Thursday, September 25, 2014

"స్వచ్చ భారత్" మూడు ముక్కలు...మూడు బొమ్మలు..

 "స్వచ్చ భారత్" ఇది నేటి నినాదం..
ఈ పిలుపు ఇచ్చింది నేటి ప్రధాని..
 
అంటే ఏమి చేయవలె.???.   
ఈ సంవత్సరం అక్టోబర్ 2 మొదలు కొని 2019 సంవత్సరం 2 అక్టొబర్ వరకు అంతా కలసి గట్టుగా కృషి చేసి 2019 అక్టొబర్ 2 తేదీ కల్లా "స్వచ్చమైన భారత దేశాన్ని" రూపొందించాలి.. 
ఎందుకంటే 2019 అక్టోబర్ 2 వ తేదీ మహాత్మా గాంధీ గారి 150 వ పుట్టినరోజు.. 
మహాత్మా గాంధీ గారు ఇంకా మహాత్ముడు కాని రోజుల్లో వుదయాన్నే గుజరాత్ వీధుల్లో చీపురు తో మురికి వాడలను శుభ్రపరచేవారు.. 

మరలా ప్రజలు రాత్రి గడిచేసరికి పాడు చేసేవారు.. మరల తెల్లారేసరికి రోడ్లన్ని శుభ్రపడి వుండేవి.. 
ఆ గ్రామ వాసులు ఒక పెద్దాయన తెల్లారగట్ల నాలుగు గంటలకే వీధులను (మల మూత్రాలను) తుడవటం చూసి సిగ్గుపడి రోడ్లను పాడుచెయ్యటం మానివేసి వారూ పరిశుభ్రత పాటించుటలో కృషి చేసారట..
మహాత్మా గాంధీ నేటి ప్రధాని పుట్టిన గుజరాత్ గడ్డపై పుట్టారు కాబట్టి మహాత్ముని స్పూర్తితో ఈ యొక్క "స్వచ్చ భారత్" కార్యక్రమాన్ని రూపొంచించడం జరిగింది..  
ఇప్పటికే అధికారిక తాకీధులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అందచేయడం జరిగింది.. ఆ ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క అధికారి ఏమి చేయాలి అంటే:

1. అన్ని కార్యాలయాల సిబ్బందికి, ఆఫీసర్లకు పరిశుభ్రతా ఆవశ్యకతపై అవగాహన కల్గించి వారు తమ కార్యాలలోను, పబ్లిక్ ప్రదేశాలలోను పరిశుభ్రతా చర్యలు చేపట్టాలి.. అనేక కార్యక్రమాలు చేపట్టాలి..
 2. మరుగు దొడ్లను నిర్మిచుటలో సహాయపడాలి..
 3. ఇతరులను (అనుసంబధిత వ్యాపార వాణిజ్య రంగాలవారిని, (యూజర్ డిపార్టుమెంట్స్)    ఇందులో భాగస్వాములు చెయ్యాలి... 
  4. మహిళా సంఘాలకు, బడి పిల్లలకు  అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని భాగస్వాములు చేయాలి..
 5. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి వాటి తాలుకా ఫొటోలను అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టాలి..
(మిగతా విషయాలు మరో టపాలో వివరిస్తాను)
మనకు ఈ "క్లీన్ అండ్ గ్రీన్" మరియు "జన్మ భూమి" లాంటి పధకాలు కొత్తేవీ కాదని పెదవి  విరవకండి..
 "కొత్త సీసాలో పాత సారా" అని  మూతి మూడు వంకర్లు తిప్పకండి..
ప్రతీ ఒక్క నాయకుడు మన దేశాన్ని, రాష్ట్రాన్ని "సింగపూర్" లాగనో "అమెరికా" లాగనో తయారు చేస్తాం అంటున్నారు.. కాని అందుకు ప్రజల భాగస్వామ్యం తప్పని సరి కదా..

Friday, September 19, 2014

గతి తప్పిన మన ఎద లయను సరిదిద్దే మాంత్రికుడు....

అతనొక బాలుడు.. అద్భుతమైన ప్రతిభగల బాలుడు.. ప్రజలంతా తండొపతండాలుగా వెళ్ళారు..అతనిలోని ప్రతిభని ఆస్వాదించడానికి.. మైమరిచిపోయి, కళ్ళప్పగించి.. చెవులు రిక్కరించి మరీ ఆ అద్భుత లయవిన్యాసానికి.. సంకీర్తనా హేళికి పరవశులై ఆ చిన్నారిని ఆశీర్వదించారు.. 

బాల మురుగన్ లాగ నుడుట వీభూతి రేఖలతో వొప్పాడి..అలవోలకగా ఒక బుల్లి వాద్య పరికరముపై బుల్లి చేతులతో ఒకొక్క రాగాలు పలికిస్తూ..మధురమైన సాంప్రదాయ కీర్తనలను మధురంగా పలికిస్తూ వుంటే నోరెళ్ళబెట్టి స్థబ్ధులై పోయారు..
అలనాటి ఆ అదృష్టవంతుల్లో నేనూ ఒకడినై వుండటం నా అదృష్టం..
ఆ పరికరం పేరు ఏమిటో కూడా ఎవరికీ తెలియదు.. ఒక విదేశీ వాద్యపరికరం.. గిటారు లాగ చిన్న చిన్న శబ్దాలు తప్ప వీణలాగో వయోలిన్ లాగో పూర్తి రాగాలను పలికించలేదు.. కాని ఆ పరికరాన్ని పట్టుకున్నది ఎవరు??
తన ఇంటిపేరునే "మాండలిన్" గా మార్చుకున్న "మాండలిన్ శ్రీనివాస్" ..నిండా పదేళ్ళు కూడా నిండని బాలుడు..అయితే ఏం..అరవై ఏళ్ళ అనుభవం గల కళాకారునికి ఆబ్బిన  ప్రతిభ అతని సొంతం..   


ముందుగా "మహా గణపతిం" వాయించి వినిపించేవాడు... చేతులకి కలిగే శ్రమని, రాగాలు పలికించడంలో కష్టాన్ని తనమనసులోనే ఇముడ్చుకుని బయటకు మాత్రం ... అల్లరంతా చేసి "నేనేమీ తప్పు చెయ్యలేదమ్మా" అని అమాయకంగా నవ్వుతూ నిలబడే బాలకృష్ణుడిలా అందరివేపు చూసి నవ్వేవాడు..
"నేను చాలా కష్టపడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ..చూడండి ఎంత సులువుగా వాయిస్తున్నానో.." అని మనల్ని ప్రశ్నిస్తున్నట్టు వుండేది ఆ బాలుని చూపు..


చూస్తూ వుండగానే దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు.. కేసెట్ల విడుదలలు.. ఎన్నో ...సన్మానాలు.. పురస్కారాలు..
తమిళియన్ అని మనం పప్పులో కాలేస్తాం..అక్కడ విద్యభ్యాసం చెయ్యబట్టి..కాని మన అచ్చతెలుగు కుర్రాడే.. పాలకొల్లు వాస్తవ్యుడు.. 
ఇంద్రాది దేవతలు ఆయన మధురమైన మాండలిన్ సంగీతాన్ని ఆస్వాదించడానికి తీసుకుని వెళ్ళారు.. కాని నాయనా శ్రీనివాస్ నీవు ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా వుంటావు..
సంగీత ప్రియుల అందరి ఇళ్ళళ్ళోను నీ మాండలిన్ సంకీర్తనా స్రవంతి నిక్షిప్తమై వుంటుంది.. 

అంతర్జాల పుణ్యామా అని "యూట్యూబ్" వారి ధర్మమా అని నీ కీర్తనలను అలసిన మా మనస్సులు ఆందోళనగా వున్నప్పుడు స్వాంతన  పరుచుకోవడానికి కాని..., గతి తప్పిన మా ఎద లయలను నీ లయవిన్యాసంతో సరిదిద్దుకుని ఆరోగ్యవంతులుగా వుండుటకు ప్రయత్నిస్తున్నపుడు గాని.. కుసింత సేపు దైవ ధ్యానంలో వుండాలని అనిపించినపుడు గాని నిన్ను సృజిస్తూ వుంటాము... 
నేటి యువత నీలో కార్యదీక్షతను, కఠోర పరిశ్రమను, నిశ్చల నిర్మల మనోభావాలను ఆదర్శంగా తీసుకుంటారని..తీసుకోవాలని  కోరుతూ.. 
నీ ఆత్మ శాంతికై నేను ఇచ్చే నివాళి..
నీ సంకీర్తలను వింటూ ఈ విధంగా పోస్టు రాయడం.. 
ఇంతకన్నా ఏవీ చెయ్యలేని ఈ అన్నయ్య నివాళి..      

Monday, September 1, 2014

ఈ వంకర టింకర లిపిని సంప్రదాయవాదులు ఇష్టపడే వారు కాదు..
1980 సవత్సరానికి కాస్త అటు ఇటుగా "బాపు" లిపి ప్రాచుర్యం లోకి బాగా వచ్చింది.. కళాకారుడు అనే వాడు అంటే బొమ్మలు గీసే పెతీ వోడూ ఈ "బాపు స్టైల్" ల్లో తెలుగు రాతని గీక డానికి తెగ ఆపసోపాలు పడేవారు..
 కాని "శంకరాభరణం" సినిమాలో చూపెట్టి నట్టు ప్రాశ్చాత్య సంగీతం వచ్చి  సాంప్రదాయ సంగీతాన్ని మింగేసినట్టు ఈ వంకర టింకర లిపిని సంప్రదాయవాదులు ఇష్టపడే వారు కాదు.. 
చక్కగా గుండ్రంగా అక్షరాలు రాస్తేనే మంచి సంప్రదాయం.. దాన్ని కాదని ఇలా వంకర టింకర అక్షరాలు రాసినవాళ్ళను సమాజం తిరస్కరించేది..కొండకచో తిట్టే వాళ్ళు కూడా.. "ఏవిటి అక్షరాలను అలా ఖూనీ చేస్తున్నావ్" అని..
నిజం చెప్పొద్దూ.. అప్పట్లో మా మిత్రుడు ఒకాయన ఇలాగే బాపు లిపిలో రాయలేక ఆపసోపాలు పడుతూ వుంటే నవ్వేవాణ్ణి... 
పక్కన మరో కళాకార మిత్రుడు .."అదంత వీజీ కాదు.. కావాలంటే రాసి చూడు" అన్నాడు.. నిజమే... కష్టం అనిపించినా నాకు కూడా అదే అలవాటైపోయింది.. ఇప్పటికీ కొంతమంది "ఏవిటీ కొక్కిరి రాత?" అని పాతకాలం వాళ్ళు తిడతారు గాని... 

మా నాటకాల వాళ్ళకి నేనే స్క్రిప్టు రాస్తాను కాబట్టి.. బాపు గారి లిపిలో రాస్తేనే వాళ్ళు చాలా ఆనంద పడి మెచ్చుకుని తొందరగా డైలాగులు వంటబట్టడానికి నా రైటింగే కారణమని అభినిందిస్తూ వుంటారు.. ఆ గొప్పతనం నాది కాదు "బాపు" గారిది అని చెప్తు వుంటా...         

కళాకారులకు "బాపు" లిపి కేరాఫ్ అడ్రస్స్ గా మారింది.. అంటే ఎవడైనా కళాకారుడు బాపు లిపి లో రాస్తేనే వాడు కళాకారుడు..లేక పోతే వాడు ఆర్టిస్ట్ కానేరడు అనే స్థాయికి వెళ్ళిపోయింది.. 


బొమ్మలు వేసే వాళ్ళతో మొదలైన ఈ జబ్బు కవితలు, కథానికలు, నవలలు రాసేవాళ్ళు కూడా బాపు లిపిలోనే అక్షరాలు అలా  పరిగెడుతూ వుంటే వాళ్ళ భావం కూడా పాఠకుల మెదళ్ళలో పరిగెడుతూ వుత్సుకతను రేకెత్తిస్తూ ఆసాంతం చదివేలా చేస్తుంది ఈ లిపి..
అలా అంతా బాపు లిపికి దాసోహం అయిపోయి చివరికి పెళ్ళి శుభలేఖల్లో కూడా బాపు బొమ్మ నమస్కారం పెడుతూ బాపు లిపిలో "ఆహ్వానం" అని రాస్తేనే గాని అది శుభలేఖ కాదు అనేంతగా తెలుగు వారి మదిలో ఈ లిపి ముద్ర పడిపోయింది.. 

తెలుగువాళ్ళు చిత్రమైన మనుష్యులు.. .. ఎవరిని ఎప్పుడు పైకెత్తుతారో ఎప్పుడు దించుతారో తెలీదు.. ఎవడో వచ్చి చెప్పే వరకు మన వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించరు.. ఎవడో పరాయి భాష వాడు తీసిన సినిమాని "ఆహా".. "ఓహో".. అంటూ ఆకాశానికి ఎత్తేస్తాం..  
కాని మనవాడే మేకప్ లేకుండా నేచురల్ గా సినిమా తీస్తే దాన్ని గుర్తించం.."ఆ(..ఏం తీసేడులే నా ముఖం" అంటాం.. అందుకే మొదట్లో  బాపు గారు తీసిన సినిమాలను తొందరగా ఆదరించలేదు జనాలు.. 

"తూర్పువెళ్ళే రైలు" లాంటి చిత్రాలు ఎంతమంది చూసారు చెప్పండి.. 
శ్రీధర్ ని హీరో గా పెట్టి ముత్యాలముగ్గుని, కృష్ణం రాజు తో భక్త కన్నప్పని, శోభన్ బాబు ని రాముడుగా పెట్టి తీసిన సంపూర్ణ రామాయాణాన్ని చూసి పెదవి విరిచిన వాళ్ళు చాలామంది వున్నారు.. 

కాని రాను రాను ప్రజల ఆదరణ ఎక్కువై అవి సూపర్ హిట్లై నిలిచాయి..
చాలామంది దర్శకులు సమాజాన్ని వుద్దరించే సినిమాలు తీసినా, అందులో ఒక కులమో మతమో ప్రాధాన్యత వుంటుంది.. కాని బాపు గారి సినిమాల్లో సమాజంలో వున్న పాత్రలే కనిపిస్తాయి.. కుల మత ఆచార వ్యవహారాలు అంతర్లీనంగా  వుంటాయి గాని హైలైట్ అవవు.. అని నా భావన..  

బాపుగారు ఆ శ్రీరాముని సన్నిధికి చేరినందుకు సంతసిస్తూ... రాముని పాదాలు వత్తుతున్న హనుమయ్య హటాత్తుగా లేచి వెళ్ళిపోతున్నాడుట.. అప్పుడు శ్రీరాముడు.."హనుమా ఏమయ్యింది? ఎందుకలా అలిగి నట్టు వెళ్ళిపోతున్నావ్?" అని అడుగగా..

"ఆ బాపు వచ్చాడుగా ఇక నాతో మీకేమి పని.. నేను పోయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటా" అని వెళ్ళిపోయాట్ట.. 
కోదండరామునికి  సేవించేందుకు బాపుగారు చేరుకున్నందుకు ఆనందిస్తూ... తెలుగువారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటు నివాళి అర్పిస్తున్నాను..