Tuesday, November 10, 2015

కొండవలసకి నాటకం ఒక పిచ్చి.. ఒక కిక్కు... ఒక సరదా..

కొండవలస లక్ష్మణరావు గారు విశాఖపట్ణం పోర్టు ట్రస్టులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గుమాస్తా గా పనిచేసారు... 
నటుడి కన్నా ముందు చక్కటి బొమ్మలతో గ్రీటింగు కార్డులు ప్రింట్ చేసి అవన్నీ టేబిల్ మీద పెట్టి సహోద్యోగులకి తక్కువ రేట్ కి ఇచ్చేవారు... 
స్క్రీన్ ప్రింటింగ్ టెక్నాలజీ అప్పుడే కొత్తగా వచ్చింది ... దీని కోసం చాలా కష్టపడేవారు... 

తదుపరి...  అప్పట్లో ఆంధ్రా యూనివర్శిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమో అంటే చాలా గొప్ప విషయం..
అక్కడ అత్తిలి కృష్ణారావుగారి శిష్యరికంలో నాటకాలు వేస్తూ డైరక్షన్ విభాగంలో కూడా మెళకువలు నేర్చుకున్నారు... 
ఇక మా పోర్టు అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం లాంటిది... కవులకు కళాకారులకు పుట్టినిల్లు మా విశాఖపట్నం పోర్టు ట్రస్టు...
నంది నాటకోత్సవాల కన్నా పోటా పోటీగా అంతర్విభాగ నాటక పోటీలు జరిగేవి... 
ఫైనాన్స్ విభాగం వారు.. వారి నాటికలను  వారే రాసుకుని ప్రదర్శించే వారు... అందుకే మిగిలిన విభాగాలకు భిన్నంగా ఫైనాన్స్ విభాగపు కల్చరల్ అసోసియేషన్ కి   "లిటరరీ అండ్ డ్రమెటిక్ అసోసియేషన్." అనే పేరుని స్వయంగా లక్ష్మణరావు గారు పెట్టడం జరిగింది... .

నాటకం తప్ప వేరే ప్రపంచం గురించి ఆలోచించని మనుష్యులలో ఈయన ఒకరు... నచ్చిన నాటికను తెచ్చుకోవడం..చాలా కొద్ది కాలం లోనే తయారు అవడం.. పరిషత్తులకి వెళ్ళడం ...ఇదీ దిన చర్య... అర్ధరాత్రి వరకూ లేదా ఒకోసారి తెల్లార్లూ రిహార్సల్స్ వేసినా మరుసటి రోజు పొద్దున్నే ఉద్యోగానిని హాజరు...


నాటకం ఒక పిచ్చి.. నాటకం ఒక కిక్కు... నాటకం ఒక సరదా.. నాటకమే ఊపిరి...అందుకే ఆ నటరాజ స్వామి కరుణించి చిత్ర సీమలో తనకంటూ గుర్తింపు తీసుకొచ్చిన పాత్రలను ప్రసాదించేడు... 

విశాఖ పోర్టు లో జరిగే పోటీలను చూసి ఎస్.బి.ఐ..స్టీల్ ప్లాంట్.. షిప్ యార్డ్ మొదలగు సంస్థల నుండి కొంతమంది ఔత్సాహిక నటులు వచ్చి నాటికలను తయారు చెయ్యమని ప్రాధేయపడగా.. వారికి డైరెక్షన్ చేస్తూ ఎంతో మంది నటుల్ని డైరెక్టర్లను తయారు చేసారు... ఎవరికీ తెలియని విషయం ఏవిటంటే ఈయన మంచి మేకప్ ఆర్టిస్టు..వారి నాటికలకే కాక ఇతరులకి కూడా మేకప్ అందించే వారు.... చాలా తక్కువ పారితోషికానికి.... ఆ రోజుల్లో కొంతమందికి నాటకం అంటే కసి.. చాలా సీరియస్ గా డైరెక్షన్ చేస్తూ చండశాసనుడిలాగ.. నియంత లాగ వాళ్ళు చెప్పినట్టుగానే సంభాషణలు పలకాలి...నిలబడాలి అని శాసించేవారు.. 

కాని కొండవలస వారు  చాలా సులువుగా హాయిగా నటులకి స్వేచ్చ నిచ్చి నటింప చేసేవారు... ఆయన భాషలో చెప్పాలంటే..."వీజీ.. వీజీ... స్టడీ..స్టడీ.." అంటూ ఉత్సాహ పరిచేవారు...
"ఒరేయ్ ఆడు అలా ఎడం వైపుకి తిరిగాడా...నువ్వు ఇలా కుడిపక్కకొచ్చి డైలాగ్ చెప్పు" అనే వారు..కాని డైలాగ్ డెలివరీ మాత్రం పర్ఫెక్ట్ గా వుండాలి అనేవారు...  
బాహుబలి లాంటి భారీ సబ్జెక్ట్ లు కాకుండా ఎక్కువగా ఫామిలీ డ్రామాలు ఎంచుకునే వారు... సినిమాల్లో ఆయన వాడింది ఫాల్స్ వాయిస్.. కాని నిజానికి ఆయన చాలా గంభీరమైన గొంతుతో గొప్ప కారెక్టర్ ఆర్టిస్టు గా రాణించే వాడు... ఎక్కువ హాస్య పాత్రలు కూడా వెయ్యడం జరిగింది.. అంతే స్థాయిలో సీరియస్ రోల్స్ కూడా వేసి మెప్పించారు...

అలా వందల నాటకాలు .. పరిష్యత్తులు.. పోటీలు....సన్మానాలు.. పురస్కారాలు ....అదో  అలుపెరుగని పోరాటం........ 
 సినిమా ప్రస్థానం కన్నా ముందు ఆయన వేసిన నాటికల్లో శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణ గారి రచనలు "రేపటి శత్రువు" "ఇండియన్ గ్యాస్" చాలా పేరుపొందాయి... వీటిని శ్రీ  వంశీ గారు చూసి ఆయన సినిమాలో (అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు) లో మంచి వేషం ఇచ్చారు.. 

ఇండియన్ గ్యాస్ నాటికలొ ఒక సోడాలు అమ్ముకునే పాత్రలో ఈ ఫాల్స్ వాయిస్ పెట్టి నాటిక మొత్తం ఫాల్స్ వాయిస్ తోనే చేయడం జరిగింది.. ఇదే ఫాల్స్ వాయిస్ సినిమాల్లో వాది దాదాపు అన్ని సినిమాలు ఒకటే వాయిస్ వాడడం జరిగింది.. అదే ఆయన కూడా అప్పుడప్పుడు బాధపడే వారు. తనలో దాగివున్న నిజమైన కళాకారుణ్ణి వాడుకోవట్లేదని...మూసపోసిన పాత్రలతో విసిగిపోయనని అనేవారు.. సినిమావాళ్ళు అంతే...  ఒక చిత్రంలొ ఏ పాత్ర ద్వారా ఒక నటుడు పరిచయం /క్లిక్  అయితే అదే పాత్రను అదే బాణిలో చెయ్యమని అడుగుతారు..తప్ప కొత్తరకం వేషాలు ఇవ్వరు.. బ్రహ్మానందం చెంపదెబ్బల కామెడీ కూడా అంతే... 

నాతో పరిచయ విషయానికొస్తే నేను ఇంటర్మీడియెట్
లో వున్నప్పుడే ఈయనతో పరిచయం ఏర్పడింది.. ఒక చిత్రకళా నికేతన్ లో... ఇక పోర్టుకి వచ్చాక ముందు ఒక చిన్న పాత్రనిచ్చి ప్రోత్సహించారు.. సోషల్ నాటికల్లో ఒకటో రెండో చేసాను ఈయన డైరెక్షన్ లో కానీ  "కన్యా శుల్కం" నాటికలో ఆడ శిష్యుడి పాత్రను వేసి ప్రేక్షకులను మెప్పించాను...సుమారు పాతికేళ్ళ కితం ......ఎంతో మంది సీనియర్ కళాకారులతో కన్యాశుల్కం నాటకాన్ని కొండవలస గారి డైరెక్షన్ లో ఒక పది ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం... అందువలన నేను కూడా నటనలొ మెళకువలు అలా సీనియర్ల నటన దగ్గరగా చూసి నేర్చుకున్నాను... కళలకు ప్రత్యేకించి కోచింగ్ వుండదు...అది ఏ కళ అయినా ....  

ఇక ఆయన పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక సినీమాల్లో బిజీ అయాక మాతో సంబంధాలు తగ్గిపోయాయి... చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తో ఫోనుల్లో మాట్లాడటం చేసే వారు.. వైజాగ్ వచ్చినప్పుడు కలిసే వాళ్ళం.. అప్పుడు "శంకరూ బావున్నావా.." అని అప్యాయంగా పలకరించేవారు..
 

కానీ బాధాకర విషయం ఏవిటంటే కళ్ళు చిదంబరం లాగే ఈయన కూడా వ్యసనాలకు లోను కావడం వలన సుమారు పది సంవత్సరాలనుండి హృద్రోగంతో బాధపడుతున్నా... ఏనాడూ నాటకం వెయ్యడం ఆపలేదు... పరిషత్తులకి కట్టడం ఆపలేదు...  
ఏది ఏమైనా విశాఖ పోర్టులో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలెట్టి.. ఎన్నో ఆటుపోటులకు తట్టుకొని సినిమాల ద్వారా ప్రఖ్యాతి వహించిన కొండవలస గారు మా పోర్టు ఉద్యోగి అని గర్వంగా చెప్పుకునేలా చిరస్మరణీయుడైనందుకు ఘన నివాళులు అర్పిస్తున్నాను..   

Monday, November 9, 2015

"కళ్ళు చిదంబరం" మా వాడే... 'కొండవలస" కూడా మా వాడే....

"కళ్ళు చిదంబరం" మా వాడే... 'కొండవలస లక్ష్మణరావు" కూడా మా వాడే....  
"మా వాడే" అంటే మా ఊరువాళ్ళు మాత్రమే కాదు.. మా విశాఖపట్నం పోర్టు ట్రస్టు లో వుద్యోగస్తులే...
విశాఖపట్నం పోర్టు ట్రస్టు లో ఎంతో మంది పేరొందిన కళాకారులు వుండేవారు.. ఇప్పుడు కొద్దిమందే మిగిలారు... కళాపోసన కూడా తగ్గింది...

కళ్ళు చిదంబరం గారు అంత ఎక్కువగా నాటకాల్లో వెయ్యకపొయినా 

శ్రీ సత్యానంద్ (పవన్ కళ్యాన్ కి ప్రభాస్ కి గురువు) తో తిరగడం వలన 
"రైలు బండి" లాంటి నాటికల్లో చురుకైన పాత్రలు ధరించి "కళ్ళు" సినిమా డైరెక్టర్ కంట్లో పడ్డారు...ఇక అక్కణ్ణుంచి సినీ ప్రస్థానం మొదలైంది.. ఆ వివరాలు నేను చెప్పక్కర్లేదు... 

ఈయన మా విశాఖ పోర్టు సాంస్కృతిక విభాగపు సంస్థ "సాగరి" కి కార్యదర్శిగా చేసారు.. ఇది సుమారు నలభై ఏళ్ళ కిందటి మాట... కొన్ని సమాజాల వాళ్ళు నాటకాలు తయారు చేస్తూ వుంటే వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వడం... కావలసిన వస్తువులు సేకరించిపెట్టడం చేసేవారు.. అదీకూడా కళాసేవే కదా.. అందుకే...
ఈయన సినిమాలకి వెళ్ళిన ఏడాది తర్వాత విశాఖపట్నం లో "నా కంటే ఎంతో ప్రతిభావంతులైన కళాకారులున్నారు..వాళ్ళకి కూడా సినిమాల్లో వేషాలు దొరికితే నా కన్నా ఎక్కువగా రాణిస్తారు" అని భావించి, విశాఖ కళాకారులందరికీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఫొటోలు బయోడేటాలు సేకరించి తాను షూటింగు కెళ్ళిన ప్రదేశాలకు అవి మోసుకెళ్ళి దర్శక నిర్మాతలకు చూపించి వాళ్ళకి వేషాలు ఇమ్మని అడిగే వారు... 

ఇదంతా ఉచితంగా చేసారు.. కాని ఫలితం శూన్యం... సినిమా వాళ్ళు ఎవరికున్న పరిమితుల్లో వాళ్ళు కళాకారుల్ని ఎంచుకుంటారు... 

సినీ ప్రస్థానం కొద్దిగా తగ్గిన తరువాత "సకల కళాకారుల సమాఖ్య" అనే సంస్థను స్థాపించి...ఒక్క నాటకాల వాళ్ళే కాక హరికథ బుర్రకథల కళాకారుల నుండి సంగీత నాట్య కళాకారుల వివరాలు పొందుపరుస్తూ ఒక పుస్తకం ప్రచురించారు.. సుమారు లక్ష రూపాయలు సొంతఖర్చుతో... \

ఆ సంస్థకు విరాళాలు సేకరించి పేద విద్యార్ధులకు పుస్తకాలు... బ్యాగ్గులు.. మొదలగునవి ఇచ్చేవారు.. తుది శ్వాస విడిచే వరకూ కళా సేవలోనే తరించారు... 
మా అమ్మ గారి ఇంటి పేరు వీరి ఇంటి పేరు ఒకటే అవడం యాదృచ్చకమే  అయినా  ఆ చనువుతో ఎప్పుడూ ఆయనకి  ప్రత్యేకంగా దగ్గర అయ్యే ప్రయత్నం చెయ్యలేదు.. కాని ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా పలకరించే వారు...

సుమారు ఐదేళ్ళ క్రితం యండమూరి వీరేంద్రనాధ్ గారి నాటిక "చీమ కుట్టిన నాటకం" లో కలిసి నటించాం.. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి లలో ప్రదర్శనలు వేశాం..  హాస్య నాటిక అవడం వలన ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునే వారు.. అందులొను ఈయన ప్రత్యేక ఆకర్షణ.. 
"కన్యాశుల్కం" నాటకంలో నేను 'అగ్నిహోత్రావధాలు' పాత్ర వేయడానికి ప్రోత్సాహమిచ్చి ఆ వేషం బాగా రాడానికి దోహదపడ్డారు.. 

ఇకపోతే ఆఖరురోజులు కాస్త భారంగా బాధగానే గడపవలసి వచ్చింది.. ఆక్సిజన్ పరికరం ముక్కుకి తగిలించుకుంటేనే గాన్ని ఊపిరి అందర్ని పరిస్థితి.. విపరీతమైన పొగతాగే అలవాటు వలన ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి..ఇంఫెక్షన్ బాగా ఎక్కువయి సుమారు ఒక సంవత్సరం నుండి ఇవాళా రేపా అన్నట్టు గడిపారనే చెప్పొచ్చు..ఈ సమయములో సాటి కళాకారునికి ఆపత్కాలంలో ఆదుకోవాలని ఆయనకు  నా వంతు సహాయం చేసాను. అదో ఉడతా భక్తి సాయం.. ప్రస్తుతం అప్రస్తుతం.. 

కాని చివరిరోజుల్లో ఒక్కొక్కరే ముఖం చాటేస్తుండటంతో "ఆ నలుగురు" లాగ నాకు చివరికి నలుగురే నలుగురు మితృలు మిగిలారండి అని పేర్లు చెప్పి మరీ బాధపడే వారు... . ఉపకారం పొందిన కొంతమంది కనీసం హాస్పిటల్ కి వచ్చి పలకరించేరు కాదని బాధపడే వారు... 

యవ్వనంలో ఉన్నప్పుడు మద్యం సిగరెట్లు లాంటి అలవాట్లను లోనైతే అవి శరీరాన్ని ఎలా పీల్చి పిచ్చి చేస్తాయో తెలియచెప్పే ఉదాహరణకు కళ్ళు చిదంబరం గారే సాక్షి...

కాని ఆయనలో ఒక గొప్ప మానవతావాది వున్నాడు..ఎవరైనా బాధ పడుతూ ఉంటే చూసి తట్టుకోలేని గొప్ప హృదయం గల మనిషి వున్నాడు... నిస్వార్ధంతో కళా సేవ చేసిన సైనికుడు వున్నాడు... 
విశాఖపట్నానికి ఒక కళా వేదిక కావాలని పోరాడిన అలుపెరుగని ఉద్యమ కారుడున్నాడు.. 
ఆయన పెంకితనం.. ముక్కుసూటి తనం ఆయనకు ఆభరణాలు అయ్యాయి గాని..ఎప్పుడు సమస్య కాలేదు... 

గంటకి ఇంత అని రేటు తీసుకునే కళాకారులున్న ఈ దేశంలొ కొన్ని చిత్రాలకు ఉచితంగానే పని చేసిన "కళ్ళు చిదంబరం" గారు చిరస్మరణీయులు...
(కొండవలస గారి గురించి  తదుపై పోస్టు లో రాస్తాను...)    

Saturday, November 7, 2015

ఎర్రమట్టి దిబ్బలు నాశనం చేసిన దుష్టులను ప్రకృతి మాత శిక్షించు గాక....

భీమునిపట్నానికి మణిహారం ఈ ఎర్రమట్టి దిబ్బలు...
ప్రపంచంలో మరెక్కడా కానరాని ఎత్తుమట్టి దిబ్బలు..
పర్యావరణ ప్రేమికులను అలరించిన అద్భుత దిబ్బలు...
అనేక చిత్రాలలో కనువిందు చేసిన సుందర దిబ్బలు..
నేడు రక్కసుల కోరలకు బలైపోయిన ప్రాచీన దిబ్బలు...ఎర్రమట్టి దిబ్బలు నాశనం చేసిన దుష్టులను ప్రకృతి మాత శిక్షించు గాక....