Wednesday, November 30, 2016

కాసు బంగారం కొన్నా...లెక్క చెప్పాల్సి వస్తుందని..

శ్రీదేవి: ఏవిటి నాధా..ఆందోళనగా ఉన్నారు??

స్వామి: దేవీ..కొంతమంది భక్తులు నల్లధనం తీసుకొచ్చి హుండీలో వేస్తున్నారు... అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముని పెద్దనోట్ల రద్దుతో ఆ పాపపుసొమ్ముని హుండీల్లో వేసి చేతులు దులిపేసుకుంటున్నారు...

శ్రీదేవి:  (గుడి) పాలకులు నల్లకుబేరులకు నేరుగా దర్శనం కల్పించి సామాన్యభక్తులను ఇక్కట్లపాలు చెయ్యడం సాధారణమే కదా స్వామీ..మీరు కుబేరులకే దేవుడు కాని పేదలకు కాదని కమిటీ వారు fix అయిపోయారు...

స్వామి: మరే...అన్నమయ్య పాడిన కీర్తనలను మరిచారు వీళ్ళు...

శ్రీదేవి: పెద్దనోట్ల రద్దుతో అన్నపానీయాలే మర్చిపోయారు..ఇక అన్నమయ ఎక్కడ గుర్తుంటాడు??

స్వామి: మరి ఏవిటి సాధనం??

శ్రీదేవి: సర్లెండి..రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు... పెద్దనోట్ల రద్దు తరువాత బంగారం మీద పడతారని భయంతో ఈ శ్రావణమాసంలో ఆడవాళ్లు బంగారం కొనడం మానేసి కూచున్నారు..కాసు బంగారం కొన్నా లెక్క చెప్పాల్సి వస్తుందని నా చిట్టితల్లులు తల్లడిల్లి పోతున్నారు...వీటికి పరిష్కారం మీరే చెప్పాలి...

(పవళింపు సేవ తరువాత కాంతతో ఏకాంతంగా అరగంట మాత్రమే విశ్రాంతి దొరికిన స్వామి గంట శబ్ధం వినగానే శిలారూపమై నల్లదొరల దర్శనానికి తిరుమల వెళ్లగా..ఉస్సూరుమంటూ మంగాపురంలో తాయారమ్మ నల్లదొరసానులకు స్వాగతం పలికింది..)

నీతి: కుబేరులు మాత్రమే నిజభక్తులని తెలుసుకోండి..పాలకులు, పాలకమండలి వారు తీసుకున్న నిర్ణయాలు కుబేరులు లబ్ధిపొందడానికే..సామాన్యులకు మేలు చేస్తాయనుకోవడం మాయ..విష్ణుమాయ...

1 comment:

  1. ఏవిటి శంకర్ గారు, ఈమధ్య మీ బ్లాగ్ లో చడీచప్పుడు లేదు.

    ReplyDelete