Monday, November 21, 2016

శ్రీ మోడీ గారికి...గిరీశం రాసిన ఉత్తరం

అన్నగారైన మోడీ గారికి... ఈ గిరీశం అనేక వేల నమస్కారములతో ఛాయంగల విన్నపములు..

మీరును నా వలనే బ్రహ్మచారిగ ఉండి పోయి లోకోద్ధరణకే జీవితాన్ని అంకితమిస్తున్నందుకు మహదానందముగ నున్నది...

శీఘ్రమే మీ కొలువునకు చేరవలనని ఉన్నది గాని..చేతిలో చిల్లర లేక మీరిచ్చిన కాపర్..అదే..2000 నోటు మా వెంకటేశానికిచ్చి పావుశేరు మిఠాయి కొనుక్కురమ్మని పంపితే అంగడి వాడు దుడ్డుకర్రతో చావబాదాడు..
ఏవీ పాలుపోకుండా ఉన్నది..

ఇక్కడ మీ మావ గారు పరమానందభరితుడై మీకు కొన్ని లక్షల ఖరీదు చేసే కోటు తయారుచేయించి బంగారుటద్దముతో 'మోడీ" అన్న మీ నామధేయము అద్దానిపై చెక్కించి బహు సుందరముగ తయారుచేయించినారు..

1 వ నంబరుషరా: వివాహ ఖర్చుల నిమిత్తం మీ అత్తగారు దాచుకున్న డబ్బు ని బ్యాంకువారు ఇచ్చుటకు నిరాకరించడముతో నూతులో పడినది..కాని మేలే అయినది..నేను అమాంతం దూకి అత్తగారిని కాపాడుట వలన బుచ్చెమ్మకు నాపై అనురాగము కల్గినది..

తదుపరి..మీ నిర్ణయము వలన సామాన్యులు‌ పలు కష్టాలు పడుచున్నారని గిట్టని వారు ప్రచారం చేయుచున్నారు..ఇదంతా కేజ్రీవాల్ కుట్రే గాని మరి వొకటి కాదు..ఈ కేజ్రీవాల్ జిత్తుల జాకాల్..అనగా గుంటనక్క..

2 వ నంబరు షరా : 50 రోజుల వరకూ ఓపికవహించమని మీరు కోరిన పిదప ప్రజలు సహనం వహిస్తున్నారు..ఆ పిదప ఈ కష్టాలు యావత్తు అలవాటు చేసుకుని మహదానందముగ ఉండగలరు..
ఆ...ఇది వరకూ ఎన్ని పర్యాయములు ఇలా నాయకుల వలన ఇబ్బందుల పాలు కాలేదు??
ఈ దేశ ప్రజలు త్యాగమూర్తులు.. సహనమూర్తులు.. గనుకనే నా ఉపదేశాల్ని ఒంటబట్టించుకున్న నాయకులు ఇలా ఒపీనియన్స్ చేంజ్ చేస్తూ ఎన్నికల నాటి హామీలకు విరుద్ధంగా‌ నిర్ణయాలు తీసుకున్ననూ మిన్నకుండి గొర్రెలవలె తలూపుతారు..

3 వ నంబరు షరా: మీకు అత్యంత ప్రియ సన్నిహితులను ఎవరో ఏదో అన్నారని దూరం చేసుకోవద్దు.. వందిమాగధులతో విదేశీ పర్యటనలకు.. పట్టుపీతాంబరములతో స్వాగత సత్కార్యములకు.. ఏనుగుర్రంబులతో ఊరేగింపులకు బహు కష్టము కలుగవచ్చు...
దీవాన్జీ సాహెబు గారినడిగి బంగారపుద్దముల పల్లకీ కూడా మీ మిత్రులు సమకూర్చుతున్నారు..
ఇదంతా వృధా ప్రయాసని గుంటనక్క కేజ్రీవాల్ కూసిననూ..మీ వ్యతిరేకులందరూ దేశ ద్రోహులుగా ముద్రవేసి వారి నోళ్ళు మూయించవచ్చును..

ఇవన్నీ దగ్గరుండి చూచుకొనుటకై నన్ను‌ దత్తత తీసుకోవలసిందిగా వేడుకొనుచున్నాను..
ఇట్లు
మీ విధేయుడు
గిరీశం

2 comments:

  1. ది ఎలెవన్ కాజెస్ ఫర్ డి-మానిటైజేషన్ ఆఫ్ ఇండియా కూడ ఒక్క బిగిన రాయగలరు.డంగై పోతాము.

    ReplyDelete
  2. ధన్యవాదములు శ్రీ కాంత్ గారు...

    ReplyDelete