Friday, December 25, 2015

ఒకరోజు నా అనుభవాలు... అనుభూతులు....నిజజీవిత వాస్తవాలు..

కథ రాయడం అంటే ఒక రచయిత తన అనుభవాలకు కొన్ని అనుభూతులు అభూత కల్పనలు జోడించి రాయడమే...
కాని నిత్యవారి జీవనంలొ మనకు ఎదురయ్యే అనుభూతులు మనసుకి హత్తుకుని కదిలించిన అనుభవాలు..కూడా రాయొచ్చు అనుకుంటా..
నిన్నటి నుండి ఇప్పటి వరకూ జరిగిని అనుభవాలు.. :
1. నా బండి కొని నాలుగేళ్ళు అయింది.. కాని ఎప్పటికప్పుడు బద్దకించకుండా సర్వీసింగు చేయిస్తూ వుండటం వలన బాగానే వుంటుంది.. కాని ఈమధ్య మైలేజ్ లో తేడావచ్చి ఏవిటీ విషయం అని ఆరాతీస్తే "సార్..క్లెచ్ ప్లేట్లు పోయాయి మార్చుకోవాలని" ఒక ప్రేవైట్ మెకానిక్ చెపితే.. అతనికన్నా షోరూం లో ఇస్తే బెటర్ అని చెప్పి నిన్న షోరూం లొ ఇచ్చా..


కట్ చేస్తే సాయంత్రం బండి తీసుకోడానికి వెళ్తే వాళ్ళు కిస్మస్ హడావుడిలో కేక్ కటింగులు ప్రార్ధనలు, కేరింతలు..వీటన్నిటినీ చూస్తూ ఓ గంట గడిచాక...నా బండి నాకు ఇచ్చారు.. ఈ గాప్ లో వాళ్ళు రిపైర్ చేసే విధానం అంతా ప్రత్యక్షంగా చూసి ఒకింత అనుభూతిని పొందాను.. 

ప్రెవేట్ మెకానిక్ అయితే ఇంత పర్ఫెక్ట్ గా చెయ్యడు కదా అని ఆనందభాష్పాలు రాల్చాను.. కాని వాడు బిల్లు కూడా ఇంత చెయ్యడు కదా అని ఎక్కడో మనసు మూలుగుతోంది.. మనసుని తొక్కిపెట్టి..బండిని తొక్కుకుంటూ ఇంటిని చేరుతూ.."ఆహా ఇంతమంచి బండిని సజెస్ట్ చేసిన రమేష్ మంచి మిత్రుడు కదా" అనుకుంటూ..ఇంటికి రాగానే ఒక మెసేజ్ పెట్టేసా.."మంచి బండి కొనిపెట్టేవ్..నాకు అన్నివిధాలా సౌకర్యంగా వుందీ.. ముందుగా పండగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని నాకు తెలిసిన ఇంగీష్ ముక్కల పాండిత్యం ఒలకబోసా... 

ఇప్పటి వరకూ రిప్లై రాలేదు.. నా మెసేజ్ అర్ధం అయిందో లేదో .. అసలు మెసేజ్లు  చూసుకునే అలవాటు ఉందో..లేదో.. చూసినా అది నెగటీవ్ గా అర్ధం అయ్యిందేమో... రోజూ ముఖముఖాలు చూసుకుంటాం కదా ఈ మెసేజ్ ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడక అనుకున్నాడేమో.. మనసు ఎంత ఉద్వేగ పడితే మాత్రం ఒక ఫోను కాల్ చెయ్యక పెద్ద ఫోజుగా మెసేజ్ చేసాం... ఇంత వరకు అవతలి వ్యక్తి నుండి జవాబు రాకపోతే ఏమనుకోవాలి.... మనసు పలురకాలుగా ఆలొచిస్తుంది.. అసలు మెసేజ్ ఇవ్వకుండా వుంటే..  గొడవే లేదు కదా...మయసభలో ఎన్.టీ.ఆర్ లాగ..డైలాగులు కొట్టుకున్నాను...

2. ఈరోజు కిస్మస్ నాకు సెలవే.. కాని మా మేడం గారికి సెలవు లేదు.. అందువలన మనమే ఈరోజు స్వయం పాకం చెయ్యాలని బయలు దేరాను.. కూర ముక్కలు తాలింపు పెట్టి కుక్కర్లోనే కదా అని కాస్త హైలో పెట్టి.. ఆహా కె.సీ.ఆర్ మంచి యాగం చేస్తున్నాడు కదా చూద్దాం..అనుకుని భక్తి టీ.వీలో యాగం ఒకపక్క... టాబ్ లో ఫేస్ బుక్ ఒకపక్క మార్చి మార్చి చూస్తున్నాను... 

పవిత్ర యాగం చూస్తూ ఫేస్ బుక్ చూస్తూ వుంటే దేవుడు ఊరుకోడు కదా.. కూర కాస్తా మాడు వాసన వస్తేనే గాని అయ్యగారికి తెలివి రాలేదు.. సరే కింద కాస్త మాడు...పైన ఉడికీ ఉడకనట్లు ఉన్న కూర వరైటీ గా వుంది కదా అని అలాగే దించేసాను... ఇలా ఏ ఆడదీ వంట చెయ్యలేదని నా ప్రగాఢ విశ్వాసం.. కాని ఇంటి ఆడది ఊరుకోదుగా... అందుకని పాపానికి ప్రాయశ్చింత్తంగా.. మన ఎజెండాలో లేక పోయినా సాంబార్  తయారు చెయ్యడం మొదలుపెట్టాను.. ఈసారి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి మనసు ఇక్కడే పెట్టి సిమ్ములో ఓ గంట సేపు ఉడికించా.. అద్భుతహ...  ఆనక అప్పడాలు వేయించా.... 
సరే మధ్య మధ్యలో యాగం చూస్తున్నా.. కే.సీ.ఆర్ వారి సతీమణి..చుట్టు మనవలు బొద్దుగా భలే వున్నారు అనిపించింది...తెలంగాణాలో రైతులందరి బిడ్డలు కూడా ఇలా ముద్దుగా బొద్దుగా వుండాలని.. ఆ విధంగా కె.సీ.ఆర్ గారు ముందుకు పోవాలని కోరుకున్నాను...  
కె.సీ.ఆర్ కుమార్తె కవిత గారు కూడా కనిపించారు.. ఆవిడ భర్త గారు అనుకుంటా పక్కన వున్నారు.. ఆహా ఏమి నాభాగ్యము బహుశా ఆయనే ఆవిడ భర్త గారు..లైఫ్ లో మొదటి సారి చుస్తున్నాను కదా అని కళ్ళు చెమర్చాయి... 

అసలు వారి మేనల్లుడు హరీష్ రావే ఈవిడ భర్త అని మొదట్లో అనుకునే వాణ్ణి.. పాపము సమించు గాక...తరువాత తెలిసింది.. మంచు వారి అసలు అల్లుడు ఎలాగ కనబడ్డో కె.సీ.ఆర్ గారి అసలు అల్లుడు కూడా ఎప్పుడూ సీన్లోకి రాడూ అని.. ఈ విషయంలొ సొనియా గారి అల్లుడే నయం.. ఎంచక్కా వార్తల్లో ప్రముఖుడయిపోయి...అత్త సీటుకే ఎసరుపెట్టేడు.. అబ్బా సవాలక్ష కారణాల్లో అదొకటి లెద్దురూ.... 

వేద ఘోష వినిపిస్తుందని ఎదురుచూసాను... కాని.చండి మాత సహస్ర నామావళి పారాయణాన్నే కొంతమంది ఆవులిస్తూ కొంత మంది కెమేరా వైపు చూసి నవ్వుతూ... కొంతమంది మౌనంగా పారాయణం చేస్తూ ఉంటే.,.ఆహా జన్మ ధన్యమయింది కదా అని మళ్ళీ కన్నీరు కార్చేను...

3. మా టీ.వీలొ సుమలత గారు ఫామిలీ కోర్టు నిర్వహిస్తున్నారు.. జడ్జీ.. న్యాయవాది...ఇలా అన్నిపాత్రలు పోషిస్తూ... ఎక్కువగా చదులేని పేద కుటుంబాల వారినే ఎంచుకుంటారనుకుంటా...ఇలాంటి షోల్లో.. ఎంచక్కా తెలంగాణా యాసలో వాళ్ళు మాట్లాడేది.. ఒక్కోసారి అర్ధం కాకపోయినా..వారి కళ్ళల్లో ఆవేదన అర్ధం అవుతుంది... 


ఈ రియాల్టీ షోల్లో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి కూర్చోబెడతారు.. వాళ్ళు మాసిపొయిన బట్టలతో జిడ్డోడుతూ వుంటే సుమలతా..జీవిత..జయసుధలు..ఫుల్ గా మేకప్ అయి నిగనిగ లాడుతూ వుంటారు.. మధ్యమధ్యలొ వీళ్లల్లో వీళ్ళు.. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ వుంటారు.. 
ఎక్కువ మంది ముసిలాళ్ళు చూసే ప్రోగ్రాం ఇది.. వాళ్ళ జీవితాలకు ఈ కథలను అనునయం చేసుకుంటూ మరింత కుంగిపొతారు..లేదా కొంతమంది ఆనందం పొందుతారు.. 

సరే.. ఈరోజు కధలోకి వెళ్తే.. ఆమెకి పదేళ్ళ వయసులో ప్రేమించి పెళ్లి చేసుకోవడం నలుగురు పిల్లలు పుట్టి చనిపోవడం...ప్రస్తుతం ఇరవై ఏళ్ళ వయసులో ఒక అనారోగ్య కూతురు..తాను టి.బీ జబ్బుతో బాధపడుతూ.. మొగుడు సరిగ్గా చూడటం లేదని ఫిర్యాదు..ఎవరితోనే అక్రమసంబంధం పెట్టుకున్నాడని అపవాదు.. ఎవరి గొడవ వాళ్ళది.. ఈ క్రమంలో ఆ అమ్మాయి ఏడుస్తూ వుంటే నాకు అప్రయత్నంగా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి...  పదేళ్లల్లో పెళ్ళి ఏవిటి..  గురజాడ ఏవైపోయావు తండ్రీ.. నీ రచనలు ఎవరికోసం.. బాల్య వివాహం ఈరోజుల్లో...అట్టేసేపు చూడలేక చానల్ మార్చాను..
ఎలావున్నాయి.. ఒకరోజు నా  అనుభవాలు...