Wednesday, January 27, 2016

నంది నాటకోత్సవాలలో మా ప్రదర్శన

కె.వి.మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేయన్, విశాఖపట్నం అను మా బృందం 'నంది నాటకోత్సవాలు-2015' లో 24/01/16 వ తేదీన మా సాంఘిక నాటకం "మీ వెంటే మేముంటాం" ప్రదర్శించాం..బాగా వచ్చింది..ప్రేక్షకుల ప్రశంసా పూర్వక హర్షధ్వానాల జల్లులో తడిసి ము
ద్దయ్యాం..కొద్ది నిముషాల్లో ఫలితాలు వస్తాయి..

Thursday, January 21, 2016

ఆ తియ్యని ద్రాక్ష పండు అందని మందభాగ్యులు ఎందరో..

"శంకరాభరణం"  సినిమాలో శంకరశాస్త్రి గారి ఇంటిలోకి అడుగు పెట్టినప్పుడు
ఆ ఇంట గుమ్మంతాకితే తుంబురనాదం వినిపిస్తుంది 
ఆ నాలుగు గోడల మధ్య ఎక్కడ  అడుగులు వేసినా సప్తస్వరాలు వినిపిస్తాయి...   
విశ్వ విద్యాలయాలు  అంటే అలా వుండేవి ఒకప్పుడు...
ఆంధ్రా విశ్వవిద్యాలయం...సర్వ శాస్త్రాల భూషితం..   
ఒకపక్క సముద్రపు హోరు..
ఆహ్లాదకరమైన వాతావరణం
మరొకపక్క ప్రకృతి రమణీయం...
వీటికి తోడు గంభీరమైన భవనాలు..
ఏ విభాగం చూసినా దేనికదే ప్రత్యేకం..
ఏ గడప చూసినా సరస్వతీ నిలయం..  

విశ్వవిద్యాలయం లో చదువుకోవాలి అనుకోవడం..
ఓ అందమైన కల... తాహతుకు మించిన కోరిక... 
ఉన్నత విద్యని అభ్యసిస్తున్న వారిపై ఈర్ష్య...
పుణ్యం కొద్దీ పురుషుడు.. దానం కొద్దీ బిడ్డలు..
నుదిటి రాత లేనిదే..మహోన్నత ఆశయం లేనిదే ...
తల్లితండ్రులకు బిడ్డను చదివించాలీ అన్న కోరిక లేనిదే...
యూనివర్శిటీ లో సీటు రాదు... పట్టభద్రుడయ్యే అవకాశం లేదు.. 

వీణావాణి చల్లని ప్రాంగణంలో .. భారతి పూదోటలో..
వటవృక్షాల నీడన.. రాలుతున్న పండుటాకుల నడుమ..
విద్యనభ్యసించే భాగ్యవంతులు కొందరే కదా... 

ఆ తియ్యని ద్రాక్ష పండు అందని మందభాగ్యులు ఎందరో..  
 
అట్టి విలువైన జీవితం ..స్వార్ధ రాజకీయాలకు బలెయ్యె నేడు...    

Saturday, January 16, 2016

ఒబామాని చూసి సిగ్గుపడాలి మనం...

నాకు ఏదైనా ప్రముఖ దేవాలయాలకి వెళ్ళినప్పుడు... రద్దీ ఎక్కువగా వుండి తోపులాటలో..కుమ్ములాటలో..దేవుని దర్శనం చేసుకోవడం ఇష్టం  ఉండదు.. అతి తక్కువ మంది వుండి కాస్త పదినిముషాలు గర్భాలయం లో గడపి వచ్చి... .. .... మూర్తిని కనులారా దర్శించుకుంటేనే గాని తృప్తి వుండదు....
ఈ కారణం వలననే ....
1.ఒకసారి తిరుపతికి నవంబరు నెలాఖర్లో వెళ్ళాం... చలి...తెల్లారుఝామున 4 గంటలకే క్యూలైన్లో నిలబడితే వందమందికి తక్కువగానే వున్నారు.. ఇది జరిగి 20 సంవత్సరాలు పైన అయ్యింది .. కాని ఇప్పటికీ ఆ రోజులు తలచుకుంటేనే తృప్తిగా వుంటుంది... రాత్రి 11 గంటలకు అస్సలు జనం లేరు.. మాకు నచ్చినంత సేపు ఆ మూర్తిని చూస్తూ  ఎంతో మనశ్శాంతిగా దర్శించుకున్నాం... 


ఈ కారణం వలననే...
2. భద్రాచలం కి దగ్గరగా నాలుగేళ్ళు వుద్యోగం చేసినా ఎప్పుడూ "శ్రీ సీతారామ కళ్యాణం" చూట్టానికి భద్రాచలం వెళ్ళలేదు... మిగిలిన రోజులలో ఉదయాన్నే సుప్రభాత వేళ గాని రాత్రి 7 గంటలు దాటేక గాని దర్శనానికి వెళ్ళి కనీసం ఓ అరగంట సేపు అయినా కనులారా దర్శించుకుని ఆనందించేవాణ్ణి..  మా ఊర్లో భయపెట్టేవారు..."కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు... హాయిగా ఇక్కడే మనగుళ్ళో కళ్యాణం చేసుకుందాం అని ఆ ఊర్లోనే ఉండిపోయేవాణ్ణి... కాని ఇప్పటికీ ఆ కోరిక అలాగే వుంది...ఒక్కసారైనా కళ్యణం రోజున భద్రాచలం వెళ్ళాలని.... చూద్దాం.... 


సరిగ్గా ఈ కారణం వలననే....
3.  ఊళ్ళో ఉండి కూడా మొన్న మార్గశిర మాసం లో ఒక్క రోజు కూడా "కనకమహా లక్ష్మి అమ్మవార్ని" దర్శించుకోలేదు... 

ఆ రద్దీకి జడిసి...తోపులాటకి భయపడి....పైరవీలు... వి.ఐ.పీల హడావుడి నచ్చక... పోలీసుల వీరంగం చూడలేక... క్యూలైన్లో వృధ్ధులు.. పసిపిల్లలు పడే ఇబ్బందులు కనలేక.... 

అందుకే ఈరోజు వెళ్ళాం...ఈ రోజు ఆదివారం...కనుమ..మాకు  తప్ప మిగిలిన వారికి "ముక్కల పండగ"...   ఎవరూ రారని తెలుసు... అందుకే వెళ్ళాం.. మేము వెళ్ళేసరికి మా ముందు పదిమంది మాత్రమే వున్నారు.... హాయిగా పూజంతా నిర్వహించుకుని మనసులో కోరికల చిట్టా విప్పేసి....తృప్తిగా వెనుదిరిగాం... "జరగండి...జరగండి" అని తోసేవాళ్ళు లేరు.... 


వచ్చే దారిలో చూసాం... ఆ "షాప్" ల ముందు జనం పెద్ద క్యూ కట్టేరు....  ఈరోజు గుడి ముందు ఖాళీ .... ఆ షాపుల ముందు బారులు తీరిన జనం... పొద్దుట్నుంచీ తోపులాట....కుమ్ములాట...
పిచ్చి జనం...

రోజూ తినేదానికి కూడా ఒకరోజు పేరు పెట్టుకోవడం...ఆ రోజే తప్పనిసరిగా తినేయాలని పాట్లు పడటం.... 
రోజూ దేవుణ్ణి దర్శించుకునే వీలున్నా ఒక రోజో ఒక మాసమో పెట్టుకుని కుమ్మేసుకోవడం.... 
మిగిలిన రోజుల్లో ఆ వైపు కన్నెత్తేనా చూడకపోవడం.... 

కార్తీక మాసంలో శివాలయాలకి .... మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి పోటెత్తడం... సంక్రాంతి పండగ ముందు మండలం రోజులు అయ్యప్ప...భవానీ మాలలు వెయ్యడం... మిగిలిన రోజుల్లో పానీయంలో మునిగి తేలడం... ఏ శాస్త్రం లో ఉందో తెలీదు....  


ఉత్తర ముఖద్వార దర్శనం కోసం తోపులాటలు... విశేష రోజుల్లో తొక్కిసలాటలు... వీటికి వి.ఐ.పీ పాసులు.. పైరవీలు....రాజకీయ నాయకులు...గవర్నర్లు...రాష్ట్రపతులు కూడా ఎగేసుకుని వచ్చి... సామాన్యులను ఇబ్బంది పెట్టడం.... 


పొరుగు రాష్ట్రం అయిన కేరళ.. మహారాష్ట్రలకు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి వెళ్ళే బదులు... 

మన ఊళ్ళొనే మన పక్కనే ఉన్న గుడికి వెళ్ళినా ఒక్కటే ఫలితం... 
మన డబ్బు అంతా కేరళ వాళ్ళకి, మహారాష్ట్ర వాళ్ళకి వేలకి వేలు పొస్తున్నాం...
వాళ్ళ చేత మనకి తెలియని  భాషలో తిట్టించుకుని మరీ వస్తున్నాం...
అయినా పర్వాలేదు... కాని సంవత్సరం లో మిగిలిన రోజుల్లో కూడా దైవ ధ్యానం లో ఉండి...చెడు అలవాట్లకు దూరంగా వున్నవాడే నిజమైన భక్తుడు అని నా ఉద్దేశ్యం...


ఒబామా జేబులో 24 గంటలు "హనుమంతుడి" బొమ్మ పెట్టుకుంటానని...అది సర్వకాల సర్వావ్యస్థలలో తనని కాపాడుతుందని విశ్వసిస్తున్నాని చెప్పాడు...  పరిపాలనా వ్యవహారలలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా మానసికంగా ఒత్తిళ్ళకి గురైనప్పుడల్లా హనుమంతుని స్మరించుకుని పునరుత్తేజం పొందుతానని సాక్షాత్తూ అమెరికా అద్యక్షుల వారే సెలవిచ్చారు... 
ఒబామా ను చూసి ఒక హిందువుడిగా గర్వపడాలి... కాని మనలో ఎంతమంది ఈ పని చేస్తున్నారో తలచుకుని సిగ్గుపడాలి.... 

కలం వుంది కదాని హిందూ దేవుళ్ళని.. పురాణాల్ని విమర్శించే మేధావులారా సిగ్గు పడండి...    

Friday, January 15, 2016

ఎవడ్రా కూసింది.."భారత దేశం పేద దేశం" అని..

ప్రపంచం లోకెల్లా అతి పెద్ద జొక్ ఏవిటంటే.. ప్రతీ ఏటా సంక్రాంతి పండగ నాడు "కోడి పందాలు నిషేదం" అంటూ సుప్రీం కోర్టు ఫర్మానా జారీ చెయ్యడం.. చట్టాన్ని కాపాడవలసిన గౌరవ ప్రజాప్రతినిధులు కోడిపందాల్లో పాల్గొనడం.. చట్టాల్ని పరిరక్షించవలసిన రక్షక భటులు ఉదాసీనత.. .
ఇదంతా ప్రింట్ మీడియాల్లో ఊదరగొట్టడం.. 
భలే తమాషాగా వుంటుంది... 
భారత దేశంలో చట్టాలకు ఎంత గౌరవం వుందో చక్కటి ఉదాహరణ... 
ఎం.పీలు..ఎం.ఎల్.ఏలు సుప్రీం అయినప్పుడు....

సుప్రీం కోర్టునే నిషేదిస్తే ఓ పని అయిపోతుంది కదా.. 
ఈ మాత్రం దానికి చట్టాలు... చట్ట సభలు... పోలీస్ స్టేషన్లు... ఎందుకు??

కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతూ వుంటే...

ఎవడ్రా కూసింది.."భారత దేశం పేద దేశం" అని.. 
జోక్ చెయ్యడానికి కూడా హద్దు ఉండాలి కదురా.... 

రెండ్రోజులనుండి ఒక్క సోగ్గాడి తోనే అన్ని చానళ్ళు పండగ చేస్తూ వుంటే.. ఇవాళ ఒక చానల్ లో ముగ్గురు సోగ్గాళ్ళు సందడి చేసారు... 

ఈ సోగ్గాళ్ళ "సోది" తప్ప పండగ పూటా మరే ప్రోగ్రాం దొరకలేదు వీళ్ళకి .. 

టీ.వీ ఆపివేసి ఇల్లాలి తో ముచ్చట్లు (కబుర్లు)- {ఈ వయసులో ఇంతకన్నా ఇంకేం వుంటాయిలెండి.} బెస్ట్ అనిపించి.. అలా కాలక్షేపం చేసాము....
నిన్న పాయాసం... ఇవాళ బూర్లు ..పులిహోర...స్పెషల్ ఐటెంస్ అయితే.. రేపు కనుమ నాడు గారెలు... 

ఎవరైనా మా  ఇంటికి వస్తే పెడతాము... రండోచ్చ్... 

పండగ పూట నాకో "తేడా మనిషి" పరిచయం అయ్యాడు... 

నా మూడ్ అంతా పాడు చేసాడు... 
చీ..చీ... తలచుకుంటేనే రోత పుడుతోంది... 
ఆద్యాత్మిక ధ్యాస లేక పోతే.. 
వృధ్యాప్యంలో కూడా మనిషి ప్రవర్తన.. ఆలోచనా సరళి..  ఎలా వుంటుందో కళ్లకి కట్టినట్టు చూపించాడు వెధవ...
వదిలేయండి....

కాని వాడు నా బుర్రలోంచి వెళ్లిపోవడానికి కనీసం  నాల్రోజులైనా పడుతుంది... 
పైకి పెద్దమనుష్యుల్లా గ కనిపించే వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తారా.. 
అని ఆశ్చర్యం..భయం... 
ఈ వెధవ సీరియళ్ళు జనాల్ని చాలా పాడు చేస్తున్నాయి...
మేనల్లూడు ఒకాయన వచ్చి అంటాడు... "మనసు విప్పి ఆప్యాయంగా మాట్లాడే మనిషే కరువయ్యారు.. కొంతమంది నవ్వుతూ పలకరించడానికి కూడా ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు.." అని బాధ పడ్డాడు....
బాబాయ్ ఒకాయన.. "మా చిన్నప్పుడు  బొబ్బిలిలో అయితే ఈ సంక్రాంతి పండగప్పుడు ఎంతో హడావుడి.. ఆడవాళ్ల పేరంటం సందడి వుండేది.. ఈ వీధి నుండి ఆ వీధివరకూ ముగ్గులు పెట్టేవారు"...  అంటూ ఇంకా చిన్నప్పటి రోజులు నెమరు వేసుకున్నాడు....


ముఖ్యంగా గ్రామాల్లో మా బ్రాహ్మల ఇండ్లన్నీ వరుసగా వుండి వీధిలో అన్ని ఇండ్లు ఒకే వంశం చుట్టాలవే అయివుండటం వలన...

వాళ్ళ పదార్ధాలు వీళ్ళు ......వీళ్ళ పదార్ధాలు వాళ్ళు పట్టుకెళ్ళి ఆనందంగా వండుకుని తినేవారు... ఇచ్చి పుచ్చుకునే వారు... 
ఇప్పుడు ఇళ్లన్నీ అమ్మేసుకున్నారు...  మారిన పరిస్థితులకు అనుకూలంగా పల్లెటూళ్ళు మారిపోయాయి... 
ఒకే ఇంటిలోని వారే ఎడముఖం పెడముఖంగా వుంటున్నాం.. 
అసలు మొగుడూ పెళ్ళామే ఒకరినొకరు మాట్లాడుకునే రోజులు పోయాయి.. ఇవీ నేటి సంక్రాంతి కబురులు....  

Thursday, January 14, 2016

కొత్త సంవత్సరంలో కొత్త లుక్ తో మీ ముందుకు

"రాత మారితే గీత మారుతుందని" అనే సామెత ఇక్కడ వర్తిస్తుందో లేదో గాని.... 
నేను మాత్రం నా బ్లాగు డిజైన్ మార్చాను... 
కొత్త సంవత్సరంలో కొత్త లుక్ తో మీ ముందుకు వచ్చాను..... 
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..  

Friday, January 8, 2016

మనలో "ఆత్మ" అనేది ఉంది.. ఖచ్చితంగా..

ఒకానొక ఇంటర్వూ లో కీ.శే.రంగనాధ్ గారు మాట్లాడుతూ..." ఆత్మలనేవి లేవు..అంతా ట్రాష్..." అంటూ ఇంకా ఏవో మాట్లాడారు.. అప్పుడు ఈ సబ్జెక్ట్ మీద పోస్టు రాద్దామనుకున్నాను..ఇప్పటికి తీరుబడి అయ్యింది...ఏవో నాకు తెలిసిన విషయాలు...
1. ఆత్మ అనేది వుండబట్టే...మనం ఏదైనా విషయం గురించి ఆలొచిస్తున్నప్పుడు ఏది చేస్తే బావుంటుంది అన్న విషయాన్ని అంతరంలో కొంత చర్చ జరుగుతుంది.. చివరకు ఫైనల్ గా లోపల అనుకున్న దానికి భిన్నంగా లేదా అనుకూలంగా ప్రవర్తిస్తాం.. బయట వ్యక్తులు ఎన్ని చెప్పినా మనం గట్టిగా అనుకున్న విషయానికే ప్రాధాన్యత ఇస్తాం.. ఒక్కోసారి అది ధర్మానికి విరుద్ధమై లోపల అంతరాత్మ హెచ్చరిస్తున్నా వినకుండా ముందుకి వెళ్తాం...
2. ఒకవేళ ధర్మానికి వ్యతిరేకమో..తప్పుడు నిర్ణయమో అయితే రాత్రి నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా ఆ నిర్ణయం లేదా ఆ సంఘటన రాత్రంతా తలపులోకి వస్తుంది...
3. తప్పు పనులు చేసే వారు దానిని సమర్ధించుకోవడానికి కారణాలను... గత చరిత్రలను.. ఇతరులను ఆదర్శంగా తీసుకుంటాడు..కాని అంతరాత్మ మాట వినడు.. ఇట్లా అంతరాత్మ మాట వినని వాళ్ళకి సుఖం తాత్కాలికం... వినేవారికి ఆనందం శాశ్వతం..  
4. నిద్రకి.. మెలవకువకి మధ్యలొ ఆత్మ యొక్క నిదర్శానాన్ని స్పష్టంగా చూడొచ్చు..
5. మనం నిద్ర పోయేటప్పుడు మనలో వున్న ఆత్మ షికారుకి వెళ్తుంది.. ఒక్కోసారి అది మనకు తెలుస్తుంది.. మరల శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తున్నప్పుడు చిన్న కుదుపులాంటిది వస్తుంది.....
6. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఏకాంతంగా వున్నప్పుడు మన ఆత్మ మాట మనకి వినిపిస్తుంది.. కాస్త మంద్ర స్థాయిలో వుంటుండి.. మన గొంతుకి భిన్నంగా వుంటుంది.. చిన్న మాట మాత్రమే వినిపిస్తుంది...   
7. ధ్యానం చేసుకునే వాళ్ళకు యోగ నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్లకు ఒకానొక ప్రశాంతత తో కూడిన అలౌకిక అనుభూతి కలుగుతుంది.. అది మాటల్లో వర్ణించలేము.. ఒక్కొక్కరోజు ఒక్కక్కలాగ వుంటుంది.. వాళ్ళకు ఈ ఆత్మానంద అనుభూతి ఖచ్చితంగా తెలుస్తుంది..
8. ఇలాంటి అనుభూతులు పొందాలంటే మంచి నడవడి కల్గివుండి...మంచి ఆహార నియమావళి వుండి...నిరంతర దైవ ధ్యానంలొ వుంటే తప్పనిసరిగా ఆత్మానుభవం కల్గుతుంది... అలాగని ముక్కు మూసుకు కూర్చోనక్కర్లేదు... ఏది ఎంత వరకు పొందాలో అంతవరకే వుండాలి...టి.వీ చూడొచ్చు..పేపర్ చదవచ్చు..
9.నూటికి తొంబై తొమ్మిది శాతం వరకు అబద్దం ఆడకుండా వుంటే... మన మనస్సు..బుధ్ధి నిర్మలంగా వున్నట్టే (ఒక్క శాతం అబద్దం కూడా సరదాకి మాత్రమే..ఆడాలి... సీరియస్ విషయాలలో కాదు),... నిర్మలమయిన మనస్సుని పరమాత్మకి అర్పించాలి..ప్రతినిత్యం... బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి.. ఆడంబరాలతో పూజలు చేయకపోయినా.. కష్టపడి ఏడు కోండలు ఎక్కకపోయినా..రోజూ నిర్మలమయిన.. పవిత్రమయిన మనస్సుతో దైవ ధ్యానం చేసుకుంటే చాలు...
10.మనం అర్పించవలసినది పవిత్ర ఆత్మని మాత్రమే.. చనిపోయే ముందు ఎటువంటి చెడు నడత లేని జీవితాన్ని.. నిర్మల మనసుని దేవునికి అర్పించాలి...  
11. ఈ అంతరాత్మ ప్రబోధమే లేకుంటే ఇంకా నేరాలు.. ఘోరాలు.. జరుగుతాయి...
12. అందువలన "ఆత్మ అంటూ లేదు.. అదంతా ట్రాష్" అనుకునేవాళ్ళకి అది తప్పుడు అభిప్రాయం అని చెప్పడానికే ఈ విషయాలు రాశాను..     

Friday, January 1, 2016

మద్యం మత్తులో..అర్ధరాత్రి చిందులతో...ఆహ్వానం పలికేరు.

కాలం తన పరుగులో 2016 మైలు రాయిని చేరింది.... .
గత కాలపు చిహ్నంగా 2015 కాల గర్భంలో కలిసిపోయింది.. ....


కొంత మంది నిద్ర మత్తులో.. మరికొంత మంది మద్యం మత్తులో..
నూతన వత్సరానికి ఆహ్వానం పలికేరు....అర్ధరాత్రి చిందులతో...


రోజూ ముఖం చిట్లించుకుని పక్కకు తప్పుకునే వాడు కూడా..
ఈరోజు ముఖం చాటంత చేసుకుని శుభాకాంక్షలు చెప్తాడు.. 


తెలుగు వత్సరాది తొలిరోజు పండగ "ఉగాది" ...
ఉషోదయాన కోయల కూత... లేలేత చిగురుల మావిడి పూత..
కుంకుడుకాయతో తలంటుట...నూతన వస్త్రధారణ ధరించుట..
ఇలవేలుపును పూజించుట.. ..షడ్రుచులను సేవించుట.. 


ఇది మన సంస్కృతి... ఇదే మన సంస్కృతి..