Sunday, February 15, 2015

ఇలా మీలో ఎంతమంది చేస్తున్నారు?? చెప్పండి..

శ్రీ. దివాకర్ బాబు రాసిన "పుటుక్కు జర జర డుబుక్కు మే" అను నాటికలో భర్త.... భార్యతో "ఏమేవ్ మన గడియారం దొంగలెత్తుకుపోయారు " అంటాడు..  
గోడ మీద గడియారం కనిపించకపోయేసరికి.. అందుకు భార్య "దొంగలెత్తుకు పోవడం కాదు.. బుజ్జిముండ 24 గంటలు టిక్కు..టిక్కు అంటూ కొట్టుకుంటూ వుంటే పాడైపోతుందని నేనే భద్రంగా బీరువాలో దాచా"... అంటుంది.. 
 
"నీకేమైనా మతిపోయిందా.. అది టిక్కు టిక్కు అని కొట్టుకోకుండా వుంటేనే పాడైపోతుందే" అంటాడు సదరు భర్త..   

ఈ నాటికలోనే పక్కింటి అమాయక చక్రవర్తి కాశీపతి వాళ్ళావిడ చీరలో ఈవిడ వుంటే పొరపాటున వాళ్ళ ఆవిడే అనుకుని.. కౌగిలించేసుకుంటాడు.. ఆ తర్వాత దీని విషయమై భర్త అయిన ప్రసాదం తనను అపార్థం చేసుకుని.. బాగా ఫీల్ అయ్యాడని.. కనిపించిన వాళ్ళందరికీ ఈ కథ పూసగుచ్చినట్టు చెప్పి ఊరు..వాడ కాన్వాసు చెసేస్తాడు...  

(.. ఇది అదేదో సినిమాలో వుందండి..అని మీరు కొట్టిపారేయొచ్చు.. ఆ సినిమా మాటల రచయిత అయిన శ్రీ దివాకర్ బాబు తన నాటికలోని సీన్లనే సినిమాలో జొప్పించాడు.. ఒక్క సినిమాలోనే కాదు రెండుమూడు సినిమాల్లో వాడేస్తారు ఈ కామెడీని..  


ఈ ఉపోద్గాతం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి నా బండి పాడైపోతుందని ఎంచక్కా కవరు కప్పేను... 


ఇలా మీలో ఎంతమంది చేస్తున్నారు?? చెప్పండి.. ఇదేమన్నా గొప్పా అని తీసిపారేయకండి.. సుమారు 50 వేలు పైగా ఖర్చుపెట్టి బండి కొన్నవాళ్ళు ఓ 300 పెట్టి కవరు కొనలేరుటండీ???
ఎన్నో లక్షలు పెట్టి కారు కొంటారు.. కనీసం వెయ్యిరూపాయల కవరు కొనలేరా కారుకి?? కొంటాం సరే.. ఇంటికొచ్చిన తర్వాత ఎవడు వేస్తాడండి.. నిముషాలు ఖర్చు అయిపోవూ???.... 


కవర్ కప్పి ఉంచడం వలన దుమ్ము, ధూళి నుండి రక్షణ మాత్రమే కాదు.. బండి కున్న రంగు షైనింగు పోకుండా వుంటుంది.. 

మీరు గమనించారా.. నా బండి కున్న నట్లు, బోల్టులు కూడా ఇప్పటికీ మెరుస్తున్నాయి.. 

అందుకు కారణం నేను ప్యూర్ ఇంజన్ ఆయిల్ (2టి) ఆయిల్ అరలీటరు కొని దాన్ని పిల్లర్ లో పోసి.. వారానికి లేదా కనీసం నెలకొకసారైనా ఆ ఆయిల్ తో క్లీన్ చెస్తే ఇలా తుప్పు పట్టకుండా వుంటాయి... అన్ని భాగాలూ... 
అయితే.. చాలామంది కొబ్బరి నూనె గాని మెకానిక్కు వాడే మడ్డి ఆయిల్ గాని వాడతారు.. అయితే ఈ రెండిటి కన్నా మీరు ప్యూర్ ఇంజన్ ఆయిల్ కొని (ఖర్చు గురించి ఆలోచించొద్దు)... వాడి చూడండి...
ఇక కారు విషయానికొస్తే ఒక కిట్ కంపెనీ వాళ్ళు అమ్ముతారు.. 

అందులో 
ఒక షాంపూ డబ్బా..
ఒక అద్దాలను శుభ్రపరిచే కొలిన్ ద్రవం.. 
ఒక బాడీ పాలిష్ ద్రవం.. 
మరియు డాష్ బోర్డు తుడిచే సొల్యూషన్ వుంటాయి.. 
ఈ కిట్టు ఖరీదు మహా వుంటే ఓ మూడొందలు వుంటుంది..  
అవి కొని ఇంట్లో పెట్టుకుని కనీసం నెలకోసారి వాడి చూడండి.. 
అద్భుతం గా వుంటుంది..
ప్రతి ఆదివారం ఒక అరగంట బండి లేదా కారు గురించి కేటాయిస్తే ఏ మికానిక్కు అవసరం లేదు..
నేను కేవలం క్లీనింగు కోసం ఇంజన్ ఆయిల్ కొంటునప్పుడు గాని.. కారు కిట్ కొంటున్నప్పుడు గాని షాపువాళ్ళు నన్ను వింతగా చూసారు.. 

కారు సర్వీసింగు సెంటరు వాడు అయితే రేటు వెంటనే చెప్పలేక పోయాడు.. దానికి కారణం ఎవరూ అంతవరకూ ఆ కిట్ ని కొనలేదు కనక.. 
"ఏవిటండీ ఓ పదో పారకో పారెస్తే సర్వీసింగు సెంటర్లో కడిగిపారేస్తారు".. అని మీరు అనొచ్చు.. కాని మన బండిని మనం క్లీన్ చేస్తే వున్న ఆనందం... పరాయి వాడు క్లీన్ చేస్తే  దొరకదు.. పైగా వ్యాయామం   కూడా..
అలాగని నేనేం పిసినారిని కాదండి.. 

సరిగ్గా మూడు నెలలు తిరగ్గానే బండి కంపెనీ సర్వీసింగు సెంటరుకు అప్పచెప్తా.. 
మనలోమన మాట.. నాకు నా భార్యకన్నా బండి అంటేనే ప్రాణం.. ఈ విషయం పెళ్ళయిన వారంలోనే అర్థం అయ్యింది మా ఇంటావిడకు... అప్పుడప్పుడు మాత్రం "చాల్లెండి తుడిచేరుగాని." అని డెప్పిపొడుస్తూ వుంటుంది...
మరో విషయం ఏవిటంటే మా మిత్రులు, బంధువులు...ఈ విషయంలో ప్రోత్సహిస్తారు కూడా.. 


ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు "బండి మీదేనా...కొత్తగా కొన్నారా" అని ఎవరైనా అంటే చాలు ఛాతీ పొంగిపోతుంది..  


"కీప్ ఇట్ అప్ సార్.." అని ఆఫీసులో చాలా మంది అంటారు..     
 అన్నట్టు నా బండి కొని  మూడేళ్ళు పైబడింది.. చూసారా.. బుజ్జిముండ ఎలా మెరిసిపోతోందో.. 

 
అన్నట్టు చెప్పడం మరిచా ఇది నా జీవితంలోకి ప్రవేశించిన  ఐదో బండి..మైలేజి ఇవ్వట్లేదని కైనెటిక్ 4ఎస్ మరియు బజాజ్ పి.ఎల్ 170 అని ఒక సెకండు హాండు బండిని త్వరగా మార్చివేసాను గాని మిగిలిన వాహనాలు పదేళ్ళు పైబడి చక్కగా మైంటేన్ చేసిన ట్రాక్ రికార్డు ఇక్కడ..