Monday, May 23, 2016

ఓ "ఆత్మ" కథ...నారీ లోక వ్యధ..

 
ఎవరో గట్టిగా పిలుస్తున్నారు.. కాదు అరుస్తున్నారు...
కళ్ళు తెరవలేని పరిస్థితి..ఎక్కడ ఉన్నానో తెలియని అయోమయ స్థితి.. బలవంతంగా కనురెప్పలు విప్పాను...
ఎదురుగా ఆసుపత్రి సిబ్బంది..డాక్టర్లు.. పోలీసు వాళ్ళు.. కొందరి కళ్ళల్లో జాలి... కొందరిలో భయం..మరికొందరిలో సానుభూతి..వింతగా నావైపే చూస్తున్నారు..

అప్పుడు గుర్తుకు వచ్చింది నేను చేసిన పని...
 పిచ్చి ఆవేశంలో ఒళ్ళు తెలియని పూనకంతో..లీటరు కిరసనాయిలు...ఒక్క అగ్గిపుల్ల నా దేహాన్ని దహనం చేసింది..
ఎన్ని రోజులైందో తెలీదు.. కాని ఇప్పుడు ఇలా నా చుట్టూ ముఖాలు.. అనేక ప్రశ్నలు.."ఏమ్మా? ఎందుకిలా చేసావు? నీ మొగుడు నిన్నేమైనా అన్నాడా?" ఒక అట్ట మీద కాగితం పెన్నూ పట్టుకుని ఎస్సై కాబోలు అడుగుతున్నాడు...
"మొగుడు??" ఓహో ప్రస్తుతం అతగాడితోనే ఉంటున్నాను కాబట్టి అతగాడే నా మొగుడు కాబోలు...
ఒకపక్క బాధ ఆగని కన్నీళ్ళు... 

ఇరవై రెండేళ్ళ జీవితం ముగిసిపోతోంది.. మహా అయితే ఇంకొక్క ఇరవై రెండు క్షణాలు.. ఇంక ఈ కళ్ళు నన్ను వెంబడించవు...ఎవరి పిలుపూ వినిపించదు..
తాళి కట్టిన మొదటి భర్త కాళ్ళ పారాణి ఆరక ముందే పైలోకానికి పయనం అయిపోతే..కారుణ్య కోటాలో కంపెనీ వారు ఆసుపత్రిలో ఆయా ఉద్యోగం ఇచ్చారు..

ఒంటరిగా ఉంటున్న నన్ను శారీరకంగా వాడుకోవాలని ఎందరో ప్రయత్నిచారు.. అందులో తప్పు వాళ్లది కాదు..తప్పు నా శరీర అందానిదే...
పాలుగారే బుగ్గలు..బేల చూపులు ఏ మగాడికైనా సొంతం చేసుకోవాలనే ఆశ పుడుతుంది... 
ఎవరికీ లొంగని నేను..అతగాడికి లొంగాను...నా మనసు శరీరం అన్నీ అర్పించాను..లోకం అంతా నవ్వింది..అవహేళన చేసారు.. చెయ్యరూ మరి...అతగాడేమైనా మన్మధుడా.. అనాకారి..బక్కపలచని దేహం..జూదరి..తాగుబోతు..కారాకిల్లీ కొరికేసిన నల్లటి దంతాలు..రేగిపోయిన జుత్తు..మాసిన బట్టలు..రంభలాంటి సౌందర్యరాసి..తాగుబోతుకి పాదదాసి అయిపోయింది..
కాని అతగాడంటే నాకు వల్లమానిన అభిమానం...లోకం నవ్వినా సరే అతడు నా వాడు..నా మొగుడు.. అతని ద్వారా ఒక ఆడపిల్లను కూడా కన్నాను.. అందుకే అతడిని మార్చాలనుకున్నాను... మద్యాన్ని మానేయమని జూదానికి దూరంగా ఉండమని కోరాను.. బతిమాలాడాను.. బెదిరించాను..దేనికీ లొంగలేదు..
చుట్టుపక్కల వాళ్ళ అవహేళనలు ఎక్కువ అయ్యాయి.."ఆ తాగుబోతోడు నిన్నేం సుఖపెడతాడే..నాతో రా" అని వెంటపడే వాళ్ళు...వెకిలిగా నవ్వేవాళ్ళు... సంస్కార వంతులు "అయ్యో పాపం చివరికి నీ యవ్వనం వాడికి బలి అయిపోయిందా" అని జాలి చూపించే వాళ్ళు..

ఒకపక్క ఇంట్లో నెలవెచ్చాలు లేవు... చంటి దానికి పాల డబ్బాలు లేవు..

వాణ్ణి కట్టుకున్న పుణ్యానికి నాకు..నా కడుపున పుట్టిన పాపానికి దానికి ఒకటే కడుపు కోత...కళావిహీనం అయిపోయిన అందం...నిర్వీరం అయిపోయిన జీవితం..
ఆఖరు ప్రయత్నంగా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది మనసు.. ఒకచేత్తో కిరోసిన్ డబ్బా..మరోచేత్తో అగ్గిపెట్టె తో పరుగున జూదశాలకి వెళ్ళాను..అతగాదికి ఎదురుగా నిలబడ్డాను.. "నువ్వు పేకాట బంద్ చేస్తావా..;చచ్చిపొమ్మాన్నావా??".. సూటిగా అడిగాను.. "సచ్చిపోతే సచ్చిపోవే.."నిర్లక్షంగా సమాధానం.. 

అంతే ఇక ఆగలేదు..అంతులేని ఆవేశం..దుఖం..నిర్వేదం..భళ్ళున నా ఒంటిమీదకు వొంపుకుని సర్రున అగ్గిపుల్ల గీసాను... అంతే..భగభగ మంటూ అగ్గిరవ్వలు నన్ను కాల్చేసాయి..స్పృహ కోల్పోయాను.. 
ఇప్పుడు ఇలా జీవచ్చవంలా మిగిలి..ఆత్మానుభూతి పొందుతున్నాను..
"ఏమ్మా.. మీ ఆయన పెట్టిన బాధల వల్లే..నువ్వు ఆత్మహత్యకి పాలుపడ్డావా??" నా నోటివెంట వచ్చే ప్రతీ అక్షరం రాసుకోవడానికి సిధ్ధపడుతున్నాదు ఎస్సై..
కాని స్థిరంగా చెప్పాను.. "లేదు.. నా ఆత్మహత్యకు కారణం అతగాడు కాదు.. పూర్తిగా నాదే.. అతగాడు నా మొగుడే కాదు.. అతనికీ దీనికీ సంబంధం లేదు.." ప్రశాంతంగా చెప్పాను..రాసుకున్నాడు ... 

కళ్ళు మూతలు పడ్డాయి.. చీకటి కమ్మేసింది... నా ఆయువు అనంతంలో కలిసిపోయింది...
ఒక్క సారి దిగ్గున లేచికూర్చున్నాదు శంకరం..నిన్న జరిగిన సంఘటన తల్చుకుని పడుకున్నాడేమో అక్క లాంటి ఆయా తన కథని చెబుతున్నట్టుగా కలవచ్చి కలత చెందిన మనస్సుతో ఇలా ఎందరి ఆడపిల్లల జీవితాలు బలీయ్యాయో ఈ దేశంలో అనుకుంటూ తిరిగి పడుక్కోవడానికి ప్రయత్నించాదు..

Sunday, May 22, 2016

ఖాన్ హోటల్లో పూరీలు తినే అదృష్టం ఉంటే రేపు తెల్లారే వరకూ ఈ ప్రాణం....

"ఖాన్"..నా జ్ఞాపకాల దొంతరలలో ఒక ప్రగాఢ ముద్రికను పెనవేసుకున్న బంధం...
సుమారు ముప్ఫై సంవత్సరాలు దొర్లిపోయాయి...
మణుగూరు లోని ప్రకాశవన కాలనీ.. 

నల్ల బంగారం సింగరేణి కార్మికుల గృహ సముదాయాల కాలనీ...
దట్టమైన అటవీ ప్రాంతం.. ఒంటరి జీవితం...రేపటి రోజు గురించి చింత లేకుండా .ఈ రోజుకిలా గడిచిస్తే చాలు అనుకుని....హాయిగా గడిపే యవ్వనం.. 


నిన్నటి రోజున తిన్నది మ(ము)రుగున పడిపోయి లేవంగనే గడబిడ చేసే ఆకలి....అల్పాహారం పడితేగాని చల్లారని జీవుడు..


వెలుగు రేఖలు సంపూర్ణంగా పరుచుకోక ముందే కార్యాలయంలో అడుగుపెట్టే పాదద్వయం..అటుంచి అటే అడుగులు వేసేది..ఖాన్ భాయ్ హోటల్ కి....


ఆ అడవిలో ఊరి సెంటర్ అనబడే రాస్తా లో ఒక పూరిపాక..
మట్టి పొయ్యలు..రాతి పలకల గట్లు..చుట్టు కొయ్య దిమ్మల బల్లలు..
ఇదీ ఖాన్ హోటల్..అయితేనేం పొద్దుటే వేడి వేడి ఇడ్లీలు.. పూరీలు.. దానికోసం ఎగబడే కార్మిక జనం.. 

సివిల్ ..ఎలక్ట్రికల్ కార్మికులు..కూలీలు..చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వ్యాపారస్తులు..మా ఆసుపత్రి సిబ్బంది....'ఖాన్..జర ఇడ్లీ దే భాయ్' ' అనొకడు...'ఖానన్నా..ఇంకో రెండు పూరీ ఎయ్యరాదె'. అని మరొకడు...'చట్నీ ఇంకా కావాలి' అని పేచేపెట్టే వాడు మరొకడు.. 

అక్కడ కొబ్బరి చట్నీ ఉండదు..బొంబాయి చట్నీ అనబడే జావలాంటి పాదార్ధాన్నే చట్నీగా భావించాలి..
కాని పూరీలు అద్భుతంగా వుండేవి.. అసలా పూరీల కోసమే ఎగబడే వాళ్ళు...ఉల్లిపాయలు..బంగాళా దుంపలు ఉన్నాయి అనుకుని మనసులో భావించుకుంటే ఆ కూర చాలా రుచికరంగా తోస్తుంది...
ప్లేటు పూరీ రెండు రూపాయలు...


తదనంతరకాలంలో కంపెనీ వారు కట్టించిన షాపింగు మాల్ లోకి ఖాన్ భాయ్ హోటల్ మారింది.. బల్లలు కుర్చీలు..పైన సీలింగు ఫ్యాను... వచ్చి చేరాయి..
కాని క్వాలిటీ ని మార్చలేము కదా... ఒక్కొక్క సారి వంట చేసుకోవడానికి బద్ధకించినప్పుడు భోజనము (?) చేసేవాణ్ణి.. ఎంత ?? ప్లేటు ఐదు రూపాయలు..

ఉడికీ ఉడకని పప్పు..నీరునీరుగా ఉన్న అన్నంలో కాసిన్ని బెడ్డలు...పులుసులాంటి ద్రవ పదార్ధం..కుసింత పెరుగు వేసేవాడు...
అన్నం పరబ్రహ్మ స్వరూపం..అని నోరుమూసుకుని తినేవాణ్ణి..ఎలా వుంది సారూ?? అని అడిగితే.ఒక నవ్వు నవ్వి ఊరుకునే వాణ్ణి,..
ఈ అడవిలో అంతకన్నా గతిలేదు...పైగా అరువుగా కూడా పెట్టేవాడు.. ఆ క్షణాన్న అతడు దేవుడితో సమానం.. 


ఒక రోజున విజయవాడ నుంచి కొత్తగా చేరిన కుర్ర మాష్టారు భోజనానికి కూర్చున్నాడు..పైన వర్ణించిన విధంగా వడ్డించిన పదార్ధాలను తినలేక కోపంతో అలిగి భోజనం ప్లేటులో చెయ్య కడుక్కుని లేచిపోయాడు..
పాపం ఖాన్ చిన్నబుచ్చుకున్నాడు...బతిమాలుకున్నాడు....
సారూ..ఈ అడవిలో ఇంతకన్న బాగా చెయ్యలేము సార్..
అని వేడుకున్నాడు.. అయినా ఆ అబ్బాయి వినకుండా వెళ్ళిపోయాడు.. మౌనంగా తింటున్న నా వేపు అదోలా చూస్తూ...

ఖాన్ నావేపు తిరిగి.. "సారూ...మీరు ఎప్పటినుండో తింటున్నారు.. అయినా ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాట అనలేదు...మీకు ఉన్న ఓపిక ఎవరికీ ఉండదు"..అని చేతులెత్తి దండం పెట్టాడు.......
కాని నేను కూడా ఖాన్ భోజం నచ్చకే కష్టపడి వంట చేసుకుని తినేవాణ్ణి..
'కష్టపడి' అని ఎందుకురాసానంటే.. అప్పుడు గాసు పొయ్యలేదు..రెండు గంటలు కుస్తీ పదితే గాని మండని రాక్షసి బొగ్గుల కుంపటి మీద వంట చేసుకొనే వాణ్ణి..
ఇంతకీ ఈ కథ ఎందుకు రాసానంటే ..
అప్పుడప్పుడు ప్రస్తుతం ఈ లోకంలో లేని ఖాన్ భాయ్ గుర్తుకు వస్తున్నాడు.. దూరంగా విసిరేసినట్టు ఉన్న క్వార్టర్లో..చలికి గజగజా వణుకుతూ రెండుమూడు దుప్పట్లను ముఖం మీదికి లాగుకొని నిద్రించు సమయాన "దేవుడా నేను ఈ చలికి ప్రాణం విడిస్తే నా కోసం రాలేనంత దూరంలో ఉన్న నా తల్లితండ్రులు వస్తారో రారో తెలీదు కాని... 
ఖాన్ హోటల్లో పూరీలు తినే అదృష్టం ఉంటే రేపు తెల్లారే వరకూ ఈ ప్రాణం ఉంచు తండ్రీ" అని దండం పెట్టుకుని పడుకునే వాణ్ణి...