మాత్రం ఇంట్రడక్షన్ లేక పోతే గణేష పాత్రో రాసిన ఆ నాటికల ప్రాముఖ్యం గురించి తెలుసుకోలేరు..
అలా పరిష్యత్తు పోటీలకి కావలసిన లక్షణాలు సమపాళ్ళలో కల్గిన నాటికలు  ఈ "కొడుకు పుట్టాల", "పావలా" నాటికలు..
ఈ నాటికలు గురించి చెప్పే ముందు ఒక పెద్దాయన గురించి చెప్పక పోతే పాపాత్ముణ్ణి అవుతాను.. 

ఆయనే శ్రీ.శ్రీ. కుప్పిలి వెంకటేశ్వర్రావు గారు.. ఆంధ్ర దేశం గర్వించ దగ్గ నటులు, దర్శకులు..
ఆయనే నట కిశోరం అనుకుంటే ఆయన మరో వందమంది నట పులులను తయారు చేసాడు..
ఆ తరువాతి తరంలో కూడా ఈ నాటక కళని సజీవంగా నిలుపుటలో జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు..

పులులనబడే శ్రీయుతులు వంకాయల, గణేష్ పాత్రో, మిశ్రో, మందులు, జగన్నాధరావు, కృష్ణచైతన్య, విజయలక్ష్మి, నేటి స్టార్ మేకర్ సత్యానంద్..ఇంకా అనేక మంది..నాకు తెలియదు.. ఎందుకంటే శ్రీ.వెంకటేశ్వర్ రావు గారి నాటకాలు ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలగలేదు..(అప్పటికి వయసులో చిన్న వాణ్ణి కాబట్టి.)..
 అయితే మా గురువుగారు కీ.శే మందులు గారు శ్రీ కె.వీ మాష్టారి గురించి ఎప్పుడూ చెప్పేవారు.. 
వారిని నాన్నగారు అని పిలిచే సీనియర్ విజయలక్ష్మి గారు నేటికీ ఆ విశేషాలను చెప్తూనే వున్నారు..
ఆవిడతో కలసి నటిస్తూ వుండడము మా అదృష్టం..
సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. 
(తరువాయి రెండో భాగం)
నాలుగు ముక్కలు రాస్తాను అని నాలుగొందల ముక్కలు రాసాను అందుకని..
చిన్న కమర్షియల్ బ్రేక్ అనుకోండి.. మనకి అలవాటేగా.. 
    

Monday, January 5, 2015

గణేష్ పాత్రో గారికి "కొర్లమ్మ" అనబడు ఈ మగ నటుడి.. నివాళి..

నా మొట్టమొదటి నాటక రంగ ప్రవేశం - శ్రీ గణేష్ పాత్రో గారు రచించిన "కొడుకు పుట్టాల" నాటకం లో "కొర్లమ్మ" - స్త్రీ పాత్ర..
ఈ పోస్ట్ అసలు మొన్ననే రాద్దామను కున్నాను.. కాని పెద్ద సెలబ్రిటీ లాగ  నా మొదటి నాటకం అని రాస్తే ఎవరూ పట్టించుకోరేమో అని రాయలేదు..
సుమారు 27 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి
మొన్ననే వెళ్ళాను ..
ఆ రంగస్థలానికి ఫొటో తీసాను.. 

(ఇదే నా మొదటి రంగస్థలం..ఆనాటి  తీపిగుర్తులను మనసులో పదిలంగా దాచుకోవడానికి మొన్న (26 డిసెంబర్ 2014 నాడు)   తీసాను.. కాని ఇలా పోష్ట్ రాస్తానని అనుకోలేదు). 


.. కాని ఈ రోజున శ్రీ గణేష్ గారు స్వర్గస్థులయ్యారు కనుక ఆయనకు నివాళి గా రాస్తున్నాను..
సుమారు 30 ఏళ్ళ క్రితం ఉత్తరాంధ్ర మాండలీకం లో రాసిన ఆయన నాటకాలు "కొడుకు పుట్టాల" మరియు "పావలా" చాలా ప్రాచుర్యం పొందాయి.. 
నిరుపేద జీవితాలకు అద్దం పట్టాయి... ఎంతో మంది కళాకారులకు బహుమతులు తెచ్చిపెట్టాయి.. ఇక పావలా నాటకంలో వేసిన శ్యామల గారి ఇంటిపేరు "పావలా శ్యమల" గా నిలిచిపోయింది..
ఆ ఊరిలో - (ప్రకాశవన కాలనీ ఆఫ్ సింగరేణి..మణుగూరు) లో  శ్రీ సీతారామ కళ్యాణ వేడుకల్లో ఈ నాటిక వేశాం..
శ్రీ ప్రసాద్ అనే ఓవర్సీర్ ఒకాయన మా నాటకం డైరెక్టర్ మరియు హీరోయిన్ కి మావయ్య కారెక్టర్ వేసారు....
సింగరేణి స్కూల్ తెలుగు మాష్టారు గారు భర్త వేషం.. ఇంకొక ఆయన (ఎవరో గుర్తు లేదు) తమ్ముడు వేషం చేసాడు..
నాకు నాటకాల మిత్రులు వైజాగ్ లో వున్నా.. ఎప్పుడూ వేషం వెయ్యలేదు.. జస్ట్ చూసేవాణ్ణి..
అప్పుడు ఇంకా లేత వయస్సు కాబట్టి.. ఆ ఊర్లో స్త్రీ పాత్రలు వేసే వాళ్ళు లేక పోబట్టి నా చేత వేయించాడు.. ఆ అనుభవాలు తదుపరి పోష్ట్ లో రాస్తాను..
అలా మొదలయిన నా నటన జీవనం అలా కొనసాగుతూ..మా పోర్టులో వున్న డైరెక్టర్లు అందరీ దగ్గరా
మంచిపాత్రలు వేస్తూ.. . కొన్ని బహుమతులు కూడా తెచ్చుకున్నాను.. ప్రస్తుతం ఎక్కువ చెయ్యక..కేవలం కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానుల పాత్ర చేస్తున్నాను... ఆ వివరాలు కూడా తరువాయి చెప్తాను..
నా మొదటి నాటిక రచయిత అయిన గణేష్ పాత్రో గారి ఆత్మకు శాంతి చేకూరాలని...ఆయన ఆశీస్సులు నా పై ఎల్లప్పుడూ వుండాలని..కోరుకుంటూ..ఈ కొర్లమ్మ నివాళి.. శెలవు...