Wednesday, January 29, 2014

అడుగు జాడ గురజాడదే - స్వకుల విమర్శ..

ఈ పోస్ట్ రాయడానికి నేను సాహసం చేస్తున్నాను.. మహాకవి గురజాడ గారు అన్న నాకు కూడా అభిమానమే...ఆయన రాసిన "కన్యాశుల్కం" మీద నాకున్న అభ్యంతరాలను మాత్రమే..మీ ముందు వుంచుతున్నాను.. నాకు తప్పు అనిపించినవి రాసాను..మీకు తప్పు అనిపించినవి మీరు తెలుపవచ్చు..

కన్యాశుల్కం తెలుగు భాషలో మొట్టమొదట వ్యవహారిక భాష లో వచ్చిన నాటకం.. ఆనాటి సాంఘీక దురాచారాలైన "కన్యాశుల్కం", బాల్య వివాహాలను ఎండగడుతూ రాసిన వ్యంగ్య  నాటకం.. అయితే ఈ దురాచారాలు కేవలం బ్రాహ్మణ కులంలోనే వున్నట్టు రాసారు..ఆనాటి సమాజంలో మిగిలిన కులస్థులకు వున సమస్యలు గాని గాని..అస్పృస్యతా సమస్య గాని ఎక్కడా కానరావు.. ఎప్పుడో వేదకాలం నాడే హిందూ సమాజంలో వున్న వర్ణ వ్యవస్థ సమస్య మీద కనీసం మాట మాత్రంగా కనిపించదు..పైపెచ్చు మిగిలిన కులాల వారిపై యథేచ్చగా కించ పరచడం జరిగింది..అలాంటప్పుడు ఈ నాటకం ఆనాటి సాంఘీక దురాచారాలను ఎత్తిచూపడం ఎలా అయ్యింది..   
  
దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని చక్కటి సందేశమిచ్చారు మహాకవి.కాని మనుష్యులంటే బ్రాహ్మణులోనోయ్..దురాచారాలు, లోటుపాట్లు కేవలం వారిలోనేనోయ్ అని కన్యాశుల్కం లో తెలియజేసారా..
ఆధునిక కవి, నవయుగ వైతాళికుడు అంటే సమాజం మొత్తం మీద జరిగిన అన్యాయాలను తెలియజేయాలి..కేవలం ఒక కులంలోని ఆచార వ్యవహారాలను మాత్రమే ఎండగట్టారు ఎందుకు???  
మరి మిగిలిన కులస్థులంతా కన్యాశుల్కాన్ని ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు..మాటమాత్రమైనా అణగారిన కులాల వారికి జరిగిన అన్యాయన్ని వేలెత్తి చూపక పోయినా బ్రహ్మ రథం పట్టారు..
ఎందుకంటే దురాచారం పేరుతో సుబ్బరంగా బ్రాహ్మణులను తిట్టాడు కాబట్టి...బ్రాహ్మణుల ఆచారవ్యవహారాలను, సనాతన సాంప్రదాయలను వెక్కిరించాడు కాబట్టి..
పోనీ ఒక మంచి వుద్దేశ్యంతో బ్రాహ్మణ సమాజాలలో వున్న లోపాలను ఎత్తిచూపి వాటిని రూపు మాపాలనే ప్రయత్నంచారు అనుకుందాం కాని దానివలన బ్రాహ్మణ సమాజానికి జరుగకూడని అపార నష్టం జరిగింది..

ఆనాటి గురజాడ మొదలు ఈనాటి సినిమా  రచయత లంతా బ్రాహ్మణులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు..కులాంతర, మతాంతర వివాహాలకు బ్రాహ్మణ స్త్రీలు, పురుషులే కథావస్తువులు..సత్ సాంప్రదాయ కులంలో పుట్టిన వారినే లవ్ చేస్తారు..

సమాజంలో ఏ కులస్థుడయినా తప్పు చెయ్యవచ్చు (లంచగొండి తనం, దొంగతనం, వ్యసనాలు పాలవడం, వ్యభిచరించడం - ఇవీ నా దృష్టిలో తప్పుడు పనులు..అజ్ఞాతలు రడీ అయిపోవచ్చు..ఆనాడు సావిత్రి, సుమతి లు చేసిన తప్పుల కన్నా ఇవి తప్పు ఎలా అవుతాయండీ అంటూ ఎనాలిసిస్ చెయ్యండి..నాకు అభ్యంతరం లేదు..కాని ఎక్కడో మర్డరో మానభంగమో జరిగినప్పుడు ..ఛీ.. ఛీ బొత్తిగా పాడైపోయింది సమాజం అని మొసలి కన్నీళ్ళు కార్చకండి..కొవ్వొత్తులు వెలిగించకండి).. 

ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా నేరమే కాని అది వారి జన్మ హక్కులాగ చూపుతారు ..కాని బ్రాహ్మణులు తప్పు చేస్తే మాత్రం చూసారా బ్రాహ్మడు అయ్యుండి ఎలా ప్రవర్తిస్తున్నాడో అంటు గోల చేస్తారు...ఇలాంటి సినిమాలకు,రచనలకు  అవార్డులు వస్తాయి,ప్రజలు బ్రహ్మరథం పడతారు..

మావాడు "బ్రాహ్మిన్" అమ్మాయిని లవ్ చేసాడండీ అని మూతి మూడు వంకర్లు తిప్పుతూ గొప్పగా చెప్తారు.అదే వారి కులం కంటే తక్కువ కులం వారిని ప్రేమిస్తే అరచి గోల పెడతారు ..నా కడుపున చెడబుట్టావ్ అని తిడతారు..ఆ ప్రేమను అంగీకరించడానికి మనసొప్పక పెళ్ళిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తారు..ఇక ఈ హీరో ఏమో పెద్దలను ఎదిరించి మరీ ఆదర్శ వివాహం చేసుకున్నాడు అంటు రెచ్చిపోతారు..మరి బ్రాహ్మణులే వర్ణ సమస్యకి ప్రథాన కారణం అయినప్పుడు సమాజంలో లోపాలన్నిటికీ కారణం బ్రాహ్మణులే (విలన్లు) అయినప్పుడు పెండ్లి చేసుకోవడానికి బ్రాహ్మణ యువతీ యువకులే ఎందుకు ??? ప్రేమకథా వస్తువులకు బ్రాహ్మలే ఎందుకు?? 

సరే ఇక విషయానికి వస్తే అడుగు జాడ గురజాడది అని గొప్పగా చెప్పుకున్న రచయితలంతా ముఖ్యంగా బ్రాహ్మణ రచయితలైన చలం, శ్రీ శ్రీ లాంటి వారికి కథావస్తువు బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ సమాజం..ఇంకా అనేక మంది బ్రాహ్మణ రచయతలు యధేచ్చగా బ్రాహ్మణులని తక్కువ చేస్తూ, ఆచార వ్యహారాలను కించపరుస్తూ రాసారు.సమాజంలో బ్రహ్మరథం పట్టించుకున్నారు..ప్రజాకవులు..ఇంకా ఏవేవో బిరుదులు..

మిగిలిన కుల రచయతలు కూడ ఇలాంటి పని చెయ్యలేదు...  ..ఈ దుస్థితి మిగిలిన ఏ ఇతర కులంలోని లేదు..చింతామణి నాటకంలో సుబ్బిసెట్టి పాత్రద్వారా వైశ్యులని తక్కువ చేసి వున్న డైలాగులను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు..  

ఇదంతా చదివి బ్రాహ్మణులను, వారి ఆచార్యవ్యహారలను కించపరుస్తూ రాసినందుకా కన్యాశుల్కాన్ని విమర్శిస్తున్నారు ??అని ఎగతాళి కి రడీ అయిపోకండి..కన్యాశుల్కంలో అన్ని కులాల వారిని, మతాల వారిని కించపరిచే డైలాగులు వున్నాయి.. అవీ చెప్తాగా రేపు... 

చివరి మాట: అసలు కన్యాశుల్కం ఆచారం అయ్యింది కాని దురాచారం ఎలా అయ్యింది..ఒక మగవాడికి పెండ్లి అవాలి అంటే డబ్బిస్తేనే గాని పిల్లనివ్వరు..అంటే ఆనాటి సమాజంలో ఆడపిల్లకె విలువ..మరి ఇప్పుడు ఆడపిల్లను కనడమే పాపంగా ఎన్నిఘోరాలు చూస్తున్నాం..వరకట్నం పేరుతో ఎన్ని అత్యాచారాలు జరుగున్నాయి...పుట్టకుండానే ఆడపిల్లను చంపేస్తున్నారే.. 

చిన్నపిల్లలకు పెండ్లిండులు  సమాజంలో అనేక జాతులలో కులాలలో జరుగుతోంది..కొంతమంది కులాల్లో ఇప్పటికీ ఆడపిల్లకు చదివించక పద్నాలుగు ఏళ్ళకే ముడిపెట్టేస్తున్నారు..ఈ తరహా అప్పుడూ మిగిలిన కులాల్లో వున్నాయి..కాని మహాకవి ఎక్కడా కన్యాశుల్కం లో ప్రస్తావించలేదు..
అందుకే మిగిలిన కులాల వాళ్ళు ఇది మా ఆచారమండీ అంటు సాగతీస్తారు..ఇది తప్పు ఇది దురాచారం అని వాళ్ళకు ఎవరూ చెప్పలేదు..కాబట్టి వాళ్ళకు తప్పులేదు..పెళ్ళి నాడు తాగడం కొంతమంది ఆచారం (సినిమాల్లో పబ్లిక్ గ్గా చూపిస్తారు, పెళ్ళికొడుకు కూడా తాగుతూ వుంటాడు)..అది దురాచారం అన్నామో మనపని మఠాష్... ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే....మళ్ళీ మనమే సమాజం పాడైపోయిందండీ అంటూ సాగతీస్తాము..

సమాజానికి చెడు కలిగించేవన్నీ ఖండించేవాడే నిజమైన  కవి.. అలాంటి రచయతలు ఎందరో పుట్టారు మన దేశంలో..దళితులకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపిన రచయతలు చాలామంది వర్ణ వ్యవస్థకి మిగిలిన అగ్రకులాల అహంకారాన్ని, దొరల పెత్తనాన్ని ఎండగడుతూ అనేక రచనలు చేసారు, నాటకాలు రాసారు..కేవలం బ్రాహ్మణులని మాత్రమే టార్గెట్ చేసింది స్వకుల రచయితలే ఎక్కువ మంది...

సౌమ్యానికి, సహనానికీ మారుపేరు అయిన బ్రాహ్మణ సమాజం తన మీద, తమ ఆచార వ్యవహారల మీద దాడి జరిగినా చెక్కు చెదరలేదు..ఏ దేశమేగినా, ఎందుకాలిడినా సాంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్న బ్రాహ్మణులందరికీ ఇదే నా జోహార్లు.. వారికి సహకరిస్తున్న మిగిలిన కుల సోదర సోదరమణులకి నా పాదాభివందనం..మిగిలిన వారు మాకు ఇస్తున్న గౌరవం, మర్యాద మరువలేనిది..మేము మిమ్మల్నే ఫాలో అవుతున్నాం శాఖాహారం లోకి మారిపోయాం, మద్యమాంసాలు వదిలేసాం అని చెప్పే వారికి ఇదే ఆహ్వానం.. 
"సర్వేజనా సుఖినో భవతు:" .. దీని అర్ధం నేను మీకు వివరించక్కర్లేదు...నాటికీ నేటికీ ఇదే మా మాట..

(తప్పులున్న సంస్కారవంతమైన భాషతో రాస్తే సరిదిద్దుకుంటాను..)         

Monday, January 27, 2014

ఆనాటి భారతాన్ని కాదు...నేటి భారతాన్ని కాపాడండి..

మనకున్న లోపమల్లా పెరటి చెట్టు వైద్యానికి పనికి రాకపోవడం..
మనకి అందుబాటులో వూళ్ళోనే వున్న ప్రకృతిలోని అందాలను గుర్తించక ఆహ్లాదానికై ఎక్కడో దూర ప్రాంతాలకు వెళతాం...
విలువలతో కూడిన దైననూ మన ధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని ఆశ్రయిస్తాం...  

ఎక్కడో విదేశాల్లో వున్న తెలుగు వాళ్ళంతా కలసి ఒక అసోసియేషన్ గా ఏర్పడి కుల, మత, ప్రాంతాలకి అతీతంగా కలసి మెలసి సన్నిహితంగా వుంటారు..కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు..
"వుయ్ ఆల్ ఆర్ టెలుగూ స్పీకింగ్ పీపుల్" అని మురిసిపోతారు.. కాని ఇక్కడ సొంత వూర్లో కత్తులు దూసుకుంటారు...   

అమెరికాలో మన భారతీయుడుకి ఎన్ని అవమానాలు జరిగినా నోరుమూసుకుని కూర్చుంటాం.. అవమానం ఒక మామూలు సామాన్యుడికి జరిగిందా?? భారత దేశంలో అత్యంత వున్నత స్థానంలో వున్న రాష్ట్రపతికి జరిగింది..రెండుసార్లు చెకింగ్ పేరుతో బట్టలూడదీశారు..అయినా మాట్లాడం..మొన్నామధ్య భారత దేశ ప్రతినిధి అయిన ఎంతో వున్నత స్థానం లో వున్న శ్రీమతి దేవయాని గారికి జరిగిన అవమానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కాని ఏమి చెయ్యగలం?? ఒక రోజు ధర్నాలు చేసి నిరసనలు చేసి ఊరుకున్నాం..

కాని ఒక మంచి మాట మన తోటి వాడు మనకి చెప్తే తట్టుకోలేము..చాల్లే వూరుకోవయ్యా పెద్ద చెప్పొచావు..వేల సంవత్సరాల కితం ఎంత ఘోరం జరిగింది..అది నీకు తప్పుగా అనిపించలేదా అని నిలదీస్తాం..ధర్మ పన్నాలు వల్లిస్తే ఎగతాళి చేస్తాం..పాయింటుని అటు తిప్పి ఇటు తిప్పి దారి మళ్ళించి కుల వివాదాల్లోకి మళ్ళేలా చెయ్యడానికి ప్రయత్నిస్తాం.. 

సత్యం, అహింస అను రెండు ధర్మాలను పట్టుకుని గాంధీజీ ముందుకు నడిస్తే కుల,మత, ప్రాంతాలకి అతీతంగా దేశ ప్రజలంతా ఆయన వెనక నడిచారు..బ్రిటీష్ వాడి కి   ఎదురొడ్డి కలసిగట్టుగా పోరాటం చేసారు..
   
జలియన్ వాలా బాగ్ లో తుపాకీ గుళ్ళకు బలి అయిన వారిలో హిందూ, ముస్లిం,సిక్కు, ఇలా అన్ని మతాల వారు కులాల వారు వున్నారు.. 
ఒక్క సారి ఆ గోడలకు పడ్డ తుపాకి గుళ్ళ రంధ్రాలను చూసి వస్తే  విబేధాలతో కలహించుకోం.. 
కాని ఆ రక్తపు తడి మరకలు ఆరక ముందే..ఒక్క తాటితో నిలబడ్డ భారతీయులు   మత, కులాల వారిగా విడిపోయి   సరిహద్దుల రక్షణకు, వూళ్ళలో జరిగే గొడవలకు కోట్లకొద్దీ డబ్బంతా ఖర్చు చేస్తున్నాం..ఒకటా రెండా ఈ అరవై ఏళ్ళ పైబడి ఇలాగే వున్నాం.. అభివృద్ధిలో రివర్స్ గేర్ లో పయనిస్తున్నాం.. 

దేశానికి స్వతంత్రం రాగానే గాంధీని, గాంధి సూత్రాలను వదిలేసాం..
పోనీ అంతటితో ఆగామా ఆయనపై వ్యక్తిగత దూషణలు, కులపు మచ్చ రుద్దేసాం...ఆయన ఆత్మ కథలో చాలా క్లియర్ గా తాను చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకుని అందుకు పశ్చాత్తాపం కూడా ప్రకటించాడు..
అయినా వదల్లేదు.. పుంఖాను పుంఖాలుగా వ్యతిరేక భావాలు ప్రజల్లో చొప్పించారు.. ఫలితంగా  గాంధీజీ ని ఆయన సిద్ధాంతాలను మనం వదిలేసాం..

కానీ  మనం వదిలేసిన గాంధీని విదేశాల వాళ్ళు ఆదరించారు.. నెల్సన్ మండేలా నుండి  బరాక్ ఒబామా వరకూ గాంధీజీ యే మా ఆదర్శం అని గొప్పగా చెప్పారు..తిరుగులేని నాయకులుగ ఎదిగి వారి జాతిని నడిపించారు.. 

ఇక్కడ  నిషేదించిన  గ్రంథాన్ని , అందులోని ధర్మ సూత్రాలను ఇప్పుడు కొన్ని విదేశీ సంస్థలు తమ మేనేజ్ మెంటు కోర్సుల్లో చేర్చి సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించి అభివృద్ది బాటలో నడిచి లాభాల బాటలో వున్నారు...

కర్పూరానికి గుడ్డ మూసినంత మాత్రాన దాని వాసనను వెదజల్లలేకుండా చెయ్యలేము.. 

మితృలారా కొన్ని వేల సంవత్సరాల క్రితం  తప్పులు జరిగి వుండవచ్చు..అలా జరుగలేదు అని చెప్పడానికి గాని జరిగాయి అని చెప్పడానికి గాని ఋజువులు ఏవీ?? జరిగివుంటే ఖచ్చితంగా అవి తప్పులే..
కాని .అది సాకుగా చూపి  అసమానతలను, వైషమ్యాలను పెంచి  అప్పటి విషయాలకి ఒకరిని  బాధ్యులను చేసి  అవమానము, అవహేళన  చేస్తే  మీకు ఒరిగేది మానసిక ఆనందమే తప్ప మరొకటి లేదు.

ఇవాళ ఏ కులానికి ప్రాధాన్యత లేదు..కేవలం డబ్బు మాత్రమే మనల్ని శాసిస్తోంది.. ఈ రాజకీయ నాయకులు కులం పేరు చెప్పి ఓట్లు దండుకుంటారు..ఆ తర్వాత మనల్ని మర్చిపోతారు...
అన్ని రాజకీయ పార్టీలు కులాల పేరు చెప్పి, వుద్ధరిస్తాం అని హాయిగా పదవులు అనుభవిస్తూ నల్ల డబ్బు మూట కట్టుకుంటున్నారు.. వీలైతే అలాంటి వారిపై పోరాడండి...
"మా కులపోళ్ళు ఇంత మంది వున్నారు సార్!"  అని ఓటుకింత అని తీసుకున్నంత కాలమూ..మనం ఎప్పటికీ ఇలాగే వుంటాం..

ఒకవైపు జపాన్, అమెరికా, సింగపూర్, మలేషియా ఇలా అన్ని దేశాలు మనకంటే ఎంతో అభివృద్ధి చెందుతూ వుంటే..అన్ని వనరులు వున్న మన దేశమే ఇలా పరాయి దేశాల ముందు తలదించుకుని వుంది..మన ప్రతినిధులు అవమానం పాలు అవుతూనే వుంటారు... 

వీటికి పరిష్కారాలు..ఆలోచించండి..పదిమందికీ పంచండి..ఆనాటి భారతాన్ని కాదు...నేటి భారతాన్ని కాపాడండి..    


    

   

Saturday, January 25, 2014

"చెప్పు తినెడి కుక్క చెరకు తీపి ఎరుగునా??" -అంటే ఏవిటి ??

ఇంతకు ముందు నేను "హీరోయిన్ అంటే హీరో కాళ్ళ దగ్గర అర్ధనగ్నంగా పాకడం కాదు" అని పోస్టు రాస్తే ఒక అజ్ఞాత మిత్రుడు అనేక ప్రశ్నలను నా మీద సంధించాడు ..
నాకు తోచినవి నేను చెప్పాను. అయినా   అలా వెంటబడుతూ నాకు పని కల్పిస్తే ..ఇలా నాకు తోచిన విషయాలు రాసాను..ఒకవేళ ఏమైనా తప్పు రాస్తే చెప్పండి నన్ను నేను సరిచేసుకుంటాను...     

ఆనాటి రాజుల కాలంలో జరిగినవాటికి నేనే కాదు..ఎవరూ సమాధానం చెప్పనక్కరలేదు.. గడచిన చరిత్ర మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి..
ఈ వాదనలు ఎంతకీ తెగవు..దానికి బాధ్యులం మనము కాము..

కాని...గత  చరిత్ర , రామాయణ, భారత, పురాణ గ్రంథాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎలా బ్రతికామో తెలుసుకుంటే ఎలా బ్రతకాలో,ఎలా బతకకూడదో  తెలుసుకోవడానికి.. 
రాముడు ఒకవేళ తప్పిదం చేసాడని భావిస్తే ఆ తప్పు మనం చెయ్యకుండా వుండాలి..అంతే కాని రామాయణం అంతా తప్పు,భారతం అంతా పనికిరానిది అని తీసిపడేయవలసినది కాదు.. 

ప్రస్తుత కాలం లోని మనకున్న హక్కులు, బాధ్యతలు, అధికారాలు అవగాహన చేసుకుని ప్రవర్తించాలి..ధర్మబద్ధంగా జీవించాలి..  

మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాము, ఎందుకు గిడుతున్నాము..ఈ మధ్యలో మనం ఎందుకు బ్రతుకుతున్నాము..దేనికోసం బతుకున్నాము అని  చెప్పేదే జ్ఞానం...
సకల సకల కోటి జీవరాశులలో జంతువులలో లేనిది మనిషికి వున్నది ఈ జ్ఞానమే....
మనకున్న పరిజ్ఞానంతో మనసా, వాచా, కర్మణా మనం పని చేస్తే వుత్తమ ఫలితాలు పొందుతాం..
ఎవరికీ మనం సంజాయిషీ ఇవ్వనక్కరలేదు..నీ మనసుకి తెలుసు నువ్వు చేస్తున్న పని చెడ్డదా మంచిదా అని..
ఏది మంచి ఏది చెడు అన్నది ఆ మనిషి పెరిగిన వాతావరణం వలనను, తల్లితండ్రుల వలనను, గురువుల వలనను తెలుసుకుంటాడు..అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాడు..అదే ధర్మం..బ్రహ్మ పదార్ధం కాదు... 

ఆనాటి ధర్మాల్లో లోపాలున్నట్లుగా ఈనాటి చట్టాల్లో లేవని..చట్టాలన్ని ఫెయిర్ గా వున్నాయని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు ..సంతోషం.. 
ఈనాటి చట్టాల లోని లోపాలు లేవు..
కాని వాటిని అమలు పరచడంలో అనేక లోపాలు, కుతంత్రాలు జరుగుతూ నిజమైన నేరస్థులు దర్జాగా తిరుగుతూ వుంటే తప్పు చెయ్యని వాడు తల దించుకుని తిరగవలసిన పరిస్థితులు వున్నాయి.. 
అలాగే ధర్మాలు తప్పు కావు..వాటిని అమలుపరచడంలో లోపాలు వుండడం వలన అనర్ధాలు జరిగివుంటాయి.. ఇక్కడ తప్పు చట్టానిది ఎలా కాదో అక్కడ తప్పు ధర్మానిది కాదు.. 

ఒక ఐ.ఏ.ఎస్.ఆఫీసరో, ఒక మిసిస్టరో చట్ట ప్రకారం తనకున్న అధికారాల తో ఒక మనిషికి సహాయం చెయ్యలేక పోవచ్చు..కాని మానవతా దృక్పధంతో చట్టాన్ని పక్కకు పెట్టి అయినా అతనికి సహాయపడగలడు.. ఒక మంచి పనికోసం రూల్స్ ని అతిక్రమించినా తప్పులేదు..అందువలన చట్టం కంటే ధర్మం గొప్పది... 

ధర్మం అంటే మీ దృష్టిలో ఎవరో బలవంతంగా రుద్దినదీ..శాసించేది.. సంక్లిష్టమైనది..అమలుకానిదీ..ఇంక ఏవేవో వ్యతిరేక భావనలు వున్నాయి..ధర్మాన్ని, ప్రాతివత్యం మీద చాలా వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఆ పేర్లు వింటేనే మీరు భరించలేకుండా వున్నారు...  

సుమతి కథలో ఆమె తన భర్త కుష్టి వ్యాధిగ్రస్తుడైనూ, అనాకారిగా వున్ననూ భర్తపై గల ప్రేమతో, అనురాగంతో వుండి సేవలు చేస్తుంది..కనుక పతివ్రతా ధర్మంపై వ్యతిరేకిస్తున్నారు..అనుకుంటా...
ఏవండీ ఒక్కమాట - మహారాజు కొడుకు,  భావి మహారాజైన సిద్ధార్ధుడు సన్యసిస్తే ఆశ్చర్యం..ఒక కోటీశ్వరుడు తనకున్న సంపదంతా దానం ఇస్తే విశేషం..కానీ ఏవీలేనివాడు నేను సన్యసించాను అంటే ఎవరు పట్టించుకుంటారు..

అలాగే భర్త చక్కటి శరీర పుష్టిగా వుండి తనను అన్నివిధాలా సుఖపెడుతూ వున్న  భర్తను ప్రేమించే ఇల్లాలికన్నా అందవిహీనుడు, రోగిష్టీ అయిన భర్తను సుఖ పెట్టడం , సంతోషపెట్టడం హర్షణీయం కాదా.. 
ఒక గొప్పింటి ఇంట్లో పుట్టిన వాడు వున్నత విద్యను చదవడం గొప్పతనం కాదు..పూరిగుడిసెలో వుంటూ వీధి దీపాలకింద చదివి ఉన్నత శిఖరాలను పొందిన వాడు గొప్ప..ఆ వ్యక్తి గురించే పేపర్లలో రాస్తారు, సన్మానిస్తారు... గౌరవిస్తారు...

అందువలన  సుమతి పతివ్రతా శిరోమణి అయ్యింది..తన శక్తితో సూర్యోదయం కాకుండా  ఆపగల శక్తిని పొందగలిగింది..

కాని నాకు బాధ కలిగించిన విషయం ఏవిటంటే పోస్టరులోని నాయికామణిని మీరు సతి సుమతి కంటే వుత్తమురాలని కితాబు ఇవ్వడం.. సాటి నాయిక (సమంత) ఆ చర్య తప్పు అని ఖండించినపుడు.. మీ దృష్టిలో ఎలా సమర్ధనీయం అర్ధం కావట్లేదు..ఇది మీ సంస్కారాన్ని తెలియచేస్తోంది..

1: అబద్ధం ఆడకూడదు అన్నది ధర్మం: ఈ నియమాన్ని, ధర్మాన్ని పాటించడానికి హరిశ్చంద్రుడిలా ఆలిని అమ్మ నవసరం లేదు... ..ఫలానా టైముకి వస్తాను అన్న మిత్రుడికి కుంటిసాకులు చెప్పకుండా హాజరు అవడం..క్లాసులు ఎగ్గొట్టి సినిమాలూ షికారులు కొడుతూ మమ్మీ ఫోన్ చేస్తే లాబ్ లో వున్నానమ్మా అని చెప్పకుండా వుండటం  .
చీటికీ మాటికీ అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటే చివరికి అబద్ధాలతోనే బతుకు గడిచిపోతుంది..  
 ఇదే అసత్యమాడరాదు అన్న ధర్మాన్ని పాటించడం ..కాని మీరు "ధర్మాలను సమర్ధించాల్సిన అగత్యం లేదు" అని  ఒక స్టేట్ మెంట్ పారేసారు.. ఏవనుకోవాలి?? అంటే నిత్యం అబద్ధాల బాటలో వున్నారన్నమాట..  

2. ఒక స్త్రీ భర్త ను ఎలా చూసుకోవాలి, భర్త తో ప్రేమగా వుంటే ఆ భర్త కూడా తనను ప్రేమించి జీవితాంతం సుఖంగా వుండాలని తెలియచేసేవి పతివ్రత కథలు...ప్రతి చిన్నవిషయానికి భర్తతో గొడవపడి మనస్పర్ధలు ఏర్పరచుకుని కాపురాన్ని చెడగొట్టుకోకూడదని తెలియచేస్తాయి..
హిందూ ధర్మ శాస్త్రంలో మీరు ఆపాదించినట్లు స్త్రీ ఒక్క దానికే ధర్మ శాస్త్రాలు ఏర్పడ పరచలేదు.. 
"ధర్మేచ.. అర్థేచ..కామేచ..మోక్షేచ నాతిచరామి" అని మూడు మార్లు పెళ్ళికొడుకు చేత ప్రమాణం చేయిస్తారు..భార్యని "అర్థాంగి" గా స్వీకరిస్తాడు.. (తన శరీరంలో అర్థభాగం) ఎంత గొప్ప పదం.. 

స్త్రీ హక్కుల పరి రక్షణకై  చట్టాలు ఎన్ని వచ్చినా ఇంకా స్త్రీలపై అత్యాచారాలు, గృహ హింసలు జరుగుతున్నాయి..నిర్భయ చట్టం లాంటి గొప్ప చట్టం తెచ్చినా అత్యాచారాలు ఎక్కువ అయ్యాయి కాని తగ్గలేదు..   
ఇక్కడ ధర్మం కంటే చట్టం గొప్పది ఎలా అయ్యింది మీ దృష్టిలో.. 
కనుక తప్పు ధర్మానిది కాదు..వాటిని వక్రీకరించిన వాళ్ళది..   

     
వేమన గారు ఒక పద్యం లో "చెప్పు తినెడి కుక్క చెరకు తీపి ఎరుగునా??" అన్నారు...అది ఏ సందర్భంలో అన్నారో  నాకూ సరిగ్గా తెలీదు... వీలైతే చెప్పండి..  
ఆయన సనాతన ధర్మాన్ని చెప్పలేదు..జీవితాన్ని చదివాడు..తన అనుభవ సారంతో కొన్ని నీతి పద్యాలు రాసాడు..ఆయన మీరు అనుకున్న కాలంలోని వాడు కాదు..కనీసం వాటిని చదివితే చాలు..అమలు పరిస్తే చాలు....మీరనుకున్నట్లు ఇవి ఎవరివలనో బలవంతంగా శిక్షలు వేసి మరీ ఆచరింపబడ్డ ధర్మ సూక్ష్మాలు కావు...  
ఇంకా సుమతీ శతకాలు, చిన్నయసూరి రాసిన పంచతంత్రం కథలు అన్నీ వాటినే తెలియచేస్తాయి..కనీసం చందమామ కథలు చదువుకున్నా మంచిది.. 

Thursday, January 23, 2014

మేకలను చూసి పులి జడుసు కొనే రోజులు రావాలి...

నిన్న, ఈరోజు శాసన సభలో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి శ్రీ.కిరణ్ కుమార్ రెడ్డి-   ఆనాడు నిండు సభలో "నిండా నాలుగు సీట్లు కూడ మీకు రాలేదయ్యా..సిగ్గులేదా రాజేందర్..తల ఎక్కడ పెట్టుకోవాలి.. ఇంకా ఏం మాట్లాడతావ్ కూర్చో..." అని రా.శే.రెడ్డి గారి లాగ  హుంకరించలేదు... "మనం ఈ విధంగా ముందుకు పోతున్నాం"..అని బాబుగారి లాగ తెచ్చి పెట్టుకుని మాట్లాడలేదు...
(సమన్యాయం..రెండు కళ్ళ సిద్ధాంతం  అంటున్నా..గత అనుభవాల దృష్ట్యా జనం నమ్మక..  రెంటికీ చెడ్డ రేవడి లాగ అయ్యింది అతగాడి పరిస్థితి..)   1 (నేనొక్కడినే) సినిమాలో ఆఖరు సీనులో నాజర్ కి మహేష్ కి  జరిగిన పజిల్ లాగ, సెపరేట్ తెలంగాణా ఇస్తే కాంగిరెస్సు లో విలీనం అవుతామని టి.ఎస్స్.ఆర్.. ముందు విలీనం అవ్వండి అప్పుడు సంపూర్ణ అధికారాలతో షరతులు లేని తెలంగాణాని పువ్వుల్లో పెట్టి వెండి పళ్ళెంలొ పెట్టి అప్పజెప్తాం అని కాంగీ వాళ్ళు ఒకరునొకరు లోపాయికారి ఒప్పందాలతో అక్కడ ఇక్కడ ప్రజలతో గేం ఆడుతున్నారు..
ఇదో మైడ్ గేం ..సుకుమార్ లాంటి మేధావి  మాత్రమే ఈ పజిల్ ని సాల్వ్ చెయ్యాలి..      నిన్న ఈరోజు  స్టార్ బాట్స్ మేన్ ఒక విద్యాధికుడిలాగ,ఒక బాధ్యత కల్గిన ముఖ్యమంత్రి లాగ నిజమైన నాయకుడిలాగ ప్రసంగించాడు.. 
సమైక్యం వాదనను గట్టిగా వినిపిస్తూ విభజన వాదులను కాస్త తీవ్రంగానే అదుపుచేసాడు సమర్ధవంతంగా. 
అలనాడు ఇందిరా గాంధి ప్రసంగం మొదలుకొని గడచిన కాలంలో ఏ ప్రాంతంలో ఎంత అభివృధ్ధి జరిగిందీ.. వుద్యోగాల, జల పరిస్థితులను గణాంకాలతో వివరించాడు.. 

నదుల గురించి చక్కతి విశ్లేషన..విభజన జరిగితే ఏర్పడే వివాదాలను ప్రస్తావించాడు.. (నేను పూర్తిగా చూడలేదు)..అయితే రాష్ట్రాన్ని విడగొట్టాలి అను భావన గట్టిగా వున్న సోనియా ఆదేశాలతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కిరణ్ గారు సమైక్యం కోసం  ఇంత గట్టిగా, ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న..

1 సినిమాలో లాగ.. ఏది నిజమో ఏది భ్రమో అర్ధం కాని స్థితిలో ప్రజలు వున్నారు...  
దూకుడు సినిమాలో మహేష్ "ఏయ్.. మళ్ళీ ఏస్సేడు" అని బ్రహ్మానందం పంచ్ డైలాక్ కి రియాక్ట్ అయినట్లు మనం రియాక్ట్ అవ వలసి వస్తోంది..

పులీ-మేకలు ఆటలో  లాగ ఒక్కొక్క పావునే కదుపుతూ ఒక్క పులి మొత్తం మేకలను అన్నీ తినేసినట్టు ఆ పులి కోటలో పాగా వేయడానికి ఇలా పావులు కదుపోతోంది ఏమో... ఎప్పుడూ  ఆ ఆటలోఅంతిమ  విజయం పులిదే కదా...

కాని "పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!!" అను నాటకం లో లాగ మేకలను చూసి పులి  జడుసు కొనే రోజులు రావాలి...  

ఏది ఏమైనా హాట్స్ ఆఫ్ టూ యూ కిరణ్.. 

కాస్సేపు ఊహల్లోకి కాస్సేపు నిజంలోకి వెళిపోయే హీరో లాగ స్క్రిప్టును రాయకండి..  ఇది రెండున్నర గంటల్లో ముగిసిపోయే సినిమా కాదు కోట్ల మంది ప్రజల జీవితాల సమస్య..     
                

Tuesday, January 21, 2014

వి.ఐ.పీ అంటే బిక్షగాడి కంటే నీచమైన వాడు..

ఒక అజ్ఞాత మితృడు సూటిగా అడిగిన ప్రశ్న: "గుళ్ళలో స్పెషల్ దర్శనాలపై మీ అభిప్రాయం ఏవిటీ?" అని.. 
ఏవిటో కాలక్షేపం  కోసం బ్లాగుల్లో రాతలు మొదలు పెట్టి.. కాస్త నలుగురూ స్పందించేసరికి... కొన్ని సమకాలీన సమస్యలకు కాస్త వ్యంగ్యాన్ని జోడించి ఈనాడు పేపర్ లోలా ఆకర్షణియమైన  హెడ్డింగులు పెట్టి బండి లాగించేస్తున్న నాకు కొంతమంది అజ్ఞాతలు చేతికి కావల్సిన పని చెప్తూ వుంటారు.. అంతా వారి అభిమానం..  

సరే ఇక విషయానికొస్తే ..గుళ్ళల్లో స్పెషల్ దర్శనాలు-మీ అభిప్రాయం.. 


అయ్యా..అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి?? ప్రత్యేక రోజుల్లోనే ఎందుకు దర్శించుకోవాలి అన్న  విషయాలపై పెద్దలు ఎందరో అనేక పుస్తకాలు రాసారు..ఇంకా అనుమానం వుంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావు గారిని అడగండి.. 

 ఈ క్రింది వాక్యాలు నా వ్యక్తిగతం.. 

భగవంతుడుని పూజించాలి అనుకుంటే గుడికి వెళ్ళనక్కర లేదు...పూజలు పునస్కారాలు చెయ్యనక్కర లేదు.. 
కళ్ళు మూసుకుని ఏకాగ్రత చిత్తంతో మనసుని ఆ భగవంతుకి సమర్పించి మీకు నచ్చిన నామాన్ని జపిస్తే చాలు... 

భగవద్గీతలో శ్రీ కృష్ణుల వారు మనల్ని అదే కోరారు..(మనసుని ఇమ్మని- ఆ మనసుని మనకు ఇచ్చిన వాడు దేవుడే కనక) 

దేవుడు మనకు ఇచ్చిన ఐశ్వర్యం కొద్దీ (శక్తి కొలదీ) మనం దేవుని పూజిం వచ్చు..డబ్బు వున్న వాడు మణులు, బంగారం, అనేక తినుబండారాలు దేవునికి సమర్పించవచ్చు.. గుడుల్ని  కట్టించవచ్చు.. ఎవరి అభీష్టం వారిది..  
కాని ఏమీ లేని వాడు పత్రం అయిననూ, పుష్పం అయిననూ, వుదకం అయిననూ భక్తితో సమర్పించాలి..ఏవీ లేకపోతే మీ మనస్సునే సమర్పించుకోండి.. చాలు...  

అన్ని మత గ్రంథాలు  ఎలా బతకాలో చెప్తాయి, ఎలా బతక కూడదో చెప్తాయి......సాటి మనుష్యులకు ఎలా తోడ్పడాలో చెప్తాయి.. ధర్మబధ్ధంగా ఎలా జీవించాలో చెప్తాయి..వాటిని తూ.చ .తప్పక పాటించాలి. 

ఇకపోతే మనం ధ్యానంలో ఆ దేవదేవుణ్ణి స్మరించుకోవడానికి ఒక రూపం వుండాలి కనుక ఒక గుడి అంటూ ఏర్పరచుకుని అందులో దేవుణ్ణి ప్రతిష్టింపచేసారు.. 
ప్రత్యేక రోజుల్లో దేవుని దర్శనానికై ఎందుకు ఎగబడతారు???
మన ఆఫీసరుకి ఒక్క న్యూ ఇయర్ నాడే ఎందుకు పళ్ళు,స్వీట్లు పట్టుకుని వెళ్తాము..స్పెషల్ గా కాకా పట్టడానికి..


అలాటిదే ఇదీను..నిజాయితీపరుడైన ఆఫీసరు  తనను కాకా పట్టిన వాళ్ళను ఒకలాగ..పట్టని వాళ్ళను వేరొకలాగ ఎలా బేధం చూపడో భగవంతుడు కూడా అలాగే తరతమ బేధం చూపడు..
కాని ఎందుకైనా మంచిది అని మనం కాకా పట్టక మానము కదా.... అందుకే క్యూ కడతాం.. 

ఇక ప్రస్తుతం వి.ఐ.పీ లు అంటే  ఎవరు?? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ముఖ్యమంత్రి, మంత్రుల షేషీ ఆఫీసునుండో.. ఎం.ఎల్.ఏ, ఎం.పీ ల లెటర్ హెడ్ పట్టుకునో ..కొంతమంది అధికార్ల సిఫార్సుల లెటర్ పట్టుకునో, టి.టి.డి బోర్డు మెంబర్ల సిఫారసుతోనో  వచ్చే ప్రతీ అడ్డమైన వాడు వి.ఐ.పీ లే ఈ రోజుల్లో...ఆ లెటర్లో 10,20 నుండి 100 మంది వున్నా పట్టించుకునే నాధుడు లేడు..అసలు పరిశీలించే సమయం, ఓపికా, అధికారము, విధానము ఏదీ లేదు..ప్రశ్నించే నాధుడు లేడు.. ప్రశ్నిస్తే ఏవయ్యింది?? వాళ్ళమీద కేసులు పెట్టారు... 

ఇవన్నీ రోజూ పత్రికల్లో మనం చూస్తున్నాం ..టీ.వీ వాళ్ళు అదేపనిగా చూపిస్తూ విమర్శిస్తూ..విశ్లేషిస్తున్నారు...అంతకన్నా గొప్పగా నేను రాయలేను...రాసినా ప్రయోజనం లేదు...

కాని...నాకెప్పుడూ ఒకటే సందేహం...ఒక వర్గం ప్రజలకు గుడిలో ప్రవేశమే కల్పించలేదు ఆనాటి రాజకీయ వ్యవస్థ..  అది ముమ్మాటికీ తప్పే..

కాని .. మనం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకన్న ఘోరంగా చంటి పిల్లలు, వయో వృద్ధులు ఒక క్షణ కాలం భగవంతుని దర్శనం కోసం అల్లాడిపోయి ఇక్కట్లు పడుతూ వుంటే..ఆనాటి వ్యవస్థను తీవ్రంగా ప్రశ్నించిన, గగ్గోలు పెట్టిన వాదులంతా ఏవయిపోయారు...దీన్ని సమర్ధించుకున్నట్లేనా?? .. 
అప్పుడు, ఇప్పుడూ  అధికారంలో వున్నవారు  మాత్రమే దేవుని గుడిలోకి ప్రవేశానికి అర్హులా?? ఇది మాత్రం వివక్ష కాదా?? 
అసలు ఈ వి.ఐ.పీ దర్శనాలకు స్వస్తి చెప్పే విధానాన్ని ప్రకటించమని ఎవరైనా కోరుతున్నారా?? రెండ్రోజులు అరుస్తారు..మళ్ళీ మర్చిపోతారు..తదుపరి వి.ఐ.పీ పాసు కోసం ఎగబడతారు..... 

 అసలు వి.ఐ.పీ అంటే నా దృష్టిలో గుడి మెట్ల మీద అడుక్కునే బిక్షగాడి కంటే నీచమైన వాడు.. "బాబూ.. ధర్మం..అయ్యా ధర్మం " అని తన కడుపుకి  మాత్రమే అడుక్కుంటాడు బిక్షగాడు.. 

కాని  పెద్దవాళ్ళ దగ్గర "ఒక్క వి.ఐ.పీ పాసు ఇప్పించు బాబూ" అని అడుక్కుంటాడు ఈ బిక్షగాడు.."నేను వి.ఐ.పీ ని నాకు మాత్రమే దర్శనం కల్గించు బాబూ" అని (అ)ధర్మకర్తలను అడుక్కుంటాడు..

ఆ బిక్షగాడికి డబ్బిస్తే పుణ్యం వస్తుంది.. కాని ఈ బిక్షగాడికి పాసు ఇచ్చి మిగిలిన సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టిన వాడికి పాపం వస్తుంది...        
ఏ న్యాయ స్థానం గాని, అధికారం లో వున్న పెద్దలు గాని దీన్ని ఖండించక పోవడం విచారకరం.. 
కనుక అధికారులు ఇప్పటికైనా ఆలోచించి వి.ఐ.పీ దర్శనాలకు బ్రేక్ ఇస్తేనే కాని ఈ సమస్యకు బ్రేక్ పడదు..

మనలాంటి సామాన్య మానవుడు బాధపడ్డం తప్ప ఏవీ చెయ్యలేము..

నా మటుకు నేను అయితే గుడి ఖాళీగా వున్న సమయంలోనే భగవంతుడు ఏకాకి గా వున్నప్పుడే దర్శనం చేసుకుంటాను..
ఆఫీసరు ఒక్కడూ ఉన్నప్పుడే కదా మనం చెప్పే నాలుగు మాటలు వింటాడు..

హాయిగా మా వూర్లో నిలువెత్తు విగ్రహాలున్న శ్రీ వేంకటేశ్వర స్వామి గుడులు నాలుగు వున్నాయి...శివాలయాలకు లోటే లేదు..
కార్తీక మాసంలో మారుమూల శివాలయం చూసి వెళ్తాను..ఖాళీగా వుండి మనకు నచ్చినంత సేపు ప్రార్ధించుకోవచ్చు...తోపులాట కుమ్ములాట వుండవు..వీలుపడలేదు అనుకోండి చక్కగా ఇంట్లో వున్న బుజ్జి శివలింగానికే "ఓం..నమ:శ్శివాయ" అంటూ అభిషేకం చేస్తా..
మీరూ అలా చెయ్యరాదూ ???    
        

          

Monday, January 20, 2014

యస్.. నేనొక్కడినే ఇటువంటి చెత్త సినిమా తీయగలను

సినిమాల్లో లాజిక్కుల గురించి.. వాస్తవ పరిస్థితులకి దగ్గరగా వున్నయా లేవా అనే విశ్లేషణ కోణాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో దూరమయ్యారు..
నిలదీసే లక్షణం తెలుగు వాడికి వుంటే........

 అరవై ఏళ్ళ వయసులో తన మనువరాలు వయస్సు వున్న నాయకురాలితో పెద్ద కడుపు వేసుకుని ఒక మహానటుడు గెంతే వాడు కాదు.. ఇద్దరు భామలతో అడవిలోని రాముడిలాగ కుప్పిగంతులు వేసేవాడు కాదు...

మరొక మహా నటుడు 60 ఏళ్ళు వచ్చినా పెళ్ళికాని కుర్రాడిలాగ పదహారేళ్ళ భామతో ప్రేమాభిషేకం చేసేవాడు కాదు.

..

ఆ సినిమాలు తీసిన దర్శకేంద్రులు, దర్శకరత్నలు  తామేదో సమాజాన్ని వుద్దరించాసాం ఆ సినిమాలు తీసి అని ఫోజులు కొట్టరు... మనమే ఆ సినిమాల్ని సంవత్సరాల తరబడి ఆడించాం... కాసులు కురిపించాము...

తప్పు ప్రేక్షకుడిదే కాని దర్శకులది కాదు... వాళ్ళు ఏ చెత్తని తీసినా ఆహా... ఓహో అంటూ ఆకాసానికి ఎత్తేస్తాం.. ఒకేసారి వంద సూమోలు ఎగరొచ్చు... ఒక్క హీరో ఒంటి చేత్తో వందమందిని కాదు వేలమందిని చంపచ్చు...చెంపదెబ్బలు తినడమే కామెడీగా కితకితలు పెట్టుకుని మరీ నవ్వుతాం.. అది 100 సినిమాల్లో వచ్చినా..అదే నటులతో తీసినా..

వీటన్నిటి కన్నా మించినది తీసి సగటు తెలుగు ప్రేక్షకుణ్ణి వుద్దరిద్దాం... అని సుకుమారం లేకుండా  ప్రయత్నించాడు ఒక దర్శకుడు..


ఒక 5 నిముషాలు సినిమా అయ్యేక.. అసలు మనం హాల్లోనే వున్నామా..ఇదంతా భ్రమా అన్న సందేహంలో బుర్రని పిచ్చి ఎక్కించేసాడు...డబ్బు పుచ్చుకుని మరీ హాయిగా వున్న బుర్రని మెంటల్ భలేగా రప్పించాడు...

వేడెక్కిన బుర్రలను అలా వేడిలోనే వుంచి లండన్ అంతా తిప్పేడు..ఫ్రీ గిఫ్టు...
గోవా అందాలకు లండన్ దర్శనం వుచితంగా..
ఒకటి కొంటే ఒకటి వుచితం..
లండన్ పోలీసులకు లంచాన్ని ఎర వేసాడు...వాళ్ళూ మన టైపే అని బోధపరిచాడు..
ఇన్ని హత్యలు జరిగినా లండన్ పోలీసు వాడు వులకలేదు కదా..
పెద్ద పేరొందిన వృక్ష శాస్త్రవేత్త కాని పరిశోధకుడు కాని రైతు కాని ఆచార్యుడు  భార్యతో సహా చనిపోతే ఎవ్వరూ ఆరా తీయరు..
నీకు ఇమ్మని మీ తండ్రి ఇచ్చాడు ఈ మూట అని క్లూ తో వున్న సంచీ జాగ్రత్తగా ప్రధాన విలన్ నాజర్ ఇస్తాడు...
క్యూబ్ పజిల్ చెయ్యడం చేతకాని నాజర్ పాపం దాన్ని భద్రంగా హీరోకి ఇస్తాడు...
(ఇలా అనేక తప్పుల పప్పులలో కాలేసిన దర్శకుడు ఏ ప్రయోజనం ఆశించాడో..ఆరడగుల అందగాణ్ణి అని మురిసిపోయి మిడిసిపడే నాయకుడు ఏమి సాధించాడో తెలీదు... తన నిజమైన కొడుకు పేరు తగిలించుకుని మురిసిపోవడం తప్ప)..    

కాస్త రిలీఫ్ ఏవిటంతే బ్రహ్మీ గాడి చెంపదెబ్బల కామెడీ లేకపోవడం...రోటీన్ పంచ్ డైలాగులు లేకపోవడం...మిగతావి అన్ని మసాలాలు    వున్నాయి...

యస్.. నేనొక్కడినే ఇటువంటి చెత్త సినిమా తీయగలను అని నిరూపించాడు దర్శకుడు...

మహేష్ అభిమానులకు...తెలుగు సినిమాని హాలివుడ్ లెవెల్లో తీసేడని మురిసిపోతున్న ప్రేక్షకులకి క్షమాపణలతో...   

Sunday, January 19, 2014

మనుషులేనా లేక మరో లోకం నుంచి వూడిపడ్డ మరో వింత జీవులా..

మన భారత దేశం మొత్తాన్ని ఒకేసారి గమనించాలి అంటే మన రైళ్ళను చూస్తే చాలు.. ఒకటే ట్రైను లో జనరల్ బోగీలు, రెండవ తరగతి పెట్టెలు, ఏ.సీ బోగీలు.. పేద, మధ్య,ధనిక తరగతి వాళ్ళంతా ఇలా ఒకేసారి కనిపించి కనువిందు చేస్తారు.. 
అందుకే గొప్ప గొప్ప దర్శకులు కొంతమంది ఈ రైలు పెట్టెలనే మాధ్యమంగా తీసుకుని ఎన్నో సినిమాలు తీసారు.. ఆస్కారులు కొట్టేసారు....   
    
ఒక మామూలు మనిషిని మహాత్ముణ్ణి చేసింది ఈ రైలు పెట్టే కదా...
కానీ మహాత్ముడైనా జీవితాంతం సాధారణ బోగీలో ప్రయాణం చేసింది ఆ మనిషే...ప్రజల మనిషి.. 
     
పేదవాడి ప్రయాణం ఎప్పుడూ జనరల్ బోగీలోనే...కాని జనరల్ బోగీల్లో వున్నవాళ్ళంతా పేదవారు కాదు..
రిజర్వేషన్ దొరక్క ఆఖరు నిముషంలో జనరల్ తప్పని సరిగా వెళ్ళేవాళ్ళు వుంటారు... 
"పదండి ముందుకు పదండి తోసుకు" అని శ్రీ శ్రీ గారి కవితకు ఇన్స్పిరేషన్ ఇదేనేమో.. 
మొదట వచ్చిన వాడికి మొదటి స్థానం అన్నట్లుగా రైలు బయలు దేరడానికి గంట ముందు గుడ్డ పరిచిన వాడిదే సీటు మీద  కూర్చునే హక్కు.. మిగిలిన వాళ్ళు ఒకరిపై ఒకరు పడుతూ, నెట్టుకుంటూ సీటుకి సీటుకి మధ్యలో కూర్చుంటూ...ఆఖరుకి బాత్ రూములవద్ద కూడా ఆ కంపుని భరిస్తూ గమ్యాన్ని చేరవలసిందే.. 

ఒక బట్టనలగని వుద్యోగస్తుడు... ఓ స్టూడెంటు కుర్రోడు/ కుర్రది, ఆ పక్కనే ఓ ముష్టివాడో, తాగుబోతు వాడో అయినా అడ్జస్ట్ అయి కూర్చోవలసిందే...
ఆడవాళ్ళని చూసి రెచిపోయి కబుర్లు చెప్పే మధ్యవయస్కులు దగ్గరనుండి.. కనీకనిపించని అందాల్ని జుర్రుకోవాలని ఆరాటపడేవాళ్ళు..  కావాలని తాకుతూ శునకానానందాన్ని పొందేవాళ్ళు ఇంకొంతమంది.. 

చంటిబిడ్డని పొత్తిళ్ళలో పెట్టుకున్న తల్లి మాత్రం బిడ్డ ఆకలికి ఏడవగానే చటుక్కున రొమ్ముకి  హత్తుకుని స్థన్యాన్ని అందిస్తుంది ..ఇన్ని వందల మంది మధ్యలో వున్నా ఏమాత్రం  సంకోచించకుండా...
ఎంతమంది కళ్ళు తనపై పడినా బిడ్డ ఆకలిని తీర్చి తృప్తి గా ఆనందిస్తుంది..ఆకలి తీరిన బిడ్డను ఆడిస్తూ తన లోకంలో తాను వుంటుంది..శిఖరం అంత మాతృత్వానికి నిలువెత్తు సాక్షం..
        
వీళ్ళందరి మధ్యలో పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ "ఛాయ్..ఛాయ్".. "మజ్జిగ...మజ్జిగ"... జాంపళ్ళండీ", "వేరుశెనక్కాయలు" అంటూ.. ఇట్లాంటివి అమ్మేవాళ్ళు.. "కళ్ళు లేని గుడ్డోడినమ్మా.. లోకమంతా మబ్బు వేసినట్టు వుందమ్మా"..అనో.."కుంటికాలు వేసుకుని ప్రయాణకులను తాకుతూ బతిమాలుకునే అడుక్కునే వాళ్ళు.. 
"బాబూ..చిన్నా..ఓ పదిరూపాయలు వెయ్యి" అని జబర్ధస్తీగా మీద పడి విచిత్రంగా చప్పట్లు కొట్టే మరో జాతి ఒకవైపు... 
గంపెడు సంతానం వున్నా జీవితం చరమాంకంలో చేరదీసే వాళ్ళు లేక పండు ముసిలిదై యనభై పడిలో కూడా పదిరూపాయలకు  టేగలు అమ్మే వాళ్ళు వుంటారు.... 
బతికి చెడిన వాళ్ళు కొంతమంది అయితే...పోరాడి బతికేవాళ్ళు మరికొంతమంది...  .. 
ఇది ఒక సినిమాలాంటి వినోదం కొందరికి.. ఇది కడుపు కాలే బడుగు జీవితం కొందరికి..  

రోజూ అదే రూట్లో ప్రయాణం చేసే టీచర్లు..వుద్యోగస్తులు రిజర్వేషన్ కంపార్టుమెంట్లో ఎక్కేసి దర్జాగ కూర్చుంటారు.. ఎవరైనా అడిగితే "ఒక గంటలో దిగిపోతాం" అనిచెప్తారు..ఇంకా ఎవరైనా గొడవ చేస్తే తిరగబడతారు.."రాత్రుళ్ళే గాని పగలు రిజర్వేషన్ సీట్లో పడుక్కోకూడదని రూల్స్ వర్లిస్తారు.. 
ఎందుకొచ్చిన గొడవలే అని వూరుకుంటే అనకాపల్లి నుండి అమెరికా దాకా....సర్పెంచు నుండి ప్రధాని దాకా అన్ని విషయాలు తమకే తెలుసును అన్నట్లు వుపన్యాసాలు దంచుతారు..
నాయకులను..సినిమావాళ్ళను ఎవ్వర్నీ వదిలిపెట్టరు...నీతి- అనినీతి... నల్లడబ్బు.. అన్నీ చర్చల్లోకి వస్తాయి....
చిన్న చిన్న వాదనలు, దెబ్బలాటలు...రైలు దిగ్గానే ఎవరి కడుపు వాడు చేతపుచ్చుకుని దిగిపోతారు.. 
ఈ గంటలోనే లోకోద్ధరణ.. అభినవ గిరీశాలు, వీరేశలింగాలు కనిపిస్తారు వాళ్ళలో...

ఈ బండిలో అమ్మేవాళ్ళకు మాత్రం ఒక నిజాయితీ వుంటుంది...మూడు జాంపళ్ళు పదిరూపాయలకు..ఐదురూపాయలకు గ్లాసుడు మజ్జిగో/ శెనగ కాయలో  అమ్మేస్తారు... 
కొన్ని స్టేషన్ల లో పదిరూపాయలకు వేడి వేడి ఇడ్లీలు తెచ్చి అమ్ముతారు.. చట్నీలు కూడా యమ టేస్టుగా వుంటాయి....
ఈ సదుపాయం మన ఆంధ్రాలోనే ఎక్కువ..
అదే ఒరిస్సాలోనో, కర్ణాటకలోనో... ఇతర హిందీ రాష్ట్రం లోనో కొనుక్కోవడానికి ఏవీ దొరకవు.. స్టేషన్లు అన్నీ ఖాళీగా దర్శనం ఇస్తాయి...
కావాలంటే పాన్, గుట్కా, సిగరెట్లు లాంటివి కనిపిస్తాయి... 
మూడు బ్రెడ్డు ముక్కలు పెట్టి మధ్యలో అవేవో కుక్కి లేదా గమ్ము లాంటి పదార్ధం అంటించి నలభై, యాభై  రూపాయలు చెప్తాడు...ఆ గడ్డి తినలేము....చావలేము...                          

ఈ రాజకీయ నాయకులు వున్నంత కాలము భారత దేశంలో పేదరికం వుంటుంది...దేశంలో పేదరికం వున్నన్నాళ్ళు ఈ జనరల్ బోగీ ప్రయాణం వుంటుంది...
నల్లరంగు అద్దాల బోగీల్లో సమశీతోష్ణ (A.C) పెట్టెల్లో ప్రయాణం చేసే బడాబాబులకు తమ వెనకాలే తగిలించిన జనరల్ కంపార్టుమెంట్లో గోల కనిపించదు..వినిపించదు.. 

డబ్బు, హోదా,దర్పం  కలగలిసి వున్న పెద్దతరగతి పెట్టెల్లో కనిపించని మానవత్వం ఈ జనరల్ పెట్టెల్లొ కనిపిస్తుంది...
బండి ఎక్కగానే లాప్ టాపుల్లోనూ..ఇయర్ ఫోనుల్లోనూ దూరిపోయి సాటి మనిషిని, తోటి ప్రయాణికున్ని కనీసం పలకరించని వీళ్ళు అసలు  మనుషులేనా  లేక  మరో లోకం నుంచి వూడిపడ్డ మరో  వింత జీవులా.. అనిపిస్తుంది ఒక్కోసారి....        

Wednesday, January 15, 2014

హీరోయిన్ అంటే హీరో కాళ్ళదగ్గర అర్ధనగ్నంగా పాకురుకుంటూ ....

కిందటి టపా లో చెప్పినట్టు వూళ్ళో లేక పోవడం వలన కొన్ని విషయాలు ఆలస్యంగా స్పందిస్తున్నాను..sorry..

నేను డి.వి.డి ప్లేయర్ కొన్నప్పుడు మొదటగా వేసి చూసుకుని ఆనందించిన సినిమా "లవకుశ"..
ఒక భక్తి సినిమాతో మొదలుపెట్టాలన్నది ఒక కారణం..సీతమ్మగా అంజలీ దేవి గారిని చూడాలని రెండవ కారణం.. ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో (సి.డి కొనేసాను కాబట్టి)..

"నేను మీ సీతారాముల కథ రాసిన వాల్మీకి నమ్మా"... అని నాగయ్యగారి అభినవ వాచకానికి జోహార్లు..
ఇందులో నాగయ్యగారు, అంజలీ గారు తమ పాత్రలలో జీవించారు.
పాటలు, పద్యాలు.. ఎన్నిసార్లు చూసినా తనివితీరని కళాఖండం...
ఇదే తమిళనాట అయితే ఈ సీతమ్మకు తప్పని సరిగా గుడి కట్టేవారు(ఏమో)...

"సందేహించకుమమ్మా.." అనేపాట సంధర్భంలో సీతమ్మ ఒక దేవతగా కాకుండా ఒక సాధారణ ఇల్లాలి లాగ ప్రవర్తించి రాముడు వేరొకరిని పెండ్లి చేసుకుని కొత్త భార్యతో పీటల మీద కూర్చుని యాగం చేస్తున్నారేమో అని బాధపడిన సీను ఎంత చక్కగా అభినయించారో కదా...జోహార్....  

జయభేరి సినిమాని బహుశా మూడు సార్లు (ఒకేమాటు విడుదల అయినప్పుడు) చూసాను..

అనార్కలి చూసినప్పుడు ఎంతటి కర్కోటకుడికి అయినా హృదయం ద్రవించక మానదు...

ఇక, ఆదినారాయణ రావు గారి సంగీతానికి చెవులు ఒక్కటే కాదు... కళ్ళు, ముక్కు కోసుకుంటాను... ముఖ్యంగా "భక్త తుకారం", "అల్లూరి" పాటలను కొన్ని వందల సార్లు టేప్ రికార్డర్ లో వినేవాడిని...

కారణజన్ములైన ఈ దంపతులకి ఆ భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ..

కన్నాంబ,భానుమతి,అంజలీదేవి, సావిత్రి, జమున లాంటి ధీటైన నాయికామణులను అందించిన తెలుగు చిత్రరంగానికి జోహార్లు... ఈ నటిమణుల ధీరోదాత్వ నటనకు వారికి జోహార్లు..

హీరోయిన్ అంటే హీరో కాళ్ళదగ్గర అర్ధనగ్నంగా పాకురుకుంటూ వుంటుందనే నేటి తరం దర్శక నిర్మాతలకు, నాయికామణులకు ఎప్పటికి కనువిప్పు అవునో కదా..  

Tuesday, January 14, 2014

మరి మనవాళ్ళు శుంఠలే..కాక మరేవిటి???

తెలుగు  బ్లాగర్లందరికీ "సంక్రాంతి" శుభాకాంక్షలు.. 
కాస్త ఆలస్యం అయింది కదా.. ఎందుకంటే వరుస ప్రయాణాలతో బిజీగా వున్నాను.. 

డిసెంబరు ఆఖరు వారంలో ముంబై(నాసిక్, ఖండాలా) వెళ్ళాం.. అటుతర్వాత గుంటూరు వద్ద పొన్నూరు(నిడుబ్రోలు) వెళ్ళాను..
  
ఈ రోజున పండుగ పూట ఒక మంచి పని చేసాను.. అదేవిటో తెలుసా.. విజయనగరం దగ్గర "పద్మనాభం" వెళ్ళాం.. 
ఓస్ అంతేకదా అని తీసిపారేయ్ కండి.. సుమారు 1300 మెట్లు నిలువునా వుంటాయి.. ఎత్తుకి వెళుతున్న కొద్దీ సుందర మనోహర దృశ్యాలు కట్టిపడేస్తాయి.. 
కనుచూపు మేరలో గోస్తనీ నది (ఎక్కడో అరకు నుండి ప్రవహిస్తుంది - తగరపు వలస దాటేక సముద్రంలో కలుస్తుంది)..
దానిపైన బ్రిడ్జి..ఆ పక్కన కొండల వరుస మనకి సమాంతరంగా..

మెట్లు ఎక్కడం కాస్త వయసు మళ్ళిన వారికి ఇబ్బందే..  ఇక కష్టపడి ఎక్కిన తరువాత కొండకి వెనకాల పొలాల పచ్చదనం, చీమల్లాగ కనిపించే కొబ్బరి, తాటి చెట్లు.. (ఏరియల్ వ్యూ)-ఒక హెలికాప్టర్ లోనుండి చూస్తే ఎలాగ కనిపిస్తాయో అలా కనిపిస్తాయి..  

ఎప్పుడో సుమారు 25 ఏళ్ళ కింద ఎక్కాను (స్నేహితులతో) .. 
మళ్ళీ ఇప్పుడే ఎక్కడం (కుటుంబ సభ్యులతో) ..  

రోడ్డు వేసారు గాని ఇంకా తారురోడ్డు కాదు..డ్రైవింగ్  కొద్దిగా ప్రమాదమే..  ఎన్నాళ్ళయినా అభివృధ్ధి పరచని పాలకులని తిట్టుకోక మానము.. 
పొద్దున్న తప్ప పూజారి గారు ఎవరూ వుండరు..కనీకనిపించని దీపాల వెలుగులో రాతి శిఖరం పై వెలిసిన అనంత పద్మనాభుణ్ణి చూడాలి.. 

వీలైనంత వరకూ నలుగురు లేదా అయిదుగురు కలసి వెళ్ళాలి.. ఈ రోజుల్లో భధ్రత అవసరం..
కొండ మీద కనీసం నీళ్ళు కూడా వుండవు..కాని వేలాది మందితో కిక్కిరిసి పోయి వున్న పేరు పడిన దేవాలయాలను దర్శించే కంటే, మనకి చేరువలో వున్న దేవుణ్ణి దర్శించుకోవడం వుత్తమమని నా వ్యక్తిగత అభిప్రాయం.. 

చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని వూరంతా వెతికినట్లు.. మన కి చేరువలో వున్న ప్రసిద్ద ఆలయాల్ని వదిలేసి వేలకు వేలు పోసి ఎక్కడో దూరాలకు వెళ్ళి ఎన్నో అవస్థలు పడటం, సుఖ సంతోషాల్ని దూరం చేసుకోవడం అవసరమా అధ్యక్షా?? 

పద్మనాభం వూరు విశాఖనుండి రెండు రకాలుగా చేరుకోవచ్చు..
1. హైవే -5 నుండి తగరపువలస దాటేక ఎడమవైపు తిరిగితే వయా రేవిడి మీదుగా చేరుకోవచ్చు..

2. సింహాచలం వద్ద అడవి వరం గ్రామం నుండి సొంఠ్యాం మీదుగా అనకాపల్లి - విజయనగరం రోడ్డుమీదుగా ఎడమ పక్కకి తిరిగి చేరుకోవచ్చు..  ఈ రూట్లో అయితే చక్కగా పల్లె వాతావరణాన్ని ఆశ్వాదిస్తూ వెళ్ళవచ్చు.. ఎట్నుంచి అయినా సుమారు 45 కిలోమీటర్లు.. 
 కాని ఈ పాతికేళ్ళుగా అవే సింగిల్ రోడ్లు..కనీసం టీ కూడా దొరకని ప్రదేశాలు.. యావత్ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఇదే పరిస్థితి.. మరి మనవాళ్ళు శుంఠలే..కాక మరేవిటి??? 

ఇన్నాళ్ళూ పదవులు పట్టుకు వేళ్ళాడి కేంద్రంలో కుర్చీని తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు విభజన ఏర్పడితే కొత్త పదవులను ఆశించేవాడు పరమ శుంఠ..వీళ్ళను గెలిపించిన మనం..????