Tuesday, March 29, 2016

"చాలా గొప్ప వాడయ్యా బాబూ మీ నాన్న..."అంటూ వ్యంగ్యంగా

ఎల్.ఐ.సీ...అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా..
ఇందులో పాలసీ కట్టని వ్యక్తి వుండడేమో నేడు.. కానీ ఎల్.ఐ.సీ పెట్టిన కొత్తల్లొ ఆ సంస్థ గుమ్మం తొక్కడానికే భయపడే వారు ... ఎల్.ఐ.సీ ఏజెంటు వస్తే చాలు యమ భటుడు వచ్చినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు.. సదరు ఏజెంటును గుమ్మం తొక్కనిచ్చే వారు కాదు...
ఇవాళ టి.వీల్లో ప్రకటనలు ఇస్తున్నారు "మీ కుటుంబానికి మీరు ఇచ్చే గొప్ప ప్రేమ లేఖ మీ ఇన్సూరెన్స్ పాలసీ" అని...
ఆ రోజుల్లో అయితే ఎల్.ఐ.సీ ఏజెంట్లు ఎంతో  కష్టపడి..ఒక్కో పాలసీ యొక్క విశేషాలు.. అంటే కాల పరిమితి..ప్రీమియం చెల్లింపు..చివరాఖరున గానీ లేదా ఆ వ్యక్తి మధ్యలో చనిపోతే ఎంత ఇస్తారూ ఇవన్నీ సవివరంగా బోధపరిస్తే గాని పాలసీ తీసుకుందుకు ముందుకు వచ్చేవారు కాదు..
"ఏంటీ చచ్చి పోతే డబ్బులు ఇస్తారా?? ఎల్లెల్లవయ్యా..'శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండేది??' అన్నాట్ట నీలాటోడే" అని..   కొట్టినంత పనిచేసేవారు ఏజెంటుని...
అయితే కాలక్రమేణా... జీవిత భీమా చేయించుకున్న వాళ్ళకి ఈ సంస్ఠ ద్వారా అందుతున్న సేవలను గుర్తించి...
ఒక వ్యక్తి హటాత్తుగా చనిపోతే సదరు వ్యక్తి తాలూకా కుటుంబం రోడ్డుపాలు కాకుండా పాలసీ తాలూకా సొమ్ముని అందుకున్న ఇతర వ్యక్తులను చూసి.. అందరూ ఎల్.ఐ.సీ పట్ల ఆకర్షులు అయ్యారు..
మరొకటి ఏవిటంటే పాలసీ పట్టాలను ష్యూరిటీగా చూపించి హౌసింగ్ లోను సౌకర్యం కూడా ఎల్.ఐ.సీ వారు ఇవ్వడంతో ఎంతో మంది మధ్య తరగతి వారు సొంత ఇల్లు కట్టుకోవడానికో పిల్ల పెళ్ళికో ఎల్.ఐ,సీ లో పెట్టిన సొమ్ముని వాడుకుంటూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు... 


ఇలాటిదే ఆ రోజుల్లో జరిగిన ఒక నిజ సంఘటన మీ ముందుంచుతాను...
ఒక మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగికి పరిమితి కన్న ఎక్కువ సంతానం..ఒక రోజు ఎల్.ఐ.సీ ఏజెంటుని ఇంటికి పిలిచాడు..
సదరు ఏజెంటు ఎంతో ఉత్సాహంగా వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగి కదా ఒక పెద్ద పాలసీ అంటే తనకు లాభం వచ్చే పాలసీ చేయిద్దాం అనుకున్నాడు...
"చెప్పండి సార్..ఇదిగో ఈ తక్కువ కాలపరిమితి గల ప్లాను అయితే ఇలా ఉంటుంది.. లేదూ లాంగ్ టెర్మ్ అయితే మీరు రిటైర్ అయ్యేటప్పటికి ఇంత డబ్బు వస్తుంది" అని పెద్ద భ్యాగు నిండా కాగితాలతో ..రకరకాల పట్టికలు ఉన్న రంగు రంగుల కాగితాలు తీసి చూపిస్తున్నాడు .. కళ్ళనిండా ఆనందం.. పిలిచి పాలసీ చేస్తాను అన్నవాడు దొరికాడు కదా అన్న సంతోషం...
కానీ ఆ ఆనందాన్ని బ్రేక్ చేస్తూ "పాలసీ నాకు కాదయ్యా ... మా అబ్బాయికి" అన్నాడు ఆ మ.త.మనిషి. ..

ఒక్కసారి తన ముందు నేల మీద కూర్చున్న అబ్బాయిలందరి వేపు సాలోచనగా చూసాడు.. ఒకడికీ పదహారేళ్ళు దాటినట్టు కనబడలేదు.. "సార్ మైనారిటీ తీరని వాళ్ళకి పాలసీ కట్టాలంటే బోలెడు తతంగం ఉంటుంది ..అయినా చూస్తూ వుంటే ఇంకా పదవ పరీక్ష కూడా రాయని పిల్లలకెందుకు సార్.. మీరు చేసుకోండి..మంచి టర్మ్ ఉన్న పాలసీ చెప్తాను" అన్నాడు...
కానీ మ.త. మనిషి పట్టు వీడలేదు.. "చేసి తీరీఅల్సిందే ..అడుగో వాడికి.." మధ్యలొ ఉన్న ఒక పిల్లాడి వేపు వేలు చూపెట్టాడు.. తండ్రి తన వేపు వేలు పెట్టి చూపిస్తుంటే "అందరిలోకీ వాడే తెలివైన వాడు.. చురుకైన వాడు" అని తండ్రి ఆ వచ్చిన స్నేహితుడితో చెప్తున్నాడు గాబోలు అని ఆ పిల్లాడు మురిపోయి.. మళ్ళీ పుస్తకం వేపు బుర్ర తిప్పాడు.. మధ్యలో ఒక చెవి అటువైపు పడేసాడు...

అతగాడు ఏదో చెప్తున్నాడు.. ఇతగాడు బుర్ర అడ్డంగా ఊపుతున్నాడు.... ఇద్దరి వేపు ఆశ్చర్యంగా , అయోమయంగా చూస్తున్నాడు పిల్లవాడు.. వీళ్ళూ ఏదో మాట్లాడుకుంటున్నారు.. నా గురించే కానీ ఒక్క ముక్క అర్ధం కావట్లేదు... కాని నెలకింత అని జమ చెయ్యాలి అని అర్ధం అవుతోంది.. ఓహో నా చదువు కోసం ఏదో పొదుపు పథకం ఆలోచిస్తున్నాడు తండ్రి అని ఊహించాడు.. 'ఆహా నా మీద  మా నాన్నగారికి ఎంత శ్రధ్ధ.....ఇప్పట్నుంచే నా కొసం అదేదో బాంకులో డబ్బులు వేస్తున్నరన్నమాట'.. అనుకుంటూ చదువువుకుంటున్నాడు....

ఎల్.ఐ.సీ ఏజెంటు ఆ అబ్బాయిని దగ్గరగా పిలిచాడు... టేప్ పట్టుకుని చాతీ కొలిచాదు... ఎత్తు కొలిచాడు..చూచాయగా బరువెంతో రాసుకున్నాడు.... పుట్టిన తేదీ.. ప్రస్తుత వయసు రాసుకున్నాడు....
"సార్ ఒక పనిచేద్దాం.. అదీ మీరు తప్పదు అంటున్నారు కాబట్టి ఓ ఏడాదిన్నార ఆగి చేద్దాం.. అప్పటికి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి కాబట్టి మెడికల్ సర్టిఫికెట్లు అవీ ప్రొడ్యూస్ చెయ్యక్కరలేదు... అని చెప్పాదు...
"అలాగే" అని అయిష్టంగా ముఖం పెట్టాడు... "సార్.. మీ కోసం ఒక్క పాలాసీ కూడా తీసుకోరా?" అని అడిగితే తల అడ్డంగా తిప్పాడు...

అతను నిరాశగా వెళ్ళిపోయాడు.. కానీ వెళ్ళిపోతూ "చాలా గొప్పవారండీ బాబూ" అని గొణుకుంటు వెళ్ళిపోయాడు.... 
రోజులు గడుస్తున్నాయి.. ఈ లోగా ఆ అబ్బాయి తమ ఇంటికి వచ్చింది ఒక ఎల్.ఐ.సీ ఏజెంటు అని ఆయనకు తన పేరుమీద పాలసీ కట్టించమని తండ్రి చెప్పినట్టు గ్రహించాదు.. కాని మైనారిటీ కూడా తీరని నా మీద ఎందుకు ఎల్.ఐ.సీ పాలసీ తీసుకోవలనుకుంటున్నారో ఎంత ఆలోచించినా ఆ చిన్న బుర్ర కి తట్టలేదు...
పది క్షణాల కాలంలొ గిర్రున ఏదాదిన్నర పూర్తీయ్యింది...
సదరు ఏజెంటు తిరిగి  రావడము.. చక చకా కాగితాలు రాసుకోవడం..కొలతలు తీసుకోవడము.. పుట్టు మచ్చలు ఎక్కడున్నాయీ...వగైరా అన్నీ పూర్తి అయ్యాయి...
"సార్.. ఇంత పట్టుదలగా మీ అబ్బాయికి ఎల్.ఐ.సీ పాలసీ ఎందుకు తీసుకుంటున్నారు??" అని ధర్మ సందేహం అడిగాదు..పిల్లాడు కాస్త దూరంగా వున్నా ఒక చెవి ఇటు పడేసాడు.. అతని సందేహం కూడా తీరుతుంది కాబట్టి..

"ఫ్యునరల్ ఖర్చులకి!!!"..  నిర్మొహమాటంగా చెప్పాడు ఆ మ.త.మనిషి..
"ఒకవేళ వీడు చచ్చిపోతే దహన ఖర్చులెవడిస్తాడు... అందుకు చేయిస్తున్నాను.. ఇప్పుడు అర్ధం అయ్యిందా.. ఇక వెళ్ళు" అన్నాడు... నివ్వెర పోతూ నోరెళ్ళ బెట్టాడు ఏజెంట్ ..
పక్క గదిలో వున్న పిల్లాడికి గొంతుకలో ప్రాణం లేదు...నిశ్చేష్టగా ఆకాశం వైపు చూస్తున్నాడు ... తన పేరున ఎల్.ఐ.సీ పాలసీ తీస్తున్నాదు తండ్రి అంటే తన చదువుకోసమో ఉజ్వల భవిష్యత్తు కొసమో అనుక్కున్నాడు.. కానీ..చచ్చిపోతే బూడిద చెయ్యడానికి కట్టేల ఖర్చుకోసమట..తాను చచ్చిపోతే తన తండ్రికి పదివేల రూపాయలు వస్తాయంట.. దానికోసం నెలకి ఇరవై  రూపాయలు కడితే చాలంట... 
అసలు చావు అన్నది ఒకటి ఉంటుందని...దానితో జీవితం పరిసమాప్తం అయిపోతుందని.. అని తెలియని వయసు అతనిది..
భావి జీవితం కోసం ఎన్నో కలలు కంటున్నాడు... ఇంజనీరో.. కాలేజీ లెక్చరరో అవ్వాలని అతని కోరిక అప్పటికి.... కాని తను చనిపోతే ఏర్పడే ఖర్చులకి ఇప్పటినుండే జాగర్త పడుతున్న తండ్రిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి..
చేష్టలుడిగి చతికిల పడ్డ ఆ పిల్లాడి ని చూస్తు బయటకు వెళ్తున్న ఏజెంటు "చాలా గొప్ప వాడయ్యా బాబూ మీ నాన్న..."అంటూ వ్యంగ్యంగా చూసిన చూపు..ఆ పిల్లాడి లో పదిలంగా వుండిపోయింది... ఎల్.ఐ.సీ భవనం చూసినా.. పాలసీ కాగితాలు చూసినా ఆ సంఘటన గుర్తుకు వస్తునే వుంటుంది... ఇలాంటి  మధ్యతరగతి మానవులను ఎంతమందినో ఆదుకుంది ఎల్.ఐ.సీ... ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం,...     

Monday, March 14, 2016

నాట్యం..సంగీతం..సాహిత్యం..మేలు కలయిక ఈ కళారూపాలు.. అద్భుతం .. అపురూపం...

తెలుగు ప్రాచీన వైభవాలకు దర్పణాలైన "హరి కథ" మరియు "బుర్ర కథ" ప్రత్యేక శైలి కలిగిన కళా రూపాలు.. 
రెండిటింకీ మూల ప్రస్థానం కళల కాణాచి అయిన విజయనగరం అని చెప్పుకోవాలి... 


హరికథలకు ఆది గురువు..హరికథా పితామహుడు..శ్రీ.ఆదిభట్ల నారాయణదాసు అని పిలువబడిన శ్రీ సూర్యనారాయణ  గారు అయితే.. బుర్రకథలకు ఆది గురువు కుమ్మరి మాష్టారుగా పిలువబడే శ్రీ దార అప్పలనారాయణ గారు.. ఇద్దరూ విజయనగరం వాస్తవ్యులు అవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. 


విజయనగరం జిల్లా
అజ్జాడ గ్రామంలో జన్మించారు కాబట్టి అంతా శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారిగా ఇప్పటికీ హరికథా విద్వాంసులు ఆయనికి గురు పూజ చేయనిదే హరికథ మొదలు పెట్టరు.. 
అనేక హరికథలను ఆయన స్వయంగా రచించి లోకానికి అందించినారు.. అనేక వేల మంది హరికథ లనే జీవన మార్గంగా ఎంచుకుని నాలుగు రాళ్ళు సంపాదించుకునేలా చేసారని చెప్పవచ్చు.. 
ముఖ్యంగా ఈ హరికథా రూపాన్ని బ్రాహ్మణులు మాత్రమే చెప్పేవారు..
హరికథలో పద్యాలు రాగయుక్తంగా పాడటమే కాక సంధోర్భానుచితమైన చలోక్తులు కూడా విసిరి ప్రేక్షకులను రంజింప చేయాలి.. మా చిన్నతనంలో బుర్రా సుబ్రహ్మణ్యం గారు ఇంకా అనేక మంది పండితులు హరికథలను చెప్పేవారు.. 
స్త్రీలు కూడా హరికథా రంగంలో రాణీంచిన వాళ్ళు అనేకులు వున్నారు... 

మైకులు లేని ఆ రోజులలో ఆదిభట్ల నారాయణ గారి గంభీర గరళం తెలుగు పద్యాలను అలవోకగా పలికేది..  విజయనగరం రాజు గారు ఆనందగజపతి వారి ఆస్థాన విద్వాంసునిగా చేర్చుకుని గౌరవించారు..  అయిననూ ప్రజల మధ్యలోనే తప్ప రాజాస్థానంలో పద్యాలు పాడేవారు కాదు.. 
మైసూర్ మహారాజువారి మన్ననలను పొందారు.... బ్రిటీష్ పాలకులు నోబుల్ ప్రైజుకి నామినేట్ చేద్దామనుకున్నా శ్రీ నారాయణ గారు సున్నితంగా తిరస్కరించారట.. 

బుర్ర కథలను శ్రీ కుమ్మరి మాష్టారి కన్నా ముందు చాలామంది చెప్పినా.. కుమ్మరి మాష్టారితో బుర్ర కథ గొప్ప విశేష కీర్తిని ఆర్జించింది...

ఈయన  విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం కోడిదేవుపల్లిలో జన్మించాడు. 
కుమ్మరి మాష్టారి బుర్రకథకి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చేవారు... ఆయన నోట వెంట వచ్చే  ప్రతీ మాట చెవులు అప్పగించి వినేవారు... 
క్షణం తలతిప్పితే ఒక గొప్ప భావాన్ని మిస్ అయిపోతామేమో అని తల తిప్పకుండా చూసే వారు... 
కుమ్మరి మాష్టారు ఆకాశవాణి లోను... అనేక సినిమాలలో  తన  బుర్రకథా గానాన్ని వినిపించేరు.. అనేక బిరుదులను సన్మానాలను పొందేరు.. 
సువర్ణ కంకణాలు పొందేరు.. 

అప్పటి ముఖ్యమంత్రుల ప్రసంశలను పొందారు..ముఖ్యంగా "బొబ్బిలి యుద్ధం" బుర్ర కథ విన్న ప్రతీవారికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి... ఈయన శైలిని అనేక మంది బుర్ర కథ కళాకారులు అనుకరించి భుక్తిని పొందారు... 
ఒక వేనులో ఈ బుర్ర కథ బృందం ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శనలు ఇవ్వటం నేను ప్రత్యక్షంగా వీక్షించాను.. అది నా అదృష్టంగా భావిస్తున్నాను... వీరి కుటుంబ సభ్యులే  ఇతర పాత్రలను పోషించేవారు...

ఇప్పటి తరం వారికి బుర్రకథలు.. హరికథలు అక్కరలేదు..కాని  ఒకప్పుడు ఈ రెండు కళా రూపాలు తెలుగు వారిని ఒక ఊపు ఊపేశాయి... ఒక మామూలు మనిషిని మహాత్మునిగా ఎదిగేలా చేసాయి... 


నాట్యం..సంగీతం..సాహిత్యం ఈ మూడింటి  మేలు కలయిక ఈ రెండు కళారూపాలు..  అద్భుతం .. అపురూపం...


నైతిక విలువలు...మానవతా విలువలు... పెంపొందించి యువతను సక్రమ మార్గములో నడుచుకేలా చెయ్యటమే గాక పెద్దలకు ఆధ్యాత్మిక ధ్యానం కలిగేలా హరికథలు ఉంటే... చారిత్రక ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు చూపటమే కాక సమకాలీన సమస్యలపై శంఖారావం పూరించేవి బుర్రకథలు.. యువతను ఆలోచించేలా చేసేవి... 


విజయనగర వాసులుగా ఎంతో గర్వించదగ్గ కళారులు పుట్టిన గడ్డ లో పుట్టినందుకు యావత్తు తెలుగు జాతి అంతా ఈ కళాకారులకు ఎంతో ఋణపడి ఉంటారు..