Sunday, July 31, 2011

నూటికో.. కోటికో ఒక్కరు.. ఎక్కడో ఎప్పుడో పుడతారు.... ..

కరెక్టే నేను రాసింది తెలుగు పాటే..
"నూటికో, కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. అది మీరే మీరే మాష్టారు.. మా దేవుడు మీరే మాష్టారు".... ఎంత గొప్ప పాటా.. సరే ఈ పాటకి నా పోస్ట్ కి లింక్ ఏమిటో మీరే చదవండి..
కా.రా గారు అనబడే కాళీపట్నం రామారావు గారు... ఓ గొప్ప కథా రచయిత.. విశాఖపట్నం వాళ్ళు గర్వపడే రచయిత.. కాదు..కాదు తెలుగువారు (నైజాం, సీడెడ్, ఆంధ్రా కలిపి) గర్వపడే రచయిత..

ఇవన్నీ మాకు తెల్సులే.. ఇప్పుడు కొత్తగా మాకెందుకు ఈ సుత్తి అని మౌస్ ని క్లిక్ మనిపించేసి, నా బ్లాగు మూసేకండి.. గొప్ప విషయం ఏమిటంటే ఆయన మాకు ఏడవ తరగతిలో లెక్కల మాష్టారు.. కారాకిళ్ళీ మాష్టారు.. కాని మాకప్పుడు తెలీదు ఈయన ఓ గొప్ప రైటర్ అని.. సాదాసీదా దుస్తులు, ఓ పాత కళ్ళజోడు..అప్పుడప్పుడు చేతిలో ఓ గుడ్డ సంచి.. ఇవీ ఆయన వేషధారణ. అయితే ఒక్కోసారి ఎవరెవరో వచ్చి ఓ నమస్కారం పెట్టి ఆయనతో మాట్లాడి వెళ్తూ వుండేవారు..బహుశా ఆయన అభిమానులు అనుకుంటా..

ఇక పాఠాల విషయానికొస్తే లెక్కలు చాలా విపులంగా అర్ధమెయ్యాలా చెప్పి, చివర్లో "ఎవర్రా బోధపడిందా?" అని ఆ కళ్ళజోడు మధ్యలోంచి ఏటవాలుగా మమ్మ్మల్ని పరికించి చూస్తూ అడిగేవారు.. అరటి పండు వలిచిపెట్టినట్టు విపులంగా చెప్తే బోధపడకుండా వుంటుందా? క్లాసులో అందరికీ లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి.. ఎప్పుడు నవ్వుతూ వుండేవాళ్ళే గాని ఎవరిమీదా పెద్దగా చికాకుపడింది లేదు.. ఒకేళ కోపం వస్తే "వెధవా" అడ్డగాడిద" అనే తప్ప బెత్తం తో కొట్టింది లేదు..

నిజానికి ఏడోక్లాసు అందరికీ పునాది.. అక్కడే అన్ని సూత్రాలు, గ్రాఫులూ, సిద్దంతాలూ మొదలవుతాయి..వీటిపై సరైన అవగాహన లేకపోతే ఇహ పై క్లాసుల్లో కష్టం గా వుంటుంది.. కాని మాకు ఆ కష్టం లేకుండా మా తొలి లెక్కల మాష్టారు మా కారాకిళ్ళీ (కారా) మాష్టారు. ఇంతకీ కారాకిళ్ళీ అని ఎందుకంటున్నాను అంటే ఆయన సదా కిళ్ళీ నములుతూ వుండేవారు.


ఇంతకీ ఇప్పుడాయన గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈరోజు మా కళాభారతి లో జరిగిన ఓ ఫంక్షన్ కి మా మాస్టారు వచ్చేరు.. ఆయన్ని వేదికపై చూసి మనసు చాలా ఆనందించి ఆ ఆనందాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను..

వైజాగ్ లో మా సైంట్ ఆంథోనీ హై స్కూల్ లో ఇలాంటి మహానుభావులు ఎంతో మంది వుండేవారు కాబట్టే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ కంటే వున్నత చదువులు చదివి, అంతా మంచి వుద్యోగాల్లో స్థిరపడ్డాం..ఎంతో మండి డాక్టర్లు, ఇంజనీర్లు కూడా అయ్యారు. అయితే అక్కడ నేర్పించిన (ఆ రోజుల్లో) డిసిప్లైన్ వల్ల ఆ స్కూల్ విద్యార్ధులు చేసేది ఏ వుద్యోగమైనా చాలా క్రమశిక్షణగా చేస్తారు.. విశాలమైన ఆ ప్లే గ్రౌండ్ లు గాని, నిశ్శబ్దమైన ఆ వాతావరణం గాని ఇప్పుడు రావు..ఇంతకీ మేం కట్టిన ఫీజు ఎంత ..సంవత్సరానికి ఓ పదిహేను రూపాయలు..
సరే ఈ రోజుకి ఇక్కడతో ఆపేస్తూ.. మా గురువుగారికి పాదాభివందనములతో ..శెలవ్

Thursday, July 28, 2011

అక్కినేని గారు... మీరు మమ్మల్ని దోసుకున్నారు

నిన్న కాబోలు ఓ నాయకుడు (టి.కాంగ్రెస్).. "హైదరాబాద్ ని సీమాంధ్ర వాళ్ళు ఏమీ అభివృద్ది పరచలేదు..వాళ్ళే లబ్ధి పొందారు.." అంటూ కొన్ని వుదాహరణలు ఇస్తూ.. అక్కినేని నాగేశ్వర్రావు గారి స్టూడియోస్ గురించి, ఇంకా సినిమా పరిశ్రమ వాళ్ళ గురించి గొప్ప నిజాలు(?) వుటంకించారు.. అప్పుడు ఆ భూములు ఏ పరిస్థితి లో వుండేవి? వుచితంగా ఇచ్చినా అలాంటి మారుమూల కొండలు, దిబ్బల మధ్య ఎవరైనా స్థలాలు తీసుకుని, కోట్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి స్టూడియోలు కడతారండి? పైగా అప్పటి ముఖ్యమంత్రి రమ్మని బతిమాలి, రాయితేలు ఇస్తే వచ్చారు గాని, దోచుకుందామని రాలేదే.
సుమారు ఇరవై, పాతిక సంవత్సరాల క్రితం వరకూ అటు వేపుగా కనీసం ఆటో కూడా వెళ్ళేది కాదు.. కాలి నడకన (కార్లు లేని వాళ్ళు) ఆ దిబ్బలెక్కి వెళ్ళేవారు..
అసలు నేటి పరిస్థితిని బట్టి డెవలప్ అయిన కంపెనీల గురించి గాని, ఇతర నాయకుల భూములు గురించి గాని అస్సలు ప్రస్తావించ లేదు.

అసలు వీళ్ళు ఏం ప్రయోజనం ఆశించి, ఈ తెలంగాణా వుద్యమం చేపట్టారో క్లారిటీ లేదు.. వీళ్ల ఏడుపులు అన్నపూర్ణా స్టూడియో మీదనా? అంటే అర్జంటుగా అక్కినేని వారు ఆ స్టూడియో ని ఖాళీ చేసి, ఏ మద్రాస్ కో పారిపోవాలన్న మాట. రేపొద్దున్న తెలంగాణా వస్తే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయి ఎంత వేగిరం అధికారం లోకి వచ్చి, భూములన్ని కబ్జా చేసేయాలన్న ఆతౄతే గాని ప్రజలమీద అభిమానం, ప్రజల శ్రేయస్సు కోరేలా ఒక ప్రకటన చేయకపోవడం దురద్రుష్టం .

Tuesday, July 26, 2011

నా ప్రశ్న కు మీ బదులేది????

అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ములారా...
తెలుగింటి(త్రిలింగ దేశం) ఆడబడుచులారా..
నా బ్లాగులో.. నా సొంత బ్లాగులో నా కామెంట్లు ఈ గూగుల్ వాడు తీసుకోడం లేదు.. ఎందువల్ల ? మీ కేమైనా తెలుసా?Google Account అయినా, Name/URL అయినా కామెంట్ ప్రచురణ కావట్లేదు.. ఎందువల్ల ? బహుశా సమైక్యాంధ్ర అన్నందుకు ఏమైనా కుట్ర జరుగుతోందా?

ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అసలు ఏం జరగబోతోంది? నాకు తెలియాలి.. తెలిసి తీరాలి...(అమ్మో మెడ పట్టేసింది..ఎందుకంటే ms narayana లెవెల్ లో ఒక్కసారిగా తల తిప్పా..)

Friday, July 8, 2011

కడలి భాష... జన ఘోష

ఒక్కసారిగా సముద్రాన్ని చూడగానే ఎవరికైనా గుండె జల్లుమంటుంది.. అమ్మో ఎన్ని నీళ్ళో,, కనుచూపుమేరకు ఆకాశం, సముద్రం కలసి పోయినట్టు వుండే సమాంతర రేఖ.. ఆ రేఖ దాటితే ఏముంటుంది ? అనే ప్రశ్న కలుగక మానదు..

చిన్నపిల్లలైతే ఎంత త్వరగా సముద్రంలోకి వెళ్దమా అన్నట్టు అమ్మా, నాన్నలు వారిస్తున్నా వినకుండా ఇసకలో పరుగుతీస్తారు.. అమ్మలకి ఖంగారు.. నాన్నలు నవ్వుతూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ తానూ తడుస్తూ గెంతులు..కుర్రవయసు వారు వచ్చీరాని ఈత కొడుతూ తామేదో హీరోలమన్న భావంతో ఒడ్డునున్న వాళ్ళ వైపు ఓ చూపు చూస్తూ, కెరటాలు వచ్చినప్పుడు జంప్ చేస్తూ గంటల తరబడి నీళ్ళలో ఆడుతూ అలసిసొలసి ఇంటికి చేరుతారు..


ప్రేమికులు ఒకరినొకరు చేతులు పట్టుకుని, ఊహల్లో తేలిపోతూ, భవిష్యత్తుకై ప్రణాలికలు వేసుకుంటూ, వురకలు వేసే కెరటాల వలే వున్న తమ వయస్సును కూడా వురకలు వేసుకుంటూ ముందుకు సాగుతారు..

ఏభయ్యో ఒడిలో పడ్డవారు అలా ఓసారి నెలకోసారన్నా బీచ్ లో ఓ పదినిముషాలు గడిపి, తమ మెదళ్ళను దొలిచేస్తున్న సమస్యలను మనసులోనే పరిష్కరించుకుంటూ "హమ్మయ్యా" అని ముందుకు సాగుతారు.. నడక లేదా వ్యాహ్యాళికి వచ్చిన వృద్ద వయస్కులు అంతా ఒకచోట చేరి, అనుభావలను పంచుకుంటూ, చిన్నవారిని చూసి ఆనందిస్తూ హ్యపీగా ఇళ్ళకి చేరుతారు..

మధ్యలో మొక్కజొన్నలు అమ్మేవాళ్ళు, ఐస్ క్రీంలు, మురీమిక్సర్లు అమ్మేవాళ్ళు.. గుర్రాలు, ఒంటెల మీద సవారీలు ఎక్కించుకునే వాళ్ళు, గవ్వలు, శంఖాలు అమ్మేవాళ్ళు, రంగుల రాట్నాలు ఒహటే కోలాహలం.. ఆదివారం అయినా, ఏ పండగ వచ్చినా పార్కింగ్ ప్లేస్ కూడా సరిపోక అవస్థలు..

అయితే కొత్తగా సముద్రానికొచ్చిన వారు తీరం లోతు తెలీక, అలల ఉధ్రితిని అంచనా వేయలేక రిస్క్ లో పడుతూ వుంటారు. హెచ్చరిక బోర్డులు నామ మాత్రం. సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ళ మధ్యలో అలలు కొడుతూ వుంటే ఓ బాలచందర్ లాగ తామూ ఫోటోలు తీయాలన్న తాపత్రయం..

నాచుపట్టిన రాళ్ళు వాళ్ళని మృత్యు ఒడిలోకి లాగుతాయని తెలీక, హీరోల్లాగ వాటిపైకి ఎక్కి ఫోటోలు తీయించు కోవాలన్న వాళ్ళ కోరిక వారిని సముద్ర గర్భంలోకి, వాళ్ళ కన్న మరియు నమ్ముకున్న వాళ్ళకు గర్భ శోకాన్ని మిగులుస్తాయి.. ఆనందం అంతలోనే అంతులేని విషాదం. విధి ఆడించిన వింత నాటకం....

అయినా మళ్ళీ పిల్లల కేరింతలు పెద్దవాళ్ళ హెచ్చరికలు,యువకులకు ధీరత్వం, ప్రేమికుల ముచ్చట్లు, నడి వయస్కుల బాధలు, వృద్దుల అనుభవాలు, అమ్మేవాళ్ళ అరుపులు, పరాయి భాషల వారి వింత కేకలు.. ఇవాన్నీ రోజూ సముద్రుడు వింటూనే వుంటాడు.. ఓదార్చే వాళ్ళని గంభీరంగా ఓదారుస్తాడు.. మనశ్సాంతి కావాలనుకునే వారికి ప్రశాంతంగా కనిపిస్తాడు , ఆయువు తీరిన వారికి మృత్యువు....అంతేకాదు మనకి కూడా ఒక హెచ్చరిక "ఎప్పటికైనా ఆ మృత్యువు,,ఆ కాలనాగు నిన్ను తనలో కలిపేసుకుంటుందని.. అయినా మోసాల.. దగాల జీవితం.....ఇంతేనా.. ఇంకేదైనా వుందా