Friday, September 25, 2015

భయానక దృశ్యం - హుద్ హుద్ మిగిల్చిన జ్ఞాపకం..

ఇక్కడ దిగువన లింక్  వీడియో - గత హుద్ హుద్ తుఫాన్ సమయములో మా ఇంటిలోంచి తీసిన వీడియో..
నిన్న కురిసిన వర్షం మరల హుద్ హుద్ తుఫాన్ ని గుర్తు చేసింది. 

కురిసిన గంట సేపు వర్షం మరలా అదే వేగం తో విశాఖను ముంచెత్తింది.. 

ఒక చిన్నారిని కాటేసింది.. 

హుద్ హుద్ తుఫాన్ ఆదివారం రోజున జరిగింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు.. 

ఇలా వర్కింక్ డే అయి ఉంటే ఎన్నో వందల ప్రాణాలు పోయేవేమో అనిపించింది అప్పుడు ఇప్పుడు కూడా..  

HUD-HUD CYCLONE FROM MY HOME 

Wednesday, September 23, 2015

వృద్ధులారా..దయచేసి శతమర్కటాలు మాత్రం కాకండి.. సహస్ర కోతులను తయారు చెయ్యకండి..."బ్రహ్మచారి శతమర్కట:"


"వృద్ధనారీ పతివ్రత:"


వీటికి అర్ధాలు చెప్పక్కర్లేదని అనుకుంటాను..
కాని ఇప్పుడు "వృద్ధనారీ శతమర్కట:" అనుకునే రోజులు...
ఇప్పటి వృద్ధులు కొంతమంది తమ వృద్ధాప్యాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు..
కట్టూ బొట్టూ అంటే వేసుకునే దుస్తులు దగ్గరనుండి చేసే పనులన్ని యువతకు తీసిపోవు.. 


మను ధర్మశాస్త్ర ప్రకారం మనిషి జీవితంలో తన వయస్సుని బట్టి నాలుగు ధర్మాలను ఆచరించవలసి వుంటుంది.
బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థానము..సన్యాసము..  
వీటి
గురించి కూడా అట్టే వివరించక్కర్లేదు అనుకుంటా.. 

ఇప్పుడు మన అంశం నేటి వృద్ధుల గురించి కాబట్టి సన్యాశ్రమము గురించి ఆలోచిస్తే..వృత్తివ్యాపార వ్యవహారాలన్ని పుత్రులకు అప్పచెప్పి అనునిత్యము దైవధ్యానంలో గడపవలెనని..ఇతరులకు ధర్మబోధలు చేస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని తెలియచేసారు..అందుకే మన ప్రభుత్వం వారు కూడా రిటైర్మెంట్ వయస్సు అరవై గా నిర్ధారించారు.. 


అయితే ఇప్పటి కాలం నాటి వృద్ధులలో కొంతమంది వయస్సుకి తగిన పనులు చేస్తున్నారా.. అని ప్రశ్నించుకోవాలి.. 

 
అసలు వయస్సుని బహిరంగ పరుచుకునే స్థితిలో వున్నారా.. అనిపిస్తుంది.. ఈరోజుల్లో నిత్యయవ్వనంగా కనిపించడానికి అనేక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి.. పాలనురుగులాంటి జుత్తుని నల్లగా నిగనిగలాడేలా చేయ్యొచ్చు.. ముఖసౌందర్యానికి అనేక క్రీములు వచ్చేయి..పొట్టి జుత్తు తో పొట్టి బట్టలతో అమ్మమ్మలు కూదా అమ్మాయిలలాగ తయారవుతున్నారు..  

ఇక్కడ వేషధారణను తప్పు పడట్లే.. ఎవరి ఇష్టం వాళ్ళది.. కాని ప్రవర్తన మాత్రం వయసుకి తగ్గట్టు ఉంటే సమాజానికి మంచిది అని నా అభిప్రాయం..
మనవడు తప్పు తోవలో వెళ్తుంటే "ఒరే తప్పురా" అని చెప్పగలిగే స్థితిలో వుండాలి.. తానే ఒక పెగ్గు తాగందే నిద్రపోని స్థితిలో వుంటే ఇక పిల్లలకి ఏమి చెప్తాడు.. 


నేటి వృద్ధులు ఎవరి మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడట్లేదు... బతికినంత కాలము స్వతంత్రంగా బతకాలని,, తమ ప్రైవసీ కి ఎవరూ అడ్డు తగలకుండా వుండాలని అభిలషిస్తున్నారు.. కొడుకు కాని కూతురు గాని ఎంత వేగిరం ఇంట్లోంచి బయటకు వెళ్తాడా అని ఆలోచిస్తున్నారు... ఎవరూ లేకుండా హాయిగా స్వేచ్చా లోకంలో విహరించాలని పిల్లలు వేరుకాపురం వుంటేనే మంచిదనే భావంలో వున్నారు.. 

 
ఇప్పటి ఆర్ధిక పరిస్థితులు బ్యాంకింగ్ రంగాలు.. పెన్షన్ స్కీములు వృద్ధుల జీవితానికి భరోసా ఇస్తోంది.. వారి పెన్షన్ డబ్బుని గాని ఇండ్లను గాని ఇతర ఆస్థులు ఏవైనా జీవితం చివరి రొజుల వరకు ఎవరికీ భాగం ఇవ్వక తమ వద్దనే వుంచుకుంటూ.. మరణాంతరం చెందేలా రాస్తున్నారు..లేదా విల్లు రాయకుండానే పోతున్నారు.. 

ఇందువలన అయినవారికి దూరంగా వుంటున్నా పైకి గాంభీర్యత ప్రకటిస్తూ శేష జీవితాన్ని గడిపేస్తున్నారు... కొంతమంది ఆస్థులు ఇండ్లు వారి మరణాంతరం ఎవరికీ చెందక ఒక్కోసారి తగాదాలు కోర్టు వరకు వెళ్ళి ఆఖరికి అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది... 


వ్యక్తిగత నష్టం ఈ విధంగా వుంటే కొంతమంది వ్యవహార శైలి వలన సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది... అరవైలో కూడా ఇరవై పనులు చేస్తూ అదేదో ఆదర్శంలాగ కుర్రాళ్ళని చెడగొడుతున్నారు... 

తివారి లాంటి వృద్ధులు కోకొల్లలు..
ద్విగిజయ సింగ్ లాంటి వారిని కూడా ఉదహరించుకోవచ్చు..  

అందుకే యువతరం చెడుతోవలో పయనిస్తోంది...వృద్ధులను యవ్వనంలో వున్నవాళ్ళు అనుసరిస్తారు..అనుకరిస్తారు.. 

తాగుబోతు అయిన తండ్రికి పుట్టిన వాడికి తాగడం తప్పని తెలీదు..
తల్లి వ్యభిచారి అయితే పిల్లలకు వ్యభిచారం తప్పుగా అనిపించదు..   

కొంతమంది వృద్ధులకు..వయసుమీరిన వారికి మను ధర్మ సూత్రాలు గాని భగవద్గీతలు గాని అక్కరలేదు... ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే పాటలు ... సమాజాన్ని పెడతోవ పెట్టే ప్రసార సాధనాలు మాత్రమే ఆశ్వాదిస్తూ పరోక్షంగా యువత తప్పు తోవలో నడవదానికి కారకులు అవుతున్నారు..

వృద్ధులారా దయచేసి పతివ్రతలు కాకపోయినా పర్వాలేదు గాని శతమర్కటాలు మాత్రం కాకండి.. సహస్ర కోతులను తయారు చెయ్యకండి...


Saturday, September 19, 2015

"కాకినాడ" - ఇంతకన్నా అభివృధ్ధి చెందదా???

నిన్న నేనూ..మా మిత్రబృందం కాకినాడ వెళ్ళాము..  ఎందుకు వెళ్ళామూ అంటే "ఆవుదూడకి గడ్డికోసం"..అన్నట్టుగా గట్టి పనేమీ లేదు.. 

"హుండాయి-సాంత్రో" కారు ఉండి డ్రైవింగ్ రాని రిటైరయిపోయిన మా మిత్రుడు అడిగాడు "మన కారులో కాకినాడ వెళ్దాం వస్తారా??" అని.. 
"మన కారు అంటే మీ కారా మా కారా??" అని అడిగా.. 
"మా కారే" అన్నాడు...మీరు సరే అంటే సరే.. లేదంటే మరో దారి వెతుక్కుంటా" అన్నాడు.. 


ఎందుకూ అని అడిగితే  "ఏవీ తోచక" అని మురారి స్టైల్లో చెప్పి..  "సరదాగా అలా వెళ్ళొద్దాం.. తెలుసున్న మిత్రులని కలుద్దాం అంతకంటే పనిలేదు.." 
"సరే"
అని ఒప్పుకున్నాను.. ఎందుకంటే...
అఫీసులో చూసిన ముఖాల్నే రోజూ చూసి బొరుకొడుతోంది..కాస్త రిలాక్సింగా వుంటుంది..కారు డ్రైవింగ్ కూడా మనకి ఇంట్రెస్టు కాబట్టి ఒకరోజు సెలవు పెట్టడం వేస్టు అయినా.. 
"పొద్దస్తమాను తిని తొంగోడవేనా మడిసన్నతర్వాత కాసింత కలాపోసన వుండొద్దూ" అని ముళ్ళపూడి వారు రావుగారితో మనకి గడ్డి పెట్టారు కాబట్టి వెనకాల ఇల్లాలి గొణుగుడ్లు వున్నా మాట ఇచ్చేసాను.. 
"ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను." అని పూరీ యో ఇడ్లీ యో ఎవరు రాసారో తెలీదు గాని అలా కమిట్ అయిపోయా...

హైవేలో కాకుండా స్టీల్ ప్లాంట్ మార్గంలో అచ్చుతాపురం మీదుగా దూసుకొని పోయి పాయకరావుపేటలో అల్పాహారం చేసి మరెక్కడా ఆగకుండా కాకినాడ చేరుకున్నాం...
"కాకినాడ" తూర్పుగోదావరికి ముఖద్వారం.. చిన్న ఓడరేవు..పాడిపంటలతో కొబ్బరి ఉత్పత్తులతో కోట్లమీద వ్యాపారం జరిగే ప్రాంతం..

ఒకపక్క జె.ఎన్.టీ.యూ.. మరోపక్క రంగరాయ మెడికల్ కాలేజి...సాంకేతిక విద్యనందించే ..వృత్తివిద్యలను అందించే విద్యాసంస్థలు.. ఇలా నాకు తెలిసి విశాఖ కన్నా ముందే ఆధునికతను రంగరించుకున్న పట్టణం..

ఏ పట్టణానికి లేని ప్రత్యేకతలు ఒకేరోడ్డు లో సినిమాహాళ్ళు.. ఒకేవీధిలో దుకాణ సముదాయలు.. ఒకే దగ్గర విద్యాలయాలు.. ఈ పట్టణం పేరు చెబితే గుర్తొచ్చేవి "సుబ్బయ్య హోటలు.. "కోటయ్య కాజాలు" .. 

ఇలా గతవైభవు చిహ్నాలని గుర్తుతెచ్చుకొని మురిసిపోవడమే గాని...ఏదీ అభివృధ్ధి??? ఎక్కడ ఆధునికత నిర్మాణాలు??? 
రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు తప్ప.. అవే రోడ్లు..అవే మురిక్కాలువలు ...

కనీసం కత్తిపూడి నుండి కాకినాడ వరకూ రెండులైన్ల రోడ్డు లేదు.. తిరిగి వస్తున్న దారిలో పెద్ద యాక్సిడెంటు ఒక కారు లారీని గుద్దేసి కారులో వున్న శాల్తీ అక్కడికక్కడే మరణించాడు.. ఎంతఘోరం.. 

ఒక వెహికల్ ని ఓవర్ టేక్ కూడ చెయ్యలేని ఇరుకు రోడ్డు..పైగా గతుకుల మయము...

అక్కడ వూరంతా తిరిగేసి..తెలుసున్న వాళ్ళని కలిసేసి..తిరిగి సాయంత్రం ఐదు గంటలకి బయలుదేరి ఎనిమిది గంటలకల్లా వైజాగ్ వచ్చేశాము.. చీకట్లొ ఇంత దూరం ఎప్పుడూ డ్రైవ్ చెయ్యలేదు గాని ఎన్.ఎహ్ 5 విశాలంగా వుందికాబట్టి ఎనబ్భై లో దూసుకొచ్చేశాను.. 


అన్నట్టు మధ్యలో అన్నవరం లో రోడ్డు పక్కన మినీ దేవాలయంలో స్వామిని ప్రార్ధించి ప్రసాదాలు కొనుక్కొని..తేనీరు సేవించి బయలుదేరాము... నా సోది ఎప్పుడూ మామూలే గాని ఫుటోలు చూడండి..    

 1. హోరువానలో ..  వాన నీటిలో కారు ప్రయాణం.. .. (పిఠాపురం దాటేక) 2, 3. గాంధీభవన్ ప్రాంగణం, kakinada..  
4. 5.కనుచూపుమేర కనువిందు.చేసే పచ్చని పైరులు...  


               
 

Sunday, September 13, 2015

మనిషి బుద్ధి మారునా? ఈ అందాలను పాడుచెయ్యకుండా వుండునా??

ఇది గత పోస్టుకు కొనసాగింపు.. 
ఇంకా కొన్ని ఫొటోలు పెడుతున్నాను ... చూసి ఆనందించండి.. 
 1.వేపగుంట, పెందుర్తి - హైవే నుండి సింహాచలం శిఖర దర్శనం..
   
2.పెందుర్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి - ప్రధాన రైలు మార్గం- హౌరా లైన్..3. "మోదకొండమ్మ" అమ్మవారి గుడి - పాడేరు....

4,5-పాడేరు - సుందర మనోహర దృశ్యం...అన్నట్టు 'దృశ్యం' సినిమా కూడా విజయనగర.. విశాఖ ప్రాంతాల్లోనే తీసారట.. 5,6.పర్వతాల నడుమ ఒక ఊరిలో సంత.. 


7.పాడేరులో కొన్న పువ్వులు...8.ఇలాంటి ఇళ్ళు కనుమరుగు అవుతాయా??? - ఒక అమ్మాయి గేదెలకు దాణా పెడుతోంది..9. విశాఖ సిటీ (కంచరపాలెం)  లో  కొండలను ఆక్రమించిన కాంక్రీటు మేడలు..


10. విశాఖ నగర పాలక సంస్థ వారు ఖాళీగా వున్న గోడలపై ఇలా అందమైన వర్ణాలను చిత్రీకరించారు..అయినా మనిషి బుద్ధి మారునా???? ఈ సిటీ అందాలను పాడుచెయ్యకుండా వుండునా???

 

ఉప్పు సముద్రం...ఉప్పొంగించే పర్వతాలు...రెండూ మావేనండి..-01

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.. నేను ఈ రోజు పాడేరు లో వెలిసిన "మోదకొండమ్మ" అమ్మవారి దర్శనానికి వెళ్ళాను.. ఆ అమ్మవారి దయవలన ప్రయాణం సాఫీగా సుఖంగా సాగింది.. 

విశాఖపట్టణానికి మూడు ముఖ్యమైన పర్వత శ్రేణులు వున్నాయి..

ఒకటి నర్శీపట్నం దాటేక చింతపల్లి, సీలేరు (భద్రాచలానికి మార్గం)  ప్రయాణం..
రెండు చోడవరం  మీదుగా వెళ్ళే పాడేరు.... 
మూడవది అందరికీ తెలిసిన అరకు...
మూడు అద్భుతమైన ప్రదేశాలు..మూడింటినీ కలుపుతూ కొండలమీదుగా రోడ్డు మార్గం వుంది.. 

చాలామంది రోడ్ కం రైల్ మార్గం ద్వారా అరకు వెళ్తారు..బుర్రా గుహలు వున్నాయి కాబట్టి..
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మూడు ప్రాంతాలు సుమారు 100 కి.మీ దూరంలోనే వుంటాయి..
పొద్దున్న బయలుదేరితే సాయంత్రం లోగా తిరిగి విశాఖపట్టణానికి తిరిగి వచ్చేయవచ్చు... 

అరకులో గెస్టు హవుజులు వున్నాయి కాబట్టి రెండు మూడు రోజులు వుండి ఎంజాయ్ చెయ్యవచ్చు.. కటికి వంటి వటర్ ఫాల్స్ వున్నాయి... అక్కడనుండి మత్సగుండం అనే అద్భుత జలపాతాన్ని పురాతన శివ దేవాలయాన్ని..
పాడేరు లో వెలిసిన మోదకొండమ్మ అమ్మవార్ని దర్శించి పాడేరు మీదుగా వైజాగ్ వచ్చెయ్యవచ్చు... కారు బుక్ చేసుకుంటే మరీ మంచిది.. లేదా ప్రతీ గంటకు బస్సులు వున్నాయి...
ఎక్కడో ఉన్న కొడైకెనాల్ .. ఊటీ.. లాంటి ప్రాంతాలకు బోలెడు ధనం వెచ్చించి వెళ్ళేకంటే తక్కువ ఖర్చుతో (బస్సుకి రానుపోను రెండొందలు...తినడానికి ఓ యేభై/ వంద  రూపాయలతో ఒక మనిషి సుమారు ఎనిమిది గంటలు వెచ్చిస్తే చాలు... శెలవు పెట్టక్కర్లేకుండానే ఆ అనుభూతులన్ని నిండుగా అనుభవించచ్చు.. ఇక సుత్తి ఆపేసి ఈ రోజు నేను తీసిన ఫొటోలు పెడుతున్నాను.. చూసి ఆనందించండి.....  


 


ఒకపక్క బంగాళాఖాతం వేరొక పక్క ఎత్తైన పర్వత శిఖరాలు మన విశాఖ ప్రత్యేకత..  మా చిన్నప్పటి రోజుల కన్నా ఇప్పుడు బెటరే గాని ఇంకా అభివృధ్ధి చెయ్యొచ్చు.. ఆ రోజుల్లో అరకులో తినడానికి ఏమీ దొరికేది కాదు..ఉన్నది ఒకే ఒక్క పాసింజర్ ట్రైన్.. అది గాని రాకపోతే అవస్థే..రాత్రంతా స్టేషన్ లో బిక్కు బిక్కు మంటూ గడిపి తెల్లారి ఎలాగో ఒకలాగ వైజాగ్ వచ్చేవారు..      

Tuesday, September 1, 2015

"అమ్మా" అనే ఆర్తనాదం "అమ్మ"కి చేర్చని మానుషత్వం..

 

ప్రభుత్వాసుపత్రిలో పసిబిడ్డను మూషికాలు కొరుక్కు తింటుంటే..
"అమ్మా" అనే ఆక్రందన శైశవనాళాల్ని ఛేధించలేక ఆగిపోతే...

 


వాణినిలయంలో  రమణిని సహోధ్యాయిలే రక్కసులై భక్షిస్తుంటే..
"అమ్మా" అనే ఆవేదన హృదయకవాటాన్ని దాటిరాలేక ఆగిపోతే..


"అమ్మా" అనే ఆర్తనాదం "అమ్మ"కి చేర్చని మానుషత్వం..
గర్భశోకంతో అలమటిస్తున్న "అమ్మ" ని ఓదార్చునా మానవత్వం...