Saturday, October 15, 2011

ఆశ, వాస్తవం, చేదు నిజం, నగ్న సత్యం..

ఒక ఆశ:
మనకి ప్రత్యెక తెలంగాణా అనే రాష్ట్రం వచ్చేస్తే :
మనకి ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, గోదావరి, కృష్ణ నదులు తెలంగాణా లో ప్రవహించి భూములన్నీ సస్య శ్యామలంగా తయారవుతాయి.. తాగడానికే కాదు అన్ని అవసరాలకు పుష్కలంగా ఎన్నో నీళ్ళు.. హైదరాబాద్ లోను మరియు ఇతర తెలంగాణా లో స్థిర పడిన ఆంధ్రా వోళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఆ ఇళ్లన్నీ మనం ఆక్ర మించేసుకోవచ్చు.. హైటెక్ సిటీని పూర్తిగా స్వాధీన పరుచుకుని అంతా తెలంగాణా వాళ్ళతో నింపేయ వచ్చు.. మన గాలిని, మన నీటిని, మన భూమిని మనమే పాలించు కోవచ్చు...

ఒక వాస్తవం:
పేదరికం ఒక తెలంగాణా లోనే కాదు భారత దేశం అంతా వుంది.. పేద వాడు ఇంకా పేద వాడు గా డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు గా మారుతున్నారు..దరిద్రాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే పట్టణాలలో వున్నమురికి వాడలు, పల్లెల్లో పేదోళ్ళ వాకిళ్ళు మన దేశంలో అంతటా ఎక్కడైనా చూడచ్చు.. పొట్ట చేత్తో పట్టుకుని దుబాయ్ లాంటి దేశాల్లో ఎన్నో పాట్లు పడుతున్న వాళ్ళు, కంప్యూటర్ ఉద్యోగాల పేరుతొ అమెరికా వంటి దేశాల్లో ఎన్నో ఇబ్బందులకి, హత్యలకి గురవుతున్న భారతీయులు...
ఒక పచ్చి నిజం:
విభజించి పాలించు అన్న సూత్రాన్ని ఒంట పట్టించుకున్న మన పాలకులు..కులాల, మతాల, ప్రాంతీయ వారిగా ప్రజల్ని విడగొట్టి పబ్బం గడుపుకుంటున్న మన పాలకులు.. భూమిని, నీళ్ళను, గాలిని కూడా కబ్జా చేస్తున్న పాలకులు..
ఆశల్ని, భ్రమల్ని కల్పించి ప్రజల్ని రెచ్చ గొట్టి, తాము మాత్రం ఎ.సి రూముల్లో, బడా కార్ల లో హాయిగా బ్రతికే నాయకులు..
ఒక నగ్న సత్యం:
ఒక్క పావలా కోసం ఒకే ఒక్క పావలా కోసం వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకుని వాడులాడుకునే ఓ పేద కుటుంబ జీవనాన్ని నాటకంగా చూపించాడు శ్రీ గణేష్ పాత్రో తన "పావలా" నాటిక ద్వారా..నలభై ఏళ్ల క్రితం....
ఒకే మెతుకు కోసం ఒకే ఒక్క మెతుకు కోసం కుక్కలతో బాటు పోట్లాడుకునే కధను రాసారు మరో రచయిత..మనల్ని దోచుకునే వాడు ఎక్కడో సముద్రాలకి అవతల లేదు మన మధ్యనే మన పక్క నే వున్నాడు.. మన డబ్బుకి, మన ప్రాణాలకి, మనాలకి రక్షణ లేదు..
ఒక చేదు నిజం:
ఇప్పుడు భారత దేశానికి స్వాతంత్ర్యం ఒచ్చి ఇన్నేళ్ళయినా ఎలా మన బ్రతుకులు మారలేదో, ఇంకా దయనీయంగా ఎలా తయారయ్యాయో రేప్పొద్దున్న తెలంగాణా వచ్చినా ఇదే పరిస్తితి.. కులాల మధ్య అంతరంగాన్ని సెరిపేయాలని ఎన్నో చట్టాలు చేసినా వర్గ పోరాటాల్లో లో ఎలా మార్పు లేదో అలాగే తెలంగాణా పరిస్థితి కూడా అలాగే వుంటుంది..పాలకులు తెలంగాణా వాళ్లైనా వాళ్ళు ఈ భారత(స్వార్ధ) నల్ల దొరలే.. పేదల్ని, వారి భూముల్ని దోచు కుంటారు... కుర్చిల కుమ్ములాటలో కుమ్మక్కులు అవుతూనే వుంటారు.. ఏమి తెలియని అమాయక జనం బలవుతూనే వుంటారు..
ఎవరో చరిత్ర కారుడు అన్నాడు : ఈ ప్రపంచం లో వున్నవి రెండే రెండు జాతులు ఒకటి పీడిత వర్గం రెండవది పాలక వర్గం..మనుషులు మారినా, తరాలు మారినా ఈ రెండు జాతులు మాత్రం మారవు..
హైదరాబాద్ కా బాద్షా అవ్వాలని కోటి ఆశలతో వున్న కుటిల రాజకీయ నాయకులు వున్నత కాలము ఈ రావణ కాష్టం ఇలా మండుతూనే వుంటుంది..