Thursday, June 30, 2011

ఈ ఫర్ కావాలి... తెచ్చే మొనగాడికి బహుమానంఈ బొమ్మలో కనిపిస్తున్న జంతువు ఫర్ తో బొమ్మ చేద్దామని వుంది.... తెచ్చి ఇవ్వగల వీరులకు అర్ధ రాజ్యం, లేదా రేపు ఏర్పడ బోయేరాష్ట్రానికి యువరాజ పట్టాభిషేకం (ముఖ్యమంత్రి) పదవి బహుమతిగా ప్రకటించడం అయినది.

Thursday, June 23, 2011

ఆజ్ కా ఫైవ్ స్టార్ హోటల్ఈ ఫోటో చూసారా ... అంతా ఎంత ఆబగా తింటున్నారో.. ఇప్పుడు ఇలాంటి ఫైవ్ స్టార్ హోటళ్ళు ప్రతీ వీధికి రెండేసి చొప్పున మా వైజాగ్ లో దర్శన మిస్తున్నాయి. ఈ బడ్డీల పుణ్యమా అని సాధారణ అంటే మధ్య తరగతి హోటళ్ళు మూతపడిపోతున్నాయి. ఉంటే ఈ బడ్డీలు లేకపోతే ఏ.సీ హోటళ్ళు..పార్శిళ్ళ సెంటర్లు వున్నా వాళ్ళు కూడా రేట్లు చాలా పెంచేస్తున్నారు. మొదట్లో ఎనిమిది రూపాయలకే ఓ కూర పొట్లాం అమ్మేవారు.. ఇప్పుడు కనీసం 20 రూపాయలు లేందే మామూలు కూరలు అమ్మట్లేదు. స్పెషల్ అయితే 40 నుండి 50 రూపాయలు. సాయిరాం లాంటి హోటళ్ళ లో కూడా ఇడ్లీ, వడ ప్లేటుకి 16 నుండి 20 రూపాయలు.ఈ రేట్లు ఇలా వుంటే ఇక ఇలాంటి బడ్డీల్లో పది రూపాయలకే నాల్గు ఇడ్లీలు / రెండు పూరీలు / ఒక దోస దొరికిపోతున్నాయి. అందుకే చూస్తున్నారుగా కాస్త మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ బడ్డీల్లో నే కానిచేస్తున్నారు. ఇక పరి శుభ్రత గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. ఈ ఫోటోలో చూడండి ఒక మామ్మ ప్లేట్లు ఎలా కడుగుతోందో.. పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా అవే నీళ్ళు.. అందులోనే ముంచడం తీయడం..అయితే వీటిని నియత్రించవలసిన బాధ్యత మునిసిపల్ హెల్థ్ డిపార్ట్మెంట్ వాళ్ళది.. కానీ అపరిశుభ్రమైన ఇలాంటి తిండి పదార్ధాలు అమ్మిన వాళ్ళమీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా మనకి కనిపించవు..టౌన్ నుండి మన ఇంటికి వచే తోవలో కనీసం పాతిక పకోడీ బడ్డీలైనా, పుల్కాలు, పానీపూరీలు (ఈ మధ్య ఎక్కువయాయి) - పెద్దింటి ఆడవాళ్ళు, ఆడపిల్లలు(స్టూడెంట్లు) కూడా రోడ్డు మీదే నిలబడి తినేస్తున్నారు.. ఒకవేళ ఏ అంటురోగమైనా వస్తే తప్పు ఎవరిది?

Wednesday, June 8, 2011

కళాతపస్వి ఫార్ములాలు


కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారి సినిమాల గురించి నా మనసులో వున్న నాలుగు మాటలు మీతో పంచుకుందామన్న
చిన్నిప్రయత్నాన్ని మనసారా అస్వాదిస్తారని కోరుకుంటూ.. అయితే మహానుభావుణ్ణీ విమర్శించే స్థాయిలో వున్నానది కాదు... కేవలం మనలో మన మాట(సరదాకి)..

) అన్ని సినిమాలు "" లేదా "" తో మొదలెట్టాలనే సెంటిమెంట్.. దాన్ని బలహీనతగా చూడవచ్చు.. బాగా తీస్తే టైటిల్ అక్షరంతో తీసినా బాగా ఆడతాయి అనే మౌలిక సూత్రానికి ఇది వ్యతిరేకం.

) ప్రధాన పాత్ర పరిచయం పాత్ర ఎంటర్ కాకుండానే ఎంతో గంభీరంగా, వుదాత్తంగా వున్నట్టు వేరొక పాత్ర చేత చెప్పించడం.. తీరా పాత్ర మనం విన్నదానికి వ్యతిరేక భావంతో నడుస్తుంది..(కధను బట్టి)..ఇదొక ట్విష్ట్..

) ఒక పాత్ర ఏదైనా పాటను పాడుతుంటే పక్క పాత్ర చాలా ఎమోషనల్ ఫీల్ అయి, బాగా పాడుతున్నట్లు భావ వ్యక్తీకరణం చెయ్యడం ( ఇది ఒకోసారి చాలా ఓవర్ ఏక్షన్ లా అనిపిస్తుంది).. తద్వారా ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతారు అన్న సినిమా ఫార్ములా పాటిస్తారు..వుదా: స్వాతికిరణం లో రాధిక, శ్రుతిలయలులో ముచ్చెర్ల అరుణ..(ఏకంగా) కళ్ళనీళ్ళు పెట్టుకుని మరీ ఇంప్రెస్ అయిపోతారు పక్కవాళ్ళ పిల్లల మీద. స్వాతిముత్యం లో "చాలా బాగా పాడుతున్నారే" అని కమల్ పాటను మెచ్చుకుంటూ రాధిక డైలాగ్ కూడా అటువంటిదే..

) ప్రతీ సినిమాల్లోనూ కాకపోయినా చాలా సినిమాల్లో కధకు అవసరం లేకపోయినా హీరోయిన్ గాని పక్క పాత్ర గాని స్నానం చేసే సీన్ వుంటుంది.. (లేకపోతే మాస్ ప్రేక్షకులు చూడరేమోనన్న బెంగ వల్లనేమో)..

) ఇంచుమించు అన్ని సినిమాలు ఇంటర్వెల్ వరకూ ఒక క్రమ పద్దతిలో నడచినా, అక్కడ్నుంచి ఏవేవో కొత్త పాత్రలు ఎంటర్ అయి.. కధను కాస్త ప్రక్క దోవ పట్టిస్తూ ప్రధాన పాత్ర చుట్టూ కాకుండా ఇతర పాత్రలకు ప్రాధాన్యం కల్పిస్తూ సాగుతాయి.. కాని శిఖరాగ్రం లో ఒక వైవిధ్య భరితమైన ఎండ్ కోసం తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తాయి..

) ఎండింగ్ లో ఎవరూ ఊహించని మలుపు తిప్పి, దర్శకత్వ ప్రతిభ నంతా ప్రదర్శించాలనే తాపత్రయం కనిపిస్తుంది ..ఇక అక్కడ విశ్వనాధ్ అనే దర్శకుడు తప్ప ఇంకెవరూ కనబడకూడదనే పట్టుదల హెచ్చుగా కనిపిస్తుంది..

అందువల్లనే ఎంతో బాగా చేసినా, నటులు ఎంత బాగా నటించినా సరే ధోరణి కాస్త ఎక్కువ అవడం వల్లన, స్వయంకృషి, సూత్రధారులు, శుభసంకల్పం, స్వరాభిషేకం వంటివి ప్రేక్షక ఆదరణ పొంద లేకపోయాయి..
సప్తపది కూడా మంచి కధ, మంచి పాటలు ఉన్న సినిమా.. కాని ఏవరేజ్ గా నే ఆడింది(మిగిలిన పాత్రల సుత్తి ఎక్కువైందేమో నన్న అనుమానం నాకు)..
శ్రీ విశ్వనాధ్ గారు మన తెలుగు వాళ్ళు గర్వపడే దర్శకులు.. ఒక సమస్య ని విభిన్న కోణం లో చూపించి, నటులలో వున్న పూర్తి టాలెంట్ వినియోగించుకోగల సమర్ధులు..
"శంకరాభరణం", "సిరివెన్నెల" వంటి మహోన్నత కళా రూపాల్ని సృష్టించిన దర్శక బ్రహ్మ.. అటువంటి మహానుభావునికి కూడా ఇన్ని సెంటిమెంట్లు, బలహీనతలు ఎందుకు అని.. సింపిల్ గా అయినా మనకు బాపు గారు, బాలచందర్ గారు సినిమాని నటులలో ఓవర్ ఏక్షన్లు, ఓవర్ భావోద్వేగాలు లేకుండా చాలా నేచురల్ గా, అతి తక్కువ మేకప్ తో సినిమాలు తీస్తారు..

ఇదంతా కేవలం నా భావాలు పంచుకోడానికే, నిజానికి విశ్వనాధ్ గారి సినిమాలో ఏదైనా పాట వినందే నిద్రపోని అభిమానిని నేను..

Sunday, June 5, 2011

మన హీరోలు ..అసలు స్వరూపం


సరదాగా మా అబ్బాయి (మహేష్ వీరాభిమాని) చెయ్యమంటే ఫోటో షాప్ లో ఇలా చేసాను .. చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ....

Wednesday, June 1, 2011

అయ్యారే ఎంత దుష్టుడీ మానవుడు


ఔరా ! ఈ మానవుడు ఎంత దుష్టుడు, దుర్మార్గుడు. ఒకే జాతికి చెందిన జంతువుల మధ్య శతృత్వం పెట్టి, అవి కొట్టుకుంటు వుంటే, వాటి ప్రాణాలు గాల్లో కలిసి పోతే ఎంతో పైశాచికంగా ఆనందిస్తాడు. పందెం కోళ్ళ ని
ఓ సంవత్సర కాలం జీడిపప్పూ, బాదం పిస్తా తో పెంచి, బలిష్టంగా తయారుచేసి, వాటి కాళ్లకు కత్తులు కట్టి, వాటిలో వాటికి శతృత్వం లేక పోయినా, కవ్వించి, పందెం పెట్టి వాటిని యుద్ధానికి వదులుతారు.. ఆ రెండు తన్నుకు చస్తుంటే కొన్ని వేల రూపాయలు పందెం పెట్టి మరీ చుట్టూ చేరి ఎంతో ఆనందిస్తారు (పైశాచిక ఆనందం).
ఆనక
ఓడిపోయిన కోడిని వేలంలో కొనుక్కొని చంపుకు తిని ఆనందిస్తారు..


సరిగ్గా
ఇదే సూత్రాన్ని ఆనాడు బ్రిటీష్ వాడు పాటించాడు.. ఒకే జాతి బిడ్డలమైన మనల్ని విభజించాడు.. మీలో ఇన్ని కులాలు,జాతులున్నాయని ఒకళ్ల మీద వేరొకరికి
లేని విభేదాల్ని సృష్టించాడు.. సమగ్ర భరతావని రెండు ముక్కలుగా విడిపోయి కొట్టుకుని చచ్చిపోతూ వుంటే ఇలాగే పైశాచిక ఆనందాన్ని పొందాడు..ఇప్పటికీ ముక్కలైపోయిన ఇరు దేశాలు యుద్దం కోసం కోట్ల రూపాయల్ని, ప్రాణాల్ని కోల్పోతుంటే అమెరికా, బ్రిటన్ వాళ్ళు చలిమంటల్లో వెచ్చదనాన్ని ఆశ్వాదిస్తున్నారు..

మళ్ళా ఇదే సూత్రాన్ని మన రాష్ట్ర నాయకులు పాటించారు.. కలని కట్టుగా వుండి, అభివృద్ది అయినా, పేదరికం అయినా సమానంగా పంచుకుంటూ జీవనం సాగిస్తున్న ఒకే భాష మాట్లాడుతున్న తెలుగు వారిని రెండు లేదా వీలైతే మూడు ముక్కలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కళ్ళు రాజ్యం ఏలాలని, ముఖ్యమంత్రులుగా తరతరాలుగా ఏలచ్చని పచ్చటి కలలు కంటూ, వాళ్ళ పిల్లల్ని కూడా ఈ రొంపి లోకి లాక్కిచ్చి, జనాల మీద కి వుసిగొల్పి మనలో మనం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ప్రాణాలు కోల్పోతూ వుంటే వాళ్ళు మన శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు.

రాష్ట్రం
చీలక ముందే, తమ పట్టు కోసం రేయింబవళ్ళూ పావులు కదుపుతూ మాటల యుద్దాలు, అనుచరుల ముష్టి యుద్దాలు కూడా చేయిస్తున్నారు.
ప్రజలకి ఇరవై నాలుగు గంటలు నిరంతర వార్తా కధనాలతో సంచనాలు సృష్టిద్దామను కునే చానళ్లకు పండగ, టి .ఆర్.పి రేటింగ్ పెరుగుతున్నాయి.. నాటకాల్ని వినోదించడానికి కాలక్షేపంగా తీసుకుంటే పర్లేదు.. కాని సీరియస్ తీసుకుని తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న విద్యార్ది లోకం, సామాన్య మానవుని గతి?