Tuesday, November 9, 2010

అడ్రస్ ఆఫ్ గాడ్


ఈ మధ్య బ్లాగుల్లో "దేవుడున్నాడని కొందరు.. లేడని కొందరు".. ఇంకా నమ్మకాల గురించి,,జాతకాల గురించి.. తెగ పోట్లాడుకుంటున్నారు.. పనిలో పనిగా కులాల్ని కూడా ఇందులోకి జోడిస్తున్నారు..
అయితే ఈ నా అనుభవాల్ని క్లుప్తంగా రాస్తున్నాను.. దేవుడున్నాడో లేడో మీరే చెప్పండి...
ఒకానొక వుద్యొగానికి నేను ఇంటర్యూ కమ్ రిటన్ టెస్ట్ కి వెళ్ళాను చాలా దూర ప్రాంతానికి.. నాలాగే సుమారు వంద మంది వచ్చారు..వున్నవి రెండే పోస్టులు.. నేను బాగా ప్రిపేర్ అయ్యను గాని.. లోపల ఒకటే టెన్షన్.. కొంత నిరాశ.. మనకి రాదులే.. అయినా మన ప్రయత్నం మనం గట్టిగా చేద్దాం.. ఇలా డొలయాన పరిస్తితిలో వుండగా.. నా పక్కకి ఓ పెద్దాయన వచ్చాడు.. ఓ యాభై కన్నా ఎక్కువ వయస్సు వుండదు.. చక్కగా నవ్వుతూ పలకరించి.."ఏమీ భయపడకు.. బాగా కష్టపడు.. నీకు తప్పక ఈ వుద్యోగం వస్తుంది." అన్నాడు.."

"చూస్తున్నారుగా ఇంతమంది వచ్చారు.. ఇక్కడ మనకి ఎవరున్నారు." ఏం కాదు..నువ్వు తప్పక సెలెక్ట్ అవుతావు.. ఆనక ఓ మంచి పిల్లని అదీ కూడా వుద్యోగస్తురాలినే చేసుకో..బావుంటుంది" అన్నాడు.." చాల్లే వూర్కొండి.. ఇప్పుడు నా వయసెంతా..ముందు ఈ వుద్యోగం నాకు చాలా ముఖ్యం..మిగతావి తర్వాత అన్నాను.. ఏం కాదు నాయనా. చక్కగా ఇక్కడ పనిచేసే ఓ మంచి అమ్మాయిని చేసుకో.. నీ లైఫ్ చాలా బాగుంటుంది నే చెప్తున్నాగా" అన్నాడు..
ఇంతకీ మీరెవరు అనడిగా టాపిక్ డైవెర్ట్ చేద్దామని.." ఫలానా స్టాఫ్ నర్స్ మా అమ్మాయి అన్నాడు.. ఓ సంవత్సరం అయ్యింది ఇక్కడ జాయిన్ అయి అన్నాడు.సరే ఇంటర్యూ.. రిటన్ టెస్ట్ అన్నీ అయ్యాయి..నా శ్రమకి తగ్గ ఫలితం వచ్చింది..జాయిన్ అయింతర్వాత ఆ పెద్దాయన ఎవరో కనుక్కొందామని..వాళ్ళ అమ్మాయి పేరు చెప్పి ఎంక్వయిరీ చేస్తే.. అబ్బే అలాంటి పేరు గల స్టాఫ్ నర్స్ ఎవరూ లేరే అన్నారు.. సరేలే అని ఊరుకున్నాను.

కాని ఆయన రూపం, నవ్వుతూ నాతో మాట్లాడే తీరు మర్చిపోలేదు..అందర్నీ వొదిలేసి నా ఒక్కడితోనే ఎందుకు మాట్లాడేడో అర్దం కాలా.సరే అప్పటికి చిన్నవాణ్ణి కాబట్టి.. బుద్దిగా ఓ నాల్గేళ్ళు ఆ వూళ్ళో పనిచేసి.. మా వూళ్ళో ఇంకో జాబ్ లొ జాయిన్ అయ్యా..

ఇక్కడ కొచ్చేటప్పడికి...మా ఆఫీస్ లోనే పనిచేసే.. అమ్మాయి(అప్పుడు సరిగా ఆయన చెప్పిన వృత్తి) సంబంధం చెప్పేరు.. కాని వుద్యోగం చేసే స్త్రీలు మా ఇళ్ళల్లో అప్పటికి లేరందున కొద్దిరోజులు ఆలోచించినా..చివరికి ఆ సంబంధం రైట్ చేసుకోడం.. నాల్గేళ్ళ క్రిందటే ఆ పెద్దమనిషి చెప్పినట్లుగా అచ్చుగుద్దినట్లుగా జరగడంతో .. ఇంతకీ ఎవరా పెద్దమనిషి ..

ఆ రూపంలో వచ్చి.. ఖచ్చితంగా నీకే ఈ వుద్యోగం వస్తుందని నాకు ధైర్యం చెప్పడం.. నువ్వు ఫలానా వృత్తిలో అమ్మాయినే చేసుకుంటావు అని చెప్పడం.. ఆ తర్వాత ఎంక్వరీ చేస్తే ఆ పేరు గల మనిషే లేక పోవడం .. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది.. దెబ్బలాటలు.. వాదనలు వద్దు.. మన తల్లి తండ్రులు మనకి ఇచ్చిన సంస్కారం మర్చి పోవద్దు.. ప్లీజ్.. ఇలాంటిదే మరో అనుభవం వుంది నా దగ్గర .. ముందు మీరు. దీనికి స్పందించండి..

Thursday, November 4, 2010

బాబా మహత్యం x శివ లింగం


ఈ ఫొటో లో కనిపిస్తున్న బుజ్జి శివలింగాన్ని చూసారు కదా ! ఈ కధంతా చదివి మహత్యాలు ఉన్నట్టా.. లేనట్టా ఏదో ఒక జవాబు ఇయ్యాలి లేదా...
మీ బుర్ర(బేతాళ కధలోలా)

ఇహ ఈ కధ.. ఈ లింగం ఈనాటివి కావు.. సుమారు పాతిక ఏళ్ళ క్రితం నాటివి. అందుకే కొంచెం పాడయింది(లింగం) ఇహ స్టోరీ లోకి వస్తే.. నేను అదేదో వూళ్ళో వుద్యోగం వెలగ బెడ్తున్నప్పుడు, ఒకానొక బాబా భక్త సంఘం వాళ్ళు మా ఊర్లో "ఉచిత కంటి ఆపరేషన్లు" (ముసలి పేద వాళ్ళకి కాటరాక్ట్ ఆపరేషన్ల కాంప్) నిర్వహించేరు..ఆ కాంప్ లోనే ఆ వారం రోజులూ వుదయం, సాయంత్రం బాబా గారి భజనలు కూడా ఏర్పాటు చేసారు.. నేను కూడా ఆ కాంప్ లో వుంటూ నాకు తోచిన సహాయం చేసే వాడ్ని.. కాని ఈ భజనలు.. వాళ్ళల్లో వాళ్ళకి గ్రూపులు అవీ నచ్చేవి కావు.. కుర్రవాణ్ణి (అప్పటికి) అగుటం చేతను.. కాస్త బాబాలమీద.. మూఢ భక్తిమీద విశ్వాసం లేక పోవడం చేతను.. నేను.. ఇంకో మిత్రుడు కలసి ఓ ప్లాన్ వేసాం.. (ఐడియా అతనిదే) అదేంటంటే...

ఆ రోజు రాత్రి రహస్యంగా ఈ శివ లింగాన్ని పూజా ద్రవ్యాల్లో కలిపెస్తాం.. మర్నాడు వుదయాన్నే సదరు భక్తుల లీడరు.. వాటిని సర్దడానికి వస్తాడు.. హఠాత్తుగా శివలింగాన్ని చూస్తాడు.. నిన్న లేని శివలింగం ప్రత్యక్షమయ్యేసరికి ఇదంతా బాబా మహిమే అనుకుంటాడు.. అందర్కీ చూపించి బాబా లీలల్ని తమ దైన రీతిలో చాటిచెప్తూ ఆనందించే వేళలో.. సరిగ్గా అప్పుడే మేం ఎన్టరై.. "నాయనలారా! ఇది మేం ఎరేంజ్ చేసిన శివలింగం.. ఇందులో బాబా మహత్యం అంటూ ఏమి లేదని" ఒక సమగ్ర ఉపన్యాసం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం అనుకున్నాం..కానీ....

మేం అనుకున్నట్టుగానే మా వాడు వెళ్ళి శివ లింగాన్ని అక్కడుంచాడు.. నేను ఇంటి దగ్గర ఆ రాత్రంతా మర్నాడు ఎలా ఉపన్యసించాలి.. అంత పెద్ద వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలి అని ప్లాను వేస్కుంటూ రాత్రంతా ఆలోచిస్తూ ఏ మూడో ఝామునో పడుకున్నాను.. అందువల్ల నేను నిద్ర లేచీ సరికే సుమారు పదకొండు దాటింది.. అందులోనూ అప్పటికి మూడ్రోజులనుండి కాంప్ కోసం రాత్రి, పగలు కష్టపడుతున్నాం..
ఇదేమిట్రా ఇలా అయ్యింది.. పొద్దున్నా ఏం జరిగిందో ఏమిటొ అని కలవర పడ్డాను.. సరే మా వాడు ఉన్నాడు కదా.. వాడు వాళ్ళందర్కీ కళ్ళు తెరిపించే వుంటాడులే.. అని అతని రాక కోసం చూసేను.. వచ్చేడు...

వస్తూనే.. "అరే! ఏంది గురూ పొద్దున్న రాలేదేం?" అని అడిగేడు.. జరిగింది చెప్పి."నా సంగతి సరే.. మన ప్లాను సక్సెస్ అయ్యిందా? వాళ్ళు శివ లింగం చూసారా? నువ్వు వాళ్ళ కళ్ళు తెరిపించావా?" అనడిగా. "ఏం చెప్పమంటావు భయ్యా? ఆ లీడరాయన ఇలా టేబుల్ మీద క్లాత్ తియ్యాగానే శివలింగం ..పక్కనే ఓ పళ్ళెం లో పడ్డది.. ఇహ చూస్కో.. ఇంతా అంతా హడావుడి కాదు.. వెంటనే "బాబా యే శివలింగాన్ని పంపించిండు.. అని ఒకరు.. కాదు బాబాయే శివలింగం రూపంలో వచ్చి మనల్ని ఆశ్వీదరిస్తున్నారు అని ఒకరు.. ఒకటే హడావుడి.. ఆ వెంటనే పేషంట్లు అందర్నీ కూచోబెట్టి..ఒకటే భజన్లు.." నేనడిగేను "మరి నువ్వే చేస్తున్నావ్.. వాళ్ళందర్కీ చెప్పలేక పోయావా ఇది మన పనే అని" లాభం లేదు గురూ అక్కడ నా మాట ఎవరూ వినిపించు కొనే స్థితిలో లేరు.. చాలా తన్మయత్వం లో వుండి.. అందరి లోను ఒక నూతన వుత్సాహం.. ఒక భక్తి భావం.. ఈ కాంప్ సక్సెస్ అయ్యిందని పెద్దాళ్ళంతా (అందరూ ఆఫీసర్లు, ఇంజనీర్లు) అంత ఉద్రిక్త వాతావరణం లో నాకసలు ఏం చెయ్యాలో తోచలే.. సర్లే మన వల్ల మంచి పనే జరిగింది.. ఏ గ్రూపులూ లేకుండా అందరూ అంతా కలసిమెలసి.. కాంపులో కలివిడిగా తిరుగుతూ పనిచేస్తున్నారు..అని సైలెంట్ గా ఉన్నా" అన్నాడు..

"ఛస్.. నీ ప్లేసు లో నేనుంటేనా..ఆళ్ళందర్కీ కళ్ళు తెరిపించేద్దును" అని అంటే
" ఆ నువ్వున్నా .. ఏం చెయ్యలేవు.. ఆ సిట్యువేషన్ అలా వుంది..పైగా వాళ్ళందరూ. మన కన్నా ఓ మెట్టు పైనున్న వాళ్ళు.. సర్లే.. ఇదీ ఒక విధంగా మంచే అనుకో.. ఆ దేవుడే మన చేత ఈ మంచి కార్యం చేయించి వుంటాడు..కాస్త ఆలోచించు" అని వెళ్ళిపోయాడు..
ఇప్పుడు చెప్పండి.. బాబా మహత్యం వున్నట్టా లేనట్టా? మా బుజ్జి శివుని లింగం నా చేత ఈ పని చేయించింది లోకానికి ఏం చాటడానికి? ఇంతకీ కధలో శివలింగం ఆ భక్తుడు పట్టుకుపోయాడు.. ఇది దాని కజిన్ అన్నమాట...