Wednesday, July 13, 2016

వన్ ప్లస్ వన్ - దిమ్మతిరిగే ఆఫర్లు...

అదో పెద్ద బంగ్లా...కాలింగ్ బెల్ మోగింది..
తలుపు తెరుకుచుని ఓ ఆసామి బైటకొచ్చాడు..


"సార్..వన్...ప్లస్ ఒన్ ఆఫర్ సార్..మా దగ్గర ఓ ఫ్లాట్ కొంటే మరో ఫ్లాట్ ఉచితం సార్" వివరించాదు సేల్స్ మేన్...


"అయ్య గోరు నేరు..నేను ఈ ఇంటి వాచ్ మేన్..ని" అన్నాడు.. ఆసామి.. 


"మీ అయ్యగోరు ఎక్కడికి వెళ్ళేరు?".. 


"వన్ ప్లస్ వన్ ఆఫర్ కే వెళ్ళేరు...సింగపూర్ ట్రిప్ కి మలేషియా ట్రిప్ ఫ్రీ అంట"...    


"మరి మీ అమ్మ గారు ఎక్కడికి వెళ్ళేరు?".. 


"వన్ ప్లస్ వన్ ఆఫర్ కే వెళ్ళేరు...ఒక చీర కొంటే మరో చీర ఫ్రీ అంట"..


"మరి పిల్లలు"...


"ఆ. ఆళ్ళూ వన్ ప్లస్ వన్ ఆఫర్ కే వెళ్ళేరు"...


"అబ్బాయేమో ఒక మందు బాటిల్ కొంటే మరో మందు బాటిల్ ఫ్రీ అంట అక్కడికి"...


"అమ్మాయేమో ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్తే మరో బాయ్ ఫ్రెండ్ ఫ్రీ అట..అక్కడికి ఎల్లినారు"....  


"అబ్బో ..మరి నీకేం వన్ ప్లస్ వన్ ఆఫర్ లేదా??"..


"ఎందుకు  లేదూ..ఇనాగ అందరూ ఎల్లిపోతే..ఈ ఇంటిని కాపలా కాసిన నాకు.. అయ్యగోరు బెడ్రూం తో బాటు పనిమనిషి ఫ్రీ"..


దిమ్మతిరిగిన సేల్స్ మేన్ కిందపడి గిల గిలా కొట్టుకుంటున్నాడు...   

Tuesday, July 12, 2016

ఆ ఒక్కణ్ణి చూసి వందమంది నవ్వుకుంటున్నారు...

ఒకప్పుడు వందమందిలో ఒక్కడు తాగేవాడు....ఆ ఒక్కణ్ణీ చూసి వందమంది అసహ్యించుకునే వాళ్ళు....
కానీ నేడు...ఒక్కడు తప్ప వందమంది తాగుతున్నారు.. ఆ ఒక్కణ్ణి చూసి వందమంది నవ్వుకుంటున్నారు... 


ఒకప్పుడు మగాళ్ళు మాత్రమే తాగేవాళ్ళు..తాగుబోతు మొగుడి చేతిలో పెళ్ళాలు తన్నులు తినేవారు..
కానీ నేడు...ఆడాళ్ళూ తాగుతున్నారు...తాగుబోతు పెళ్ళాంతో కామ్ గా కాపురాలు చేస్తున్నారు మగాళ్ళు... 


ఒకప్పుడు తండ్రులు మాత్రమే తాగేవోళ్ళు... తాగుబోతు తండ్రికి పిల్లలు భయపడే వారు...
కాని..నేడు...తండ్రులే పిల్లల జల్సాలకి..మందు పార్టీలకు డబ్బిస్తున్నారు... బలాదూర్ తిరగడానికి కార్లిస్తున్నారు.. 


తాగిన మైకంలో మైనారిటీ తీరని మద ముచ్చులు చేసిన మారణకాండకి ఏడ్చేదెవడు...ఆదుకునేవాడెవడు...
అర్రులు జాపి నోట్ల కట్టల కోసం నోర్లు బార్లా తెరిచే చట్ట, న్యాయ, రాజకీయ గద్దలు సిద్ధంగా ఉన్నాయి...

Saturday, July 9, 2016

కర్రి రత్తమ్మ - జీతం లేని పోలీసు ...ఇప్పుడు నేను రాస్తున్న కథ పూర్తిగా నా ఊహాజనితమే... ఎవరినీ ఉద్దేశ్యించి రాసినది కాదు అని మనవి....
"కర్రి రత్తమ్మ" అంటే ఆ ఊర్లో అందరికీ హడల్... మనిషి కారు నలుపు..సివంగి లాంటి రూపం..చింపిరి జుత్తు..చేతిలో ఓ పొడవట్టి కర్ర...
ఊర్లో వాళ్ళ పశువులను మేతకి తీసుకెల్తుంది... పశువులతో బాటే కాయో..పండో తింటుంది...తల్లి తండ్రులు లేని అనాధ..


పొద్దుగూకేక రాంకోవెల్లో తలదాచుకుంటుంది..అలికిడి అయితే చాలు "ఒరేయ్ ఎవర్రా అది" అని కర్ర పట్టుకుని అదిలిస్తుంది..
పంతులుగారు ఇచ్చే ప్రసాదం ఒక్కటే తింటుంది..
ఇంకెవరు ఏవిచ్చినా పుచ్చుకోదు..
అల్లరి చేసే పిల్లకాయలకు "అదిగో రత్తమ్మ వస్తోంది.." అంటే చాలు టక్కున సైలెంట్ అయిపోతారు...
పోకిరీ పనులు చేసే కుర్ర నాయాళ్ళు అల్లంత దూరంలో రత్తమ్మని చూడగానే పక్క వీధిలోకి జారుకుంటారు...
పెద్దమనుషులు ఏదైనా అడ్డగోలు తీర్పు ఇస్తే చడా మడా కడిగి పారేస్తుంది...
దీని నోరుకి, కర్ర బలానికి జడిసి చెడ్డ పనులు చెయ్యాలంటేనే ఆ వూర్లో వాళ్ళు జడిసిపోతారు... 


అలాంటిది... ఓసారి ఆ ఊర్లో ఇప్పుడిప్పుడే మూతిమీదకి మీసాలు వస్తున్న కుర్రకారు ఓ నలుగులు ఊరి చివర పాడుపడ్డ నూతి గట్టుపై కూర్చుని ఆ తోవంట పోయే పడుచు పిల్లలతో ఎకసెక్కాలు ఆడుతున్నారు...
ఇంతలో పొన్నూరు కొత్త పిల్లెవరో ఒంటరిగా వెళుతూ వీళ్ళ కంట బడింది...
అంతే నలుగురూ చుట్టుముట్టారు...
అనేకరకాలుగా కామెంట్లు చేస్తూ గుండ్రంగా చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు...
ఆ పిల్ల భయపడుతున్న కొద్దీ రెచ్చిపోయి మీద మీద పడి..చెంపల మీద, పిర్రల మీద చేత్తో తాకుతూ వినోదిస్తున్నారు...
పెద్దోళ్ళ పిల్లలమనే గర్వంతో మమ్మల్ని ఎవరూ ఏవీ చెయ్యలేరు అన్న ధీమాతో ఇంకాసేపు ఉంటే ఏమైనా చేసేలా ఉన్నారు.. 


ఇంతలో... "ఒరేయ్..ఎవర్రా అది.." అని ఒక పెద్ద కేక వినబడింది..
"అమ్మో కర్రి రత్తమ్మ" అంటూ పరుగు లంకించుకున్నారు నలుగురూ....
కానీ సూర్యం గాడు అదుపుతప్పి పాడు పడ్డ నూతిలోకి జారిపోయాడు...
నూతిలో నీళ్ళు అయితే లేవుగానీ లోతెక్కువ...పైకి వద్దామన్నా గోడలకి పట్టు లేదు..
కర్రి రత్తమ్మ వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసి ఆ పిల్ల వెళ్ళిపోయింది...
సూర్యం గాడు అరుస్తూ తన స్నేహితులని పిలుస్తున్నాడు... ఎవరూ లేరు...
వాడి కేకలకి కర్రి రత్తమ్మ నూతి దగ్గరకి వచ్చి తొంగి చూసింది...
నూతిలోంచి బయటకు వచ్చే మార్గం తెలీక గిల గిల కొట్టుకుంటున్న సూర్యాన్ని చూసింది...
వెంటనే చీర విప్పింది .తాడులాగ ముడతలు పెట్టి సూర్యానికి అందించింది...ఆ చీర కొస పట్టుకుని మెల్లిగా బయటకు వచ్చాడు సూరిగాడు అనబడే సూర్యం..పెద్దింటి పిల్లోడు...రత్తమ్మ అనబడే పోరంబోకు (ఎవరికీ అక్కరలేని) అనాధ అనాకారి పిల్ల చేతిని అందించింది...

బలమైన ఆ చేతినందుకుని బయటపడ్డాడు.. ఆమెను కౌగిలించుకుని భోరుమని ఏడ్చాడు.. ఏ ఆచ్చాధనా లేని ఆమె వక్షద్వయం వాడికి వికారాన్ని కలిగించలేదు..అమ్మతనానికి నిదర్శనంగా గోచరించాయి...  
"రత్తమ్మా..." అంటూ కాళ్ళపై పడ్డాడు... ఇవేవీ పట్టించుకోని నల్ల బంగారం తిరిగి చీరను వంటిపై చుట్టుకుని కర్ర నేలకి తాకించుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయింది....
అదో పల్లెటూరు ...రత్తమ్మ లాంటి జీతం లేని పోలీసులు కాపలా ఉంటారు ఊరికి.. కానీ నేడు మహా పట్టణాల్లో నిత్యం ఏదో ఒక చోట మానభంగాలు..హత్యలు జరుగుతూనే వున్నాయి... కౄర మృగం లాంటి రాక్షసుల అకృత్యాలకి ఎంతో మంది స్త్రీలు బలి అయిపోతున్నారు..... 

దీనికి పరిష్కారం పాలకులే చెప్పాలి....ఏవంటారు???