Saturday, March 28, 2015

కాని ఆ అనుభూతి.. ఈ కట్టె ఆ కట్టెల్లో కాలే వరకూ వుంటుంది.

భద్రాచలం తో నా అనుబంధం చెప్పాలంటే చాంతాడంత అవుతుంది...ఈ రోజున శ్రీరామనవమి కాబట్టి ఒకట్రెండు మాటలు..

ఎన్నో వందల కిలోమీటర్లు 14 గంటల బస్సు ప్రయాణం తర్వాత "రామయ్య" సన్నిధి కి చేరగానే "హమ్మయ్య నాకిక ఢోకా లేదు"..అని నిశ్చింతగా "కర్నూల్" వారి సత్రవులో (ఇప్పుడా పేరులేదు) ఏ వసతులు లేకపోయినా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయే వాణ్ణి..
సుమారు నాలుగేళ్ళు ఆ ప్రాంతంలోనే వుద్యోగం చేసి.. వీలు కుదిరినప్పుడల్లా రామయ్య దర్శన భాగ్యం చేసుకుంటూ..గోదావరిలో స్నానం ఆచరిస్తూ.. సంధ్యావందనం చేసుకుంటూ .. అడగకుండానే అన్నీ ఇచ్చిన రామయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రోజులు దొర్లించేసాను ఆనందంగా..   


ఇక అక్కడి నుండి వేరొక చోటికి మరొక వుద్యోగం కోసం వెళ్ళిపోతున్న తరుణంలో ఆఖరుసారిగా రామయ్య దర్శనార్ధం...ఎప్పుడూ సుప్రభాత దర్శనం చేసుకో లేదు కనుక  ఎలాగైనా ఆ మర్నాడు సుప్రభాత దర్శనం చేసుకోవాలి.. అనె సంకల్పంతో ముందురోజు రాత్రి భధ్రాచలంలో బస  చేసాను.. 


తెల్లవారుఝామునే లేచి స్నానం చేసి నాలుగు గంటలకన్నా ముందే గుడికి వెళ్ళాను.. ఎవ్వరూ లేరు..నేనొక్కణ్ణే ..ఆంజనేయ విగ్రహం ఎదురుగా గర్భగుడిలోకి వున్న ప్రధాన ద్వారం పక్కన ఎత్తైన అరుగు వుంటుంది..(ఇప్పటికీ వుంది)..  ఆ ఎత్తైన అరుగుమీద కూర్చుని కళ్ళారా ఆంజనేయ స్వామిని చూస్తూ.. దూరాన కనిపిస్తున్న గోదావరిని చూస్తూ..దైవ ధ్యానంలో కూర్చున్నాను..
కాస్త చలిగానే వుంది..
 
 ఇంతలో పూజారి గారు వచ్చారు.. "మీరు లెండి" అన్నారు.. ఓహో ఇక్కడ కూర్చోకూడదు కాబోలనుకుని లేచి ఒక పక్కగా నిలబడ్డాను.."నాతో రండి" అన్నారు.. నాకు అర్ధం కాలేదు..అలాగే నిలబడ్డాను.. "నాతో కూడా గర్భ గుడి లోకి రండి" అన్నారు.. ఆశ్చర్య పోయాను... 
నాకు తెలియకుండానే ఆయన వెనకాలె వెళ్ళాను.. 
పూజారి గారు మంత్రాలు చదువుతూ స్వామి నిజరూప దర్శనంలో ఒక పక్క సుప్రభాతం వినిపిస్తూ వుండగా నీళ్ళతోను, పాలతోను అభిషేకం చేస్తున్నారు.. 
ఆ దృశ్యాన్ని  చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు.. 
మనసు పరవసించి పోతోంది .. ఇక అలాగే సాష్టాంగ ప్రమాణం చేసాను.. ఏవిటేవిటో కోరికలు కోరుకుంటున్నాను.. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు... ఇన్నాళ్ళు దగ్గరగా వున్నాను.. నీ  చల్లని నీడలో హాయిగా వున్నాను.. "నా మీద ఎప్పుడూ ఇలాగే దయచూపించు తండ్రీ" అంటూ ఏవిటేమిటో మాట్లాడేస్తున్నాను..  
 
అలౌకిక  ఆనందంలో చక్కటి అనుభూతితో నా రూం కి వచ్చాను.. 
నాకు తోడుగా వచ్చిన నా దగ్గర పనిచేసే అతను డబ్బులు అడిగితే ఎప్పుడూ ఇవ్వనంత డబ్బు ఇచ్చేసాను.. ఎందుకంటే ముందు రోజు రాత్రే నేను దర్శించుకుని ఉదయాన్నే బస్సు ఎక్కుదాం అనుకున్నాను.. కాని..అతను ముస్లిం అయినా.. . "సార్ మీరు మొదట సుప్రభాత దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు.. కాని బస్సు కోసం కంగారుపడుతున్నారు.. మీకేం పర్వాలేదు బస్సు టైము కల్లా మీకు సుప్రభాత దర్శనం అయిపోతుంది.. మరల మీకు అవకాశం దొరుకుతుందో లేదో.. కనుక మీరు సుప్రభాత దర్శనానికే వెళ్ళండి" అని ప్రోత్రహించాడు...
ఆ తరువాత ఇన్నేళ్ళలో రెండు సార్లు సుప్రభాత దర్శనానికి వెళ్ళాను కాని .. ఇప్పుడున్న పరిస్థితులు వేరు..

కేవలం నేను.. నా రాముడు..ఆయన ఒడిలో సీతమ్మ.. పక్కనే లక్ష్మన స్వామీ.. ఒక పూజారి గారు.. అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తినా రాదేమో...    
కాని ఆ అనుభూతి.. ఈ కట్టె ఆ కట్టెల్లో కాలే వరకూ వుంటుంది.. అందుకే ఎప్పుడు భధ్రాచలం వెళ్ళినా ఆ అరుగు మీద కూర్చుంటాను.. ఎంతమంది జనం వున్నా..ఎవరు ఏవనుకున్నా ..   
శ్రీరామ నవమి సందర్భంగా మీకు శుభం అగుగాక..