Sunday, September 10, 2017

NTR, SOBHAN BABU ఇక్కడే చదువుకున్నారు

Andhra Christian College, Guntur- 1885 సం.లో మొట్టమొదటి డిగ్రీ కాలేజీల్లో ఒకటి..

NTR, SOBHAN BABU లాంటి ప్రముఖులెంతో మంది చదువుకున్నారు.
ఇప్పటికీ ఎంతో ఠీవిగా కనబడుతున్నా, ప్రభుత్వ నిర్వహణా లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది..
శిథిలమైన టవర్ చూస్తే గుండె కరుగుతుంది.
దర్పంగా గుర్రం మీద స్వారీ చేస్తూ, డ్రాగన్ పై నిలబడున్న కాలేజీ స్థాపకుడు జార్జి విగ్రహం ఆనాటి వ్యవస్థకు అద్దం పడుతుంది..
P.S: గుంటూరు ప్రాంతం వారు గానీ, ex.students గానీ ఆ కాలేజి గురించి ఇంకా వివరాలు అందించమని ప్రార్థన..

Friday, September 8, 2017

అరుస్తాడు..కులం గోడలు బద్దలు కొందాం అని..

"వామపక్ష భావజాలం" అన్న పదానికి అర్ధం ఎంతమందికి తెలుసు?
వారిలో నిజంగా ఆ సిద్ధాంతం తమ నిజ జీవితంలో ఆచరించేవారెంతమంది??
ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని బలపరిచే వారి సంఖ్య ఎంత??
ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఏకపక్షాన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాభిష్టానికి, ప్రజా శ్రేయస్సు నకూ వ్యతిరేక చర్యలు పాల్పడుతూ నియంతలా వ్యవహరిస్తూ ఉంటే, కేవలం హైందవ సంస్కృతికి, అగ్రవర్ణాలపై అక్కసు వెళ్ళగక్కుతూ ఎన్నాళ్ళు రాస్తారు మతిలేని రాతలు..

రోజురోజుకూ అడుగంటున్న మానవత్వం, రక్షణ లేని పౌరసత్వం...
అంతులేని ధనదాహం, అవధుల్లేని అధికారబలం..
కులం చూసి ఓటు వేసే దౌర్బల్యం..

గోచీ కట్టిన పతోడూ గొంతుచించుకుని అరుస్తాడు..కులం గోడలు బద్దలు కొందాం అని..
కానీ రాతి గోడలతో స్వకుల పునాదులు నిర్మిస్తాడు..

"పతితులార, భ్రష్టులార.....ఏడవకండేడవకండి...
వస్తున్నాయొస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు.."
మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది...పోదాం..పోదాం..పైపైకి" అంటూ 50 ఏండ్ల కితమే యువతను వేడెక్కించి పైకి పోయాడు అభాగ్యుడై ఓ మహాకవి(?)....
ఇప్పటికీ పతితుల, భ్రష్టుల కన్నీళ్ళకు, జగన్నాథ రథచక్రాలకూ లింకు తెలీక, కనబడని ఆ మరో ప్రపంచపు దారి తెలియక బిక్కుబిక్కుమని దిక్కులు చూస్తున్నాడు కూలోడు...నాలోడు..
ఈ ప్రపంచంలో ఇప్పుడందరూ కూలోళ్ళే..
కూటి కోసం, గూటికోసం అలమటిస్తున్న అభాగ్యులే..

అభ్యుదయ భావాలతో నిరంతరం జనహితాన్ని కోరుతూ డిబేట్ లు, సంచలన ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వేడెక్కించే వార్తలను వడ్డి వండించే ఛానల్ వాళ్ళు గణేశ్ నిమజ్జాన్ని రెండ్రోజుల పాటు ఏకధాటిగా ప్రసారం చేస్తారు..
మతమౌఢ్యం, కుల పక్షపాతం ఉండకూడదని నీతులు చెప్పేవాడే తన దాకా వచ్చేసరికి వాటినే పట్టుకు వేలాడతారు..
మోసపోతూ, ఇంకా ఊబిలోకి కూరుకుపోతోంది కూలోడూ, నాలోడే...
Saturday, July 1, 2017

బోరు బావి లో ఇంకిన కన్నీళ్ళు...కన్నబిడ్డ కానరాక..
కన్నతల్లి కన్నీరాయె..

పాలబుగ్గ పసిపాపను
పాడుబుగ్గ మింగెనమ్మ..

విలవిల లాడెనమ్మ పసిపాణం..
వలవల పోయెనమ్మ పేగు బంధం..

పాపాత్ములైన పాడు మనుషులు..
పాతాళానికేసిరి  పాడు బావులు..

బుడిబుడి అడుగుల బుజ్జాయి..
తడబడి అడుగంట జారిపోయి..

అమ్మ కోసం ఆక్రోశించె బిడ్డ..
బిడ్డ కోసం రోదించె అమ్మ..

ఇంకిపోయిన బావిలోన..
ఇంకరాని కూన కోసం..
ఇంకెనమ్మా కన్నీళ్ళు..

ఇంకెన్నాళ్ళయ్యా ఈ అగచాట్లు???

(రచన, బొమ్మ: ఓలేటి.శంకర్)