Tuesday, July 14, 2015

పుష్కరాలపై నా టపాలో రాసినట్టే అయ్యింది..


ఈ దిగువన నేను పుష్కరాల కి ముందు రాసిన టపా చదవండి... ఇందులో నేను రాసినట్టే జరగడం యాదృచ్చకమే అయినా.. 
జరగబోయే పరిణామాలను ఊహించి రాయడం.. ఇది అనుభవ సారం..http://shankaratnam.blogspot.in/2015/07/blog-post.html

నా టపాపైన ఎటువంటి వ్యాఖ్యలు, కామెంట్లు లేకపోయినా చదివిన వారు కొద్దిమందే అయినా..వాటిని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను..
ఆ టపాలోని వాఖ్యలే ఇప్పుడు టీ.వీల్లో చెప్తున్నారు.. 

పుష్కర సంవత్సర కాలంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా స్నానం చెయ్యవచ్చునని..

నిన్నటి వరకు మా ఆఫీసులో "పుష్కరాలకు వెళ్దామా..."  అని మాట్లాడిన వాళ్ళే... 

ఇప్పుడు.. పుష్కరాల గురించి ... వాటిలో స్నానం చేసే  వాళ్ళ గురించి అవహేళణగా మాట్లాడుతున్నారు...
పాపాలు
చేసిన వాళ్ళే ముందుగా  ములిగిపోదాం అని మొదటి రోజే పరుగెట్టికెళ్ళారని వెకిలిగా కామెట్లు చేస్తున్నారు...
రోజూ టి.వీ చానళ్ళలో హోరెత్తిస్తున్నారని.. చాగంటి గారైతే ఒక్కసారి ములిగితే కోటి ఆవులు దానం చేసిన ఫలితం వస్తుందని చెప్పారని ఇవన్నీ విని వెళ్ళి బలైపోయారని... ఇలా వాగుతున్నాడు ఒకడు..
ఒక పెద్దాయన అంటాడు "పాపాలు చెయ్యడం ఎందుకు..గంగలో, గోదాట్లో ములగడం ఎందుకు???... 


వీళ్ళ నోళ్ళు మూయించడం కన్నా మనమే నోరు మూసుకు కూచోడం ఉత్తమం అని ఊరుకున్నాను.. మెజార్టీ ఆఫ్ పీపుల్ అటే ఉన్నారు...
కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్టు ఇప్పుడు టి.వీ చానళ్ళలో ఒకటే గోల.. శవ రాజకీయాలు
చేసేవాళ్ళు ఎక్కువ....
ఏది ఏమైనా పోయినది ప్రాణమే... మనలాటి ప్రాణమే... వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... ఇక మీదటైనా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం..


Wednesday, July 8, 2015

1991 నాటి పుష్కరాలు- సతీ సమేత సాహస యాత్ర

1991 వ సంవత్సరములో పుష్కరాలు వచ్చాయి కదా...మేముండేది విశాఖలో...పుష్కరాలు అనగానే బోల్డంత జనం.. వసతులు సౌకర్యాలు వుండవు కాబట్టి వెళ్ళాలని అనుకోలేదు కాని ఏమూలో వెళ్ళాలనే వుంది..

ఇంతలో మా ఆఫీసులో పనిచేసే ఒకాయన.."ఏమండీ మాకు తెలిసిన ప్రైవేట్ బస్సు ఓనరు ఒకాయన బస్సు వేస్తున్నారు.. వస్తారా?" అని అడిగేడు..
ఆ మరురోజే పుష్కరాలకి తొలిరోజు.. ఇదొక గొప్ప అవకాశంగా భావించి సరే అన్నాను.. పైగా "ఆర్.టీ.సీ బస్సులో వెళ్ళలేము..ఒకవేళ వెళ్ళినా సుమారు 5 కి.లో మీటర్ల దూరంలో ఆపుతారు...తిరుగు టపాలో బస్సులు దొరకవు" అని భయపెట్టేసారు..   
అప్పటికి మా పెళ్ళి అయి సుమారు నాలుగేళ్ళు.. ఇద్దరు పిల్లలు.. పాపకి రెండేళ్ళు..బాబుకి ఏడాది.. కనుక పిల్లలని పెద్దవాళ్ళ దగ్గర వదిలేసి బయలు దేరాము..
వన్ టౌన్ లో ఆ ఓనర్ గారి చుట్టాల ఇంటిలో మమ్మల్ని.. మా లాంటి మరో పది మందిని కూర్చోపెట్టేరు.. ఎంతకీ బస్సు వెయ్యలేదు.. ఇదిగో..అదిగో అంటూ రాత్రి పన్నెండు..ఒంటిగంట.. మూడు..ఇలా కూర్చోబెట్టేసారు...
ఎంతకీ బస్సు రాలేదు.. పొజిషన్ ఏంటో సరిగ్గా చెప్పట్లేదు.. పోనీ వెళ్ళిపోదాం అనుకుంటే అర్ధరాత్రి.. స్కూటర్ కూడా తేలేదు... పైగా మా ఆఫీసులో అతను..మాటి మాటికీ "అమ్మో ఆర్.టీ.సీ బస్సుల్లో వెళ్ళలేరు.. సీట్లు దొరకవు.. అని భయపెట్టేస్తున్నాడు...

"ఇదేవిటండీ.. ఇలా చెసేరు?? ఇప్పుడు ఏమి చేద్దాం.." అంటూ అడుగుతోండి మా ఆవిడ..
ఇక నాలుగు అయ్యేసరికి నాలో సహనం చచ్చి పోయింది.. "పద" అంటూ సీరియస్ గా మా ఆవిడ్ని బయలుదేరనిచ్చాను.. 
తిన్నగా ఇంటికొచ్చాము... మా బండి తీసాను.. బండి అంటే ఇప్పటి లాగ మోటార్ బైక్ కాదు.. "వెస్పా పి.ఎల్ 170" అనబడు బుల్లి స్కూటరు..
 
 (image from google website)

ఏ బస్టాండుకో ..రైల్వే స్టేషనుకో అనుకుంది ఆవిడ.. మారు మాటాడకుండా బండి ఎక్కేసింది.. తదేకంగా బండి హైవే మీదకు పోనిచ్చాను...
"ఏవిటి ఎక్కడకు తీసుకెళ్తున్నారు?? " ఆందోళనగా అడిగింది.. "మనం దీనిమీదే రాజమండ్రి వెళ్తున్నాం.. " అని గంభీరంగా..పౌరుషంగా చెప్పాను...
"ఏవిటి ఈ బండి మీదా??" బెరుగ్గా అంది..
"ఏం పర్వాలేదు.. నువ్వు అలాగే కూర్చో.. నేను ఇలాగే నడుపుకుంటూ మధ్యానికల్లా రాజమండ్రి తీసుకుపోతాను" అని చెప్పాను..
అంతకు ముందు బ్రహ్మచారిగా వున్నప్పుడు "కైనెటిక్ స్పార్క్" అనే ఇంతకన్నా చిన్న బండి వుండేది.. దానిమీద భద్రాచలం నుండి తిరుపతి.. ఇంకోసారి భద్రాచలం నుంది వైజాగ్ వచ్చేసాను..(అప్పుడు అక్కడ దగ్గర్లో వుద్యోగం వెలగ బెడుతున్నాను లెండి )
ఆ ధైర్యం కొంత వుంది...
సరే మేము అనుకున్నట్లే మధ్యాహ్నాని కల్లా రాజమండ్రీలో పడ్డాము.. మా ఆవిడ చుట్టాలు.. కీ.శే.వేలూరి వెంకట్రామయ్య గారు అని.. పేరు మోసిన లాయరు గారి ఇంటికి వెళ్ళాం.. ఇప్పటిలాగ సెల్ ఫోన్లు లేవు కాబట్టి వారికి మా రాక విషయం తెలీదు గాని.. పుష్కరాల సంధర్భంగా అప్పటికే వచ్చిన చుట్టాలు.. ఇంకా ఎవరైనా రావచ్చు.. అని వారు వసతి .. భోజనం కల్పించారు.. అదే ఈ రోజుల్లో అయితే అంత ఆదరణ.. మర్యాద వుండదేమో.... వాళ్ళ అబ్బాయి గారు "ఏవిటీ వైజాగ్ నుండి బంది మీద అదీ ఒక చిన్న స్కూటర్ వేసుకుని వచ్చేసారా??" అంటూ బోల్డంత ఆశ్చర్య పోయి..మమ్మల్ని ఎంతో ఆదరించారు..

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మేము అనకాపల్లి దాటేసరికి చాలా ఆర్టీసీ బస్సులు "పుష్కరాల స్పెషల్" అని బోర్డు తగిలించుకుని ఖాళీగా వెళ్తున్నాయి.. కాని అప్పుడే ఏ అనకాపల్లి లోనే ఎలమంచిలి లోనో బండి పార్కు చేసి బస్సులో వెళ్ళొచుకదా.. ఆ కుర్ర వయస్సులో ఆ ఆలోచన ఎక్కడిది.. ఉడుకు రక్తం.. పైగా వెనకాల నాయికామణి...అదో పెద్ద సాహసం...

పుష్కర స్నానాలు అయ్యాయి... ఆ రాత్రి వారింట బసచెసి..మరురోజు మళ్ళీ వుదయం ఆరింటికల్లా బయలుదెరాము.. హైవేకి దారి తెలియక మధ్యలో ఎవరినైనా అడిగితే వాళ్ళు" అదిగో అలా వెళ్ళండి" అంటూనే "వైజాగ్ వెళ్తారా..ఈ బండి మీదా ??" అని నోరెళ్ళబెట్టి చూస్తుంటే నవ్వుకుంటూ బయలు దేరాను..

కాని ఎండలో ప్రయాణం... సూర్యకాంతి డైరెక్టుగా ముఖాల మీద పడుతోంది..అలా అలా నెమ్మదిగా ప్రయాణం సాగుతోంది.. ఈ బండి గంటకి 50 కి.మీ కన్నా స్పీడుగా వెళ్ళదు... మధ్యలో యలమంచిలి అడ్డరోడ్డు వద్ధ "కొరుప్రోలు" అనే ఊర్లో మా పిన్ని గారింటికి వెళ్ళం... కాని అదే మేము చేసిన పొరబాటు.. దాంతో యలమంచిలి దాటుసరికి చీకటి పడిపోయింది.. ఆ చీకట్లో పట్టాలు దాటుతుండగా సైలెన్సరు పట్టాలకు తగిలి "డబ్" అనే శబ్ధంతో పైకె లేచిపోయి టైరుకి రాపిడి జరిగి బండి కదలడం లేదు.. మా ఆవిడ భయంతో బిగుసుకుని పోయింది..

"నీ కేమీ భయం లేదు.. అంతగా కావలిస్తే నువ్వు బస్సులో వెళ్దువు గాని" అని ధైర్యం చెప్పి.. ఒక పెద్ద రాయి తీసుకుని సైలెన్సర్ పై భాగంలో "టపా టపా" అని రెండు దెబ్బలు వేసాను.. సెట్ అయిపోయింది... మరల "జూం.." అని బయలుదేరాము.. కాని వైజాగ్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది.. ఆ చీకటిలో ఒంటరిగా జనబాహుళ్యం  లేని చోట . తనకి పై ప్రాణాలు పైకే పోయినంత పరిస్థితి..
అందువలన బాగా డస్సిపోయి.. మరురోజు చూసుసరికి  ముఖం అంతా ఎర్రగా కందిపోయింది.. జ్వరం వచ్చినట్టు అయిపోయింది..వారం రోజులు డ్యూటీకి సిక్కు...     

ఇప్పుడు కారు వచ్చేక చాలా సార్లు రాజమండ్రి వెళ్ళాం.. వెళ్తున్నప్పుడల్లా ఆ ప్రయాణం గుర్తుకు తెచ్చుకుని "మీ డాడి..చిన్న బండి మీద రాజమండ్రి తీసుకెళిపోయేరే బాబూ.." అని మా పిల్లలకు చెప్తుంది..

రాజమండ్రి చుట్టం ఏ పెళ్ళిలో కనిపించినా "వీళ్ళు అప్పుడు చిన్న బండి మీద రాజమండ్రి వచ్చేశారు" అని ఇప్పటికీ పక్కవాళ్ళకి ఆశ్చర్యంగా చెప్తాడు...
 
మరల 2003 లో వచ్చిన పుష్కరాలకి మా బావమరిది అండ్ ఫామిలీ తో వెళ్ళాం గాని గుర్తుపెట్టుకునే అంతటి సంఘటనలు లేవు... కాని అప్పుడు శ్రీ.చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన ఘాట్ లన్ని ఇప్పటికీ అలాగే వున్నాయి..


ఇదిగో మళ్ళీ మా ఆఫీసు లో కొలీగ్ ఒకతను కెలుకుతున్నాడు.."సార్... తలో వెయ్యి వేసుకుని ఏదైనా కారు బుక్ చేసుకుని పుష్కరాలకి వెల్దామా??" అని...
అయ్యా జేబులోంచి రూపాయ్ తియ్యకుండా ఫ్రీ గా తీసుకెళితే వచ్చే మహానుభావులు వున్న ఈ కాలంలో వెయ్యిరూపాయలు ఎవరిస్తారండి బాబు.. చూద్దాం ఏవవుతుందో..
"రాజమండ్రి కాదుగాని "భద్రాచలం" వెళ్దాం.. పుష్కర స్నానం తో బాటు ఆ భద్రాచల రాముణ్ణి కూడా దర్శించినట్టు వుంటుందని ఓ ఉచిత సలహా పారేసా.. ఎంతైనా అక్కడ పనిచేసి వచ్చాగా.. పక్షపాతం..          

పుష్కరాలలో "జాలీ" ట్రిప్ చెయ్యకండి..

పుష్కరాల కాలములో నదిలో స్నానం చెయ్యడం ఎంతో పుణ్యఫలమే ...
కాని కేవలం పుష్కరాలలో "మాత్రమే" నదీ స్నానం వలన పుణ్యఫలం కలుగుతుంది అనుకోవడం పొరపాటే... 

ముఖ్యంగా పవిత్ర గంగ, గోదావరి  లాంటి నదులలో స్నానం అన్ని వేళలా మంచిదే....
"అప్పిచ్చు వాడు వైద్యుడు.. "  అను సుమతీ శతకములో "ఎప్పుడు నెడతెగక పారు నేరును.." అన్నట్టుగా.. 

ఎల్లప్పుడూ ఎడతెరిపి లేకుండా పారే ఏరు ఉన్న ఊరిలో నివాసముండాలని హితవు చెప్పారు..
మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు నది ఒడ్డున గాని, కనీసం ఏటి ఒడ్డున గాని నివసించాలని విన్నాను... అందుకే చాలామంది వృద్ధాప్యంలో "కాశి" పట్టణములో తుదిశ్వాస విడవాలని కోరుకుంటూ అక్కడ ఆశ్రమాలలో కాలం వెళ్ళబుచ్చుతారు..  
యాత్రలకు గాని, పుణ్యక్షేత్రాలకు గాని వెళ్ళేవారు కొంతమంది "జాలీ ట్రిప్" గా వెళతారు.. తినకూడనిది తింటూ.. తాగకూడనిది తాగుతూ పవిత్ర స్థలాలని పాడు చెయ్యడమే కాక పరిసరాలను కూడా పాడు చేస్తారు.. 


ముఖ్యంగా పురాతన దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి స్థల పురాణాలను అడిగి తెలుసుకుని వాటిని నమ్మి ఆవిధంగా ఆరాధిస్తూ నమ్మకంతో పూజలు చేస్తే చక్కటి ఫలితం వుంటుంది.. 

వాటిని అవహేళన చేస్తూ.. నిజంగా ఇక్కడ రాముడు తిరిగాడా.. శివుడు వెలిసేడా.. ఇది స్వయం భూ విగ్రహమేనా.. అంతా అబద్ధం అనుకునే వారికి ఏ ఫలితము వుండదు.. 

అందరికన్నా ముందుగా..వేగంగా దర్శనం కావాలి అను కోరికతో అడ్డదారిలో దేవుని దర్శనం చేసుకున్న వారికి పుణ్యం రాదుగదా పాపం మూట కట్టుకుంటారు.. వి.ఐ.పీ పాసులంటారు ...అసలు దేవుని ముందు ఎవరు వి.ఐ.పీ లు???
ఇక విషయానికొస్తే.. ఇటువంటి  తీర్థాలు, పుష్కరాలు వచ్చినప్పుడు.. భక్తులు కాకుండా ఆకతాయి కుర్రాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు..
సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకునే పరిజ్ఞానం వచ్చింది కాబట్టి స్నానం చేసే వారిని తమ ఫోన్లలో బంధించి..సోషల్ నెట్వర్క్ లో పెట్టేవారు...లేని రద్దీని సృష్టిస్తూ ఆడవారిపై పడిపోయి...తాకరాని చోట తాకుతూ పైశాచిక ఆనందం కలిగేవారి సంఖ్య ఎక్కువగా వుంటుంది.. అటువంటి వారిని పోలీసులు కూడా నివారించలేరు.. 


 
పుష్కరాల కాలము లోనే కాదు.. నదీ స్నానం చెసేటప్పుడు పవిత్ర భావంలో చెయ్యాలి..
ముందుగా నదీమ తల్లికి నమస్కరించాలి..
నీటిలో మునకలు వేస్తున్నప్పుడు ఇష్ట దైవారాధన చెయ్యాలి.. 

వస్తే..మంత్రోచ్చారణ  చెయ్యాలి.. లేదా కనీసం కేశవ నామలను చదవాలి..
స్నానము చేసిన అనంతరము.. చుట్టుపక్కల వారిని..వాతావరణాన్ని పట్టించుకోకుండా ఒడ్డున తదేక దీక్షతో మౌనంగా దైవప్రార్థన గాని సంధ్యావందనం గానీ గాయత్రీ మంత్రము గాని చెయ్యాలి.. 

ఏ మంత్రమూ రాక పోతే కనీసం "ఓం నమో నారాయణాయ.." అని మనసులో మీకు నచ్చినన్ని సార్లు నామ జపం చెయ్యండి.. 

ఒకవేళ ఏ కారణము వలనైనా... బరువెక్కిన హృదయంతో నీటిలో దిగిన వారు తేలిక మనసుతో ఇంటికి వెళ్ళేలా వుండాలి...మనసు ప్రశాంతంగా వుండాలి... 

ముఖ్యంగా దోసిలితో నీరు తీసుకుని సూర్యునికి అభిముఖంగా నిలబడి "అర్ఘ్యం" లేదా తర్పణం ఇవ్వాలి..  దీని వలన కలిగే ఫలితం అంతా ఇంతా కాదు..    

ఇంటికి వచ్చిన తరువాత పదే పదే మనస్సులో స్నానం చేసిన అనుభూతిని.. అందువలన వచ్చిన ఆనందాన్ని తలచుకోవాలి..
ఈ విధంగా ఎప్పుడు స్నానం చెసినా ఆ నదీ మాత ఆశీస్సులు మనకు "పుష్కలంగా" ఉంటాయి.. 


మరొక మాట.. ఈ సంవత్సరం లో ఏ రోజు గోదావరిలో స్నానం చేసినా పుష్కర కాలంలో స్నానం చేసిన ఫలితం వుంటుంది.. కాబట్టి పీక్ టైం లో వెళ్ళి మీరు ఇబ్బంది పడద్దు.. ఇతరులని ఇబ్బంది పెట్టద్దు... 
   
ఈ మాటలన్నీ స్వయంగా అనుభవించి రాసినదే కాని ఎక్కడో విన్నవీ చదివినవీ కాదు..  


సుమారు..30 ఏళ్ళక్రితం..ఆ గోదావరి మాత దయవలన.. కేవలము రెండు సార్లు గోదావరి నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న కారణంగా మంచి ఫలితాన్ని పొందిన వాణ్ణి కనుక పై విషయాలు రాస్తున్నాను... మీరు ఆచరించి చూడండి... .