Monday, November 28, 2011

నీ దారి ఎటు?...


భగవంతుని సృష్టి లో అన్నీ రెండు విభిన్న పార్శ్వాలు కనపడతాయి..
వెలుగు దాని వెనకాలే చీకటి..
అగ్నికి వ్యతిరేకం నీరు..
గాలిలో ప్రాణ వాయువు, ప్రాణహానిని కల్గించే విషవాయువులు....
తెల్లగా వుండే పాలు, నల్లని నీళ్ళు.... ఇలా ఒక్కక్కదానికి ఒక్కొక్క ధర్మం..
నిరంతరంగా వాటి విధులను అవి నెరవేరుస్తూ వుంటాయి.. వీటి మధ్యలోనే మన జీవితాలు కొట్టుకుపోతూ వుంటాయి..
వీటి వునికి తో మనకు జీవితంలో రెండు వేర్వేరు భావాలు ఎదురవుతూ వుంటాయి..
సుఖం దాని వెనకాలే దుఖం...
మెప్పు దాని వెనకాలే అవమానం
ఒకప్పుడు ధనికుడు నేడు పేదగా మారచ్చు.. పేద ధనికుడు కూడా అవవచ్చు..

ప్రేమ.... ధ్వేషంగా మారచ్చు.. ద్వేషం లో ప్రేమించిన వాడే ప్రాణ హరించిన వాడు అవుతున్నాడు..
నీతికి.. అవినీతి కి మధ్య పోరాటం ఎప్పుడు జరుగుతూనే వుంటుంది..

ఇలా రెండు విభిన్న ధోరణులు మనిషిని శాసిస్తున్నాయి..
రెంటి మధ్య ఎటు పక్క వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో మానవుడు మనుగడ సాగిస్తున్నాడు..

అందుకే పూర్వ కాలంలో నీతి కధలు, ధర్మ సూక్ష్మాలు, దేవుని మహత్యాల తో కూడిన కధలు పాఠ్య పుస్తకాల్లో వుండేవి.. మోరల్ పిరియడ్ వుండేది..

ఇప్పటి విద్యా సంస్థల్లో అవి లేవో, అసలు వాటి విలువలు తెలుసున్న వారు యాజమాన్యం లో వున్నారో లేదో..
అన్ని వ్యాపార కేంద్రాలుగా మారిన విద్యా సంస్థలు..
నిరంతరం వార్తలని అందించే చానళ్ళలో అన్ని హత్య వార్తలు.. వాటిపై అనాలిసిస్సులు ...
కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న ఒక మావోయిస్టు చనిపోగానే హిరో అవుతాడు..
పదిమందితో ఎంగేజ్ మెంట్ చేసుకుని వదిలేసిన హిరోయిన్ తల్లైతే అది ఒక పెద్ద వార్త....
మహాత్మా గాంధి, ఝాన్షి లక్ష్మి బాయి వీరు కాదటోయ్ మహానుభావులు, పోరాట వీరులు..
నువ్వు చదివిన చరిత్ర మర్చిపో ....
"జనం మర్చిపోయినా మేం మర్చి పోనివ్వం .. మీలో మత, కుల, ప్రాంత విద్వెషాలని రెచ్చ గోడుతునే వుంటాం ..
చలి మంటల్లో వెచ్చగా , హాయిగా సుఖిస్తాం తరతరాలుగా అనుకుంటూ" ప్రజల ధన, మాన ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటున్న నాయకులు, సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు ఉన్నంత కాలం .....
ఇలా రెండు విభిన్న పార్స్వాల మధ్య జీవుడు నలిగి పోవాల్సిందే..

దేవుని సృష్టి లో వెలుగు, నీడలు .. అగ్ని, వాయువులు.. పాలు, నీళ్ళు... సర్వ మానవాళికి ఒక్క పైసా ఖర్చు లేకుండా సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తే .. మనిషి తోటి మనిషి జీవితాన్ని విభిన్న పార్స్వాలతో నాశనం చేస్తాడు..
శాశ్వతం అనుకున్నది ప్రతిది అశాశ్వతము గా మిగులుతుంది.. అయినా ఆరాటం.. పోరాటం ..
ఇలా ఎంత కాలం..

Thursday, November 24, 2011

ప్రతి ఒక్కరు విన దగ్గ పాట..

బాల మురళి కృష్ణ గారు పాడిన ఈ తత్వం పాట నాకు చాలా ఇష్టం:

వస్తా వట్టిదే.. పోతా వట్టిదే .. ఆశ ఎందుకంటా ..
చేసిన ధర్మమూ.. చెడని పదార్ధము .. చేరును నీ వెంటా...

చేతిలో అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంటా..
ఆకాశంపై పోయేటప్పుడు .. ఎవరు రారు వెంటా..

ఇది ఎవరు రచించారో .. లేదా. ఏదైనా స్తుతి గితమో నాకు తెలీదు గాని.. నన్ను అమితంగా ప్రభావితం చేసింది..
ప్రతి ఒక్కరు దీనిని కనీసం నెలకొసారైనా వినిపించుకుని వుంటే .. ధనాపేక్షతో చేసే మోసాలు, ద్వేషాలు కలుగవు..

ఇంకా ఈ సిరిస్ లోనిదే " ఏమి చేతురా లింగా ఏమి చేతు" .. ఎంత అద్భుతం...

Tuesday, November 22, 2011

హైదరాబాద్ లో ఇరాని చాయ్ సెంటర్ లో నా పాట్లు..

హైదరాబాద్ లో చాలా కాలం(సుమారు ఇరవై మూడు సంవత్సరాలు) క్రిందట జరిగిన సంఘటన... మనం కొన్నాళ్ళు అక్కడ వుద్యోగం వెలగబెట్టాం లెండి.. నాకు మావయ్య వరస అయ్యే అతను .జి ఆఫీసులో పనిచేసే వాడు.. రోజు అతన్ని చూడడానికి వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను.. ఆఫీసు మంచి సెంటర్ లోనే వుందని మీకు తెలిసిన విషయమే..
అయితే అప్పుడు ఇప్పుడు అయినంత డెవలప్ లో లేదు..ప్రతి సెంటర్ లోను ఇరాని చాయ్ సెంటర్ మాత్రమే ఉండేది .. అలాంటి హోటల్ కి వెళ్ళాం. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. నాకు మంచి ఆకలి గా వుంది..
మావాడు "సమోసా" అన్నాడు.. వెంటనే బుట్టడు నిండా సుమారు పాతిక సమోసాలు తెచ్చి మా ముందు పెట్టి వెళ్ళాడు హోటల్ అతను.. ఇన్ని సమోసాలు ఎందుకు ఆర్డర్ ఇచ్చాడో అర్థం కాలా... ఇది భోజనం చేసే సమయం కదా హాయిగా ఏదైనా భోజనం హోటల్ కి తీసికెళ్ళి భోజనం పెట్టించ కుండా ఇలా ఇన్ని సమోసాలు ఆర్డర్ ఇచ్చేడేమిటా అని వాటిని తినలేక తింటున్నా..

అతనేమో స్టైల్ గా రెండు సమోసాలు తిని ఆపేసి, చాయ్ తాగుతున్నాడు.. నేనేమో అవన్నీ తినాలనుకుని అలా తింటూనే వున్నా... అతను నా వైపు వింతగా చూస్తున్నాడు... ఇద్దరికీ మొహమాటం..కాని మా వాడే నన్ను, బుట్టను ఓ సారి పరికించి చూసి, ఇహ వెళ్దామా అన్నాడు..
ఏంటి ఆర్డర్ ఇచ్చిన సమోసాలు తినకుండానే .. డబ్బులు ఎక్కువైపోయాయా.. అనుకుంటూ "ఎందుకు ఇన్ని సమోసాలు ఆర్డర్ ఇచ్చావ్ ? " అని అడిగా .
అప్పుడు అర్ధం అయ్యింది అతనికి.."నేనేమి అన్ని సమోసాలు ఆర్డర్ ఇవ్వలేదు.. మనం సమోసా అనగానే బుట్ట మన ముందు పెట్టేస్తాడు, మనం ఒకటో రెండో తెనేసి మిగతావి వదిలేయాలి..మనం తిన్న వాటికి మాత్రమే బిల్లు పే చేస్తే చాలు.."అన్నాడు..
"
మరి మిగతావి" అని అడిగా అమాయకంగా..
"వాటిని మరొకరు ఆర్డర్ చేస్తే వాళ్ళ టేబుల్ మీద పెడతాడు" ..
ఏంటి మనం తినగా మిగిల్చినవి ఇంకోడు తింటాడా..అయితే మనం తిన్నవి కూడా ఎవడో తినగా మిగిల్చినవేనా." అన్నాను..
అతను నవ్వుతు "అంతే.. అదే ఇక్కడి పద్దతి.. నువ్వు తెలిక బుట్టడు సమోసాలు తినాలని చూసావు..
విషయం నేను గ్రహించే సరికే ఆలస్యం.అయింది. నువ్వు సుమారు ఆరో, ఏడో తిని ఉంటావు.." మరి ఇలా ఒకరి ఎంగిలి వేరొకరికి తగిలి జబ్బులు రావా అని అడుగుదామన్నా నేను అడగలేక పోయా.అప్పటికే కడుపులో దేవుతోంది..సమోసాలు ఎక్కువై పక్క.. చాలా మంది తినగా వదిలిన సమోసాలు తిన్నానే అన్న భావన ఒక పక్క.. సంఘటన జరిగి చాలా కాలం అయినా హైదరాబాద్ గుర్తొచ్చి నప్పుడు.. లేదా మా మావయ్య కనబడ్డప్పుడు అతని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇది గుర్తుకొస్తుంది.... ఇంకా పద్దతి హైదరాబాద్ లో వుందో లేదో నాకు తెలీదు.ఇప్పుడంటే ఇన్ని భోజన హోటల్లు వున్నాయి గాని.. అప్పుడు పెద్ద నాన్ వెజ్ హోటల్లు లేదా ఇరాని చాయ్ హోటల్లు తప్ప హైదరాబాద్ లో ఉండేవి కావు..ఒకటో అరా తప్ప.. అదికూడా నాంపల్లి, సికిందరాబాద్ దగ్గర తప్ప..కాని తాగితే హైదరా బాద్ ఇరాని చాయ్ నే తాగాలి..

Sunday, November 13, 2011

ఏ పుర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

రోజు సాక్షి ఆదివారం అనుబంధం లో కధ "ఆగ్రాలో టాంగా" చాలా బావుంది... నాణానికి రెండో వైపులా తాజ్ మహల్ కి రెండో కోణాన్ని చాలా అద్భుతంగా రాసారు.. చివరికి తాజ్ మహల్ చూడ కుండానే వెనుదిరిగి వెళ్లి పోవడం చాలా బాగుంది.. పైగా చూడ లేదనే అసంతృప్తి తో కాక సిసలైన భారత దేశాన్ని చూసాను అని చెప్పడం చాలా బావుంది.. నిజానికి అనుభవం నాకు చాలా సార్లు జరిగింది..
మొన్నామధ్య
మేము అమృతసర్ వెళ్ళాం.. గోల్డెన్ టెంపుల్ చూడాలని ఎంతో వ్యయ ప్రయాసలు పడి వెళ్ళాం..కాని గోల్డెన్ టెంపుల్ లోని ప్రశాంతత, సిక్కుల భక్తీ మనసుకి ఉల్లాసాన్ని కలిగించినా పట్టణం లోని అపరిశుభ్ర పరిసరాలు, పొంగి పొర్లుతున్న మురికి నీరు, గతుకుల రోడ్లు..మనం తినలేని గట్టి చపాతీలు ...ఎప్పుడెప్పుడు మన వూరు చేరతామా అని ప్రాణం వుగ్గపెట్టుకుని వచ్చాం ...
ఇండియా లో ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి.. కలకత్తా అయినా, హైదరాబాద్ అయినా, ముంబై అయినా, అటు మద్రాస్ అయినా, ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం.... ప్రతి పట్టణం లోను మురికి వాడలు, నిరు పేదల జీవితాలు... స్టేషన్ నుండి రైలు బయటకు వచ్చినా పట్టాలకు ఆనుకునే వుంటాయి.. చెత్త దిబ్బలు వాటి మధ్యలో పూరి గుడిసెలు.. బడుగుల్లోంచి వచ్చిన నాయకులు అంతా ఏం చేస్తున్నారు.. సామాజిక న్యాయం అంటూ గొంతు చించుకునే నాయకులకు ఇవేమీ పట్టవా.. (..) చెందిన వారమంటూ ఓట్ల లోను, ఉన్నత ఉద్యోగాలలోనూ సీట్లను పొందుతున్నా స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా... వీరి తల రాతలు మారలేదేమి....