Monday, August 31, 2015

ఆశ..ఆకాంక్ష...ఆరాటం...అవేదన...మారుతుంది ఈ సమాజం అని..చదివేను.. చదువుతున్నాను.. చదువుతాను...
చదువుతునే వుంటాను.... 


అక్షరాల భావాలు అర్ధం అయ్యే వయస్సులో మొదలెట్టాను..
భావాల వెనక అర్ధాలను వెతుక్కుంటూ చదువుతున్నాను..
కనీకనిపించక అక్షరాలు అలుక్కుపోయేవరకూ చదువుతాను..
నాలో ఊపిరి కొట్టుమిట్టాడునంత వరకూ చదువుతునే వుంటాను...
దాహం.. తపన ..ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస అక్షరాలను ఆకర్షిస్తోంది..  

ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఎందరో మహానుభావులు..
తమకు తెలిసిందేదో ఈ ప్రపంచానికి అందించాలని తపన.. 
అక్షరాలకు ప్రాణం పోసి సమాజానికి హితవు చెయ్యాలనే ఆవేదన...
అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞానమనే వెలుగుని నింపాలని ఆరాటం..

ఈ అక్షర యజ్ఞంలో...
ఆస్తికుల్ని చదివాను... నాస్తికుల్ని చదివాను.. 


 
శృంగార కావ్యాలని చదివాను... వైరాగ్య గీతికల్ని చదివాను..
నీతి కథల్ని చదివాను... అవినీతి చక్రవర్తుల చరిత్రను చదివాను..


 
భిక్షాధికారి లక్షాధికారిగా మారిన వైనాన్ని చదివాను..
అపర కుబేరుడు దరిద్రుడిగా మారడాన్ని చదివాను..

అగ్రవర్ణాల దురహంకారానికి బలైపోయిన నిమ్న జాతుల చీకటి జీవితాల్ని..
మారిన వ్యవస్థలో అణగానిపోతున్న అగ్రవర్ణాల దుస్థితిని ..రెంటినీ చదివాను... 

ధన మాన ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల గాధలు చదివాను...
కుటిల నాయకుల ధన అధికార దాహానికి..బలైపోతున్న మాన ప్రాణాల గాధలు చదివాను..  

ఎంతోమంది ఈ ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చినా ..
మారని ఈ సమాజాన్ని...
ఎంతోమంది నిలువెత్తు కాగడాలను వెలిగించినా అంధకారంలో వున్న         ఈ సమాజాన్ని..
ఎంతోమంది మానవత్వపు పరిమళాల్ని వెదజల్లినా.. పైశాచికత్వాన్ని వీడని ఈ సమాజాన్ని..
ఎంతోమంది సన్మార్గాన్ని బోధించినా వున్మాదత్వంతో వూగిపోతున్న          ఈ సమాజాన్ని... 


చదివాను.. చదువుతున్నాను... చదువుతాను..
నా ఊపిరి ఉన్నంత వరకూ చదువుతూనే వుంటాను..
ఆశ...ఆకాంక్ష...ఆరాటం...అవేదన.... మారుతుంది ఈ సమాజం అని..   
Saturday, August 29, 2015

వెన్నెల్లో సింహాచల అందం...మది కన్నుల్లో....

దివిపైన నెలరాజు కాంతులీనంగ..
భువిపైన గిరిరాజు మెరయంగ..
మదిపైన సింహరాజు మెదలంగ..

మురిసెను హృదయమ్ము..
విరిసెను తన్మయత్వమ్ము..
కురిసెను భక్తిపారవశ్యమ్ము..

(Images at Simhachalam on yesterday)Saturday, August 22, 2015

నా దృష్టిలో బాహుబలి కంటే ఉత్తమ ఫొటో యాంగిల్..

మొన్న "ప్రపంచ ఫొటోగ్రఫీ రోజు " న రైల్లో వున్నాను.. అందుకే నా మొదటి ఫొటోగ్రఫీ అనుభవాలు ఈ రోజున రాస్తున్నాను...
చేత్తో బలపం పట్టుకుని "అ.ఆ లు" దిద్దుతున్నప్పుడే బొమ్మలు కూడా వేస్తే బాగుణ్ణు అనిపించేది.. 

అలా.. ఎదురుగా ఏ వస్తువు కనపడితే ఆ వస్తువుని గీయడానికి ప్రయత్నించే వాణ్ణి.... 
పుస్తకాలు చదువుతున్నట్టుగా నటించి ఆ పుస్తకాల్లో వున్న బొమ్మలు వెనక పేజీల్లో గీసేవాణ్ణీ.. అందులో ముఖ్యమైనది "గజేంద్రమోక్షం" బొమ్మ.. 
ఆ రోజుల్లో చాక్లేట్ డబ్బాలు (రేకు డబ్బాలు) వుండేవి.. వాటి మీద ఆకర్షణియమైన బొమ్మలు వుండేవి.. వాటిల్లో లేపాక్షి బొమ్మ విపరీతంగా ఆకర్షించేది..వాటిని వెయ్యడానికి ప్రత్నించే వాడిని... 
మొదట కోప్పడినా మా అమ్మగారు బాగా ప్రోత్సహించే వారు.. 

ఇలా వుండగా మా "మూర్తి మావయ్య" అని శ్రీ.కె.ఎస్.ఆర్ .మూర్తి గారు (రైల్వే లో పని చేసే వారు.) మా అమ్మ గారికి కజిన్ అన్నమాట.. ఆ మాట కొస్తే మాకు "కె.ఎస్.ఆర్ మూర్తి" అని పేరు గల వాళ్ళు నలుగురో.. ఐదుగురో మావయ్యలు వున్నారు.. 

అందరూ "కొల్లూరు సూర్యనారాయణ మూర్తి.." అన్న పేరుగల వాళ్ళే... 

సరే ఈ కజిన్ మావయ్య నా బొమ్మలని ఇష్టపడే వాడు.. అతనికి కూడా ఫైన్ ఆర్ట్స్ లో ప్రవేశం వున్నది... పాటలు..ఆటలు అన్నిటిలోను చాలా ఏక్టివ్.. 
నా పదహారో ఏట అనుకుంటా ..ఒకరోజు హటాత్తుగా.. "ఇదిగో తీసుకోరా శంఖు బడ్డూ.." అని ఓ కెమేరా నా చేతికిచ్చాడు.. 
"ఇది నీకే గిఫ్ట్.." అని అంతవరకూ ఆయన ఎప్పట్నుంచో వాడుతున్న ఓ "డబ్బా కెమెరా" ను నా కిచ్చాడు.. 
(google image)


"డబ్బా కెమెరా" అన్నానని తక్కువ అంచనా వేసి మాట్లేడానని అనుకోకండి..
దాని పేరు "డబ్బా కెమెరాయే" .. ఒక బాక్స్ లాగ వుంటుంది.. ఒకపక్క లెన్స్ వుండి..మనం తీయవలసిన బొమ్మ తాలుకా ఇమేజ్ పై భాగంలోని అద్దం మీద లీల గా తలకిందులుగా మనకి కనిపిస్తుంది..స్పష్టంగా కనబడదు.. దీనికి ఏ విధమైన లెన్స్ ఎడ్జెస్టుమెంట్లు గాని కాంతి ని బట్టి షట్టర్ వేగం తాలుకా అడ్జస్టుమెంటు గాని వుండవు.. అంటే ఎక్కువ ఎండలోను తియ్యకూడదు.. తక్కువ కాంతిలోను తియ్యకూడదు.. నడినెత్తిన సూర్యుడు లేనప్పుడు..ఉదయ సాయం సంధ్యా సమయాల్లో తీస్తే బహు బేషుగ్గా వస్తాయి... పదకొండు వరకు ఫర్వాలేదు.. 

ఇక ఈ కెమేరాతో ఎన్నో ప్రయోగాలు చేసాను.. మేఘాద్రిపేట రిజర్వాయర్ దగ్గరకు వెళ్ళి వాటర్ ఫాల్స్ కిందన ఒక రాయిమీద కెమేరా పెట్టి అంతా ఎడ్జస్టుమెంటు చేసి నేను వెళ్ళి తగిన ప్లేస్ లో కూర్చుని మా ఫ్రెండుని మీట నొక్కమని చెప్పాను.. అద్భుతంగా వచ్చింది.. నా భుజం హైలేట్ అయి పెద్ద కండల వీరుడులాగ వచ్చాను.. అందరూ అడిగేవారు.. "ఈ ఫొటొ ఎలా తీసావు??.. ఇందులో వున్నది నిజంగా నువ్వేనా??" అని... 
ఏ గ్రాఫిక్కు లేకుండా.. పెద్ద వాటర్ ఫాల్స్ వెనకాల హాఫ్ ప్రొఫైల్ లో నా ఇమేజ్ కనబడేది.. నిజానికి ఒక సన్నటి నీటి ధార.. ఫొటోలో పెద్ద జలపాతం లాగ కనబడేది.. నా దృష్టిలో బాహుబలి కంటే ఉత్తమ ఫొటో యాంగిల్.. ఎందుకంటే మాయా లేదు మర్మం లేదు... కేవలం కెమేరా యాంగిల్ మాత్రమే..  

రైలుపట్టాల మధ్యలో మా ఫ్రెండుని నిల్చోపెట్టి తీసాను.. ఒకసారి ఏకంగా పెద్ద గ్రూప్ ఫొటో తీసి పడేసాను.. ఫిల్మ్ కడిగిన స్టూడియో వాడు నోరు వెళ్ళపెట్టాడు.. "ఈ కెమేరా తో ఇంత పెద్ద గ్రూప్ ఫొటో ఎలా తీసావయ్యా బాబూ" అని... 
పడుక్కున్న ఆవు-దూడ ఫొటో తీసాను.. అద్భుతహ.. ఒక బాపు లాగో.. బాలచందర్ లాగో ఫీల్ అయిపోయే వాణ్ణి.. 

ఇది నా మొదటి కెమేరా విశేషాలు.. ఇలా మీతో పంచుకున్నందుకు ఆనందిస్తూ ... మొన్న రైల్లో రాత్రంతా మా ప్రియమైన మూర్తి మావయ్య గార్ని తలుచుకుంటూ..తన ఆట పాటలతో ఇంద్రాది దేవతలను మురిపించడానికి వెళ్ళిన ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ... శెలవ్..

Saturday, August 15, 2015

విశాఖవాసిగా గర్వపడుతున్నాను..

స్వాతంత్ర్య దినోత్సవ సంధర్భంగా విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ భవనం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది..

రాష్ట్రం విడిపోవడం వలననే స్వాతంత్ర్యవేడుకలు విశాఖపట్నంలో చాలా ఘనంగా జరిగాయి..విశాఖవాసిగా గర్వపడుతున్నాను... కాని చెత్త వెధవలు రూపాయి ఆదాయం గాని.. ప్రత్యేక ఆర్ధిక సహాయం గాని లేకుండా చేసారు... నాశనం అయిపోతారొరే... నాశనం అయిపోతారు... 

Wednesday, August 12, 2015

ప్రధాని మారినా... "మౌన ముని" పాత్ర మారలేదు..

వర్షాకాలపు సమావేశాలంట...
వాళ్ళకి టైం పాసు..
మనకి మెంటల్ పాసు..
ఒక్క లలిత్ మోదీ ఇష్యూ తప్ప..
మరే సమస్యా లేదంట...

ప్రధాని మారినా
"మౌన ముని" పాత్ర  మారలేదు..

ప్రజాస్వామ్యానికి పాడి కట్టితిరే...
అక్కటా ఎన్నాళ్ళీ చలనమ్ము లేని జీవనము..Tuesday, August 11, 2015

"ఆంధ్రా" వాలాకి "ఢిల్లీ" వాలా ఇవ్వబోయే "పేద్ధ స్పెషల్ పాకేజీ" అంట...


 ----------------------------------------------------------------------------------------------
 ఇంకో ఇల్లాలి వేదన:

అచ్చ తెనుగు ఆంధ్రా వోడేనమ్మా..
ఢిల్లీ పీఠం ఎక్కంగనే మారిపోయెనమ్మా...

మనువాడక ముందు...
బాస కాని బాస లో యాస కాని యాస లో
ప్రతినలెన్నో సేసెనమ్మా...

తీరా తాళి కట్టంగనే...
ఇచ్చిన వరాలు మర్చెనమ్మా.....
ఏందిరా ఇది మగడా అంటే
మాట మార్చి మోసం చేసెనమ్మా..  

Sunday, August 2, 2015

ఆణు శాస్త్రవేత్త ని "రాష్ట్ర పతి" గా ఎందుకు చేశారు??

అబ్దుల్ కలాం గారు గొప్ప శాస్త్ర వేత్త, భారత దేశ క్షిపణి ప్రయోగాల్లో అగ్రగణ్యుడు.. తన జీవితాన్ని వృత్తికి త్యాగం  చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయిన మహానుభావుడు.. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు.. 

కాని.. అస్సలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని భారత దేశంలో అత్యున్నత పదవి అయిన "రాష్ట్రపతి " గా ఎందుకు నియమించారు?? ఆనాడు ఆ పదవికి పోటీలో వున్న వారు ఎవరు.. వారిని కాదని కలాం గారికే ఎందుకు ఇవ్వవలసి వచ్చింది?? 


వీటి వెనకాల ఉన్న మర్మమేమి??
అతనికి తెలిసిన అనెక మర్మాలు బయటకు పోతాయని భయం ఆనాటి పాలకుల్లో కలిగిన మాట వాస్తవమా??
ఇంత నిజాయితీ పరుణ్ణి ఎందుకు శంకించారు??
అలా శంకించడానికి కారణాలు ఏమైనా వున్నవా?? 


నిజంగా దేశ భక్తుడే అయి, పదవీ కాంక్ష లేని వాడు అయితే "రాష్ట్రపతి " సీటులో అడగ్గానె ఎందుకు కూర్చున్నారు.. మహాత్మా గాంధీ లాగ ఏ పదవీ ఆశించకుండా దేశ సేవ, సమాజ సేవ ఎందుకు చెయ్యలేదు..
మరి ఇలాంటి త్యాగ మూర్తిని మన నాయకులు ఎందుకు ఆదర్శంగా తీసుకోడంలేదు..

నా బుర్ర కలిగిన ఈ సందేహాలకు ఎవరైనా "మానవ భాష" లో సమాధానం ఇస్తే సంతోషిస్తాను..