Sunday, May 31, 2015

సీ గాన పెసూనాంబ (జూనియర్) కబుర్లు...


అంకుల్స్ ఎండ్ ఆంటీసూ...అందలికీ దండాలు...
ఇంగో ఇక్కల నన్ను ఎత్తుకొని ఫోజులిత్తున్నాలే..
ఈయన నా తాతాలన్నమాట.. 
అత్తమాను "చూలు..నీ తాతాల్నొచ్చేను చూలు.." అని నేను పుత్తిందగ్గర్లుండి బతిమాలుకుంతుంతే..పోనీలే పాపం అని మనం కుంచెం జాలి చూపించి..సరేలే అని ఒప్పుకున్నాం అన్నమాట..

అప్పులప్పులు ఎదులుగా ఉన్న నాతో ఆలుకోకుండా సెల్ లో కనబడని ఫ్రండ్సుతో ఊసులాలుతాలు..అప్పులు మా అమ్మమ్మ గాఠిగా వీడికి కుంచెం క్లాసు తీసుకుంటుదన్నమాట..

వీడు నన్ను లకలకాల పేర్లు పెత్తి పిలుస్తూ మనం నవ్వాలని బోల్డు కోతి చేస్టలు చేస్తూ ఉంతాలు..
ముందు మనం నవ్వకూలదు..కుంచెం బెట్టు చెయ్యాలన్నమాత..లేకపోతే మనం వీడికి అలుసైపోతాం..
పోనీలే పాపం అని జాలి పడి కుంచెం నవ్వాలి..ఇక చూడాలి..
మా పాప నన్ను చూసి నవ్విందోచ్ అని గెంతుతాలు...
బుగ్గల మీద ముద్దులు పెత్తెత్తూ వుంతాలు...
"నీ  మీచాలు గుచ్చుకుంతున్నాయ్ తాతోయ్" అని అంతున్నా వినిపించుకోడు..అయినా మన ఉంగా భాష వీడికి రాదుగా..
సరే..ఇక ఉంతా...బై...

Sunday, May 24, 2015

ఇప్పుడు మా ఊళ్ళో ఎమర్జెన్సీ పెట్టేరు..మరి మీ ఊళ్ళో మాటేవిటి??

1977 లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేరు..కర్ఫ్యూ పెట్టేరు..144 సెక్షన్ అమలుపెట్టేరు..మిలటరీ వారు ఊళ్ళోకొచ్చి కవాతు చేసేరు..అప్పుడు రోడ్లన్ని నిర్మాణుష్యం..మనిషి కాదుకదా పిట్టలు కూడా కానరాలేదు..మనుషుల్ని పిట్టల్లా కాల్చివేస్తారని..పిట్టల్ని చూసి ఒకవేళ మనుషులేమోననుకుని కాల్చివేస్తారేమోనని పిట్టలు లేవు..పిట్టమనిషి లేడు..


ఇప్పుడు అలాగే  ఉంది..గత వారం నుండి అమలులో ఉన్న ఎమర్జెన్సీ  ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు..
అప్పుడు ఇందిరమ్మకి కోపం వస్తే..ఇప్పుడు ఇంకో పెద్దాయనకి కోపం వచ్చింది...

సన్నాసి  వెధవల్లారా మీ చావు మీరు చావండి..
నా డ్యూటీ నేను చేస్తున్నాను..
తెల్లారి లేచింది మొదలు మీ పైవాడికి (మీ బాస్ కి) అష్టోత్తరాలతో, సహస్రనామాలతో పూజించి కాకాలు పడతారు గాని కేవలం నాకున్న 12 నామాల్ని చదివారా ఎన్నడైనా..
నేనే అసలైన పైవాడ్ని అన్న ఇంగిత ఙ్ఞానం లేదే??

ఎవడో ఏదో ఉద్దరిస్తాడని ఉన్నదంతా ఊర్చి వాడికి ధారపోస్తారు గాని ప్రాత: కాలాన్న నేనుదయించు సమయాన అంజలి ఘటించి దోసిలితో ఇంత ఉదకాన్ని సమర్పించారా ఏనాడైనా..

కడుపు నింపుకోడానికి నలుదిక్కులూ పరిగెడతారు గాని నేనొచ్చే ఒకే ఒక్క దిక్కు తూ ర్పు దిక్కు..ఆ దిక్కుకి ఒక్క మరైనా దండం పెట్టారా?? పై పెచ్చు ఎవడైనా దివాలా తీస్తే "తూ ర్పుకి తిరిగి దండం పెట్టూ" అంటూ వేళాకోళం చేస్తారు..
మీ కడుపు నిండడానికి కావలసిన గడ్డి నా వలననే తయారవుతుందన్న నిజాన్ని మర్చినారా??

గంటలు గంటలు మాయదారి కంప్యూటర్లు, లాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు  ముందేసుకుని అడ్డమైన పోస్టులకి లైక్ లు, కామెంట్లు పెడతారు గాని.. ఒక్క పది నిముషాలు "ఆదిత్య హృదయం" చదివిన పాపాన పోయారూ???

అయినా..మీ స్వయం కృతాపరాధ్ధానికి నన్ను ఆడిపోసుకోడం ఎందుకు..
చెట్లు నరికేసి..కాలుష్యాన్ని పెంచేసి, అనేక రకాలుగా భూ వాతావరణం వేడెక్కేలా చేసుకుని తప్పంతా నాదైనట్టు పేపర్లలో   "భానుడి ప్రతాపం".."మండే సూర్యుడు" హెడ్డింగులు పెట్టి నన్ను వికృత రూపంలో చూపిస్తారా??
అనుభవించడిరా...ఇంతకింతా అనుభవించండి..

Tuesday, May 19, 2015

హాయి నొందు సమయాన బానపొట్ట పెరిగెనమాంతరముగన్..

వినువీధిన టాకీసునందు
వెండి తెరమీద తైతక్క లాడు బొమ్మ
లు నేడు నట్టింట చేరి బుల్లితెర మీద
నాట్యమాడుతు పంచె విసోదమ్ము నిర్విరాముగన్..

చలువ యంత్రమెదుట
ఎత్తుపీటపై కాలుబార జాపి
వలయు ఛానళ్ళను మీటనొక్కుచు
హాయినొందు సమయాన
బాన పొట్ట పెరిగెనమాంతరముగన్..

వంటిలోన కొవ్వు అంతవేగిర పోదయా..
విశ్వ ఓలేటి మాట వినగ రండయా..Saturday, May 16, 2015

ఫిట్ మెంటు అడగని ఉద్యోగులు

కోటి కాంతుల వెలుగుతో జీవకోటికి
ప్రాణశక్తిన్ ప్రసాదంప దినకరుడేతెంచు
ప్రభాత వేళన్ రేయంత పనిచేసి అలసిన
చందురూడు రవినాహ్వానించి శెలపుగైకొనెన్..

2.నృష్టి ఆద్యంతము రేబవలు
అవిశ్రాంతగా పనిచేయు అన్నదమ్ములిద్దరీకి
జీతభత్యాలు, అలవెన్సులు లేవు..
ఫిట్ మెంటులు అసలే లేవు..
మనసార నమస్కరించి కృతఙ్ఞత
తెలుపుటె వారికిచ్చెడి భత్యమని
తెలుసుకొనుడి  ప్రాజ్ఞులారా...

Wednesday, May 13, 2015

నేటి (అవి) నీతి పద్యము

అద్దమందు అక్షరములు తారుమారగును
గాని నిజరూపమె మనకి గోచరమౌసు..
కలికాలమందు తీర్పులు తారుమారై
నిజరూపము మృగ్యమౌసు..
విశ్వ ఓలేటి మాట విసరండయ్యా ..

Sunday, May 10, 2015

ఇండియా చాలా గొప్పదే.. మేరా భారత్ మహాన్..

ఒక మంచి వస్తువ వుంది అనుకోండి.. దానిని వాడుకోవడం తెలియకో..దాని విలువ తెలియకో మనం విడిచిపెడితే.. దాని విలువ తెలిసిన మరొకడు ఆ వస్తువను నెత్తిమీద పెట్టుకుంటాడు..  
స్వాతంత్రం వచ్చిన కొలది కాలంలో ఈ దేశం నుండి ప్రతిభ గలవారు, శాస్త్ర,విజ్ఞాన రంగంలో ఆరితేరిన వారు విదేశాలకు వలస వెళ్ళిపోయారు.. ఎందుకని ఈ దేశంలో వారికి అవకాశములు లేక మాత్రమే కాదు.. 
సరి అయిన గుర్తింపు గౌరవం లేక.. 
విదేశీయులు వారిని నెత్తిన  పెట్టుకుని  అనతి కాలంలోనే అభివృద్ధి సాధించగా  ..
మన దేశం మరో వెయ్యేళ్ళు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంటుంది.. 
ఎందుకంటే ఈ దేశంలో కష్టపడి పనిచేసే వారికన్నా.. అడ్డదారులు తొక్కేవారికి, కాకాలు పట్టే వారికి..అవినీతి పనులు చెసేవారికి గౌరవము..సహకారము ఎక్కువ.. 
న్యాయవాదులు..కోర్టులు తప్పు చేసిన వారిని శిక్షించే బదులుగా.. ఆ తప్పు నుండి బయటకు పడేలా ఎన్ని సెక్షన్లు వాడాలో అన్ని సెక్షన్లు వాడుకుంటారు.. 
"ఒక నేరస్తుడికి శిక్ష పడకపోయినా పర్వాలేదు..కాని ఒక అమాయకుడికి మాత్రం శిక్ష పడకూడదు" అని  సిద్ధాంతం.. అందువలన డబ్బున్న, పలుకుబడి,పరపతీ వున్న మహానుభావులకి ఈ దేశంలో శిక్షలు ఉండవు..."మై లార్డ్ ఎంతో అమాయకుడైన నా క్లయింటుని విడిచిపెట్టండీ" అంటూ ఎంతో నేర్పుగా నిజాన్ని అబద్ధంగా..అబద్ధాన్ని నిజంగా చెప్పగల  ఘనాపాటిలు వున్నారు....
ఆనాటి సమాజంలో రక్షణ, స్వతంత్రం లేని వర్గాలకి చట్టంలో కొన్ని హక్కులు, చట్టాలు రూపొందిచబడ్డాయి.. అంతేకాని తప్పు చేసి తప్పించుకోవడానికి ఈ హక్కులను గాని, చట్టాలని కాని వాడుకోవడానికి కాదు.. రాజ్యాంగ పరమైన హక్కులను దుర్వినియోగం చెస్తూ వారికి పడని వారిని ఏదో రకంగా ఇరికించి శిక్షలు వేయడానికి కాదు..
అయినప్పటికీ ఇండియా చాలా గొప్పదే.. మేరా భారత్ మహాన్..


ఎందుకంటే.. ఇన్ని కబుర్లు చెప్తున్న మనం పొరపాటునో..తొందర్లోనో బండిమీద వెళ్తూ హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయామే అనుకోండి..పోలీసు వాడు ఆపుతాడు...ఫైన్ కట్టండి అంటాడు...మీ సీ బుక్కు, లైసెన్సు అవీ ఏవీ అంటాడు.. 

నేను ఫలానా నాయకుడి తాలూకా అనో ఫలానా అఫీసులో పనిచెస్తున్నాను అనో... ఫలనా మంత్రి గారి బావమరిది అనో చెప్పి తప్పించుకోవచ్చు.. లేదా ఫలానా యూనియన్ కి నాయకుడ్ని.నన్ను టచ్ చేస్తే గొడవలు అయిపోతాయ్ జాగ్రత్త అని హెచ్చరిస్తే బెదిరిపోయి వదిలేవచ్చు.. 
కాని ఫారిన్ కంట్రీ లో అయితే మన గోడు ఎవడూ వినిపించుకోడు..మూర్చ బిళ్ళల లాగ నీ కార్డులు వేళాడుతూ వుండాలి..
లేకపోతే ముందు కొట్లో పడేస్తాడు ..అనుమానం వస్తే కాల్చి పారేస్తాడు..
ప్రెసిడెంట్ అయినా రూల్స్ పాటించవలసిందే... 


2. నియమ నిబంధనలను.. చట్టాలను తలకింద పెట్టుకుని
హాయిగా నిద్రపోవచ్చు  ...నీ చేతిలో డబ్బుంటే... 
అది ఎలా సంపాదించావో అనవసరం..

   

Monday, May 4, 2015

అప్పలమ్మ-అమెరికా యాత్ర -05

ఒకనాడు ఆఫీసు కి సెలవు దినము..పిల్లలను తీసుకుని రామశాస్త్రి భార్య  పుట్టింటికి వెళ్ళింది సెలవులు కావటంతో..
ఇంట్లో ఎవరూ లేరు..సెలవు దినము కదా క్షుర కర్మ చేయించుకుందామని బయలుదేరాడు.. షాపులో కూర్చున్నాడు.. ముందరి వారిది ఇంకా పూర్తి కాకపోవడంతో... పక్క సీటులో కూర్చుని వున్నాడు... ఆ ఎదురుగుండా వున్న రామాలయంలో కోలాహలంగా వుంది.. మైకులో నుండి పాటలు వినిపిస్తున్నాయి.."కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి.." లవకుశ సినిమాలోని పాట
లు కడు రమ్యంగా వినిపిస్తున్నాయి.. 
ఆ రోజు శ్రీరామ నవమి.. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం..
ఆ తోవన తలంట్లు పోసుకుని.. మంచి మంచి బట్టలు వేసుకుని పిల్లా పాపలతో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతో ఉత్సాహంతో గుడికి వెళ్తున్నారు.. రాముని కళ్యాణం కనులారా చూడటానికి వెళ్తున్నారు... 
"మరి నేను??" ప్రశ్నించుకున్నాడు తనలో తను.. 
గుండె ఝల్లుమంది..  
ఒక్కసారిగా పాత రోజులు గుర్తుకువచ్చాయి.. చిన్నప్పుడు వాళ్ళ వూరిలో రామ కోవిలలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలు గుర్తుకు వచ్చాయి.. 
కనీసం ఐదు రోజుల పాటు జరిగే కల్యాణోత్సవాలు గుర్తుకువచ్చాయి.. సశాస్త్రీయంగా తాతగారి మంత్రోచ్ఛారణలు.. 
నాన్న గారి ఆధ్యాత్మిక ప్రసంగాలు..
హరిదాసుల పురాణ గాధలు.. పానకం కోసం పిల్లల కొట్లాటలు..
మంచి మంచి పట్టు పరికీణల తోటి...పువ్వుల జడలతోటి..ఆడపిల్ల ముస్తాబులు.. అమ్మలక్కల ఆ పాటలు..గిర గిరా బుర్రలో తిరిగాయి.. పండిత పరమేశ్వర శాస్త్రి మనవడినేమిటి.. ఉభయ భాషా ప్రావీణ్యుడైన విశ్వనాధ శాస్త్రి కొడుకునైయ్యుండి.. ఈ పవిత్ర శ్రీరామ నవమి రోజున క్షురకర్మకు రావడం ఏవిటీ?? 
ఒక్కసారిగ కళ్ళు తిరిగినంత పని అయ్యింది... సిగ్గుతో..లజ్జతో..మనసు కుచించుకు పోయింది.. తాతగారి రూపం కళ్ళల్లో మెదులుతోంది..అటువంటి వంశాన జన్మించిన నేను ఈ రోజున ఇలా అపవిత్రంగా..చెయ్యకూడది కార్యానికి రావడమా?? కర్తవ్యం గుర్తుకు వచ్చింది.. 
గబ గబా ఇంటివైపుకు అడుగులు వేసాడు...దారిలో పరిసరాలను గాని..మనుషులను గాని గమనించే స్థితిలో లేడు.. 
ఇంటికి వెళ్ళగానే  వంటిమీదున్న బట్టలు విసిరిపారేసి.. టవల్ కట్టుకుని బాత్రూం లోకి దూరి ఎన్ని చెంబుల నీళ్ళు తలమీద గుమ్మరించుకున్నాడో తెలీదు.. బుర్ర శాంత పడే వరకు స్నానం చేస్తూనే వున్నాడు...
పొడిబట్ట కట్టాడు.. ఏదో ఒకటి చెయ్యాలి.. 
మా ఇలవేలుపు రాముడికి.,సీతమ్మకు పవిత్రంగా ఏదో ఒకటి నేవైద్యం పెట్టాలి ఈ రోజున.. 
కాని కాస్త అన్నం, పప్పు ఉడకేసుకోడం తప్ప ఏ పిండి వంటకమూ చెయ్యడం రాదే.. ఎలా.. వెంటనే ఒక ఉపాయం తోచింది.. 
రాముడి కల్యాణం రోజున పులిహోర నైవేద్యం పెట్టి అందరికీ పంచేవారు.. పులిహార ఎలా చెయ్యాలో పూర్తిగా రాదుగాని..తనకు తోచిన రీతిలో కాస్త బియ్యం ఉడకేసాడు..అందులో కాస్త చింతపందు రసం వేసాడు.. ఉప్పు కలిపాడు.. తర్వాత పోపు వేసి కలిపేసాడు.. గ్లాసుతో నీళ్ళు తీసుకున్నాడు.. రామ కోవిల దిశగా నైవేద్యం పెట్టాడు.. 
పవిత్ర హృదయంతో పెట్టాడు.. ఇన్నాళ్ళు ఏ పూజలూ చెయ్యనందుకు క్షమించమని వేడుకునాడు... 
ఆర్తితో..గుండెనిండా గాలి పీల్చుకుని ఒక్కసారిగా సాష్టాంగ ప్రమాణం చేసాడు... అప్పటికి గాని మనసు శాంతించలే దు... ఒక విధమైన అలౌకిక ఆనందంలో ములిగి తేలాడు..
భక్తి పారవశ్యంలో కళ్ళుమూసుకున్నాడు..రాముడు నవ్వుతూ కనిపించాడు.. లేచి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని  తినడం మొదలుపెట్టాడు.. పొద్దుట్నుంచి కాఫీ లేదు, ఫలహారం లేదు....ఆకలి మీద వున్నాడేమో.. 
తను చేసిన ప్రసాదం ఎంతో కమ్మగా అనిపించింది..   
తల్లి, భార్య చేసినంత   రుచిగా లేదని తెలుసు...  
పులుపు కాస్త ఎక్కువయ్యిందో..కాస్త ఉప్పు   తక్కువ అయ్యిందో తెలీదుగాని .... కాని..తన చేత్తో వండి పెట్టిన ప్రసాదం.. 
ఎన్నో ఏళ్ళ తర్వాత పరమ పవిత్రంగా ముందుగా సీతారాములకు నివేదించి   తరువాత తాను తిన్న ప్రసాదం..
ఆహా ఏమి ఆనందం.. ఎన్ని లక్షలు..కోట్లు ఖర్చుపెట్టినా దొరకని ఆనందం.. ఆనందంతో అలాగే నేలపై పరుండిపోయాడు..
అలా పడుకున్నవాడు.. సాయంత్రం ఐదుకి లేచాడు... 

మరల శుభ్రంగా స్నానమాచరించాడు.. బట్టలు వేసుకుని తిన్నగా రామకోవిలకు వెళ్ళాడు.. ఇక్కడ కూడా ఏవో సంగీత కార్యక్రమాలు.. వినోద కార్యక్రమాలు పెట్టరు ..అలా వాటిని ఆశ్వాదిస్తూనే..రాముల వారి దర్శనం చేసుకున్నాడు.. 
ఆ రోజు నుండి...అతని జీవన విధానమే మారిపోయింది.. 
ఉదయ,సాయం సంధ్యవేళలో సంధ్యావందనం ఆచరిస్తున్నాడు... అలమరాలో మూల పడివున్న ఆధ్యాత్మిక పుస్తకాలను తీసి దుమ్ముదులిపాడు..రోజూ ఆ పవిత్ర గ్రంధాలను చదువుతున్నాడు... 
భర్తలో వచ్చిన ఈ మార్పుకు రామశాస్త్రి భార్య ఆశ్చర్య పోయింది..
అంతా ఆ సీతారాముల చలవ అని చేతులు పైకెత్తి నమస్కరించింది...
అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు.. ఇలా హటాత్తుగా అతనిలో పరివర్తన వచ్చిందా.. ఇదేమీ ఒక్కసారిగా రాలేదు.. ఈ సంఘటనకు ముందు రెండు మూడు సంఘటనలు జరిగాయి.. అవన్నీ కలిపి.. ఈ రోజు ఇలా అతనిలోని మార్పుకి కారణం.. ఆ వివరాల్లోకి తరువాయి భాగంలో చూద్దాం..

Sunday, May 3, 2015

అప్పలమ్మ-అమెరికా యాత్ర - 04

అసలు అప్పలమ్మ కథకు.. విశ్వనాధ శాస్త్రి కథకు లింక్ ఏవిటన్నది..అనుమానం రావచ్చు... 
ప్రస్తుతం అప్పలమ్మ కి ఏ పిల్లల చదువుమీద మంచి సలహా గాని..ఏదైనా సందేహం కాని వస్తే.. తిన్నగా రామశాస్త్రి గారి దగ్గరకు వెళ్తుంది..పరమేశ్వర శాస్త్రికి మనవడు...విశ్వనాధ శాస్త్రికి కొడుకు అయిన రామశాస్త్రి పట్నంలో ఒక ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసేవాడు.. ...
కాలం మారింది..కాలంతో బాటు మనుష్యుల జీవన విధానం మారింది.. మనిషి శీలానికి,  మంచితనానికి, ప్రతిభకు విలువ లేకుండా కేవలం డబ్బు కి మాత్రమె విలువున్న రోజులు.. ఇది అందరికీ తెలిసిందే..
ఒకప్పుడు డబ్బు అవసరం లేకుండా అన్నీ సమకూరే స్థితినుండి..ప్రతీ వస్తువూ కేవలం  డబ్బుతోనే ముడిపడి వుంది.. 
రామశాస్త్రి తండ్రి కాలానికి వేదాద్యయనం చెసిన వారికి, కళలకు,కళాకారులకు, సాంప్రదాయ విద్యలను ప్రదర్శించే వారికి విలువ లేకుండా పోయింది..కుల వృత్తులు మటుమాయం అవుతున్నాయి.. ఎవరు ఏ వృత్తి చేస్తున్నారో అందులో వాళ్ళకి ప్రతిభ, అనుభవం వుందో లేదో పరీక్షించే వాళ్ళే లేరు..భూదాన వుద్యమంలో భూములు కూడా ప్రభుత్వ పరం అయిపోయాయి.. ఇంటిల్లపాదీ పస్తు పడుక్కోకూడదు అంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చెరాలి.. అభిమానవంతుడైన విశ్వనాధ శాస్త్రి "టాట్ ఒకడి కింద నేను పనిచేయాలా" అని వచ్చిన వుద్యోగ అవకాశాలను వదిలేశాడు...
విశ్వనాధ శాస్త్రి తక్కువ వాడు కాదు.. తండ్రి పరమేశ్వర శాస్త్రిగారి వద్ద సంస్కృత ఆంధ్ర భాషలయందు ప్రావీణ్యం పొందాడు...ఉభయభాషా ప్రవీణుడు.. అంతవరకూ గురు పరంపరగా వస్తున్న చందస్సు ,. వ్యాకరణ విషయాలే కాకుండా... భారత, భాగవత రామాయణ శ్లోకాలను సరళ తరంగా తెలుగులో అర్ధం అయ్యేటట్టు పుస్తకాలను రాసినవాడు.. అక్కడక్కడా సంస్కృత శ్లోకాలను ...వాటి అర్ధాలను వివరిస్తూ అనేక గ్రంధాలు రాసాడు... అనేక చోట్ల పురస్కారాలను....ఘనసన్మాలను పొందిన వాడు.. కానీ కవులను, కళాకారులను. ప్రోత్సహించే వాడు వుంటేనే వీళ్ళు మనగలిగేది..
రామశాస్త్రి యువకుడిగా వున్నప్పుడే సమాజంలో మార్పుల వలన గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి....రాబడి లేకపోగా ఆడపిల్లల పెళ్ళిళ్ళకు..పురుళ్ళకు..పుణ్యాలకు..బాలసారెలకు...వెనకటి వలనే సంతర్పణలకు ..ఆడంబరాలకు.. గొప్పకు పోయి ఖర్చు పెట్టడం వలన వున్న కాస్త ఆస్థి హారతి కర్పూరం లాగ ఖర్చు అయిపోయింది.. 
దాంతో రామశాస్త్రి చదువు ఎస్.ఎస్.ఎల్సీ తో నే ఆగిపోయింది..ఇంజనీరింగ్ అయ్యే తెలివితేటలు..ప్రతిభ..పట్టుదల వున్నా పరిస్థుతుల ప్రభావం వలన అంతకంటే పై చదువుకి వెళ్ళలేక పోయాడు.. అందువలన రామశాస్త్రికి తండ్రి అన్నా.. తాత అన్నా... వేదాలన్నా.. మడి..అచారాలన్నా.. పురాణాలన్నా తిరస్కార భావంతో వుండేవాడు... 
 
దానికి తోడు.. అప్పటికే ఆధునిక సాహిత్యం అనే పేరుతో విశ్వనాధ శాస్త్రి రాసిన పుస్తకాలమీద విమర్శిస్తూ అనేక మంది వక్ర భాష్యాలు ప్రచురించే వారు.. పురాణ పురుషులను..ఆచార వ్యవహారలను అవహేళన చేస్తూ.. కొంతమంది రచనలు చెయ్యడము..దానికి అప్పటి పాలకుల  సహకారం ఉండడం వలనను..శాస్త్రీయ సంప్రదాయాలు మరుగున పడి ఆధునిక భావాలు  కల్గిన యువకులు బయలు దేరారు.. అనేక కథలు..కవిత్వాలు రాసారు.. వాటి ప్రభావం రామశాస్త్రి మీద పడింది..
పట్నంలో వుద్యోగం సంపాదించుకుని పల్లెటుళ్ళో తలితండ్రులను..తోబుట్టువులను గాలికి వదిలేసి.. నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని పట్నంలో కాపురం పెట్టాడు..
ఆఫీసు పదిగంటలకి అయితే తొమ్మిదికి నిద్రలేస్తాడు.. సంధ్యావందనం మాట దేవుడెరుగు..ఒక పూజా పునస్కారం లేదు...ఆధునిక వేషభాషలు..స్నేహితులతో విందులు వినోదాలు.. .మిగిలిన వారి కంటే పురాణ కథల మీద పట్టు వున్నవాడు కాబట్టి.. చుట్టూ వున్నవారికి పురాణాలలో విషయాలను తన మిడిమిడి జ్ఞానంతో విమర్శించే వాడు.. ఫలానా శాస్త్రి గారి అబ్బాయి.. అతడు ఏం చెప్పినా నిజమేనని చుట్టు వున్నవారు చప్పట్లు కొట్టేవారు.. అప్పుడప్పుడు పత్రికలలో కథలు రాసేవాడు  ..వాటికి అవార్డులు కూడా వచ్చెవి... 
ఇండియాని విమర్శిస్తూ..వేలెత్తి చూపిస్తూ "ఆస్కార్"  అవార్డు పొందిన సినిమాల లాగ మన ఆచారవ్యవహారాలను విమర్శిస్తూ రాసిన ఇతడికి ఒక్కోసారి బహుమతులు వచ్చేవి...
కథ ఇంతటితో ముగిస్తే గొడవే లేదు... అలాంటి రామశాస్త్రి వున్న వుద్యోగం వదిలి మరల స్వగ్రామానికి  రావడం ఎందుకు జరిగిందీ.. తన తాత తండ్రుల లాగే పదిమందికి శాస్త్ర విజ్ఞానంతో ఉపయోగపడటం ఏవిటీ.. 
ఈ కథకు  రామశాస్త్రికి కథకు లింకు ఏమిటి...
(తరువాయి భాగంలో) 

Saturday, May 2, 2015

అప్పలమ్మ-అమెరికా యాత్ర -03

అప్పలమ్మ తన కూతుర్లని క్రమశిక్షణలో పెంచింది..ఎలాగంటే.. ఆ ఊర్లో ఎవరైనా సరే తమ పిల్లలను "ఒరేయ్.. ఆ అప్పలమ్మ కూతుర్లని చూసి సిగ్గు తెచ్చుకోండిరా" అని తిట్టే స్థాయిలో పెంచింది..
మరి ఇంత మనో ధైర్యం.. నిజాయితీ..పట్టుదల అప్పలమ్మకి ఎక్కడ నుంచి వచ్చాయి అంటే తన తాత గారి దగ్గరనుండి...
అంటే అమ్మ తండ్రి అన్నమాట..
ఆయన పేరు  రంగారావు.. ఎస్.వీ రంగారావు లాగే పెద్ద పర్శనాలిటీ, పెద్ద పెద్ద మీసాలు అవీ వుండేవి...చిన్నపట్నుంచి అప్పలమ్మకి తాత అంటే భయము, భక్తి, చనువు వుండేవి... 

తాత మీసాలతో ఆడుకునేది.. తాత నవ్వుతూ పిల్లలందర్నీ కూచోబెట్టి భాగవత, రామాయణ పద్యాలు.. సుమతీ, వేమన శతకాల పద్యాలు చదివేవాడు... అలాగని తాత చదువుకున్నోడు కాదు.. 
మరి ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే తాతకి చిన్నప్పుడు ..ఆ ఊళ్ళో పంతులు గారి అబ్బాయి విశ్వనాధ శాస్త్రి తో గొప్ప స్నేహం ఉండేది.. పాటలు, పద్యాలు.. ఆ అబ్బాయి నేర్పితే... అతనికి ఈత కొట్టడం, సునాయాసంగా చెట్లెక్కడం తాత నెర్పేవాడు.. 

విశ్వనాధ శాస్త్రి  నాన్న గారు అయిన పరమేశ్వర శాస్త్రి గారు గొప్ప వేద పండితుడు...సకల శాస్త్రాలు తెలిసిన వాడు.. నిత్యం గాయత్రీ మంత్ర జపం చేస్తూ త్రిసంధ్యలలో విధిగా సంధ్యా వందనం చేసేవాడు.. 
రాముడు అరాధ్య దైవం..గురువుద్వారా మంత్రోపదేశం పొంది..ఆ దైవానుగ్రహంతో... జ్ఞానంతో..పరులకు సేవ చెసేవాడు.. 

పక్క ఊర్లనుండి ఎంతో మంది బ్రాహ్మణ పిల్లలు ఆయన దగ్గర వేదం నేర్చుకోవడానికి..ఇతర వైవాహిక..క్రతువుల..యజ్ఞయాగాదుల..కర్మలకు పనికి వచ్చే మంత్రోచ్చారణలను సశాస్త్రీయంగా ఎలా పలకాలో నేర్చుకునే వారు.. 
కాని ఎన్నడూ ఎవరిదగ్గరా ఏదీ పుచ్చుకొనే వాడు కాదు.. ఆ అవసరం లేదు.. నిత్యం వేద ఘోషతో మార్మోగే ఆ ఇంట నిత్యాగ్ని హోత్రం వెలుగుతునే వుండేది.. సరుకులు ఎక్కడనుంచి వస్తాయో తెలీదు... ఆ పూట ఎంతమంది భోజనానికి వస్తారో తెలీదు.. 
శాస్త్రి గారు ఎంతో మంది విద్యార్ధులకు విద్యా దానం చెస్తే  ఆ ఇంటి ఆడబడచులు ఎంతమందికో అన్న దానం చెసేవారు...పరమేశ్వర శాస్త్రి గారి పెద్దబ్బాయికి అప్పలమ్మ తాతకి గొప్ప స్నేహం ఏర్పడింది..ఉదయం వేదాధ్యయనం అయ్యాక శాస్త్రి గారు పిల్లలని ఆడుకోమని పంపించేవారు..తోటల్లోను..చెరువుల్లోను..పొలాల గట్లల్లోను..పిల్లలు ఆడుకునే వారు.. 

అలా ఓ రోజు  చెరువుగట్టు వెంబడి వున్న మామిడి తోటలో కాయలు కొయ్యబోయి పరమేశ్వర శాస్త్రి గారి అబ్బాయి విశ్వనాధ శాస్త్రి పడిపోయాడు.. అక్కడే మరో చెట్టుమీదున్న రంగారావు అది చూసి పక పకా నవ్వాడు.. మోచేతికి దెబ్బతగిలి అసలే బాధపడుతున్న శాస్త్రికి కోపం వచ్చింది..మళ్ళీ ఎగరబోయాడు.. ఇంతలో రంగారావు చెట్టు మీంచి దిగి.."అట్టా కాదు పంతులు గారు..ఇట్టా కొయ్యాలి" అని చాచిపెట్టి రాయి విసిరాడు.. అది గురితప్పకుండా మావిడి కాయ మొదలుకి తగిలి గిర గిరా కిందపడిపోయింది..
"ఈ పాలి మీరు విసరండి"..అని రాయి ఇచ్చాడు.. మొదట ఓ రెండు సార్లు విఫలం అయినా మూడో ప్రయత్నంలో శాస్త్రి సఫలం అయ్యాడు.. 


ఆ రోజునుండి ఇద్దరు దోస్తీ కట్టేరు.. ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని పొలాల గట్లంట తిరిగేవారు..

ఉదయం తండ్రి  చెప్పిన పద్యాలు, శ్లోకాలు సాయంత్రం అప్పచెప్పాలి.. అందుకని చెరువుగట్టు మీద జాం చేట్లమీద కూర్చిని వాటిని వల్లె వేసేవాడు.."పంతులూ పైక చదువు..కాస్త నేను వింటాను..అని పైకి చెప్పించుకునే వాడు.. అలా వేమన..సుమతీ శతకాలు..వాటి భావం..రామాయణ..భారత..భాగవత పద్యాలు బిగ్గరగా శాస్త్రి చెప్తూవుంటే అందులో కొన్ని రంగారావుకి కూడా కంటతా వచ్చెవి.. ఇద్దరూ కలసి రాగయుక్తంగా పాడేవారు...

రంగారావు చెర్లో ఈత కొడుతూ వుంటే శాస్త్రి ఒడ్డున కూర్చుని పద్యాలు చదివేవాడు.. ఒకరోజు "పంతులూ .. నువ్వు ఈత కొట్టవయ్యా.." అంటే..
"అమ్మో నాకు భయ్యం.." అన్నాడు శాస్త్రి..
ఒక్కపాటున వెనకగా వచ్చి శాస్త్రిని నీళ్ళలోకి తోసేసాడు రంగారావు.. అప్రయత్నంగా కాళ్ళు..చేతులూ ఆడించేడు శాస్త్రి.. రంగారావు పక్కనే వుండి.."అద్దీ..అలాగా..ఇంకా..ఇంకా.." అని ప్రోత్సహిస్తూ ఈత కొట్టడం ఎలాగో నేర్పించేసాడు..
రంగారావు తో స్నేహం వలన శాస్త్రి..శాస్త్రితో స్నేహం వలన రంగారావు..తమకు రాని విద్యలను నేర్చుకుని హుషారుగా బాల్యం గడిపేరు..
ఇద్దరిదీ ఒకే మాట..ఒకే బాట...

అప్పలమ్మ-అమెరికా ప్రయాణం -2

పేరుని బట్టి "అప్పలమ్మ" అంటే అమాయకురాలైన పల్లెటూరి మడిసి అని భ్రమపడకండి.. 
ఐదవ తరగతిలోనే చదువు ఆపించేసి పదమూడే ఏటనే పెళ్ళి చేసేరు..కాబట్టి ఇలా ఇద్దరు పిల్లలతో చేతగాని దానిలా నిలబడింది గాని.. అమోఘమైన తెలివితేటలు గలది.. అవకాశం ఇస్తే అమెరికా ప్రెసిడెంటు చెయ్యగల సామర్ధ్యం వున్నది... 
అందుకే ఇప్పటి పిలగాళ్ళలాగ కాక  "కేలిక్కులేటర్" లేకుండానే కూడికలు- తీసివేతలు చేసీగల్దు.. ఏ వస్తువుని ఎంత రేటు పెట్టి కొనచ్చో కరెక్టుగా అంచనా వేసి చెప్పగలదు.. 

అంతే కాదు చాలా నిజాయితీ మనిషి.. ఎన్నడూ అబద్దమన్నది ఆడి ఎరగదు...అన్నిటిలోనూ నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా వుంటుంది.. 
ఒక మనిషి గురించి ఏదైనా వుంటే ముఖం మీదే అడుగుతుంది గాని వారి వెనకాల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడదు.. 

ఇన్ని సుగుణాలు వుండబట్టే భర్త తాగుబోతు అయినా.. రోడ్డున పడి అల్లరి చెయ్యలేదు..ఇప్పటి కాలం ఆడపిల్లల లాగ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విస్తరాకులు పారేసినంత తేలిగ్గా విడాకులు ఇస్తున్న ఆధునిక మహిళకాదు అప్పలమ్మ..   
మంచిగానే మొగుణ్ణి మార్చింది..పెద్ద కూతురు పుట్టగానే.. ఇకనుంచి సంసారం పెరిగిందని.. మునిపట్లా డబ్బు తగలేస్తే పిల్లని పెంచడం కష్టమని..నెలకు అంతే ఇంతో పొదుపు చేస్తేనే గాని పిల్లకు చదువు గట్రా చెప్పించి..పెళ్ళి పేరంటం చెయ్యగలం అని హితబోధ చేసింది.. 


తన కంటే తన పెళ్ళాం చాలా తెలివైందని.. పైపెచ్చు మంచి నడవడి కలది అని అప్పారావు గ్రహించేడు..

క్రమేపీ అప్పారావులో మార్పు వచ్చింది..నెల నెలా జీతం తీసుకొచ్చి అప్పలమ్మ చేతిలో పోసేవాడు.. జేబులో ఓ రెండో మూడో రూపాయలు పెట్టుకునే వాడు...  తాగుడు అలవాటు అయ్యాక షిఫ్ట్ డ్యూటీలు చెయ్యడం మానీసేడు.. కాని మళ్ళా షిఫ్ట్ డ్యూటీలు వేయించుకుని ఓ.టీలు, హాలీడే ఎలవన్సులు.. నైట్ ఎలవెన్సులు సంపాదిస్తున్నాడు.. 
తాగినప్పుడు అస్తమాను పై అధికార్ల మీద తిరగబడే అప్పారావు.. ఇప్పుడు అందరికీ తలలో నాలుకలా అయిపోయాడు... ఎక్కడ ఏ టైములో డి-రైలింగు అయినా అప్పారావుకి కబురు వస్తుంది.. వెంటనే వాలిపోయి గ్యాంగుని ఉత్సాహ పరుస్తూ అనుకున్న టైముకన్నా ముందే రైలుని పట్టాలమీదకి ఎక్కించేవాడు..
రైల్వే అధికారుల ప్రశంసలతో బాటు.. అలవెన్సులు..పారితోషకాలు.. ఉత్తమ కార్మికుడి అవార్డు..
ఒకప్పుడు "చీ.. తాగుబోతు నాయాలా" అని తిట్టిన వాళ్ళే "అప్పారావు గారూ".. అని సంభోదిస్తూ వుంటే... ఈ జన్మకి ఇంత కంటే ఏం కావాలి... ఇదంతా అప్పలమ్మ చలవే..
ఈ ఉపోద్గాతం అంతా ఎందుకంటే.. ఇలా నాలుగు రాళ్ళు వెనకేసుకున్నప్పుడే. అప్పలమ్మ ఓ మంచి పని చేసింది.. వాళ్ళ ఊరిలో..ఓ ప్రభుత్వ రంగ సంస్థ  కార్మికులు అసంపూర్తిగా కట్టి వదిలేసిన ఓ ఇల్లు కొన్నది..
ఇక్కడ ఈ ఇళ్ళ గురించి కాస్త వివరించాలి..
ప్రభుత్వ రంగ సంస్థ లలో  ఇళ్ళు కట్టుకోమని కార్మికులకు 'హౌసింగు లోను' ఇస్తారు.. అదీ కూడా అంచెలంచెలుగా ఇస్తారు.. జాగా కొన్నపుడు కొంత.. పునాదులు..గోడలు లేపినప్పుడు కొంత.. స్లాబు వేసినప్పుడు కొంత.. అంతా పూర్తి అయ్యాక మిగిలిన లోను సాంక్షన్ చేస్తారు.. 
ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు.. అయితే కొంతమంది కార్మికులు ఇళ్ళనిర్మాణం పూర్తికాకుండానే లోను డబ్బు మొత్తం తీసుకుంటారు. దీనికి బ్రోకర్లు వుంటారు.. వాళ్ళు నగరానికి 20 కి.మీ దూరంగా కొన్ని లే అవుట్లు వేస్తారు.. వాటిని ఈ కార్మికులకు అమ్ముతారు.. రిజిష్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే.. లోనుకి అప్లయి చేయిస్తారు.. 
మొదటి విడత ఇన్స్పెక్షన్ పూర్తి అయిన వెంటనే కొంత డబ్బు లోను శాంక్షన్ అవుతుంది.. ఆ డబ్బు బ్రోకర్ల చెతిలోకి వెళ్ళిపోతుంది   ..
రెండు గదులు ప్లస్ వంటింటితో స్లాబు వరకు వేసి ఆపేస్తారు.. అప్పుడు మరల అధికార్లు తనిఖీకి వచ్చి ఇల్లు పూర్తిగా నిర్మాణం అయినట్టు సర్టిఫై చేసేస్తారు.. దాంతో పూర్తి లోన్ శాంక్షన్ అయిపోతుంది.. అందులో ముప్పావలా వాటా బ్రోకర్లకి, అధికార్లకి పోను  పావలా వంతు మాత్రమే కార్మికుడికి వెళుతుంది   .. అది చాలు ఆ తాగుబోతుకి..ఓ నెలో రెన్నెళ్ళొ తాగీడానికి.. కాని తీసుకున్న లోనుకి అసలు ప్లస్ వడ్డీ సర్వీసు లో వున్నంత కాలము కట్టాలి... మరందుచేత కొన్నాళ్ళకి .. అంటే రిటైర్ అయ్యేముందర ఈ ఇళ్ళను అమ్మేస్తారు.. ముందుగా ప్రోనోటు రాయించుకొని.. తర్వాత పూర్తిగా బదలాయిస్తారు.. ఇలాంటి ఇండ్లు ఎవరూ కొనడానికి ముందుకు రారు కాబట్టి చవగ్గా దొరుకుతాయి... 
అయితే ఆ పక్కనే అప్పలమ్మ వాళ్ళ వూరు వుండటంతో తమ్ముడు కబురెట్టేడు.."ఫలానా ఇండ్లు అమ్మకానికి వున్నాయని..నేనొకటి కొనుక్కుంటున్నాను.. కావాలంటే నువ్వూ ఒకటి కొనుక్కో" అని... 
అప్పటికే  2 సంవత్సరాల నుండి  భర్త పి.ఎఫ్ ఖాతాలో డబ్బు పెరిగింది కాబట్టి.. ఆ డబ్బుతోను.. పెళ్ళప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టిన కాస్త బంగారాన్ని అమ్మి..ఇంకా చాలక పోతే భర్త చేత రైల్వే సొసైటీలో అప్పు చేయించింది..
ఈ ఉపోద్గాతం అంతా ఎందుకంటే అప్పుడు చవగ్గా కొన్న ఇల్లే ఇప్పుడు భర్త పోయేక ఆసరాగా నిలిచింది... పక్కనే తోడబుట్టిన వాడు వున్నాడు.. ఇంకో అన్నయ్య టౌన్ లో వుండి.. అప్పుడప్పుడు వస్తూ యోగ క్షేమాలు చూస్తున్నాడు.. స్వతహాగా ధైర్యవంతురాలు.. అభిమాన వంతురాలు అయిన ఆడదానికి ఇంతకన్నా ఏమి కావాలి.. అందుకే తన వద్ద గంపెడు ఆస్థి లేకపోయినా... కేవలం పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండేలా అడుగు వేసింది..

Friday, May 1, 2015

అప్పలమ్మ - అమెరికా ప్రయాణం..

అప్పలమ్మ "అమేరికా" వెళ్తోంది.. 
"ఏవిటీ..ఐదో క్లాసు కూడా పాసవని అప్పలమ్మ అమేరికా వెళ్ళడం ఏవిటని??"..మూతి మూడు వంకర్లు తిప్పుకున్నారు గిట్టని వాళ్ళు.. 

అప్పలమ్మకి పదమూడో ఏటనే అప్పరావుకిచ్చి పెళ్ళిచేసేరు.. అప్పట్లో రైల్వై లో సూపర్ వైజర్ గా చేసేడు..మూడెంకల జీతం పైగా ప్రభుత్వ ఉజ్జోగం అవడంతో అప్పారావుకి ఇచ్చి చేసేరు.. 
పిల్లని, పిల్లాడ్ని కాక వెనక బాక్ గ్రౌండ్ (వంశ పేరు ప్రతిష్ట) ని చూసి చేసే రోజులు కాబట్టి అప్పారావుని ఒక్కసారి కూడా చూడకుండానే తాళి కట్టించు కుంది అప్పల్లమ్మ. 
కాని అదే కొంప ముంచింది.. రైల్వై లో గాంగు మేన్ గా దూరి..సూపర్ వైజర్ గా ఎదిగిన అప్పారావుకి లేని అలవాటు లేదు.. సకల కళా పారంగతుడు.. వానొస్తే విస్కీ.. వానరాకపోతే బ్రాందీ తాగుతాడు.. 24 గంటలు తిండి లేకుండా పేకాట  ఆడగల సామర్ధ్యం వున్న వాడు.. 
ఇవన్నీ పెళ్ళయిన చాలాకాలానికి గాని తెలియలేదు..కాని అప్పటికే ఆలస్యం అయంది ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయి కూచుంది.. 
పెళ్ళవగానే మొగుడి ఉద్యోగరీత్యా అప్పలమ్మ ఊరికి 500 కి.మీ దూరాన వున్న కాకులు దూరని కారవడివిలో పోస్టింగు..ఇక్కడి విషయాలు రాస్తే అమ్మానాన్న బాధపడతారని తను ఎన్ని బాధలైనా భరించింది కాని .. ఏనాడు కన్నవాళ్ళకి మొగుడి లీలలు చెప్పేది కాదు.. 
అయినా అప్పారావు పెళ్ళాన్ని బాగానే చూసుకుంటాడు.. రాత్రి గడబిడ చేసినా తెల్లారేక.."బంగారం.. రాత్రి నిన్నేవన్నా ఇబ్బంది పెట్టానా.. సారీ బంగారం అని" కాళ్ళు వొత్తి..బుగ్గలు నిమిరేవాడు.. తాగుబోతువాడైనా ప్రేమకా చూసుకుంటున్నాడు..
 
ఆ ఇంజనీరు గాడైతే..ఏ చెడ్డ అలవాట్లు లేవు గాని..ఎప్పుడూ ధుమధుమ లాడుతూ వుంటాడు.. చారులో ఉప్పు ఎక్కువ అయిందని.. కాఫీ వేడిగా ఇచ్చి చావలేదని పెళ్ళం మీద ఎప్పుడూ ఎగురుతూ వుంటాడు.. తాగుబోతువాడైనా "మా ఆయన బంగారం"  అంటూ సర్దుకుని పోయేది అప్పలమ్మ..
మరి ఇలాంటి బాక్ గ్రౌండ్ ఉన్న అప్పలమ్మ అమెరికా ఎలా వెళ్ళింది అని మీకు సందేహం.. కదా  ...
ఇదంతా ఫ్లాష్ బాక్.. అంటే గత చరిత్ర అన్నమాట.. ఇక ప్రస్తుత   పరిస్థికి వస్తే అప్పలమ్మ ఇద్దరు కూతుర్లు ఎదిగారు.. ఎదగడం అంటే అలాగ ఇలాగనా..మంచి ఏపుగా ఎదిగారు.. ఎక్కడా.. ఇరవ్వై ఏళ్ళబట్టి పుట్టింట్లో..అదేమిటి మరి అప్పారావో.. ఇంకెక్కడ అప్పారావు..రెండో పిల్ల పుట్టిన ఏడాదికే బకెట్టు తన్నీసేడు.. అతని అలవాట్లే అతని ప్రాణాలు తీసాయి.. 

అయినా అధైర్య పడలేదు అప్పలమ్మ.. రైల్వై వాళ్ళు ఇచ్చిన డబ్బుని..నెలా నెలా వచ్చే పెన్షన్ డబ్బుని  పొదుపుగా వాడుతూ..అన్నదమ్ముల సాయంతో డిగ్రీ వరకూ చదివించింది కూతుర్లని.. పిల్లలని క్రమశిక్షణ తో పెంచింది.. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసింది.. తన జీవితం లాగ కాకుండా కూతుర్లకి ఏ అలవాటు లేని మొగుళ్ళకి ఇచ్చి కట్టబెట్టాలని నిర్ణయించుకుంది.. ఆస్థులు.. అంతస్థులు  కాకుండా అబ్బాయి గుణగణాలు చూసి పెళ్ళి చెయ్యాలని అనుకుంది.. 
కాని కాలం మారింది..పూర్వంలాగ పెద్దలు..బంధువులు..చుట్టరికాలు లేవు..అంతా కంప్యూటర్ యుగం.. పిల్లలు చెబితే "షాదీ డాట్ కాం..టెలుగూ మారేజ్ బ్యూరో" లాంటి అన్నిరకాల వెబ్.సైట్లలో డబ్బు కట్టింది..
పిలగాళ్ళ ఫుటొలు..వాడికున్న క్వాలిఫికేషన్లు.. "ఎగ్గుటేరియన్" .. అంటూ వాళ్ళకున్న అలవాట్లు అన్నీ వివరంగా వున్నాయి..
పెతీ వోడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే..అమెరికా..అట్లాంటా...ఆఫ్రికాల్లో వుంటున్న వాళ్ళే... కానీ ఏ అలవాటు ఎవడికుందో తెలియదు...
కాని అందరిలాగ ఆలోచిస్తే ఆమె అప్పలమ్మ ఎలా అవుతుంది.. పిలగాడి ముఖం చూసి..వాడు తాగుబోతోడో కాదో ఇట్టే చెప్పీసేది.. అనుభవం.. మరి.. కళ్ళకింద నున్న జీరలు చూసి కనిపెట్టేసేది... అలా ఫిల్టర్ చెయ్యగా చెయ్యగా..ఒక మంచి పిలగాడితో పెద్దపిల్లకి పెళ్ళి చేసేసింది..అంత డబ్బు తగలేసి చూసిన కంప్యూటర్ బ్యూరో పిలగాడు కాదు.. 
ఎరిగున్నవాళ్ళే.. అబ్బాయి పక్కనే పట్నంలో ఉజ్జోగం చేస్తాడు.. అదేదో ప్రయివేటు కంపెనీలో..ఇరవై వేల దాక వస్తాయి..ఏ అలవాటు లేదు..కూతుర్ని పువ్వుల్లో కాకపోయినా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు.. పక్కనే పదిహేను కిలో మీటర్ల దూరం కాబట్టి..ఇక్కడ మీట నొక్కితే అక్కడ(కూతిరింట్లో) పడిపోతుంది..అక్కడ మీట నొక్కితే ఇక్కడ వాలిపోతుంది.. పండంటి ఆడపిల్లను కనింది కూతురు..పురుళ్ళు పుణ్యాలు ..బాలసారలు అన్నీ దగ్గరుండి చేసింది..వున్నంతలో ఘనంగా..
మరి అప్పలమ్మ అమెరికా ఎలా వెళ్ళింది..
(రెండో అమ్మాయి అమెరికా లో వుంది కాబట్టి..)
వచ్చే భాగంలో..