Tuesday, November 7, 2017

"బండెనక బండి కట్టీ..." పాట మార్చాలి...

రాజ్యం లేని రాజు ఉండచ్చునేమో గానీ, రాజులేని రాజ్యం ఉండరాదు...

కానీ బ్రిటిష్ వారు మొదట ఈ దేశంలో రాజు అనేవాడు లేకుండా చేసారుగానీ పాలనా పగ్గాలు వారి రాణిగారే చేపట్టారు..‌

స్వాతంత్ర్య సముపార్జన తరువాత ప్రజాసామ్యమే అనివార్యం అయింది...ప్రజలే పాలకులు..ఓటరే రాజు..

కానీ సమర్ధుడైన పాలకుడు లేకపోవడం వలన మంత్రులు, అధికారులు అవినీతి పరులై, ప్రజాశ్రేయస్సు గంగపాలు చేసారు...

అభివృద్ధి మాట దేవుడెరుగు...సామాన్యుడికి రక్షణ కరువైంది..

ఉన్నత విలువలు కలిగిన మంత్రుల హితవుతో  రాజు ప్రజలను సుఖసంతోషాలు, శ్రేయస్సు, సమన్యాయం జరిగేలా పాలించి ప్రజల మన్ననలు పొందేవారు..

పాలించేవాడికి ఉండవలసిన ప్రాధమిక అర్హతలు కూడా అక్కరలేని ఛండాలపు సూత్రాలు ఈ దేశంలో తప్ప ఎక్కడా లేవు...

యూరోప్ దేశాల్లోనూ, ఆసియా దేశాలు చాలా వాటిలో రాజులుండగా లేనిది మన దేశంలో లేకపోవడం వలననే ప్రజాస్వామ్యం ముసుగులో నియంత్రత్వం రాజ్యమేలుతోంది...

ఉండాలి..రాజులు ఉండాలి...కావలిస్తే తెలంగాణా ముఖ్యమంత్రి గారి ఈ రోజు అసెంబ్లీ లో మాట్లాడిన ప్రసంగాన్ని వినండి... నిజాం రాజుల గొప్పదనాన్ని చాలా చక్కగా సెలవిచ్చారు...

"బండెనక బండి కట్టీ..." పాట మార్చాలి...
Wednesday, October 4, 2017

వీరు మాత్రం స్మగ్లర్లు కాదు..మన మేథావుల (?) దృష్టిలో....

పాత హిట్ సినిమాల్లో కోటీశ్వరుడైన గుండెపోటు గుమ్మడిని అతనికి నమ్మిన బంటు బావమరిది నాగభూషణం కత్తితో పొడిచి చంపేస్తాడు..

ఇంతలో పేదవాడు, నిజాయితీ పరుడు, అమాయకుడు (పేదవాళ్ళందరూ అమాయకులే అన్నది  ఈ దేశంలో రూలు..డౌటొస్తే మీ దగ్గర్లోనున్న మేథావినడగండి)..  అయిన హీరో "బాబు గారూ" అంటూ గుమ్మడిని రక్షించడానికై కత్తిని లాగుదామని చెయ్యవేసాడో లేదో...పిస్తోలు పట్టుకుని పావలా వేషగాళ్ళు ఇన్సపెక్టరు, ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చి "యూ ఆర్..అండర్ అరస్ట్" అని బేడీలు తీయగానే..పాపం అమాయకుడైన హీరో మారుమాటాడకుండా చేతులకి బేడీలు వేయించుకుంటూ ఉండగా....
బ్యాగ్రౌండ్లో‌ ఘంటసాల గారి పాట ఆరున్నొక్క రాగంలో "విధి రాతకు బలయ్యావా?...కటకటాల పాలయ్యావా??" అంటూ బరువెక్కిన హృదయంతో హీరో విలపిస్తూంటే...హీరియిన్ జీపు వెనకాలే పరిగెడుతూ ఉంటుంది..
అమాయకుడైన హీరోకి చెయ్యని నేరానికి ఉరిశిక్ష పడుతుంది...తదుపరి కథ 16 రీళ్ళు ...

ఏతావాతా ఈ దేశ ప్రజల్లో గూడుకట్టుకున్న  ప్రగాఢ విశ్వాసం ఏమనగా...ఎవరేనీ చావుబతుకుల్లో ఉన్నా..ఆపదలో ఉన్నా అస్సలు పట్టించుకోకూడదు..

రోడ్డుమీద యాక్సిడెంటయో, మర్డరో.. మానభంగం జరిగో సాటి మనిషి రక్తపు మడుగులో గిలగలాడుతున్నా ముఖం తిప్పుకుని పోవాలే గానీ..దవాఖానికి తీసుకెళ్ళకూడదు..

అందుకే అభాగ్యురాలైన నిర్భయ, ఆమె స్నేహితుడు రాత్రల్లా రోడ్డుమీద గాయాలతో "హెల్ప్..హెల్ప్" అని దీనంగా అరుస్తున్నా... వందలమంది వాహనదారులు నిర్దయగా బండాపకుండా పక్కనుండి  వెళ్ళిపోయారే గానీ ఒక్కడూ రక్షించే ప్రయత్నం చెయ్యలేదు...

కానీ...
ఇదే దేశంలో...
ఆ మరురోజునుండి ఎక్కడలేని మానవతావాదులూ, సానుభూతి పరులూ ప్లకార్డులు, కొవ్వొత్తులూ పట్టుకుని ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి, "నిర్భయ" చట్టం వచ్చేవరకూ పోరాడారు...

కట్ చేస్తే...
ఇదే దేశంలో ఓ పిల్లిగడ్డపాయన కోట్లకి కోట్లు బ్యాంకులకి టోకరా యిచ్చి సొంత యిమానంలో యిదేశాలకి చెక్కేసి...ఫ్యామిలీతో సహా సొంత బీరు తాగుతా ఎంజాయ్ చేస్తాఉంటే....
విదేశీ పోలీసులు "ప్లీజ్..ఒక్కసారి అరెస్టు అయినట్టుగా యాక్టింగ్ చెయ్యండి"...
అని బతిమిలాడుకొంటే..పోన్లేపాపమని కనికరిస్తే...
యెంటనే ఇదే దేశంలో అన్ని ఛానల్లలోనూ...
"అజయ్ చౌర్యా అరెస్ట్"అని హొరెత్తించి..
"అశ్వత్థామ అతః..కుంజరహః" అన్న స్టయిల్లో అపర ధర్మరాజులై మీసమ్ము తిప్పవలె....
అదెగదా మన ధీరత్వము..వీరత్వమూ...

ఈ "అజయ్ చౌర్యులు" మాత్రం స్మగ్లర్లు కాదు..మన మేథావుల (?) దృష్టిలో....


Tuesday, October 3, 2017

కుక్క ఒకటి అందరు బ్లాగర్లనూ కరుస్తోంది..

ఈ మధ్య కాలంలో కుక్క ఒకటి అందరు బ్లాగర్లనూ కరుస్తోంది..
కొందరంటున్నారూ...అది మామూలు కుక్క కాదు..
పిచ్చికుక్క అనిన్ను..మందులిప్పిస్తే మంచిదనిన్నూ..
కాని..
పిచ్చి కుక్క కరిచిన మనిషికి మందుందేమో గాని...
పిచ్చికుక్క కి మందులేదు...మరణమొక్కటే...
మనిషిని కరిచిన కుక్క వారం రోజుల్లో మరణిస్తుంది..
అది పిచ్చికుక్క అయితే గనుక..

ఒక సోకాల్డ్ మేధావి (?) కుక్కను Facebook, whatsapp లలో చావగొట్టి వదిలేస్తే కుయ్యో మొర్రో మంటూ మూలుక్కుంటూ, గూట్లో కి దూరి కూచుంది..

మంత్రులు, ముఖ్యమంత్రులు దాని తోక కట్ చేసారు..ఉభయ రాష్ట్రాల్లో...
కానీ ...దాని సహచరులు మాత్రం ఇంకా మొరుగుతూనే ఉన్నాయి..వాటి తోకలూ కట్ అవుతాయి త్వరలోనే...

Sunday, September 10, 2017

NTR, SOBHAN BABU ఇక్కడే చదువుకున్నారు

Andhra Christian College, Guntur- 1885 సం.లో మొట్టమొదటి డిగ్రీ కాలేజీల్లో ఒకటి..

NTR, SOBHAN BABU లాంటి ప్రముఖులెంతో మంది చదువుకున్నారు.
ఇప్పటికీ ఎంతో ఠీవిగా కనబడుతున్నా, ప్రభుత్వ నిర్వహణా లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది..
శిథిలమైన టవర్ చూస్తే గుండె కరుగుతుంది.
దర్పంగా గుర్రం మీద స్వారీ చేస్తూ, డ్రాగన్ పై నిలబడున్న కాలేజీ స్థాపకుడు జార్జి విగ్రహం ఆనాటి వ్యవస్థకు అద్దం పడుతుంది..
P.S: గుంటూరు ప్రాంతం వారు గానీ, ex.students గానీ ఆ కాలేజి గురించి ఇంకా వివరాలు అందించమని ప్రార్థన..

Friday, September 8, 2017

అరుస్తాడు..కులం గోడలు బద్దలు కొందాం అని..

"వామపక్ష భావజాలం" అన్న పదానికి అర్ధం ఎంతమందికి తెలుసు?
వారిలో నిజంగా ఆ సిద్ధాంతం తమ నిజ జీవితంలో ఆచరించేవారెంతమంది??
ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని బలపరిచే వారి సంఖ్య ఎంత??
ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఏకపక్షాన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాభిష్టానికి, ప్రజా శ్రేయస్సు నకూ వ్యతిరేక చర్యలు పాల్పడుతూ నియంతలా వ్యవహరిస్తూ ఉంటే, కేవలం హైందవ సంస్కృతికి, అగ్రవర్ణాలపై అక్కసు వెళ్ళగక్కుతూ ఎన్నాళ్ళు రాస్తారు మతిలేని రాతలు..

రోజురోజుకూ అడుగంటున్న మానవత్వం, రక్షణ లేని పౌరసత్వం...
అంతులేని ధనదాహం, అవధుల్లేని అధికారబలం..
కులం చూసి ఓటు వేసే దౌర్బల్యం..

గోచీ కట్టిన పతోడూ గొంతుచించుకుని అరుస్తాడు..కులం గోడలు బద్దలు కొందాం అని..
కానీ రాతి గోడలతో స్వకుల పునాదులు నిర్మిస్తాడు..

"పతితులార, భ్రష్టులార.....ఏడవకండేడవకండి...
వస్తున్నాయొస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు.."
మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది...పోదాం..పోదాం..పైపైకి" అంటూ 50 ఏండ్ల కితమే యువతను వేడెక్కించి పైకి పోయాడు అభాగ్యుడై ఓ మహాకవి(?)....
ఇప్పటికీ పతితుల, భ్రష్టుల కన్నీళ్ళకు, జగన్నాథ రథచక్రాలకూ లింకు తెలీక, కనబడని ఆ మరో ప్రపంచపు దారి తెలియక బిక్కుబిక్కుమని దిక్కులు చూస్తున్నాడు కూలోడు...నాలోడు..
ఈ ప్రపంచంలో ఇప్పుడందరూ కూలోళ్ళే..
కూటి కోసం, గూటికోసం అలమటిస్తున్న అభాగ్యులే..

అభ్యుదయ భావాలతో నిరంతరం జనహితాన్ని కోరుతూ డిబేట్ లు, సంచలన ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వేడెక్కించే వార్తలను వడ్డి వండించే ఛానల్ వాళ్ళు గణేశ్ నిమజ్జాన్ని రెండ్రోజుల పాటు ఏకధాటిగా ప్రసారం చేస్తారు..
మతమౌఢ్యం, కుల పక్షపాతం ఉండకూడదని నీతులు చెప్పేవాడే తన దాకా వచ్చేసరికి వాటినే పట్టుకు వేలాడతారు..
మోసపోతూ, ఇంకా ఊబిలోకి కూరుకుపోతోంది కూలోడూ, నాలోడే...
Saturday, July 1, 2017

బోరు బావి లో ఇంకిన కన్నీళ్ళు...కన్నబిడ్డ కానరాక..
కన్నతల్లి కన్నీరాయె..

పాలబుగ్గ పసిపాపను
పాడుబుగ్గ మింగెనమ్మ..

విలవిల లాడెనమ్మ పసిపాణం..
వలవల పోయెనమ్మ పేగు బంధం..

పాపాత్ములైన పాడు మనుషులు..
పాతాళానికేసిరి  పాడు బావులు..

బుడిబుడి అడుగుల బుజ్జాయి..
తడబడి అడుగంట జారిపోయి..

అమ్మ కోసం ఆక్రోశించె బిడ్డ..
బిడ్డ కోసం రోదించె అమ్మ..

ఇంకిపోయిన బావిలోన..
ఇంకరాని కూన కోసం..
ఇంకెనమ్మా కన్నీళ్ళు..

ఇంకెన్నాళ్ళయ్యా ఈ అగచాట్లు???

(రచన, బొమ్మ: ఓలేటి.శంకర్)

Wednesday, November 30, 2016

కాసు బంగారం కొన్నా...లెక్క చెప్పాల్సి వస్తుందని..

శ్రీదేవి: ఏవిటి నాధా..ఆందోళనగా ఉన్నారు??

స్వామి: దేవీ..కొంతమంది భక్తులు నల్లధనం తీసుకొచ్చి హుండీలో వేస్తున్నారు... అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముని పెద్దనోట్ల రద్దుతో ఆ పాపపుసొమ్ముని హుండీల్లో వేసి చేతులు దులిపేసుకుంటున్నారు...

శ్రీదేవి:  (గుడి) పాలకులు నల్లకుబేరులకు నేరుగా దర్శనం కల్పించి సామాన్యభక్తులను ఇక్కట్లపాలు చెయ్యడం సాధారణమే కదా స్వామీ..మీరు కుబేరులకే దేవుడు కాని పేదలకు కాదని కమిటీ వారు fix అయిపోయారు...

స్వామి: మరే...అన్నమయ్య పాడిన కీర్తనలను మరిచారు వీళ్ళు...

శ్రీదేవి: పెద్దనోట్ల రద్దుతో అన్నపానీయాలే మర్చిపోయారు..ఇక అన్నమయ ఎక్కడ గుర్తుంటాడు??

స్వామి: మరి ఏవిటి సాధనం??

శ్రీదేవి: సర్లెండి..రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు... పెద్దనోట్ల రద్దు తరువాత బంగారం మీద పడతారని భయంతో ఈ శ్రావణమాసంలో ఆడవాళ్లు బంగారం కొనడం మానేసి కూచున్నారు..కాసు బంగారం కొన్నా లెక్క చెప్పాల్సి వస్తుందని నా చిట్టితల్లులు తల్లడిల్లి పోతున్నారు...వీటికి పరిష్కారం మీరే చెప్పాలి...

(పవళింపు సేవ తరువాత కాంతతో ఏకాంతంగా అరగంట మాత్రమే విశ్రాంతి దొరికిన స్వామి గంట శబ్ధం వినగానే శిలారూపమై నల్లదొరల దర్శనానికి తిరుమల వెళ్లగా..ఉస్సూరుమంటూ మంగాపురంలో తాయారమ్మ నల్లదొరసానులకు స్వాగతం పలికింది..)

నీతి: కుబేరులు మాత్రమే నిజభక్తులని తెలుసుకోండి..పాలకులు, పాలకమండలి వారు తీసుకున్న నిర్ణయాలు కుబేరులు లబ్ధిపొందడానికే..సామాన్యులకు మేలు చేస్తాయనుకోవడం మాయ..విష్ణుమాయ...