Wednesday, November 30, 2016

కాసు బంగారం కొన్నా...లెక్క చెప్పాల్సి వస్తుందని..

శ్రీదేవి: ఏవిటి నాధా..ఆందోళనగా ఉన్నారు??

స్వామి: దేవీ..కొంతమంది భక్తులు నల్లధనం తీసుకొచ్చి హుండీలో వేస్తున్నారు... అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముని పెద్దనోట్ల రద్దుతో ఆ పాపపుసొమ్ముని హుండీల్లో వేసి చేతులు దులిపేసుకుంటున్నారు...

శ్రీదేవి:  (గుడి) పాలకులు నల్లకుబేరులకు నేరుగా దర్శనం కల్పించి సామాన్యభక్తులను ఇక్కట్లపాలు చెయ్యడం సాధారణమే కదా స్వామీ..మీరు కుబేరులకే దేవుడు కాని పేదలకు కాదని కమిటీ వారు fix అయిపోయారు...

స్వామి: మరే...అన్నమయ్య పాడిన కీర్తనలను మరిచారు వీళ్ళు...

శ్రీదేవి: పెద్దనోట్ల రద్దుతో అన్నపానీయాలే మర్చిపోయారు..ఇక అన్నమయ ఎక్కడ గుర్తుంటాడు??

స్వామి: మరి ఏవిటి సాధనం??

శ్రీదేవి: సర్లెండి..రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు... పెద్దనోట్ల రద్దు తరువాత బంగారం మీద పడతారని భయంతో ఈ శ్రావణమాసంలో ఆడవాళ్లు బంగారం కొనడం మానేసి కూచున్నారు..కాసు బంగారం కొన్నా లెక్క చెప్పాల్సి వస్తుందని నా చిట్టితల్లులు తల్లడిల్లి పోతున్నారు...వీటికి పరిష్కారం మీరే చెప్పాలి...

(పవళింపు సేవ తరువాత కాంతతో ఏకాంతంగా అరగంట మాత్రమే విశ్రాంతి దొరికిన స్వామి గంట శబ్ధం వినగానే శిలారూపమై నల్లదొరల దర్శనానికి తిరుమల వెళ్లగా..ఉస్సూరుమంటూ మంగాపురంలో తాయారమ్మ నల్లదొరసానులకు స్వాగతం పలికింది..)

నీతి: కుబేరులు మాత్రమే నిజభక్తులని తెలుసుకోండి..పాలకులు, పాలకమండలి వారు తీసుకున్న నిర్ణయాలు కుబేరులు లబ్ధిపొందడానికే..సామాన్యులకు మేలు చేస్తాయనుకోవడం మాయ..విష్ణుమాయ...

Friday, November 25, 2016

వాడు కాదు వీడు..వాడమ్మ మొగుడొచ్చినా ఒకటే మాట‌‌...

రవి అస్తమించని తెల్లదొరల పాలన పోయినా....
ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలెన్నొచ్చినా..

వాడు కాదు వీడు..వీడు కాదు వాడమ్మ మొగుడొచ్చినా ఒకటే మాట‌‌...

1. పేదల అభ్యున్నతికే అహర్నిశలూ పాటు పడతాం.. ఇండియా లో పూర్తిగా పేదరికాన్ని పోగొడతాం...
2. అవినీతి పరుల భరతం పడతాం...
3.కుల మత వైషమ్యాలు లేని లౌకికరాజ్యం ఏర్పాటుచేస్తాం...
4. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తాం..
    పూలే, అంబేద్కర్ ఆశయాల్ని నెరవేరుస్తాం..
5. ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పిస్తాం..
6.స్త్రీలకు రక్షణ కల్పిస్తాం..
7. పాక్ కి బుద్ధి చెప్తాం..
ఎప్పుడు చూడు అనే మాటలు...అనే హామీలు..కొత్త డైలాగులు రాయరా???

కూల్ బాబూ...కూల్

ఎన్నేళ్లయినా ఆ హామీలే నాయకులకు శ్రీరామరక్ష...

ఆ హామీలన్నీ ఎప్పటికీ తాజాగా ఉండాలంటే...
1. పేదవాళ్లు ఉండాలి..
2. అవినీతి పరులు వర్ధిల్లాలి..
3.కులమత వైషమ్యాలు రెచ్చగొట్టాలి..
4. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి...కుల వర్గాల మధ్య పోరుండాలి..
5. ముస్లిం లు జనాభా పెరిగినా మైనార్టీలనే అనాలి..
6. స్త్రీలపై అత్యాచారులు పెరగాలి..
7.  నిత్యం కాశ్మీరు రక్తమోడేలా చెయ్యాలి..మనకి నచ్చినపుడు యుద్ధం రావాలి..అక్కర్లేనపుడు ఆపేయాలి...

ఇది రాజనీతి నాయనా...మరో వందేళ్లయినా మారని దమన నీతి...

కాని మారనిదొకటే..
కరెన్సీ నోటుపై ఒక నిస్సహాయకుని చిరునవ్వు..బోసి నవ్వు..

ఆర్ధిక నేరస్థులకి శిక్షలు వేసిన రారాజు

ఒకానొక రాజ్యం లో పరమోత్తములైన పాలనాధ్యక్షుల వారి సమక్షాన పరమ విధేయులైన కోశాధీసుల వారు రాజ్యం లో కెల్లా అత్యంత ఆర్ధిక నేరాలకి పాల్పడిన నేరస్థులను ప్రవేశపెట్టారు..

1. ఈ ముద్దాయి నెలవారీ వెచ్చాలకోసం తన భర్త ఇస్తున్న డబ్బులో కొంతభాగము మిగుల్చుకొని పోపులడబ్బాలో తన భర్త కు తెలియకుండా దాచినది..
దీన్ని తీవ్రమైన ఆర్ధిక నేరంగా పరిగణించి..ఇకమీదట ఆడవాళ్ళకి పోపులపెట్టి రద్దు చేసి....ప్రస్తుత పోపులపెట్టెలన్నీ ఈ నెలాఖరులోగా రాజ్యానికి అప్పచెప్పవలసిందిగా ప్రకటించడమైనది..

2.ఈ ముద్దాయి తన కున్న 2 ఎకరాల పొలం తాకట్టుపెట్టి లక్ష రూపాయల ఋణం చేసి వచ్చేనెలలో తన పిల్ల పెళ్ళి కోసం బ్యాంకులో వేసుకున్నాడు..
నిజనిర్ధారణ కమిటీ వేసి..జమాఖర్చులు బేరీజు వేసి కమిటీ వారు సూచించిన మేరకే వారి డబ్బు ఇచ్చి మిగిలిన సొమ్మంతా రాజ్యం లో కలిపేసుకోవలసింగా ఆజ్ఞాపించడమైనది...

3. ఈ ఉద్యోగి పన్ను ఎగవేయుటకు పి.ఎఫ్ ఖాతాలో పొదుపు చేయడం... ఋణాలు తీసుకుని ఇండ్లు కట్టుకోవడం వంటి నేరాలు చేస్తున్నాడు...
ఉద్యోగులకు పి.ఎఫ్ లు, బోనస్సులు, బ్యాంకు ఋణాలు, పండగ అడ్వాన్సులు...మొత్తం రద్దు చేసి గోళ్ళూడగొట్టాలి..

4. ఇక తోపుడుబళ్ళ వాళ్ళు, రోజుకూలీలు లెక్కలేనంత ఆర్ధిక నేరాలు చేస్తున్నారు...వీళ్ళకసలు బ్యాంకు అకౌంట్లు గానీ...ఏ.టి.ఎమ్ కార్డులు గాని లేవు..జమాఖర్చుల అకౌంటు లేదు..
అందుకే వీళ్ళకి  ఓ పది రోజులపాటు చిల్లర ‌ నోట్లు అందుబాటులేకుండా చేస్తే చస్తారు..దరిద్రం వదిలిపోద్ది...

ఇంతలో కలకలం...రాజుగార్ని సన్మానించడానికి ఓ పది మంది ఉన్నతవ్యక్తులు..పరమపురుషోత్తములైన కోట్ల ఋణాల్ని పొంది పాపం కట్టలేని బీద పరిస్థితుల్లో ఉండి ప్రజలచే మోసగాళ్ళని అపవాదు మోస్తూ ఆ అవమానం భరించలేక పొరుగుదేశంలో తలదాల్చుకున్న ఆ దీనుల కోట్ల ఋణమాఫీ చేసిన ధీరోధాత్తుడైన రాజుగార్ని సన్మానించుకోవడానికొచ్చారు..

రాజుగారు ఎదురెళ్ళి పట్టుపీతాంబరములతో..పన్నీటి జలకరింపులతో ఆహ్వనం పలికేరు..
అడ్డుగా ఉన్న పైన చెప్పిన ఆర్ధిక నేరస్థులను సైనికులు లాక్కెళ్ళి కుళ్లబొడిచారు..

Tuesday, November 22, 2016

మహతిని భారతి ఎత్తుకెళ్ళింది..

రేడియో లో బుల్లి బుల్లి మనుషులుండి పాటలు పాడతారు కామోసనుకునే  పసితనంలో 'ఏమి సేతురా లింగా..ఏమీ సేతురా" అంటూ లాలిత్యమైన గొంతు వింటూ ఉదయాన్నే సుప్రభాత వేళ పారవస్యంతో పులకరించేది మనసు..

గ్రాంఫోను గిర గిర మని తిరిగితే పాటలెట్లు వచ్చునో తెలియని లేత వయసులో "ఇదిగో భద్రాద్రీ..గౌతమి నదిగో చూడండి" అంటూ గాంభీర్యమైన గొంతు మిత్రుడింట పదే పదే వింటూ చదువు కొనసాగించేది తనువు...

వయసు‌ బాటు మారుతున్న దృశ్య శ్రవణ యంత్రాలలో
నిక్షిప్తమైన వందల..వేల కీర్తనలను అదే మాధుర్యమైన
గొంతు లో వింటూ ఆధ్యాత్మికా భావ ప్రభంజనంలో జీవన మాధుర్యాన్ని గ్రోలుతూ సంసార నావని నడిపిందీ జీవుడు.

సంగీత సాహిత్య కళా పిపాసి బాలమురళి..
సరస్వతీ మాత కొలువులో మహతి గానరవళితో
సరళ రాగాల మేలవింపుతో సరికొత్త కీర్తనావళి
సుస్వరంగా ఆలపించుటకై బ్రహ్మలోకానికి పయనమైరి..

Monday, November 21, 2016

శ్రీ మోడీ గారికి...గిరీశం రాసిన ఉత్తరం

అన్నగారైన మోడీ గారికి... ఈ గిరీశం అనేక వేల నమస్కారములతో ఛాయంగల విన్నపములు..

మీరును నా వలనే బ్రహ్మచారిగ ఉండి పోయి లోకోద్ధరణకే జీవితాన్ని అంకితమిస్తున్నందుకు మహదానందముగ నున్నది...

శీఘ్రమే మీ కొలువునకు చేరవలనని ఉన్నది గాని..చేతిలో చిల్లర లేక మీరిచ్చిన కాపర్..అదే..2000 నోటు మా వెంకటేశానికిచ్చి పావుశేరు మిఠాయి కొనుక్కురమ్మని పంపితే అంగడి వాడు దుడ్డుకర్రతో చావబాదాడు..
ఏవీ పాలుపోకుండా ఉన్నది..

ఇక్కడ మీ మావ గారు పరమానందభరితుడై మీకు కొన్ని లక్షల ఖరీదు చేసే కోటు తయారుచేయించి బంగారుటద్దముతో 'మోడీ" అన్న మీ నామధేయము అద్దానిపై చెక్కించి బహు సుందరముగ తయారుచేయించినారు..

1 వ నంబరుషరా: వివాహ ఖర్చుల నిమిత్తం మీ అత్తగారు దాచుకున్న డబ్బు ని బ్యాంకువారు ఇచ్చుటకు నిరాకరించడముతో నూతులో పడినది..కాని మేలే అయినది..నేను అమాంతం దూకి అత్తగారిని కాపాడుట వలన బుచ్చెమ్మకు నాపై అనురాగము కల్గినది..

తదుపరి..మీ నిర్ణయము వలన సామాన్యులు‌ పలు కష్టాలు పడుచున్నారని గిట్టని వారు ప్రచారం చేయుచున్నారు..ఇదంతా కేజ్రీవాల్ కుట్రే గాని మరి వొకటి కాదు..ఈ కేజ్రీవాల్ జిత్తుల జాకాల్..అనగా గుంటనక్క..

2 వ నంబరు షరా : 50 రోజుల వరకూ ఓపికవహించమని మీరు కోరిన పిదప ప్రజలు సహనం వహిస్తున్నారు..ఆ పిదప ఈ కష్టాలు యావత్తు అలవాటు చేసుకుని మహదానందముగ ఉండగలరు..
ఆ...ఇది వరకూ ఎన్ని పర్యాయములు ఇలా నాయకుల వలన ఇబ్బందుల పాలు కాలేదు??
ఈ దేశ ప్రజలు త్యాగమూర్తులు.. సహనమూర్తులు.. గనుకనే నా ఉపదేశాల్ని ఒంటబట్టించుకున్న నాయకులు ఇలా ఒపీనియన్స్ చేంజ్ చేస్తూ ఎన్నికల నాటి హామీలకు విరుద్ధంగా‌ నిర్ణయాలు తీసుకున్ననూ మిన్నకుండి గొర్రెలవలె తలూపుతారు..

3 వ నంబరు షరా: మీకు అత్యంత ప్రియ సన్నిహితులను ఎవరో ఏదో అన్నారని దూరం చేసుకోవద్దు.. వందిమాగధులతో విదేశీ పర్యటనలకు.. పట్టుపీతాంబరములతో స్వాగత సత్కార్యములకు.. ఏనుగుర్రంబులతో ఊరేగింపులకు బహు కష్టము కలుగవచ్చు...
దీవాన్జీ సాహెబు గారినడిగి బంగారపుద్దముల పల్లకీ కూడా మీ మిత్రులు సమకూర్చుతున్నారు..
ఇదంతా వృధా ప్రయాసని గుంటనక్క కేజ్రీవాల్ కూసిననూ..మీ వ్యతిరేకులందరూ దేశ ద్రోహులుగా ముద్రవేసి వారి నోళ్ళు మూయించవచ్చును..

ఇవన్నీ దగ్గరుండి చూచుకొనుటకై నన్ను‌ దత్తత తీసుకోవలసిందిగా వేడుకొనుచున్నాను..
ఇట్లు
మీ విధేయుడు
గిరీశం

Saturday, November 19, 2016

కోటి దీపోత్సవమా?? మోడీ బాకోత్సవమా??


నిన్న శనివారం భక్తి టీ.వీ వారు సభక్తికంగా నిర్వహించిన కార్యక్రమం ఆధ్యాత్మికమా నీచ రాజకీయ కలుషోత్సవమా అర్ధం కాలేదు...

శివనామ సంకీర్తలతో మార్మోగవలసింది పోయి మోడీనామ జపోత్సవంతో వెలిగిపోయింది..

ఆధ్యాత్మిక ప్రసంగాలు మాత్రమే చెయ్యవలసిన ప్రవచనకారుడు గరికపాటి వారు పురాణాలకీ నోట్ల రద్దుకీ ముడిపెట్టి ఈ కోటి దీపోత్సవపుణ్యం అంతా పి.ఎమ్ శక్తినివ్వడానికే గాని మీకుకాదని తేల్చిచెప్పి వెంకుబాబు గార్ని మురిపించి ఆయనకు ముసిముసి నవ్వులు కురిపించేరు..

ఆహా..ఏమీ భజన..ఏమీ భజన..
శివుడు వెలవెల బోవ..గంగ విస్తుబోవంగ..పార్వతీదేవి మూర్ఛబోవునటుల..యావత్ భక్తులంతా ఛీదరించునటుల ఈ బాకా పూజలు ఎవరిని కాకా పట్టుటకు??

ఈ నీచపనికి కార్తీకదీపోత్సవమని పవిత్రపేరెందుకు?? పండితులతో సంస్కృతాంధ్ర భాషలతో భజనలెందుకు??
మీరు చెప్పే నీతులు ఇతరులకేనా??

పోతనామాత్యుడు సరస్వతీ మాత ముందు "కాటుక కంటినీరు.."అనే పద్యం చదివి బాధ పడినది ఎందుకు? ఇలాంటి నీచ నికృష్ట పని చెయ్యలేరా కదా??